23, అక్టోబర్ 2023, సోమవారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 6

 


Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం
స్వచ్ఛంద సేవ 
తనపై తాను పని చేసుకోవడంలో స్వచ్ఛంద సేవ కూడా చాలా కీలక పాత్ర వహిస్తుంది. మనలను మనం పరిశుద్ధంగా చేసుకునే క్రమంలో, మనలను మనం మరింత సూక్ష్మంగా తయారు చేసుకునే క్రమంలో, ఇంతకు ముందు చర్చించుకున్న ఇతర సాధానోపాయాల కంటే వేగంగా పని జరిగే అవకాశం ఉన్న అంశం ఈ స్వచ్ఛంద సేవ. మనం వలంటీర్ సేవ అని కూడా అంటూ ఉంటాం. 

నిజమైన స్వచ్ఛంద సేవ ముఖ్యంగా మన హార్ట్ఫుల్నెస్ సంస్థలో అభ్యాసిలో గురువు పట్ల గాని, ధ్యాన పద్ధతి పట్ల గాని, సంస్థ పట్ల గాని హృదయంలో నిజమైన కృతజ్ఞత సహజంగా ఏర్పడినప్పుడు మొదలవుతుంది. అప్పటి వరకూ తానేమీ పొందుతున్నాడన్నది మాత్రమే ఆలోచిస్తాడు అభ్యాసి; కృతజ్ఞత మొదలైన తరువాత,  నేనేమి చెయ్యగలను అని ఆలోచించడం మొదలెడతాడు అభ్యాసి.  

స్వచ్ఛంద సేవ ద్వారా రకరకాల మనస్తత్వాలు గల వ్యక్తులతో రాపిడి లేకుండా ఒక్క జట్టుగా ఎలా పని చెయ్యాలో అలవాటవుతుంది; నెమ్మదిగా అందరి పట్ల ప్రేమ భావం పెరుగుతుంది; ఓరిమి పెరుగుతుంది; పరస్పరం సహాయం చేసుకునే తత్త్వం పెరుగుతుంది; మనసులో కూడా ఎవరినీ తిట్టుకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది; అందరమూ ఆ గురుదేవుల బిడ్డలమేనన్న స్పృహ నెమ్మదిగా పెంపొందుతుంది. నిజమైన విశ్వజనీన సౌభ్రాతృత్వం ఏమిటో అర్థమవుతుంది; కుల, మత, రంగు, జాతి, భాష, ధనిక-పేద, వంటి తారతమ్యాలు మెల్లమెల్లగా మనలో నశించే అవకాశం ఉంది. ఎందుకంటే మన లక్ష్యసిద్ధికి ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి. 

స్వచ్ఛంద సేవ యొక్క అసలు రుచి తెలియాలంటే, నిజంగా లక్ష్యసిద్ధి కోసం తపించేవారైతే, పూజ్య దాజీ సూచన ఏకాంతంగా గుండె నిండా గురువు పట్ల కృతజ్ఞతా భావం నింపుకొని సేవలనందించమంటారు. గుంపుగా చేయడంలో ఇతర ఆనందాలు కలుగుతాయి కానీ, ఇలా ఏకాంతంగా సేవనందించడంలోనే పరమార్థం దాగి ఉండంటారు దాజీ. అటువంటి స్పృహ లేక చేతనావస్థ చేయగా చేయగా స్థిరపడే అవకాశం ఉంటుంది; ఆ స్పృహతో ఈ భవసాగరాన్ని ఈదడం తేలికైపోతుంది. 

వారి కృపకు అర్హత సంపాదించే మార్గం, దగ్గర త్రోవ ఈ స్వచ్ఛంద సేవ. serve to deserve అన్నారు పూజ్య చారీజీ మహారాజ్. దైవాన్ని ప్రేమించడం గాని, గురువు పట్ల విధేయత గాని చాలా కష్టం కావచ్చును గాని, వారి ఆశయాన్ని తన ఆశయంగా చేసుకుని సేవ చేయడం ద్వారా వారి మనసులో చోటు సంపాదించడం చాలా తేలిక అంటారు, పూజ్య చారీజీ. ఎటువంటి గుర్తింపును ఆశించకుండా, నిండు మనసుతో, గుండె నిండా కృతజ్ఞతను నింపుకొని చేసే సేవే గురువు కోరుకునే నిజమైన స్వచ్ఛంద సేవ. ఈ విధంగానే మనిషిలో అసలైన పరివర్తన సంభవించే అవకాశం ఉంటుంది. 





Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 5

 

Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం
స్వాధ్యాయం  

పతంజలి మహర్షి రచించిన యోగసూత్రాల్లో సూచించిన అష్టాంగ యోగపద్ధతిలో రెండవ అంగమైన నియమ లోని అంశం స్వాధ్యాయం. ఆధ్యాత్మిక సాధనలో, యోగా సాధనలో భాగంగా సాధకుడు ముఖ్యంగా చేసుకోవలసినది. 
స్వాధ్యాయం అంటే స్వ ను అధ్యయనం చేయడం. అంటే తనను తాను విచారించి తెలుసుకోవడం. ఇది అనేక రకాలుగా చేయడం జరుగుతూ ఉంటుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం, మహాభాగవతం, వంటి పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా; ధ్యానం ద్వారా, ఆత్మావలోకనం   ద్వారా సాధకుడు తనలోని ఆలోచనలను, ఉద్వేగాలను, అనుభూతులను, అలవాట్లను, చేతలను, ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా తనను తాను తెలుసుకుంటాడు.
 
