పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ
(1927-2014)
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురూన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ప్రియతమ గురుదేవులతో కొన్ని ఉత్తర-ప్రత్యుత్తరాలు
ఆ రోజుల్లో ఉత్తరాలు కాగితం మీద వ్రాసి కవర్ లో పెట్టి పోస్ట్ చేసేవాళ్ళం. 1990 లో నేను సహాజమార్గ సాధన ప్రారంభించిన క్రొత్తల్లో నాకు పరిచయం చేసిన ప్రశిక్షకులు, "కృష్ణా, నువ్వు కావాలంటే నీకేమైనా సందేహాలుంటే మాస్టర్ గారికి ఉత్తరం వ్రాయవచ్చు. వారు నీకు సమాధానం ఇస్తారు" అని చెప్పడం జరిగింది. అంతటి మహానుభావుడు నాలాంటి పరిపక్వత లేని కుర్రాడికి ఎందుకు సమాధానం ఇస్తారు, ఆయనకి ఎక్కడ అంతా తీరిక ఉంటుంది ,అని అనుకున్నాను. సరే, పెద్దాయన చెప్పారు కదా అని ఒక ప్రయత్నం చేద్దామని సాహసం చేశాను. మొట్టమొదటిసారిగా ఒక ఆధ్యాత్మిక సంస్థ అధ్యక్షుడికి ఉత్తరం వ్రాసాను. అందులో నేను వ్రాసిన ప్రశ్న, నన్ను చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్న:" పూజ్య మాస్టర్ కు ప్రణామాలు. నా మనసు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపే మొగ్గుతూ ఉంది, అసలు భౌతిక జీవితం మీద ఆసక్తే లేదు; మీరు పక్షి, రెండు రెక్కలు అంటున్నారు; నాకేమీ బోధపడటం లేదు; దయచేసి మార్గదర్శనం చేయగలరు." అని వ్రాసాను.
దానికి వారు ఒక పది రోజుల్లోనే సమాధానం వ్రాయడం జరిగింది. నా ఆనందానికి అవధుల్లేవు. సమాధానం రాదనుకున్న వాడికి సమాధానం రావడమే గొప్ప ఆనందానికి కారణం అయ్యింది. ఒక నూతనోత్సాహం కలిగింది నాలో. అది టైపు చేసిన ఉత్తరం. క్రింద వారి సంతకం కనిపించింది. చాలా ఆనందించాను. వారు వ్రాసిన సమాధానం: "డియర్ బ్రదర్, నువ్వు నీ సమయాన్ని తగినట్లుగా సమానంగా సర్దుకోగలగాలి. నీ మనసు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపుగా మొగ్గుతున్నట్లయితే, దాన్ని భౌతిక జీవితం పైకి మళ్ళించు; నీ మనసు భౌతిక జీవితం పైకి ఎక్కువగా మొగ్గుతూ ఉంటే ఆధ్యాత్మికత వైపుకు మళ్ళించు. ఈ సమాధానం నీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నీ ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను." అని వ్రాసారు. ఈ ఉత్తరం ద్వారా నాకు మార్గదర్శనం లభించింది. కానీ ఒక చిన్న అసంతృప్తి కూడా ఉండింది. ఎందుకంటే అది టైపు చేసిన ఉత్తరం; ఎవరో సమాధానం టైపు చేసి ఉంటారు, ఆయన కేవలం సంతకం పెట్టి ఉంటారేమోనన్న ఒక చిన్న మూర్ఖమైన అనుమానం కూడా ఉండింది మనసులో. ఆనందం-అనుమానం మిళితమైన అనుభవం. ఆ తరువాత 1991 లో మరొక ఉత్తరం వ్రాసాను; ననను వేధిస్తున్న ప్రశ్నలు మరికొన్ని వ్రాయడం జరిగింది. నేను వ్రాసిన ప్రశ్నలు: "1) పర్ఫెక్షన్ అంటే ఏమిటి? 2) శివుడాజ్ఞ లేనిదే ఒక్క ఆకు కూడా కదలదంటారు, చీమ కూడా కుట్టదంటారు, ప్రతీదీ ముందే నిర్ణయింపబడినప్పుడు, ఇక మనం చేసే ప్రయత్నంలో అర్థమేమిటి? నా మనసు గందరగోళంగా ఉంది మాస్టర్, దయచేసి సహాయపడగలరు. 