23, అక్టోబర్ 2023, సోమవారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 6

 


Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం
స్వచ్ఛంద సేవ 
తనపై తాను పని చేసుకోవడంలో స్వచ్ఛంద సేవ కూడా చాలా కీలక పాత్ర వహిస్తుంది. మనలను మనం పరిశుద్ధంగా చేసుకునే క్రమంలో, మనలను మనం మరింత సూక్ష్మంగా తయారు చేసుకునే క్రమంలో, ఇంతకు ముందు చర్చించుకున్న ఇతర సాధానోపాయాల కంటే వేగంగా పని జరిగే అవకాశం ఉన్న అంశం ఈ స్వచ్ఛంద సేవ. మనం వలంటీర్ సేవ అని కూడా అంటూ ఉంటాం. 

నిజమైన స్వచ్ఛంద సేవ ముఖ్యంగా మన హార్ట్ఫుల్నెస్ సంస్థలో అభ్యాసిలో గురువు పట్ల గాని, ధ్యాన పద్ధతి పట్ల గాని, సంస్థ పట్ల గాని హృదయంలో నిజమైన కృతజ్ఞత సహజంగా ఏర్పడినప్పుడు మొదలవుతుంది. అప్పటి వరకూ తానేమీ పొందుతున్నాడన్నది మాత్రమే ఆలోచిస్తాడు అభ్యాసి; కృతజ్ఞత మొదలైన తరువాత,  నేనేమి చెయ్యగలను అని ఆలోచించడం మొదలెడతాడు అభ్యాసి.  

స్వచ్ఛంద సేవ ద్వారా రకరకాల మనస్తత్వాలు గల వ్యక్తులతో రాపిడి లేకుండా ఒక్క జట్టుగా ఎలా పని చెయ్యాలో అలవాటవుతుంది; నెమ్మదిగా అందరి పట్ల ప్రేమ భావం పెరుగుతుంది; ఓరిమి పెరుగుతుంది; పరస్పరం సహాయం చేసుకునే తత్త్వం పెరుగుతుంది; మనసులో కూడా ఎవరినీ తిట్టుకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది; అందరమూ ఆ గురుదేవుల బిడ్డలమేనన్న స్పృహ నెమ్మదిగా పెంపొందుతుంది. నిజమైన విశ్వజనీన సౌభ్రాతృత్వం ఏమిటో అర్థమవుతుంది; కుల, మత, రంగు, జాతి, భాష, ధనిక-పేద, వంటి తారతమ్యాలు మెల్లమెల్లగా మనలో నశించే అవకాశం ఉంది. ఎందుకంటే మన లక్ష్యసిద్ధికి ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి. 

స్వచ్ఛంద సేవ యొక్క అసలు రుచి తెలియాలంటే, నిజంగా లక్ష్యసిద్ధి కోసం తపించేవారైతే, పూజ్య దాజీ సూచన ఏకాంతంగా గుండె నిండా గురువు పట్ల కృతజ్ఞతా భావం నింపుకొని సేవలనందించమంటారు. గుంపుగా చేయడంలో ఇతర ఆనందాలు కలుగుతాయి కానీ, ఇలా ఏకాంతంగా సేవనందించడంలోనే పరమార్థం దాగి ఉండంటారు దాజీ. అటువంటి స్పృహ లేక చేతనావస్థ చేయగా చేయగా స్థిరపడే అవకాశం ఉంటుంది; ఆ స్పృహతో ఈ భవసాగరాన్ని ఈదడం తేలికైపోతుంది. 

వారి కృపకు అర్హత సంపాదించే మార్గం, దగ్గర త్రోవ ఈ స్వచ్ఛంద సేవ. serve to deserve అన్నారు పూజ్య చారీజీ మహారాజ్. దైవాన్ని ప్రేమించడం గాని, గురువు పట్ల విధేయత గాని చాలా కష్టం కావచ్చును గాని, వారి ఆశయాన్ని తన ఆశయంగా చేసుకుని సేవ చేయడం ద్వారా వారి మనసులో చోటు సంపాదించడం చాలా తేలిక అంటారు, పూజ్య చారీజీ. ఎటువంటి గుర్తింపును ఆశించకుండా, నిండు మనసుతో, గుండె నిండా కృతజ్ఞతను నింపుకొని చేసే సేవే గురువు కోరుకునే నిజమైన స్వచ్ఛంద సేవ. ఈ విధంగానే మనిషిలో అసలైన పరివర్తన సంభవించే అవకాశం ఉంటుంది. 





Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 5

 

Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం
స్వాధ్యాయం  

పతంజలి మహర్షి రచించిన యోగసూత్రాల్లో సూచించిన అష్టాంగ యోగపద్ధతిలో రెండవ అంగమైన నియమ లోని అంశం స్వాధ్యాయం. ఆధ్యాత్మిక సాధనలో, యోగా సాధనలో భాగంగా సాధకుడు ముఖ్యంగా చేసుకోవలసినది. 
స్వాధ్యాయం అంటే స్వ ను అధ్యయనం చేయడం. అంటే తనను తాను విచారించి తెలుసుకోవడం. ఇది అనేక రకాలుగా చేయడం జరుగుతూ ఉంటుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం, మహాభాగవతం, వంటి పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా; ధ్యానం ద్వారా, ఆత్మావలోకనం   ద్వారా సాధకుడు తనలోని ఆలోచనలను, ఉద్వేగాలను, అనుభూతులను, అలవాట్లను, చేతలను, ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా తనను తాను తెలుసుకుంటాడు.
 
ఆ చదివినవాటిని లేక వినిన వాటిని శ్రవణ మనన, నిధిధ్యాసన ద్వారా జీర్ణించుకోవడాన్ని కూడా స్వాధ్యాయం అంటారు. అలాగే సామూహికంగా, సమిష్ఠిగా ఇటువంటి విషయాలను చర్చించుకుంటూ, తోటి సాధకులతో పంచుకుంటూ పరస్పరం ఉపయోగపడటమే స్వాధ్యాయం అంటే. ప్రస్తుతం మనం చేస్తున్నది కూడా స్వాధ్యాయంలోకే వస్తుంది. 

సహజమార్గ సందర్భంలో స్వాధ్యాయంలో సహజమార్గ సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం, సాధనాంశాలను గురించి లోతైన అవగాహనలు పరస్పరం పంచుకోవడం, సత్సంగాల్లో పాల్గొనడం, సంస్థ కార్యక్రమాల్లో వీలు చేసుకుని పాల్గొనగలగడం, అవకాశం వచ్చినప్పుడల్లా పూజ్య గురుదేవుల సన్నిధిలో సమయాన్ని గడపటం, అలాగే కుదిరినప్పుడల్లా స్వచ్ఛంద సేవలో వలంటీరుగా సేవలనందించడం, ఇవన్నీ మన స్వాధ్యాయంలోకి వస్తాయి. స్వాధ్యాయం మన లక్ష్యసిద్ధిలో చాలా కీలకమైన అంశంగా మనం గుర్తించవలసి ఉంది; తగువిధంగా మన జీవితాలను మనం మలచుకోవలసి ఉంది. 



Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 4


Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం 
సాధన 
మనపై మనం చేసుకునే పనికి సరైన, తగిన బలాన్ని చేకూర్చేది మనం నిత్యం చేయవలసిన సాధన. అంటే ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం అనే హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ సాధనా పద్ధతిలోని మూడు ప్రధాన యౌగిక ప్రక్రియలు. ఈ  మూడిటిని నిర్దేశించిన విధంగా ధ్యానిస్తూ, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకూ మన దినచర్యలోనూ, ప్రపంచంతో వ్యవహరించే విధానంలోనూ ఎలా ఉండాలో తెలియజేసే పది సూక్తులను గనుక ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే, మనలోని చైతన్య వికాసం ప్రతి నిత్యం గణనీయంగా వికాసం చెందడం మనం అనుభవం ద్వారా గ్రహించగలుగుతాం. 

అయితే ఈ ప్రక్రియలను కేవలం మొక్కుబడిగా గాకుండగా, కేవలం యాంత్రికంగా గాకుండగా, ఆ విధంగా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, కనీసం క్రమక్రమంగానైనా సరైన వైఖరితో, సరయిన దృక్పథంతో, తపనతో, భక్తి-ప్రేమలతో, ఆసక్తితో చేయడం అలవరచుకోవాలి. ఇవన్నీ మన దశనియమాల్లో విపులంగా తెలియజేయడం జరిగినది; దీనికి సంబంధించిన సాహిత్యం చదవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. 

ధ్యానం యొక్క ప్రయోజనం ధ్యాన స్థితిని పొందడమే; శుద్ధీకరణ ప్రక్రియ వల్ల గుండెలోని బరువు తగ్గి, హృదయ లోలోతుల్లోకి వెళ్ళగలిగే ప్రయోజనం కలుగుతుంది; తద్వారా మరునాడు చేసే ధ్యానం మరింత నిగూఢంగా ఉండే అవకాశం కలుగుతుంది; రాత్రి ప్రార్థన వల్ల హృదయంలో ప్రార్థనాపూర్వకమైన స్థితి ఏర్పడటం, వినమ్రత అలవడటం, తద్వారా అదే  మన స్వభావంగా మారే అవకాశం ఉంటుంది. 

ధ్యానం చేసే సమయంలో వచ్చే ఆలోచనలు కూడా ఒక్కోసారి బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయి; ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని కావడంతో బహుశా మనం రోజంతా చేయవలసిన పనులను గురించిన ఆలోచనలు రావచ్చు; వాటిని మనం ధ్యానంలో స్పష్టంగా చూసినప్పుడు అక్కడికక్కడే ఏవి ముఖ్యమైన పనులో, ఏవి కావో, ఏవి చేయక్కర్లేదో తెలిసిపోవడంలో మనకు రోజులో చాలా సమయం ఆదాయ అయ్యే అవకాశం ఉంటుంది; అందుకే పూజ్య దాజీ ధ్యానం వల్ల అదనంగా సమయం దొరుకుతుందంటారు. ఆసక్తితో ధ్యానం చేసినప్పుడు అనుభవంలో ఇలా చాలా విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే వచ్చే పోయే ఆలోచనలను నిర్లక్ష్యం చేసే కళ క్రమక్రమంగా అలవడటం వల్ల ముఖ్యమైన వాటిపైనే దృష్టిని పెట్టడం అలవాటవుతుంది; తద్వారా జీవితం ప్రయోజనకరంగా లక్ష్యసిద్ధి కోసం ఎక్కువ సమయం దొరుకుతుంది; విచక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దివ్య లక్షణాలు మనకు తెలియకుండా అలవడతాయి. ముఖ్యంగా ధ్యాన స్థితిని పొందిన తరువాత ఎక్కువ సేపు నిలుపుకోగలగడం, ఆ తరువాత అదే మన స్వభావంగా మారిపోయే వరకూ ధ్యానం కొనసాగిస్తాం; ధ్యానస్థితిలో ఉంటూ మనం జీవితం కొనసాగించడం వల్ల, మనం చేసే పనులు నేర్పుతో చేయడమే గాక, వాటి ముద్రలు మన హృదయంపై ఏర్పడకుండా కూడా జీవించగలుగుతాం. 

శుద్ధీకరణ ప్రక్రియ మనలో ఏర్పడిన ముద్రలను అంటే మన గతాన్ని, ఏరోజుకారోజు మనం తుడిచి వేయగలుగుతాం; ఆ విధంగా మనం గుండె బరువు తగ్గడం ప్రత్యక్షంగా అనుభూతి చెందగలుగుతాం. అలాగే ప్రశిక్షకుల ద్వారా లేక మాస్టర్ ద్వారా తీసుకునే ధ్యాన-సిట్టింగుల్లో మరింత లోలోతుల్లో స్థిరపడిన సంస్కారాల బీజాలను దగ్ధం చేయడం జరుగుతుంది. తద్వారా మనం సాధించిన ఆధ్యాత్మిక పురోగతి దృఢంగా నిలుస్తుంది. ఆ విధంగా క్రమక్రమంగా మన సంస్కారాలన్నీ తొలగించడం వల్ల ఈ సాధన మోక్షస్థితికి దారి తీస్తుంది. నాలుగు రకాల ప్రధానంగా మనకున్నాయి - 1) రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), 2) ప్రాపంచిక చింతలు 3) ఇంద్రియపరమైన బాధలు, 4) అపరాధాభావం. వీటిల్లో మొదటి మూడు రకాల సంస్కారాలను ఈ రకరకాల శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వదిలించుకోవచ్చు. నాల్గవది మాత్రం కేవలం ప్రార్థనా-ధ్యానం ద్వారా మాత్రమే పశ్చాత్తాపం ద్వారా మాత్రమే తొలగించుకోగలుగుతాం; దీన్ని భగవంతుడు గాని గురువు గాని వీళ్ళు కూడా తొలగించలేరు. ఇంకా అనేక ప్రయోజనాలు అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తాయి.
 
రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం  సాధనలో చాలా ముఖ్యమైన అంశం. పది-పదిహేను నిమిషాలు చేసే ఈ ప్రార్థనా-ధ్యానం మన సాధనలో చాలా కీలకమైనది. ఇది మన హృదయంపై పడే అతిభారమైన సంస్కారాలను తొలగించే అవకాశం ఉంది. పైన చెప్పిన విధంగా గుండెకు అతి భారమైన సంస్కారం అపరాధ భావం; అది కేవలం ఈ ప్రార్థనా-ధ్యానం ద్వారా తొలగించుకోగలుగుతాం. వెరసి శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియ ద్వారా మనలోని అనేక జటిల మనస్తత్త్వాలు, మలినాలు, అశుద్ధాలు తొలగిపోవడం వల్ల మనం మన అంతరంగంలో మరింత స్వచ్ఛంగా, సరళంగా తయారావుతాం. 

పై మూడు యౌగిక ప్రక్రియలు ఒకదానిపై ఒకటి ఆధారపడినవి. సమగ్రంగా ఈ ధ్యాన సాధన చేసినప్పుడు, సమాంతరంగా శీల నిర్మాణం చేసుకున్నప్పుడు,  నిజమైన నిరంతర స్మరణ లేక ధ్యాన స్థితి ఏర్పడతుంది. నిరంతర స్మరణ వల్ల నిజమైన ప్రేమ లేక భక్తి ఉద్భవిస్తుంది; ప్రేమ, పరిపక్వత చెందిన తరువాత అది శరణాగతిగా మారుతుంది; శరణాగతి తరువాత సిద్ధించే స్థితి - ఆ పరతత్వంలో సంపూర్ణ లయ ప్రాప్తించడమే . నీటి చుక్క మహాసముద్రంలో పడి మహాసముద్రంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది; ఆ విధంగా మన ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది. 

 






 



22, అక్టోబర్ 2023, ఆదివారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 3

 


Working on the self
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం -  3
ఆత్మావలోకనం 

ఆత్మావలోకనం అంటే తనను తాను నిష్పక్షపాతంగా, నిర్దుష్టంగా, ఉన్నదున్నట్లుగా చూసుకోగలిగి, తనను తాను యథాతథంగా ఉన్నదున్నట్లుగా స్వీకరించుకోగలగడం.  మనలోని కొరతలను, లోటుపాట్లను, బాగోగులను ఉన్నదున్నట్లుగా గుర్తించినప్పుడే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది; అప్పుడే మనిషి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆత్మావలోకం అంటే తన సమస్యలకు పరిష్కారాన్ని తనలోనే వెతుక్కోవడం. 
అలాగాక ఎక్కడికక్కడ మన లోటుపాట్లను సమర్థించుకున్నట్లయితే మనలో మార్పు రాకపోవడమే గాక, ఆత్మవంచనగా మారి, మనలో అపరాధాభావం ఎక్కువై గుండె రోజు-రోజుకూ బరువెక్కుతుంది. కాబట్టి గుండె రోజు-రోజుకూ తేలికపడటానికి ఆత్మావలోకనం చక్కటి పరికరం. ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలసిన ప్రక్రియ.
 
ఆత్మావలోకనం లేక ఆత్మపరిశీలన అనే ప్రక్రియ కొన్ని పరిస్థితుల్లో మనిషి జీవితంలో   సహజంగా జరుగుతూ ఉంటుంది; ముఖ్యంగా జీవితంలో విపరీత ఫలితాలు వచ్చినప్పుడు సహజంగా జరుగుతుంది; అప్రయత్నంగా జరుగవచ్చు. కానీ మనిషి తాను మరింత మెరుగైన విధంగా జీవించాలనుకున్నప్పుడు, తనను తాను మార్చుకోవాలనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా త్వరితంగా పురోగతి చెండాలనుకున్నప్పుడు, ఆత్మ వికాసం లేక వ్యక్తిత్వ వికాసం లేక చైతన్య వికాసం త్వరితంగా జరగాలనుకున్నప్పుడు ఈ ప్రక్రియను ప్రయత్నపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా వినియోగించవలసి ఉంటుంది. 
ఇది అంతర్లీనంగా జరిగే ప్రక్రియ. ధ్యానంలోనూ, శుద్ధీకరణ ప్రక్రియ చేస్తున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలో కూడా ఎల్లవేళలా జరుగుతూ  ఉంటుంది. దీనిపై ప్రయత్న పూర్వకంగా, ప్రత్యేక దృష్టిని పెట్టి పరిష్కారాలు వెతుక్కోవడమే ఆత్మావలోకనం. 

ఆత్మావలోకనం అంటే ఏది కాదు?
ఆత్మావలోకనం అంటే ధ్యానించడం కాదు. కళ్ళు మూసుకొని ఆలోచించడమూ కాదు. ఆత్మావలోకనం అంటే శుద్ధీకరణ ప్రక్రియ కూడా కాదు. ఆత్మావలోకనం అంటే కేవల కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం కూడా కాదు. 

మరి ఆత్మావలోకనం అంటే ఏమిటి?
ఆత్మావలోకనం అంటే వ్యక్తి తనను తాను ఉన్నదున్నట్లుగా పరికించుకోగలగడం, పరిశీలనగా చూసుకోగలగడం. దీని వల్ల వ్యక్తి తనను తాను యథాతథంగా స్వీకరించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. తనను తాను మార్చుకోవాలంటే ఈ విధంగా తనను తాను యథాతథంగా స్వీకరించగలగడం అవసరం, ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతికి ఇది చాలా కీలకం; అప్పుడే వ్యక్తిలో సమూలమైన శాశ్వతమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. 
ఆత్మావలోకనం ద్వారా తన ఆలోచనా విధానాన్ని, ఆలోచనలను, ఉద్వేగాలను, అనుభూతులను ప్రత్యక్షంగా ఉన్నదున్నట్లు గమనించగలుగుతాడు. వ్యక్తి తన బాలాలను, బాలహీనతలను, సమస్యలను, యథాతథంగా చూడగలిగే అవకాశం ఉంటుంది. 
ఆ విధంగా మనలో ఏ యే సమస్యలను పరిష్కరించగలము, ఏవి పరిష్కారానికి కొంత కష్టపడాలి, ఏ యే సమస్యలను కష్టపడినా పరిష్కరించలేము, వాటిని యథాతథంగా స్వీకరించగలిగే శక్తి వస్తుంది. 
పరిష్కరించగలిగే సమస్యలను గుర్తించినప్పుడు, వాటిని వెంటనే మనం ప్రయత్నం ద్వారా పరిష్కరించుకోగలుగుతాము. పరిష్కరించడం కష్టం అన్న సమస్యల కోసం అంతర్యామిగా ఉన్న భగవంతుని సహాయం కోసం ప్రార్థించి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. అసాధ్యం అన్న సమస్యను లేక కష్టాలను దైవ సంకల్పాలుగా భావించి, దివ్య ప్రణాళికలో భాగంగా భావించి, సంతోషంగా స్వీకరించగలుగుతాం. 

ఈ విధంగా ఆత్మావలోకనం అనే ఈ ప్రక్రియ, ప్రయత్నపూర్వకంగా చేసే ఈ ప్రక్రియ, మన ఆధ్యాత్మిక పరిణతిని, ఆధ్యాత్మిక పురోగతిని, ఆత్మ వికాసాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలను, సహజంగా జరిగే పరిణామ క్రమాన్ని మరింత వేగాన్ని పుంజుకునేలా తోడ్పడుతుంది. 



20, అక్టోబర్ 2023, శుక్రవారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 2

 


Working on the self 
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం -  2
శీలనిర్మాణం 
ఆధ్యాత్మిక ప్రగతి నా వంతు, శీల నిర్మాణం అభ్యాసి వంతు - బాబూజీ 
నేను మీ పట్ల చేస్తున్నది నా ధర్మం, మీరు నా పట్ల యేది చేయడం లేదో అది మీ ధర్మం. - బాబూజీ 
మనం నిత్యం సాధన చేసుకుంటూ, అది గాక మన మాటలను, చేతలను, అలవాట్లను, ప్రవర్తనను, మన మనోద్వేగాలను, ఉద్రేకాలను, మన సంకల్పాలను (అంటే మన మనసులో ఉండే ఉద్దేశాలను), వెరసి మన శీలాన్ని గమనించుకుంటూ వాటిని మెరుగుపరచుకునే దిశగా కృషి చేయడమే మన వంతు. 

ఇదే మనపై మనం పని చేసుకోవడమూ అంటే. ఇదే బాబూజీ చెబుతున్న అభ్యాసి వంతు. ఒక కన్ను అంతరంగంలోకి చూసుకోవడానికి మరో కన్ను లౌకిక వ్యవహారాల్లో మన ప్రవర్తనను గమనించుకోవడానికి, అని బాబూజీ అంటూండేవారు. ఇలా ఉండనప్పుడే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. జరుగవలసిన వికాసం జరగదు. ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాము. 
బాబూజీ దయ వల్ల అంతరంగంలో వెలుగు దేదీప్యమానంగా వెలుగుతున్నప్పటికీ, దాని కాంతి మాత్రం బయటకు ప్రసరించకపోవడానికి కారణం లాంతరు మసితో నిండిపోవడం.  ఆ మస్సే మన శీలం. లాంతరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే తప్ప వెలుతురు బయటకు రాదు. ఈ అవగాహన పూజ్య చారీజీ ఇచ్చినది. 

ఇక్కడ సౌశీల్యాన్ని గురించి మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. 
ఆధ్యాత్మికంగా ఎదుగుతూ కూడా సౌశీల్యం లేకుండా ఉండగలరా? 
ఉండవచ్చు. మన చుట్టూ గమనిస్తే చాలా మంది కనిపిస్తారు. మన ఆధ్యాత్మిక చరిత్రలో చూస్తే, రావణ బ్రహ్మ ఒక కొట్టొచ్చే ఉదాహరణ. అతను గొప్ప తపః సంపన్నుడు, వేదశాస్త్రాలు వంటబట్టించుకున్నవాడు, కానీ శీలంలో లోపం ఉండటం వల్లనే అతను పతనమవుతాడు. రావణుడు తన శవం ద్వారా లక్ష్మణుడికిచ్చిన చివరి సందేశంలో మనకర్థమవుతుంది. మంచి చేయడానికి ఆలస్యం చేయవద్దని ఆతని చివరి సందేశం. మంచి అని తెలిసినా ఆలస్యం చేయడమే తన పతనానికి కారణమని, తన జీవితంలో నేర్చుకున్న పాఠమని, చెప్పడం జరుగుతుంది.  ఇలా ఒక్క ఆలోచన మన శీలాన్ని పతన దిశగా తీసుకువెళ్ళవచ్చు. పూజ్య లాలాజీ కూడా శీలవంతుడు గాకపోతే సాధకుడు ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా ప్రయోజనం ఉండదన్నారు. 

ఆధ్యాత్మిక సాధన చేస్తున్న సాధకుడిలో శీల నిర్మాణం తనంత తానుగా జరగదా? 
మనం సహజమార్గ సాధన  ప్రతి నిత్యం చేస్తున్నప్పుడు సౌశీల్యం అప్రయత్నంగా పెంపొందదా, అంటే పెంపొందుతుంది; కానీ చాలా నెమ్మదిగా జరుగుతుందన్నారు చారీజీ. అందుకే అభ్యాసి శీలనిర్మాణంపై దృష్టి పెట్టవలసిన అవసరం. అది గురువు చెయ్యలేడు. సహకరించగలడు. 

శీల నిర్మాణం అనేది మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇటుక కట్టుడులాంటిది. ఇటుకపై ఇటుక పెడుతూ ప్రతీ ఆలోచనను గమనించుకుంటూ నిర్మించుకోవలసినది. తుదిశ్వాస వరకూ కొనసాగవలసినది. ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినది. ఆటోమ్యాటిక్ గా జరగదు. బాబూజీ ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతికి అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనలను సరిదిద్దుకోవలసి ఉంటుంది. చేతలను, అలవాట్లను, ప్రవర్తనను మాలచుకోవలసి ఉంటుంది. అప్పుడే ఆధ్యాత్మిక పురోగతి పరిపూర్ణమవుతుంది. దీనికి ఒక ఆదర్శ వ్యక్తి మన జీవితంలో ఉన్నట్లయితే శీలనిర్మాణం తేలికయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గురువును ఆదర్శంగా చేసుకునేది సహజమార్గంలో. అటువంటి ఉన్నతోన్నత వ్యక్తులే సహజమార్గ గురుపరంపరలో ఉంటారు - ఆధ్యాత్మికంగానూ శీలపరంగానూ పరిపూర్ణాతను సాధించిన ఆదర్శవంతమైన వ్యక్తులు వీరు. ఇంకా చెప్పాలంటే సజీవ గురువు అవసరం కూడా ఇదే  సాధకులకు. ధ్యానం వల్ల, గురువు యొక్క అనుసరణ వల్ల కష్టసాధ్యమైన శీలనిర్మాణం తేలికయ్యే అవకాశం ఉంది.  

 











18, అక్టోబర్ 2023, బుధవారం

Working on the self - తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం - 1

 


Working on the self  
తనపై తాను పని చేసుకోవడం - మానవ ప్రయత్నం 

ఆధ్యాత్మిక సాధనలో సాధకుడి అతిముఖ్యమైన పాత్ర అయిన మానవ ప్రయత్నం ఏమిటో, దాన్ని గురించి చర్చించుకుందాం. అదే తనపై తాను పని చేసుకోవడం అంటే కూడా, ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ సహజమార్గ సాధనపరంగా. 

సహజమార్గ ధ్యానం యొక్క పరమలక్ష్యం లేక యదార్థ లక్ష్యం, పూజ్య బాబూజీ చెప్పిన ప్రకారం,  భగవంతునిలో సంపూర్ణ ఐక్యం చెందడం. ప్రప్రథమంగా ఆ లక్ష్యాన్ని మన హృదయంలో సుస్థిరంగా స్థాపింపబడిందా లేదా సరిచూసుకోవడం చాలా అవసరమని పూజ్య దాజీ చెప్పడం జరిగింది. 

మరలా పూజ్య దాజీ చెప్పినట్లుగా, మనం నీటి చుక్క అయితే భగవంతుడు మహాసాగరం; అప్పుడే ఆ నీటి చుక్క మహాసాగరంలో ఒక్కటైపోవడం లేక నీటి చుక్క మహాసాగరంగా మారిపోవడం జరుగుతుంది; మన పరమ లక్ష్యం సిద్ధిస్తుంది. 
కానీ మనం నీటి చుక్కగా గాకుండగా నూనె చుక్కగా ఉన్నట్లయితే మహాసాగరంలో ఒక్కటయ్యే అవకాశమే లేదు, ఎన్ని యుగాలయినప్పటికీ మహాసాగరంలో అలా తేలుతూనే ఉంటుంది తప్ప సముద్రంలో విలీనమవడం జరగదు. ఈ విషాదకరమైన పరిస్థితిని దయచేసి గమనించండి - ఆ నూనె చుక్క మహాసముద్రంలో ఉన్నప్పటికీ, సముద్రంతో అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది. మన పరిస్థితి కూడా సరిగ్గా అలాంటిదే. సాక్షాత్తు ఆ భగవంతుడు మనలో అంతర్యామిగా ఉన్నప్పటికీ మనం ఆయనతో సంబంధం లేకుండా జీవించేస్తూ ఉంటాం. ఇంతకంటే పరమ విషాదకరమైన పరిస్థితి మనిషికి ఉండదేమో! 

అయితే ఈ నూనె చుక్కలో ఉన్న నూనెతనం లేక పచ్చిగా చెప్పాలంటే నూనె చుక్కలో ఉన్న జిడ్డు మూలాన అది సముద్రంతో సంబంధం లేకుండా ఉండిపోయింది. ఆ జిడ్డును గనుక ఎలాగో అలాగ తొలగించగలిగి, అందులోని సముద్ర తత్త్వాన్ని ఆవిష్కరించగలిగినట్లయితే అది కూడా మహాసముద్రంలో విలీనమైపోతుంది. ఇదే మన గురుదేవులు మనపై చేస్తున్న ప్రయత్నం - ఈ జిడ్డును వదలకొట్టడం. ఇందులో మన పాత్ర లేక మానవ ప్రయత్నం చాలా ఉంది; అన్నీ మాస్టరే చేసేస్తారన్నది పొరపాటు భావమే అవుతుంది. కచ్చితంగా మన ప్రయత్నం చాలా అవసరం;  చివరికి అసలు పని చేసేది ఆయనే అయినప్పటికీ, సాయశక్తులా మనం చేయవలసిన ప్రయత్నం చాలా ఉంటుంది. 

అయితే మనలో ఉండే ఈ జిడ్డు ఏమిటి? మనకు మనలో అంతర్యామిగా ఉండే భగవంతునితో సంబంధం లేనట్లుగా మనిషి జీవించడానికి కారణమైన ఆ నూనెతనం అంటే ఏమిటి? మూడే మూడు - సంస్కారాలు, కోరికలు, అహంకారము. మూడే కదా అనిపిస్తుంది కానీ, వీటిని వదుల్చుకోడానికి ఎన్ని జన్మలైనా పట్టవచ్చు, సరైన మానవ ప్రయత్నం లేకపోతే, సమర్థుడైన గురువు ఆశ్రయం లేకపోతే.
వీటిల్లో సమర్థుడైన గురువును ఆశ్రయించి, వారు చెప్పింది చెప్పినట్లుగా అనుసరించగలిగితే సంస్కారాలను తుడిచేయగలడు ఈ జన్మలోనే. సాధకుడు తన స్వయం కృషితో తన కోరికలను కూడా తగ్గించుకోవచ్చును. కానీ అహంకారం మాత్రం సాధకుడు మాత్రమే తగ్గించుకోవాలి. ఈ  మూడు సంపూర్ణంగా తొలగినప్పుడు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందడం, నూనె చుక్క నీటి చుక్కగా మారి సముద్రంలో విలీనమయ్యే అవకాశం ఉంటుంది. 

అయ్యబాబోయ్! ఇది మన వల్ల కాదనిపిస్తుంది. కానీ తప్పదు. ఇక్కడే మాస్టర్ యొక్క అనుగ్రహం పని చేసేది. మన జీవన విధానం ఆయనను అనుసరిస్తూ ఆయన అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా మలచుకోగలిగితే వారి అపార అనుగ్రహం వల్ల కూడా పని అయ్యే అవకాశం ఉంటుంది; ఎందుకంటే ఆయన ఉన్నదే మనలను అనుగ్రహించడానికి. అయితే ఇందులో మన పాత్ర, ప్రయత్నం చాలా ఉంది. దాన్నే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

పైన చిత్రంలో ఉన్నట్లుగా మన వైపు నుండి మనం శుద్ధి చేసుకోవలసిన అంశాలు - సాధన, శీలం, ఆత్మావలోకనం, స్వాధ్యాయం, స్వచ్ఛంద సేవ. వీటిని మన స్వభావంగా మారే వరకూ ప్రేమతో, భక్తితో అనుసరించినప్పుడు వారి దృష్టిని లేదా వారి అనుగ్రహాన్ని ఆకర్షించగలుగుతాం. ప్రయత్నిద్దాం. 
తరువాయి భాగంలో వివరాలు చర్చిద్దాం. 




16, అక్టోబర్ 2023, సోమవారం

జ్యోతిష్యం, ఆధ్యాత్మిక జీవనం


 జ్యోతిష్యం, ఆధ్యాత్మిక జీవనం

మనిషి జీవనం, మనిషి మనుగడ బహుశా జ్యోతిష్యాన్ని యేదొక దశలో స్పృశించకుండా ముందుకు సాగదేమోనని నా అభిప్రాయం. నాస్తికులైనా, హేతువాదులైనా కూడా వాటిని విమర్శించడానికైనా వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం కష్టమే. సంసారం అనే ఈ ఇక్కట్లతో కూడిన భవసాగరాన్ని ఈదడానికి, ముఖ్యంగా సగటు మనిషి అనుభవించే బలహీన క్షణాలను అధిగమించడానికి ఎన్నిటినో ఆశ్రయించవలసి వస్తూ ఉంటుంది. అందులో భవిష్యత్తును తెలుసుకోవాలన్న తపనను కొంత వరకూ తెలియజేసేది ఈ జ్యోతిష్యం ఒక్కటే. 

జ్యోతిష్యం అంటే, సగటు మానవ దృష్టిలో, జాతక చక్రం ద్వారా జాతకాన్ని తెలుసుకోవడం; లేక హస్తసాముద్రికం; నాడీ శాస్త్రం; టారోట్ కార్ఢులు; ముఖాన్ని చూసి చెప్పే జాతకాలు ఇత్యాదివి ఇంకా ఎన్నో రకాల పద్ధతుల ద్వారా తమ భవిష్యత్తును, పరిహారాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం. మనిషి జీవితంలో యేదొక దశలో వీటిని ఆశ్రయించేవారున్నారు; లేక వాటినే తు. చ. తప్పకుండా సాంప్రదాయంగా పాటించే వారు కూడా ఉన్నారు.

వెరసి కొంత వరకూ వీళ్ళు చెప్పినవి జరగడం, కొంత జరగకపోవకపోవడం; ఇవన్నీ ఉంటాయి. వీటిని నమ్మడం ఎంత వరకూ కరెక్టు? అన్న మీమాంస ప్రతి మనిషిలోనూ ఉంటూనే ఉంది. ముఖ్యంగా మనిషికి భయం కలిగినప్పుడు, దిక్కుతోచనప్పుడు, అనుకున్నవి అనుకున్నట్లుగా జరగనప్పుడు, విపత్తులు, ఆపదలు సంభవించినప్పుడు, కారణాలు తెలియని సమస్యలతో లేక అనారోగ్యాలతో క్రుంగిపోతున్నప్పుడు, జీవితం ఏ దిశగా కొనసాగుతున్నదో  తెలియనప్పుడు, సాధారణంగా  మనం వీటిని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. ఇవేవీ పని చేయనప్పుడు, అప్పుడు మాత్రమే గురువుల అన్వేషణలో లేక ఆధ్యాత్మిక దిశలో మనిషి ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడు. 

అసలు జ్యోతిష్య శాస్త్రం నమ్మదగ్గదేనా? నిజంగా గ్రహాల ప్రభావం మనపై ఉంటుందా? జాతకంలో వ్రాసినట్లుగానే జీవితం ఉంటుందా? మనం చేయగలిగిందేమైనా ఉంటుందా, ఉండదా? మన జాతకాన్ని లేక మన విధిని ఏమైనా మనం మార్చుకోగలమా, లేదా? ఇటువంటి ప్రశ్నలు కూడా మనిషిని మనసు లోలోతుల్లో వేధిస్తూనే ఉంటాయి. 

హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ గురుపరంపరలోని మాస్టర్ల నుండి మనకేమైనా సమాధానాలు వస్తాయేమో చూద్దాం. 

జ్యోతిష్య శాస్త్రం అనేది మన సనాతన ధర్మంలోని వేదాంగాల్లో ఒకటి. మహర్షులు దర్శించినవి ఇందులో సశాస్త్రీయంగా ఉండటం మూలానే ఇప్పటికీ సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు, సూర్యచంద్రాదులతో సహా ఇతర గ్రహాల కదలికలు,  గ్రహణాలు, అంతరిక్షంలో జరిగే వివిధ సంఘటనలను అంత సరిగ్గా చెప్పగలుగుతున్నారు, ఒక సంవత్సరం ముందే చెప్పగలుగుతున్నారు, జరగబోయేవాటితో సహా. కాబట్టి శాస్త్రాన్ని అజ్ఞానంగా నిరాకరించడానికి లేదు. తప్పక గ్రహప్రభావాలు మనిషిపై ఉంటాయన్నది ఈనాడు సైన్సు కూడా అంగీకరిస్తున్న విషయం. అనుభవిస్తున్నాం కూడా. 

అయితే ఈ జాతకాలు అంటే మన వ్యక్తిగత భవిష్యత్తులు అనేవి కూడా చాలా వరకూ వాళ్ళు ముందుగా చెప్పినట్లుగా జరుగుతూ ఉంటాయి కూడా. అంటే మన జీవితాల్లో అన్నీ  ముందే రాసిపెట్టినట్లుగానే జరుగుతూ ఉంటే ఇక మనం చేయవలసినదేమిటి? అన్న ప్రశ్న కలుగుతుంది. మనిషి అయోమయంలో పడతాడు. అందుకే మనిషి వీటిని ఆశ్రయించడానికి కారణం.

మనిషిలో సంకల్పబలం లేక సంకల్ప శక్తి అనేది కూడా ఒకటుందన్న సంగతి మనిషి మరచిపోతూ ఉంటాడు. ఇది చాలా సూక్ష్మమైన శక్తి. దీన్ని వినియోగిస్తే మన విధిని మనం రూపకల్పన చేసుకోవచ్చు. నా అవగాహణలో మనిషి దీన్ని వినియోగించుకోవడంలోనే విఫలుడవుతూ ఉన్నాడు. 

నేనొకసారి పూజ్య చారీజీ మాస్టరు గారిని ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు ఈ విధంగా సమాధానమిచ్చారు: "విధివ్రాత అనేది ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే తన విధిని మార్చుకోవడానికి ఏ ప్రయత్నమూ చెయ్యడో ఆ వ్యక్తికి మాత్రమే వీధివ్రాత వర్తిస్తుంది" అన్నారు.  అలాగే జ్యోతిష్యం గురించి హార్ట్ టు హార్ట్ ఆంగ్ల ప్రసంగాల శ్రేణిలో మాట్లాడుతూ, ఏ జాతకమైనా రాసింది రాసినట్లుగా జరగాలంటే మూడు పరిస్థితులుండాలన్నారు - 1) జాతకానికి సంబంధించిన సమాచారం పొల్లుపోకుండా కరెక్ట్ గా ఉండాలి, 2) జాతకం చెప్పేవారు పరిపూర్ణ జ్యోతిష్యుడై ఉండాలి ఇక 3) మూడవది, చాలా ముఖ్యమైనది, ఆ జాతకుడు మారడానికి సిద్ధంగా లేనివాడై ఉండాలి. అప్పుడు జాతకం తప్పనిసరిగా ఎలా రాసుందో సరిగ్గా అలాగే జరుగుతుందన్నారు. స్వామి వివేకానంద జ్యోతిష్యం నిజమే అయినప్పటికీ దాన్ని నమ్మకూడదన్నారు, ముఖ్యంగా యువకులు, లేకపోతే సోమరులుగా తయారవుతారన్నారు. పూజ్య దాజీ మన విధిని ఏ విధంగా మనం రూపకల్పన చేసుకోవచ్చునో ఆంగ్లంలో ఒక గ్రంథమే వ్రాయడం జరిగింది.  దాని పేరు - డిజైనింగ్ డెస్టినీ  తప్పక అందరూ చదువవలసిన గ్రంథం. 

ఇందులో పూజ్య దాజీ స్పష్టంగా వివరించినది ఏమిటంటే - మనిషి జీవితంలో మార్చుకోలేని భాగం కొంత ఉంటుంది, మార్చుకోగలిగిన భాగం మన సంకల్ప శక్తితో సమర్థుడైన ఆధ్యాత్మిక గురువు సహాయంతో చాలా వరకూ మార్చుకోవచ్చు; ఆ విధంగా మన విధినే రూపకల్పన చేసుకోవచ్చును. దానికి ఏమి చేయాలో ఏ విధంగా సరళమైన హార్ట్ఫుల్నెస్ యోగా-ధ్యాన ప్రక్రియలు ఉపకరిస్తాయో తెలియజేశారు. 

అందరూ తప్పక ఆ గ్రంథం చదువుతూ హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియలను ఆసక్తితో ప్రతినిత్యం చేసుకుంటూ మన పరమగమ్యానికి మనమే చక్కని త్రోవను ఏర్పాటు చేసుకోవాలని, ఆ అనుభవాన్ని  ఈ జన్మలోనే పొందాలని ప్రార్థిస్తూ .... 


13, అక్టోబర్ 2023, శుక్రవారం

ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక పరిణతి, చైతన్య వికాసం

 



ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక పరిణతి, చైతన్య వికాసం 
ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక పరిణతి, చైతన్య వికాసం - ఈ  మూడూ కూడా పర్యాయపదాలే. అర్థం ఒక్కటే. ప్రతీ సాధకుడూ ఆధ్యాత్మికమగా పురోగతి చెండాలనుకుంటాడు. మన హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ మాస్టర్ల ప్రకారం ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటి? జరుగుతున్నదని ఎలా తెలుస్తుంది? దానికి మనం మన వంతుగా చేయవలసినదేమిటి? వీటికి మనం మౌలికమైన  సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. 

ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏది కాదు?
ఆధ్యాత్మిక పురోగతి అంటే యేది కాదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక పురోగతి అంటే, అకస్మాత్తుగా పేదవాడు ధనికుడైపోవడం కాదు, విద్య లేనివాడు విద్యావంతుడైపోవడం కాదు, తెలివి తక్కువవాడు, తెలివైనవాడైపోవడం కాదు, ఇలాంటివన్నీ వాళ్ళ-వాళ్ళ సంస్కారాల/కర్మల/వాసనల వల్ల జరుగుతాయి. 
అలాగే ఆధ్యాత్మిక పురోగతి అంటే గాలి లోంచి యేవేవో వస్తువులను సృష్టించినట్లు అద్భుతాలు చేయడం కాదు, రకరకాల సిద్ధులు పొందడం కాదు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, కుండలినీ శక్తిని మేలకొల్పడం కూడా కాదు, వీటికి, ఆధ్యాత్మికతకూ ఎటువంటి సంబంధమూ లేదని సుస్పష్టంగా ఎంతో మంది మహాత్ములు తెలియజేయడం జరిగింది, ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. భయంతోనూ, ప్రలోభంతోనూ సాధించేవి యేవీ కూడా ఆధ్యాత్మికత కోవకు చెందవు. 

మరి ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటి? 
బాబూజీ చెప్పిన విధంగా, పాశవికంగా ఉండే మానవుడి నుండి మానవత్వం కలిగిన మానవుడిగానూ, మానవత్వం కలిగిన మానవుడి నుండి దైవత్వంతో నిండిన మానవుడిగానూ మారడమే ఆధ్యాత్మిక పురోగతి. 
స్థూల స్థితిలో ఉన్న చేతనం నుండి రోజురోజుకూ సూక్ష్మంగా మారడమే ఆధ్యాత్మిక పురోగతి. అంటే రోజురోజుకూ మన హృదయం మరింత-మరింత తేలికగా దూది పింజలా తయారవడమే ఆధ్యాత్మిక పురోగతి. స్థూలం నుండి సూక్ష్మంగా, ఆతిసూక్ష్మంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా తయారవడమే ఆధ్యాత్మిక పురోగతి. 
మనిషి చేతనను బట్టే అతని తత్త్వం ఉంటుంది. మనిషి చేతనలో నాణ్యత వస్తే తప్ప మనిషిలో నిజమైన మార్పు రాదు. మరే రకంగా మార్పులు వచ్చినా అవి తాత్కాలికమే, శాశ్వతం కాదు. మనిషి లోలోతుల్లో నుండే వచ్చే మార్పే ఆధ్యాత్మిక పురోగతి. 
పట్టు-పురుగు తాను సృష్టించుకున్న పట్టులో తానే ఇరుక్కున్న రీతిగా ఆత్మ తానే సృష్టించుకున్న ఈ సంస్కారాలు, కోరికలు, అహంకారం అనే వలలో చిక్కుకున్న స్థితిలో నుండి బయట పడటమే నిజమైన ఆధ్యాత్మిక పురోగతి. 
భయము, ప్రలోభాలు పోయి, ప్రేమతో నిండిపోయి నిష్కపటంగా పసిహృదయంగా తయారవడమే  ఆధ్యాత్మిక పురోగతి. 
 
ఆధ్యాత్మిక పురోగతి జరుగుతున్నదీ-లేనిదీ మనకెలా తెలుస్తుంది?
సాధన ప్రతి నిత్యం క్రమం తప్పకుండా సరైన దీక్షతో, భక్తిప్రేమలతో చేస్తున్నప్పుడు రోజు-రోజుకూ తేలికదనాన్ని హృదయంలో అనుభూతి చెందుతాం. రోజు-రోజుకూ దైవంపై ఆధారపడటం పెరుగుతుంది; కుల మత జాతి భాషా బేధాలు మనసులో నుండి సమూలంగా పోయే విధంగా మనం అడుగులు వేస్తూంటాం. భగవంతుని పట్ల సమర్పణా భావం పెరుగుతూ ఉంటుంది; మన కుటుంబం పట్ల, సమాజం పట్ల, ఉద్యోగం పట్ల, దేశం పట్ల, ఇంకా ఇతర ధర్మాల పట్ల సరైన ఆసక్తితో మన కర్తవ్యాలను నిర్వహిస్తాం. అలాగే చుట్టూ ఉండే చెట్ల పట్ల, మొక్కల పట్ల, రాళ్ళ పట్ల, ఆకాశం పట్ల, చుట్టూ ఉన్న వాతావరణం పట్ల ఒక నూతన దృక్పథం ఏర్పడుతుంది; అన్నిటా దైవత్వం గోచరించే అవకాశం ఉంటుంది.  
భయప్రలోభాలు తగ్గుముఖం పడతాయి; నిష్కారణంగా అందరి పట్ల ప్రేమ కలుగుతూ ఉంటుంది; రోజు-రోజుకూ మనశ్శాంతి పెరుగుతూ ఉంటుంది; కష్టాలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతూ ఉంటుంది; భగవంతుడిని యేదీ యాచించడం మానేస్తామ; బదులుగా జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాం; మనకు ప్రతికూలంగా ఉన్నవాటిని కూడా స్వీకరించగలుగుతాం, కోరికలు తగ్గుముఖం పడతాయి, అహంకారం తగ్గుతూ ఉంటుంది, క్షమా గుణం ఎక్కువవుతూ ఉంటుంది; ఇలా కొన్ని సూచనలు మనకే కనిపించడం మొదలెడతాయి; ఇదే చైతన్య వికాసం. 
అదే రోజు-రోజుకీ గుండె బరువెక్కుతున్నదంటే మనం మనలో సవరించుకోవలసినవి చాలా ఉన్నాయని తెలుసుకోవాలి, వాటిని ఆత్మావలోకనం ద్వారా గుర్తించే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత శ్రీదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి.

ఆధ్యాత్మిక పురోగతికి మనం మన వంతుగా ప్రతి నిత్యం చేయవలసినదేమిటి? 
ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనలో కొరతలను సరిదిద్దుకుంటూ, దిద్దుకోలేనివాటికి భగవంతునికి మొరపెట్టుకుంటూ, చేసిన తప్పలకు పశ్చాత్తాపం చెందుతూ, చేసిన తప్పులు మరలా చేయకుండా ఉంటూ జీవితాగమనాన్ని కొనసాగించడానికి సంపూర్ణ ప్రయత్నం చేయాలి.  
గురువును ఆశ్రయించినవారు గురువు పట్ల విధేయతను మరింత-మరింతగా పెరిగేలా చూసుకోవాలి; గురువు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి ప్రయత్నించాలి; వారి బోధనలను నిత్యజీవితంలో అన్వయించుకుని జీవించే ప్రయత్నం చేయాలి; వారి ఆదేశాలను పాటించే ప్రయత్నం చేయాలి; ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులొస్తే గురువును వేడుకోవాలి; ప్రతినిత్యం క్రమ  తప్పకుండా సాధన చేసుకోవాలి. శీలనిర్మాణం పట్ల తగిన శ్రద్ధ వహించాలి. 
గురువును ఇంకా ఆశ్రయించనివారు మన శాస్త్రాల అధ్యయనం చేసి, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ, పెద్దలను అనుసరించే ప్రయత్నం చేయాలి. ఇది గురువును ఆశ్రయించినవారికి కూడా వర్తిస్తుంది. 



11, అక్టోబర్ 2023, బుధవారం

మానవ శరీరము, మానవ జీవితము


మానవ శరీరము, మానవ జీవితము 

మానవ  శరీరం  

త్రిగుణాత్మకం అంటే మూడు గుణాల సమ్మేళనం - సత్త్వ గుణం, రజో గుణం, తమో గుణం.   

పంచభూతాత్మకం - భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అయిదు తత్త్వాలతో  తయారైనది. 

మూడు శరీరాలు - స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 

స్థూల శరీరం - చర్మము, యముకలు, నరాలు, నాళాలు, వివిధ అవయవాలు (కాళ్ళు, చేతులు, వేళ్ళు, కళ్ళు, కనుబొమ్మలు, కనురెప్పలు, ముక్కు, చెవులు, మెడ, నోరు, నాలుక, పళ్ళు, కొండనాలుక, గుండె, ఊపరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాలు, ఉదరం, జననేంద్రియాలు, పిరుదులు, నడుము,  అస్తిపంజరం, క్లోమకం, వెన్నుపూస, వెన్నెముక, తలకాయ, పుర్రె, మెదడు, 

సూక్ష్మ శరీరం -19 సూక్ష్మ శరీరాలు 

పంచ కర్మేంద్రియాలు (కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుహ్యము); పంచ జ్ఞానేంద్రియాలు (చెవులు-శబ్ద, కళ్ళు-రూప, చర్మము-స్పర్శ, నాలుక-రస, ముక్కు-గంధ), పంచ ప్రాణాలు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ప్రాణవాయువులు),   అంతఃకరణ చతుష్టయం - మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. 

పంచకోశాలు - అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం.  


                        

కారణ శరీరం - ఆత్మ 


మానవ జీవితంలో 

అనివార్యమైనవి నాలుగు - జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ  నాలుగూ తప్పించుకోలేనివి. 

నాలుగు ఆశ్రమాలు - బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస  ఆశ్రమాలు 

నాలుగు దశలు - బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము. 


మానవ చైతన్యంలో 

మూడు ప్రధాన అవస్థలు - జాగృదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 

ఇతర ఉన్నత అవస్థలు: తురీయావస్థ, తురీయాతీత ఇంకా మరెన్నో సూక్ష్మ అవస్థలు.   








5, అక్టోబర్ 2023, గురువారం

శీల నిర్మాణము - ఆధ్యాత్మికము - ధ్యానం

 


శీల నిర్మాణము  - ఆధ్యాత్మికము - ధ్యానం
  శీల నిర్మాణం అభ్యాసి బాధ్యత, ఆధ్యాత్మిక పురోగతినివ్వడం నా బాధ్యత
- బాబూజీ  మహారాజ్ 
నేను మీ పట్ల చేస్తున్నది నా బాధ్యత; మీరు నా పట్ల ఏమి చేయడం లేదో అది మీ బాధ్యత. 
- బాబూజీ  మహారాజ్ 
శీలనిర్మాణం అనగానే ప్రముఖంగా అందరికీ స్ఫురించే వ్యక్తి స్వామి వివేకానంద. శీలాన్ని గురించి బహుశా అంతా విస్తృతంగా మాట్లాడినది కూడా ఆయనే. వారి బోధనలను అనుసరిస్తూ తరించిన వాళ్ళు, తరిస్తున్నవాళ్ళు ఇప్పటికీ  ఉన్నారు, భవిష్యత్తులో కూడా తప్పక ఉంటారు. 
అసలు శీలనిర్మాణం అంటే ఏమిటి? ఇది అంత అవసరమా? అందులో ఆధ్యాత్మికతకూ, ధ్యానానికీ శీలనిర్మాణానికి గల సంబంధం ఏమిటి? ఎప్పుడు మొదలవుతుంది? ఎలా మొదలవుతుంది? తనంతతానుగా అప్రయత్నంగా జరుగుతుందా? ఈ ప్రశ్నలు ప్రతీ సాధకునికీ కలుగుతాయన్నది నా విశ్వాసం. వీటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

శీలనిర్మాణం ఎవరికి అవసరం?
శీలనిర్మాణం అనేది ఎదగాలనుకున్న ప్రతీ వ్యక్తికీ అవసరం; ఆధ్యాత్మిక పరిణతి చెందాలనుకున్న ప్రతీ సాధకునికి అవసరం; ప్రకృతికి అనుగుణంగా శ్రుతిలో ఉంటూ జీవించాలనుకునే వారందరికీ అవసరం; అర్థవంతమైన జీవితం గడపాలనుకున్నవారందరికీ  అవసరం; జీవిత ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలనుకున్నవారందరికీ అవసరం; మానవ పరిపూర్ణత దిశగా ప్రయాణించాలనుకున్నవారందరికీ అవసరం; సంపూర్ణ ఆత్మ సంతృప్తి కలిగే విధంగా జీవించాలనుకునేవారికి అవసరం; విలువలతో కూడిన జీవితం  కావాలనుకున్నవారికి అవసరం; దైవసాక్షాత్కారం లేక ఆత్మసాక్షాత్కారం కావాలనుకున్నవారికి అవసరం; జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకున్నవారికి అవసరం; జీవితంలో రాణించాలనుకున్నవారికి అవసరం; మానవ పరిపూర్ణతను సాధించాలనుకున్నవారికి అవసరం.  వెరసి శీలనిర్మాణం, మనస్సాక్షికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా, విలువలకు దూరంగా, అపరాధభావాన్ని ప్రోగు చేసుకుంటూ హృదయభారాన్ని మరింత పెంచుకోవాలనుకునే వారికి తప్ప, అందరికీ అవసరమని స్పష్టమవుతున్నది.  

శీలనిర్మాణం అంటే ... 
శీలనిర్మాణం అనేది ఇటుకపై, ఇటుక పెడుతూ కట్టే ఇటుక-కట్టుడులాంటిది. మనిషి చేసే ప్రతీ సంకల్పంతోనూ ప్రతీ ఆలోచనతోనూ, ప్రతీ అలవాటుతోనూ, ప్రతీ ప్రవర్తన ద్వారా, నిర్మింపబడేది శీలనిర్మాణం. కాబట్టి ఒక్కరాత్రిలో అయిపోయేది కాదు. వీటి నాణ్యతను బట్టే, వీటి శుద్ధతను బట్టే, మన శీలం ఏర్పడుతుంది. శీలనిర్మాణం తనంతతానుగా జరిగే ప్రక్రియ కాదు; అప్రయత్నంగా జరిగేది కాదు; ప్రయత్నపూర్వకంగా, సంపూర్ణ స్పృహతో నిర్మాణం చేసుకునేది. కాబట్టి ఇందులో మన సంకల్పశక్తిని ఉపయోగించడం చాలా అవసరం. 

