ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
26, సెప్టెంబర్ 2023, మంగళవారం
పూజ్య దాజీ 68 వ జన్మదినోత్సవ సందేశ మననం - 2
23, సెప్టెంబర్ 2023, శనివారం
పూజ్య దాజీ 68 వ జన్మదినోత్సవ సందేశ మననం - 1
22, సెప్టెంబర్ 2023, శుక్రవారం
సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ - 2
పాయింట్ ఎ, పాయింట్ బి
(పైన చిత్రం: రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే గ్రంథంలోనీది.)
పూజ్య బాబూజీ చేసిన అనేక ఆధ్యాత్మిక ఆవిష్కరణల్లో పాయింట్ ఎ, పాయింట్ బి అనే ఉపబిందువులు చాలా ప్రధానమైనవి. బాబూజీ ప్రకారం అనేక ఉపబిందువులున్నాయి కానీ, అభ్యాసి సాధనకు సంబంధించినంత వరకూ ఇవి చాలా ముఖ్యం అన్నారు. ఈ బిందువులు ప్రతి మనిషికీ ఎక్కడుంటాయో చెప్పడం జరిగింది. ఎడమ చనుమొన నుండి 2 వేళ్ళ వెడల్పు కుడివైపుకు తీసుకుని, అక్కడి నుండి 3 వేళ్ళ వెడల్పు నిటారుగా క్రిందకు తీసుకుంటే ఉండేది పాయింట్ ఎ ఉపబిందువు. అక్కడి నుండి 2 వేళ్ళ వెడల్పు క్రిందకు వస్తే ఉండేది పాయింట్ బి ఉపబిందువు.
సహజమార్గ ఆధ్యాత్మిక పథం ప్రకారం పాయింట్ ఎ పై ధ్యానం కొద్ది నిముషాలు, పాయింట్ బి శుద్ధీకరణ కొద్ది నిముషాలు ప్రతి రోజూ సాధకుడు చేయవలసి ఉంటుంది.
పాయింట్ ఎ వద్ద ప్రాపంచిక చింతలకు సంబంధించిన ముద్రలు ఏర్పడతాయి; పాయింట్ బి వద్ద ఇంద్రియాకర్షణకు సమబంధించిన ముద్రలు ఏర్పరచుకుంటూ ఉంటాడు అభ్యాసి. పైన చెప్పిన సాధన వల్ల యే రోజుకారోజు ఏర్పడిన ముద్రలను తొలగించుకోవడం వల్ల ఒక ఉన్నత కోవకు చెందిన చేతనం సహజంగా పెంపొందడం జరుగుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యపడుతుందని చెప్తారు బాబూజీ. సహజమార్గ సాధనలో ఈ ప్రక్రియలు చాలా ముఖ్యం.
మరిన్ని వివరాలకు పైన చెప్పిన బాబూజీ వ్రాసిన రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే గ్రంథాన్ని అధ్యయనం చేయగలరు.
సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ - 1
భగవంతునితో సంపూర్ణ ఐక్యం చెందడమే ఆధ్యాత్మిక పథం యొక్క పరమగమ్యం, అని బాబూజీ చెప్పడం జరిగింది. ఈ గమ్యాన్ని అతి సరళంగా, చేరుకునే మార్గం, అతి దగ్గర మార్గం సహజమార్గమని బాబూజీ తన స్వీయ అనుభవంలో సాక్షాత్కరించుకున్నారు. ఆ పాఠాన్ని మానవాళికి సహజమార్గ పథంగా అందజేయడం జరిగింది.
భగవంతునితో సంపూర్ణ ఐక్యము అంటే ఆ పరమపవిత్ర చైతన్యంలో లయమైపోవడమే. ఆత్మ మూలం నుండి విడిపోయినప్పుడు, ఆ పరమ పవిత్ర చైతన్యం నుండి దూరమయ్యింది; క్రమక్రమంగా ఆ దివ్య చైతన్యం నుండి దిగి వచ్చినప్పుడు 13 ప్రధాన చైతన్య గ్రంథులుగా ఏర్పడినావి. వాటినే గ్రంథులని, బిందువులని, చక్రాలని, తీర్థ క్షేత్రాలని మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క చక్రం దిగిన కొద్దీ ఆ చైతన్యతలో నాణ్యత తగ్గుతూ వచ్చింది. అలా మనిషి హృదయ చక్రం వరకూ దిగిపోవడం జరిగింది. హృదయ చక్రం నుండి 13 చక్రాలు కేవలం మనుషుల్లోనే ఉంటాయి. ఇవి గాక మూలాధార, మణిపూరక, స్వాధిష్ఠాన చక్రాలు కూడా ఉంటాయి. ఇవి జంతువులలో కూడా ఉంటాయి. ఈ చక్రాల చతన్యంలో ఇరుక్కుపోయిన జీవులు కేవలం బ్రతకడం కోసమే వాటి జీవనం సరిపోతుంది. కేవలం తనను తాను కాపాడుకోవడానికి, ఆహారం, నిద్ర, ఇంద్రియపరమైన సుఖం, భయం వీటి చుట్టూనే అల్లుకుని ఉంటుంది వీటి జీవనం.
సహజమార్గ ఆధ్యాత్మిక పథము హృదయ చక్రం నుండి ప్రారంభమై, మన గమ్యమైన 13 చక్రమ వరకూ కొనసాగుతుంది.
ఆధ్యాత్మిక యాత్ర అంటే ఒక చక్రం నుండి మరొక చక్రానికి ఆత్మ యొక్క కదలిక. ఆత్మ కదులుతుందా? ఆత్మ యొక్క చైతన్యం కదులుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. దాన్నే ఆత్మ యొక్క యాత్ర అని అంటాం. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైన చేతనం ఉండటం వలన, సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు చేతన కదులుతున్నట్లుగానూ, విస్తరిస్తున్నట్లుగానూ, ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదుగుతూ, ఆధ్యాత్మిక ఆకాశంలో ఎత్తుగా విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. మానవ జన్మ యొక్క యదార్థమైన లక్ష్యం ఇదే. ఈ యాత్రను సమర్థుడైన గురువును ఆశ్రయించి, ప్రారంభించి, కొనసాగించి, ఈ జన్మలోనే పూర్తి చేసుకోవాలి. ఈ యాత్ర ఫలితంగానే, బాబూజీ చెప్పినట్లుగా మనిషిలో యాదార్థమైన పరివర్తన సంభవిస్తుంది. జీవితాన్ని సమగ్రమైన దృష్టితో, స్పష్టతతో లోతుగా అర్థం చేసుకునే ఎరుక ఏర్పడుతుంది. విజ్ఞత కలుగుతుంది. వ్యక్తిత్వం మరింత మరింత సూక్ష్మతరంగా మారుతూ ఉంటుంది. ఇక ఈ యాత్రకు అంతుండదు. అందుకే ఈ గ్రంథానికి, అనంతం వైపు అని పేరు పెట్టడం జరిగింది.
ఈ సహజమార్గ పాఠాన్ని పూజ్య బాబూజీ, తన గురుదేవులైన పూజ్య లాలాజీ మార్గదర్శనంలో తన "అనుభవ శక్తి" ద్వారా ప్రత్యక్షానుభవం ఆధారంగా ఆవిష్కరింపబడిన వినూత్న రాజయోగ పద్ధతి. ఈ ఆధ్యాత్మిక శిక్షణ, ప్రాణాహుతి అనే దివ్య శక్తిని సంసిద్ధుడైన సాధకుని హృదయంలోకి ప్రసరించడం ద్వారా ఇచ్చే శిక్షణ. ప్రాణాహుతిని ప్రసరణ చేయగలిగే గురువును సమర్థ గురువు అంటారు; ప్రాణాయాహుతి అంటే కేనోపనిషత్తులో ఉల్లేఖించిన ప్రాణస్య ప్రాణః అంటే ప్రాణానికే ప్రాణం అంటే, ప్రాణ తత్త్వం అన్నమాట. దేని వల్ల ప్రాణానికే ప్రాణం వచ్చినట్లవుతుందో అదే ప్రాణాహుతి. ఈ ప్రాణాహుతి ప్రసరణ వల్ల యాత్రలో చాలా సమయం ఆదా అవడమే గాక, ఒక చక్రం నుండి మరో చక్రానికి యాత్ర సహజంగా జరుగుతుంది.అయితే సిద్ధులు, శక్తులు పొందాలనుకున్నవారికి, ఇది అనుకూలమైన మార్గం కాదని, వాటికి, ఆధ్యాత్మికతకూ ఎటువంటి సంబంధమూ లేదని మన గురుపరంపర బోధన. ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలనుకున్నవారికి, చైతన్య వికాసం పొందాలనుకున్నవారికి, తనను తాను మార్చుకోవాలనుకున్నవారికి, మానవ చేతనం నుండి దివ్య చేతనంగా పరివర్తన కావాలనుకున్నవారికి, దైవానుభూతి చెందాలనుకున్నవారికి ఈ మార్గం ప్రశస్తం.
బాబూజీ ఈ యాత్రను, వారు వ్రాసిన సత్యోదయం అనే గ్రంథంలో 24 వృత్తాలుగానూ, సహజమార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం అనే గ్రంథంలో 3 క్షేత్రాలుగానూ, అనంతం వైపు అనే గ్రంథంలో 13 బిందువులు, లేక గ్రంథులు లేక చక్రాలుగానూ అభివర్ణించడం జరిగింది. సాధకులు తప్పక ఈ గ్రంథాలను తమ వ్యక్తిగత సాధనను కొనసాగిస్తూ అధ్యయనం చేసుకోవాలి. లేకపోతే అవగాహన ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉండే అవకాశాలే ఎక్కువ; ఎందుకంటే ఈ గ్రంథాలలో వ్రాసినవన్నీ యదార్థ ఆధ్యాత్మిక సూక్ష్మ అనుభవాలకు సంబంధించినవి కాబట్టి.
మొదటి 5 బిందువులను హృదయ క్షేత్రం అని, 6 నుండి 12 బిందువులను మనోక్షేత్రమని, 13 వ బిందువును కేంద్ర క్షేత్రం అని అంటారు బాబూజీ. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక రకమైన చైతన్య వికాసం జరిగి, తదనుగుణమైన సహజమైన పరివర్తన సాధకునిలో సంభవిస్తుంది. ఆ మేరకు అంతఃకరణ అంటే 4 ప్రధాన సూక్ష్మ శరీరాలు (మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము) శుద్ధి చేయబడతాయి; ఇదంతా ఒక్క జన్మలోనే సాధించే అవకాశం ప్రతీ అభ్యాసికి ఉంది. కనీసం ప్రతీ అభ్యాసి ఈ జన్మలోనే హృదయ క్షేత్రాన్ని దాటి మోక్షాన్ని పొందాలన్నది మన గురుపరంపర యొక్క ఆకాంక్ష.
తదుపరి వ్యాసంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
20, సెప్టెంబర్ 2023, బుధవారం
పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 4
శ్రమ - కర్మ
పూజ్య దాజీ శ్రమకూ కర్మకు గల వ్యత్యాసం చెప్పడం జరిగింది. శ్రమ అంటే ఫలితం కోసం చేసేది. ఉదాహరణకు ఉద్యోగం చేసేది జీతం కోసం; కూలి చేసేది డబ్బుల కోసం; దీన్ని శ్రమ అంటారు. కర్మ అంటే భగవత్సాక్షాత్కారం కోసం చేసే పని, బ్రహ్మవిద్య కోసం చేసే పని, ఫలితం ఆశించకుండా చేసే పని.
శ్రీకృష్ణుడి కాలంలో అంటే సుమారు 7000 కు పైగా సంవత్సరాలు గడచిపోయాయి; ఆ కాలంలో వాడిన కర్మ అనే పదానికి అర్థం దైవసాక్షాత్కారం కోసం చేసే పని అని అర్థం. ఆ కాలంలో అందరూ సుమారుగా అదే ధోరణిలో జీవించేవారు. కాలానుగుణంగా పదాలకు అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు ఆంగ్లంలో "gay" అనే పదానికి ఉల్లాసం, ఆనందం అనే అర్థం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అదే పదానికి వేరే అర్థం వచ్చేసింది.
శ్రమ వల్ల కచ్చితంగా సంస్కారాలు ఏర్పడతాయి; కర్మ వల్ల సంస్కారాలు ఏర్పడవు. నేను 30 రోజులు పని చేశాను, జీతం ఇవ్వాలి అని యాజమానిని అడుగవచ్చు కానీ 20 సంవత్సరాలు నీ కోసం ధ్యానం చేశాను, కాబట్టి దర్శనం ఇవ్వాలని భగవంతుడిని గట్టిగా అడుగలేము, ఆడగకూడదు కూడా; ఆత్మసమర్పణ ద్వారా మాత్రమే భగవంతుడు లభించేది, అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగింది.
కాబట్టి మనం కర్మకు, శ్రమకూ గల పూజ్య దాజీ తెలియజేసిన ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవలసి ఉంది. ఈ నూతన అవగాహనను మననం చేసుకోవలసి ఉంది.
18, సెప్టెంబర్ 2023, సోమవారం
పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 3
వినాయకుడు మానవ పరిపూర్ణతకు చిహ్నం
13, సెప్టెంబర్ 2023, బుధవారం
పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 2
శ్లోకం 1
ప్రజాహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనాతుష్ఠః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. //2:55//
ఓ పార్థా, మనసులో ఉద్భవించే కోరికలన్నిటినీ ఎవరైతే త్యజిస్తాడో, ఆత్మసంతృప్తి కలిగి ఉంటాడో, ఆత్మలో సంతుష్ఠుడై అంతరంగంలో స్థిరంగా ఉంటాడో అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు.
శ్లోకం 2
ధ్యాయతో విషయాంపుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోపిజాయతే. //2:62//
ఇంద్రియాలపైనే దృష్టిని సారించినవాడు వాటికి ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ
నుండి కోరిక పుడుతుంది; కోరిక నుండే కోపం పుడుతుంది.
శ్లోకం 3
క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి. //2:63//
కోపం మనసును గందరగోళానికి గురి చేసి భ్రమకు లోనవుతుంది; ఫలితంగా జ్ఞాపక
శక్తి నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనమవడంతో మనిషి
అథోగతిపాలవుతాడు.
శ్లోకం 4
రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్
ఆత్మవశ్యైవిధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి. //2:64//
మనసును అదుపులో ఉంచుకున్నవాడు రాగద్వేషాల (ఇష్టాయిష్టాల)నుండి
ఇంద్రియములతో వస్తువులను వినియోగిస్తున్నప్పటికీ వాటి నుండి
విముక్తుడవుతాడు; భగవదనుగ్రహాన్ని పొందుతున్నాడు.
శ్లోకం 5
నాస్తి బుద్ధిరుక్తస్య న చా యుక్తస్య భావనా
భావనాన చా భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్. //2:66//
సామరస్యం లేనిదే మనిషికి విజ్ఞత ఉండదు; సామరస్యం లేకుండా ధ్యానం
కుదరదు; ధ్యానించకుండా శాంతి రాదు. మనశ్శాంతి లేనప్పుడు మనిషికి
సంతోషం ఎక్కడుంటుంది?
శ్లోకం 6
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావః //3:35//
పరధర్మాన్ని ఎంతబాగా నిర్వర్తించినప్పటికీ గుణము లేనిదైనా స్వధర్మమే
మేలు; పరధర్మాన్ని నిర్వహించడం కంటే కూడా స్వధర్మం ఆచరిస్తూ మృత్యువు
సంభవించినా మంచిదే. క్లుప్తంగా చెప్పాలంటే, “నీ పని నువ్వు చూసుకో”
అని అనుండేవారు బాబూజీ.
శ్లోకం 7
నకర్మణామనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్నన్యసనాదేవ సిద్ధిం సమాధిగచ్ఛతి. //3:04//
కర్మ చేయకుండా ఉండటం వల్ల మనిషికి కర్మ నుండి విముక్తి కలగదు. కేవలం
కర్మ పరిత్యాగం వల్ల పరిపూర్ణతను సాధించడం సాధ్యపడదు.
రహస్యం 1
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ॥4:7॥
రహస్యం 2
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ॥4:8॥
తాత్పర్యం:శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని
స్థాపించడం కోసం నేను భూమిపై మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాను.
రహస్యం 3
ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, 18వ అధ్యాయంలోనిది, 66వ శ్లోకం:
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥18 :66॥
తాత్పర్యం: అన్ని ధర్మాలను విడిచిపెట్టి, నన్ను మాత్రమే శరణు వేదినట్లయితే, నీ సమస్త పాపాల నుండి విముక్తిని కలిగిస్తాను; భయపడకు.
ఈ ఏడు రత్నాలను, ఈ మూడు రహస్యాలను తరువాయి భాగాల్లో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం.
