23, డిసెంబర్ 2023, శనివారం

గీతా ధ్యానం - విశ్వరూప దర్శనం

 


గీతా ధ్యానం - విశ్వరూప దర్శనం 
ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ పవిత్ర దినాన భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు, 11 వ అధ్యాయంలోని విశ్వరూప దర్శనం గురించి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. 
భగవద్గీతలో చాలా ఆసక్తికరమైన అధ్యాయం ఈ విశ్వరూప దర్శనం. 10 వ అధ్యాయంలో భగవానుడు తనను అన్నిటా దర్శించడాన్ని గురించి తెలియజేయడం జరిగింది. 11 వ అధ్యాయంలో అన్నిటినీ తనలో దర్శింపజేయడం జరిగింది. అదే విశ్వరూపదర్శనం. ఈ శ్లోకాలు, దాని అర్థము ఏ  మహానుభావుని నోటైనా వింటూంటే (చదవటం కంటే కూడా) అనేక అద్భుతమైన పదాలు వినిపిస్తాయి, ఆ విశ్వరూపాన్ని (వర్ణించలేనిదాన్ని) వర్ణిస్తూ. ఒక్క పదాన్ని అందులో నుండి తీసేసినా వికారంగా తయారవుతుంది, ఒక్క పదం జోడించినా భంగం వాటిల్లుతుంది. అంత అత్యద్భుతంగా వేదవ్యాస మహర్షి పదాల కూర్పును చేయడం జరిగింది. 
అసలు విశ్వరూపం దర్శించవలసిన కోరిక ఎందుకు కలిగింది ఆర్జనుడికి?
ఒక్కటే తత్త్వం అనేకంలో ఎలా ఉన్నదో భగవానుడు అనేక ఉదాహరణాలతో చెప్పడం జరిగింది - జంతువులలో వృషభాన్ని నేనని, సూర్యునిలో కాంతిని నేనని, వజ్రంలో ఉన్న మెరుపును నేనని, అందమైన వాటిల్లో అందాన్ని నేనని, బుద్ధిలో తెలివిని నేనని - ఇలా అనేకరకాలుగా అన్నిటిల్లోనూ తానే హృదయమై యున్నాడన్న తత్త్వాన్ని  భగవానుడు చెప్పడం, అర్జునుడు తెలుసుకోవడం జరుగుతుంది. దీన్నే భక్తి యోగం అంటారు. ఇప్పుడు ఆర్జనుడు, ఒక విద్యార్థిగా, ఈ అనేకాన్ని ఒక్కటిలో దర్శించాలనుకుంటున్నాడు; దీన్నే యోగం అంటారు. మనిషి తన సృష్టిని, (అంటే కోరికలను, సంస్కారాలను, అహంకారాన్ని) అధిగమించి, వాటిని దాటి ఆ పరతతత్వంలో లయమవడమే యోగం. అటువంటి యోగస్థితిని దర్శించాలనుకున్నాడు. 
ఏవమేతద్యా తాత్థ త్వమాత్మానాం  పరమేశ్వర | 
ద్రష్టు మిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ || 11:3 || 
ఓ పరమేశ్వరా! నీ గురించి నువ్వు చెప్పినదంతా సత్యమే. పురుషోత్తమా! ఈశ్వరునికి సంబంధించిన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నాకు కోరికగా ఉన్నది. 
విశ్వరూపాన్ని దర్శించాలంటే ఎలా?
 శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన విశ్వరూప దర్శనం, ఈ  మాంసపు కళ్ళతో చూసేది  కాదు. దానికి దివ్య చక్షువులు, హృదయ చక్షువులు అవసరం. ఆకాశ కాలాలకి అతీతమైన, ఈ విశ్వరూప సందర్చనానికి, అందరూ అర్హులు కారు. కేవలం అనన్య భక్తితో చేసే సేవల ద్వారా మాత్రమే నన్ను అర్థం చేసుకునేందుకు శక్యమవుతుంది.  నీకు ముందు ఎవ్వరూ దర్శించలేదు; వేదాది శృతి శాస్త్రాలు చదివినా, తపోయాగాదులు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పవిత్ర కార్యాలు ఒనర్చినా, నా ఈ రూపాన్ని,  నన్ను యథాతథంగా ఎప్పుడూ ఎవ్వరూ ఇంతవరకూ చూడలేదు. 
 న తు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః  పశ్యమే యోగమైశ్వరం || 11: 8 ||
నీకున్న కళ్ళతో ఈ విశ్వరూపాన్ని దర్శించలేవు. నీకు దివ్య చక్షువులు ప్రసాదిస్తున్నాను; వాటితో నా విశ్వరూపాన్ని దర్శించు. 
ఆర్జనుడు దర్శించిన విశ్వరూపం ఎలా ఉంది?
ఈ సృష్టిలో ఉండే వస్తువులను (మనుషులను, పశుపక్షాదులను, చరాచర వస్తువులను) విడదీసేది యేది? ఆ మధ్యలో ఉన్న ఆకాశం, లేక ఖాళీ. ఈ  ఖాళీని గనుక యేదో విధంగా తీసేసినట్లయితే సర్వమూ ఒక్క దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో అదే విశ్వరూపం అని ఒక మహాత్ముడు గొప్పగా తెలియజేశాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పినట్లుగా, దివ్య చక్షువులతో గాని ఆయన విశ్వరూపాన్ని దర్శింప శక్యం  కాదు. అలాగే అనన్య భక్తితో సేవించే ఆర్జనుడిలాంటి వాడికి తప్ప ఈ విశ్వరూప దర్శన యోగం ఉండదేమో! 
ఈ విశ్వరూపం ఎలా ఉంటుందో 11 వ అధ్యాయంలో అనేక శ్లోకాల్లో వివరించడం జరిగింది. మచ్చుకు ఇక్కడ రెండు శ్లోకాలు చెప్పుకుందాం:
అనేక వ్యక్తరనయనం అనేకాద్భుత దర్శనం |
అనేక దివ్యాభరణం దివ్యానేకో ద్యతాయుధం || 11:10 ||
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం |
సర్వాశ్చర్యమయం దేవమనంతం విషవతోముఖం || 11:11 ||
ఆ విశ్వరూపం అనేక ముఖాలతో, అనేక నేత్రాలతో, అనేక అద్భుతాలతో, అనేక దివ్య ఆభరణాలతో, అనేక ఎక్కుపెట్టిన దివ్యాయుధాలతో, దివ్య పుష్ప వస్త్రంతో, దివ్య గంధాలతో, మహా ఆశ్చర్యకరంగా, దేదీప్యమానంగా అనంతం విశ్వతోముఖమై విరాజిల్లుతూ ఉంది. 






