16, డిసెంబర్ 2025, మంగళవారం

సంపూర్ణ ఐక్యం

 


సంపూర్ణ ఐక్యం 

ప్రతీ ఆధ్యాత్మిక సాధకుని పరమ లక్ష్యం, ఆ సృష్టికర్తలో సంపూర్ణ ఐక్యం పొందడం అంటారు బాబూజీ.  ఆత్మ పరమాత్మలో లయమవడం అన్నా అదే. వర్షం చుక్క మహాసముద్రంలో ఒకటైపోవడం అన్నా అదే. నదులు మహాసముద్రంలో కలవడం అన్నా అదే అర్థం. ప్రతీ ఆత్మ భగవంతునిలో కలవడం అనే సంకల్పం ప్రతీ ఆత్మలోనూ స్వతఃసిద్ధంగా నిహితమై ఉంది. కాబట్టి ఆ ప్రవాహానికి అనుకూలంగా ప్రయాణించడమే జీవుడి పని. దానికి విరుద్ధ దిశలో పయనించడం అంటే ఒత్తిళ్ళు కొని తెచ్చుకుంటున్నట్లే. సాధ్యమైనంత త్వరగా ఈ సత్యాన్ని ఎరిగి తదనుగుణంగా ప్రయాణించడమే ఆత్మకు శ్రేయస్కరం. 

అసలు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందవలసిన అవసరం ఏమిటన్న జిజ్ఞాస సాధకునికి కలుగవచ్చు. సంపూర్ణ లయం పొందితే గాని సాధకుడు తనను తాను లేక తన అస్తిత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేడట. అందుకే మనిషి జన్మ యొక్క పరమ లక్ష్యం భగవంతుని పొందడమే. అదొక సమాధానమైతే, ఆత్మ తన మూలానికి చేరుకునే వరకూ అశాంతిగానే ఉంటుందన్నది మరొక సమాధానం. యేది అయినప్పటికీ సాధకుడు ధ్యాన సాధన చేస్తూ, గురువుల అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్న ప్రతీసారి, నిజంగా ఆత్మసంతుష్టి అంటే ఏమిటో ప్రస్ఫుటంగా అవగతమవుతూ ఉంటుంది. అదే మరింత తీవ్రంగా సాధన చేయాలన్న ఉత్సాహాన్ని, ప్రేరణను కూడా కలిగిస్తుంది. ఇదే నిదర్శనం ఆత్మలో ఈ సంకల్పం నిహితమై ఉందనడానికి. అందుకే ఆ సంకల్పానుగుణంగా మనిషి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడమే విజ్ఞత అని బోధ పడుతుంది. 

1 కామెంట్‌:

నిరంతర స్మరణ

  నిరంతర స్మరణ  అభ్యాసి: గమ్యాన్ని అతిత్వరగా చేరుకోవాలంటే మార్గం ఏమిటి? బాబూజీ: నిరంతర స్మరణ.  నిరంతర స్మరణ అంటే ఏమిటి?   సహజ మార్గ గురువులు...