ఆ చదివినవాటిని లేక వినిన వాటిని శ్రవణ మనన, నిధిధ్యాసన ద్వారా జీర్ణించుకోవడాన్ని కూడా స్వాధ్యాయం అంటారు. అలాగే సామూహికంగా, సమిష్ఠిగా ఇటువంటి విషయాలను చర్చించుకుంటూ, తోటి సాధకులతో పంచుకుంటూ పరస్పరం ఉపయోగపడటమే స్వాధ్యాయం అంటే. ప్రస్తుతం మనం చేస్తున్నది కూడా స్వాధ్యాయంలోకే వస్తుంది. 

సహజమార్గ సందర్భంలో స్వాధ్యాయంలో సహజమార్గ సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం, సాధనాంశాలను గురించి లోతైన అవగాహనలు పరస్పరం పంచుకోవడం, సత్సంగాల్లో పాల్గొనడం, సంస్థ కార్యక్రమాల్లో వీలు చేసుకుని పాల్గొనగలగడం, అవకాశం వచ్చినప్పుడల్లా పూజ్య గురుదేవుల సన్నిధిలో సమయాన్ని గడపటం, అలాగే కుదిరినప్పుడల్లా స్వచ్ఛంద సేవలో వలంటీరుగా సేవలనందించడం, ఇవన్నీ మన స్వాధ్యాయంలోకి వస్తాయి. స్వాధ్యాయం మన లక్ష్యసిద్ధిలో చాలా కీలకమైన అంశంగా మనం గుర్తించవలసి ఉంది; తగువిధంగా మన జీవితాలను మనం మలచుకోవలసి ఉంది. 



Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 4


Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం 
సాధన 
మనపై మనం చేసుకునే పనికి సరైన, తగిన బలాన్ని చేకూర్చేది మనం నిత్యం చేయవలసిన సాధన. అంటే ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం అనే హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ సాధనా పద్ధతిలోని మూడు ప్రధాన యౌగిక ప్రక్రియలు. ఈ  మూడిటిని నిర్దేశించిన విధంగా ధ్యానిస్తూ, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకూ మన దినచర్యలోనూ, ప్రపంచంతో వ్యవహరించే విధానంలోనూ ఎలా ఉండాలో తెలియజేసే పది సూక్తులను గనుక ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే, మనలోని చైతన్య వికాసం ప్రతి నిత్యం గణనీయంగా వికాసం చెందడం మనం అనుభవం ద్వారా గ్రహించగలుగుతాం. 

అయితే ఈ ప్రక్రియలను కేవలం మొక్కుబడిగా గాకుండగా, కేవలం యాంత్రికంగా గాకుండగా, ఆ విధంగా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, కనీసం క్రమక్రమంగానైనా సరైన వైఖరితో, సరయిన దృక్పథంతో, తపనతో, భక్తి-ప్రేమలతో, ఆసక్తితో చేయడం అలవరచుకోవాలి. ఇవన్నీ మన దశనియమాల్లో విపులంగా తెలియజేయడం జరిగినది; దీనికి సంబంధించిన సాహిత్యం చదవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. 

ధ్యానం యొక్క ప్రయోజనం ధ్యాన స్థితిని పొందడమే; శుద్ధీకరణ ప్రక్రియ వల్ల గుండెలోని బరువు తగ్గి, హృదయ లోలోతుల్లోకి వెళ్ళగలిగే ప్రయోజనం కలుగుతుంది; తద్వారా మరునాడు చేసే ధ్యానం మరింత నిగూఢంగా ఉండే అవకాశం కలుగుతుంది; రాత్రి ప్రార్థన వల్ల హృదయంలో ప్రార్థనాపూర్వకమైన స్థితి ఏర్పడటం, వినమ్రత అలవడటం, తద్వారా అదే  మన స్వభావంగా మారే అవకాశం ఉంటుంది. 

ధ్యానం చేసే సమయంలో వచ్చే ఆలోచనలు కూడా ఒక్కోసారి బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయి; ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని కావడంతో బహుశా మనం రోజంతా చేయవలసిన పనులను గురించిన ఆలోచనలు రావచ్చు; వాటిని మనం ధ్యానంలో స్పష్టంగా చూసినప్పుడు అక్కడికక్కడే ఏవి ముఖ్యమైన పనులో, ఏవి కావో, ఏవి చేయక్కర్లేదో తెలిసిపోవడంలో మనకు రోజులో చాలా సమయం ఆదాయ అయ్యే అవకాశం ఉంటుంది; అందుకే పూజ్య దాజీ ధ్యానం వల్ల అదనంగా సమయం దొరుకుతుందంటారు. ఆసక్తితో ధ్యానం చేసినప్పుడు అనుభవంలో ఇలా చాలా విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే వచ్చే పోయే ఆలోచనలను నిర్లక్ష్యం చేసే కళ క్రమక్రమంగా అలవడటం వల్ల ముఖ్యమైన వాటిపైనే దృష్టిని పెట్టడం అలవాటవుతుంది; తద్వారా జీవితం ప్రయోజనకరంగా లక్ష్యసిద్ధి కోసం ఎక్కువ సమయం దొరుకుతుంది; విచక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దివ్య లక్షణాలు మనకు తెలియకుండా అలవడతాయి. ముఖ్యంగా ధ్యాన స్థితిని పొందిన తరువాత ఎక్కువ సేపు నిలుపుకోగలగడం, ఆ తరువాత అదే మన స్వభావంగా మారిపోయే వరకూ ధ్యానం కొనసాగిస్తాం; ధ్యానస్థితిలో ఉంటూ మనం జీవితం కొనసాగించడం వల్ల, మనం చేసే పనులు నేర్పుతో చేయడమే గాక, వాటి ముద్రలు మన హృదయంపై ఏర్పడకుండా కూడా జీవించగలుగుతాం. 

