26, సెప్టెంబర్ 2023, మంగళవారం

పూజ్య దాజీ 68 వ జన్మదినోత్సవ సందేశ మననం - 2

 

ఆధ్యాత్మికంగా గురువుకు "అందుబాటులో ఉండటం"అనే అంశానికి సంబంధించి దాజీ చెప్పిన అద్భుత ఉదాహరణలు 

పరమపూజ్య బాబూజీ (దాజీ చెప్పినట్లుగా హుక్కా పీలుస్తూ, లాలాజీకి అందుబాటులో ఉంటూ  ఉన్నత స్థితుల్లో పనిచేస్తున్న సన్నివేశం)  
మదర్ హెలీన్ పైరే (బాబూజీ నుండి, ఇతర మహాత్ముల నుండి మన విస్పర్స్ సందేశాలను అందుకున్న లేఖిని, దాజీ మామ్  అని సంబోధిస్తూంటారు)


పూజ్య దాజీ, సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సత్సంగాల తరువాత తన సందేశాన్ని చదువుతూ మధ్య-మధ్యలో అదనంగా కొన్ని వ్యాఖ్యలు, విపులీకరణలు చేయడం జరిగింది. అలాగే వారి సందేశంలో ఉటంకించిన 4 విస్పర్ సందేశాలను కూడా పూర్తిగా చదవడం చేశారు. ఈ సందేశం అంతా కూడా శిష్యుడు గురువుకు అందుబాటులో ఉండటాన్ని గురించే. గత వ్యాసంలో వీటిల్లో కొన్ని భావాలను మనం మననం చేసుకున్నాం. ఈ వ్యాసంలో అదనంగా వారు చెప్పినవాటిని మననం చేసుకుందాం. 
ముఖ్యంగా అందుబాటులో ఉండటాన్ని గురించి ఉల్లేఖిస్తూ, తనకు జరిగిన ఒక  అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. ఒక రోజు దాజీ, ఫ్రాన్స్ లోని మోంప్లే ఆశ్రమంలో ఉన్నప్పుడు, మన లేఖిని మదర్ హెలీన్ పైరే ను కలుసుకున్నప్పుడు, ఆమె దాజీని మరునాడు ఉదయం 10 గంటలకు బాబూజీతో మీటింగ్ ఉంది ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. ఈ సందేశాలను ఆంగ్లంలోకి అనువదించే సోదరుడు మిచేల్ ఆతని భార్య జనేట్ దాజీని కలిసి ఆమెకు బాబూజీతో మీటింగ్ ఉంది కాబట్టి, మనం ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది అని చెప్పగానే ఆయన మదర్ ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయారు. ఆ తరువాత ఆయన 10.45 గంటలకు మదర్ ఇంటికి వెళ్ళిన తరువాత మదర్, "చెప్పాను కదా నీకు బాబూజీతో 10 గంటలకు మీటింగు ఉందని, ఎందుకు రాలేదు?" అని ప్రశ్నిస్తారు. అప్పుడు దాజీ, తాను బాబూజీకి అందుబాటులో ఉండలేకపోయానే, అవకాశాన్ని కోల్పోయానే అని బాధపడ్డారట. జరిగినది చెప్పినప్పుడు మదర్ దాజీని ఓదారుస్తారట. 

పూజ్య దాజీ పలికిన కొన్ని అద్భుత వాక్యాలు; శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా సాక్షాత్కరించుకోవాలసిన వాక్యాలు:

1) విజ్ఞత అంటే సంపూర్ణంగా భగవంతుని పనిలో నిమగ్నమై ఉండటం. 
"నేను మళ్ళీ మళ్ళీ అనుభవంలో చూసిందేమిటంటే, ఎన్ని ఇబ్బందులున్నా ఎలాగో అలాగ, మనం చేయవలసిన ధర్మానికి అనుగుణంగా బలవంతంగా అయినా పని చేసినప్పుడు, ప్రకృతి ఏర్పరచిన అవరోధాలు లేక పరీక్షలన్నీ ఆధిగమించగలుగుతాం. తలనొప్పనో, లేక మరే కారణం చేతనో మనం చేయవలసిన ధ్యానం చేయడం వంటి పనులు చేయకపోతే, మనం ఇబ్బందులపాలవుతాం. అస్తమానూ వాయిదా వేస్తూనే ఉండటం వల్ల మనం వికాసపథంలో ఉండం. అందుబాటులో ఉండటమూ అంటే, సంపూర్ణ సమర్పణ భావంతో, చేయవలసిన పనిని ఏమి జరిగినా స్వీకరిస్తూ పని చేయడమే. ఇలా పనిచేయడానికి పూర్తిగా అందుబాటులో ఉండటమే దైవత్వం. భగవంతుని సేవకు సంపూర్ణంగా అందుబాటులో ఉండటమే విజ్ఞత. దీనికి ఏ  నెపమూ పనికి రాదు.. అందుబాటులో లేకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు, కానీ అందుబాటులో ఉండటానికి ఉన్నది కేవలం ఒకే ఒక్క కారణం - నా పట్ల నేను చేసుకోవలసిన ధర్మం. 
2) నిజంగా అందుబాటులో ఉండటం, అహం యొక్క పాత్ర 
సంస్కారాలు అందుబాటులో ఉండటం అనేదాన్ని వడాపోస్తున్నట్లుగా వ్యవహరిస్తాయి. సంస్కారాలు గతానికి సంబంధించినవి. మన కోరికలు, అహంకారం ఇప్పటికే ముద్రల ద్వారా ఏర్పడిన చట్రాలకు తోడవుతాయి. అహం అంటే ఏమిటి? అహం తన అథమ స్థితిలో, జడంగానూ, మంకుపట్టు పట్టడం, దబాయించి ఆడగటం, ఈ విధంగా ఉంటుంది. ఈ ధోరణి అందుబాటులో ఉండటానికి విరుద్ధమైనది.  
 

23, సెప్టెంబర్ 2023, శనివారం

పూజ్య దాజీ 68 వ జన్మదినోత్సవ సందేశ మననం - 1




పరమ పూజ్య గురుదేవులు దాజీ 68 వ జన్మదినోత్సవ సందర్భంగా, హార్దిక శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. 
వారు దీర్ఘాయుష్కులై, ఆరోగ్యంగా, భూమ్మీదకు తాను వచ్చిన కార్యసిద్ధి  జరగాలని, వారి ఆశయసిద్ధిలో విజయం చేకూరాలని, మానవాళిలో వారు ఆపేక్షిస్తున్న పరివర్తన త్వరితంగా సంభవించాలని, హృదయపూర్వకంగా మన గురుపరంపరలోని మహానీయులందరినీ వేడుకుందాం. 
 అలాగే వారి అభ్యాసులుగా, భక్తులుగా, శిష్యులుగా, స్వచ్ఛంద సేవకులుగా, కృతజ్ఞతాపూర్వకంగా అందుబాటులో ఉంటూ  స్వయం పట్ల, సంస్థ పట్ల మనం మన వంతుగా చేయవలసిన కృషిని,  బాధ్యతను,  నెరవేరుస్తామని మనకు మనమే త్రికరణశుద్ధిగా వాగ్దానం చేసుకుందాం.  


(పూజ్య దాజీ ఈ సందర్భంగా "అందుబాటులో ఉండటం" అనే విషయంపై ఇచ్చిన సందేశాన్ని పైన వీడియో ద్వారా వినవచ్చు, చూడవచ్చు.)

సందేశ మననం 
విషయం - అందుబాటులో ఉండటం. భౌతికంగానూ, ఆధ్యాత్మికపరంగానూ కూడా శిష్యుడు గురువుకు  అందుబాటులో ఉండటం అని ముఖ్యంగా దీని అర్థం. అంటే వారికి వ్యక్తిగత సేవాలని కాదు అర్థం;  శిష్యుడు గురువుకు అందుబాటులో ఉండేది, కేవలం తన ఆధ్యాత్మిక పరిణతి కోసం, చైతన్య వికాసం కోసం, దివ్యయచేతన దిశగా జీవనం కొనసాగడం కోసం, నిష్కారణ ప్రేమ పెంపొందడం కోసం, ఇంకా చెప్పాలంటే ప్రేమగా మారడం కోసం, గురువు చేసే కార్యంలో సహకరించడం కోసం, గురుసేవలో ఉండటం కోసం, ఇంకా చెప్పలేనివెన్నో..
ఈ సందేశంలో బాబూజీ పలికిన 3  విస్పర సందేశాల్లోని వాక్యాలతోనూ, ఒక వాక్యం ది వెనరబుల్ అనే మాస్టరు పలికిన వాక్యంతోనూ, 2  కథలతోనూ మనందరికీ అందుబాటులో ఉండటాన్ని గురించి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మానాకేదో సందేశాన్నివ్వడం జరిగింది. ఈ సందేశం ద్వారా పూజ్య దాజీ మనందరికీ ఒక్కొక్కరికీ వారికి వర్తించే సందేశం ప్రత్యేకంగా ఒక్కటైనా ఉండుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అవునో కాదో, ఎవరికి వారు శోధించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఫలితంగా మన సంస్థ సేవాలనందించడంలో గణనీయమైన మార్పు సంభావిస్తుందనిపిస్తున్నది. ఇది ఆయన ఇచ్చే ప్రతి సందేశానికి వర్తించినా, ముఖ్యంగా ఈ సందేశానికి వర్తిస్తుందనిపిస్తోంది. .   
బాబూజీ విస్పర్స్ లో వ్రాసిన వాక్యంతో ప్రారంభిస్తారు;  "సేవ అంటే, ఇక తన జీవితం తనది కానట్లే.. " అంటారు. విస్పర్స్ అందుకున్న మదర్ హెలీన పైరే గారు ఎన్ని వ్యక్తిగత విపత్కర పరిస్థితులున్నా, ఎన్ని అనారోగ్య సమస్యలున్నా బాబూజీ సందేశాలందుకోడానికి, తనను తాను యే విధంగా అందుబాటులో ఉంచుకునేదో  ఊహిస్తే మనకు ప్రేరణ కలగాలి. అలా అందుబాటులో ఉండటం మూలంగానే ఆమె అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుందని చెప్తున్నారు దాజీ. 
అందుబాటులో ఉండటం అనే అద్భుత లక్షణానికి అద్వితీయ నిదర్శనం, ఉదాహరణాల్లో పరాకాష్ఠ సాక్షాత్తు బాబూజీ మహారాజే. వారు యే విధంగా నిరంతరం లాలాజీకి అందుబాటులో ఉండేవారో, వారి ఆజ్ఞలకు ఎంత అప్రమత్తంగా ఉండేవారో, యే విధంగా హుక్కా పీలుస్తూనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితుల్లో లాలాజీకి  అందుబాటులో ఉంటూ పని చేసేవారో చాలా మంది అభ్యాసులు గమనించారని కూడా గుర్తు చేశారు. 
కానీ మనలాంటి మామూలు జనం యే విధంగా అనవసరమైన విషయాలకు అందుబాటులో ఉంటూ నష్టపోతూ ఉంటామో కూడా విడమర్చి చెప్పడం జరిగింది ఈ సందేశంలో. 
బావిలో కప్ప కథ ద్వారా, యే విధంగా సముద్రపు కప్ప, బావిలో కప్పకూ సముద్రం గురించి చెప్పడంలో కష్టపడుతుందో, అయినా దానికి అర్థం కాకపోవడం చెప్పడం జరిగింది. ఇక్కడ సముద్రపు ఒక రకంగా గురువు, బావిలో కప్పలా ఉన్నది మనం. బావిలో కప్పను సముద్రపు కప్పగా మార్చాలంటే మనం వ్యక్తిగతంగా  సృష్టించుకున్న లోకాన్ని నాశనం చేసుకోవాలి, మన బావి అన్నాడానిలో నుండి బయట పడాలి; దీనికి సహజమార్గం సహకరిస్తుందన్నారు. 
సహాజమార్గ ధ్యాన-శుద్ధీకరణాలు ఏ విధంగా విజ్ఞతకు దారి తీస్తాయో, ఏ విధంగా విజ్ఞత కూడా బావిగా మారుతుందో, అక్కడి నుండి తప్పించుకునే మార్గం అధిచేతనా స్ఫూర్తి ద్వారా మాత్రమే సాధ్యమంటారు దాజీ. ఆ స్ఫూర్తి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. 

ఎత్తైన దృష్టికోణంతో చూసే వ్యక్తి యే విధంగా గతాన్ని, భవిష్యత్తును స్పష్టంగా వర్తమానంలో చూడగలుగుతాడో అని చెప్పడానికి మరో కథ దాజీ చెప్పడం జరిగింది. ఇది వికసించిన చేతనం వల్లే సాధ్యపడుతుంది.

అలాగే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద అన్ని రోజులు ప్రయాణం పోకుండా  పడుకోవలసి రావడాన్ని గురించిన కారణం 100 జన్మలకు పూర్వం తాను చేసిన కర్మేనని తెలుసుకునేలా శ్రీకృష్ణుడు వరం ఇవ్వడం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు గాని భీష్ముని మనసుకు శాంతి కలుగదు. భగవానుడికి అందుబాటులో ఉన్నప్పుడే మనసుకు శాంతి కలుగుతుందని మరోసారి తేటతెల్లమయ్యింది. 


(ఇంకా ఉంది ..)

  
 

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ - 2






సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ

పాయింట్ ఎ, పాయింట్ బి 

(పైన చిత్రం: రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే గ్రంథంలోనీది.)

