కొత్తగూడెం, సింగరేణి కొల్లరీస్ ఉద్యోగులకు హార్ట్ఫుల్నెస్ పరిచయ కార్యక్రమంలో గౌరవనీయ సోదరులు ఎ. పి. దురై గారితో
తెలంగాణాలో
శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా
నా ప్రస్థానం - 3
జోన్ కో-ఆర్డినేటర్ గా నాకు పూజ్య గురుదేవులు అందించిన ప్రశిక్షణ ద్వారా, నా ఆధ్యాత్మిక అవగాహనకు, నా ఆధ్యాత్మిక ఉన్నటికి తోడ్పడే అంశాలు అనేకం చెప్తే కూడా నేర్చుకోలేనివెన్నో ప్రత్యక్షంగా బోధపడే అవకాశాన్ని కలిగించారు. పూజ్య చారీజీ చాలా సార్లు, "సహజ మార్గంలో వివిధ సంస్థ నిర్వహణా బాధ్యతలను అభ్యాసులకు అప్పగించేది, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమేనని" అన్న మాటలలోని నిజం, పని చేస్తున్నప్పుడు అర్థమయ్యింది. ఇదే హార్ట్ఫుల్నెస్ లో స్వచ్ఛంద సేవలోని రహస్యం. బహుశా సాధన ద్వారా కూడా అంతా తీవ్ర పురోగతి సాధ్యంకాదేమో!
కొత్తగూడెంలో సింగరేణి కొల్లరీస్ వారు తమ ఉద్యోగులకు హార్ట్ఫుల్నెస్ పరిచయం చెయ్యాలని పూజ్యశ్రీ చారీజీ మహారాజ్ కు ప్రియ శిష్యులలో ఒకరైన, మన సంస్థకు దాదాపు 15 సంవత్సరాలు చారీజీకి ప్రైవేట్ సెక్రటరీగా పని చేసిన కీ. శే. శ్రీ ఎ. పి. దురై (ఐ. పి. ఎస్.) గారిని ఆహ్వానించడం జరిగింది. వారు పదవి విరమణకు పూర్వం కర్ణాటక రాష్ట్ర డి. జి. ఆఫ్ పోలీస్ గానూ, నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ డైరెక్టర్ గానూ, ఆర్. పి. ఎఫ్. డి. జి. గానూ అద్భుతమైన సేవలనందించిన క్రమశిక్షణతో కూడిన వ్యక్తి.
ఆ సందర్భంలోనే అక్కడ చుట్టు ప్రక్కల ఉన్న 8 కేంద్రాలను 2 రోజుల్లో సందర్శించడం, అక్కడున్న అభ్యాసులకు ప్రేరణ-స్ఫూర్తులను కలిగించడం జరిగింది. వారితో ప్రయాణించడంలో ఈ 2 రోజుల్లోనే, కొన్ని సంవత్సరాలలో నేర్చుకోవాలసినవి నేర్చుకున్నట్లుగా అనిపించింది. వారితో ప్రయాణిస్తున్నప్పుడు చారీజీతో ప్రయాణిస్తున్నట్లనిపించిన అనుభూతి కలిగింది. వారి క్రమశిక్షణ, వారు తనను తాను నిర్వహించుకునే విధానం, తన గురుదేవుల పట్ల వారికున్న నిష్ఠ, ప్రేమ, భక్తి, పూజ్య భావం, జీవితాన్ని, సహజ మార్గాన్ని గురించిన నిగూఢమైన అవగాహన, అనుభవం, వారి సంభాషణా పటిమ, అందరి అభ్యాసులతోనూ వారు మెలగిన తీరు, ఆ నిరాడంబరత, చారీజీతో వారికున్న అనుబంధం, ఇన్ని ఉన్నా, అస్సలు గర్వం లేశమాత్రం కూడా తొణికిసలాడకపోవడం, అంతా వినమ్రంగా ఉండగలగడం, సంస్థను నిర్వహించడంలో వారి నైపుణ్యం - ఇవన్నీ ఒక్క వ్యక్తిలో అతి దగ్గరగా దర్శించగలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించిన పూజ్య దాజీకి శతకోటి నమస్సులు. దురైగారు తన అనుభవాలను నా వంటి అల్పునితో పంచుకుంటూ, యే విధంగా నిర్వహించాలో అన్న మెళకువలు నాకు నేర్పుతూ వారితో నేను గడిపిన రోజులు, సమయం నా హృదయ ఫలకం మీద శాశ్వతంగా ఉండిపోతాయి. వారు చారీజీతో అనుభవాలను అనేక గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఒక రెండు గ్రంథాలను నాకు బహూకరించారు కూడా.
ఈ ప్రయాణంపై పూజ్య దాజీని నేను రిపోర్టు వ్రాసి, దూరాయిగారికి కూడా ఒక కాపీ పెట్టినప్పుడు పూజ్య దాజీ స్పందిస్తూ, దూరాయిగారిని ఎంతగానో ప్రశంసించారు. అలాగే దురైగారు దానికి స్పందిస్తూ నాకు వ్రాస్తూ నేను రిపోర్టు వ్రాసిన తీరు, విధానాన్ని ప్రశంశిస్తూ, ఒక ఫంక్షనరీ ఈ మాత్రంగా వ్రాయడం సెక్రటరీగా ఉన్న నా ఈ అనుభవంలో చూడలేదు, ఒప్పవకోవలసిందే. కీప్ ఈట్ అప్ అన్నారు. నాకు భారత రత్న అవార్డు లభించినంత ఆనందం కలిగింది. వెంటనే గురుదేవులకు మరొక్కసారి మనసులో కృతజ్ఞతలను వ్యక్తం చేసుకుంటూ సర్దుకున్నాను. కానీ ఇది ఒక్క చక్కని జ్ఞాపకం.
(సశేషం .... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి