16, మే 2024, గురువారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 14 - దశనియమాలు

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 14
దశనియమాలు 

పూజ్య బాబూజీ మహారాజ్, మనిషి నిత్యజీవితం ఎలా ఉండాలో, అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ మన దినచర్య యే విధంగా ఉండాలి, మన వైఖరులు ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలి అనే సూచనలు చాలా సరళంగా అందించడం జరిగింది. వీటిని మన నిత్య జీవన విధానంలో అమలుపరచే ప్రయత్నంలో ఉన్నప్పుడు, జీవితం ప్రతి నిత్యం నిత్యనూతనంగా ఉండటం, తేలికగా సవాళ్ళను ఎదుర్కోవడం, సంస్కారాలు ఏర్పడకుండా జీవించడం, ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలియడం, మనలో సూక్ష్మ స్థాయిలో కలిగే  మార్పులు, వ్యక్తిత్వ వికాసం, అనుభవంలోకి రావడం  వంటివెన్నిటినో  చూడవచ్చు. 

ఆ దశ నియమాలు ఈ విధంగా ఉన్నాయి:
1) ఉషః కాలానికి పూర్వమే నిద్ర లేచి, ఒకే సమయంలో మీ ప్రార్థనా-ధ్యానాదులను ఆరంభించండి. సాధ్యమైనంత వరకూ వాటిని సూర్యోదయానికి పూర్వమే పూర్తయ్యేలా చూడండి. ధ్యానం కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని, ఒక ఆసనాన్ని ఏర్పరచుకోండి. సాధ్యమైనంత వరకూ ఒకే భంగిమలో కూర్చొనే అలవాటు చేసుకోండి. శారీరక మానసిక శుచీలో ప్రత్యేక శ్రద్ధను వహించండి. 
2) ఆధ్యాత్మికోన్నటి కోసం ప్రార్థన చేసి మీ ధ్యానాన్ని ప్రారంభించండి. హృదయం అంతా ప్రేమతో నిండిపోయే విధంగా ప్రార్థనను నివేదించండి. 
3) భగవంతునితో సంపూర్ణ ఐక్యం పొందడమే లక్ష్యంగా ఏర్పరచుకోండి. ఆశయం సిద్ధించే వరకూ విశ్రమించకండి. 
4) ప్రకృతితో సమానంగా ఒక్కటై ఉండేలా మీ జీవితాన్ని సరళంగా మలచుకోండి.  
5) ఎల్లప్పుడూ సత్యసంధత కలిగి ఉండండి; కష్టాలు మీ మంచి కోసమే భగవంతుని వద్ద నుండే వస్తున్నాయని గ్రహించి కృతజ్ఞతతో ఉండండి. 
6) ప్రజలందరూ తమ సహోదరులుగా తెలుసుకుని, వారితో అదే భావంతో మెలగండి. 
7) మీ పట్ల ఎవరైనా పొరపాటుగా వ్యవహరిస్తే, వారి పట్ల ప్రతీకార భావం పెంచుకోకండి. దానికి బదులుగా అది భగవంతుని వద్ద నుండి వచ్చినదిగానే భావించి, కృతజ్ఞత కలిగి ఉండండి. 
8) నిజాయితీయైన ధర్మబద్ధమైన సంపాదనకు ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ ఏమి లభించినా, దానిని నిరంతర దైవ చింతనతో భుజిస్తూ సంతుష్టులై ఉండండి. 
9) ఇతరులలో ప్రేమ, పవిత్ర భావాలు జనింపజేసే ఉన్నత కోవకు చెందే విధంగా మీ ప్రవర్తనను, మీ జీవన విధానాన్ని మాలచుకోండి. 
10) రాత్రి నిద్రపోయే ముందు, భగవత్సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ, ఉద్దేశపూర్వకంగా చేయని తప్పులకు పశ్చాత్తాప పడండి. వినమ్ర భావంతో క్షమాపణ వేడుకుంటూ, ఆ పొరపాట్లు పునరావృతం కావని ప్రార్థనాస్తితిలో తీర్మానించుకోండి.  

పై దశనియమాలను పాటించడానికి ప్రయత్నిస్తూ జీవించినప్పుడు సౌశీల్య నిర్మాణం అప్రయత్నంగా జరుగుతుంది; ప్రవర్తనలో మార్పులు సంభవిస్తాయి. ఈ నియమాలను అనుసరిస్తూ, నిర్దేశించిన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేసుకుంటూ జీవించే విధానమే సహజ మార్గ జీవన విధానం. 




బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 13 - సంస్కారాలు

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 13 
సంస్కారాలు 

సాక్షాత్తు భగవంతుడు హృదయంలో నివాసం ఉంటూ కూడా మనిషి ఆయన ఉనికితో సంబంధం లేకుండా బ్రతకడం చాలా విడ్డూరం, చాలా విషాదాకారం. దాజీ చెప్పినట్లు, ఒక నూనె చుక్క సముద్రంలో పడినా, సముద్రంతో యే సమబంధమూ లేకుండా ఉన్నట్లు, మనం కూడా అంతర్యామితో యే సంబంధమూ లేనట్లుగా జీవిస్తున్నాం. 

అంతర్యామిగా ఉన్న దైవానికి మన అహానికి మధ్య అవరోధాలుగా నిలిచేవి అంటే భగవత్సాక్షాత్కారానికి, అడ్డుగా ఉండేవి మూడు -  కోరికలు, సంస్కారాలు, అహం. 

ప్రస్తుతం మనం సంస్కారాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  సంస్కారాలను భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో వాసనలని, కర్మలని కూడా అంటారు. సహజ మార్గ సాహిత్యంలో జటిల తత్వాలు/మలినాలు అని అంటారు. 

మామూలుగా వాడుక భాషలో "సంస్కారం లేదా?" అని అంటూంటారు. ఇక్కడ సంస్కారం అంటే అర్థం మంచి అలవాట్లు, మంచి సంస్కృతి అని అర్థం. కానీ ఆధ్యాత్మిక సాహిత్యంలో, ముఖ్యంగా సహజ మార్గ సాహిత్యంలో సంస్కారాలంటే కర్మలు, వాసనలు, జటిల తత్త్వాలు/మలినాలు. 

అసలు ఈ సంస్కారాలంటే ఏమిటి? 
మనిషి ప్రతి నిత్యం ప్రపంచంతో వ్యవహరించేప్పుడు, చేసే పనుల వల్ల, ఆలోచనల వల్ల మనసులో ముద్రలు ఏర్పడతాయి. పదే పదే అవే ముద్రలు నిత్యం ఏర్పడటంతో, అవి గాఢమైన ముద్రలుగా ప్రవృత్తులుగా లేక సంస్కారాలుగా  మారి అవి మనిషి జీవితాలను శాసించడం ప్రారంభిస్తాయి. 
అందుకే సహజ మార్గ శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ముద్రల స్థాయిలోనే, ఇవి సంస్కారాలుగా ఏర్పడకుండానే యే రోజుకారోజు శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా హృదయ భారం తగ్గుతూ ఉండి తేలికదనాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. గాఢ ముద్రలను లేక సంస్కారాలు ప్రశిక్షకుల ద్వారా గాని, మాస్టర్ ద్వారా గాని తీసుకునే ధ్యాన సిట్టింగుల్లో శుభ్రం చేయడం జరుగుతుంది. అందుకే ప్రతీ అభ్యాసి, వారానికి కనీసం ఒక సిట్టింగ్ ప్రశిక్షకునితో చాలా ముఖ్యం. జీవన లక్ష్యం ఇంచుమించు సంస్కార రహితంగా తయారవడం. 

