(1927-2014)
అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం ।
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
కదిలించివేసే వారి ప్రసంగాలు, గ్రంథాలు
వాస్తవానికి వారు వ్రాసిన అన్ని గ్రంథాలు, అన్ని ప్రసంగాలూ కదిలించివేసేవిగానే ఉంటాయి గాని, కొన్ని పుస్తకాలను ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. నిజమైన మాస్టర్ల గ్రంథాలు శ్రద్ధతో చదువుతున్నప్పుడు మన చేతనావస్థనే మార్చేస్తాయి, ప్రాణాహుతి ప్రసరణను కూడా అనుభూతి చెందవచ్చు.
మై మాస్టర్: ముందుగా ఈ గ్రంథంలోని కొన్ని అంశాలు చూద్దాం. మొట్టమొదటిసారిగా సంస్థలో ఇటువంటి గ్రంథం ఉదయించింది. పూజ్య బాబూజీకి బాగా నచ్చిన గ్రంథం. చాలా సరళమైన భాష, అందరికీ అర్థమయ్యేలా వ్రాసిన గ్రంథం. ఈ గ్రంథం చదివితే, ఇద్దరు మాస్టర్లను గురించి తెలుసుకోవచ్చు, గురు-శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, ఒక శిష్యుడు తన గురువును ఏ విధంగా చూడాలి, ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఆయన సేవ ఏ విధంగా చేయాలి, ఇలా అనేక రకాలైన అవగాహనలు కలుగుతాయి. ముఖ్యంగా ఆయన మొట్టమొదటిసారి బాబూజీతో జరిగిన కలయికను గురించి వ్రాసిన ఘట్టం అందరినీ కదిలించివేస్తుంది, కళ్ళకు కట్టినట్లుగా మనం కూడా షాజహానుపూర్ లో బాబూజీతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే గురువును అన్ని స్థాయిల్లోనూ ఏ విధంగా స్వీకరించాలో కూడా తెలియజేస్తారు - మానవ స్థాయిలోనూ, దివ్య స్థాయిలో, దైవంగా ఎలా చూడాలనేది అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంకా మాటలకందని అనేక అంశాలున్నాయి.
ద రోల్ ఆఫ్ మాస్టర్ ఇన్ హ్యూమన్ ఇవల్యూషన్: మనిషి యొక్క ఆధ్యాత్మిక వికాస యాత్రలో మాస్టర్ యొక్క పాత్ర ఏమిటో అద్భుతంగా వర్ణించారు. ఇందులో బాబూజీతో వారి సాంగత్యం ద్వారా తనలో ఇముడ్చుకున్నదంతా పండ్లన్నీ పిండి తీసిన రసం అందించినట్లు మనకందించారు. ఒక్క వాక్యం మచ్చుకి - సహజమార్గంలో మాస్టర్ బోధించకుండా బోధిస్తారు. (Master teaches us without teaching). ఈ గ్రంథం చదవడం వల్ల మనకు జీవితం పట్ల, గురువు పట్ల, మన సాధన పట్ల, మన జీవిత లక్ష్యం పట్ల ఉన్న దృక్పథం సమూలంగా పరిణతి చెందుతుంది. తప్పక చదవవలసిన గ్రంథం. ఈ పుస్తకం చదవడం వల్ల సహజమార్గ సాధకుడికి తన సాధనకు ఒక పటిష్ఠమైన పునాది ఏర్పడుతుంది.
యాత్ర: 1) ఇండియా ఇన్ ది వెస్ట్, 2) సహజ్ మార్గ్ ఇన్ యూరోప్, 3) గార్డెన్ ఆఫ్ హార్ట్స్ , 4) బ్లాసమ్స్ ఆఫ్ ది ఈస్ట్ అనే 4 గ్రంథాల సంకలనం ఈ యాత్ర అనే గ్రంథం. చారీజీ, బాబూజీతో కలిసి విదేశీ పర్యటనల్లోని విశేషాలను వ్రాసుకున్న డైరీల ఆధారంగా వ్రాసినటువంటి గ్రంథం యాత్ర. ఈ గ్రంథం చదువుతూ ఉంటే మనం కూడా వారివురితోపాటు అన్ని దేశాలూ పర్యటిస్తున్నట్లు, బాబూజీ సమక్షంలో కూర్చొని మనం కూడా అన్నీ వింటున్నట్లు, చారీజీ వివరణలు అర్థం చేసుకుంటున్నట్లు, బాబూజీ లీలలు మనం నేరుగా వీక్షిస్తున్నట్లు, ఇలా అనేకరకాల అనుభూతులు పొందుతూ ఇద్దరు మాస్టర్ల సాంగత్యానుభవం కలుగుతుంది. తెలియకుండా సహాజమార్గ సంస్కృతి మనలో ఇంకిపోయే అవకాశం ఉంది. జీవితంలో మనసు బాగోలేనప్పుడు చదివితే తప్పక క్రుంగిపోకుండా కాపాడే అద్భుత గ్రంథం.
ఇన్ హిజ్ ఫుట్ స్టెప్స్ : ఇది 3 సంపుటాలుగా ఉన్న గ్రంథం. ఇందులో ప్రియతమ చారీజీ వ్రాసుకున్న డైరీ కనిపిస్తుంది. వారు సహజమార్గ సాధన ప్రారంభించినప్పటి నుండి ప్రతి రోజు వ్రాసుకున్న డైరీ ఇక్కడ కనిపితుమది; వారి యాత్ర ఏ విధంగా కొనసాగిందో రోజువారీగా మనం దర్శించవచ్చు. అంటే కాదు, ఇందులో వారు సంస్థను నడిపించిన విధానం, సంస్థలో ఏర్పడిన అడ్డంకులను, సమస్యలను ఏ విధంగా ఎదుర్కొన్నదీ, వారి ఆలోచనలు, తన గురుదేవుల ఆశయానికి కార్యరూపం ఇచ్చచేటువంటి నేర్పు, ఇంకా ఎన్నో అంశాలు దర్శనమిస్తాయి. గంభీర సాధకుడు తప్పక చదవ వలసిన గ్రంథం. తన గురుపరంపరను, సంస్థ చరిత్రను, సహాజమార్గ ఆధ్యాత్మిక ఉద్యమం యొక్క వికాసాన్ని, తెలియజేసేటువంటి గ్రంథం.
డౌన్ మెమరీ లెన్: పూజ్య చారీజీ తన స్వీయ చరిత్రను, రెండు సంపుటాలుగా వ్రాయడం జరిగింది. వారి జ్ఞాపక శక్తి అమోఘం, అద్వితీయం, అద్భుతం. ఇంచుమించు వారు పుట్టినప్పటి నుండి, వారి పూర్వీకుల వరకు తన స్మృతిపథంలోకి వెనక్కి వెళ్ళి వ్రాసిన గ్రంథం. ఇందులో అందరినీ బాగా కదిలించివేసే అధ్యాయం - మై మదర్. చారీజీ తల్లిగారు జానకీగారు, చారీజీ 5 సంవత్సరాలుండగానే పరమపదించారు. అంతా చిన్న వయసులో ఆయన తన తల్లిని కోల్పోయారు. ఆ సమయంలో వారి తల్లిగారి పార్థివ శరీరాన్ని ఐసు మీద ఉంచితే, అమ్మకు చలి వేస్తుందని బాధపడతారు, చారీజీ. వారికి ఆ చిరుప్రాయం నుండి తమ తల్లిగారి మీద ఉన్న ప్రేమ అలాగే ఎప్పటికీ ఉండిపోయింది. ఎంత ప్రేమ అంటే, బాబూజీ ఒకసారి ధ్యానంలో జానకీగారి చేత సిట్టింగ్ ఇప్పిస్తారు, చారీజీ ఆమె స్పర్శను గుర్తించడం కూడా జరుగుతుంది; బాబూజీకి అశ్రువులతో కృతజ్ఞత వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. ఇలా అనేక అంశాలు మనకు ఈ గ్రంథం చదివితే తారసిల్లుతాయి.
హి, హుక్కా అండ్ ఐ: ఈ ప్రసంగాల శ్రేణి వారు భౌతికంగా ఉన్నప్పుడు చివరి రోజుల్లో రికార్డు చేసిన ప్రసంగాలు. ఈ శీర్షికను విడుదలైన ప్రసంగాలు కూడా రెండు విడతలుగా, రెండు సంపుటాలుగా వెలువడింది. ఇందులో ఇచ్చిన ప్రసంగాలు చారీజీ, బాబూజీల సాంగత్యంలో, జరిగిన సంభాషణల ఆధారంగా అనేక అంశాల మీద ప్రసంగించడం జరిగింది. ఈ సి. డీ. లు మన మానసిక స్థితిని బట్టి ఏ సి. డీ. పెట్టుకున్నా ఆ క్షణానికి మన అవసరానికి తగ్గట్టుగా పరిష్కారం లభిస్తుందని, చీకట్లో ఉన్నప్పుడు, ఒక అగ్గిపుల్ల చేసే పని ఈ ప్రసంగాలు అభయాసులకు చేస్తాయని చారీజీ పరిచయ వాక్యాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యాసులు ఈ విధంగా ప్రయత్నించి చూడవచ్చు.
ఇవిగాక వారు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ, చేసిన అనేక ప్రసంగాలు, అనేక శీర్షికలతో గ్రంథాలుగా వెలువడ్డాయి. చారీజీ గ్రంథాలు చదివితే మనం ఆధ్యాత్మికతతోపాటుగా ఎన్నో వేల పుస్తకాల సారాంశాన్ని గ్రహించవచ్చు. ఇంగ్లీషు మాట్లాడటం, చక్కటి పదప్రయోగం, సున్నిత వ్యంగ్యం, హాస్యం, చక్కని భావవ్యక్తీకరణ వంటివెన్నో మనలో పెంపొందే అవకాశం ఉంది, ప్రాణాహుతి గాకుండగా.
(సశేషం ..)
నమస్తే. చారీజీ పుస్తకాల గురించి చక్కని, చదవాలనే ప్రోత్సాహం కలిగించే పరిచయం ఇచ్చారు. ధన్యవాదాలు!
రిప్లయితొలగించండి