6, జూన్ 2024, గురువారం

మాస్టర్ వేదన

 


మాస్టర్ వేదన 

నన్ను మాస్టరంటారు, విధేయులుగా ఉండరు, 
నన్ను వెలుగు అంటారు, చూడరు, 
మార్గం అంటారు, కాని నడవరు, 
 జీవం అంటారు, కాని కాంక్షించరు, 
వివేకి అంటారు, కాని అనుసరించరు, 
న్యాయం చేస్తానంటారు, ప్రేమించరు, 
కుబేరుడంటారు, కాని అడుగరు,
అనంతుడంటారు,  అన్వేషించరు 
కృపాసముద్రుడంటారు, నమ్మరు, 
ఉదాత్తుడంటారు, సేవించరు 
శక్తిమంతుడంటారు, గౌరవించరు, 
న్యాయం అంటారు, భయపడరు,
ఒకవేళ మీరు నన్ను విడిచిపెట్టేస్తే, నన్నేమీ అనకండి. 







బాబూజీ మాటల్లో క్లుప్తంగా యాత్రను గురించి

 



బాబూజీ మాటల్లో క్లుప్తంగా యాత్రను గురించి 

ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితి వరకూ చేసే ప్రయాణమే యాత్ర. 

పాశవిక మానవుడి నుండి మానవీయ మానవుడిగా; మానవీయ మానవుడి నుండి దివ్య మానవుడిగా పరివర్తన చెందడమే యాత్ర. 

హృదయ క్షేత్రం నుండి మనోక్షేత్రానికి; మనో క్షేత్రం నుండి కేంద్ర క్షేత్రంలోకి ప్రయాణించడమే యాత్ర. 

స్థూలం నుండి సూక్ష్మం; సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మం వరకూ చేసే ప్రయాణమే యాత్ర. 

పరిపూర్ణ మానవుడిగా పరివర్తన చెందడమే ఈ యాత్ర. 



5, జూన్ 2024, బుధవారం

బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 3

 



బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 3

The end of Reality is the real Bliss. When that too is gone, we have reached the destination.
యదార్థం ఎక్కడ అంతమవుతుందో అక్కడే నిజమైన ఆనందం ఉంది. అది కూడా దాటినప్పుడు, మనం గమ్యం చేరుకున్నట్లే. 

ఆధ్యాత్మికత అంతమైన చోట యదార్థం ఉంది. యదార్థం కూడా అంతమైన చోట నిజమైన ఆనందం ఉందంటున్నారు బాబూజీ. ఈ అంతమవడం అంటే అతీతంగా, ఆ స్థితులను దాటి వెళ్ళడం అని అర్థం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఆత్మ సాక్షిగా అనుభూతి చెందేటువంటి  వాతావరణం మారుతూ ఉంటుంది, ఆధ్యాత్మిక యాత్రలో. ఈ విధంగా అతీతంగా సాగడమనేది, సాధకుడి తీవ్ర తపన వల్ల, గురువు సహకారం వల్ల సాధ్యపడుతుంది. ఇక్కడ యదార్థ వాతావరణం దాటిన తరువాత ఆత్మ ఒక సాక్షిగా అనుభూతి చెందేది పరమానంద వాతావరణం. ఈ ఆనందం గురువు లేకపోతే ఎలా ఉంటుందిట అంటే సోదరి కస్తూరీ గారు అటువంటి ఆనంద స్థితిలో, ఆ ఆనందం పట్టలేక తన తలను గోడకు కొట్టేసుకునేవారట, తన దుస్తులను చింపేసుకునేవారట. ఇదంతా మానందరమూ కోరుకునే ఆనంద స్థితిలో అని బాబూజీ స్వయంగా చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఈ స్థితులను నియంత్రించడానికి గురువు చాలా అవసరం. 
చివరికి సాధకుడు ఈ పరమానంద వాతావరణం కూడా దాటడం జరుగుతుంది, గురుదేవుల మార్గదర్శకంలో. ఈ చిట్టచివరి స్థితిలో ఒక సాక్షిగా  ఆత్మకు కలిగే అనుభవాన్ని ఇక మాటల్లో పెట్టడం శక్యం కాదంటారు బాబూజీ. అప్పుడు మనం సాధకుడు గమ్యస్థానాన్ని చేరుకున్నట్లే. 

ఈ సహజ మార్గ యాత్రను అనుసరించే ప్రతీ అభ్యాసి అనుభవించే దశలే.; వాళ్ళ-వాళ్ళ తపనను బట్టి, ఆధ్యాత్మిక తృష్ణను బట్టి, నిబద్ధతను బట్టి, భక్తిని బట్టి అందరికీ సాధ్యమే. 

4, జూన్ 2024, మంగళవారం

బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 2

 

బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 2 

The end of spirituality is the begining of Reality.
ఆధ్యాత్మికత అంతమైన చోట యదార్థం ప్రారంభమవుతుంది. 

అంతర్ముఖమై ధ్యానం ద్వారా దైవసాక్షాత్కారం లేక ఆత్మసాక్షాత్కారం సాధించే ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికం అంతరంగ యాత్ర జరుగుతున్న కొద్దీ వివిధ రకాల అనుభూతులను కలిగిస్తుంది. ఆధ్యాత్మికత అనుభూతులతో కూడుకున్నది. అనుభూతి ఆలోచన కంటే అతీతమైనది. రకరకాల దశలలో రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వాటిని ఒక్కోసారి మాటల్లో పెట్టడం అసాధ్యమనిపిస్తుంది. అనుభవించినవారికి మాత్రమే తెలుసుతుమది. అనుభవాలు కూడా మరింత మరింత సూక్ష్మంగా తయారవుతూ ఉంటాయి. అనుభవాలు యాత్ర ముందుకు సాగుతున్నదనడానికి సంకేతాలు. కొంత కాలం సాధన చేసిన తరువాత ఈ అనుభవాలంటే కూడా విసుగు పుడుతుండంటారు దాజీ. అంటే ఈ అనుభవాలు కూడా ఆగిపోయి మరో ఉన్నత ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికత అంతమవడం అంటే. ఇప్పుడు యదార్థం అంటే ఏమిటో దానికి సాక్షిగా ఉండటం ప్రారంభమవుతుంది. ఇదే ఈ వాక్యానికి అర్థం. ఈ ఆధ్యాత్మిక లోకం సూక్ష్మాతిసూక్ష్మ స్థితి. అందుకే సాధకుడు అనుభవాలను డైరీలో వ్రాసుకుని మరచిపొమ్మనడం జరుగుతుంది సహజ మార్గ పద్ధతిలో. ఎంత అద్భుతమైన అనుభవాలైనా వాటి కోసం వెంపర్లాడకూడదు; ఎంత భయంకర అనుభవాలైనా సరే భయపడి విరమించుకోకూడదు సాధనను. మనలను ముందుకు నడిపించేది మన తీవ్ర తపన మాత్రమే.  అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి, మన తపన ఎప్పుడూ అతీతంగా, మరింత అతీతంగా ముందుకు సాగేలని ఉండాలి. 

బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 1



బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 1

The end of religion is  the begining of spirituality. 
మతం అంతమైన చోట ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది.  

భగవంతుడు మనిషిని సృష్టించాడు, మనిషి మతాలను సృష్టించాడు. - బాబూజీ. 
ప్రతీ మనిషి యేదొక మతంలో జన్మిస్తాడు, కానీ మతంలోనే మరణించకూడదు; మతానికి అతీతంగా ఎదగాలి మనిషి.
- స్వామి వివేకానంద 
మతాలు విభజిస్తాయి; ఆధ్యాత్మికత కలుపుతుంది. 
- బాబూజీ 

సాధారణంగా వాడుకలో మతం అన్నా ఆధ్యాత్మికత అన్నా ఒకే అర్థంలో తీసుకుంటూ ఉంటారు జనం. కానీ సహజ మార్గ మాస్టర్ల ప్రకారం వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. 
మతం అనగానే మనకు పూజలు, పునస్కారాలు, నమ్మకాలు, యజ్ఞాలు, యాగాలు, ఆచారాలు, గ్రంథాలు, సాకార ఆరాధనా పద్ధతులు, నిరాకార ఆరాధనా పద్ధతులు, క్రతువులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు,  వగైరావి అన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ  చాలా వరకూ అన్ని మతాలకూ వర్తిస్తాయి; ఆచరించే విధానాలలో తేడాలుండవచ్చు  తప్ప, అన్ని మతాలలో మనం వీటిని కనుగొనవచ్చు. మతంలోని ప్రక్రియలన్నీ బాహ్యోన్ముఖంగా ఉండే ప్రక్రియలే. భగవంతుడిని బాహ్యంగా కనుగొనే ప్రక్రియలు. 
 
