దీపావళి - బయట దీపం వెలుగు, లోపల దివ్యవెలుగు
దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. ఈ దీపాల పండుగను భారతీయులు, ముఖ్యంగా హిందువులు అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు.
శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతమ్మవారిని రావణ చర్య నుండి విడుదల చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా కొందరు; శ్రీకృష్ణుడు నరకాసుర వఢ చేసి 16,100 కన్యలను చెర నుండి విడిపించి, వివాహమాడి సమాజంలో వారికి గౌరవం లభించేలా గొప్ప వరాన్ని ప్రసాదించిన రోజుగానూ; మహావీర జైన్ అనే 24 వ తీర్థంకరుడు నిర్వాణం పొందిన రోజుగానూ; లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన రోజుగానూ, ఇలా అనేక కారణాల చేత ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు.
ఈ సందర్భంగా జనం అందరూ తమ ఇళ్ళను శుభ్రం చేసుకొని, నూతన వస్త్రాలు ధరించి, దీపాలు వెలిగించి, లోపలున్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టపాకాయలు కాలుస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
ఆధ్యాత్మికపరంగా దీన్ని అర్థం చేసుకుంటే, బయట దీపాలు లోపల కలిగే మేలుకొలుపుకు సంకేతాలు; నరకాసురుని వధించడం అంటే కామ, క్రోధ, అహంకారాలను నాశనం చేయడం; నిజమైన లక్ష్మీ అంటే శాంతి, పవిత్రత, దివ్యప్రేమ; దీపం వెలుగు అంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆత్మ నుండి వచ్చే ప్రకాశం.
హార్ట్ఫుల్నెస్ సహజమార్గం ప్రకారం నా అవగాహనలో, ధ్యానం ద్వారా హృదయాన్ని ప్రకాశింపజేయడం; అంతరంగంలో జ్యోతిని ప్రజ్వలించడానికి సాంకేతమే బయట దీపాలు వెలిగించడం; యౌగిక ప్రాణాహుతి ప్రసరణ ద్వారా, హృదయం పవిత్రతతో వెలుగును విరజిమ్మడం.
హృదయం లోపలి నుండి ప్రకాశించినప్పుడు నిజమైన దీపావళి ప్రారంభమవుతుంది - బాబూజీ
సమస్త విశ్వానికి దీపావళి సందేశం 1) వివేకం ద్వారా వెలుగులో జీవించు 2) కారుణతో ప్రేమతో జీవించు 3) పవిత్రంగా ఉండటం ద్వారా శాంతిని వ్యాపింపజేయి 4) ద్వంద్వాలకతీతంగా జీవిస్తూ ఏకత్వాన్ని సాక్షాత్కరించుకో.
"బాబూజీ మహారాజ్ కు అమావాస్య నాడు దైవ సాక్షాత్కారం జరిగింది; బుద్ధుడికి పౌర్ణమినాడు జరిగింది; సాక్షాత్కారం సాధకులకు ఏ రోజైనా, ఎప్పుడైనా, ఏ క్షణమైనా జరగవచ్చు. దానికి తగిన విధంగా తయారవడానికే ప్రాణాహుతితో కూడిన ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన వంటి ప్రక్రియల సాధన చేయడం ద్వారా ఇది సాధ్యం. కానీ "నాకు సాక్షాత్కారం జరిగింది" అని డైరీలో వ్రాసుకోడానికి సాధకుడుండడు. దయచేసి ఈ విషయాన్ని గురించి ఆలోచించండి." - ఈ దీపావళి నాడు పూజ్య దాజీ కాన్హాశాంతి వనంలో ఇచ్చిన సందేశం
అందరూ దీపాలువెలిగించుకుని (లోపల-బయట) నిశ్శబ్దంగా ప్రార్థనాపూర్వకంగా దీపావళి జరుపుకోవాలని ఆశిస్తూ
అందరికీ దీపావళి శుభాకాక్షలు.


ఆహా ! అద్భుతం.
రిప్లయితొలగించండి