26, జులై 2023, బుధవారం

కృతజ్ఞత - పూజ్య దాజీ

పూజ్య గురుదేవులు దాజీ, పూజ్యశ్రీ చారీజీ జన్మదినోత్సవ సందర్భంగా (జూలై 23,24,25, 2023 తేదీల్లో) "కృతజ్ఞత" ను గురించి ఇచ్చిన సందేశంలో  నుండి కొన్ని అద్భుత వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి; ప్రతి ఒక్కరూ సత్సంగాల్లో మన గురుపరంపర అందించిన ఆధ్యాత్మిక స్థితులను కొనసాగించుకునే   ప్రయత్నంలో ధ్యానించుకోవలసిన మహావాక్యాలు:  

కృతజ్ఞత లేని వ్యక్తి బ్రహ్మ విద్యకు అర్హుడు కాడు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత పట్ల మళ్ళాలంటే, ఈ కృతఘ్నతకు సంబంధించిన అలవాట్లను మానుకోవాలి. – లాలాజీ

పాపం అంటూ ఏదైనా ఉందీ  అంటే,  అది కృతజ్ఞతారాహిత్యమే. – బాబూజీ 

కృతజ్ఞతను ఎలా ఆపగలం? కృతజ్ఞత జీవితంలో కళ్ళల్లో నుండి హృదయ ప్రవాహం ధారగా వస్తున్నప్పుడు దాన్ని సంస్కృతంలో అశ్రుధార అంటారు. కళ్ళల్లో నుండి వచ్చే రెండు అశ్రుధారలను గంగాయమునలతో పోలుస్తారు. అటువంటి అశ్రులు పవిత్రమైనవి, ధన్యమైనవి. అటువంటి అశ్రులు హృదయ లోలోతుల్లో పాతుకుపోయిన అపరాధ భావానికి సంబంధించిన భారాన్ని తొలగించి, హృదయంలో ఆనకట్ట వేయబడిన కృతజ్ఞత స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేలా చేస్తాయి. ఆ ఆనకట్ట పగిలినప్పుడు మనం ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. ఇది చాలా గొప్ప అనుభవం.  అభ్యాసికి ఇటువంటి  అనుభవం జరుగుతున్నప్పుడు ఆపకండి, జరగనివ్వండి. – చారీజీ 

 కృతజ్ఞత. అఖలాఖ్ కు సంబంధించిన లక్షణాలైన స్వార్థరహితంగా ఉండటం, వినమ్రత, ఆ సర్వశక్తిమంతుని పట్ల సమర్పణ భావము,   పెంపొందిస్తుంది. - దాజీ

గుండె నిండా కృతజ్ఞత వరదలై పొంగాలంటే,  గుండె పూర్తిగా ఖాళీ అయిపోవాలి. ఇంతకంటే ఏమాత్రం తక్కువగా ఉన్నా కుదరదు.- దాజీ

అద్భుతాలు సృష్టించే సామర్థ్యం అనుగ్రహంలో  ఉంటుంది. దివ్యలోకంలో ఉన్న మహనీయులు ఆనందంగా ఉండి, సూక్ష్మంగా మనతో ఉన్నప్పుడు ఈ కృప వర్షించడం జరుగుతుంది.= దాజీ

కృతజ్ఞత అనేది పువ్వు యొక్క పరిమళం లాంటిది, దానికి ప్రత్యేకమైన గమ్యం అంటూ ఏదీ  ఉండదు.  మీరు భగవంతుని నమ్మినా ఫర్వాలేదు, నమ్మకపోయినా ఫర్వాలేదు; మీరు కృతజ్ఞతను అనుభూతి చెందడమే ముఖ్యం.- దాజీ

నిజాయితీగా కృతజ్ఞతను  అనుభూతి చెందే స్థితిలో నుండి వెలువడే నిశ్శబ్ద ప్రార్థన తప్పక తన నిర్ధారిత గమ్యాన్ని చేరి తీరుతుంది, నిజానికి  అటువంటి  ఉద్దేశం లేకపోయినా సరే. - దాజీ

ఆ పరతత్వంతో అనునాదం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నిజమైన కృతజ్ఞత ఆవిర్భవిస్తుంది; ఇక బాహ్య సంఘటనలపై గాని లేక ఆధ్యాత్మికపరమైన ఆశీస్సులపై గాని ఆధారపడటం ఉండదు. సమస్త రకాల కోరికలూ  అంతరించినప్పుడే ఆ పవిత్ర స్థితిలోకి ప్రవేశించగలుగుతాం.  - దాజీ 

పైన తెలిపిన ఒక్కొక్క వాక్యాన్ని మన ఆధ్యాత్మిక సాధనలో, శ్రవణ,మనన, నిధిధ్యాసనల ద్వారా మన జీవ వ్యవస్థలోని ప్రతీ కణంలోనూ శాశ్వతంగా ఇంకిపోయేలా చేసుకునే ప్రయత్నం చేద్దాం.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...