12, సెప్టెంబర్ 2023, మంగళవారం
పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు
7, సెప్టెంబర్ 2023, గురువారం
పూజ్య దాజీ సందేశాలపై మననం - శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 7, 2023
శ్రీకృష్ణాష్టమి మనందరికీ గొప్ప పర్వదినం; ఆయన యుగపురుషుడే కాదు, యోగేశ్వరుడు కూడా; అంటే యోగానికి ఈశ్వరుడు, యోగానికి భగవానుడు కూడా.
పూజ్య లాలాజీకి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎనలేని భక్తి, పూజ్యభావం, శ్రద్ధ గలవారు. ఆయన ఇప్పటివరకూ ఉన్న భారతీయ ఆధ్యాత్మిక చరిత్రనంతా తిరగేసి శోధించినప్పుడు, శ్రీకృష్ణుడు అందరిలోకీ భిన్నంగా ప్రకాశిస్తూ ఉన్నదని తన గ్రంథాలలో వ్రాసుకోవడం జరిగింది. అలాగే బాబూజీ మహారాజ్ కూడా శ్రీరాముడిని గురించి అలాగే, నైతికతకు, సత్ప్రవర్తనకు, సంస్కృతికీ పునాదులు వేసిన వ్యక్తిగా విశ్వసించేవారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ కలియుగాన్ని శాసించే యుగపురుషుడు. నైతికత, సత్ప్రవర్తన లను పునాదులుగా ఏర్పరచుకుని శ్రీకృష్ణ భగవానుడు మానవ జీవిత గమనంలో భక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. భగవంతుని పట్ల ప్రేమను ఆధ్యాత్మిక యోగసాధనలో భక్తిని ప్రవేశ పెట్టడం జరిగింది.
సహజమార్గ పద్ధతి ద్వారా మనకర్థమయ్యేదేమిటంటే, మనం నిత్యం చేసే కర్మలను, ప్రేమ లేకుండా, ఉత్సాహం లేకుండా కేవలం భౌతికంగా, మానసికంగా మాత్రమే చేసినట్లయితే బ్రతుకు ఈడుస్తున్నట్లుగా ఉంటుంది. అలా గాకుండగా మనం చేసే పనులను గనుక కాస్త భగవంతుని పట్ల ప్రేమతో చేసినట్లయితే అది ఒక విధమైన భక్తిగా మారుతుంది, జీవితం ధన్యంగా మారుతుంది. లేకపోతే ఎప్పుడూ శ్రమగానే మిగిలిపోతుంది. అలాగే మనం సంపాదించుకున్న జ్ఞానం కూడా పాడైపోతుంది; పాలు పాడైతే పెరుగుగా మారినట్లే; అలాగే జ్ఞానం కూడా అహం వల్ల కలుషితమైపోతుంది; ఆ జ్ఞానానికి భగవంతుడు కేంద్ర బిందువుగా ఉంటే తప్ప; భగవంతుని ప్రభావం ప్రబలంగా ఉంటూ భగవంతుడు కేంద్ర స్థానాన్ని గ్రహిస్తే తప్ప. అప్పుడే జ్ఞానం భక్తిగా పరివర్తన చెందుతుంది; లేకపోతే ఆ జ్ఞానం మూర్ఖత్వంగా మిగిలిపోతుంది.
శ్రీకృష్ణుని జీవితంలో మరొక ముఖ్యమైన పాత్ర ఏమిటంటే, మనందరికీ ఈ రోజున తెలిసిన సహజమార్గ పద్ధతి ద్వారా ప్రసరించే ప్రాణాహుతి పద్ధతి, ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రసరణను గురించి. అర్జునుడికి అంత జ్ఞానాన్ని, 18 అధ్యాయాలలోనీ 700 శ్లోకాలు, మౌఖికంగా అందజేయడం అనేది అసాధ్యమైన విషయం; ముఖ్యంగా యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో, అన్నీ దిక్కుల నుండి శంఖాలు పూరించిన తరువాత; ఆ క్షణంలో అర్జునుడు విషాదంలో మునిగి ఇక నేను యుద్ధం చేయలేనని చతికిల పడిపోయినప్పుడు; ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్నంతటినీ ప్రాణాహుతి ప్రసరణ ద్వారా కొన్ని క్షణాల్లోనే అర్జునుడికి అందజేయడం జరిగింది; వేదవ్యాస మహర్షి ఈ ప్రక్రియనంతటినీ సాక్షిగా ఉన్నాడు; కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ క్షణాలలో ప్రాణాహుతి ద్వారా అందించిన జ్ఞానాన్ని తర్జుమా చేసినదే మనం ఈ రోజున చదువుకుంటున్న 700 శ్లోకాల భగవద్గీత. కేవలం ఆధునిక మానవుడు మాత్రమే ఈ ప్రక్రియను అర్థం చేసుకోగలుగుతాడు; ఏ విధంగా ఈ జ్ఞానాన్ని డౌన్ లోడ్ చేయడం జరుగుతుందో. కొన్ని గిగా బైట్ల మెమరీని ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలో ఎలా డౌన్ లోడ్ చేయవచ్చో ఈ ఆధనిక మానవుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. ఈనాటి ప్రపంచం మాత్రమే ఏ విధంగా ఈ జ్ఞానాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చునో అర్థం చేసుకోగలడు.
ఆయన జీవితకాలంలోనే దివ్యలోకాలకు తరలి వెళ్ళాలని సంకల్పించినప్పుడు, ఉద్ధవుడు తెలుసుకొని, స్వామీ, మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? మీరు మాతో ఏమీ పంచుకోలేదు అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, నువ్వే అందరికీ బోధించాలి; భక్తిని గురించి గోపికలకు బోధించు; భక్తిని గురించి ప్రపంచానికి అందరికీ తెలియజేయి అంటాడు. ఆ సాంప్రదాయమే ఈరోజుకీ కొనసాగుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రకారం భక్తి అంటే, కేవలం బాహ్య ఆరాధనే కాదు; మనం చేసే అన్నీ పనులకు వర్తిస్తుంది; వాటన్నిటినీ స్వామికి అంకితం చేస్తాం; జీవితంలోని ప్రతీ అంశమూ ఆ పరతత్త్వం పట్ల ఉన్న ప్రేమ తరంగాలతో కంపించాలి; అప్పుడే దాన్ని నిజమైన భక్తి అనగలుగుతాం.
చక్కని పాలలో ఒక నిమ్మరసం యొక్క చుక్క పడితే పాలు పాడైపోయినట్లు, భక్తి అనేది కలుషితమైపోయేది, భక్తికి మచ్చలేర్పడేది, ఎప్పుడంటే దురాశ ఏర్పడినప్పుడు, ఏదైనా ఆడగాలనుకున్నప్పుడు, చివరికి బ్రహ్మ విద్యను గురించి గాని, మోక్షాన్ని గురించి గాని, ఒక ఆలోచన మెదిలినా కూడా; భగవంతుడా నేనింత తపస్సు చేస్తున్నాను, ఇంత ధ్యానం చేస్తున్నాను, కొంచె మనశ్శాంతినిస్తావా? అనేటువంటి వ్యాపార ధోరణి భక్తిని పాడుచేస్తుంది. ఎందుకంటే భక్తి దేన్నీ కోరదు గనుక. భక్తి అంటే కేవలం ప్రేమ కోసం ఉండే ప్రేమ మాత్రమే; కేవలం భగవంతుని కోసం ఉండేది. మన ఉనికి ఉన్నదే భగవంతుని కోసం. కేవలం ఆయన సేవ కోసం మాత్రమే.
ఆయన జీవితం ఎప్పటికీ ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక వెలుగుకూ కాంతిపుంజమై భాసిస్తూ ఉంటుంది. మనం వాటిని ఆకళింపుచేసుకోవాలి. ఆయన తత్త్వాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవాలి.
సహజమార్గ మాస్టర్ల గురుపరంపర శ్రీకృష్ణ భాగవానునితో ప్రారంభమవుతుంది. అది కొనసాగుతూ ఉంది కూడా; మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చును. మన మాస్టర్ల గురుపరంపర శ్రీకృష్ణుడు, శ్రీరాధతో ప్రారంభమవుతుంది; ఆ తరువాత చైతన్య మహాప్రభువు, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలాజీ మహారాజ్, బాబూజీ మహారాజ్, చారీజీ మహారాజ్, ఇలా కొనసాగుతూ ఉంది; ఒక్కోసారి ఈ పేర్లన్నీ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది; దయచేసి క్షమించండి. నేను అన్ని పేర్లూ చెప్పకలేకపోవచ్చు; అన్నీ పుస్తకాలలో ఉన్నాయి. చెప్పలేకపోతే కూడా ఏమిటి నష్టం? కృష్ణుడి పేరు ముందా, లాలాజీ పేరు ముందా, అసలు ఏ పేరూ లేదా? ఒకవేళ వాళ్ళ పేర్లన్నీ చెప్పినా, వాళ్ళను గురించి మనకేమి తెలుస్తుంది? వారి దివ్య తత్త్వాలను గురించి ఎలా తెలుస్తుంది? మనం కూడా అటువంటి తత్త్వాలుగా మారితే తప్ప. కాబట్టి గురుపరంపర యొక్క పిలుపు ఒక్కటే - వాళ్ళల్లా తయారవ్వండి; తయారైన తరువాత ఆ తయారైన తత్త్వాన్ని వారికే అర్పించండి; ఆ విధంగా తయారై మిమ్మల్ని మీరు పూర్తిగా లేకుండా చేసుకోండి; మిమ్మల్ని మీరు లేకుండా చేసుకోవడం అంటే, మిమ్మల్ని మీరు కాల్చుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు; ఈ తయారైన తత్వానికి అతీతంగా ఎడగండి; అప్పుడొక నూతన అస్తిత్వం ప్రారంభమవుతుంది; అప్పుడు మనకు ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. కనీసం వారిలా తయారవ్వాలన్న దిశగా ఆసక్తి కనబరచండి, దానికి అవసరమైన లక్షణాలను మీలో పెంపొందించుకోండి; వాళ్ళకి మన జీవితాల్లో స్థానం కల్పించండి; మనం వారికి అందుబాటులో ఉందాం; ఇలా మనలను మనం, మన ఆత్మలను, మన హృదయాన్ని, మన కృషి వారికి అందుబాటులో ఉంచడం అనేది చాలా కీలకం. ప్రస్తుతం మనం అందుబాటులో ఉన్నాం ఇక్కడ; వాళ్ళు మనపై పని చేయగలరు; మీరొక్క సమూహంగా ఇక్కడ అందరూ ధ్యానంలో కూర్చున్నారనుకోండి - దీన్నే అందుబాటులో ఉండటం అంటారు; వారి దివ్యకృపకు, దివ్య ప్రాణాహుతికి పాత్రులవడం; అప్పుడు మనకీ, వారికీ మధ్య జరుగవలసిన విలీన ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది; అలాగే మన ఇళ్ళల్లో కూడా మనం ఈ ప్రాణాహుతికి, పై నుండి వర్షిస్తున్న ఈ దివ్యకృపకు అందుబాటులో ఉంటున్నామా? మీరు అందుబాటులో లేనట్లయితే, మీరు వాటిని అందుకొనే పరిస్థితుల్లో లేకపోయినట్లయితే, మీలో పరివర్తన ఎలా వస్తుంది? కాబట్టి ఆధ్యాత్మిక పరివర్తనకు, అందుబాటులో ఉండటం అనేది కీలకమైనది. భౌతికంగా అందుబాటులో ఉన్నా హృదయం మూసుకొని ఉంటే? ఎవరైతే అందుబాటులో ఉండాలనుకోవడం లేదో వాళ్ళకి చాలా అవరోధాలుంటాయి. ఎవరైతే నిజంగా, నిజంగా, నిజంగా పురోగమించాలనుకుంటున్నారో, వాళ్ళకు ఎటువంటి సాకులూ ఉండటానికి వీల్లేదు. కాబట్టి మనం ఇక మనకు ఈ అందుబాటులో ఉండటం కోసం, ఎటువంటి కారణాలూ, సాకులూ ఉండవన్న నిబద్ధత కలిగి ఉందాం. ధన్యవాదాలు.
(పైన హైలైట్ చేసిన వాక్యాలు, మనం మరలా-మరలా, మనలో జీర్ణమయ్యే వరకూ మననం చేసుకోవలసిన వాక్యాలు. గమనించగలరు. )
5, సెప్టెంబర్ 2023, మంగళవారం
యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణ ధ్యానం
4, సెప్టెంబర్ 2023, సోమవారం
నా ఆదర్శ ఉపాధ్యాయిని - శ్రీమతి విద్యాధరిగారు
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...