పూజ్య బాబూజీ చేసిన అనేక ఆధ్యాత్మిక ఆవిష్కరణల్లో పాయింట్ ఎ, పాయింట్ బి  అనే ఉపబిందువులు చాలా ప్రధానమైనవి.  బాబూజీ ప్రకారం అనేక ఉపబిందువులున్నాయి కానీ, అభ్యాసి సాధనకు సంబంధించినంత వరకూ ఇవి చాలా ముఖ్యం అన్నారు. ఈ బిందువులు ప్రతి మనిషికీ ఎక్కడుంటాయో చెప్పడం జరిగింది. ఎడమ చనుమొన నుండి 2 వేళ్ళ వెడల్పు కుడివైపుకు తీసుకుని, అక్కడి నుండి 3 వేళ్ళ  వెడల్పు నిటారుగా క్రిందకు తీసుకుంటే ఉండేది పాయింట్ ఎ ఉపబిందువు. అక్కడి నుండి 2 వేళ్ళ వెడల్పు క్రిందకు వస్తే ఉండేది పాయింట్ బి ఉపబిందువు. 

సహజమార్గ ఆధ్యాత్మిక పథం ప్రకారం పాయింట్ ఎ పై ధ్యానం కొద్ది నిముషాలు, పాయింట్ బి శుద్ధీకరణ కొద్ది నిముషాలు ప్రతి రోజూ సాధకుడు చేయవలసి ఉంటుంది. 

పాయింట్ ఎ వద్ద ప్రాపంచిక చింతలకు సంబంధించిన ముద్రలు ఏర్పడతాయి; పాయింట్ బి వద్ద ఇంద్రియాకర్షణకు సమబంధించిన ముద్రలు ఏర్పరచుకుంటూ ఉంటాడు అభ్యాసి. పైన చెప్పిన సాధన వల్ల యే  రోజుకారోజు  ఏర్పడిన ముద్రలను తొలగించుకోవడం వల్ల ఒక ఉన్నత కోవకు చెందిన చేతనం సహజంగా పెంపొందడం జరుగుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యపడుతుందని చెప్తారు బాబూజీ. సహజమార్గ సాధనలో ఈ ప్రక్రియలు చాలా ముఖ్యం. 

మరిన్ని వివరాలకు పైన చెప్పిన బాబూజీ వ్రాసిన రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే  గ్రంథాన్ని అధ్యయనం చేయగలరు. 

 

సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ - 1


(పైన చిత్రం: బాబూజీ ఆవిష్కరించిన నూతన ఆధ్యాత్మిక పథము ; మన ఆధ్యాత్మిక యాత్ర జరిగే 13 తీర్థ స్థానాలు, బిందువులు, గ్రంథులు, క్షేత్రాలు  - మూలం: "అనంతం వైపు" గ్రంథం)

సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ

భగవంతునితో సంపూర్ణ ఐక్యం చెందడమే ఆధ్యాత్మిక పథం యొక్క పరమగమ్యం, అని బాబూజీ చెప్పడం జరిగింది. ఈ గమ్యాన్ని అతి సరళంగా, చేరుకునే మార్గం, అతి దగ్గర మార్గం సహజమార్గమని బాబూజీ తన స్వీయ అనుభవంలో సాక్షాత్కరించుకున్నారు. ఆ పాఠాన్ని మానవాళికి సహజమార్గ పథంగా అందజేయడం జరిగింది. 

భగవంతునితో సంపూర్ణ ఐక్యము అంటే ఆ పరమపవిత్ర చైతన్యంలో లయమైపోవడమే. ఆత్మ మూలం నుండి విడిపోయినప్పుడు, ఆ పరమ పవిత్ర చైతన్యం నుండి దూరమయ్యింది; క్రమక్రమంగా ఆ దివ్య చైతన్యం నుండి దిగి వచ్చినప్పుడు 13 ప్రధాన చైతన్య గ్రంథులుగా ఏర్పడినావి. వాటినే గ్రంథులని, బిందువులని, చక్రాలని, తీర్థ క్షేత్రాలని మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క చక్రం దిగిన కొద్దీ ఆ చైతన్యతలో నాణ్యత తగ్గుతూ వచ్చింది. అలా మనిషి హృదయ చక్రం వరకూ దిగిపోవడం జరిగింది. హృదయ చక్రం నుండి 13 చక్రాలు కేవలం మనుషుల్లోనే ఉంటాయి. ఇవి గాక మూలాధార, మణిపూరక, స్వాధిష్ఠాన చక్రాలు కూడా ఉంటాయి. ఇవి జంతువులలో కూడా ఉంటాయి. ఈ చక్రాల చతన్యంలో ఇరుక్కుపోయిన జీవులు కేవలం బ్రతకడం కోసమే వాటి జీవనం సరిపోతుంది. కేవలం తనను తాను కాపాడుకోవడానికి, ఆహారం, నిద్ర, ఇంద్రియపరమైన సుఖం, భయం వీటి చుట్టూనే  అల్లుకుని ఉంటుంది వీటి జీవనం. 

సహజమార్గ ఆధ్యాత్మిక పథము హృదయ చక్రం నుండి ప్రారంభమై, మన గమ్యమైన  13 చక్రమ వరకూ కొనసాగుతుంది. 

ఆధ్యాత్మిక యాత్ర అంటే ఒక చక్రం నుండి మరొక చక్రానికి ఆత్మ యొక్క కదలిక. ఆత్మ కదులుతుందా? ఆత్మ యొక్క చైతన్యం కదులుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. దాన్నే ఆత్మ యొక్క యాత్ర అని అంటాం. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైన చేతనం ఉండటం వలన, సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు చేతన కదులుతున్నట్లుగానూ, విస్తరిస్తున్నట్లుగానూ, ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదుగుతూ, ఆధ్యాత్మిక ఆకాశంలో ఎత్తుగా విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. మానవ జన్మ యొక్క యదార్థమైన లక్ష్యం ఇదే.  ఈ యాత్రను సమర్థుడైన గురువును ఆశ్రయించి, ప్రారంభించి, కొనసాగించి, ఈ జన్మలోనే పూర్తి చేసుకోవాలి. ఈ  యాత్ర ఫలితంగానే, బాబూజీ చెప్పినట్లుగా మనిషిలో యాదార్థమైన పరివర్తన సంభవిస్తుంది. జీవితాన్ని సమగ్రమైన దృష్టితో, స్పష్టతతో లోతుగా అర్థం చేసుకునే ఎరుక ఏర్పడుతుంది. విజ్ఞత కలుగుతుంది. వ్యక్తిత్వం మరింత మరింత  సూక్ష్మతరంగా మారుతూ ఉంటుంది. ఇక ఈ  యాత్రకు అంతుండదు. అందుకే ఈ గ్రంథానికి, అనంతం వైపు అని పేరు పెట్టడం జరిగింది. 

ఈ సహజమార్గ పాఠాన్ని పూజ్య బాబూజీ, తన గురుదేవులైన పూజ్య లాలాజీ మార్గదర్శనంలో తన "అనుభవ శక్తి" ద్వారా ప్రత్యక్షానుభవం ఆధారంగా ఆవిష్కరింపబడిన వినూత్న రాజయోగ పద్ధతి. ఈ  ఆధ్యాత్మిక శిక్షణ, ప్రాణాహుతి  అనే దివ్య శక్తిని సంసిద్ధుడైన సాధకుని హృదయంలోకి ప్రసరించడం ద్వారా ఇచ్చే శిక్షణ. ప్రాణాహుతిని ప్రసరణ చేయగలిగే గురువును సమర్థ గురువు అంటారు; ప్రాణాయాహుతి అంటే కేనోపనిషత్తులో ఉల్లేఖించిన ప్రాణస్య ప్రాణః అంటే ప్రాణానికే ప్రాణం అంటే, ప్రాణ తత్త్వం అన్నమాట. దేని వల్ల ప్రాణానికే ప్రాణం వచ్చినట్లవుతుందో అదే ప్రాణాహుతి. ఈ ప్రాణాహుతి ప్రసరణ వల్ల యాత్రలో చాలా సమయం ఆదా అవడమే గాక, ఒక చక్రం నుండి మరో చక్రానికి యాత్ర సహజంగా జరుగుతుంది.అయితే సిద్ధులు, శక్తులు  పొందాలనుకున్నవారికి, ఇది అనుకూలమైన మార్గం కాదని, వాటికి, ఆధ్యాత్మికతకూ ఎటువంటి సంబంధమూ లేదని మన గురుపరంపర బోధన.  ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలనుకున్నవారికి, చైతన్య వికాసం పొందాలనుకున్నవారికి, తనను తాను మార్చుకోవాలనుకున్నవారికి, మానవ చేతనం నుండి దివ్య చేతనంగా పరివర్తన కావాలనుకున్నవారికి, దైవానుభూతి  చెందాలనుకున్నవారికి ఈ మార్గం ప్రశస్తం.  

బాబూజీ ఈ యాత్రను, వారు వ్రాసిన సత్యోదయం అనే గ్రంథంలో 24 వృత్తాలుగానూ, సహజమార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం అనే గ్రంథంలో 3 క్షేత్రాలుగానూ, అనంతం వైపు అనే గ్రంథంలో 13 బిందువులు, లేక గ్రంథులు లేక చక్రాలుగానూ అభివర్ణించడం జరిగింది.  సాధకులు తప్పక ఈ గ్రంథాలను తమ వ్యక్తిగత సాధనను కొనసాగిస్తూ అధ్యయనం చేసుకోవాలి. లేకపోతే అవగాహన ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉండే అవకాశాలే ఎక్కువ; ఎందుకంటే ఈ గ్రంథాలలో వ్రాసినవన్నీ యదార్థ ఆధ్యాత్మిక సూక్ష్మ అనుభవాలకు సంబంధించినవి కాబట్టి.

మొదటి 5 బిందువులను హృదయ క్షేత్రం అని, 6 నుండి 12  బిందువులను  మనోక్షేత్రమని, 13 వ బిందువును కేంద్ర క్షేత్రం అని అంటారు బాబూజీ. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక రకమైన చైతన్య వికాసం జరిగి, తదనుగుణమైన సహజమైన పరివర్తన సాధకునిలో సంభవిస్తుంది. ఆ మేరకు అంతఃకరణ అంటే 4 ప్రధాన సూక్ష్మ శరీరాలు (మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము) శుద్ధి చేయబడతాయి; ఇదంతా ఒక్క జన్మలోనే సాధించే అవకాశం ప్రతీ అభ్యాసికి ఉంది. కనీసం ప్రతీ అభ్యాసి  ఈ  జన్మలోనే హృదయ క్షేత్రాన్ని దాటి మోక్షాన్ని పొందాలన్నది మన గురుపరంపర యొక్క ఆకాంక్ష. 

తదుపరి వ్యాసంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

 
 

20, సెప్టెంబర్ 2023, బుధవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 4

 



నూతన అవగాహనలు

శ్రమ - కర్మ 

పూజ్య దాజీ శ్రమకూ కర్మకు గల వ్యత్యాసం చెప్పడం జరిగింది. శ్రమ అంటే ఫలితం కోసం చేసేది. ఉదాహరణకు ఉద్యోగం చేసేది జీతం కోసం; కూలి చేసేది డబ్బుల కోసం; దీన్ని శ్రమ అంటారు. కర్మ అంటే భగవత్సాక్షాత్కారం కోసం చేసే పని, బ్రహ్మవిద్య కోసం చేసే పని, ఫలితం ఆశించకుండా చేసే పని. 

శ్రీకృష్ణుడి కాలంలో అంటే సుమారు 7000 కు పైగా సంవత్సరాలు గడచిపోయాయి; ఆ కాలంలో వాడిన కర్మ అనే పదానికి అర్థం దైవసాక్షాత్కారం కోసం చేసే పని అని అర్థం. ఆ కాలంలో అందరూ సుమారుగా అదే ధోరణిలో జీవించేవారు. కాలానుగుణంగా పదాలకు అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు ఆంగ్లంలో "gay" అనే పదానికి ఉల్లాసం, ఆనందం అనే అర్థం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అదే పదానికి వేరే అర్థం వచ్చేసింది.

శ్రమ వల్ల కచ్చితంగా సంస్కారాలు ఏర్పడతాయి; కర్మ వల్ల సంస్కారాలు ఏర్పడవు. నేను 30 రోజులు పని చేశాను, జీతం ఇవ్వాలి అని యాజమానిని అడుగవచ్చు కానీ 20 సంవత్సరాలు నీ కోసం ధ్యానం చేశాను, కాబట్టి దర్శనం ఇవ్వాలని  భగవంతుడిని  గట్టిగా అడుగలేము, ఆడగకూడదు కూడా; ఆత్మసమర్పణ ద్వారా మాత్రమే భగవంతుడు లభించేది, అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగింది. 

 కాబట్టి మనం కర్మకు, శ్రమకూ గల పూజ్య దాజీ తెలియజేసిన ఈ వ్యత్యాసాన్ని  తెలుసుకోవలసి ఉంది.  ఈ  నూతన అవగాహనను మననం చేసుకోవలసి ఉంది. 





18, సెప్టెంబర్ 2023, సోమవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 3

 