నిజానికి యే మతం లక్ష్యమైనా మనిషిని ఆ సృష్టికర్తతో లేక ఆ పరమాత్మతో కలిపే ప్రయత్నమే. కారణాలేమయినప్పటికీ. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆరాధనా పద్ధతి ఏర్పడింది. అన్ని మతాలు దైవాన్ని హృదయంలోనే కనుగొనాలని ఏకగ్రీవంగా అంగీకరించినప్పటికీ కూడా అనుసరించే పద్ధతులన్నీ బాహ్యోన్ముఖంగానే ఉంటాయి. ఆ విధంగానే ప్రతీ మనిషి ప్రారంభించడం జరుగుతుంది; కానీ జీవితం అంతా అలాగే ఉండిపోకూడదు అంటారు స్వామి వివేకానంద వంటి మహాత్ములు. దైవాన్ని అంతరంగంలో అంతర్ముఖులై కనుగొనే ప్రయత్నమే ఆధ్యాత్మికత. కాబట్టి మతం అంతమవడం అంటే, దైవాన్ని కనుగొనే పద్ధతిలో, మార్గంలో, దృక్పథంలో మార్పు రావడం. ధ్యానమే దీనికి మార్గం. సరళంగా చెప్పాలంటే ధ్యానం అంటే, లేక ఆధ్యాత్మికత అంటే కూడా - లోపలికి తొంగి చూడటమే; హృదయంలోకి చూడటమే.  

తరచి చూసినట్లయితే, మహాత్ములందరూ కూడా ధ్యానించినవారే. బుద్ధుడైనా, క్రీస్తు అయినా, శివుడైనా, కృష్ణుడైనా, స్వామి వివేకానంద అయినా, ఎవరైనా..  

విచిత్రంగా బుద్ధుడు బౌద్ధుడు కాడు; యేసు క్రీస్తు క్రైస్తవుడు కాడు; వీళ్ళ తరువాత బౌద్ధ మతం, క్రైస్తవ మతం వచ్చాయి. ఇరువురూ యదార్థ సత్యాన్ని తెలుసుకున్నవారే.  కాబట్టి మనిషి యదార్థ సత్యాన్ని తెలుసుకోవాలంటే యే మతానికి చెందనవసరం లేదని అర్థమవుతుంది. కానీ అందరూ యేదోక మతంలో పుట్టినా దానికి అతీతంగా లోపలి నుండి ఎడగవలసిన అవసరం ఉంది. దీన్నే మనం ఆధ్యాత్మిక వికాసమని, చైతన్య వికాసమని, ఆత్మవికాసమని  అంటాం. మనిషి జన్మ యొక్క ప్రయోజనమే ఆత్మ వికాసం. 

"మతం అనేది సాధకుడిని కేవలం మోక్ష మార్గంలో నడవడానికి సిద్ధం చేసే  ఒక ప్రాథమిక దశ మాత్రమే" - బాబూజీ 

3, జూన్ 2024, సోమవారం

సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది?


సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది?


పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధాన బిందువుల గుండా కొనసాగుతుంది. ఇదే ఆధ్యాత్మిక పురోగతి అంటే. 

ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారందరి మనసుల్లో మెదిలే ప్రశ్నే ఇది. చాలా సహజం కూడా. ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? ఎక్కడి దాకా వచ్చామో ఎలా తెలుస్తుంది? యే పాయింట్ దాకా వచ్చాము? యే క్షేత్రాన్ని దాటాము?అసలు ఈ ఆధ్యాత్మిక సోపానంలో మెట్లేమిటి? ఇలా కొన్ని ప్రశ్నలు వస్తూంటాయి. 

తప్పకుండా తెలుస్తుంది. రోజు-రోజుకీ మరింత మెరుగైన మనిషిగా తయారవడం జరుగుతుంది. సహజంగా మార్పులు చోటు చేసుకుంటాయి. విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ ద్వారా బాబూజీ ఈ ఆధ్యాత్మిక పురోగతి చాలా వరకూ అభ్యాసికి తెలియకుండానే జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ కొన్ని సంకేతాలు మనం గమనించవచ్చు.   