శుద్ధీకరణ ప్రక్రియ మనలో ఏర్పడిన ముద్రలను అంటే మన గతాన్ని, ఏరోజుకారోజు మనం తుడిచి వేయగలుగుతాం; ఆ విధంగా మనం గుండె బరువు తగ్గడం ప్రత్యక్షంగా అనుభూతి చెందగలుగుతాం. అలాగే ప్రశిక్షకుల ద్వారా లేక మాస్టర్ ద్వారా తీసుకునే ధ్యాన-సిట్టింగుల్లో మరింత లోలోతుల్లో స్థిరపడిన సంస్కారాల బీజాలను దగ్ధం చేయడం జరుగుతుంది. తద్వారా మనం సాధించిన ఆధ్యాత్మిక పురోగతి దృఢంగా నిలుస్తుంది. ఆ విధంగా క్రమక్రమంగా మన సంస్కారాలన్నీ తొలగించడం వల్ల ఈ సాధన మోక్షస్థితికి దారి తీస్తుంది. నాలుగు రకాల ప్రధానంగా మనకున్నాయి - 1) రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), 2) ప్రాపంచిక చింతలు 3) ఇంద్రియపరమైన బాధలు, 4) అపరాధాభావం. వీటిల్లో మొదటి మూడు రకాల సంస్కారాలను ఈ రకరకాల శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వదిలించుకోవచ్చు. నాల్గవది మాత్రం కేవలం ప్రార్థనా-ధ్యానం ద్వారా మాత్రమే పశ్చాత్తాపం ద్వారా మాత్రమే తొలగించుకోగలుగుతాం; దీన్ని భగవంతుడు గాని గురువు గాని వీళ్ళు కూడా తొలగించలేరు. ఇంకా అనేక ప్రయోజనాలు అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తాయి.
 
రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం  సాధనలో చాలా ముఖ్యమైన అంశం. పది-పదిహేను నిమిషాలు చేసే ఈ ప్రార్థనా-ధ్యానం మన సాధనలో చాలా కీలకమైనది. ఇది మన హృదయంపై పడే అతిభారమైన సంస్కారాలను తొలగించే అవకాశం ఉంది. పైన చెప్పిన విధంగా గుండెకు అతి భారమైన సంస్కారం అపరాధ భావం; అది కేవలం ఈ ప్రార్థనా-ధ్యానం ద్వారా తొలగించుకోగలుగుతాం. వెరసి శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియ ద్వారా మనలోని అనేక జటిల మనస్తత్త్వాలు, మలినాలు, అశుద్ధాలు తొలగిపోవడం వల్ల మనం మన అంతరంగంలో మరింత స్వచ్ఛంగా, సరళంగా తయారావుతాం. 

పై మూడు యౌగిక ప్రక్రియలు ఒకదానిపై ఒకటి ఆధారపడినవి. సమగ్రంగా ఈ ధ్యాన సాధన చేసినప్పుడు, సమాంతరంగా శీల నిర్మాణం చేసుకున్నప్పుడు,  నిజమైన నిరంతర స్మరణ లేక ధ్యాన స్థితి ఏర్పడతుంది. నిరంతర స్మరణ వల్ల నిజమైన ప్రేమ లేక భక్తి ఉద్భవిస్తుంది; ప్రేమ, పరిపక్వత చెందిన తరువాత అది శరణాగతిగా మారుతుంది; శరణాగతి తరువాత సిద్ధించే స్థితి - ఆ పరతత్వంలో సంపూర్ణ లయ ప్రాప్తించడమే . నీటి చుక్క మహాసముద్రంలో పడి మహాసముద్రంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది; ఆ విధంగా మన ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది. 

 






 



22, అక్టోబర్ 2023, ఆదివారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 3

 


Working on the self
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం -  3
ఆత్మావలోకనం 

ఆత్మావలోకనం అంటే తనను తాను నిష్పక్షపాతంగా, నిర్దుష్టంగా, ఉన్నదున్నట్లుగా చూసుకోగలిగి, తనను తాను యథాతథంగా ఉన్నదున్నట్లుగా స్వీకరించుకోగలగడం.  మనలోని కొరతలను, లోటుపాట్లను, బాగోగులను ఉన్నదున్నట్లుగా గుర్తించినప్పుడే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది; అప్పుడే మనిషి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆత్మావలోకం అంటే తన సమస్యలకు పరిష్కారాన్ని తనలోనే వెతుక్కోవడం. 
అలాగాక ఎక్కడికక్కడ మన లోటుపాట్లను సమర్థించుకున్నట్లయితే మనలో మార్పు రాకపోవడమే గాక, ఆత్మవంచనగా మారి, మనలో అపరాధాభావం ఎక్కువై గుండె రోజు-రోజుకూ బరువెక్కుతుంది. కాబట్టి గుండె రోజు-రోజుకూ తేలికపడటానికి ఆత్మావలోకనం చక్కటి పరికరం. ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలసిన ప్రక్రియ.
 
ఆత్మావలోకనం లేక ఆత్మపరిశీలన అనే ప్రక్రియ కొన్ని పరిస్థితుల్లో మనిషి జీవితంలో   సహజంగా జరుగుతూ ఉంటుంది; ముఖ్యంగా జీవితంలో విపరీత ఫలితాలు వచ్చినప్పుడు సహజంగా జరుగుతుంది; అప్రయత్నంగా జరుగవచ్చు. కానీ మనిషి తాను మరింత మెరుగైన విధంగా జీవించాలనుకున్నప్పుడు, తనను తాను మార్చుకోవాలనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా త్వరితంగా పురోగతి చెండాలనుకున్నప్పుడు, ఆత్మ వికాసం లేక వ్యక్తిత్వ వికాసం లేక చైతన్య వికాసం త్వరితంగా జరగాలనుకున్నప్పుడు ఈ ప్రక్రియను ప్రయత్నపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా వినియోగించవలసి ఉంటుంది. 
ఇది అంతర్లీనంగా జరిగే ప్రక్రియ. ధ్యానంలోనూ, శుద్ధీకరణ ప్రక్రియ చేస్తున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలో కూడా ఎల్లవేళలా జరుగుతూ  ఉంటుంది. దీనిపై ప్రయత్న పూర్వకంగా, ప్రత్యేక దృష్టిని పెట్టి పరిష్కారాలు వెతుక్కోవడమే ఆత్మావలోకనం. 

ఆత్మావలోకనం అంటే ఏది కాదు?
ఆత్మావలోకనం అంటే ధ్యానించడం కాదు. కళ్ళు మూసుకొని ఆలోచించడమూ కాదు. ఆత్మావలోకనం అంటే శుద్ధీకరణ ప్రక్రియ కూడా కాదు. ఆత్మావలోకనం అంటే కేవల కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం కూడా కాదు. 

మరి ఆత్మావలోకనం అంటే ఏమిటి?
ఆత్మావలోకనం అంటే వ్యక్తి తనను తాను ఉన్నదున్నట్లుగా పరికించుకోగలగడం, పరిశీలనగా చూసుకోగలగడం. దీని వల్ల వ్యక్తి తనను తాను యథాతథంగా స్వీకరించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. తనను తాను మార్చుకోవాలంటే ఈ విధంగా తనను తాను యథాతథంగా స్వీకరించగలగడం అవసరం, ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతికి ఇది చాలా కీలకం; అప్పుడే వ్యక్తిలో సమూలమైన శాశ్వతమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. 
ఆత్మావలోకనం ద్వారా తన ఆలోచనా విధానాన్ని, ఆలోచనలను, ఉద్వేగాలను, అనుభూతులను ప్రత్యక్షంగా ఉన్నదున్నట్లు గమనించగలుగుతాడు. వ్యక్తి తన బాలాలను, బాలహీనతలను, సమస్యలను, యథాతథంగా చూడగలిగే అవకాశం ఉంటుంది. 
ఆ విధంగా మనలో ఏ యే సమస్యలను పరిష్కరించగలము, ఏవి పరిష్కారానికి కొంత కష్టపడాలి, ఏ యే సమస్యలను కష్టపడినా పరిష్కరించలేము, వాటిని యథాతథంగా స్వీకరించగలిగే శక్తి వస్తుంది. 
పరిష్కరించగలిగే సమస్యలను గుర్తించినప్పుడు, వాటిని వెంటనే మనం ప్రయత్నం ద్వారా పరిష్కరించుకోగలుగుతాము. పరిష్కరించడం కష్టం అన్న సమస్యల కోసం అంతర్యామిగా ఉన్న భగవంతుని సహాయం కోసం ప్రార్థించి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. అసాధ్యం అన్న సమస్యను లేక కష్టాలను దైవ సంకల్పాలుగా భావించి, దివ్య ప్రణాళికలో భాగంగా భావించి, సంతోషంగా స్వీకరించగలుగుతాం. 

ఈ విధంగా ఆత్మావలోకనం అనే ఈ ప్రక్రియ, ప్రయత్నపూర్వకంగా చేసే ఈ ప్రక్రియ, మన ఆధ్యాత్మిక పరిణతిని, ఆధ్యాత్మిక పురోగతిని, ఆత్మ వికాసాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలను, సహజంగా జరిగే పరిణామ క్రమాన్ని మరింత వేగాన్ని పుంజుకునేలా తోడ్పడుతుంది. 