శీలము-ఆధ్యాత్మికము-ధ్యానము 
మన పెద్దలందరూ కూడా శీలం లేకపోతే ఆధ్యాత్మికత లేదన్నారు. అసలు సరైన జీవితమే ఉండదు.  సౌశీల్యం లేకపోతే ఆధ్యాత్మిక స్థితులు గాని ఆధ్యాత్మిక సంపద గాని నిలబడదు. ఆధ్యాత్మిక సాధన ద్వారానే లేక ధ్యానం ద్వారా మాత్రమే మనిషి అంతరంగంలో ఉన్న  సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతుంది; అంటే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, అనే ప్రధాన  సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతుంది. మన ఆలోచనలకు, చేతలకు, అలవాట్లకు, ప్రవర్తనకు వెరసి మన శీలానికి మూలకారణమైనటువంటి వీటి శుద్ధి జరుగుతుంది; లోపల జరుగుతున్న ఈ శుద్ధికి అనుగుణంగా పై నుండి మన ఆలోచనలను, ప్రవర్తనను మాలచుకోవాడమే శీల నిర్మాణం. ఈ ప్రక్రియ, పై నుండి మనిషి ప్రయత్నపూర్వకంగా చేయవలసిన పని. అదేమిటి? మరి ధ్యానం/ఆధ్యాత్మిక సాధన చేత శీలం అప్రయత్నంగా ఏర్పడదా? తప్పక శీల నిర్మాణం జరుగుతుంది కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది; అందుకే సాధకుడు రోజూ చేసుకునే ధ్యానం తరువాత కలిగే సూక్ష్మ స్థితికి అనుగుణంగా ఆ స్థితితో లయమై ఉంటూ మన శీలాన్ని మలచుకోవడం ప్రతీ సాధకుడు తప్పక చేయవలసినది; లేకపోతే మనం ధ్యానంలో పొందిన స్థితిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక సంపద, శీల నిర్మాణం - ఈ రెండూ చేదోడు-వాదోడుగా ఉంటూ ముందుకు సాగడమే, పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వికాసం అవుతుంది. ఇటువంటి జీవితం మానవ పరిపూర్ణతకు దారి తీస్తుంది. 

ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పటి వరకూ కొనసాగాలి?
మనిషి నిర్దుష్టమైన గమ్యం ఏర్పరచుకున్నప్పుడు; ఆ గమ్యానికి అనుగుణంగా తన శీలాన్ని నిర్మించుకోవడం ప్రారంభిస్తాడు; ఈ  ప్రక్రియ ప్రతీ క్షణమూ జరిగేది. ఆ గమ్యం రకరకాలుగా ఉండవచ్చు; గమ్యాన్ని బట్టి తన శీలాన్ని నిర్మించుకోవడం, లేక వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతూ ఉంటుంది; అది ఆధ్యాత్మిక గమ్యమైతే, తపన యొక్క తీవ్రతని బట్టి, శీలనిర్మాణం యొక్క అవసరాన్ని గుర్తించడం జరిగి, తగిన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది, సాధకుడి ద్వారా; మరింత సూక్ష్మ స్థాయిల్లో తనను తాను మలుచుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక గమ్యం అంత సూక్ష్మాతి  సూక్ష్మమైనది కాబట్టి. ఈ  ప్రయత్నం లేక ఈ దిశగా చేసే కృషికి అంతం అంటూ ఉండదు; తుది శ్వాస వరకూ జరుగుతూండవలసిందే; అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. 

శీలనిర్మాణానికి సాధనం ఆత్మావలోకనం  
శీలనిర్మాణానికి సాధనం అంటే ప్రతీ క్షణం నడిపించేది - ఆత్మావలోకనం; స్వాధ్యాయం అంటే తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవడం; తన ఆలోచనలను, చేతలను, అలవాట్లను, ప్రవర్తనను, ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉండటం; దీనికి ధ్యానం అద్భుతంగా సహాయపడుతుంది, ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి చక్కటి సహకారాన్ని అందిస్తుంది. 

తేలికగా శీలనిర్మాణం జరగాలంటే...  
పెద్దలు చెప్పినది: ఎవరో ఒకరిని ఆదర్శ వ్యక్తిగా భావించి, ఆ వ్యక్తి మనం ఆరాధించే వ్యక్తిగా మారడానికి గల కారణాలను, ఆ వ్యక్తి చేసిన కృషిని కూలంకషంగా అధ్యయనం చేస్తూ త్రికరణ శుద్ధిగా అనుసరించే ప్రయత్నం చేయమన్నారు. 







2, అక్టోబర్ 2023, సోమవారం

జన్మ మృత్యు జరా వ్యాధి

 


జన్మ మృత్యు జరా వ్యాధి 

ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవచ |  

జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనం || భగవద్గీత 13.9|| 

మానవ జన్మకు నాలుగు ప్రధాన దుఃఖాలున్నాయి, తప్పవు ఎవరికైనా. జన్మ, మృత్యువు, జరా, వ్యాధి, ఈ  నాలుగు దుఃఖాలు తప్పనిసరిగా ప్రతీ మనిషీ ఎదుర్కోవలసినదే. జన్మ అంటే పుట్టుక, మృత్యువు అంటే మరణం, జరా అంటే ముసలితనం, వ్యాధి అంటే రోగం, ఈ  నాలుగు దుఃఖాలు తప్పనిసరిగా అందరూ అనుభవింమచవలసినదేనని మన శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. 

వీటిని తప్పించుకోలేమని తెలిసినా, తెలియకపోయినా వాటిని పోగొట్టుకోవాలని మానవుడు సర్వవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు.  ఒక్కసారి జన్మించామంటే తక్కిన మూడు దుఃఖాలు వాటంతటవే తగులుకుంటాయి. నాకు ముసలితనం అంటే ఆసక్తి లేదు; నాకు మృత్యువు అంటే ఇంటరెస్ట్ లేదు అంటే అది హాస్యాస్పదమే అవుతుంది తప్ప వాటిని తప్పించుకునేది ఉండదు. అందుకే జన్మే లేకుండా పోతే మిగిలిన మూడూ ఉండవు కదా అని మన మహర్షులు యోచన చేశారు, పరిష్కారాలు కనుగొన్నారు. వాటినే మనం యోగా-ధ్యాన పద్ధతులంటాం. అందుకే దీన్ని జన్మరాహిత్యం అని కూడా అంటారు. కాబట్టి ప్రతీ మనిషి ఈ  జన్మరాహిత్యం కోసం తెలిసో-తెలియకో, ఈ రోజో-రేపో మనసు పెట్టవలసిందే. ఎంత త్వరగా మనసు దానిపై కుదురితే అంత సమయం ఆదా అవుతుంది. 

కాబట్టి ఏ యోగపథమైనా మనకు నేర్పించవలసినది జన్మకు, మృత్యువుకు మధ్య సక్రమంగా జీవించే విధానం ఏమిటి, లేక సక్రమంగా మరణించే విధానం ఏమిటి అన్నది తెలియజేయాలి. ఇక్కడ సక్రమంగా జీవించడమూ అంటే మరలా జన్మించవలసిన అవసరం లేకుండా జీవించే కళను నేర్చుకోవడం (ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుకోవచ్చు); అలాగే సక్రమంగా మరణించడమూ అంటే మరలా మరణించవలసిన అవసరం లేకుండా మరణించగలిగేటువంటి శిక్షణను పొందడం (ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనవచ్చునేమో).  అదే మన హార్ట్ఫుల్నెస్  యోగపథము, లేక హార్ట్ఫుల్నెస్  జీవన విధానం.

ఈ  నాలుగు దుఃఖాలను మనిషికుండే నాలుగు ప్రధాన ఒత్తిళ్ళు అని కూడా అనవచ్చు. ఈ ఒత్తిళ్ళను సంపూర్ణంగా అధిగమించే ఉపాయమే యోగము లేక ధ్యానము. ఈ  నాల్గిటికి మూల కారణాలు, కోరికలు, సంస్కారాలు/కర్మలు/వాసనలు, అహంకారము. జన్మకు, మృత్యువుకు మధ్య ఉండే జీవనాన్ని సద్వినియోగపరచుకుంటూ వీటిని క్రమక్రమంగానైనా అధిగమించే ప్రయత్నమే ఈ  యోగానుష్ఠానం. అందునా హార్ట్ఫుల్నెస్ జీవన విధానం ద్వారా సంసార సాగరంలో ఉంటూనే ఆధ్యాత్మిక దృష్టితో జీవించే కళను మనం నేర్చుకోగలుగుతాం, తద్వారా మృత్యుభయం క్రమక్రమంగా నశిస్తుంది కూడా. 

కాబట్టి వీటి పట్ల ఉండవలసిన యదార్థ వైఖరి కలిగి ఉంటూ అనవసరంగా కంగారు  పడకుండా, క్రుంగిపోకుండా స్వీకరించడం నేర్పిస్తుంది ఈ హార్ట్ఫుల్నెస్ యోగ పద్ధతి. ఈ పరమసత్యాలను ఈ  జన్మలోనే అనుభవంలోకి అందరూ తెచ్చుకుందురుగాక. అందరూ ప్రయత్నింతురుగాక!  

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...