భౌతిక హృదయం ప్రతి ఒక్కరికీ సాధారణంగా ఛాతీకి ఎడమ భాగంలో ఉండే శరీర అవయవం. వేల మందిలో యే ఒక్కరికో ఛాతీకి కుడి భాగంలో ఉంటుంది. ఇది భౌతిక జీవనానికి ఆధారం. ఊపిరి తిత్తుల ద్వారా శుద్ధం చేసిన రక్తాన్ని, పోషక పదార్థాలను శరీరానికి నలు మూలలా సరఫరా చేస్తుంది. ఉద్వేగాలకు పుట్టిల్లు. భౌతిక హృదయం మనిషిలో కలిగే ఉద్వేగాలకు, ఒత్తిళ్ళకు, హార్మోన్లకు ప్రభావితమవుతూ ఉంటుంది.
ఆధ్యాత్మిక హృదయం శరీర అవయవం కాదు. కంటికి కనిపించదు. కానీ అనుభూతి చెందవచ్చు. ఆధ్యాత్మిక హృదయం ఆత్మకు నివాసం; మనిషి చేతనానికి, అనుభూతులకు కేంద్రం; మనం ధ్యానంలో దివ్యవెలుగును అనుభూతి చెందేది ఇక్కడే; మానవీయత, దివ్యత్వాల కలయిక జరిగే చోటు. ఆధ్యాత్మిక చేతనం ఉండేది ఇక్కడే; ఛాతీకి కొంచెం కుడి ప్రక్కగా ఉంటుందని గువులు చెప్తారు.
ఉద్వేగాలన్నీ అనుభూతి చెందేది భౌతిక హృదయంలోనే అయినప్పటికీ, అవి ఉద్భవించేది ఆధ్యాత్మిక హృదయంలో. మన కర్మల వల్ల, మన సంకల్పాల వల్ల, మన ఆలోచనా ప్రక్రియల ఫలితంగా ఈ ఉద్వేగాలు కలుగుటూ ఉంటాయి.
ఆధ్యాత్మిక హృదయ శుద్ధి జరిగినప్పుడు భౌతిక హృదయం ఆరోగ్యంగా తేలికగా ఉంటుంది. హృదయంపై ధ్యానం చేయడం వల్ల శాంతి, ఆలోచనలోనూ, అవగాహణలోనూ స్పష్టత, ఉద్వేగాల్లో సమతౌల్యత, చైతన్య విస్తరణ జరుగుతుంది.
భౌతిక హృదయం శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది; ఆధ్యాత్మిక హృదయం జీవుడిని సజీవంగా ఉంచుతుంది. భౌతిక హృదయం రక్తాన్ని సరఫరా చేస్తే, ఆధ్యాత్మిక హృదయం శాంతిని, ప్రేమను, ఉన్నత చేతనాన్ని సరఫరా చేస్తుంది.


చక్కగా సంక్షిప్తంగా చెప్పారు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకుంటున్నది.
రిప్లయితొలగించండి