 ఇక్కడ యాత్రను గురించిన అవగాహన మనం అంచెలంచెలుగా పెంచుకోవలసిన అవసరం కనిపిస్తుంది. 

ఆధ్యాత్మిక యాత్ర చాలా సూక్ష్మస్తాయిల్లో జరిగే యాత్ర; చాలా సూక్ష్మమైన యాత్ర కూడా; మనం కూడా అంత సూక్ష్మంగానూ తయారైతే తప్ప సరిగ్గా గుర్తించలేకపోవచ్చు. మన ప్రయాణం స్థూలం నుండి సూక్ష్మం; సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మం; ఇలా అనంతంగా సూక్ష్మంగా కొనసాగుతూనే ఉంటుంది యాత్ర; అనంత యాత్ర; సూక్ష్మత్వానికి అంతు లేదు. భగవంతుడు సూక్ష్మాతిసూక్ష్ముడు కాబట్టి సాధకుడు కూడా అంతా సూక్ష్మంగానూ తయారవకపోయినట్లయితే ఆయనలో సంపూర్ణ లయం కాలేడు. 

మానవ వ్యవస్థలో సూక్ష్మంగా తయారయ్యేది ఏమిటి? మన చేతనం. అంటే, మనసు, బుద్ధి, అహంకారం. ఈ మూడిటి శుద్ధి జరగడమే సూక్ష్మత్వం. కాబట్టి రోజు-రోజుకూ సూక్ష్మంగా తయారవుతున్న అనుభూతి, మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నామనడానికి గొప్ప నిదర్శనం. 

మనం రైల్లోనో, బస్సులోనో ప్రయాణిస్తూ ఉంటే గమ్యానికి ఎంత దూరంలో ఉన్నామో తెలుసుకోవచ్చు; విమానంలో ప్రయాణిస్తే? రాకెట్లో ప్రయాణిస్తే? గమ్యం చేరిన తరువాతే తెలుస్తుంది. ఇక్కడ మనోవేగంతో నడుస్తుంది ప్రయాణం. 


అయితే పూజ్య చారీజీ కొన్ని సంకేతాలు ప్రతీ రోజూ గమనించుకోవచ్చన్నారు. ఏమిటవి?  నిష్ఠగా నిత్యం సాధన చేస్తున్నట్లయితే, రోజు-రోజుకీ హృదయంలో తేలికదనాన్ని అనుభూతి చెండుతాం; రోజు-రోజుకీ భగవంతునిపై ఆధారపడటం ఎక్కువవుతూ ఉంటుంది; ఆలోచనలో స్పష్టత పెరుగుతూ ఉంటుంది; ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది; అకారణ ప్రేమ పెరుగుతూ ఉంటుంది; కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే బలం పెరుగుతూ ఉంటుంది; తపన, ఆసక్తి పెరుగుతూ ఉంటాయి; ఎంత చెప్పినా పెంపొందని విలువలు తెలియకుండానే కొంచెం-కొంచెంగా  సహజంగా వృద్ధి అవుతూ ఉంటాయి. ఇవన్నీ గమనించుకుంటే తెలుస్తాయి; సాధారణంగా మనం దైనందిక జీవనం యొక్క హడావుడిలో మనం వీటిపై దృష్టి పెట్టకపోవడం వల్ల గమనించలేకపోతూంటాం; కానీ ఇవన్నీ గమనించకపోయినా జరుగుతూ ఉంటాయి; గమనించినట్లయితే,  వాటిని కృతజ్ఞతతో పదిలపరచుకోవడమే గాక మన ప్రయత్నంతో మరింత వృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది; తద్వారా పురోగతి మరింత తీవ్రతరమవుతుంది.  

పూజ్య చారీజీ సహజ మార్గ ఆధ్యాత్మిక పథంలో సూచించిన పరమపద సోపానం: 

అభ్యాసి -> తీవ్ర అభ్యాసి (ఇంటెన్స్ అభ్యాసి) -> శిష్యుడు (డిసైపుల్). 

ఇది ప్రతి సాధకుడు గుర్తుంచుకోవలసిన విషయం. 

