సహజ మార్గము - మానవాళికి బాబూజీ మహాప్రసాదం
సహజమార్గ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతి, పూజ్య బాబూజీ మహారాజ్ మానవాళి ఉద్ధరణకు అందించిన ఒక విప్లవాత్మకమైన ధ్యాన పద్ధతి. రాజయోగ ధ్యాన పద్ధతిని పునర్వ్యవస్థీకరించి, ఆధునిక మానవుల అవసరాలకు తగినట్లుగా, ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సరళంగా దైవత్వాన్ని సాక్షాత్కరించుకునే మార్గం; మానవ పరిపూర్ణతను సిద్ధించుకునే సాధనం.
దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న ప్రాణాహుతి ప్రసరణతో కూడిన రాజయోగ బ్రహ్మ విద్యా విధానం, ఈ సహజ మార్గం. ఈ ఋషి పేరును కూడా పూజ్య దాజీ సూచించడం జరిగింది. ఆయన పేరు ఋషభ్ నాథ్. దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం అంటే బహుశా రాముడి కాలంలో గాని కృష్ణుడి కాలంలో గాని ఈ ప్రాణహుతితో కూడిన ఆధ్యాత్మిక విద్య ప్రాచుర్యంలో లేదు.
పూజ్య లాలాజీ ఆధునిక మానవాళిని అత్యంత త్వరితంగా మోక్షానికి తీసుకువెళ్ళగలిగే మార్గాన్ని తన యోగశక్తి ద్వారా శోధించినప్పుడు, కాలగమనంలో అంత వెనక్కి (దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం) వెళ్ళినప్పుడు తెలుసుకున్న విద్యయే ఈ ప్రాణాహుతి ప్రసరణ విద్య. కాబట్టి దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న విద్యను ప్రస్తుత కాలానికి తీసుకు వచ్చినది పూజ్య లాలాజీ మహారాజ్.
ఆ ప్రాణాహుతితో కూడిన ధ్యాన పద్ధతికి అదనంగా సంస్కారాలను దగ్ధం చేసే శుద్ధీకరణ ప్రక్రియను ఆవిష్కరించి, ప్రార్థన అనే యౌగిక ప్రక్రియని జోడించి, ఈ రాజయోగపద్ధతికి పరిపూర్ణతను పూజ్య బాబూజీ చేకూర్చడం జరిగింది. ఈ మూడు యౌగిక ప్రక్రియలను అనుసరించడం ద్వారా యోగసిద్ధి సహజంగా జరుగుతుంది కాబట్టి, ఈ ధ్యాన పద్ధతికి సహజ మార్గ్ అనే నామకరణం చేయడం జరిగింది.
ఈ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల మనిషిలో మనసు క్రమశిక్షణలో ఉండటమే గాక, మనసుకు అతీతంగా ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళడం ద్వారా అడుగడుగునా జీవిత దృక్పథం మారుతూ వ్యక్తిని మరింత మరింత మెరుగైన విధంగా మారుస్తుంది. క్రమక్రమంగా పద్ధతిగా సాధన కొనసాగించడం ద్వారా ఈ జన్మలోనే పరిపూర్ణతను సాధించే అవకాశం ఉన్నది.
ఈ సాధన చేస్తే అందరూ మహాత్ములయిపోతారా? అన్న ప్రశ్న అమదరికీ రావచ్చు. దానికి చారీజీ ఒకసారి సమాధానమిస్తూ, అందరూ మహాత్ములు కాకపోవచ్చు, కానీ 80 శాతం మహాత్ములుగా పరిశుద్ధ జీవనం సాగించగలుగుతారని చెప్పడం జరిగింది. బంగారు పతాకం ఒక్కరికే రావచ్చునేమో గాని, పట్టభద్రులు ఎవరైనా కాగలగడం ఎలా సాధ్యమో, అందరూ చాలా వరకూ మరింత మెరుగైన విలువలతో కూడిన మనుషులయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటారు చారీజీ. దీనికి మన అనుభవమే నిదర్శనం అవుతుంది. కేవలం కొన్నాళ్ళు ప్రయత్నించి చూడాలంతే.
సహజ మార్గ్ అన్నీ మతాలకు అతీతమైనది. ఎవ్వరైనా ఈ సాధన ప్రయత్నించవచ్చు. ఈ సాధన వల్ల హిందువు మరింత మెరుగైన హిందువుగానూ, క్రైస్తవుడు మరింత మెరుగైన క్రైస్తవుడుగానూ, ఇలా యే మతానికి చెందినవారైనా మరింత మెరుగైన వ్యక్తిగా మారడమే గాక, సంకుచిత మనస్తత్వం పోయి, విశాలమైన హృదయంతో వారి వారి మతాగ్రంథాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు, మానవాళిలో సామరస్యం, ప్రేమ పెరగడానికి తోడ్పడటం జరుగుతుంది. ఆ విధంగా భూతల స్వర్గం ఏర్పడే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చూడవలసిన యోగసాధన సహజ్ మార్గ్.
అవును. ఇది అనుభవపూర్వకమైన పధ్ధతి. దీనికి ఈ పధ్ధతి ని సాధన చేస్తున్న ఎంతో మంది సజీవ ఉదాహారనలే మరి.
రిప్లయితొలగించండిసమాజంలో వారి ప్రవర్తన, తమ తమ జీవన శైలి లను గమనించవాచు.