5, జనవరి 2024, శుక్రవారం

బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 3

 



బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 3

బాబూజీ బోధన అంతా బీజరూపంలో ఉండేది. తనను తాను బీజం నాటే వ్యక్తిగా చెప్పుకునేవారు. తన ప్రాణాయాహుతి ప్రసరణ ద్వారా ఆ బీజాన్ని నాటుటఊండెవయారు. అది మన లోలోతుల్లో అంతరంగంలో వికసించి, పుష్పించేది. అలా పుష్పించగా వెదజల్లిన పరిమళం ద్వారా ఇతరులు సహజమార్గం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలనీ, ఆ విధంగా సహజమార్గ అభ్యాసి ప్రవర్తన ఉండాలని అనేవారు. సహాజమార్గ ప్రచారం మరో విధంగా చేయవలసిన అవసరం లేదనీ అనేవారు. 
మాస్టర్ పని మన అంతరంగంలో మనకు తెలియకుండా జరిగి, లోపల నుండి వికాసం జరిగేలా చేస్తుంది. మార్పు తరువాత బయట పడుతుంది. ఆయన సంభాషణ చాలా మృదుమధురంగా  ఉండేది. ఎన్నడూ ఉపన్యాసాలు ఇవ్వడం జరగలేదు. వారి వద్దకు ఎటువంటి వ్యక్తి వచ్చినా ఆతని గతాన్ని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎటువంటివారిలోనైనా మార్పు సాధించేవారు. అలా వచ్చినవారిలో ఉన్న నమ్మకాలతో, వాళ్ళ అవగాహనలతో, ఎప్పుడూ జోక్యం చేసుకోకుండా, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులను గాని, విధానాలను గాని విమర్శించకుండా, వాళ్ళ స్వేచ్ఛను గౌరవిస్తూనే వారిలో మార్పును తీసుకురాగలిగేవారు. అంటే ఆయన ఎంత కష్టపడేవారో ఊహించవచ్చు. 
బాబూజీ తాను చేసే పని మీద, తన శక్తిసామర్థ్యాలపైన ముఖ్యంగా తన గురుదేవులైన పూజ్య లాలాజీ పైన, అపారమైన విశ్వాసం ఉండేది. అందుకే ఆయన సాధన బాధ్యత, అభ్యాసిదయితే, ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యత మాస్టర్ ది అనేవారు. ఇంతకు ముందెన్నడూ ఇటువంటి సాధనాపద్ధతి లేదు. సహజమార్గం ద్వారా బాబూజీ గురు-వ్యవసత్యకే కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. 
బోధించకుండా బోధించడం అనేది బాబూజీ ప్రత్యేకత. తన వద్దకు వచ్చే అభ్యాసులు రకరకాలుగా ప్రవర్తించేవారు. కొందరు సిగరెట్లు త్రాగి, పీకాలను అక్కడే పడేసినా, మరికొందరు మరుగుదొడ్లు వాడి నీళ్ళు పొయ్యకపోయినా, కాగితం ముక్కల్లాంటి చెత్తను ఎక్కడపడితే అక్కడే పడేసినా, తల్లి ఎలాగైతే చిందవందరగా మార్చేసిన ఇంటిని చక్కగా సర్దుకుంటుందో, అదే విధంగా బాబూజీ కూడా, ఆ పీకాలను తీసి దూరంగా పారవేయడం, మారుగుదొడ్లను నీళ్ళు పోసి శుభ్రం చేయడం, లైట్లు ఆర్పడం మరచిపోతే వాటిని ఆర్పడం, వంటివి స్వయంగా చేసేవారు. ఆ పనులు చేస్తున్నప్పుడు వారిలో విసుగు గాని, కోపం గాని కనిపించేది కాదు. ఆ విధంగా వారు పని చేయడం చూసిన అభ్యాసులు అయ్యో మనకి ఆ ఆలోచన తట్టలేదే, అన్నీ వారే స్వయంగా చేసుకుంటున్నారే అని బాధపడి, తమలో కొంతమంది పాశ్చాత్తాపంతో మార్పులు చేసుకునేవారు. చెప్పడం కంటే చేసి చూపించడమే బాబూజీ శిక్షణానిచ్చే పద్ధతి. 
బాబూజీ అభ్యాసుల్లో మార్పు రావడం కోసం ఎంత కష్టపడేవారన్నదానికి, అర్థం చేసుకోవడానికి ఒక్క ఉదాహరణ చాలు. తన వద్దకు వచ్చేవారికి ఎటువంటి నియమనిబంధనలు, ఎటువంటి అర్హతలు చూడలేదు. ఆయనను చూసి ఆకర్శింపబడినవారందరినీ ఆయన స్వాగతించారు. ఆ విధంగా వచ్చినవారిలో అత్యంత దుస్సాధ్యమైన ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకోవాలన్న ఆకాంక్షకు సంబంధించిన బీజాన్ని వాళ్ళల్లో నాటేవారు.  అంతేకాదు ఆ తపన వాళ్ళల్లో వికాశిస్తూ ఉండటానికి ప్రాణాహుతి ప్రసరణను కొనసాగిస్తూనే ఉండేవారు. ఆయన వద్దకు వచ్చినవాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అవసరాలను కూడా తీరచేవారు; రకరకాల అవసరాలతో వస్తూండేవారు - కొందరికి అనారోగ్యమైతే, మారికొందరికి ఆర్థిక ఇబ్బందులు, ఇంకొంతమండికి పేరుప్రఖ్యాతులు వగైరా. ఇంకా క్రీడి స్థాయిలో చిన్న-చిన్న కోరికలు కూడా ఉండేవి, వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేసేవారు. సంస్కారాల ప్రభావం ఉధృతయాన్ని తగ్గించడానికి శుద్ధీకరణ చేసేవారు. ఈ విధంగా బాబూజీ ఎంతో శ్రమ పడేవారని అర్థమవుతుంది.
అత్యల్పమైనదాన్ని అర్థం చేసుకునే ముందు అత్యుత్తమమైనదాన్ని అర్థం చేసుకోవాలన్నదే వివర్త సిద్ధాంతం. ఆయన ప్రాణాహుతి ప్రసరణ ఎలా పని చేస్తుందంటే మాస్టర్ యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వం మనలోకి ప్రసరించి, మనం ఆయనలాగే ఎడగడాన్ని, ఆయనలాగే మారడాన్ని సాధ్యం చేస్తుంది. తద్వారా వారి బోధనలను అర్థం చేసుకునేలా చేస్తుంది. అందుకే వారి ప్రాణాహుతిని స్వీకరించడం అంత ముఖ్యం. అప్పుడే మనం అర్థం చేసుకోలేనివి, అర్థం చేసుకోలేనివి, గ్రహించలేనివి, కనుగొనలేనివి అయిన సూక్ష్మ విషయాలను మనలోకి ప్రసరించడం జరుగుతుంది. అటువంటి గురువునే సమర్థగురువు అని అంటాం. 
సత్యం కంటే, ఆధ్యాత్మికత కంటే, అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉండీ అంటే, అది మాస్టరే. దాన్ని ప్రసాదించేది కూడా మాస్టరే. 
(సశేషం .. )  



బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 2

 


బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 2

బాబూజీ సాయంకాలం ఆరున్నరకు సత్సంగం నిర్వహించేవారు. ఆ తరువాత వాలు కుర్చీలో కూర్చొని హుక్కా పీలుస్తూండేవారు. ఉల్లాసంగా, ఆనందంగా, జలపాతంలో నీరు పడుతున్నట్లుగా గలగల మాట్లాడుతూండేవారు. ఒక్కోసారి మౌనంగా తనదైన లోకంలో ఉండేవారనడం కంటే కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక కార్యాలనో, బీజరూపంలో చేసే ప్రకృతి కార్యాలనో  లేక అద్భుతాలను నిర్వహిస్తూండేవారనడమే కరెక్ట్ అనుకుంటాను. అలా రాత్రి అవుతున్నకొద్దీ, అప్పుడే ఆయన దినచర్య మొదలయ్యిందా అన్నట్లుగా మరింత హుషారుగా కనిపించేవారు. 
అలా రాత్రి పదకొండు, పన్నెండు గంటల వరకూ కూర్చునేవారు. అలా కూర్చున్న ఆ నిశ్శబ్ద మౌన క్షణాలే వారిచ్చే అత్యున్నత అద్భుత ఆధ్యాత్మిక శిక్షణ. ఛలోక్తులు విసరడం, సులభంగా అర్థమవ్వాలని కథలు చెప్పడం, అభ్యాసి గతంలోకి తొంగి చూసి అతను ఫలానా అని చెప్పడం లేదా అభ్యాసుల్లో సంస్కార ఉచ్చులను తొలగించేస్తూండటం, అప్పుడప్పుడు అవగాహన కోసం కబీరు కథలో, గురునానక్ కథలో సూఫీ కథలో చెప్తూండటం చేసేవారు. 
బాబూజీ శిక్షణ చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆయన ప్రవచనకారుడు కాదు, వక్త కాదు. కానీ ఆయన చుట్టూ కూర్చొని ఉన్నప్పుడు, ఆయన సంభాషణలు, విసిరే ఛలోక్తులతో అభ్యాసుల  సమస్యలకు సమాధానాలిస్తూండేవారు. ఎన్నోసార్లు అభ్యాసుల మనసుల్లోని మాటను గ్రహించి, వాళ్ళు ప్రశ్నించకుండానే సమాధానం ఇచ్చేవారు. ఎందరో అభ్యాసుల కథనాలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి. 
బాబూజీ ఎవ్వరికీ ఇది చెయ్యి, అది చెయ్యి అని సాధారణంగా చెప్పేవారు కాదు. మీరు అభ్యాసికి  నేరుగా ఫలానా పని చేయమని ఎందుకని చెప్పారు అని ఒకసారి చారీజీ  ప్రశ్నించినప్పుడు, అలా చెప్తే అది గురువాజ్ఞ అయిపోతుంది, దాన్ని అభ్యాసి  ఉల్లంఘించినట్లయితే అది పాపమై చుట్టుకుంటుంది అనేవారు. అభ్యాసి శ్రేయస్సు అన్ని విధాలా కోరుకునే సద్గురువు బాబూజీ. 
"నౌ అయాం టెల్లింగ్ యు" అనే ఆంగ్ల పదబంధం ఆయన నోటి వెంట తరచూ వినిపిస్తూండేది. బాబూజీ కళ్ళు కొంటె కుర్రాడి కళ్ళల్లా మెరుస్తూండేవి. లాలాజీ ని తలచుకోగానే ఆయన కళ్ళు మరింతగా మెరుస్తూండేవి. చేతులు అటు ఇటూ కడుపుతూ తన ఆహార్యంతో తన గురుదేవుల గురించిన విషయాలను అభివ్యక్తం చేసేవారు. ఆయన ముందు కూర్చున్న అభ్యాసులందరూ మంత్రముగ్ధులై, మనసు, హృదయం అంతా శూన్యమైపోయి ఎంతో తేలికదనాన్ని అనుభూతి చెందుతూండేవారు. సంస్కారాల భారం నుండి అభ్యాసులను తప్పించి, వాళ్ళకు తెలియకుండానే ప్రాణాహుతిని వాళ్ళ హృదయాల్లో నింపుతూ, వాళ్ళకు బోధించవలసినదంతా బీజరూపంలో చొప్పించేవారు; వివేకము, వికాసము లోపలి నుండి పైకి సహజంగా పైకి తనంతతానుగా వచ్చే పరిస్థితిని కల్పించేవారు. బాబూజీ అసలైన శిక్షణ ఇదే. ప్రాణాహుతి ఆయన ద్వారా 24 గంటలూ ప్రవహిస్తూనే ఉండేది.
తెల్లవారుఝామున 2 గంటల నుండి ప్రత్యేకంగా అందరికీ ప్రాణాహుతి ప్రసరణ చేస్తూండేవారు. ఆపడల్లోనూ, సమస్యల్లోనూ, చిక్కుకున్న అభ్యాసులు, బాబూజీని స్మరించినప్పుడు, వాళ్ళ రూపాలు ఆయన హృదయంలో నీటి బుడగల్లా కనిపించేవట; తక్షణమే వారికి అందవలసిన సహాయం అందుతూండేదని బాబూజీ చెప్తూండేవారు. మాస్టరును ఆశ్రయించి ఆ విధంగా ఆధారపడటమే చాలా ముఖ్యం.
బాబూజీ బోధిస్తున్నది జీవిస్తూ, ఆచరించి చూపించేవారు. తన వద్దకు చాలా మంది చూడాలని వస్తారు కానీ చూడకుండానే వెళ్లిపోతూంటారని బాబూజీ ఆవేదన పడుతూండేవారు.  ఇవ్వడానికి ఆయన వద్ద ఆధ్యాత్మిక పెన్నిధి ఉన్నా, అడిగిన వారికి ఇద్దామని ఆతృతతో వేచియున్న బాబూజీ వద్దకు ఎవరూ రానప్పుడు, వచ్చినవారు కూడా అసందర్భంగా ఎంతో అల్పమైనవాటిని మాత్రమే కోరుకున్నప్పుడు, వారు ఎంత వ్యధను అనుభవించేవారో వారి గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. బాబూజీని చూసినవారే దీనికి నిదర్శనం. ఆయన ఎప్పుడూ ఇవ్వడమే, మరింతగా ఇవ్వడమే తప్ప దేనిని ఆశించలేదు. ఆయన ప్రధాన బోధన కూడా "ఇవ్వండి, ఇవ్వండి" అనేదే. చివరికి ఆయన "నా వద్ద తరగని ఆధ్యాత్మిక సంపద ఉన్నది. దీన్ని కొల్లగొట్టి తీసుకోండి. నా జీవితకాలంలో మీరు తీసుకోలేకపోతే దీన్నంతా వాతావరణంలో విడిచిపెట్టేయవలసి వస్తుంది" అనేవారు. 

( సశేషం ..)
 




4, జనవరి 2024, గురువారం

బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 1

 


బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 1

బాబూజీ జీవనమే అత్యున్నత శిక్షణ. ఆయన వ్రాసిన పుస్తకాలు ఎంత చదివినా కూడా నేర్చుకోలేనిదాన్ని ఆయనతో కలిసి ఉండటం ద్వారా, కలిసి  జీవించడం ద్వారా, నేర్చుకొనేవారు. ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉన్నవారు కూడా ఆయనలో ఎంతో సహజంగా ఉండే నిరాడంబరత, సరళత్వం, ఆదరణ, ఆప్యాయతలకు ముగ్ధులయి ఆయనను విడిచివెళ్ళేటప్పుడు ఎవరో ఆప్తుడిని, ఆత్మీయుడిని విడిచి వెళ్తున్నట్లు బాధపడేవారు. ఇస్తున్నట్లు  కనిపించకుండానే ఎంతో, ఎన్ని విధాలుగానో ఇస్తూండేవారు. తనకు ప్రేమతో బహూకరించిన వస్తువులను వాటి అవసరం ఉన్న వ్యక్తికి అవి చేరిపోయేవి. ఆధ్యాత్మిక శిక్షణ కోసం తన వద్దకు వచ్చేవారి సాధారణ అవసరాలు కూడా గుర్తుంచుకొని తన వ్యక్తిగత ఇబ్బందులను లక్ష్యపెట్టకుండా తీర్చేవారు. "బాబూజీ ఒక పర్ఫెక్ట్ హోస్ట్" అని చక్కగా అభివర్ణించేవారు చారీజీ బాబూజీని. 
దూరతీరాల నుండి ఆధ్యాత్మిక ఆకాంక్షతో వచ్చే విదేశీయుల పట్ల బాబూజీ ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. అక్కడి ఆధునాతనమైన, ఆడంబరమైన జీవితాలను విడిచి వచ్చిన వీరు నెలల తరబడి బాబూజీ సన్నిధిలో ఆ నిరాడంబరమైన సామాన్య వాతావరణంలో ఉండిపోయేవారంటే బాబూజీ వారిని ఎంత గాఢంగా ప్రభావితం చేశారో తెలుస్తుంది. కొద్ది కాలంలోనే ఆధ్యాత్మిక పురోగతితోపాటుగా వారి జీవితాల్లో, జీవిత విలువల పట్ల గల మౌలిక అవగాహనలో వారు తీసుకురాగలిగిన మార్పు ఏ  సామాజిక శాస్త్రవేత్త, సంఘసంస్కర్త, కొన్ని దశాబ్దాలలో కూడా సాధించలేనిది. 
అలాగని ఆయన ఇచ్చిన శిక్షణ ఏ మాత్రమూ హడావుడిగా గాని, నిర్ణీతమైన ఒక కార్యక్రమానికి గాని పరిమితమై ఉన్నట్లుగా గాని ఉండేది కాదు. అంతా అతి సామాన్యంగా, సాధారణంగా, తాపీగా మనకు తెలియకుండానే సాగిపోయేది. అయితే అభ్యాసులు మాత్రం తమలో వస్తున్న అనేక మార్పులను గమనిస్తూండేవారు. సహజమార్గ సాధనలో అభ్యాసి పాత్ర కంటే కూడా మాస్టరు బాధ్యత అనే విషయం సులభంగా నిరూపణ అయ్యేది. అయితే ఇది మొదలవడానికి ముందు అభ్యాసికి, గురువుకు మధ్య అనుబంధం ఏర్పడాలి. ఆ అనుబంధం ఏర్పడాలంటే మాస్టరును అభ్యాసి హృదయపూర్వకంగా స్వీకరించగలగాలి. అప్పుడే మాస్టర్ ఇచ్చే ప్రాణాహుతిని స్వీకరించగలగడం, 'ఆయన పని' మొదలు కావడం జరుగుతుంది. బాబూజీ భాష, అందులోనూ ఆయన ఇంగ్లీషు ఉచ్ఛారణ అర్థంగాని విదేశీ అభ్యాసులు, ఎంతో మంది ఇంగ్లీషు రానివాళ్ళు కూడా ఎంతో సుదూర తీరాల నుండి వచ్చి వారి ముందు కూర్చొని, బాబూజీ ఇంట్లో కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిపి, వారిని సునాయాసంగా స్వీకరించారంటే, వాళ్ళ ఆమోదాన్ని పొందడానికి బాబూజీ వారిని ఎలా ఆకట్టుకునేవారో అన్నది ఊహించవచ్చు. అయితే ఎందుకీ ప్రయాస అంతా! తన మాస్టర్ పట్ల తను నిర్వర్తించవలసిన బాధ్యత కోసమే. అందరినీ ఎక్కడి నుండి వచ్చారో మరలా ఆ మూలనివాసానికి చేరేలా చూడటం కోసమే. 
బాబూజీ రాత్రి చాలా ఆలస్యంగా పడుకొనేవారు. బాబూజీ దినచర్య సుమారు 8-9 గంటలకు హుక్కా పీల్చడంతో మొదలయ్యేది.   వరండాలో తన వాలు కుర్చీలో కూర్చొని, మౌనంగా అభ్యాసులపై తన పనిని, మనకు తెలియకుండానే మొదలు పెట్టేవారు. బాబూజీతో ప్రతి రోజు, భిన్న భిన్నంగా ఉండేది. నిర్దిష్టంగా ఇలా ఉంటుందని చెప్పడానికి ఉండదు. నిదానంగా, తాపీగా సాగుతున్నట్లుండేది రోజు. ఒక్కోసారి మౌనంగా ఉండేవారు, మరోసారి ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేవారు; చాలా సార్లు వేరే యేదో లోకాల్లో పని చేస్తున్నట్లుగా కనిపించేవారు. అప్పుడప్పుడు సిట్టింగు ఇస్తాను కూర్చోండి అనేవారు. మధ్యమధ్యలో ఇంట్లోకి వెళ్ళి వస్తూండేవారు. బహుశా అభ్యాసుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి చేయవలసిన ఏర్పాట్లు చేయడం కోసమో, గృహస్థుగా తాను నిర్వర్తించవలసిన బాధ్యతల కోసమో,  లేక ఇంట్లోవాళ్ళకి ఏవో సూచనలివ్వడానికో అన్నట్లుగా బయటకు, లోపలికి తిరుగుతూ ఉండేవారు. 
ప్రెస్ లో పనులు, అభ్యాసుల ఉత్తరాలకు సమాధానాలివ్వడం, అతిథులకు మర్యాదలు చేయడమో, ఆఫీసు పనులు చేయడమో కాస్సేపు ఇలా ఉండేది వారి దినచర్య. అప్పుడప్పుడు ప్రశిక్షకులను చేయడంలో నిమగ్నులయ్యేవారు. అలాంటి సమయాల్లో అభ్యాసులు మౌనంగానే ఉన్నప్పటికీ, తమలో ఎంతో నిగూఢమైన పని జరుగుతోందనే స్పృహ మొదట్లో ఉండేది కాదు. కానీ, రాను రాను, బాబూజీ శిక్షణాశైలికి అలవాటు పడిన అభ్యాసులకు, తమ అంతరంగంలో వస్తున్న అనూహ్యమైన మార్పులను గమనించి, బాబూజీ సునాయాసంగా, తమ ప్రమేయం లేకుండానే, తమ నుంచి ఎటువంటి ప్రతిఘటనను ఎదుర్కోవలసిన అవసరం రాకూడదనే, ఆయన అంతటి బాధ్యతను తనపై వేసుకున్నారని, అసలు సద్గురువు అంటే ఇలా ఉండాలనీ, తెలిసేది. ఎప్పుడో ఒకప్పుడు బాబూజీని కలిసి, ఒకటో రెండో సిట్టింగులు తీసుకున్న అభ్యాసులకు తమపై ఇంతటి 'పని' జరుగుతుందని తెలిసేది కాదు. కానీ సహజమార్గ పద్ధతిలో చెప్పినట్లుగా, మాస్టరుతో కొన్నాళ్ళపాటు గడిపి, ఆయనకు తమపై పని చేయడానికి అవకాశం కల్పించిన అభ్యాసులకు బాబూజీ ఎంత గాఢంగా పని చేసేవారో తెలుసును. అందుకే, అసాధ్యమైన ఆధ్యాత్మిక శిఖరాలను సహజమార్గంలో సునాయాసంగా చేరుకోగలుగుతాం. 
(సశేషం ..)



3, జనవరి 2024, బుధవారం

స్పెషల్ పర్సనాలిటీ - బాబూజీ

 


స్పెషల్ పర్సనాలిటీ - బాబూజీ 

ఆధ్యాత్మిక రంగంలో ఇంతవరకూ మునులు, ఋషులు, మహర్షులు, సిద్ధులు సాధువులు, ఉంటారనే మనకు తెలుసు. అవసరమైనప్పుడు, "పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం ...." అని గీతలో చెప్పినట్లుగా, అవతార పురుషులు దిగివస్తారని కూడా మనం విన్నాం. ఇవన్నీ గతంలో జరిగినవే. సహజమార్గంతో ఒక నూతన ఆధ్యాత్మిక శకం ప్రారంభమయ్యింది. 
ప్రకృతి ప్రక్షాళన కోసం, ప్రకృతి ప్రణాళిక అమలు జరగడం కోసం, ప్రకృతే, అనగా సాక్షాత్తూ ఆ మూల కారణమైన దైవమే, మానవ రూపం ధరించి దిగి వచ్చిన వ్యక్తిత్వమే  "స్పెషల్ పర్సనాలిటీ". ఆ స్పెషల్ పర్సనాలిటీయే బాబూజీ మహారాజ్. ఆ దివ్య సంకల్పం ఏ విధంగా కార్యరూపం దాల్చింది అన్నదే "సహజమార్గం". 
ఆదిగురువులు లాలాజీ అవతరించడం, బాబూజీని తీర్చిదిద్దడం, 1944 వ సంవత్సరంలో బాబూజీ స్పెషల్ పర్సనాలిటీగా తయారవడం, బాబూజీ గురుదక్షిణగా తమ గురుదేవుల పేర 1945 వ సంవత్సరంలో శ్రీరామచంద్ర మిషన్ స్థాపించడం, ఇవన్నీ దైవ ప్రణాళిక ప్రకారం క్రమంగా జరిగిపోయాయి. వీటన్నిటి వివరాలు శ్రీరామచంద్ర మిషన్ సాహిత్యంలో స్పష్టంగా లభిస్తాయి. శ్రీరామచంద్రుని సంపూర్ణ రచనలు ఆరు సంపుటాలు, దివ్యసుధాధార, బాబూజీతో ప్రత్యుత్తరాలు, విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ 1944 ముఖ్యంగా చదువవలసిన ఉద్గ్రంథాలు. 
అవతారాలు ఏదో ఒక నిర్దిష్టమైన కార్యాన్ని నిర్వర్తించడానికి మాత్రమే వచ్చి, ఆ పని పూర్తయిన తరువాత ఆ అవతారం చాలించడం జరుగుతుంది. అలా వచ్చిన అవతార పురుషుడు మరొక అవతారాన్ని తయారు చేయలేడు. కానీ ఈ స్పెషల్ పర్సనాలిటీ 'వారిలాంటి' వ్యక్తిత్వాలను ఎందరినో తయారు చేయగలరు. 
విశ్వంలో మార్పును సంభవింపజేసి, మానవాళిని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేసి, ప్రకృతి ప్రణాళికను యథాతథంగా అమలు జరుపడానికి, అత్యంత పరిశుద్ధ స్థితిలో స్థిరపడిన మనసు కలిగిన వ్యక్తి ప్రకృతికి అవసరం. అటువంటి ప్రకృతి కార్యాన్ని నెరవేర్చేందుకు సరైన పరికారంగా పరిణమించిన వ్యక్తిత్వమే  ఈ స్పెషల్ పర్సనాలిటీ. ఇంతకు మునుపెన్నడూ ఇటువంటి స్పెషల్ పర్సనాలిటీ ఆవిర్భావం జరగలేదంటారు. అంతే కాదు ఇంతకు పూర్వం భూమిని పవిత్రం చేసి వెళ్ళిన, శ్రీకృష్ణ భగవానుడు, మాతా రాధారాణి, శ్రీరామ కృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చైతన్య మహాప్రభు, కబీరు వంటి   ఎందరో అవతార పురుషులు, మహాత్ములెందరో బాబూజీలో విలీనమై ఆయన ద్వారా ఇప్పటికీ ఈ సృష్టికి సేవలనందించడం మూలానే బాబూజీని స్పెషల్ పర్సనాలిటీ అనడానికి మరో ప్రధాన కారణం. 
సృష్టిలోని అన్ని రకాలైన శక్తులు, వినాశకర శక్తులు, నిర్మాణాత్మకమైన శక్తులు, ఇంతవరకూ వచ్చి వెళ్ళిన మహాత్ములందరూ ఈ స్పెషల్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో, వారి ఆజ్ఞానుసారం సహకరిస్తూ పని చేయడం జరుగుతోంది. మరలా ఇటువంటి వ్యక్తిత్వం ఆవిర్భవించడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందట. 
ఈ స్పెషల్ పర్సనాలిటీ సృష్టి మూలం నుండి నేరుగా వచ్చిన వ్యక్తిత్వం. ఇటువంటి వ్యక్తిత్వం సృష్టిలో ఒక్కరే ఉంటారట. వారిని దర్శించాలని తపిస్తున్నవారెవరైనా, ఆయన సంకల్పానుసారం సూర్యచంద్రాదుల్లో గాని, సూక్ష్మరూపంలో గాని, ఎక్కడైనా, ఏ రూపంలోనైనా, ఏ సమయంలోనైనా, దర్శనమివ్వగలరు. ఈ ప్రపంచానికి సంబంధించిన కార్యాలే గాక, పిపీలకాది బ్రహ్మ పర్యంతమూ సమస్త జీవరాసులకు సంబంధించిన లోకాల్లోనూ కార్యనిర్వహణ నిమిత్తమైన అవతరించిన మహానుభావులు. ఈ వ్యక్తిత్వం భౌతిక రూపంలో ఒక ప్రదేశంలో ఉన్నప్పటికీ, విశ్వమంతటా, సర్వత్రా వ్యాపించి ఉంటారు. 
వారు నెరవేర్చవలసిన కార్యాలకు ఆదేశాలు ఆ "మూలం" నుండి జారీ అవుతాయి. వాటిననుసరించి వారు పని చేస్తారు. సృష్టిలో వారికి ప్రతీదీ అతి స్పష్టంగా కనిపిస్తుంది. వారికి తెలియకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు. త్రికాలాల్లోనూ పని చేయగల సమర్థులు, కాలాతీతులు, సుదూర భవిష్యత్తులోని పనికి కూడా ఈ స్పెషల్ పర్సనాలిటీ అప్పుడే బీజాలు వేయడం జరిగింది. వీరు నాటిన బీజప్రభావాలు కొన్ని ఇప్పటికే కార్యరూపం దాల్చి, చరిత్ర పుటల్లోకి చేరిపోయాయి. దీనికి నిదర్శనం బాబూజీ ఆంగ్లంలో రచించిన "రియాలిటీ ఎట్ డాన్(సత్యోదయం తెలుగులో)" అనే గ్రంథంలో "మై విజన్" అనే అధ్యాయం చదవాలని విజ్ఞప్తి. ఈ గ్రంథాన్ని వారు 1945 లో వ్రాయడం జరిగింది. 
ఈ స్పెషల్ పర్సనాలిటీని దర్శించాలని తీవ్ర ఆకాంక్ష గలవారెవరైనా, నేరుగా భగవంతుని ప్రార్థిస్తూ, ధ్యానంలో కూర్చోవచ్చు, వారికి దర్శనం తప్పక లభించే అవకాశం ఉంది. 
అంతటి మహోన్నత వ్యక్తిత్వం గురించి అక్షరాల్లో పెట్టే ప్రయత్నం దుస్సాహసమే. అయినప్పటికీ మన అవగాహన ఇంకా హృదయానికి గాక బుద్ధికి, పుస్తకాలకే పరిమితమై ఉండటం వల్ల వారిని ఈ విధంగానైనా దర్శించే ప్రయత్నమే ఈ చిరు ప్రయత్నం. 






2, జనవరి 2024, మంగళవారం

లాలాజీ-బాబూజీల కలయిక - జూన్ 3 1922

 


లాలాజీ - బాబూజీల కలయిక
జూన్ 3, 1922

ఆత్మ ఈ  ప్రపంచంలోకి వచ్చిన తరువాత ఆగమ్యగోచరంగా దిశ లేకుండా, ఎందుకొచ్చామో, ఏం చేయాలో, ఎక్కడికి ప్రయాణిస్తున్నామో, ఎక్కడికి ప్రయాణించాలో, గమ్యం ఏమిటో, ఎందుకు జన్మించామో, ఎందుకు మరణించాలో, మన అస్తిత్వానికి కారణం ఏమిటి, మన జీవిత ప్రయోజనం ఏమిటో, కష్టాలు ఎందుకు పడాలో, ఇలా అనేక మన అస్తిత్వానికే సంబంధించిన ప్రశ్నలతో పైకి మనం ఏమి చేస్తున్నా కూడా, అంతరంగం అల్లకల్లోలంగా ఉండే స్థితిలో మనుగడ కొనసాగిస్తూ ఉంటుంది ఆత్మ. 
వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ప్రతి యొక్క ఆత్మకు తనకు ప్రకృతిచే నిర్ధారించిన గురువు యొక్క సాన్నిధ్యం లభించటం, అటువంటి సమర్థ గురువును కలవగలగడం.  కచ్చితంగా అది సత్యాన్వేషకుడు చేసుకునే ఎంపిక కాదు. శిష్యుడు తయారుగా ఉన్నప్పుడు గురు దర్శనం జరుగుతుంది. గురువే సాధకుడిని ఎంపిక చేసుకుంటాడు" అంటారు చారీజీ.  అటువంటి అద్భుతమైన కలయిక సరైన సమయం వచ్చినప్పుడు, ఈ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలతో, సమాధానాల కోసం పరితపిస్తున్న ప్రతీ ఆత్మకు సంభవిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. కొందరికి ఈ తపన అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఈ తపన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత త్వరగా గురువు లభిస్తాడు. 
ఆదిశంకరులు తన గురువైన గోవింద భగవత్పాదుల వారిని కలిసిన క్షణం, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణులవారిని కలిసిన క్షణం, పార్థసారథి రాజగోపాలాచారీజీ బాబూజీని కలిసిన క్షణం,   పూజ్య కమలేష్ పటేల్ జీ పూజ్య బాబూజీని కలిసిన క్షణం, ఇలా ఎంతో మంది మహానుభావుల తమ తమ గురువులను ఆత్మస్థాయిలో సంపర్కం జరిగిన క్షణాలను, కలిసిన ఘట్టాలను మనం పరికించి చూసినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అటువంటి క్షణాలు గురువును పొందిన క్షణంలో మనం కూడా అనుభూతి చెందడం జరుగుతుంది. 
ఆ అద్భుత క్షణం అత్యంత నిగూఢమైనది. మహాత్ముల జీవితాన్ని పరిశీలిస్తే, వారి జీవిత చరిత్రలను గమనిస్తే అనిపించిందేమిటంటే - ఆ క్షణంలోనే బీజస్థాయిలో ఆధ్యాత్మికంగా జరుగవలసిన మహత్తర కార్యం అంతా జరిగిపోతుంది. ఆ తరువాతి జీవితంలో ఈ ఆధ్యాత్మిక బీజం వికసించడమే మనం వీక్షించడం జరుగుతుంది అంతే. సాధన ద్వారా ఈ బీజరూపంలో ఉన్నది నెమ్మది నెమ్మదిగా మొలకెత్తి, ఆ తరువాత వృక్షమవుతుంది.  
అటువంటి అద్భుత క్షణమే బాబూజీ 22 సంవత్సరాల వయసులో ఫతేగఢ్ లో పూజ్య లాలాజీని కలిసిన క్షణం. అందులో బాబూజీ-లాలాజీల కలయిక చాలా ప్రత్యేకమైనది. తన గురువును గురించి విని బాబూజీ ఫతేగఢ్ లో ఉన్న లాలాజీని దర్శించాలని, ఆయన నిర్వహించే సత్సంగంలో పాల్గొనాలని రావడం జరుగుతుంది. సత్సంగంలో చివ్వరిలో కూర్చుంటారు బాబూజీ. లాలాజీ ధ్యానం ప్రారంభిస్తారు. ఆ క్షణమే బాబూజీ, లాలాజీ సంపూర్ణ రూపంపై ధ్యానించడం ప్రారంభించారట. అప్పటి నుండి జీవితం అంతా బాబూజీకి జగమంతా లాలాజీ మయమే. లాలాజీ గాక ఈ ప్రపంచంలో ఇక ఏముంది అని అంటూండేవారు. లాలాజీ మహాసమాధి తరువాత కూడా బాబూజీ ప్రతి నిత్యం ప్రతి క్షణం, లాలాజీ నుండి మార్గదర్శనం పొందుతూండేవారు. దాని ఫలితమే శ్రీరామ చంద్ర మిషన్ అనే ఆధ్యాత్మిక సంస్థ. దాని ఫలితమే సహాజమార్గ ధ్యాన పద్ధతి ఉనికిలోకి వచ్చినది. లాలాజీ కృప వల్లనే ప్రాణాహుతి శక్తి భువిపైకి వచ్చింది. ప్రతీ ఆత్మలో ఉన్న ఆధ్యాత్మిక తృష్ణను సంతృప్తి పరచేది ఈ ప్రాణాహుతి శక్తి మాత్రమే. దాని ఫలితమే ఈ రోజున ఈ సంస్థ ఇంతగా వ్యాపిస్తూ ఉంది, ఒక రోజు ఈ భూగ్రహం అంతా వ్యాపించి తీరుతుంది కూడా.
ఆ కలయిక ఎలా ఉంటుంది? 
ఆ కలయిక అంటూ జరిగితే, ఆ సంపర్కం ఎప్పటికీ విడిపోని విధంగా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది. ఒక్కసారి అటువంటి గురువు లభించిన తరువాత సాధకుడు తనను తాను ఆ గురువును ఇనుప సంకెళ్ళతో బంధించేసుకోవాలంటారు బాబూజీ. ఆ తరువాత చేసే సాధన ఈ ఆత్మీయ బంధాన్ని పటిష్ఠం చేస్తుంది. జీవిత ప్రయోజనం సిద్ధిస్తుంది, మనుగడ అర్థవంతంగా ఉంటుంది, జన్మ సార్థకమవుతుంది.   

1, జనవరి 2024, సోమవారం

మూర్తీభవించిన శూన్యత్వం – బాబూజీ

 


మూర్తీభవించిన శూన్యత్వం – బాబూజీ


అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శ్రీరామ చంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆధ్యాత్మిక క్షేత్రంలో సహజమార్గం అనే విప్లవాత్మక పద్ధతిని ఆవిష్కరించిన సమర్థ గురువు  పూజ్య బాబూజీ మహారాజ్ గారి 125వ  జయంత్యుత్సవం  హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ సాధకులందరూ జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సంవత్సరమంతా వారి ప్రత్యేక స్మరణలో గడిపే ప్రయత్నంలో ఉన్న అభ్యాసులందరికీ  ప్రత్యేకమైన  హృదయపూర్వక ఆధ్యాత్మికాభినందనలు.

శ్రీరామ చంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆధ్యాత్మిక క్షేత్రంలో సహజమార్గం

అనే విప్లవాత్మక పద్ధతిని ఆవిష్కరించిన సమర్థ గురువు  పూజ్య బాబూజీ

మహారాజ్ గారి 125వ  జయంత్యుత్సవం  హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ

సాధకులందరూ జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సంవత్సరమంతా వారి

ప్రత్యేక స్మరణలో గడిపే ప్రయత్నంలో ఉన్న అభ్యాసులందరికీ  ప్రత్యేకమైన

 హృదయపూర్వక ఆధ్యాత్మికాభినందనలు. 