నూతన అవగాహనలు, ఆవిష్కరణలు - పరిచయం  

పూజ్య లాలాజీ, దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం ఉన్న ఈ ప్రాణాహుతి ఆధారితమైన రాజయోగ విద్యను, కాలగర్భంలో కనుమరుగైపోయిన ఈ విద్యను వెలికి తీస్తే, పూజ్య బాబూజీ మహారాజ్ ఈ  విద్యకు పరిపూర్ణతను చేకూర్చి, సహజమార్గం అన్న పేరుతో మానవాళికి పరిచయం చేయడం జరిగింది. ఈ విద్యను పరమపదిలంగా స్వచ్ఛతను కాపాడుకుంటూ, పవిత్రంగా ఉంచుతూ పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ మహారాజ్ కు అందజేస్తే, వారు 100 దేశాలలో ఈ పద్ధతిని విస్తరింపజేశారు; ఆ తరువాత పూజ్య దాజీకి ఈ సహజమార్గ కాగడాను 2014 లో కొనసాగించమని అందజేయడం జరిగింది. దాజీ భూమ్మీద ఉన్న ప్రతి ఇంటికి ఈ పద్ధతి యొక్క అవగాహనను అందిస్తూ ప్రతి గుండెకూ ప్రాణాహుతి అనుభూతిని అందించే ప్రయత్నంలో ఉన్నారు; హార్ట్ఫుల్నెస్  అనే వైశ్విక నామకరణం చేసి ఈ సహాజమార్గ ఆధ్యాత్మిక పద్ధతిని విశ్వమంతటికీ అందుబాటులో ఉండేలా  ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనందరమూ ఉడతాభక్తిగా మన వంతు తోడ్పాటునందించే  ప్రయత్నంలో మనం ఉన్నాం. 
1945 లో పూజ్య బాబూజీచే ప్రారంభింపబడిన ఈ ఉద్యమం ప్రతీ మాస్టరు ద్వారా  కొంత పరిణామం చెందుతూ వస్తోంది. ఈ సంస్థ ఆశయం - ప్రపంచంలో ప్రబలియున్న  అనాధ్యాత్మికత  స్థానంలో ఆధ్యాత్మికతను నెలకొల్పడం; ఆధునిక మానవుని అవసరాలకు తగినట్లుగా యోగాన్ని ప్రవేశపెట్టడం. ఈ క్రమంలో ఈ సహజమార్గ సాంప్రదాయంలో నలుగురు మాస్టర్లు పరంపరగా వచ్చారు. ప్రస్తుతం పూజ్య దాజీ నాల్గవ మాస్టరుగా ఉన్నారు. మానవాళి వికాసం విషయంలోఒక్కొక్క మాస్టరుకు ఒక్కొక ప్రత్యేకమైన పాత్ర ఏర్పరచడం జరిగింది.  లాలాజీ ఈ సాంప్రదాయానికి  ఆద్యులైతే, బాబూజీ, చారీజీలు పటిష్ఠమైన పునాదులను ఏర్పరచారు. ఇప్పుడు పూజ్య దాజీ ఆ పునాదులపై విశిష్ఠమైన ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిస్తున్నారు. 
సహజమార్గంలో జన్మతః మాస్టర్లుగా ఉండరని చారీజీ ఒకసారి చెప్పడం జరిగింది,  కొన్ని సంప్రదాయాలలో ఉన్నట్లుగా. ప్రకృతి లేక భగవంతుని ఆధ్వర్యంలో అటువంటి వ్యక్తిత్వ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తులు చాలా తీవ్రంగా ఎంతో నిబద్ధతతో సహజమార్గ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంతో కాలంగా సాధన చేస్తూంటారు. ఆ క్రమంలో ఆయా కాలానికి తగినట్లుగా ఉత్కృష్ఠ ఆధ్యాత్మిక స్థితులు సిద్ధించడం, సూక్ష్మాలు తెలియడంతో వినూత్న అవగాహనలకు, నూతన ఆవిష్కరణలకు, వారి సాధన దారి తీస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు గాని అటువంటి వ్యక్తి వెలుగులోకి రారు. చివరికి ఆ సమయంలో ఉన్న మాస్టరుకు కూడా తెలియకపోవచ్చు. సారాంశం ఏమిటంటే మన గురుపరంపరను నిర్దేశించేది పై లోకాల నుండే;  అత్యున్నత ఊర్ధ్వలోకాల్లో ఉన్న మహాత్ముల కూటమి ద్వారానే అన్నమాట.   

ఆ క్రమంలో పూజ్య దాజీ తన సాధన 1976 లో ప్రారంభించినప్పటి నుండి చాలా గంభీరంగా, తీవ్రతపనతో సాధన చేసిన వ్యక్తిగా ఉన్నారు. ఇప్పటికీ తనను తాను ఒక యోగసాధకుడిగానే భావించుకుంటారు, ప్రపంచానికి తనను తాను అలాగే పరిచయం చేసుకుంటారు కూడా. తన మొట్టమొదటి ధ్యాన సిట్టింగులో కలిగిన అనుభూతిని ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా ఎంత అద్భుతమైనదో చెబుతూ ఉంటారు. ఇలా తీవ్రంగా నిబద్ధతతో కొనసాగుతూ ఉన్న తపస్సు ద్వారా, నిగూఢమైన ధ్యాన స్థితుల్లో కలిగిన అవగాహనలను, ఆవిష్కరణలను పూజ్య దాజీ ఎప్పటికప్పుడు వారు మనతో తన ప్రసంగాల ద్వారా, వ్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా, పత్రికల ద్వారా, హార్ట్ఫుల్నెస్ మ్యాగజైన్ల ద్వారా, ప్రసంగాల ద్వారా, సంభాషణల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారని ఆయనే స్వయంగా ఈ మధ్యన ఆగష్ట్ 13, 2023 న ఆదివారం సత్సంగం తరువాత వెల్లడించడం జరిగింది. వాటినే మనం, ఆ  వెల్లడించిన విషయాలనే ఇక నుండి ఒక్కొక్కటిగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 



వినాయకుడు మానవ పరిపూర్ణతకు చిహ్నం





|| వశిష్ఠ వామదేవాది వందిత || 
|| మహాగణపతిం, మనసా స్మరామి ||

వినాయకుడు మానవ పరిపూర్ణతకు చిహ్నం 

వినాయకుడి రూపం మనిషి పరిపూర్ణతను సాధించాలంటే ఉండవలసిన లక్షణాలను సూచించే స్వరూపం; ప్రేరణను కలిగించే ఆకారం; ఆచరణకు నిత్యస్ఫూర్తినిచ్చే గొప్ప తత్త్వం ఈ రూపం; చూడగానే మనసుకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించే సమ్మోహన రూపం, వినాయకుడు. 
ఆధ్యాత్మిక సాధకులు ఈ స్వరూపాన్ని పరిశీలనగా గమనిస్తే బోలెడంత స్ఫూర్తి కలుగుతుంది. 
తొండంతో ప్రారంభిద్దాం; ఏనుగు తొండంలో చాలా సున్నితత్త్వం ఉంటుందంటారు; సూదిని కూడా ఎత్తగలదంటారు ఆ తొండంతో. అలా మనిషి కూడా అంతా సున్నితత్త్వం కలిగి ఉండాలి. అలాగే విశాలమైన నుదురు, జ్ఞానానికి ప్రతీక; చిన్న కళ్ళు; అంటే దూరదృష్టి, సూక్ష్మదృష్టి గలవాడని అర్థం; పెద్ద చెవులు; అంటే బాగా వినాలని సంకేతం; పెద్ద ఉదరం అంటే, ఎన్ని అవమానాలు పడినా స్పందించకుండా కడుపులో పెట్టుకోగలిగినవాడు; అంత బరువైన శరీరంలా కనిపించినా చిన్ని ఎలుక మోయగలిగేంత తేలికగా ఉండేవాడు; ఎలుక కోరికలను సూచిస్తుంది; ఎలుకపై అంటే కోరికలపై ఆధిపత్యం సంపాదించినవాడు అంత తేలికగా ఉంటాడని సంకేతం. ఇలా ఇటువంటి లక్షణాలన్నీ అలవరచుకుంటే మనిషి దైవంగా మారతాడని వినాయకుడి రూపం మనకు తెలియజేస్తున్నది. ఈ లక్షణాలన్నీ సాధన ద్వారా అలవరచుకొని మనిషి దివ్యంగా పరిపూర్ణ వ్యక్తిత్వంగా మారాలన్న ఆదర్శాన్ని సూచిస్తుంది ఈ దివ్యమంగళ విగ్రహం. 
ఒక చేతిలో దుష్ట శక్తులను నాశనం చేసే ఆయుధాలు, అంటే మనిషిలోని మలినాలను, అరిషడ్వర్గాలను తొలగించే శక్తులు; మరొక చేతి ద్వారా అభయం. 

అంతేగాక పూజ్య దాజీ చెప్పినట్లుగా, ఆయనలో కొంత భాగం పశువుది, కొంతభాగం మనిషిది, మరికొంత భాగం దివ్యమైనది - అంటే పాశవికత నుండి మానవత్వం; మానవత్వం నుండి దివ్యత్వం వరకూ చేసే మన ఆధ్యాత్మిక యాత్రను సూచిస్తున్నది. ఇలా సూక్ష్మదృష్టితో పరికించి చూసినప్పుడు మరిన్ని సూక్ష్మాలు మనకు స్ఫురించవచ్చు. అంతర్ముఖులై ధ్యానించినప్పుడే సూక్ష్మదృష్టి కలిగే అవకాశం, తద్వారా మనిషి పరిపూర్ణుడుగా మారే అవకాశం ఉంటుంది. 



 

సత్సంగ్ ప్రాశస్త్యం

సత్సంగ్ ప్రాశస్త్యం    సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా ...