21, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 1

 


ధీశక్తి  - ధ్యానం - 1  

ప్రతి మనిషికి అందుబాటులో ఉండే అత్యద్భుత శక్తి ధీశక్తి లేక ఆలోచనా శక్తి. ఆలోచన లేకపోతే సృష్టి లేదు; ఆలోచన లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఆలోచన లేకపోతే యే  పనీ చేయలేము. 

ఆలోచన కాంతి కంటే వేగమైనది; మనోవేగం అంటాం. యే వస్తువుతోనైనా, ఆ వస్తువు మన అనుభవంలో ఉన్నా ఉండకపోయినా, చూసినా చూడకపోయినా ఆ వస్తువుతో ఆలోచన ద్వారా వెంటనే సంపర్కం ఏర్పరచుకోవచ్చు. అది వస్తువే కానక్కర్లేదు, భావమైనా కావచ్చు. ఉదాహరణకు మనం ఎప్పుడూ దైవాన్ని అనుభూతి చెందకపోయినా కూడా, ఆలోచన ఆ దైవ భావంతో అనుసంధానం ఏర్పరుస్తుంది. 

ఆ ఆలోచనను తదేకంగా అటువంటి భావంపై గాని, వస్తువుపై గాని దృష్టిని నిలపడమే ధ్యానం. దీన్నే ధ్యాన వస్తువు అని కూడా అంటారు. ఈ ప్రక్రియ వల్ల, దీన్ని పద్ధతిగా కొనసాగించడం వల్ల  ధ్యాన వస్తువు యొక్క సిద్ధి కలుగుతుంది. ఇదీ ఆలోచనకు, ధ్యానానికీ ఉన్న సంబంధం. 

అయితే ఆలోచనలకు స్వతహాగా యే శక్తి ఉండడంటారు బాబూజీ. మనం వాటిపై దృష్టిని నిలిపినప్పుడే వాటికి శక్తి లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాటిపై దృష్టి నిలపడం మానేస్తామో అవి వాటంతట అవే ఎండుటాకుల్లా రాలిపోతాయమటారు బాబూజీ. 

దృష్టిని నిలపడం 
మనం మన జీవితంలో గమనిస్తే అనేక సమస్యలుంటూ ఉంటాయి. సమస్యపై తగిన దృష్టిని నిలపడం ద్వారానే మనం ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటాం. ఆ విధంగా దృష్టి పెట్టనట్లయితే ఆ సమస్య అలాగే ఉండిపోవడమే గాక క్రమంగా జటిల సమస్యగా తయారవుతుంది. కాబట్టి సమస్య పరిష్కారానికి దానిపై దృష్టి నిలపడం అనివార్యం. 

అయితే జీవిత సమస్యకు పరిష్కారం కావాలంటే, దేనిపై దృష్టి నిలిపితే ఇది పరిష్కారమవుతుందో దానిపై నిలపవలసి ఉంది. ఆ ధ్యాన వస్తువునే హృదయంలో దివ్యమైన వెలుగు ముందే స్థితమై ఉందన్న భావం, అని అంటారు బాబూజీ. అందుకే సహజ మార్గ రాజయోగ ధ్యాన పద్ధతిలో జీవిత సమస్య పరిష్కారానికి హృదయంలో ఉన్న దివ్య ఉనికి అనే భావం పై ధ్యానిస్తాం. 

(సశేషం ...)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...