హృదయంతో వినడం - 1
హృదయంతో వినడం అనేది ఒక కళ. హార్ట్ఫుల్నెస్ జీవన విధానం అంతా కూడా దీన్ని గురించే; హృదయాన్ని గురించే అంతా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది భౌతిక హృదయాన్ని గురించి కాదు; లబ్-డబ్, లబ్-డబ్ అని కొట్టుకునే మాంసపు గుండెను గురించి కాదు; మనం చర్చించుకుంటున్నది ఆధ్యాత్మిక హృదయం గురించి; తెలుగులో వాడుకలో హృదయాన్ని మనసు అని కూడా అంటాం. మంచి మనసున్న మనిషి, సహృదయుడు, దయార్ద్ర హృదయుడు. కఠిన హృదయుడు, సున్నిత మనస్కుడు, ... ఇలా మనసు అనే పదాన్ని, హృదయం అనే పదాన్ని ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. ఈ ఆధ్యాత్మిక హృదయం ఎక్కడుంది? గుండె కొట్టుకునే ప్రాంతంలోనే ఉంది అని మన విస్పర్శ్ గ్రంథం కూడా ధృవీకరిస్తోంది. హృదయం అంటే కేంద్రం అని కూడా అర్థం ఉంది. హృదయం అనేది మనిషి చేతనకు కేంద్రంగా ఉంది. అందుకే హృదయాన్ని బట్టే మనిషి వ్యక్తిత్వం; మనిషి చేతనం; మారవలసినది హృదయమే; అందుకే హృదయ పరివర్తనం అంటారు; హృదయం మారితే మనిషి మారినట్లే. వేదాది శాస్త్రాలన్నీ కూడా హృదయాంతరాళంలోనే దైవం నివాసం అని చెబుతున్నాయి. మనం ధ్యానం ద్వారా అనుభూతి చెందవచ్చు. అందుకే హృదయం ఎప్పుడూ తప్పుడు మార్గదర్శనం చేయదు. మనస్సాక్షి అంటే కూడా ఇదే; అంతఃకరణ అంటే కూడా ఇదే. హృదయం అనేది ఉద్వేగాలకు, ప్రేరణలకు మూలస్థానం అని పూజ్య దాజీ చెబుతూ ఉంటారు. అంతే కాదు, మనిషి తప్పు చేస్తున్నప్పుడల్లా తప్పక ఎత్తి చూపుతుంది; కానీ సరైన పని చేసినప్పుడు, సరిగ్గా ఆలోచించినప్పుడు, మౌనంగా ఉండిపోతుంది, కానీ 'శభాష్' అని భుజం తట్టదు.
మనలో అనేక గళాలున్నాయి
మనిషి అంతరంగంలో నుండి అనేక గళాలు వినిపిస్తాయి - మన సంస్కారాల గళాలు, మన అహంకారానికి సంబంధించిన గళాలు, మన కోరికలకు సంబంధించిన గళాలు, ఈ గళాలన్నీ కూడా మనలో ఉండే వికారాల ప్రభావం కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ బుద్ధిని ప్రభావితం చేస్తాయి. ఆ బుద్ధినే మనిషి సాధారణంగా అనుసరిస్తూ ఉంటాడు. 'బుద్ధి కర్మానుసారిణి' అని పెద్దలు అందుకే అన్నారు; అంటే బుద్ధి మన కర్మలను (సంస్కారాలను) అనుసరిస్తుంది; మనం బుద్ధిని అనుసరిస్తాం. అందుకే మనిషి జీవితం తన కర్మ ఎలా ఉంటే అలా కొనసాగుతూ ఉంటుంది. నిజానికి బుద్ధి కూడా హృదయాన్ని అనుసరించినట్లయితే కర్మల ప్రభావం తగ్గి, మనిషి జీవితం ఉండవలసిన రీతిలో సరైన దిశలో కొనసాగుతుంది; ఆ విధంగా వ్యక్తి యొక్క విధిరూపకల్పన ప్రారంభమవుతుంది. అది ధ్యానం వల్లనే సాధ్యపడుతుంది. బుద్ధికి హృదయాన్ని అనుసరించే శిక్షణనివ్వడమే హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క లక్ష్యం. ఇది మొట్టమొదటి రోజు నుండి జరుగుతుంది.
(ఇంకా ఉంది ...)
అద్భుతం.
రిప్లయితొలగించండి