20, అక్టోబర్ 2023, శుక్రవారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 2

 


Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం -  2
శీలనిర్మాణం 
ఆధ్యాత్మిక ప్రగతి నా వంతు, శీల నిర్మాణం అభ్యాసి వంతు - బాబూజీ 
నేను మీ పట్ల చేస్తున్నది నా ధర్మం, మీరు నా పట్ల యేది చేయడం లేదో అది మీ ధర్మం. - బాబూజీ 
మనం నిత్యం సాధన చేసుకుంటూ, అది గాక మన మాటలను, చేతలను, అలవాట్లను, ప్రవర్తనను, మన మనోద్వేగాలను, ఉద్రేకాలను, మన సంకల్పాలను (అంటే మన మనసులో ఉండే ఉద్దేశాలను), వెరసి మన శీలాన్ని గమనించుకుంటూ వాటిని మెరుగుపరచుకునే దిశగా కృషి చేయడమే మన వంతు. 

ఇదే మనపై మనం పని చేసుకోవడమూ అంటే. ఇదే బాబూజీ చెబుతున్న అభ్యాసి వంతు. ఒక కన్ను అంతరంగంలోకి చూసుకోవడానికి మరో కన్ను లౌకిక వ్యవహారాల్లో మన ప్రవర్తనను గమనించుకోవడానికి, అని బాబూజీ అంటూండేవారు. ఇలా ఉండనప్పుడే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. జరుగవలసిన వికాసం జరగదు. ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాము. 
బాబూజీ దయ వల్ల అంతరంగంలో వెలుగు దేదీప్యమానంగా వెలుగుతున్నప్పటికీ, దాని కాంతి మాత్రం బయటకు ప్రసరించకపోవడానికి కారణం లాంతరు మసితో నిండిపోవడం.  ఆ మస్సే మన శీలం. లాంతరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే తప్ప వెలుతురు బయటకు రాదు. ఈ అవగాహన పూజ్య చారీజీ ఇచ్చినది. 

ఇక్కడ సౌశీల్యాన్ని గురించి మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. 
ఆధ్యాత్మికంగా ఎదుగుతూ కూడా సౌశీల్యం లేకుండా ఉండగలరా? 
ఉండవచ్చు. మన చుట్టూ గమనిస్తే చాలా మంది కనిపిస్తారు. మన ఆధ్యాత్మిక చరిత్రలో చూస్తే, రావణ బ్రహ్మ ఒక కొట్టొచ్చే ఉదాహరణ. అతను గొప్ప తపః సంపన్నుడు, వేదశాస్త్రాలు వంటబట్టించుకున్నవాడు, కానీ శీలంలో లోపం ఉండటం వల్లనే అతను పతనమవుతాడు. రావణుడు తన శవం ద్వారా లక్ష్మణుడికిచ్చిన చివరి సందేశంలో మనకర్థమవుతుంది. మంచి చేయడానికి ఆలస్యం చేయవద్దని ఆతని చివరి సందేశం. మంచి అని తెలిసినా ఆలస్యం చేయడమే తన పతనానికి కారణమని, తన జీవితంలో నేర్చుకున్న పాఠమని, చెప్పడం జరుగుతుంది.  ఇలా ఒక్క ఆలోచన మన శీలాన్ని పతన దిశగా తీసుకువెళ్ళవచ్చు. పూజ్య లాలాజీ కూడా శీలవంతుడు గాకపోతే సాధకుడు ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా ప్రయోజనం ఉండదన్నారు. 

ఆధ్యాత్మిక సాధన చేస్తున్న సాధకుడిలో శీల నిర్మాణం తనంత తానుగా జరగదా? 
మనం సహజమార్గ సాధన  ప్రతి నిత్యం చేస్తున్నప్పుడు సౌశీల్యం అప్రయత్నంగా పెంపొందదా, అంటే పెంపొందుతుంది; కానీ చాలా నెమ్మదిగా జరుగుతుందన్నారు చారీజీ. అందుకే అభ్యాసి శీలనిర్మాణంపై దృష్టి పెట్టవలసిన అవసరం. అది గురువు చెయ్యలేడు. సహకరించగలడు. 

శీల నిర్మాణం అనేది మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇటుక కట్టుడులాంటిది. ఇటుకపై ఇటుక పెడుతూ ప్రతీ ఆలోచనను గమనించుకుంటూ నిర్మించుకోవలసినది. తుదిశ్వాస వరకూ కొనసాగవలసినది. ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినది. ఆటోమ్యాటిక్ గా జరగదు. బాబూజీ ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతికి అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనలను సరిదిద్దుకోవలసి ఉంటుంది. చేతలను, అలవాట్లను, ప్రవర్తనను మాలచుకోవలసి ఉంటుంది. అప్పుడే ఆధ్యాత్మిక పురోగతి పరిపూర్ణమవుతుంది. దీనికి ఒక ఆదర్శ వ్యక్తి మన జీవితంలో ఉన్నట్లయితే శీలనిర్మాణం తేలికయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గురువును ఆదర్శంగా చేసుకునేది సహజమార్గంలో. అటువంటి ఉన్నతోన్నత వ్యక్తులే సహజమార్గ గురుపరంపరలో ఉంటారు - ఆధ్యాత్మికంగానూ శీలపరంగానూ పరిపూర్ణాతను సాధించిన ఆదర్శవంతమైన వ్యక్తులు వీరు. ఇంకా చెప్పాలంటే సజీవ గురువు అవసరం కూడా ఇదే  సాధకులకు. ధ్యానం వల్ల, గురువు యొక్క అనుసరణ వల్ల కష్టసాధ్యమైన శీలనిర్మాణం తేలికయ్యే అవకాశం ఉంది.  

 











18, అక్టోబర్ 2023, బుధవారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 1

 


Working on the self  
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం 

ఆధ్యాత్మిక సాధనలో సాధకుడి అతిముఖ్యమైన పాత్ర అయిన మానవ ప్రయత్నం ఏమిటో, దాన్ని గురించి చర్చించుకుందాం. అదే తనపై తాను పని చేసుకోవడం అంటే కూడా, ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ సహజమార్గ సాధనపరంగా. 

సహజమార్గ ధ్యానం యొక్క పరమలక్ష్యం లేక యదార్థ లక్ష్యం, పూజ్య బాబూజీ చెప్పిన ప్రకారం,  భగవంతునిలో సంపూర్ణ ఐక్యం చెందడం. ప్రప్రథమంగా ఆ లక్ష్యాన్ని మన హృదయంలో సుస్థిరంగా స్థాపింపబడిందా లేదా సరిచూసుకోవడం చాలా అవసరమని పూజ్య దాజీ చెప్పడం జరిగింది. 

మరలా పూజ్య దాజీ చెప్పినట్లుగా, మనం నీటి చుక్క అయితే భగవంతుడు మహాసాగరం; అప్పుడే ఆ నీటి చుక్క మహాసాగరంలో ఒక్కటైపోవడం లేక నీటి చుక్క మహాసాగరంగా మారిపోవడం జరుగుతుంది; మన పరమ లక్ష్యం సిద్ధిస్తుంది. 
కానీ మనం నీటి చుక్కగా గాకుండగా నూనె చుక్కగా ఉన్నట్లయితే మహాసాగరంలో ఒక్కటయ్యే అవకాశమే లేదు, ఎన్ని యుగాలయినప్పటికీ మహాసాగరంలో అలా తేలుతూనే ఉంటుంది తప్ప సముద్రంలో విలీనమవడం జరగదు. ఈ విషాదకరమైన పరిస్థితిని దయచేసి గమనించండి - ఆ నూనె చుక్క మహాసముద్రంలో ఉన్నప్పటికీ, సముద్రంతో అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది. మన పరిస్థితి కూడా సరిగ్గా అలాంటిదే. సాక్షాత్తు ఆ భగవంతుడు మనలో అంతర్యామిగా ఉన్నప్పటికీ మనం ఆయనతో సంబంధం లేకుండా జీవించేస్తూ ఉంటాం. ఇంతకంటే పరమ విషాదకరమైన పరిస్థితి మనిషికి ఉండదేమో! 

అయితే ఈ నూనె చుక్కలో ఉన్న నూనెతనం లేక పచ్చిగా చెప్పాలంటే నూనె చుక్కలో ఉన్న జిడ్డు మూలాన అది సముద్రంతో సంబంధం లేకుండా ఉండిపోయింది. ఆ జిడ్డును గనుక ఎలాగో అలాగ తొలగించగలిగి, అందులోని సముద్ర తత్త్వాన్ని ఆవిష్కరించగలిగినట్లయితే అది కూడా మహాసముద్రంలో విలీనమైపోతుంది. ఇదే మన గురుదేవులు మనపై చేస్తున్న ప్రయత్నం - ఈ జిడ్డును వదలకొట్టడం. ఇందులో మన పాత్ర లేక మానవ ప్రయత్నం చాలా ఉంది; అన్నీ మాస్టరే చేసేస్తారన్నది పొరపాటు భావమే అవుతుంది. కచ్చితంగా మన ప్రయత్నం చాలా అవసరం;  చివరికి అసలు పని చేసేది ఆయనే అయినప్పటికీ, సాయశక్తులా మనం చేయవలసిన ప్రయత్నం చాలా ఉంటుంది. 

అయితే మనలో ఉండే ఈ జిడ్డు ఏమిటి? మనకు మనలో అంతర్యామిగా ఉండే భగవంతునితో సంబంధం లేనట్లుగా మనిషి జీవించడానికి కారణమైన ఆ నూనెతనం అంటే ఏమిటి? మూడే మూడు - సంస్కారాలు, కోరికలు, అహంకారము. మూడే కదా అనిపిస్తుంది కానీ, వీటిని వదుల్చుకోడానికి ఎన్ని జన్మలైనా పట్టవచ్చు, సరైన మానవ ప్రయత్నం లేకపోతే, సమర్థుడైన గురువు ఆశ్రయం లేకపోతే.
వీటిల్లో సమర్థుడైన గురువును ఆశ్రయించి, వారు చెప్పింది చెప్పినట్లుగా అనుసరించగలిగితే సంస్కారాలను తుడిచేయగలడు ఈ జన్మలోనే. సాధకుడు తన స్వయం కృషితో తన కోరికలను కూడా తగ్గించుకోవచ్చును. కానీ అహంకారం మాత్రం సాధకుడు మాత్రమే తగ్గించుకోవాలి. ఈ  మూడు సంపూర్ణంగా తొలగినప్పుడు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందడం, నూనె చుక్క నీటి చుక్కగా మారి సముద్రంలో విలీనమయ్యే అవకాశం ఉంటుంది. 

అయ్యబాబోయ్! ఇది మన వల్ల కాదనిపిస్తుంది. కానీ తప్పదు. ఇక్కడే మాస్టర్ యొక్క అనుగ్రహం పని చేసేది. మన జీవన విధానం ఆయనను అనుసరిస్తూ ఆయన అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా మలచుకోగలిగితే వారి అపార అనుగ్రహం వల్ల కూడా పని అయ్యే అవకాశం ఉంటుంది; ఎందుకంటే ఆయన ఉన్నదే మనలను అనుగ్రహించడానికి. అయితే ఇందులో మన పాత్ర, ప్రయత్నం చాలా ఉంది. దాన్నే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

పైన చిత్రంలో ఉన్నట్లుగా మన వైపు నుండి మనం శుద్ధి చేసుకోవలసిన అంశాలు - సాధన, శీలం, ఆత్మావలోకనం, స్వాధ్యాయం, స్వచ్ఛంద సేవ. వీటిని మన స్వభావంగా మారే వరకూ ప్రేమతో, భక్తితో అనుసరించినప్పుడు వారి దృష్టిని లేదా వారి అనుగ్రహాన్ని ఆకర్షించగలుగుతాం. ప్రయత్నిద్దాం. 
తరువాయి భాగంలో వివరాలు చర్చిద్దాం. 




16, అక్టోబర్ 2023, సోమవారం

జ్యోతిష్యం, ఆధ్యాత్మిక జీవనం


 జ్యోతిష్యం, ఆధ్యాత్మిక జీవనం

మనిషి జీవనం, మనిషి మనుగడ బహుశా జ్యోతిష్యాన్ని యేదొక దశలో స్పృశించకుండా ముందుకు సాగదేమోనని నా అభిప్రాయం. నాస్తికులైనా, హేతువాదులైనా కూడా వాటిని విమర్శించడానికైనా వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం కష్టమే. సంసారం అనే ఈ ఇక్కట్లతో కూడిన భవసాగరాన్ని ఈదడానికి, ముఖ్యంగా సగటు మనిషి అనుభవించే బలహీన క్షణాలను అధిగమించడానికి ఎన్నిటినో ఆశ్రయించవలసి వస్తూ ఉంటుంది. అందులో భవిష్యత్తును తెలుసుకోవాలన్న తపనను కొంత వరకూ తెలియజేసేది ఈ జ్యోతిష్యం ఒక్కటే. 

జ్యోతిష్యం అంటే, సగటు మానవ దృష్టిలో, జాతక చక్రం ద్వారా జాతకాన్ని తెలుసుకోవడం; లేక హస్తసాముద్రికం; నాడీ శాస్త్రం; టారోట్ కార్ఢులు; ముఖాన్ని చూసి చెప్పే జాతకాలు ఇత్యాదివి ఇంకా ఎన్నో రకాల పద్ధతుల ద్వారా తమ భవిష్యత్తును, పరిహారాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం. మనిషి జీవితంలో యేదొక దశలో వీటిని ఆశ్రయించేవారున్నారు; లేక వాటినే తు. చ. తప్పకుండా సాంప్రదాయంగా పాటించే వారు కూడా ఉన్నారు.

వెరసి కొంత వరకూ వీళ్ళు చెప్పినవి జరగడం, కొంత జరగకపోవకపోవడం; ఇవన్నీ ఉంటాయి. వీటిని నమ్మడం ఎంత వరకూ కరెక్టు? అన్న మీమాంస ప్రతి మనిషిలోనూ ఉంటూనే ఉంది. ముఖ్యంగా మనిషికి భయం కలిగినప్పుడు, దిక్కుతోచనప్పుడు, అనుకున్నవి అనుకున్నట్లుగా జరగనప్పుడు, విపత్తులు, ఆపదలు సంభవించినప్పుడు, కారణాలు తెలియని సమస్యలతో లేక అనారోగ్యాలతో క్రుంగిపోతున్నప్పుడు, జీవితం ఏ దిశగా కొనసాగుతున్నదో  తెలియనప్పుడు, సాధారణంగా  మనం వీటిని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. ఇవేవీ పని చేయనప్పుడు, అప్పుడు మాత్రమే గురువుల అన్వేషణలో లేక ఆధ్యాత్మిక దిశలో మనిషి ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడు. 

అసలు జ్యోతిష్య శాస్త్రం నమ్మదగ్గదేనా? నిజంగా గ్రహాల ప్రభావం మనపై ఉంటుందా? జాతకంలో వ్రాసినట్లుగానే జీవితం ఉంటుందా? మనం చేయగలిగిందేమైనా ఉంటుందా, ఉండదా? మన జాతకాన్ని లేక మన విధిని ఏమైనా మనం మార్చుకోగలమా, లేదా? ఇటువంటి ప్రశ్నలు కూడా మనిషిని మనసు లోలోతుల్లో వేధిస్తూనే ఉంటాయి. 

హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ గురుపరంపరలోని మాస్టర్ల నుండి మనకేమైనా సమాధానాలు వస్తాయేమో చూద్దాం. 