3) మీరు సాక్షాత్కారం పొందిన వ్యక్తి అని నేను ఎలా తెలుసుకోగలను? " అని వ్రాసాను. ఈసారి పూజ్య గురుదేవులు వారి స్వహస్తాలతో, ఒక తెల్ల కాగితం మీద సమాధానం వ్రాసి పంపించారు. ఆ ఉత్తరం చూసి ఎక్కెక్కి ఏడ్చాను; అనవసరంగా అంతటి మహానుభావుని అనుమానించానే అని. వారు ఈ ప్రశ్నలకు వ్రాసిన సమాధానం: "1) పర్ఫెక్షన్ అంటే నా గురుదేవుల ప్రకారం పర్ఫెక్ట్ ఇన్నర్ బ్యాలన్స్. అంటే పరిపూర్ణమైన అంతరంగ సమతౌల్యత. 2) ఈ ప్రశ్న విధికి సంబంధించినది. విధి అనేది ఎవరికి వర్తిస్తుందంటే, తమ విధిని మార్చుకోడానికి ఎవరైతే ఏ ప్రయత్నమూ చెయ్యరో, వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ సమాధానాలు నీకు ఉపయోగపడతాయనుకుంటున్నాను. నీ పురోగతికై ప్రార్థిస్తున్నాను. " అని వ్రాసారు. మూడవ ప్రశ్నకు సమాధానం వ్రాయలేదు. బహుశా ఏమీ సమాధానం ఇవ్వకపోవడమే సమాధానం అనిపించింది నాకు. నిజానికి మౌనంలోనే అన్ని సమాధానాలూ వస్తాయి. ఈ సమాధానాలు నా జీవితాన్ని మార్చేసాయి; నేను జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చేసాయి. గాఢమైన మానసిక ప్రశాంతతను ఇప్పటికీ అనుభవిస్తున్నాను.
ప్రియతమ గురుదేవులతో చిన్ని-చిన్ని అనుభవాలు పెద్ద-పెద్ద ప్రభావాలు
వారి సమక్షంలో నా జీవితాన్ని మార్చేసిన, వారి నుండి నేరుగా విన్న కొన్ని గొప్ప పలుకులు:
1) To know where we are going wrong, we don't need a Guru.
మనం ఎప్పుడు తప్పులు చేస్తున్నామో తెలియడానికి మనకు గురువు అవసరం లేదు.
2) Babuji said, "Deserve and then desire." Those who deserve generally do not desire; and those who desire generally do not deserve.
"ముందు యోగ్యత సంపాదించి, ఆ తరువాత కోరుకో" అన్నారు బాబూజీ. యోగ్యత ఉన్నవారు సాధారణంగా కోరుకోరు; కోరుకునేవారికి సాధారణంగా యోగ్యత ఉండదు.
3) Fate or destiny is only for those, who do nothing to change their destiny.
వీధి లేక ప్రారబ్ధం అనేది కేవలం ఎవరైతే తమ విధిని మార్చుకోవడానికి ఏమీ చెయ్యరో, వారికి మాత్రమే వర్తిస్తుంది.
4) Even to say "I know nothing" is also a state of knowledge. We need to transcend that.
" నాకు తెలిసినది శూన్యం" అని అనడం కూడా జ్ఞాన స్థితే. దీన్ని కూడా అధిగమించవలసి ఉంది.
పైన చెప్పిన ఈ వాక్యాలు నా దృక్పథాన్ని సమూలంగా మార్చివేశాయి, నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయి; నా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయి; జీవితంలో వచ్చే ఒడుదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనేలా చేశాయి; సూక్ష్మత్వాన్ని నాలో పెంచాయి.
ఇలా పంచుకోటానికి అనంతంగా ఉన్నాయి, కానీ ఇక్కడితో ప్రస్తుతానికి విరామం ఇద్దాం.
(సశేషం ..)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి