18, జులై 2023, మంగళవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 2

 


బాబూజీతో చారీజీ 
గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః 
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 

బాబూజీ చారీజీ అనుబంధం, ఎన్నెన్నో జన్మల అనుబంధం 
చారీజీకి తన గురుదేవులైన బాబూజీతో అనుబంధం, ఈ జన్మలో 1964 వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. వారి ప్రసంగాల్లోనూ, సంభాషణల్లోనూ వారు తెలియజేసినదేమంటే కనీసం అయిదారు జన్మలలో కలిసి జీవించారు; కాకభూషుండి మహర్షిగా  బాబూజీ ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగానూ, పతంజలి మహర్షిగా ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగానూ, మరొక జన్మలో ఇద్దరూ వైశ్యులుగానూ జన్మించినట్లు తెలియజేయడం జరిగింది. అంతే కాదు, ఒక జన్మలో వారు సెయింట్ పాల్ గా (ఏసు క్రీస్తు శిష్యుడిగా) కూడా ఉన్నారట. ఆ విధంగా ఈ ఇద్దరి ఆధ్యాత్మిక దిగ్గజాల, మహాపురుషుల అనుబంధం ఇప్పటిది కాదు. 

చారీజీ మొట్టమొదటిసారిగా తన గురుదేవులను దర్శించుకుందామని ఉత్తర ప్రదేశ్ లోని షాజహానుపూర్ వెళ్ళినప్పుడు బాబూజీ, 5 అడుగులు కూడా సరిగ్గా లేని ఒక బలహీన ముదుసలి వ్యక్తి, ఒక మంచం మీద గోడకు తిరిగి పడుకొని ఉండటం చూశారు. ఎంతో చదువుకున్న, ఉత్కృష్ఠ వైష్ణవ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన, మహామేధావి, టి. టి. కె. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నతాధికారిగా  ఉన్న ఆధునిక వ్యక్తిత్వం, అది చూసి, "ఈయన నాకు గురువా" అని నిరాశ చెందారు. ఆ తరువాత కొంత సేపటికి బాబూజీ మేల్కొని చారీజీ వైపు చూసి, ఎవరు నువ్వు, ఎక్కడిని వచ్చావు? అని ప్రశ్నించినప్పుడు, వారి కళ్ళల్లోకి చారీజీ తదేకంగా చూసినప్పుడు, బాబూజీ  కళ్ళు అంతులేని  లోతుగా ఉన్న సాగరాల్లా  కనిపించాయట. వెంటనే శ్రీకృష్ణుని నోటిలో యశోదకు  సమస్త సృష్టీ కనిపించిందీ  అంటే ఆశ్చర్యం లేదని వెంటనే నమ్మేసారట. అంతే కాదు, ఈయన కాకపోతే మరెవరవుతారు నా గురువు అని సంభ్రమాశ్చర్యాలతో, కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఆ క్షణం నుండి వారిని స్వంతం చేసేసుకున్నారు. వారి తదుపరి 50 సంవత్సరాల జీవితం ఈ అద్భుత క్షణం యొక్క కార్యరూపమే. తీవ్ర పరితప్త హృదయం గల జిజ్ఞాసువు, తన గురుదేవులతో మొట్టమొదటి కలయిక ఆ విధంగా జరిగినప్పుడు, అటువంటి  కలయిక ఎవరిలోనైనా క్షణకాలంలో  సంపూర్ణ పరివర్తనకు బీజం వేస్తుంది.  

మాస్టరును స్వంత చేసుకోవడంతో, ఆయన అందించిన  సహజమార్గ పద్ధతిని,  ఆయన ఆశయాన్ని, సంస్థను, అప్పుడే మానసికంగా స్వంతం చేసేసుకున్నారు. ఆ క్షణం నుండి వారు ఆవిశ్రాంతంగా, నిర్విరామంగా, రాత్రింబవళ్ళూ ఎంతో నిబద్ధతతో, ఎంతో కృతజ్ఞతతో, ఎంతో వినమ్రతతో, వారి వృత్తిని, సంసారాన్ని, సంస్థను ఎంతో నేర్పుతో నిర్వహిస్తూ వచ్చారు. 

బాబూజీ మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటన చేయాలనుకున్నప్పుడు చారీజీని తోడు రావాలని కోరడం జరిగింది బాబూజీ. అప్పటి నుండి విదేశీ పర్యటనలు చేసినప్పుడల్లా చారీజీ ఎప్పుడూ ప్రక్కనే ఉండేవారు. వ్యక్తిగతంగా గురుశుశ్రూష చేశారు; అప్పుడప్పుడు వండి పెట్టేవారు, హుక్కా తయారు చేసేవారు, వారి అవసరాలన్నీ చూసుకునేవారు; బాబూజీ విదేశీయులతో మాట్లాడిన మాటలను వాళ్ళకు అర్థమవడానికి వాటిని విశదీకరించేవారు; సహాజమార్గాన్ని గురించి, గురువు లేక మాస్టరు గురించి విదేశాల్లో తెలియజేసినది చారీజీ; ఈ రోజు ఇటువంటి సంస్కృతి విదేశీ అభ్యాసుల్లో కనిపించడానికి  వీరిరువురే కారణం. 

వారి ప్రసంగాల్లో ప్రతీ  వాక్యంలోనూ "మై మాస్టర్ బాబూజీ మహారాజ్" అన్న పదబంధం తప్పక వినిపించేది; వారి ప్రవర్తనలో అణువణువూ బాబూజీ స్పర్శ తొణికిసలాడేది; ఆయన "మై మాస్టర్ బాబూజీ మహారాజ్" అని అంటూంటే వింటున్న అభ్యాసులందరూ పులకించిపోయేవారు. ఆయన తన గురువును ఎంతగా తనలో లీనం  చేసుకున్నారో, లేక బాబూజీలో చారీజీ ఎంతగా లీనమైపోయారో, లేక ఇద్దరూ ఎలా ఏకమైపోయారో స్ఫురించేది.

బాబూజీని ప్రత్యక్షంగా చూడని అభ్యాసులు చాలా మంది చారీజీ సాంగత్యంలో బాబూజీని చూడలేదన్న లోటును శాశ్వతంగా పోగొట్టుకున్నారు. సహజమార్గ మాస్టర్ల గొప్పదనం అనుకుంటాను: సజీవ మాస్టరును మనస్ఫూర్తిగా స్వీకరిస్తే మన గురుపరంపరలోని అందరి మాస్టర్ల సాన్నిధ్యయన్ని అనుభూతి చెందగలుగుతారు. ఇది నా ప్రగాఢమైన విశ్వాసం, అనుభవం. అంతెందుకూ మన పూజ్య దాజీ ఒక్కోసారి లాలాజీ లాగానూ, ఒక్కోసారి బాబూజీగానూ, ఒక్కోసారి చారీజీగాను ఒక్కోసారి దాజీగానూ స్ఫురిస్తూ ఉంటారు. అది మన అంతరంగ ఆధ్యాత్మిక స్థితి పైన కూడా ఆధారపడి ఉంటుందేమో నాకు తెలియదు. 
                                                                                (సశేషం ..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...