జ్యోతిష్య శాస్త్రం అనేది మన సనాతన ధర్మంలోని వేదాంగాల్లో ఒకటి. మహర్షులు దర్శించినవి ఇందులో సశాస్త్రీయంగా ఉండటం మూలానే ఇప్పటికీ సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు, సూర్యచంద్రాదులతో సహా ఇతర గ్రహాల కదలికలు,  గ్రహణాలు, అంతరిక్షంలో జరిగే వివిధ సంఘటనలను అంత సరిగ్గా చెప్పగలుగుతున్నారు, ఒక సంవత్సరం ముందే చెప్పగలుగుతున్నారు, జరగబోయేవాటితో సహా. కాబట్టి శాస్త్రాన్ని అజ్ఞానంగా నిరాకరించడానికి లేదు. తప్పక గ్రహప్రభావాలు మనిషిపై ఉంటాయన్నది ఈనాడు సైన్సు కూడా అంగీకరిస్తున్న విషయం. అనుభవిస్తున్నాం కూడా. 

అయితే ఈ జాతకాలు అంటే మన వ్యక్తిగత భవిష్యత్తులు అనేవి కూడా చాలా వరకూ వాళ్ళు ముందుగా చెప్పినట్లుగా జరుగుతూ ఉంటాయి కూడా. అంటే మన జీవితాల్లో అన్నీ  ముందే రాసిపెట్టినట్లుగానే జరుగుతూ ఉంటే ఇక మనం చేయవలసినదేమిటి? అన్న ప్రశ్న కలుగుతుంది. మనిషి అయోమయంలో పడతాడు. అందుకే మనిషి వీటిని ఆశ్రయించడానికి కారణం.

మనిషిలో సంకల్పబలం లేక సంకల్ప శక్తి అనేది కూడా ఒకటుందన్న సంగతి మనిషి మరచిపోతూ ఉంటాడు. ఇది చాలా సూక్ష్మమైన శక్తి. దీన్ని వినియోగిస్తే మన విధిని మనం రూపకల్పన చేసుకోవచ్చు. నా అవగాహణలో మనిషి దీన్ని వినియోగించుకోవడంలోనే విఫలుడవుతూ ఉన్నాడు. 

నేనొకసారి పూజ్య చారీజీ మాస్టరు గారిని ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు ఈ విధంగా సమాధానమిచ్చారు: "విధివ్రాత అనేది ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే తన విధిని మార్చుకోవడానికి ఏ ప్రయత్నమూ చెయ్యడో ఆ వ్యక్తికి మాత్రమే వీధివ్రాత వర్తిస్తుంది" అన్నారు.  అలాగే జ్యోతిష్యం గురించి హార్ట్ టు హార్ట్ ఆంగ్ల ప్రసంగాల శ్రేణిలో మాట్లాడుతూ, ఏ జాతకమైనా రాసింది రాసినట్లుగా జరగాలంటే మూడు పరిస్థితులుండాలన్నారు - 1) జాతకానికి సంబంధించిన సమాచారం పొల్లుపోకుండా కరెక్ట్ గా ఉండాలి, 2) జాతకం చెప్పేవారు పరిపూర్ణ జ్యోతిష్యుడై ఉండాలి ఇక 3) మూడవది, చాలా ముఖ్యమైనది, ఆ జాతకుడు మారడానికి సిద్ధంగా లేనివాడై ఉండాలి. అప్పుడు జాతకం తప్పనిసరిగా ఎలా రాసుందో సరిగ్గా అలాగే జరుగుతుందన్నారు. స్వామి వివేకానంద జ్యోతిష్యం నిజమే అయినప్పటికీ దాన్ని నమ్మకూడదన్నారు, ముఖ్యంగా యువకులు, లేకపోతే సోమరులుగా తయారవుతారన్నారు. పూజ్య దాజీ మన విధిని ఏ విధంగా మనం రూపకల్పన చేసుకోవచ్చునో ఆంగ్లంలో ఒక గ్రంథమే వ్రాయడం జరిగింది.  దాని పేరు - డిజైనింగ్ డెస్టినీ  తప్పక అందరూ చదువవలసిన గ్రంథం. 

ఇందులో పూజ్య దాజీ స్పష్టంగా వివరించినది ఏమిటంటే - మనిషి జీవితంలో మార్చుకోలేని భాగం కొంత ఉంటుంది, మార్చుకోగలిగిన భాగం మన సంకల్ప శక్తితో సమర్థుడైన ఆధ్యాత్మిక గురువు సహాయంతో చాలా వరకూ మార్చుకోవచ్చు; ఆ విధంగా మన విధినే రూపకల్పన చేసుకోవచ్చును. దానికి ఏమి చేయాలో ఏ విధంగా సరళమైన హార్ట్ఫుల్నెస్ యోగా-ధ్యాన ప్రక్రియలు ఉపకరిస్తాయో తెలియజేశారు. 

అందరూ తప్పక ఆ గ్రంథం చదువుతూ హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియలను ఆసక్తితో ప్రతినిత్యం చేసుకుంటూ మన పరమగమ్యానికి మనమే చక్కని త్రోవను ఏర్పాటు చేసుకోవాలని, ఆ అనుభవాన్ని  ఈ జన్మలోనే పొందాలని ప్రార్థిస్తూ .... 


అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...