22, డిసెంబర్ 2023, శుక్రవారం

గీతా ధ్యానం - స్వధర్మం



గీతా ధ్యానం - స్వధర్మం 

భగవద్గీతలోని అనేక అద్భుత అంశాలలో మనిషి జీవితానికి ఉపయోగపడే అనేక అంశాలలో స్వధర్మం ఒకటి. శ్రీకృష్ణ భగవానుడు పలికిన ఈ పదాన్ని భాష్యకారులు అనేక విధాలుగా వివరించడం జరిగింది. కానీ బహుశా ఒక సజీవ మార్గదర్శనం ద్వారా మాత్రమే సరిగ్గా బోధపడే అవకాశం ఉందనిపిస్తున్నది. 

ఈ మధ్యనే పూజ్య బాబూజీ, పూజ్య దాజీకి వెల్లడించిన 7 శ్లోకాల్లో ఇది 7 వ శ్లోకం. మహాభారత యుద్ధం ఇంకా ప్రారంభించక ముందు ఆర్జనుడు విషాదంలో మునిగిపోయి ఉన్నప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు కేవలం 7 శ్లోకాలు పలకడం ద్వారా మాత్రమే ఆర్జనుడిని ఉత్తిష్ఠుడిని చేశాడని, తక్కిన శ్లోకాల సారాంశాన్ని ప్రాణాహుతి ద్వారా ప్రసరించడం జరిగిందని, ఆ సారాన్ని తక్కిన శ్లోకాల్లో వేదవ్యాస మహర్షి అందులోని అంశాలను తగిన విధంగా తర్జుమా చేయడం జరిగిందని బాబూజీ వెల్లడించడం జరిగిందని పూజ్య దాజీ చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమైన 7 శ్లోకాల్లో స్వధర్మాన్ని గురించి ఒక శ్లోకం ఉండటం, దీనికున్న ప్రాధాన్యతను సూచిస్తున్నది. ఈ శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది:

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో  భయావయః ||3:35||

పరధర్మాన్ని ఎంత బాగా నిర్వతిమచ్చినప్పటికీ గుణము లేనిదైనా స్వధర్మమే మేలు; పరాధర్మాన్ని నిర్వహించడం కంటే స్వధర్మం ఆచరిస్తూ మృత్యువు సంభవించినా మంచిదే. 

అసలు స్వధర్మం అంటే ఏమిటి?

పూజ్య చారీజీని అసలు స్వధర్మం అంటే ఏమిటని అడిగినప్పుడు, వికాసం అని సమాధానమిచ్చారు. ప్రతీ ఆత్మ యొక్క స్వధర్మం నిజానికి వికాసమేనన్నారు. ప్రతీ ఆత్మ వికాసం కోసమే తపిస్తున్నది. ఆ పనిలో ఉండటమే ఆత్మ యొక్క నిజమైన స్వధర్మం. 

ఆత్మ స్థాయి నుండి క్రిందకి వస్తే, తన సంస్కారాలను బట్టి, వివిధ పరిస్థితుల్లో, వివిధ వాతావరణాల్లో ఆత్మ జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆత్మ తన వికాసానికి అనువైన వాతావరణాన్ని, పరిస్థితులను, తనకు అనుకూలమైన తల్లి గర్భాన్ని కూడా తానే ఎన్నుకుందన్నమాట. తాను ఎన్నుకున్న ధర్మమే భూమ్మీదఉన్నంత వరకూ ఆత్మ తన వికాసానికి వినియోగించవలసిన స్వధర్మం. దానిని అనుసరించే మనుగడను సాగించవలసి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మార్గం ప్రత్యేకమైనది. సామూహికంగా అనుసరించే మార్గం ఒక్కటే అయినప్పటికీ, ప్రతి ఒక్కరి మార్గం చాలా ప్రత్యేకమైనది. ఎవరికి వారు, గురుదేవుల సహకారంతో అనుసరించవలసినది. 

మన స్వధర్మం ఏమిటో ఎలా తెలుస్తుంది?

సర్వమూ మన హృదయానికి తెలుసు. అందుకే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై ప్రశ్నించుకోవలసిన అవసరం. హృదయం నుండి ఈ విషయమై కలిగిన ప్రేరణలే మన స్వధర్మాన్ని తెలియజేస్తాయి. ఇది స్పష్టంగా తెలియడానికే ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరం. 

మనకర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆత్మ వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే స్వధర్మం. ఇతరుల ధర్మంతో పోల్చుకోవడం వల్ల అనార్థాలే జరుగుతాయి.  






-                                                  

21, డిసెంబర్ 2023, గురువారం

గీతా ధ్యానం - ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు

 


గీతా ధ్యానం - ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు 

శ్రీకృష్ణ భగవానుడు ఈ క్రింది శ్లోకాల ద్వారా ఈశ్వరుడు,  సర్వభూతానాం అంటే,    సర్వభూతముల యందు, సర్వస్య చాహం హృది అంటే  అందరి హృదయంలోనూ, స్థితమై యున్నాను, అని సుస్పష్టం చేయడం జరిగింది. 

