27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 4

 

ఫిబ్రవరి 22-24, 2019 కరీంనగర్ మొట్టమొదటి ధ్యానోత్సవం 

తెలంగాణాలో

 శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 

నా ప్రస్థానం - 4 

మనిషిలో సహజంగా పరివర్తన, ఆధ్యాత్మిక పరిణతిని   తీసుకురాగలిగే ప్రాణాహుతి శక్తిని, భూమ్మీదున్న ప్రతీ గుండెకీ అందించే పవిత్ర కార్యాన్ని విశ్వవ్యాప్తి చేయడం కోసం పూజ్య దాజీ అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, కార్యాలయాల్లోనూ, కార్పొరేట్లలోనూ, పోలీసులకు, డాక్టర్లకు, ఇంజనీయర్లకు, లాయర్లకు, గృహస్థులకు, ఇలా అన్ని వర్గాల వారికి, కులమత రంగు, భాష, జాతి వివక్ష లేకుండా హార్ట్ఫుల్నెస్  ధ్యాన పరిచయం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే సాధారణ ప్రజలకు విస్తృతంగా ఈ పరిచయ కార్యక్రమం అందించాలని సంకల్పించారు. దీనికనుగుణంగా ఛత్తీశ్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఒక స్టేడియంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ గా ఈ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించడం జరిగింది. దానికి 3000 కు పైగా ప్రజలు హాజరయ్యారట. అటువంటి కార్యకమాన్నే  కరీంనగర్ లో కూడా చేద్దామని సూచించడం జరిగింది. అది పూజ్య దాజీ స్వయంగా నిర్వహించవలసిన కార్యక్రమం. అప్పుడే కానహాలో బసంత్ కార్యక్రమం పూర్తయ్యింది. వారి కంఠంలో ఇబ్బంది కలిగి మాట్లాడలేని స్థితిలో ఉన్నానన్నారు. ఎలాగూ నేను తెలుగులో మాట్లాడలేని కదా, మీరే తెలుగులో నిర్వహించమనడం జరిగింది. ఆ విధంగా కృష్ణను 3 రోజులూ పద్ధతిని గురించి పరిచయం ఇవ్వమని కోరడం జరిగింది. ఆ విధంగా ఆ గురువాజ్ఞ, నాకు మొట్టమవదాటుసారిగా తెలుగులో పబ్లిక్ గా మన పద్ధతిని పరిచయం చేసే మహద్భాగ్యం, వారి అనుగ్రహం కలిగింది. కానీ నా గుండెల్లో గుబులు కూడా బయల్దేరింది. మరలా వారినే బలంగా స్మరించుకుని కార్యక్రమానికి ఉపక్రమించడం జరిగింది. 


ఆ సమయంలో కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన తరువాత మన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అప్పుడే మన కార్యక్రమానికి "ధ్యాయణోత్సవం" అన్న పేరు మనసులో మెదిలింది. అందరూ ఆ పేరును స్వీకరించిన తరువాత ఆ పేరుపైన బ్యానర్లు, ఫ్లయర్లు, తయారు చేసేసిన తరువాత గురుదేవులకు చూపించడం జరిగింది, అమాయకంగా. ప్రింట్ చేయక ముందు అనుమతి తీసుకోవలసింది, తరువాత వారి ముందుంచడం జరిగింది. వారి అపార అనుగ్రహం, వారికి ఆ పేరు బాగా నచ్చింది. అప్పటి నుండి ఇటువంటి కార్యక్రమాలను ధ్యానోత్సవాలని పిలవడం జరుగుతోంది. గ్రామాల్లో చేసే కార్యక్రమాలను గ్రామ ధ్యానోత్సవం పేరున నిర్వహించడం జరుగుతోంది. 


ఇక నిర్వహించిన తీరు చాలా అమాయకంగా జరిగింది. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సంపూర్ణ సామరస్యంతో నిర్వహించుకోవడం జరిగింది. కరీంనగర్ అభ్యాసీలందరూ ఎంతో ప్రేమగా సహకరించడం జరిగింది. మన సోదరీమణులు ఇంటింటికీ కుంకుమ భరణితో వెళ్ళి బొట్టు పెట్టి ఎంతో ఆదారంగా ఆహ్వానించడం జరిగింది. ఇంచుమించు లక్ష మందిని పిలవడం జరిగింది. ఆ 3 రోజులూ కరీంనగర్ పట్టణం అంతా హార్ట్ఫుల్నెస్ పండుగలా ఉండింది వాతావరణం. మన ఆహ్వానానికి 5000 మందికి పైగా స్పందించి విచ్చేయడం జరిగింది. బి. ఆర్.  అంబేద్కర్ స్టేడియం కళాకళలాడింది. వచ్చిన జనం ఓపికగా కూర్చున్నారు. ప్రసాదం తీసుకుని వెళ్ళారు. అలా 3 రోజులూ 5000 సంఖ్య తగ్గలేదు. 


వ్యక్తిగతంగా నాకు మొట్టమొదటిసారిగా 5000 మందికి పద్ధతిని గురించి పరిచయం చేసే అవకాశం, అంత మందికి ధ్యానం నిర్వహించే అవకాశం, ఆ అద్భుత లోపలి వాతావరణం, బయట వాతావరణం, వ్యక్తం చేయలేని విధంగా నా హృదయాన్ని ద్రవింపజేశాయి. పూజ్య గురుదేవులు గంట-గంటకీ ఇక్కడ రిపోర్ట్ తెలుసుకుంటూ వారి దృష్టి అంతా కరీంనగర్ పైనే ఉంచడం చూసి గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. పూజ్య గురుదేవుల దివ్య అనుగ్రహం, ఏంచేసినా వారి ఋణం తీర్చులేనిది. వారి పట్ల నాకున్న శ్రద్ధ ఎన్నో రెట్లు బలపడింది. అలాగే అభ్యాసీల కళ్ళల్లో ఆ 3 రోజుల్లో ఉన్న ఆనందాన్ని చూసి మరింత తన్మయుడినయిపోయాను. ఇది గాక కాన్హా శాంతి వనం నుండి పెద్ద-పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నవారందరూ వచ్చి వారి సహకారాన్ని అందించడం మరింత కనువిందుగా అనిపించింది. మొత్తానికి ఈ మొట్టమొదటి ధ్యానోత్సవం (తెలుగులో), కరీంనగర్ అభ్యాసీలకు ఒక మారువరాని జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఈ ఉత్సవ ఫలితం ఏమిటంటే, ఇందులో పాల్గొన్న ఇద్దరు సాధకులు ప్రస్తుతం మన సంస్థలో పరాశిక్షకులుగా సేవాలనందిస్తున్నారు. 


ఆ తరువాత ఖమ్మంలో కూడా ఇదే ఎత్తులో ధ్యానోత్సవం జరిగింది. అక్కడ కూడా నిర్వహించే అవకాశం లభించింది. అలా తెలంగాణా మొత్తం సుమారు 60-70 ధ్యానోత్సవాలు నిర్వహించే అవకాశం, నా జన్మకు ధన్యతను చేకూర్చింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...