హృదయంతో వినడం - 2
హృదయంలో నిద్రాణమై బీజరూపంలో ఉన్న శక్తులు అనేకం ఇంకా వెలికి రావలసినవి ఉన్నాయని శాస్త్రజ్ఞులు కూడా నమ్ముతున్నారు. హార్ట్ మ్యాత్ సొల్యూషన్స్ (ఇది ఇంటర్నెట్ లో దొరుకుతుంది) అనే గ్రంథంలో హృదయానికి అవసరమైన బుద్ధి హృదయంలోనే ఉందని మామూలుగా వాడే బుద్ధి అవసరం లేదని తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ లో ఉల్లేఖించడం జరిగింది.
లోపలి నుండి వినిపించే గళం హృదయ గళమా లేక మరేదైనా గళమా ఎలా తెలుస్తుంది?
ఇంతకు ముందు వ్యాసంలో లోపల అనేక గళాలున్నాయని తెలుసుకున్నాం. వాటిల్లో మనస్సాక్షిని లేక హృదయ గళాన్ని గుర్తించడం ఎలా అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది హృదయ గళం మనం తప్పు చేస్తున్నప్పుడే వినిపిస్తుంది. మనం తీసుకున్న నిర్ణయం సరైనడా కాదా అన్న సందేహం వచ్చిందంటే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. సరైన నిర్ణయం అయితే ఇక యేమాత్రమూ సందేహం ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
హృదయం లేక మనస్సాక్షిని అనుసరించడం అనేది ఈ ప్రపంచంలో సాధ్యమా?
మనం ఉన్న పరిస్థితుల్లో కష్టసాధ్యమే. హృదయాన్ని ప్రస్తుత కాలంలో అనుసరించాలంటే సాహసం కావాలి; నిజానికిది చాలా సరళమైనది. సరళమైనది జటిలం చేసేసుకున్నాం. సరైన ఆలోచనా విధానం, సరైన అవగాహన చాలా అవసరం.
కానీ అన్నిటికంటే పెద్ద ఒత్తిడి మనస్సాక్షికి దూరంగా ఉండటమే; భగవంతునికి దూయమగా ఉండటమే; ఆత్మవిరుద్ధంగా జీవించడమే. కాబట్టి సరైన దిశలో జీవితం కొనసాగాలంటే కనీస ప్రయత్నం అవసరం. అదే ఆధ్యాత్మిక సాధన.
సరైన ఆలోచనా విధానం అని , సరైన అవగాహన అని ఎలా తెలుస్తుంది ?
సరైన ఆలోచనపైనే సరైన అవగాహన ఆధారపడుంది; సరైన అవగాహన సరైన ఆలోచనపైన ఆధారపడుతుంది. సరైన ఆలోచన, సరైన అవగాహన అని ఎప్పుడు తెలుస్తుందంటే మనసులో విపరీతమైన ప్రశాంతత ఉన్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత ప్రతీదానికి అవసరం. అది హార్ట్ఫుల్నెస్ ధ్యానం వల్ల సరళంగా సంభవిస్తుంది.
కాబట్టి హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన వల్ల హృదయంతో వినడం అనేది సుసాధ్యం, సహజం. దీనివల్ల సరైన ఆలోచన, సరైన అవగాహన, సరైన నిర్ణయాలు, అన్ని స్థాయిల్లో ఉండే ఒత్తిళ్ళు క్రమక్రమంగా పోగొట్టుకోవడం; ఆ తరువాత అణువణువూ ప్రశాంతత స్థిరంగా ఉన్నప్పుడు ఇతర సూక్ష్మ లోకాల సంపర్కం, ఆ తదుపరి ఆత్మ వికాసం జరుగుతాయి. ఈ యాత్ర పూర్తవడం అంటూ ఉండదు; ఇది అనంత యాత్ర. ఒత్తిడి నుండి మోక్షం; మోక్షం నుండి భగవత్సాక్షాత్కారం ; అక్కడి నుండి లయావస్థ; లయావస్థ నుండి పూజ్య దాజీ చెప్పినట్లుగా, అసలు అనంత యాత్ర ప్రారంభవడం జరుగుతుంది. ఇది ఆత్మ కొనసాగించే సృష్టి ఆది నుండి ఒక అనంత అంతరంగ సాహసయాత్ర. అందరూ ఉత్సాహంగా, ధైర్యంగా, ఆనందంగా కొనసాగింతురుగాక!

జటిలమైన విషయాన్ని ఎంతో చక్కగా సరళంగా చెప్పేశారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి