పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల
మననం -1
పూజ్య దాజీ ఇటీవల అందించిన రెండు నూతన సంవత్సర సందేశాల మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
నూతన సంవత్సరానికి 2-3 రోజుల ముందే ఒక సందేశాన్నివ్వడం జరిగింది. అందులో ప్రతీ మనిషిలో ఉండే పసిహృదయాన్ని నిలుపుకునే పనిలో ఈ సంవత్సరం అంతా నిమగ్నమై ఉండమన్నారు. ఆ సందేశంలో అది ఎలా సాధన చేయాలో కూడా విపులంగా వివరించడం జరిగింది.
జనవరి 1 వ తేదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ క్లుప్తమైన ప్రసంగం చేస్తూ - సాధనలో తీక్షణంగా చేయమని, అభ్యాసంలో మునిగిపొమ్మని, ఏడు నెలలలోనే సంపూర్ణ యాత్ర, సంపూర్ణ సాధన ద్వారా పూర్తి చేయమని, దీనికి ఏడు మాసాలలో పూర్తి చేయవచ్చని, సంవత్సరకాలం ఎక్కువని, అఅబూజీ అంటూండేవారని మనందరికీ అత్యున్నత శ్రేయస్సు కలగాలని ఆశీర్వదించడం జరిగింది; ఆదేశించడం కూడా జరిగింది.
ఇది విన్న వెంటనే నా గుండెల్లో విపరీతమైన కలవరం మొదలయ్యింది. ఏమిటి దాజీకి మనపై అంత విశ్వాసం? ఇది నిజంగా సాధ్యమేనా? ఈ సంవత్సరాంతంలో అత్యధిక మోక్షం పొందిన వ్యక్తులను, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులను చూడబోతున్నామా? అలా ఆదేశించడం ద్వారా రానున్న సంవత్సరంలో కానీ, ఏడు నెలల్లో గాని మన నుండి ఎటువంటి ప్రయత్నం ఉండాలని ఆశిస్తున్నారు? వారి అనుగ్రహం ఈ విషయంలో నిస్సందేహంగా ఉంది, కేవలం మన ప్రయత్నం లోనే కొరత ఉన్నదా? ఈ కొరతను యే విధంగా పూరించాలి? ఇలా పలు రకాల ప్రశ్నలు ఆ క్షణం నుండి నాలో కలుగుతూనే ఉన్నాయి. బహుశా చాలా మందికి కలుగుతూ ఉండవచ్చు.
ఇప్పటికే ఈ సంవత్సరంలో 6 రోజులు గడిచిపోయాయి, ఇన్ని రోజులూ లేక ఇన్ని సంవత్సరాలూ చేస్తున్న సాధన కంటే భిన్నంగా, మరింత ప్రభావపూరితంగా, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభ్యాసాన్ని ఎలా కొనసాగించాలి? అయితే ప్రశ్నలోనే సమాధానం నిక్షిప్తమై ఉంటుందంటారు పెద్దలు. ఆ దిశలో ఆలోచిస్తూ దాజీ ఇచ్చిన సందేశాలను మరలా-మరలా చదివినప్పుడు కొన్ని ఆలోచనలు స్ఫురించడం జరిగింది. బహుశా ఈ సంవత్సరం అంతా కూడా స్ఫురిస్తూనే ఉంటాయేమో కూడా. వాటిని ఇక్కడ (ఈ శీర్షికన) ఆలోచనలు వస్తున్నంత వరకూ పంచుకునే ప్రయత్నం చేసే సాహసం చేస్తున్నాను.
(సశేషం .... )
🙏🙏🙏🙏
రిప్లయితొలగించండి