అసలు బాబూజీ మహారాజ్ గారిని “వారు ఇది” అని అభివర్ణించే ప్రయత్నమే ఒక దుస్సాహసం. అయితే వారిని భౌతికంగా దర్శించిన గంభీరమైన సాధకుల  ద్వారా, వారి జీవన విధానాన్ని ప్రత్యక్షంగా దర్శించినవారు  వారితో స్వయంగా జరిపిన సంభాషణల ద్వారా, వారి బోధనల ద్వారా, వారి గ్రంథాల ద్వారా, వారు పలికిన వాక్కుల ద్వారా,  వారి కృపచే తయారైన చారీజీ, దాజీ వంటి మహత్తర వ్యక్తిత్వాల జీవితాల ద్వారా, వారిపై ధ్యానించిన వ్యక్తుల ద్వారా, వెరసి వీరందరి  ద్వారా కలిగిన స్వీయ అవగాహన ద్వారా  ఆ మహాపురుషుని దర్శించడానికి చేసే  దుస్సాహసమే ఈ చిన్ని ప్రయత్నం.

సృష్టికి పూర్వం ఉన్నది శూన్యమేనని అందరూ అంగీకరిస్తున్నదే. శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి చూసినా, బాబూజీ వంటి ఆధ్యాత్మిక తత్త్వవేత్తలను అనుసరించి చూసినా, శూన్యం నుండే సర్వమూ ఉద్భవించిందనడానికి  ఇక ఏ మాత్రమూ  సందేహపడనవసరం  లేదు.

పూజ్య చారీజీ చెప్పినట్లుగా, ఒక చిన్న విత్తులో మర్రి చెట్టు దాగి ఉంది; అదెక్కడుందోనని ఆ విత్తును రెండుగా విడదీసి చూసినట్లయితే  ఏమీ కనిపించదు. కానీ ఆ శూన్యంలో నుండే అంత పెద్ద వటవృక్షం వస్తుంది మరి. సృష్టి కూడా అంతే.  అంటే మనమూ మన చుట్టూ ఉన్న అస్తిత్వం కూడా అంతేఆ శూన్యత్వం నుండే వచ్చింది.  

విజ్ఞానశాస్త్రపరంగా శూన్యం (వాక్యూమ్) అనేది గాలి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ స్థితి చాలా శక్తివంతమైనది. అన్నిటినీ తనలోకి పీల్చేసుకుంటుంది, ఇముడ్చేసుకుంటుంది (బ్లాక్ హోల్స్ లా). అటువంటి శూన్యస్థితులు  సముద్రాలలో ఏర్పడటం వల్లే మనకు తుఫాన్లు, సునామీలు, వంటి భీభత్సాలు సంభవిస్తూ ఉంటాయి. ఇది భౌతికపరమైన శూన్యత్వం.

అలాగే మనుషుల్లో ఉండే కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు, కోరికలు, సంస్కారాలు, అహంకారము,  సుగుణాలు, దుర్గుణాలు ఇలా సమస్తమూ పోయినప్పుడు కలిగే,  ఏమీ  లేనటువంటి స్థితిని ఏమనాలి? దాన్ని కూడా శూన్యత్వం అనే అంటాం, ఆధ్యాత్మిక శూన్యత్వం అంటే అదే. దాన్నే నామరూపగుణ రహిత తత్త్వం అని కూడా అంటాం. నిర్గుణ, నిరాకార, నిర్మమకార, నిరహంకార స్థితి. ఈ స్థితి మనిషి హృదయంలో నెలకొన్నప్పుడు భగవత్కృపను ఊహకందని విధంగా ఆకర్షించడం జరుగుతుంది. దైవమయం అయిపోతాడు మనిషి. శూన్యత్వానికి ప్రతిరూపమైపోతాడు వ్యక్తి. అపార శక్తివంతమైనది ఈ స్థితి. అన్నిటికీ అతీతమైనది. అస్సలు ఊహకందనిది, జ్ఞానానికి కూడా అందనిది, జ్ఞానానికి అతీతమైనది.   భౌతికపరమైన శూన్యత్వంతో పోల్చ లేనిది. సాధకుడు ఈ విధంగా తయారయ్యే క్రమాన్నే సహజమార్గ ధ్యానపద్ధతిలో వ్యక్తిగత ప్రళయం అని అంటారు. ఇటువంటి శూన్యత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం పూజ్య బాబూజీ మహారాజ్.  అందుకే వీరిని స్పెషల్ పర్సనాలిటీ (విశిష్ఠ వ్యక్తిత్వం) అని కూడా అంటారు. స్పెషల్ పర్సనాలిటీ అంటే ఎవరు? అని ఎవరో ప్రశ్నించినప్పుడు బాబూజీ - అది అతి గోప్యమైన విషయం అన్నారు.  ఇటువంటి వ్యక్తిత్వాలు పదివేల సంవత్సరాలకొక సారి ఈ భూమ్మీదకు వస్తూ ఉండటం జరుగుతూ ఉంటుందట.  మరల అటువంటి వ్యక్తిత్వం వచ్చే వరకూ, ఈ లోకసంరక్షణ కోసం అన్ని  సంవత్సరాలకు సరిపడ, చేయవలసిన  నిగూఢ ఆధ్యాత్మిక కార్యాలను నిర్వహించి వెడతారట. నిగూఢ ధ్యానస్థితుల్లో సుస్థిరముగా నిలబడినవారు, వీరు నిర్వహించిన కార్యాలను దర్శించగలుగుతారని బాబూజీ చెప్పడం జరిగింది.

ఆ శూన్యత్వాన్ని ప్రతిబింబించే విధంగా బాబూజీ పలికిన కొన్ని వాక్యాల ద్వారా, ఆయనను ప్రార్థనాపూర్వకంగా దర్శించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాక్యాలను,  బాబూజీ నోటి వెంట వెలువడిన మహావాక్యాలుగా చెప్పుకోవచ్చుననిపిస్తుంది. ఈ క్రింది మహా వాక్యాలపై ధ్యానించడం ద్వారా ఆయన తత్త్వం కొంతవరకూ అయినా దర్శించగలవేమో ప్రయత్నిద్దాం.   

ఒకసారి ఎవరో బాబూజీని “అసలు మీరెవరు?” అని అడిగారట. దానికి వారు, “నేను నేను అని అన్నప్పుడు, అది నన్ను సూచిస్తున్నదో, లేక నా గురువును సూచిస్తున్నదో లేక ఆ దైవాన్ని సూచిస్తున్నదో  నాకు తెలియదు” అన్నారట. కాస్త ధ్యానించి చూడండి ఈ వాక్యాన్ని. వారి నోటి వెంట వచ్చే ఆ పలుకులు ఎటువంటి నిగూఢ ఆధ్యాత్మిక స్థితి నుండి వెలువడుతున్నాయో దర్శించే ప్రయత్నం చేయండి.

మరో వాక్యం ..

“నాకు శాంతి అంటే ఏమిటో తెలియదు. శాంతి అంటే ఏమిటో తెలియనప్పుడు, నేను భగవంతుడిని శాంతి కావాలని ఎలా కోరుకోగలను? ఒకవేళ కోరుకోవలసి వస్తే ఆ శాంతినిచ్చేవాడినే  కోరుకుంటాను.” అన్నారు బాబూజీ ఒకసారి. కాస్త ధ్యానించి ఈ వాక్యంలో ఉన్న నిగూఢ అనుభూతిని  పొందే  ప్రయత్నం చేయండి.