అహమాత్మా గుఢాకేశా సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత యేవ  చ ||10:20||

సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిజ్ఞానమాపోహనం చ|
వేదాయిశ్చ సర్వైరహమేవ వేదయో వేదాంతకృద్వేవవిదేవ చాహం||15:15||

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ।। 18:61 ।।

హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ ధ్యాన పద్ధతిలో అందుకే పూజ్య బాబూజీ మహారాజ్ హృదయంపై ధ్యానించమని సూచించినది. కేవలం హృదయంపై ధ్యానించడం ద్వారా మాత్రమే ఈశ్వరానుభూతి కలిగేది, సర్వప్రాణులతో ఉన్న సంబంధాన్ని గుర్తించగలిగేది, సాక్షాత్కరించుకోగలిగేది, అన్ని రకాల నిజమైన జ్ఞానం పొందగలిగేది, చివరికి ఆయనలో లయం కాగలిగేది, జీవితం తరింపజేసుకోగలిగేది. ఇక ఎక్కడ ధ్యానించాలన్న ప్రశ్న సాధకునిలో ఉండవలసిన అవసరం లేదు. 

20, డిసెంబర్ 2023, బుధవారం

గీతా ధ్యానం - విజయానికి తారకమంత్రం

 


గీతా ధ్యానం - విజయానికి తారకమంత్రం 
(Success Mantra)
గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు, విజయానికి తారక మంత్రం ఈ క్రింది శ్లోకాల్లో సూచించడం జరిగింది. శ్రావణ, మనన, నిధిధ్యాసన చేసే ప్రయత్నం చేద్దాం:

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ||18-78 ||


ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపదఐశ్వర్యంవిజయందృఢమైన నీతి ఉంటాయని నా ఆభిప్రాయం.



సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || 18-66 ||


అన్ని రకాల ధర్మాలనూ విడిచిపెట్టి, కేవలం నన్నే శరణు వేడు; నీ యొక్క సర్వపాపాలనుండీ  నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను.


పై రెండు శ్లోకాల్లో శ్రీ కృష్ణ భగవానుడు మనం చేసే యే ప్రయత్నంలోనైనా విజయం సాధించాలంటే మనం అవలంబించవలసిన మార్గాలను సూచించడం జరిగింది. మానవ ప్రయత్నము, శరణాగతి, భగవంతుని కృప - ఈ  మూడు మనం సాధన ద్వారా అలవరచుకున్నట్లయితే విజయానికి చేరువవుతాము. 


మొదటి శ్లోకంలో, ఆర్జనుడు మానవ ప్రయత్నానికి ప్రతీక, శ్రీకృష్ణ భగవానుడు భగవత్కృపకు ప్రతీక. ఎక్కడ ఈ రెండూ ఉంటాయో అక్కడ విజయం తథ్యం అని అర్థం. రెండూ అవసరం; కేవలం ప్రయత్నం ఉన్నా ప్రయోజనం లేదు; కేవలం భగవత్కృప ఉన్నా సరిపడదు; రెండూ అవసరమే. అందుకే మన జీవితాన్ని భగవత్కృపను ఆకర్షించే విధంగా మలచుకోవడం అవసరం; ఇది సరైన వైఖరులతో కూడిన, హృదయపూర్వకమైన నిష్ఠతో చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా సుసాధ్యమవుతుంది. ధ్యానం వల్ల మనసు క్రమశిక్షణలో పెట్టగలుగుతాం; మనసునే దాటి అతీతంగా ఉన్న ఉన్నత స్థితులకు వెళ్ళగలుగుతాం; హృదయం విశాలమై చైతన్య వికాసం జరగటాన్ని అనుభూతి చెందుతాం; శుద్ధీకరణ ప్రక్రియ వల్ల గతం నుండి విడుదలవుతాం; ధ్యానలోలోతుల్లోకి తేలికగా వెళ్ళగలుగుతాం; ప్రార్థన ద్వారా ఉన్నదున్నట్లుగా ఉండటం, వినమ్రత పెరగడం, అహంకారం తగ్గడం, స్వార్థం తగ్గడం, కోరికలు తగ్గడం, అప్రయత్నంగా శరణాగతి భావం అలవడటం జరుగుతాయి; ఉదయం నుండి సాయంత్రం వరకూ మన దశనియమాలను అనుసరిస్తూ జీవించడం ప్రయత్నించినప్పుడు, మన హృదయం దైవ కృపను అత్యధికంగా ఆకర్షించడం జరుగుతుంది. అటువంటి స్థితిలో చేసే ప్రయత్నాలు తప్పక సిద్ధిస్తాయి. 


పైన చెప్పిన రెండవ శ్లోకంలో సమస్త శాస్త్రాల మర్మాలు, వివిధ ధర్మాలు, వాటిల్లోని సూక్ష్మాలు ఇవన్నీ అర్థం చేసుకోనవసరం లేదు, అవన్నీ విడిచిపెట్టేసి, కేవలం అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మను శరణు వేడితే చాలు, సమర్పణ భావంతో ఉంటే చాలు, ఆ పరమాత్మే మనలోని సమస్త దోషాల నుండి విముక్తినివ్వడం జరుగుతుందని ఈ శ్లోకం చెబుతున్నది. 


ఇలా శ్రీకృష్ణ భగవానుడు ప్రతీ శ్లోకంలోనూ కర్తవ్యబోధను చేస్తున్నారు. 

కృష్ణ వందే జగద్గురుం.