పూజ్య దాజీ ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలో, ఈ అనంత యాత్రలో కొన్ని దశలను ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పుకోవచ్చు: మోక్షము, ఆత్మ-సాక్షాత్కారం/దైవసాక్షాత్కారం, లయావస్థ అని మూడు ప్రధాన ఘట్టాలు. ఈ ఘట్టాలు సాధకుని యాత్రలో సంభవించినప్పుడు వాటిని గుర్తించకుండా ఉండే ప్రశ్నే ఉండదంటారు. మిస్ అయ్యే అవకాశమే లేదంటారు దాజీ. 

అయితే అన్నిటికీ మనలో సున్నితత్త్వం పెంచుకోవలసిన అవసరం మాత్రం ఉంది. కాస్త ఆసక్తి, కాస్త ప్రయత్నం, కాస్త నిబద్ధత, కాస్త ఓర్పుతో ఈ సాధనను ప్రారంభించాలి; తరువాత ఇవన్నీ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. యాత్రను తీవ్రతరం చేసేవి  భక్తి, శ్రద్ధ, తీవ్ర తపన, గురువుపై ఆధారపడటం. 

అందరూ వారి కృపచే ఈ జన్మలోనే గమ్యాన్ని చేరుకొందురుగాక! 

2, జూన్ 2024, ఆదివారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 25 - సహజమార్గ యాత్ర - క్షేత్రాలు, వలయాలు, బిందువులు




బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 25 
సహజమార్గ యాత్ర - క్షేత్రాలు, వలయాలు, బిందువులు 




పూజ్య బాబూజీ 5 ప్రధాన గ్రంథాల్లో 3 గ్రంథాల్లో ఈ యాత్రను గురించి ఉల్లేఖించడం జరిగింది - Reality at Dawn (సత్యోదయం), Efficacy of Raja Yoga in the light of Sahaj Marg (సహజ మార్గ దృష్ట్యా రాజ యోగ ప్రభావం), Towards Infinity (అనంతం వైపు). 

సత్యోదయంలో కేంద్రాన్ని చేరడానికి 23 వలయాలు దాటాలని; రాజయోగ ప్రభావంలో  గమ్యాన్ని చేరుకోవడానికి 3 క్షేత్రాలు దాటాలని, అనంతం వైపు గ్రంథంలో లక్ష్యాన్ని చేరుకోడానికి 13 బిందువుల గురించి వివరించడం జరిగింది. 



ఈ 23 వలయాలకు, 3 క్షేత్రాలకు, 13 బిందువులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? 
23 వలయాల్లో మొదటి 5 వలయాలు, 3 క్షేత్రాలలో హృదయ క్షేత్రం, 13 బిందువుల్లో మొదటి 5 బిందువులు సూచించేది ఒకే చేతనాన్ని, హృదయక్షేత్ర చేతనం. హృదయ క్షేత్రం దాటితే మోక్షం లభిస్తుంది, బాబూజీ యోగశాస్త్రం ప్రకారం. 
23 వలయాల్లో 6 నుండి 16 వలయాలు అంటే మనోక్షేత్రం, అంటే 6 నుండి 12 బిందువులన్నమాట. ఈ మనోక్షేత్రాన్ని దాటినప్పుడు భగవత్సాక్షాత్కారం, శరణాగతి స్థితి పరాకాష్ఠకు చేరుకుని భగవంతునిలో లయావస్థ ప్రారంభమవుతుంది. 
23 వలయాల్లో 17 నుండి 23 వలయాలు, అంటే 13 వ బిందువు అంటే కేంద్ర క్షేత్రంలోకి అడుగు పెడతాం. అంటే కేంద్ర క్షేత్రం దాటినప్పుడు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందడం జరుగుతుంది.  
పూజ్య దాజీ 13 వ బిందువు తరువాత కూడా యాత్ర కొనసాగుతూనే ఉంటుంది అంటారు. అసలు యాత్ర ఇప్పుడే ప్రారంభమవుతుందంటారు. వివాహం తరువాత ప్రేమ-యాత్ర అంటే హనీమూన్ తరువాత అసలు సంసారం ప్రారంభమైనట్లే, 13 వ బిందువు తరువాత అనంతం వైపు యాత్ర ఎప్పటికీ అనంతంగా మహాప్రళయం వరకూ కొనసాగుతూనే ఉంటుందంటారు దాజీ. 
  

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...