ప్ర: గడచిన కొన్ని యుగాల్లో అవతార పురుషులు చేసిన కార్యాలను గురించి మీ వ్యాఖ్యలు?

బాబూజీ: అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు సమాజంలో నైతికతకు, సంస్కృతికి పునాదులు ఏర్పరచాడు. శ్రీకృష్ణభగవానుడు ఆ పునాదిపై నిర్మాణం చేస్తూ సాధనలో భక్తి తత్త్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీకృష్ణుడికి పూర్వం ఈ భక్తి అనే అంశం ఉండేది కాదు. కాబట్టి ప్రతీ అవతార పురుషుడు ఇంతకు ముందు అవతారం చేసిన పనికి మరింత మెరుగైన అంశాన్ని జోడిస్తూ ఉండటం జరుగుతూ ఉంది.  ఇదీ క్రమం. ఒక రకంగా చూసినట్లయితే, ఒక్కొక్క అవతారం అంతకు ముందు అవతారం కంటే గొప్పదని చెప్పవచ్చు. ఈ అర్థంలో పరికిస్తూ   శ్రీకృష్ణావతారం, శ్రీరామావతారం కంటే గొప్పదిగా పరిగణించేవారు కూడా ఉన్నారు.  

కానీ, మరో అర్థంలో గనుక చూస్తే, ఎక్కువ, తక్కువ అనే ఆలోచనలు సరైనవి కావని అర్థమవుతుంది. ప్రతీ అవతారము ఆయా కాలాలకి తగినటువంటి అవసరాలను నెరవేర్చడం కోసం దిగిరావడం జరిగిందని అర్థమవుతుంది.  అటువంటప్పుడు ఒక అవతారం గొప్పది, మరొక అవతారం తక్కువది ఎలా అవుతుంది? కేవలం అవసరాలు మాత్రమే ఎక్కువ, తక్కువ ఉంటాయి కానీ అవతారాల్లో ఎక్కువ-తక్కువ ఉండవు. .

ఈ సమాధానాన్ని కాస్త ధ్యానించి చూడండి. ఇటువంటి సమాధానాలు ఎవరు ఇవ్వగలరో శోధించి చూడండి.

 

ప్ర: సంస్థలో సభ్యుల సంఖ్య ఎందుకు పెరగాలనుకుంటున్నారు? ఆరుగురో-ఏడుగురో ఉంటే సరిపోదా?

బాబూజీ: చూడు నాయనా! నేను ఆనంతత్వం నుండి వచ్చాను, కాబట్టి నాలో అనంతత్వం యొక్క బీజం ఉంది. అలాగే నేనేం చేసినా సహజంగానే అనంతత్వం నాతోపాటు ఉండాలనుకుంటాను. అలాగే అందరికీ ఉండాలనుకుంటాను. చివరికి ఒక దొంగ కూడా తనతోపాటు చాలా మంది ఉండాలనుకుంటాడు. ఇది కూడా అతనిలో ఉన్న ఆ  అనంతత్వం యొక్క ప్రభావమే, కాకపోతే తప్పుడు దిశలో పని చేస్తోంది. మరో విషయం చెబుతున్నాను మీకు: భగవంతుని శక్తిని పాక్షికంగా వినియోగించకూడదు, సంపూర్ణంగా వినియోగించాలి. కానీ నేను అనేది ఉన్నంత వరకూ పూర్తి శక్తిని వినియోగించడం సాధ్యపడదు. కాబట్టి నేను అన్నది పోగొట్టుకోవాలి, అప్పుడే పూర్తి శక్తి వినియోగంలోకి వస్తుంది. కానీ దాన్ని అదుపులో ఉంచుతూ వినియోగించుకోవలసి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది.

కాస్త ధ్యానించి చూడండి ఈ సమాధానాన్ని.”ఆనంతత్వం నుండి వచ్చాను” అని ఎవరు అనగలరో శోధించి చూడండి.

ఇప్పుడొక చిన్ని కథ చెప్పుకుందాం, బాబూజీ స్వయంగా చెప్పిన కథ. పూజ్య బాబూజీ శతజయంత్యుత్సవాల సందర్భంగా, ఏప్రిల్ 30, 1999 న  వెలువడిన “ది బిలవెడ్ రిమెంబర్డ్” అనే పుస్తకంలో,  సోదరులు  ఎస్. ఎ. సర్నాడ్ జీ, వ్రాసిన బాబూజీ స్మృతి-వ్యాసంలో ఉటంకించిన కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం.

ఈ కథ ద్వారా శూన్యత్వం ఎంత  శక్తివంతమైనదో, శూన్యత్వం వ్యక్తిని ఎంత వినమ్ర వ్యక్తిగా మారుస్తుందో, బాబూజీ వ్యక్తిత్వం ఏ విధంగా అటువంటి మూర్తీభవించిన శూన్యత్వమో దర్శించే  ప్రయత్నం చేద్దాం.  

ఈ కథ యొక్క సందర్భం: సర్నాడ్ జీ ఒకసారి షాజహానుపూర్ లో బాబూజీ సాన్నిధ్యంలో ఉండగా, బాబూజీ ఇలా అన్నారట, “సర్నాడ్, నీకు తెలుసా, పార్థసారథి మన పద్ధతిని గురించి, నా గురించి, ఇంకా ఇతర విషయాల గురించి ఎన్నో పుస్తకాలు వ్రాశాడు. ఆ పుస్తకాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఎంతో జ్ఞానం ఉంది వాటిల్లో,  ఎంతో సమాచారం ఉంది, ఎంతో విద్య ఉంది; కానీ అలా వ్రాయడానికి అవసరమైన  జ్ఞానాన్నంతా నేనే ఇచ్చాననుకుంటున్నాడు అతను. ఇక్కడ  (తన హృదయాన్ని సూచిస్తూ) ఉన్నదంతా శూన్యమేనని అతనికి తెలియడం లేదు.  అంతా “ఠన్ ఠన్ గోపాలే” అంటూ ఒక కథను వినిపించారు. “ఠన్ ఠన్ గోపాల్” అంటే ఏమీ లేదని అర్థం. ఈ పదబంధాన్ని ఉత్తర భారతంలో ఏమీ లేదని చెప్పడానికి వినియోగిస్తూ ఉంటారు.

 ఒక సన్న్యాసుల  మఠం ఉండేది; అక్కడ ఒక మహాత్ముడి సమాధి ఉండేది; అక్కడే, ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధుడైన ఒక మహాత్ముడు కూడా ఉండేవాడు.

అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, ఆయన వద్దకు ఒక శిష్యుడు యేదో నేర్చుకుందామని వచ్చి, ఆయనతోపాటు కొంతకాలం ఉన్నాడు. అతని విద్యాభ్యాసం పూర్తయిన తరువాత వీడ్కోలు పలుకవలసిన రోజు వచ్చినప్పుడు, గురువు తన శిష్యుడికి ఒక గాడిదపిల్లను కానుకగా ఇవ్వడం జరిగింది. గురువు నుండి కానుకగా అందుకోవడం వల్ల, ఆ గాడిదపిల్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు శిష్యుడు. దురదృష్టవశాత్తు ఆ గాడిద పిల్ల దారిలో చనిపోతుంది. శిష్యుడు చాలా విచారంలో మునిగిపోతాడు; కడు దుఃఖానికి  గురవుతాడు. “నేను పాపాత్ముడిని! అందుకే ఇలా జరిగింది” అంటూ తనను తాను నిందించుకుంటూ దుఃఖిస్తాడు.  అలా ఎంత సేపని ఏడుస్తాడు? ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ గాడిదపిల్లను ఒక చెట్టు క్రింద గొయ్యి త్రవ్వి అక్కడ పూడుస్తాడు. ఆ చెట్టు క్రిందే నిద్రాహారాలు లేకుండా,  ఇక పట్టణంలోకి ప్రవేశించకుండా అక్కడే ఉండిపోతాడు. ఇలా కొంత కాలంగడిచింది.

ఆ దారిలో వెళ్తున్నవారందరూ ఈ శిష్యుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉండటం గమనించారు. అతనికి ఆకలి వేస్తుందని అక్కడ పండ్లుంచి వెళ్ళేవారు. శిష్యుడు కళ్ళు తెరిచినప్పుడు పండ్లు కనిపిస్తే సంతోషించి, నిజంగా బాగా ఆకలిగా ఉండటం వల్ల వాటిని తిని తన గురువుకు కృతజ్ఞతను వ్యక్తం చేసుకునేవాడు. ఆ తరువాతి రోజు కూడా అలాగే జరిగింది. కొద్ది రోజుల్లోనే అక్కడ భక్తులు పొడుగాటి క్యూలలో నిలబడి పండ్లు, డబ్బు అన్నీ సమర్పిస్తూ వచ్చారు. “ఇది చాలా బాగుందే! గురుదేవులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి” అనుకున్నాడు శిష్యుడు. కొన్ని నెలలలోనే ఆ గాడిదపిల్లను పాతిపెట్టిన చోట ఒక ఆలయనిర్మాణం జరిగిపోయింది. అది ఒక మఠంగా మారిపోయింది.  ఈ శిష్యుడు ఒక గురువైపోయాడు. అతని పేరు నలుదిశలా ప్రాకి ప్రసిద్ధుడైపోయాడు. ఎంత ప్రసిద్ధుడైపోయాడంటే, ఈ సమాచారం ఆతని గురువు దాకా వెళ్ళింది. ఆయన కూడా ఈతని పేరు-ప్రఖ్యాతుల గురించి వినడం జరిగింది. “నా శిష్యుడు నాకంటే ఎక్కువగా పేరు గడించడానికి గల కారణం ఏమిటో, ఏం చేశాడో, ఏమి చేస్తున్నాడో?” తెలుసుకుందా మని  సంకల్పించుకుంటాడు. అలా ఆ ముదుసలి గురువు తన శిష్యుని ఆశ్రమానికి వస్తే ఆయనను ప్రవేశించనీయకుండా ఆపేస్తారు; మరునాడు మాత్రమే కలిసే అవకాశం ఉందని ఆ ముదుసలి గురువుకు తెలియజేయడం జరుగుతుంది.

ఈ సమాచారం శిష్యునికి తెలుస్తుంది. “అయ్యో, ఆయన నా గురువు! ఆయనని అలా వేచి ఉండేలా చేయకూడదు” అనుకుంటూ పరుగెత్తుకొని వచ్చి, ఆయన పాదాలపై సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమని కోరతాడు. “క్షమించండి! మిమ్మల్ని వేచి ఉండేలా చేశాను. దానికి చాలా విచారిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి” అంటూ ప్రాధేయపడి, గురువుగారిని లోపలికి తీసుకువెళ్ళి సకల మర్యాదలు, సేవలు  చేస్తాడు. అప్పుడు నెమ్మదిగా ఆ గురువు తన శిష్యుడిని దగ్గరకు పిలిచి, “నీకు ఈ పేరు-ప్రసిద్ధులు రావడానికి కారణం ఏమిటి?” అని అడుగుతాడు.

దానికి ఆ శిష్యుడు, “అయ్యా, నన్ను మీరు క్షమించాలి, మీరు బహూకరించిన కానుకను పోగొట్టుకున్నాను. మీరు నన్ను క్షమించాలి” అని పశ్చాత్తాపపడుతూ వేడుకుంటాడు. “మీ అనుగ్రహం చేతనే ఈ పేరు-ప్రఖ్యాతులొచ్చాయి. మీరిచ్చిన కానుక వల్లే; అది చనిపోతే ఇక్కడ పాతిపెట్టాను; దానిపై ఈ మఠాన్ని నిర్మించడం జరిగింది. అందుకే ఇదంతా జరుగుతోంది” అన్నాడు.

అప్పుడు గురువు ఎంతో దయతో, “బాధపడకు నాయనా! ఇందులో విచారించవలసినదేమీ లేదు. నా మఠంలో ఏముందనుకుంటున్నావు? ఈ గాడిద పిల్ల, తల్లే అక్కడ ఉన్నది” అన్నాడట.

ఈ కథ ద్వారా బాబూజీ చాలా సూక్ష్మంగా తనకుతాను ఎటువంటి  ప్రాముఖ్యతనూ ఆపాదించుకోకుండా, ఎలాగైతే ఈ కథలో ఆ గురుశిష్యులు ప్రసిద్ధి పొందడంలో నిజానికి ఆధారం గాడిద పిల్ల తప్ప మరేదీ  లేదో, అలాగే చారీజీ వ్రాసిన వ్రాతలు బాబూజీకి ఆపాదించడంలో కూడా ఏ కారణమూ లేదని చెప్తున్నారు. సరిగ్గా ఇలాంటి చోటే మహాపురుషులందరూ కూడా తమ  నిజతత్త్వమైన  ఆ శూన్యత్వాన్ని వెల్లడి చేస్తూనే దాటేస్తూ ఉంటారు. మనం దర్శించవలసింది ఇదే. ఈ విధంగా మనకు ఈ కథ ద్వారా బాబూజీని మూర్తీభవించిన శూన్యత్వంగా దర్శించవచ్చు. మనందరమూ ఆ దిశగా ప్రయాణించే ప్రేరణ పొందవచ్చు.

(సేకరణ –పై వాక్యాలు, ప్రశ్నలు-జవాబులు, పూజ్య చారీజీ వ్రాసిన యాత్ర అనే ఆంగ్ల గ్రంథం నుండి సేకరించినవి, పైన చెప్పుకున్న కథ  ది బిలవెడ్ రిమెంబర్డ్ ఏప్రిల్ 30, 1999, సోదరులు సర్నాడ్ జీ, గుల్బర్గా , పేజీ 308 లోనిది )

అందరికీ మరోసారి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అభ్యాసులందరికీ ప్రత్యేక ఆధ్యాత్మికాభినందనలు. పూజ్య  దాజీ ఆదేశానుసారం, బాబూజీ దివ్యస్మరణలో మనం ఈ సంవత్సరమంతా ప్రత్యేకంగా గడిపే ప్రయత్నం చేద్దాం. 

2024 - బాబూజీ 125 వ జయంత్యుత్సవం


పరమపూజ్య శ్రీరామచంద్రజీ (బాబూజీ), వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీరామచంద్ర మిషన్

2024 - బాబూజీ 125 వ జయంత్యుత్సవం 
పరమ పూజ్య బాబూజీ మహారాజ్ 125 వ జయంత్యుత్సవం, పూజ్య గురుదేవులు దాజీ ఆదేశానుసారం మనం ఈ సంవత్సరం అంతా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఇటువంటి స్పెషల్ పర్సనాలిటీని గురించి, అర్థం చేసుకోవడం దుస్సాధ్యమే అయినా, గురుకృపాతో,  కొంచెం-కొంచెంగా సాధ్యమైనంత వరకూ ప్రతి రోజూ ఈ చిన్ని-చిన్ని వ్యాసాల ద్వారా ప్రత్యేకంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం.

మొట్టమొదటగా పైన చిత్రంలో ఉన్న పూజ్య బాబూజీ మహారాజ్ను చూస్తూ, వారిని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మనకు కలిగిన అనుభవాన్ని ఎవరికి వారు వ్రాసుకునే ప్రయత్నం చేద్దాం.  






 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...