19, డిసెంబర్ 2023, మంగళవారం

గీతా ధ్యానం - కర్మలంటకుండా జీవించడం


గీతా ధ్యానం - కర్మలంటకుండా జీవించడం 

సుఖదుఃఖే సమే కృత్వా లాభ అలాభౌ జయ అజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 2: 38 ।। 

సుఖ-దుఃఖాలను, లాభ-నష్టాలను, జయాపజయాలను సమానంగా గ్రహిస్తూ, కర్తవ్య దీక్షతో యుద్ధం చెయ్యి. బాధ్యతలను ఈ విధంగా నిర్వర్తించటం వల్ల ఎన్నటికీ పాపం అంటదు.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ।। 5:10 ।।

సమస్త మమకారాసక్తులు త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసే సాధకుడు, తామరాకు నీటిలో ఉంటూ కూడా తడి అంటకుండా ఉన్నట్లుగా, సాధకుడు కూడా పాపముచే తాకబడకుండా జీవించగలుగుతాడు. 

ఇక్కడ పాపం అంటే ద్వంద్వాలు. ఈ ప్రపంచంలోని ద్వంద్వాలను సమదృష్టితో చూడగలిగే స్థితి, హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ ధ్యానం వల్ల, స్వల్ప కాలంలోనే కలిగే అవకాశం ఉంది. సహజమార్గ ఆధ్యాత్మిక యాత్రలోని మొదటి 5 గ్రంథులను/చక్రాలు, దీనినే హృదయ క్షేత్రం అని కూడా అంటారు; ఈ హృదయ క్షేత్ర శుద్ధి జరిగినప్పుడు, ఈ ద్వంద్వాలచే, అంటే కర్మలచే/వాసనలచే/సంస్కారాలచే అంటకుండా మానవుడు ఈ ప్రపంచంలో జీవించగలుగుతాడు. దానర్థం, కర్మలు చేయకుండా ఉండమని కాదు; కర్మలను ధ్యాన స్థితిలో, దివ్యస్మరణలో చేస్తూ ఉన్నప్పుడు సంస్కారాల ప్రభావం మనపై ఉండదని అర్థం. 
అలాగే ఈ హృదయక్షేత్ర శుద్ది జరుగుతున్నప్పుడు, మనిషి తన మమకారాలను-ఆసక్తులను, భగవంతునికే తన సమస్త కర్మలను అర్పించి జీవించే పరిస్థితి ఏర్పడి, తామరాకు నీటిలో ఉంటూ కూడా తడి అంటకుండా ఎలా ఉంటుందో, అదే విధంగా, సాధకుడు కూడా ఈ ప్రపంచంలోని మాయ తనను అంటకుండా మనుగడను సాధించగలుగుతాడు. అంటే, ప్రపంచంలో తానుంటాడు గాని, తనలో ప్రపంచం ఉండదన్నమాట. 


18, డిసెంబర్ 2023, సోమవారం

గీతా ధ్యానం - ధ్యాన శ్లోకాలు

 



(గీతా ధ్యాన శ్లోకం )
గీతా ధ్యానం - ధ్యానశ్లోకాలు 
గీతా ధ్యానం అనే భగవద్గీత శ్లోకవాహినిలో మనం కొన్ని ప్రధాన శ్లోకాల భావాన్ని, తత్త్వాన్ని అర్థం చేసుకుని, మననం చేసుకుని, ఆపై మనకర్థమైన భావంపై ధ్యానించే  ప్రయత్నం చేద్దాం. 
ముందుగా గీతాచార్యుడైన ఆ శ్రీకృష్ణ భగవానుని, గ్రంథకర్తయైన వ్యాసభగవానుని,    స్మరిస్తూ గీతా ధ్యాన శ్లోకాలను కొన్నిటిని మననం చేద్దాం. 
గీతా ధ్యాన శ్లోకం 1 
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం |
వ్యాసేన గ్రధితాం పురాణ మునినాం మధ్యే మహాభారతం| 
అద్వైతామృత వర్షిణీమ్  భగవతీం అష్టాదశాధ్యాయినీమ్| 
అంబ త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీమ్. ||

వ్యాస భగవానుడిచే రచింపబడిన మహాభారత ఇతిహాస, మధ్యలో, నారాయణుడే స్వయంగా, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడికి ఉపదేశించినదే భగవద్గీత. అద్వైతామృత వర్షాన్ని కురిపించే దివ్య మాతా, పద్దెనిమిది అధ్యాయాలకు తల్లీ,  భగవద్గీతా, సంసారంలోని  మాయను నాశనం చేసే  గీతామాతా, నేను నీపై ధ్యానిస్తున్నాను.  

 గీతా ధ్యాన శ్లోకం 2 
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయతపత్ర నేత్ర |
యేన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్జ్వాలితో జ్ఞానమయ ప్రదీపః||
 
విశాల బుద్ధి గల, తామర రేకుల వంటి కనులుగలిగిన వ వ్యాస మహర్షీ, నీకు నమస్సులు. నీ ద్వారా భారతం అనే తైలంతో గీత అనే జ్ఞానం అనే దీపం ప్రజ్వలితం అయ్యింది. 

 గీతా ధ్యాన శ్లోకం 3 
సర్వోపనిషదో గావః దోగ్ధాః గోపాల నందనః |
పార్థో వత్సః  సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ || 

ఉపనిషత్తులన్నీ గోవులైతే, పాలు పితికేవాడు గోపాలనందనుడైతే, పార్థుడు ఆవు దూడయితే  గోక్షీరమనే గీతామృతాన్ని శుద్ధ మనస్కులు ఆస్వాదిస్తున్నారు.  

13, డిసెంబర్ 2023, బుధవారం

గీతా జయంతి - శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడి ముఖము నుండి వెలువడిన రోజు

 


గీతా జయంతి 
(శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడి ముఖము నుండి వెలువడిన రోజు)
సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం, ద్వాపరాయుగాంత సమయంలో,  పాండవులకు, కౌరవులకు మధ్య భీకర సంగ్రామ ప్రారంభించక ముందు, కురుక్షేత్ర యుద్ధభూమిలో, ఇరుసైన్యములు యుద్ధానికి సన్నద్ధులైన ఉన్న సమయంలో, ఆర్జనుడు విషాదంలో మునిగిపోయి, విరక్తితో కూడిన మనసుతో అధైర్యమునకు లోనై యుద్ధం విరమించుకుందామనుకున్న క్షణాన, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని యుద్ధానికి ఉపక్రమించేలా చేయడానికి, కర్తవ్య బోధను చేసిన అద్భుత క్షణం ఈ క్షణం. ఈ క్షణాన్నే, శ్రీకృష్ణ భగవానుని నోటి ద్వారా గీతామృతం పెల్లుబికిన రోజు; ప్రతి సంవత్సరమూ, మార్గశిర మాస శుద్ధ ఏకాదశి నాడు భారతదేశమంతా, ఇప్పుడు ప్రపంచమంతా, అన్నీ దేశాలలోనూ ఉన్న గీతా ప్రేమికులందరూ గీతా జయంతిగా, ఈ రోజున, గీతను, గీతాచార్యుడిని ప్రత్యేకంగా స్మరిస్తూ  ఒక ఉత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం గీతాజయంతిని డిశంబరు 22, 2023 న జరుపుకోబోతున్నాం. 
ఆర్జనుడి మనసులో  అలముకున్న అంధకారాన్ని తొలగించి, యుద్ధానికి ఉపక్రమించేలా ఉత్తిష్ఠుడిని  చేయడానికి ఈ బోధను చేయవలసి వచ్చింది. అదే ఈనాడు ఒక దిక్సూచిగా  మానవాళికి మార్గదర్శనం చేస్తూ ఉన్నది. ప్రతీ మానవుడు జీవితం అనే కురుక్షేత్రంలో ఇరుక్కుపోయి, మంచి-చెడుల మధ్య నలిగిపోతూ, చిత్తభ్రమలకు, భ్రాంతులకు లోనవుతూ, సరైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతూ, మనశ్శాంతి లేకుండా, అల్లకల్లోలంగా మారిన మనసుతో, నిరాశ-నిస్పృహలతో జీవన గమనాన్ని సక్రమంగా సాగించలేని స్థితిలో మనిషిని ఆదుకునేది ఈ గీతబోధ. 
ఇటువంటి భగవద్గీతా జయంతి ఎవరికి వారు తమకు తోచిన విధంగా ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత కృతజ్ఞతా భావంతో, భక్తితో, ప్రేమతో, సమర్పణ భావంతో, ఈ గీతాధ్యయనం చేసి గీతా సారాన్ని, గీతా హృదయాన్ని దర్శించడమే గాక, మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయి, అడుగడుగునా మార్గదర్శనం చేసే విధంగా,  ప్రయత్నలోపం లేకుండా తగిన కృషి చేయవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. గీతా దర్శనం వల్ల జీవిత పరమార్థం, కర్తవ్య బోధ, వివేకము, నిజమైన జ్ఞానము, ఆత్మనివేదనా భావము, కృతజ్ఞత వంటి అద్భుతమైన లక్షణాలు నిస్స్వార్థ బుద్ధితో కేవలం ఇతరుల కోసమే జీవించేటువంటి కళ మనలో అలవడే అవకాశం ఉంటుంది. 
శ్రీమద్భగవద్గీత, శ్రీ కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి విరచిత 18 పర్వాలతో కూడిన మహాభారత ఇతిహాసంలో, భీష్మ పర్వంలో 18, అధ్యాయాల్లో, 700 శ్లోకాలతో దర్శనమిస్తుంది. ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసినవారు ముగ్గురే ముగ్గురు - శ్రీ వేదవ్యాస మహర్షి, సంజయుడు, బర్బరీకుడు. యుద్దానికి సన్నద్ధమైన క్షణంలో శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు ఎలా చెప్పాడా అని అందరికీ సందేహం కలుగుతుంది. దానికి రానున్న వ్యాసాలలో పూజ్య దాజీ ఇచ్చిన సమాధానాలను ఏకాగ్రతతో, భక్తితో, తపనతో అధ్యయనం చేయగలరు. 
గీతాజయంతి  రోజున చాలా మంది రకరకాలుగా గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా అందరూ భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారు. పారాయణకు దాని ప్రభావం దానికి ఉన్నప్పటికీ, దాని కంటే కూడా ఒక గురువు ఆశ్రయంలో వారు చెప్పిన ఆదేశాన్ని అనుసరిస్తే మరింత ప్రభావపూరితంగా ఉంటుంది. 
ఈ సందర్భంగా, హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక మార్గదర్శి యైన పూజ్య దాజీ వెల్లడించిన గీతా హృదయాన్ని సంస్మరిస్తూ, ధ్యానిస్తూ, ఆ సారాన్ని మన హృదయం నిండా నింపుకునే ప్రయత్నం చేద్దాం. రానున్న కొన్ని వ్యాసాలు దీనికి సంబంధించినవై ఉంటాయి. 

 


8, డిసెంబర్ 2023, శుక్రవారం

సహజమార్గ ధ్యాన పద్ధతి - అష్టాంగ యోగ మార్గము

 


పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ ధ్యానంలో 
సహజమార్గ ధ్యాన పద్ధతి  - అష్టాంగ యోగ మార్గము 

సహజమార్గ ధ్యానం పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ గారిచే ఆవిష్కరింపబడిన రాజయోగధ్యాన పద్ధతి. మన శరీర వ్యవస్థలో రాజు వంటిది ఆలోచన లేక మనసు. ఈ  రాజువంటి ఆలోచనా శక్తి ద్వారా యోగాన్ని  సాధించడమే  రాజయోగసాధన అని అంటారు. 

యోగం అంటే కలయిక, ఆత్మ పరమాత్మతో లయమవడం. 
పతంజలి మహర్షి అష్టాంగ యోగంలోని - యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి - అనే ఎనిమిది అంగాల్లో ఏడవ మెట్టయిన ధ్యానంతో ఈ యోగపద్ధతి ప్రారంభమవుతుంది. 


ఈ ధ్యానం యొక్క ప్రత్యేకత ప్రాణాహుతి అనే దివ్యశక్తి యొక్క ప్రసరణతో కూడినటువంటి ధ్యానం. ఈ ప్రాణాహుతితో కూడిన ధ్యానం వల్ల ధ్యానించడం తేలికైపోతుంది. 

అంతకు ముందున్న యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ప్రక్రియల సాధన చేయకుండా ధ్యానంతో ప్రారంభించడం ఏ విధంగా సాధ్యపడుతుంది?  అన్న ప్రశ్న కలుగుతుంది. అది ప్రాణాహుతితో కూడా ధ్యానం వల్ల ఇది సాధ్యపడుతున్నది. ధ్యానంతో ప్రారంభించడం వల్ల లోపలికి అంతరంగంలోకి చూడటం సాధకుడు తనను తాను గమనించడం నేర్చుకుంటాడు. ఆ తరువాత ధ్యానం చేయడంలో వచ్చే అవరోధాలను గుర్తించడం ప్రారంభిస్తాడు.  ఫలితంగా ఈ ముందున్న ప్రక్రియల విలువను, ప్రాముఖ్యతను గుర్తిస్తాడు సాధకుడు. మనిషి సాధారణంగా దేని విలువైనా గుర్తిస్తేనే గాని వాటిని సక్రమంగా సాధన చేయడానికి ఉపక్రమించడు . 

ఉదాహరణకు, ప్రపరతమంగా కూర్చోవడానికే, అంటే ఆసనం విషయంలోనే  ఇబ్బందులు ఎదురవడం వల్ల, ఆసనం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తాడు. అలాగే తనలో అవగుణాలు ధ్యానంలో కనిపించినప్పుడు వాటిని తొలగించుకునే ప్రయత్నంలో యమనియమాలను సాధన చేయడం ప్రారంభిస్తాడు. అలాగే శ్వాసను తాజాగా ఆరోగ్యవంతంగా చూసుకోవలసిన అవసరాన్ని గుర్తించి ప్రాణాయామ సాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తాడు. అంతేగాక ఇంద్రియపరమైన బలహీనతలను గుర్తించినప్పుడు ప్రత్యాహారం అనే అంగం యొక్క గొప్పదనాన్ని గుర్తించి ప్రత్యాహార సాధన ప్రారంభిస్తాడు. ఆ తరువాత ఒకే అంశంపై ఆలోచనను అంతరాయం లేని విధంగా, తైల ధారగా ఉంచడం అప్రయత్నంగానే వస్తుంది. అదే ధారణ.  వీటన్నిటి సాధన వల్ల ధ్యానంలోకి తేలికగా వెళ్ళగలుగుతాడు సాధకుడు. ధ్యానం మనసును క్రమశిక్షణలో పెట్టడమే గాక, మనసుకు ఆవల ఉన్న ఉన్నతోన్నత ఆధ్యాత్మిక స్థితులకు చేర్చగలుగుతుంది. ఫలితంగా సమాధి స్థితికి చేరుకోవడం సాధ్యపడుతుంది. 

ఈ ప్రక్రియలన్నీ చిత్తశుద్ధితో చేసే ప్రతీ సహజమార్గ అభ్యాసి తెలియకుండానే ఆచరిస్తూ ఉంటాడు. ఇన్ని తెలియకుండా జరిగేటువంటి అద్భుతమైన పద్ధతి, తెలిసినప్పుడు అమితమైన కృతజ్ఞత, ప్రేమ, భక్తి, సమర్పణ భావం గురువు పట్ల ఏర్పడటం వల్ల, ప్రాణాహుతి ప్రసరణకు మరింత అనుకూలంగా సాధకుడు తనను తాను సవరించుకోవడం జరుగుతుంది. ఈ సహజమార్గ ధ్యాన పద్ధతిని బాబూజీ మహారాజ్ మానవాళి పట్ల ఎంతో కరుణతో  రూపొందించడం జరిగింది. ఇవన్నీ ప్రాణాహుతి ప్రసరణ వల్లనే సాధ్యపడుతున్నది. ఎంతో సమయాన్ని ఆదా చేస్తున్నది, తగ్గిస్తూ ఉన్నది. అందుకే ఈ ఆధ్యాత్మిక పద్ధతి, తీరిక లేని ఆధునిక మానవులకు చాలా అనుకూలమైనది. ఈ సాధన పట్ల విధేయతతో ఉంటూ అనుసరించడం వల్ల ప్రతి జీవితంలోనూ ఉన్న తెలియని వెలితిని పూరించడమే గాక జీవితానికి గల పరమార్థాన్ని గుర్తించి, తగు రీతిలో జీవించే కళను అప్రయత్నంగా నేర్చుకోవడం జరుగుతుంది. 

అందుకే పూజ్య దాజీ మనలను పదే పదే రియాలిటీ ఎట్ డాన్ పుస్తకంలో సాక్షాత్కారం అనే అధ్యాయాన్ని చదవమంటారు. అందుకే దాజీ మన అభ్యాసులకు ప్రత్యేకంగా తెలియజేయవలసిన అవసరం ఉందని, వీటన్నిటినీ మరల పరిచయం చేస్తున్నారు, వాటి ప్రాముఖ్యతను, ఆచరించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. సజీవ మాస్టర్ ఇలా ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా తన సూచనలతో మానవాళిని సరిదిద్దుతూ ఉంటారు. మన పని, మనకు తగినట్లుగా వారిని ఆచరించడమే. 

