21, జులై 2023, శుక్రవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 5

 


చారీజీ - దాజీ
గురుపరంపరలోని గురుద్వయం 

దుర్లభం త్రయం యేవ యేతత్  దేవానుగ్రహహేతుకం 
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయః 

గురుపరంపర ప్రాముఖ్యత 
ఏ ఆధ్యాత్మిక సాంప్రదాయానికైనా మానవాళికి తమ బోధలతో మార్గదర్శనం చేయడానికి, ఆయా ధ్యాన పద్ధతులను సంరక్షించుకోడానికి గురుపరంపర అవసరం. లేకపోతే అద్భుతమైన ధ్యాన పద్ధతులు కాలగర్భంలో కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. అలా ఎన్నో పద్ధతులు కనుమరుగయ్యాయో మనకు తెలియదు. 

అలా కాలగర్భంలో కనుమరుగైన విద్యే ప్రాణాహుతి ప్రసరణ విద్య. ఈ రాజయోగ  విద్య దశరథమహారాజుకు 72 తరాల పూర్వం వినియోగంలో ఉండేదట. అంటే రాముని కాలంలో లేదు, కృష్ణుని కాలంలో కూడా లేదన్నట్లే. అటువంటి విద్యను పూజ్య లాలాజీ పునరుద్ధరించడం జరిగింది. మానవాళికి అతి త్వరితంగా మోక్షసిద్ధి కలగాలంటే ఏమైనా మార్గం ఉండేమోనని వారు అన్వేషణ చేసినప్పుడు వెల్లడైన మహా సత్యం. ఆ అపూర్వ పద్ధతినే గురుపరంపర ద్వారా ఒకరి తరువాత ఒకరికి మరలా కోల్పోకుండా పదిలంగా సంరక్షిస్తూ అందజేయడం జరుగుతోంది. సాధకులు ఈ విద్యనభ్యాసం చేస్తేనే ఇది కాపాడబడుతుంది. 

ఆ విధంగా సహజమార్గ రాజయోగ ధ్యాన పద్ధతిలో ప్రస్తుతం గురుపరంపరలో నాల్గవ తరం గురువు పూజ్య దాజీ రూపంలో మనకు మార్గదర్శనం చేస్తున్నారు. పూజ్య చారీజీ మూడవవారు.  ప్రత్యక్షానుభవమే  దీనికి నిదర్శనం. ప్రాణాహుతి విద్యతో కూడిన ఈ  రాజయోగ ధ్యానం మనిషిలో పరివర్తన తీసుకురావడం కొద్ది కాలం ధ్యానం చేసినవారందరికీ సుపరిచితమే. 

అయితే సహాజమార్గ గురుపరంపరలో ఇప్పటి వరకూ వచ్చిన గురువులు, ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్రను పోషించి మానవ కళ్యాణానికి కాలానుగుణమైన  సేవలనందించి ఆ తరువాతి మాస్టరుకు రంగం సిద్ధం చేసి వెడుతూ ఉంటారు; ఆ విధంగా లాలాజీ ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించినవారు; బాబూజీ, చారీజీ ఈ ఉద్యమానికి పటిష్ఠమైన పునాదులు ఏర్పరచడానికి వచ్చినవారు; పూజ్య దాజీ, వ్యాప్తి కోసం విస్తరణ కోసం వచ్చినవారు. వారి-వారి కర్తవ్యాలను బట్టి వారి కార్యాచరణను మనం గమనించవచ్చు, తదనుగుణంగా మన వంతు సహకారాన్ని స్పష్టమైన అవగాహనతో అందించవచ్చు. 

చారీజీ - దాజీ 
పూజ్య చారీజీ 1983 లో శ్రీరామ చంద్ర మిషన్ అధ్యక్షులుగా బాబూజీ తరువాత బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనేక అల్పమైన కారణాల వల్ల వారిని సంపూర్ణంగా సజీవ మాస్టరుగా స్వీకరించడానికి అభ్యాసులకు  కొంత వ్యవధి పట్టింది. అప్పటి నుండి వారి నిర్విరామ కృషితో చారీజీ 100 దేశాలకు పైగా తన గురుదేవుల సందేశాన్ని, సహాజమార్గ పద్ధతిని వ్యాపింపజేశారు. 2014 లో వారు మహాసమాధి పొందారు. 

కానీ పూజ్య చారీజీ 2011 లోనే పూజ్య దాజీని తన వారసునిగానూ, పూజ్య బాబూజీ యొక్క రెండవ ప్రతినిధిగానూ ప్రకటించడం జరిగింది. 2006 వ సంవత్సరం నుండే దాజీ చెన్నైలో చారీజీ ఆజ్ఞ మేరకు అమెరికాలోని తన వ్యాపారాలన్నీ తన పుత్రులకు  అప్పగించి చెన్నైలోనే ఉండిపోయారు. 2012 నుండి శ్రీరామచంద్ర మిషన్ వైస్-ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు. 2011 నుండి చారీజీ ప్రతీ సమావేశంలోనూ, ప్రతీ నగరంలోనూ,  స్వయంగా అభ్యాసులందరికీ పరిచయం చేశారు. 

ఉభయులూ కలిసి ఆ తరువాత అనేక సత్సంగాలు అభ్యాసులకు నిర్వహించేవారు. ఆ గురుద్వయాన్ని  చూసి, వారిలో వారు చేసుకునే గుస-గుసలు చూసి అభ్యాసులు తన్మయత్వం చెందేవారు. ఇద్దరు మహాపురుషుల సాన్నిధ్యాన్ని అనుభూతి చెందిన అభ్యాసులందరూ ధన్యులు. 

2014, డిశంబర్ 20 న పూజ్య చారీజీ మహాసమాధిని పొందారు. అందరూ శోకాసముద్రంలో మునిగిపోయారు. ఇలా ఉండగా మరునాడు ఆ బ్రైటర్ వరల్డ్ నుండి పూజ్య చారీజీ నుండి ఒక సందేశం వస్తుంది - ... చివరికి నా కష్టాలన్నీ అయిపోయాయి, ఇక చేయవలసిన ఆఖరి లాంఛనాలు మిగిలాయి. అంతా బాగానే ఉంది. ఇక్కడ ఒక నూతన జీవితం ప్రారంభమవుతోంది... - అంటూ ఒక విస్పర సందేశం డిశంబర్ 21, 2014 - 10 గంటలకు అందుకోవడం జరిగి ఒక్కసారిగా అభ్యాసులందరూ సేద తీరారు విచిత్రంగా. ఇది నాకు అబ్బురపరచే అనుభూతి - ఎప్పుడూ చరిత్రలో గాని ఎక్కడా వినలేదు, ఉన్నత లోకాలకు వెడలిన వ్యక్తి క్షేమంగా చేరాను అన్నట్లుగా ఒక జాబు వ్రాయడం. అటువంటి అద్భుత మాస్టర్ల సాంగత్యంలో మనం ఉన్నాం, అటువంటి అద్భుత సంస్థతో మనం కూడి ఉన్నాం, అటువంటి అద్భుత పద్ధతిని మనం అనుసరించే ప్రయత్నం చేస్తున్నాం. భువిపై ఉన్న ప్రజలందరూ ఈ దివ్య అవకాశాన్ని వినియోగించుదురుగాక అని మనస్ఫూర్తిగా మన  గురుపరంపరను ప్రార్థిస్తున్నాను. 
                                                                                       (సశేషం ..)



1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...