అసలు ముద్రలు ఎందుకు ఏర్పడతాయి?
ప్రతీ పని, ప్రతీ ఆలోచన, 'నేను చేస్తున్నాను' లేక 'నాది' అనే స్పృహతో చేయడం వల్ల ముద్రలేర్పడతాయి. 'ఆయన చేస్తున్నారు' అనే స్పృహతో పనులు నిర్వర్తించినప్పుడు ఈ ముద్రలేర్పడటం ఆగిపోతాయి. ఇది నిరంతర స్మరణలో ఉండటం వల్ల సాధ్యపడుతుంది. నిరంతర స్మరణ సహజంగా ఏర్పడే వరకూ అభ్యాసం కొనసాగించవలసి ఉంటుంది.
 
మనం ఏర్పరచుకునే సంస్కారాలు ప్రధానంగా నాలుగు రకాలు 
ప్రపంచంతో నిత్య వ్యవహారాలలో మనం ఏర్పరచుకునే సంస్కారాలు నాలుగు రకాలు - రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), ఇంద్రియపరమైన వాంఛలు, ప్రాపంచిక చింతలు, అపరాధ భావాలు. 
శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా, ధ్యాన సిట్టింగుల ద్వారా, సామూహిక ధ్యానాల ద్వారా, అపరాధ భావాలకు సంబంధించిన ముద్రలు తప్ప అన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. అపరాధ భావాలు మాత్రం యేరోజుకారోజు రాత్రి ప్రార్థనా-ధ్యానం ద్వారా, పశ్చాత్తాపం చెంది, తిరిగి చేసిన పొరపాట్లు చేయబోనని తీర్మానం చేసుకోవడం ద్వారా వీటి ప్రక్షాళనం జరుగుతుంది. 

15, మే 2024, బుధవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 12 - శ్రీ రామ చంద్ర మిషన్ ప్రశిక్షక వ్యవస్థ

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 12 
శ్రీ రామ చంద్ర మిషన్ ప్రశిక్షక వ్యవస్థ 

భారత దేశం ఎందరో మహాత్ములచే, అవతార పురుషులచే, మహర్షులచే, మునులచే సమర్థులైన గురువులచే, సద్గురువులచే దివ్యంగా తీర్చిదిద్దబడిన పవిత్ర దేశం. 

శరీరానికి గుండె స్థానం ఎటువంటిదో, ప్రపంచానికి భారత దేశ స్థానం అటువంటిది. గుండె యే విధంగా శుద్ధి చేయబడిన రక్తాన్ని శరీరం అంతా సరఫరా చేస్తుందో, అదే విధంగా ప్రపంచం మొత్తానికి భారతదేశం ఎన్నో యుగాలుగా ఆధ్యాత్మిక శక్తిని సరఫరా చేస్తూ ఉన్నది. 

ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా కూడా, భౌతిక జీవితంతో విసిగిపోయినప్పుడు, లోపల  ఉదయించే అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు మనసును వేధిస్తున్నప్పుడు, మనసు దేని కోసమో తెలియకుండా పరితపిస్తున్నప్పుడు, సమాధానాల కోసం ఈ రోజుకీ కూడా భారత దేశం వైపే చూస్తూ ఉంటాడు. భారత దేశం వచ్చి వివిధ గురువులను ఆశ్రయిస్తూ తన ఆత్మలోని తపనను చల్లార్చుకోవాలని  ప్రయత్నిస్తూ ఉంటాడు. 

శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థాపకులైన సమర్థ గురు పరమపూజ్య బాబూజీ మహారాజ్ భారతదేశం వరకూ రానక్కర్లేకుండా, ప్రతీ దేశంలోనూ ఈ ఆధ్యాత్మిక తృష్ణను తీర్చగల ప్రాణాహుతితో కూడిన ధ్యానాన్ని అందించే వ్యక్తులను తయారు చేయాలనుకున్నారు. భారతదేశంతో సహా భూమ్మీద అన్నిచోట్లా ప్రాణాహుతిని అందించగల వ్యక్తులను తయారు చేయాలని సంకల్పించారు. వాళ్ళనే ప్రశిక్షకులని, హార్ట్ఫుల్నెస్ ట్రైనర్లని, ప్రిసెప్టర్లని  అంటారు.  ప్రపంచంలో ప్రతీ ఇంట్లోనూ ఒక ప్రిసెప్టర్ ఉండాలన్నది, బాబూజీ సంకల్పం ఈ సంకల్ప సిద్ధి కోసం సహజ మార్గ మాస్టర్ల పరంపర, సంస్థ ఆవిర్భావం దగ్గర నుండి కృషి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 16000 కు పైగా ప్రశిక్షకులున్నారు. వీరందఋ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. 

ఈ ప్రశిక్షకులను ఆ సమయంలో ఉన్న సంస్థ అధ్యక్షులు, ఆధ్యాత్మిక మార్గదర్శి, అయిన సజీవ మాస్టరు నేరుగా తగిన శిక్షణనిచ్చి తయారు చేయడం జరుగుతుంది. 

బాబూజీ ప్రశిక్షకులను శుద్ధ రక్తనాళాలుగా (arteries) అభివర్ణించేవారు. మాస్టర్ హృదయం అయితే, అందులో నుండి వచ్చే ప్రాణాహుతిని శుద్ధ రక్తనాళాల ద్వారా శరీరమంతటా సరఫరా చేసేది ప్రశిక్షకులు. అందుకే వీళ్ళని ఆంగ్లంలో arteries అని అనేవారు బాబూజీ. 

ప్రాణాహుతి ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడమే గాక, చేతనలో మార్పులు కొంచెం-కొంచెంగా తీసుకువచ్చి, మనిషిలో సమూల ప్రవర్తన తీసుకురాగలిగే శక్తి ప్రాణాహుతి. కేవలం అనుభవం ద్వారా మాత్రమే ఎవరైనా తెలుసుకోగలిగేది. 

స్వార్థం లేకుండా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, కేవలం గురువు పట్ల భక్తిప్రపత్తులతో, కృతజ్ఞతా భావనతో ఉచితంగా అందించే వ్యక్తులు ప్రశిక్షకులు. గురుదేవులు ప్రశిక్షకులపై ఉంచిన నమ్మకం అద్వితీయం; నమ్మకంలోనే పరాకాష్ఠ. ఎక్కడ నమ్మకం ఉంటుందో, ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ బాధ్యత ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే బాధ్యత అనేది మనస్సాక్షికి సంబంధించిన విషయం.  



13, మే 2024, సోమవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 11 - శ్రీ రామ చంద్ర మిషన్ గురుపరంపర

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 11 
శ్రీ రామ చంద్ర మిషన్  గురుపరంపర 

లాలాజీ        బాబూజీ         చారీజీ            దాజీ 

పూజ్య బాబూజీ రూపొందించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథాన్ని మానవాళికి ఉచితంగా అందించడం కోసం మాత్రమే స్థాపించబడిన సంస్థ శ్రీ రామ చంద్ర మిషన్ అనే లాభాపేక్ష లేని ఒక ఆధ్యాత్మిక సంస్థ. దీన్ని 1945 లో స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు బాబూజీ, తన గురుదేవులైన, ఫతేగఢ్, ఉత్తర ప్రదేశ్ కి చెందిన సమర్థ గురు శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (అందరూ ప్రేమగా లాలాజీ అని పిలుస్తారు) పేరునివ్వడం జరిగింది. బాబూజీ తన గురుదేవులకు గురుదక్షిణగా వారి పేరున శ్రీ రామ చంద్ర మిషన్ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు ఆది-గురుదేవులు, పూజ్య లాలాజీ. 
1983 లో పూజ్య బాబూజీ మహాసమాధి పొందిన తరువాత, ఆయన వారసునిగా, బాబూజీ ఆధ్యాత్మిక ప్రతినిధిగా, శ్రీ రామ చంద్ర మిషన్ కు అధ్యక్షులుగా చెన్నై, తమిళనాడుకు చెందిన పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీని నియమించడం జరిగింది. పూజ్య చారీజీ 2014 లో పరపపదించిన తరువాత, పూజ్యశ్రీ కమలేష్ డేశాయ్ భాయ్ పటేల్ (అందరూ ఆప్యాయంగా దాజీ అని పిలుస్తారు) గారిని బాబూజీ తరువాతి ఆధ్యాత్మిక ప్రతినిధిగానూ, చారీజీ వారసునిగానూ, శ్రీ రామ చంద్ర మిషన్ అధ్యక్షులుగానూ, హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతికి మార్గదర్శిగానూ బాధ్యతలను చేపట్టడం జరిగింది. 

సంస్థ విస్తరణ 
1945 నుండి 2024 వరకూ 160 దేశాలకు పైగా ఈ సంస్థ విస్తరించింది. భారత దేశంలో ఇంచుమించుగా అన్నీ రాష్ట్రాల్లోనూ, అనేక జిల్లాల్లోనూ ఈ సంస్థకు సంబంధించిన ధ్యాన కేంద్రాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 250 కు పైగా ఆశ్రమాలున్నాయి. ఈ పద్ధతిలో ప్రవేశం కల్పించి, ప్రాణాహుతి ప్రసరణ ద్వారా ఆధ్యాత్మిక శిక్షణనందించే ప్రశిక్షక గణం 17000 కు పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ ప్రశిక్షకులనే ప్రిసెప్టర్లనీ, హార్ట్ఫుల్నెస్ ట్రైనర్లనీ కూడా అంటారు. ఈ ప్రశిక్షకులు నేరుగా సంస్థ అధ్యక్షులు, గురుదేవులు వారి నుండే శిక్షణ పొందుతారు. ఆ తరువాతనే వారిని ప్రశిక్షకులుగా నియమించడం జరుగుతుంది. వీరందరూ స్వంచ్ఛందంగా ఉచితంగా సేవలనందించడానికి ముందుకు వచ్చినవారే. అందరూ గృహస్థులే; అందరూ వారి వారి బాధ్యతలున్నవారే; గురువు పట్ల కృతజ్ఞతా భావంతో వారి సమయాననిచ్చి మానవాళి సేవలో ఉన్నవారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ హార్టఫుల్నెస్  సహజ మార్గ అభ్యాసాన్ని అనుసరిస్తున్నారు. 

కాన్హాశాంతి వనం 

హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, హైదరాబాదు శివార్లలో బెంగుళూరు హైవే మీద, షంషాబాద్ విమానాశ్రయానికి గంట దూరంలో, చేగూరు గ్రామ వద్ద, నందిగామ మండలంలో కాన్హా 
శాంతి వనం అనే గ్రామంలో ఉంది. ఇది 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూతల స్వర్గం. 
హార్ట్ఫుల్నెస్ సంస్థ అన్నా, శ్రీరామ చంద్ర మిషన్ అన్నా రెండూ నిజానికి ఒక్కటే. 
హార్ట్ఫుల్నెస్ అనేది సహజ మార్గాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళే విధానం; సహజ్ మార్గ్ అనేది ధ్యాన పద్ధతి; శ్రీ రామ చంద్ర మిషన్ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ.  

సాధన ప్రారంభించు విధానం  
ఈ ఆధ్యాత్మిక సాధనను అభ్యాసం ప్రారంభించాలనుకున్నవారు సమీప ప్రశిక్షకులను గాని, సమీప హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాన్ని గాని, వెబ్ సైట్ ద్వారా సంప్రదించవచ్చు. (www. heartfulness. org) వారితో ముఖాముఖి  రోజుకొక గంట సేపు చొప్పున వరుసగా 3 రోజులు ధ్యానంలో శిక్షణ తీసుకోవాలసి ఉంటుంది. మిగిలిన వివరాలు ప్రశిక్షకులు తెలియజేయడం జరుగుతుంది. 



12, మే 2024, ఆదివారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 10 - పరమపదానికి సహజ మార్గ సోపానం

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 10 
పరమపదానికి సహజ మార్గ సోపానం 

బాబూజీ అని ఆప్యాయంగా పిలుచుకునే సమర్థ గురు శ్రీ రామ చంద్రజీ మహారాజ్ (షాజహానుపూర్, ఉ. ప్ర. భారత్ ), ఆధునిక   మానవుడి  యొక్క ఆత్మోన్నతికి, జీవిత గమ్యమైన పరమపదాన్ని  తేలికగా అధిరోహించడానికి ఒక సరళమైన సోపానాన్ని ఎంతో కరుణతో అనుగ్రహించడం జరిగింది. దాన్నే సహజ మార్గ ఆధ్యాత్మిక పథం అంటారు. 
సహజ మార్గ సోపానం
స్వాధ్యాయం 
ఉదయం ప్రాణాహుతితో కూడిన ధ్యానం 
సాయంకాల శుద్ధీకరణ 
రాత్రి ప్రార్థనా-ధ్యానం 
ఆధ్యాత్మిక/సహజ మార్గ సాహిత్య పఠనం 
స్వచ్ఛంద సేవ 
ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొనడం 
దశనియమాలను అనుసరిస్తూ భౌతిక జీవనం  
ప్రశిక్షకులతో వ్యక్తిగత సిట్టింగులు 
వారానికి రెండు సామూహిక ధ్యానాలు (సత్సంగాలు) 
స్వాధ్యాయ ఫలితంగా సహజంగా కలిగే పరిణామాలు 
నిరంతర స్మరణ 
శరణాగతి 
దివ్యప్రేమ 
పరమాత్మతో సంపూర్ణ లయ స్థితి లేక 
మానవ పరిపూర్ణత్వం సిద్ధించడం.  
 




11, మే 2024, శనివారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 9 - సహజ మార్గ జీవన విధానం

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 9 
సహజ మార్గ జీవన విధానం 

పూజ్య బాబూజీ ప్రకారం సహజ మార్గ జీవన విధానంలో మనిషి జీవితంలోని భౌతిక, ఆధ్యాత్మిక పార్శ్వాలు, పక్షికి రెండు రెక్కల్లాంటివని, రెంటికీ సమప్రాధాన్యతనివ్వడం చాలా అవసరం అని బోధించడం జరిగింది. ఒకదాని కోసం మరొకదాన్ని నిర్లక్ష్యం చేయరాదన్నారు. దీనికి ఆధునిక మానవుల అవసరాలకు తగినట్లుగా ఎందరో మహాత్ముల మార్గదర్శనంలో, జీవిత పరమార్థాన్ని పరిపూర్ణత సిద్ధించే దిశగా, ఆధ్యాత్మిక వికాస దిశగా ప్రయాణించేలా ఒక సరళమైన జీవన విధానాన్ని రూపొందించారు బాబూజీ. అదే సహజ మార్గ జీవన విధానం. 
దీని ప్రకారం  ప్రతి రోజూ ఇంతకు పూర్వం వ్రాసిన వ్యాసాల్లో చెప్పిన విధంగా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ ప్రపంచంతో వ్యవహరించడంలో మన దినచర్య యే విధంగా ఉండాలన్నది, తన దశ నియమాల్లో నిర్దేశించడం జరిగింది. అలాగే భౌతిక, ఆధ్యాత్మిక పార్శ్వాలకు సమప్రాధాన్యతనిస్తూ జీవించమంటారు బాబూజీ. 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 8 - వైఖరులు

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 8 - వైఖరులు 

సహజ మార్గ యౌగిక ప్రక్రియల అభ్యాసం ఎలా చేయాలన్నది 5 శాతమయితే, ఎటువంటి వైఖరితో, ఎటువంటి భావనతో చేయాలన్నది 95 శాతం అంటారు పూజ్య దాజీ. యౌగిక ప్రక్రియ ఎలా చేయాలన్నదీ అభ్యాసి ప్రయత్నంలో భాగమే; ఉండవలసిన వైఖరి కూడా మన ప్రయత్నంలో భాగమే. కానీ దీనికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. యే సాధనయినా కూడా తీవ్ర తపనతో చేస్తేనే ఫలితాలు సక్రమంగా ఉంటాయి. 

ధ్యానం ఎటువంటి వైఖరితో చెయ్యాలి?
తీవ్ర తపనతో చేయడానికి ప్రయత్నించాలి. సహజంగా మనలో ఉన్న తపనను యే విధంగానైనా పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆకలిగా ఉన్నప్పుడు భోజనాన్ని సంపూర్ణంగా యే విధంగానైతే ఆస్వాదించగలుగుతామో, తపనతో చేసిన ధ్యానం కూడా ఎన్నో రెట్లు సంతృప్తికరంగా ఉంటుంది. 

తపన పెంచుకోవడం ఎలా?
ప్రతీ ఆత్మలోనూ సహజంగానే ఎంతో కొంత తపన ఉంటుంది. దాన్ని తీవ్రం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. ఒక పద్ధతి అంటూ యేమీ లేదు, ఎన్నో రకాలుగా ప్రయత్నించవచ్చు. మన చుట్టూ ఉన్న లోకాన్ని ఆశ్చర్యంతో పరికించి చూడటం ద్వారా కావచ్చు; ఆత్మ వికాసానికి సంబంధించిన గ్రంథాలను, ఆధ్యాత్మిక సాహిత్య  అధ్యయనం చేయడం ద్వారా కావచ్చును; సజ్జనులతో, తోటి సాధకులతో సమయం వెచ్చించడం ద్వారా కావచ్చు; ఫలితం ఆశించకుండా ఇతరుల సేవలో నిమగ్నమవడం ద్వారా కావచ్చు; తపస్సు ద్వారా కావచ్చు; మహాత్ముల ప్రవచనాలు, ఉపన్యాసాల ద్వారా కావచ్చును; సృష్టి రహస్యాలను తెలుసుకోవాలన్న ఆతృతతో కావచ్చును; మహాత్ముల సాంగత్యం ద్వారా కావచ్చును; ఇవన్నీ కలిపి కూడా కావచ్చును; ఇలా ఇంకా అనేక రకాలుగా మనకు మార్గాలు స్ఫురించవచ్చును. నిజాయితీతో కూడిన ప్రయత్నం కీలకం. 

శుద్ధీకరణ ఎటువంటి వైఖరితో చేయాలి?
ఉదయం నుండి సాయంకాలం వరకూ ఎండలో బాగా కష్టపడి, చమటలు కారుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడు స్నానం చేస్తానా, ఎప్పుడు శుభ్రంగా తాజాగా తయారవుతానా  అన్న అశాంతితో ఎలా ఉంటామో, అలాగే ఎప్పుడెప్పుడు మనలో ఏర్పరచుకున్న మలినాలు, సంక్లిష్ట తత్త్వాలు పోగొట్టుకుంటానా అన్న అశాంతి వైఖరితో శుద్ధీకరణ చేసుకుంటే ఫలితం అద్భుతంగా ఉండటం అనుభూతి చెందవచ్చు. 

ప్రార్థనా-ధ్యానం యే భావంతో చేయాలి?
నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా, దీనస్థితిలో ఉన్నట్లుగా, స్వార్థం లేకుండా, పూర్తి సమర్పణ భావంతో, వినమ్రంగా చేయాలి ప్రార్థన. అందరినీ కలుపుకోవాలి ప్రార్థనలో. 



అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...