(ఇది నా నూరవ బ్లాగు. ఆదరించిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు)




6, డిసెంబర్ 2023, బుధవారం

యువావస్థ ఆదర్శంగా జీవించాలన్న ఆకాంక్షలతో నిండిన సమయం

 

యువావస్థ ఆదర్శంగా జీవించాలన్న ఆకాంక్షలతో నిండిన సమయం 

మొదటి 15 సంవత్సరాలు మనసు అమాయకంగా ఉండే  కాలం. ఇంకా స్వాతంత్ర్య భావాలు రాణి కాలం. చుట్టూ ఉన్నవారు ఏమి చెబితే అది చేసే కాలం, ఏది నచ్చితే అది చేసే కాలం, లేక పెద్దలు చెప్పినదే చేసే కాలం. 
యువావస్థ అంటే ఇంచుమించు 15 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండే కాలం. మెల్ల మెల్లగా స్వతత్ర భావాలు మొదలవుతాయి. నెమ్మదిగా ఆదర్శాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం చక్కటి స్థితిలో ఉండే కాలం. శారీరకంగా మార్పులు సంభవించే కాలం. ఆదర్శాలతో, ఆశయాలతోనూ జీవించాలన్న సంకల్పాలు ప్రబలంగా ఉండే కాలం. అయితే దేశాకాల పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ ఆదర్శాలను నిలబెట్టుకోలేక వాటికి దూరమయ్యే సమయం కూడా ఇదే. వృద్ధాప్యానికి, బాల్యానికి మధ్య ఉన్న కాలం ఈ యువావస్థ; చాలా కీలకమైన సమయం. దీన్ని సక్రమంగా వినియోగించుకోవడంలోనే విజ్ఞత ఉన్నది. యువకులు ఈ సత్యాన్ని గుర్తించే విధంగా పిల్లలకు అటువంటి వాతావరణం ఏర్పరచే బాధ్యత తల్లిదండ్రులపైన, చుట్టూ ఉండే పెద్దలపైన ఉన్నది.  
మనిషి ఎప్పుడూ యువావస్థలో ఉండాలంటే మనసులో ఎట్టి పరిస్థితులలోనూ  తన ఆదర్శాలను, ఆశయాలను వీడకూడదు అనేవారు పూజ్య చారీజీ. అవి జరిగినా జరుగకపోయినా. మనసు ఎప్పుడూ వయసులోనే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.  మనసును ఎప్పుడూ తాజాగా, ఆశావహంగా, ఆరోగ్యంగా ఉంచేవి వీటికి సంబంధించిన ఆలోచనలే, చేతలే. ఎప్పటికైనా మన జీవితాన్ని సవరించి తీరతాయి. జీవితం తప్పక సార్థకమవుతుంది. ఇటువంటి మానసిక స్థితే మహాపురుషులను, అసలైన మార్గదర్శిని ఆకర్షిస్తుంది. మార్గనిర్దేశనం కనిపిస్తుంది, దిశానిర్దేశం జరుగుతుంది, చివరికి ఆదర్శవంతమైన మార్గదర్శి మన జీవితాన్ని నడిపించే విధంగా, అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ, వెన్నంటే ఉంటూ సంరక్షించే మహాపురుషుడు తటస్తమవడం జరుగుతుంది. ఇది జీవితంలో ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా జీవితం సరైన త్రోవలో పయనిస్తుంది. 
అసలైన మార్గదర్శి ప్రతీ హృదయంలో నిక్షిప్తమై ఉన్నాడు అని తెలుసుకునే వరకూ బాహ్యంగా మార్గదర్శనం చేసే వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి డబ్బు మనిషి కాకూడదు, మార్గదర్శనం చేసినందుకు రుసుములు తీసుకోకూడదు, అటువంటి వ్యక్తి సన్నిధిలో ప్రశాంతటాను అనుభవించగలగాలి. సరైన మార్గదర్శి అనడానికి ఇవే సాంకేటాలని పూజ్య దాజీ సెలవిచ్చారు. 
ఆదర్శ యువకుడు అనగానే మనందరికీ వెంటనే స్ఫురించేది మన యువ కిశోరం  స్వామి వివేకానంద. ఆయన చిత్రం స్ఫురణలోకి రాగానే ఇలా ఉండాలనిపిస్తుంది ప్రతీ యువకుడికి. అలా ఉండాలంటే జీవితానికి ధ్యానం పునాది కావాలన్నారు స్వామీజీ. నిజానికి విద్యాభ్యాసానికి పూర్వమే ధ్యానం అవసరం అన్నారు. ధ్యానం వల్ల ఏకాగ్రత సంభవించడం వల్ల అనవసరంగా మాన్సులేని విషయాలపై గాక ఆసక్తిగల విషయాలపై దృష్టిని కేంద్రీకరించి ఆయా విషయాల్లో నిష్ణాతులయ్యే అవకాశం ఉంటుందనేవారు. లేకపోతే బలవంతంగా మనసు లేకపోయినా విషయాలను చదవడం వల్ల, సమయం వ్యర్థమవడమే గాక, నిరాశ, నిస్పృహ వంటి నకారాత్మక లక్షణాలు మనిషిలో చోటు చేసుకుని జీవితాన్ని పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది. 
ఇటువంటి చక్కటి ఆశయాలతోనూ, ఆదర్శాలతో నిండి ఉండవలసిన యువత ఎ కారణం చేతనైతేనేమి పెడత్రోవను పట్టడం విచారకరం - మొదట తల్లిదండ్రులకు, తరువాత కుటుంబానికి, ఆ తరువాత విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఆ తరువాత సమాజానికి వేదనను కలిగించే విషయం. ఈ పరిస్థితికి అనేక ప్రబలమైన కారణాలుండవచ్చునేమో గాని, ఒక ముఖ్యమైన కారణం ఆదర్శవంతమైన వ్యక్తులు సమాజంలో కరువైపోవడం, విలువలతో సంబంధం లేని విద్యాభ్యాసం, పెడత్రోవను పట్టించే అనేక చెడు మార్గాలు. 
తల్లిదండ్రులుగా, పెద్దలుగా, మన వంతు కృషి మనం చేయడం ఎట్టి పరిస్థితులలోనూ చాలా అవసరం. మనం చేయలేనప్పుడు పూజ్య దాజీ వంటి మహాత్ములు ఈ పనిని చేపట్టినప్పుడు మన వంతు తోడ్పాటునందించవలసిన  అవసరం ఉంది; అదే మనం మన తరువాతి తరానికి అందించగల చేయూత. సంపూర్ణ ప్రయత్నం చేద్దాం. 
 

స్పిరిచ్యువల్ అనాటమి - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - 3

 


స్పిరిచ్యువల్ అనాటమి  - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - 3
అయాన్ ఎ. బేకర్, పూజ్య దాజీతో సంభాషణ 
అయాన్ బేకర్ అమెరికా దేశస్థుడు, ఎంతో చదువుకున్నవాడు, గొప్ప పేరు-ప్రఖ్యాతులు గాంచిన భూమ్మీద ఎన్నో  సాహసయాత్రలు చేసే వ్యక్తి. ఎన్నో గ్రంథాలు రచించిన వ్యక్తి. బాహ్యమైన సాహస యాత్రలే గాక అంతరంగ సాహసయాత్రలో కూడా రుచి గలవాడు, ఇటువంటి అంశాలపై కూడా పుస్తకాలు రచించిన లోతైన వ్యక్తి. ఆయన పూజ్య దాజీతో స్పిరిచ్యువల్ అనాటమీకి సంబంధించి సంభాషించడం జరిగింది. పైన ఉన్న వీడియో వీక్షించగలరు. 
ఇందులోని ముఖ్యాంశాలు కొన్ని  మనం ఇక్కడ చెప్పుకుందాం. 
దాజీ పలికిన గొప్ప అంశాలు: సాహస స్ఫూర్తి జీవించడానికి చాలా అవసరం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే సాహస స్ఫూర్తి ఎలా అవసరమో అలాగే మహా సముద్ర అడుగుభాగం చేరుకోవాలంటే కూడా ఎంతో ధైర్యం సాహస స్ఫూర్తి అవసరం. అంతరంగ యాత్ర చేయాలంటే, మరింత ఎక్కువగా ఈ సాహసస్ఫూర్తి అవసరం. అంతరంగ లోలోతుల్లోకి వెళ్ళాలంటే కూడా ఎన్నో వదులుకోవాలి, దానికి సాహసం కావాలి; దురభిమానాలు వీడాలి; పక్షపాత వైఖరులు వదులుకోవాలి; ఇప్పటి వరకూ మనం నేర్చుకున్నవి వదులుకోవాలి; లేకపోయినట్లయితే ఆధ్యాత్మికతలో  విజయం సాధించలేం. ఆ విధంగా ఒకరకమైన తటస్థ భావానికి, ఒక తటస్థ స్థితికి చేరుకోగలిగితేనే నిజమైన అనుభవం కలిగే అవకాశం ఉంటుంది.
బేకర్: మీరు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ (రహస్య దినుసు)  అనే అధ్యాయం ఒకటి వ్రాసారు. ఏమిటది?
దాజీ: మనోవైఖరి, భావం - ఎటువంటి వైఖరితో మనం సాధన చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ఆధ్యాత్మికతలో విజయానికి చేరువ చేసేది భావం; సాధన చేస్తున్నప్పుడు మనకుండే భావం చాలా ప్రధానం. 
మృత్యువు గురించి: మృత్యువు సంభవించినప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్క చక్రం కరిగిపోవడం జరుగుతుంది. ముందు మూలాధార చక్రం మూసుకుపోతుంది - మూల ఆధారం (అంటే భూతత్త్వం) పోయినప్పుడు అన్నీ పడిపోతాయి. ఇదొక భూకంపంలా ఉంటుంది. తరువాత జల చక్రం మూసుకున్నప్పుడు ఒళ్ళంతా చల్లబడిపోతుంది; ఆ తరువాత మణిపూర చక్రం శరీరం కొంచెం వేడెక్కుతుంది; కాస్సేపు చలి, కాస్సేపు వేడి అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇలా కొన్ని క్షణాల తరువాత ఈ చక్రం లయమైపోతుంది. ఆ తరువాత వాయు చక్రం లయమైపోయినప్పుడు శరీరం వణకడం మొదలెడుతుంది; ఆ తరువాత ఆకాశ తత్త్వం; ఈ సమయంలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఆత్మ గనుక తన జీవితకాలంలో మోక్షాన్ని పొందకపోయినట్లయితే, ప్రాణం లేక ఆత్మ నవరంధ్రాల్లో ఏదోక రంధ్రం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది; మోక్షం సాధించిన వ్యక్తికి శిఖ ఉండే స్థానం నుండి, 10 వ చక్రం నుండి, బ్రహ్మ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రవేశించేది కూడా ఈ బ్రహ్మరంధ్రంలో నుండే గర్భం దాల్చిన మూడవ మాసంలో ప్రవేశిస్తుంది. 
మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక శూన్యస్థితిని అనుభూతి చెందుతూ ఉంటాం. ఈ స్థితి మృత్యు స్థితిని పోలి ఉండే స్థితి. ఈ స్థితి మన ధ్యానంలో అలవాటైపోయినవారికి ఇక మృత్యు భయం ఉండదు; మృత్యు సమయంలో నిర్భయంగా ఆ తరువాతి లోకానికి తమ ప్రయాణాన్ని హాయిగా కొనసాగిస్తారు.
స్త్రీలు సహజంగా పురుషుల కంటే వికాసం చెందినవారై ఉంటారు; అది ప్రకృతి వరం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, చేతలు వాళ్ళ అనుభూతిని బట్టి ఉంటాయి. పురుషుల ఆలోచనలు, చేతలు కేవలం మేధోపరంగా మాత్రమే ఉంటాయి. కాబట్టి స్త్రీలు పురుషులతో సమానత్వం కోరుకోకూడదు; అలా చేస్తే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నట్లే. 

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...