6, నవంబర్ 2025, గురువారం

అస్థిత్వానికి సంబంధించిన ప్రశ్నలు

 


అస్థిత్వానికి  సంబంధించిన  ప్రశ్నలు 
Existential Questions

అస్థిత్వం అంటే మన ఉనికికి సంబంధించిన ప్రశ్నలన్నమాట. ప్రతి వ్యక్తిలో, ప్రతి ఆత్మలో సహజ సిద్ధంగా కలిగే ప్రశ్నలు; మనలోని జిజ్ఞాసకు నిదర్శనాలు; మనలో స్వతః సిద్ధంగా ఉండే తపన వల్ల కలిగే ప్రశ్నలు. ప్రతీ వ్యక్తికీ యేదొక దశలో సమాధానాలు దొరికే వరకూ వేధిస్తూ ఉంటాయి. అలాగే మన దృక్పథాన్ని విస్తృతం చేస్తాయి కూడా. చేతనను విస్తృతపరుస్తాయి. అవగాహన పెంచుతాయి. ఈ ప్రశ్నలే మనిషిని ఆధ్యాత్మికతకు దారి తీస్తాయి. ఈ ప్రశ్నలకు విశ్వజనీనంగా అందరూ అంగీకరించగలిగే సమాధానాలేవీ ఉండవు. ఎవరికి వారు తమ సమాధానాలు వారే శోధించి ఆత్మ బోధ ద్వారా తెలుసుకోవలసినదే. శాస్త్రాలు, గురువులు, మహాత్ములు వారి-వారి అనుభవ జ్ఞానం ద్వారా తెలుసుకున్నవి అందించి సహకరించగలరే గాని, నిజమైన సమాధానాలు అంతరంగంలో నుండి రావలసినదే. దీనికి ప్రతీ ఆత్మ స్వీయ మననం ద్వారా తపిస్తూ శ్రమించవలసినదే. దైవాన్వేషణ  లేక సత్యాన్వేషణ అంటే ఇదే. సత్యాన్వేషణలో కలిగే ప్రశ్నలు  ఇవే. ఈ ప్రశ్నలకు సమాధానాలు రానిదే ఆత్మకు నిద్ర పట్టదు. అస్సలు నిద్ర పట్టని ఆత్మలు మహాత్ములవుతారు. సాగటౌ మనిషిలో కూడా ఈ ప్రశ్నలుంటాయి గాని వీటికి ప్రాధాన్యతనివ్వడు. సంసార సాగరంలో పడిపోవడం మూలాన వీటి ప్రాధాన్యత అడుగుకి వెళ్ళిపోతూ ఉంటుంది. గురువు వచ్చి తట్టి లేపే వరకూ ప్రాధాన్యతలోకి రాదు. ఆ విధంగా మేల్కొన్న వ్యక్తి ఆధ్యాత్మిక సాధకుడవుతాడు. జీవిత పరమార్థం ఇదేనని తెలుసుకుంటాడు. 

సాధారణంగా కలిగే కొన్ని ప్రశ్నలు:
జీవితం యొక్క అర్థం ఏమిటి? ప్రయోజనం యేమైనా ఉందా?
మనుషులు కష్టాలెందుకు పడాలి? వాటి ప్రాముఖ్యత ఏమిటి?
మనం ఎందుకు పుట్టాం? ఎందుకు చనిపోతాం? పుట్టుకకు, చనిపోవడానికి మధ్య మనిషి యేమి చెయ్యాలి? లేక చనిపోయే వరకూ బ్రతకవలసిందేనా? యేమైనా ప్రయోజనం ఉందా? చనిపోయిన తరువాత ఏమవుతుంది? మనం ఎక్కడి నుండి వచ్చాం? అసలు 'నేను' అంటే ఎవరు?

ఈ ప్రశ్నలకు పరిష్కారం 
వీటికి ప్రతి మనిషి తర్కపరంగా సమాధానాలు వెతుక్కున్నప్పటికీ, నిజమైన పరిష్కారం అనుభవపరంగా తెలుసుకోవలసినదే; దాన్నే మనం ఆత్మ సాక్షాత్కారం లేక దైవ సాక్షాత్కారం అంటూంటాం.  

2 కామెంట్‌లు:

  1. చక్కగా చెప్పారు కృష్ణ ! నాకనిపిస్తూ ఉంటుంది, ఈ ప్రశ్నలు మనలో కలిగే అంతవరకు మనం మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటుందని. ఈ ప్రశ్నలు కలగనంతవరకు, మనం ఈ జీవితం అంటే ఏమిటిఅర్థం కాక అలాగే చదువు లేదా పని, తర్వాత వివాహం, పిలల్లు, సంపాదన ఇంతే అనుకుంటాం. ఇటువంటి మీరు చెప్పిన ప్రశ్నలు కలగడమే ఒక విధమైన పరిపక్వత చెందిన తర్వాతే జరుగుతుందేమో !!
    మంచి అంశాన్ని ఇక్కడ ఎంచుకున్నారు.

    రిప్లయితొలగించండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...