31, మే 2025, శనివారం

అహంకారం - ego

 



        

అహంకారం - ego 

పైన చిత్రం: అహంకార ముద్ర. ఈ ముద్ర కనీసం 10 నిముషాలు చేస్తే ప్రయోజనం చాలా కనిపిస్తుందంటారు యోగసాధకులు. 

అహంకారం అంటే నేను, నాది  అనే భావం;  అంతర్యామికి, జీవుడికి మధ్య ప్రధాన అవరోధాలు - అరిషడ్వర్గాలనే వికారాలు, కోరికలు, సంస్కారాలు, అహంకారం. వీటిల్లో అతిపెద్ద అవరోధం ఈ అహంకారం. మిగిలినవాటిని యేదో విధంగా తొలగించుకోవచ్చునేమో కాని, అహంకారాన్ని మాత్రం సాధకులు ఎవరికి వారు తొలగించుకోవలసిందేనంటారు మన మాస్టర్లు. అయితే ఈ అహంకారం లేకపోతే కూడా ఈ భూమ్మీద  ఏ కర్మ చేయడానికి ఉండదు. "నేను ఈ పని చేయగలను" అని అనిపించేది అహం. కాని అహాన్ని స్వాధీనంలో ఉంచుకోవడానికి వినమ్రత అలవరచుకోమంటారు పూజ్య దాజీ. ఆహాన్ని శుద్ధి చేయగలిగే సాధనం ఈ వినయమే.  

శాస్త్రాల ప్రకారం అహం అవిద్య వల్ల, అంటే ఆత్మను ఆత్మగా గాక శరీరము గాను, మనసు, బుద్ధి, అహంకారములగాను భావించడం వల్ల కలుగుతుంది. ఇది గుర్తించి సాధకుడు, ఈ అహాన్ని సంపూర్ణంగా శరణాగతి భావంతో ఆ అంతర్యామికి సమ ర్పించడమే పరిష్కారం. ఇది చెప్పినంత తేలిక కాదు. అందుకే సమర్థ గురువు యొక్క అవసరం. ఈ అహాన్ని ఆ గురువుకు సంపూర్ణంగా సమర్పించి జీవించడమే గొప్ప పరిష్కారం. 

పూజ్య బాబూజీ పలికిన ఒక మహాయవాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తుంది: "నిన్ను నువు మరచిపో. కేవలం ఆయన స్మరణలోనే ఉండు." ఇదే మనం సహజ్ మార్గ్ ధ్యానం ద్వారా మొట్టమొదటి రోజు నుండి నేర్చుకునేది. 

"నిన్ను నువ్వు మరచిపో... " అంటే, మొట్టమొదట ఈ నేను అనే  శారీరక స్పృహ పోవడం; ఆ తరువాత నేను అనే మానసిక (నేను అంటే మనసు, బుద్ధి, అహం అనే) స్పృహ కూడా పోవాలి; అప్పుడే శుద్ధ చేతనంతో ఒకటయ్యే అవకాశం ఉందంటారు. అంటే మన చేతనం యొక్క తత్త్వం మనం సాధన చేస్తున్న కొద్దీ పరిణతి చెందుతూ ఉంటుంది. ఇది మనం అనుభవం ద్వారా గమనించవచ్చకు. చేతన యొక్క తతత్వంలో మార్పులు వస్తున్న కొద్దీ మనిషిలో కూడా వికాసం జరుగుతూ ఉంటుంది. 

నిత్యజీవితంలో మన మానవ సంబంధాల్లో, అహంకారం వల్ల దుష్ప్రభావాలే ఉంటాయి, నకారాత్మక ప్రభావాలే ఉంటాయి. వివేకాన్ని నశింపజేసేవిగానే ఉంటాయి. దీనికి పరిష్కారం మనం అహం గురించి అస్సలు మాట్లాడకుండా, చర్చించుకోకుండా, కేవలం ఎవరికి వారు అర్థం చేసుకుని, మన సంభాషణల్లో నాలుకను నియంత్రించుకుంటూ , సాధ్యమైనంత వరకూ పూజ్య లాలాజీ అందించిన సంభాషణా సూత్రాలను అనుసరించే ప్రయత్నంలో ఉండటం ఒక సమాధానం. అహం సంపూర్ణంగా లయమయ్యేది లయావస్థలోనే. 

అహాన్ని దాటే ప్రయాణం అతి క్లిష్టమైన, పెద్ద ప్రయాణం. పూజ్య బాబూజీ కూడా సత్యోదయం అనే గ్రంథంలో యాత్రను 24 వృత్తాలుగా వివరించినప్పుడు అందులో 11 వృత్తాలు అహంకారానికి సంబంధించినవే. 
అందుకే సమర్థ గురువు యొక్క ఆశ్రయం తప్పదు. ఇదే శాశ్వత పరిష్కారం.  


30, మే 2025, శుక్రవారం

ఇచ్ఛ లేక ఆశ - కోరిక

 ఇచ్ఛ లేక ఆశ - కోరిక

ఇచ్ఛ లేక ఆశ అంటే ఆంగ్లంలో wish లేక will; కోరిక అంటే desire. తెలుగు నిఘంటువుల్లో ఇచ్ఛ అన్నా, కోరికన్నా ఒక్కటే అర్థం కనిపిస్తుంది. ఈ రెంటికీ వ్యత్యాసం ఉందా? పరిశీలిద్దాం. 

ఇచ్ఛ/కోరిక లేకపోతే జీవితమే లేదు. కానీ మహాత్ములదరూ కోరికలు తగ్గించుకోమనే చెబుతున్నారు. కోరిక లేకపోతే మనిషికి మనుగడే కనిపించదు. జీవించాలన్నది కూడా కోరికే అయినప్పుడు కోరికలు తగ్గించుకోవడం ఎలా? మరి కోరికలు తగ్గాలనుకోవడం కూడా ఒక కోరికే కదా?ఈ గందరగోళ స్థితి నుండి బయట పడటం ఎలా? 

హార్ట్ఫలనెస్  సహజ్ మార్గ్ ప్రార్థనలో కూడా "... మేము ఇంకా కోరికలకు బానిసలమై యుండుట మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది ... " అని ఉంటుంది. ఈ లైనుకి పూజ్య చారీజీ చెప్పిన అర్థం చెప్తూ కోరికలను గరించి వారు ఇలా సెలవిచ్చారు: కోరికలుండటం తప్పు కాదు; కోరికలకు బానిసలైపోవడం  మంచిది కాదు. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది - అది కోరిక; నేను ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేను - అనేది కోరికకు బానిసత్వం. ఆ విధంగా మనం ఎన్నో కోరికలకు బానిసలుగా మారిపోయాం. ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. కోరికల బానిసత్వం, పెరుగుతున్న కొద్దీ వివేకం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కోరికలు తగ్గించుకోవాలసిన అవసరం ఉంది. 

ఇక పూజ్య దాజీ ప్రకారం, కోరికలు ఎదుకు తగ్గాలి:

ఉదాహరణకు మొత్తం 10 కోరికల్లో 8 కోరికలు నెరవేరాయనుకోండి; అప్పుడు సంతోషం 80 శాతం ఉన్నట్లు; అదే 10 కోరికాలూ నెరవేరాయనుకోండి; అప్పుడు సంతోషం నూటికి నూరు శాతం; ఇప్పుడు కోరికల సంఖ్య 0 అనుకోండి, గణిత శాస్త్రం ప్రకారం సంతోషం అనంతం లేక లెక్కించలేనిదిగా ఉంటుంది. అందుచేత సంతోషం అనంతంగా ఉండాలంటే కోరికలు తగ్గించుకోవడం మంచిది. 

దాజీ ప్రకారం, ప్రార్థనలోని ఈ పంక్తిపై మరో వివరణ ఉంది:

ఇచ్ఛ, కోరిక యొక్క పూర్వ స్వరూపం అంటారు. అంటే ఇచ్ఛ బీజం అయితే కోరిక వృక్షం. ఆశ యొక్క తీవ్రరూపమే కోరిక. అందుచేత ఈ బీజరూపంలో ఉన్న ఇచ్ఛలే/ఆశలే  కోరికలవుతున్నాయి. ఇచ్ఛ యొక్క తీవ్ర రూపం. ఇచ్ఛ అంటే ఒక ఆశ - నేను బాగా చదువుకొని ఉంటే బాగుండేది. ఇటువంటి ఆశలు మనకు ఎన్నో, ఎన్నో ఎన్నెన్నో. ఈ ఆశల స్థాయిలోనే వీటిని తొలగించుకోగలిగితే, ఇక కోరికలుగా మారే అవకాశం ఉండదంటారు.

కానీ అనిషి యొక్క యదార్థ స్థితి ఈ ఆశలకు బానిశాలమై ఉండటం. ఈ స్థితి నుండి గురువు ఉన్న స్థితికి జేర్చగలవాడు కేవలం ఆయన మాత్రమేనని స్వీకరించి మన సమస్యను ఆయన ముందుంచుతున్నాం ఈ ప్రార్థన ద్వారా. నిరంతరం మనం చేరవలసిన గమ్యం యొక్క మరణలో ఉన్నట్లయితే, అంటే నిరంతర స్మరణలో ఉన్నప్పుడు, కేవలం ఆయనను చేరాలన్న ఒక్క ఇచ్ఛ, ఆశ, కోరిక మిగిలిన అన్నీ ఆశలను తొలగిస్తుంది. 

ఆయనను చేరాలన్నది నిజానికి కోరిక కాదు ప్రతీ ఆత్మ యొక్క ధర్మం; ప్రతి ఆత్మలోనూ స్వతఃసిద్ధంగా ఉన్న ధర్మం; కర్తవ్యం. 


29, మే 2025, గురువారం

సంస్కారాలు/ వాసనలు/ కర్మలు

 

                   

            పువ్వును చూడటం                               కావాలనుకోవడం                                      స్వంతం చేసుకోవడం         



సంస్కారాలు/ వాసనలు/ కర్మలు
 
సంస్కారాలన్నా, వాసనలన్నా, కర్మలన్నా ఒక్కటే. 
తోటలో ఒక గులాబీని చూడటం; ఆ తరువాత ఆ పూవును కాంక్షించడం; ఆ తరువాత దాన్ని స్వంతం చేసుకోవాలనుకోవడం. ఇలాగే మన చిత్తంలో ముద్రలు ఏర్పడేది, మరలా మరలా పునరాకృతం అవడం ద్వారా ఆ ముద్రలే సంస్కారాలుగా మారడం జరుగుతుంది. ఈ సంస్కారాలే/కర్మలే  మన మనసును, బుద్ధిని శాసించడం జరుగుతుంది. అందుకే "బుద్ధి కర్మానుసారిణి" అన్న నానుడి ఏర్పడింది. అంటే బుద్ధి కర్మను అనుసరిస్తుందన్నమాట. అందుకే మనిషి జీవితం తన కర్మ ఎలా ఉంటే అలా ఉంటుంది. వాస్తవానికి బుద్ధి హృదయాన్ని అనుసరించాలి. ఎందుకంటే దైవత్వం అందులో నివాసం ఉండటం వల్ల ఎప్పుడూ తప్పుడు మార్గదర్శకత్వం చేయదు. బుద్ధిని హృదయాన్ని అనుసరించేలా చేసే శిక్షణే ధ్యాన శిక్షణ. ఆ విధంగా మనిషి తన విధిని తాను రూపకల్పన చేసుకొనే అవకాశం ఉంటుంది. 
పైన ఉన్న మూడు చిత్రాలు మనిషి తనలో ముద్రలు యే విధంగా ఏర్పరచుకుంటాడో తెలియజేస్తున్నాయి. మనం ప్రపంచంతో వ్యవహరించినప్పుడు ఇలా ఎన్నో ముద్రలేర్పారచుకుంటూ ఉంటాం, అవే కారుడు కత్తి సంస్కారాలుగా మారతాయి. ఆ సంస్కారాలే మన చిత్తంలో గాడులుగా తయారై మన జీవితాలను శాసించడం ప్రారంభిస్తాయి. మన జీవించవలసిన విధంగా జీవించనియ్యవు ఈ సంస్కారాలు. మనిషి జీవించవలసిన విధంగా మార్గదర్శనం చేసేది హృదయం. అందుకే హృదయంపై ధ్యానించడం అనివార్యం. 
ఈ సంస్కారాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఏర్పడతాయి - 1) రాగద్వేషాలు అంటే ఇష్టాలు, అయిష్టాల వల్ల ఏర్పడేవి; 2) ఇంద్రియపరమైనవి ముఖ్యంగా స్త్రీ-పురుషుల మధ్య ఉండే ఆకర్షణల వల్ల కలిగే లైంగికపరమైన ముద్రలు; 3) ప్రాపంచిక చింతలకు సంబంధించిన ముద్రలు, అంటే కూటుమాబంలో ఉండే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, బంధాల వల్ల కలిగే చింతలు, ఇత్యాదివాటి వల్ల ఏర్పడేవి. ఈటీ బాధలని వేటినైతే అంటామో వాటి వల్ల ఏర్పడే ముద్రలు; 4) అపరాధ భావం వల్ల కలిగే సంస్కారాలు - చెయ్యవలసిన పనులు చేయకపోవడం వల్ల, చేయకూడని పనులు  చేయడం వల్ల ఏర్పడే ముద్రలు. 
ఈ నాలుగు రకాల ముద్రలు మనం తెలిసో తెలియకో ప్రతి నిత్యం ప్రపంచంతో వ్యవహరించే క్రమంలో ఏర్పరచుకుంటాం. ఇందులో మొదటి 3 రకాల ముద్రలూ సహజమార్గ పద్ధతిలోని శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా చాలా వరకూ తొలగించుకోవచ్చు. నాల్గవ రకం ముద్రలు మాత్రం చాలా బారువైనవి కాబట్టి, వాటిని గురువు గాని, దేవుడు గాని ఎవ్వరూ తొలగించలేరు. వీటిని కేవలం పశ్చాత్తాపం అనే అగ్నితో కరిగిన హృదయం వల్లే, సాధకుని అశ్రుధారల  ద్వారానే తొలగించబడతాయి. దీని నిమిత్తమే ప్రార్థనా ప్రక్రియ సహజ్ మార్గ్ ధ్యాన పద్ధతిలో భాగమై ఉన్నది.

24, మే 2025, శనివారం

చింతలు - Worries

 

చింతలు - Worries 
"నిర్జీవం దహతే చితా, సజీవం దహతే చింతా" 
చితి జీవం లేని వ్యక్తిని  దహిస్తుంది; చింత జీవం ఉన్న వ్యక్తిని దహిస్తుంది. 

మనుషుల మనసును దహించే, కృంగదీసే, బాధించే మరో అంశం - చింతలు. చింత అంటే విరామం లేకుండా మనసుపై ఒత్తిడి ఉండటం; మరే ఆలోచనా తట్టకపోవడం; మనసు నకారాత్మకంగా తయారవడం; పదే  పదే అవే ఆలోచనలు రావడం; భయం వేయడం; ఫలితాలు అనుకున్నట్లుగా ఉండవన్న భయం; మనలో ఉన్న కొరతలను గురించిన ఆలోచనలు; ఇత్యాదివి. 

సాధారణంగా అందరికీ ఉండే చింతలు - అనారోగ్యం; అస్థిర ఆర్థిక పరిస్థితి; బాంధవ్యాల్లో ఒత్తిళ్ళు; ఉద్యోగపరమైన/వ్యాపారపరమైన పరిస్థితులు; విద్యారంగంలో రాణించలేకపోవడం; అనిశ్చితి; నియంత్రణ లేకపోవడం; సామాజిక సమస్యలు; వాతావరణ సమస్యలు; రాజకీయ అశాంతి; ఇత్యాదివి; తలనొప్పులు, అజీర్ణ సమస్యలు, కండరాల నొప్పులు వంటి శారీరక సమస్యలు ; 

వీటి వల్ల కలిగే నష్టాలు - నిద్ర పట్టకపోవడం; ఏకాగ్రత లేకపోవడం; సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం; మానసికంగా అలసిపోవడం;  ఇవన్నీ ఆందోళనకు దారి తీసి మనిషిని కృంగిపోయేలా చేయడం.

చింత గనుక తగిన మోతాదులో ఉంటే దాని వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి: తగిన జాగ్రత్తలు తీసుకోగలగడం; సమస్యను పరిష్కరించాలన్న ప్రేరణ కలగడం; ఆ క్షణంలో ఉండే అవసరాలపై దృష్టి పెట్టగలగడం వంటి లాభాలు కూడా ఉన్నాయి. 

అనవసరంగా చింతించడం వల్ల నష్టాలేనని, సమస్య ఉన్నప్పుడు చింతించడం సమంజసం అని పూజ్య చారీజీ చెబుతూండేవారు. చింత అంటే తప్పుడు దిశలో ఉండే ఆలోచన (Worry  is misdirected thought) అని పూజ్య బాబూజీ చెప్పేవారు. 

వీటికి చాలా వరకు తగ్గించుకోటానికి కొన్ని పరిష్కారాలు: అన్నిటి కంటే సమగ్ర పరిష్కారం - ధ్యానం/శుద్ధీకరణ/ప్రార్థన/దశ నియమాలను పాటించడం, మన జీవన విధానంగా మారిపోవడం, ఉన్న సమస్యను యథాతథంగా స్వీకరించగలగడం,  వంటి సత్సంకల్పాలు చేసుకోవడం.  

21, మే 2025, బుధవారం

కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు షడ్రిపులు - అరిషడ్వర్గాలు



 కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 
షడ్రిపులు లేక అరిషడ్వర్గాలు

సనాతన సంస్కృతిలో పుట్టి, పెరిగిన ప్రతి వ్యక్తీ ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే పదబంధాన్ని వినే ఉంటారు, దాన్ని గురించి అంతగా పట్టించుకోకపోయినా. వీటినే షడ్రిపులని, అరిషడ్వర్గాలని కూడా అంటారు మన శాస్త్రాలలో. ఈ ఆరు ప్రవృత్తులు మనిషి చైతన్య వికాసంలో, ఆత్మవికాసంలో పెద్ద అవరోధాలు, ఆత్మకు శత్రువులు. ఇవి లేని వ్యక్తి ఉండటం చాలా అరుదు. 

అయితే వీటిని పూర్తిగా తొలగించుకోగలమా? శుద్ధ చైతన్య స్థితిని అనుభూతి చెందగలమా? ఒకవేళ తొలగించుకోగలిగితే ఎలా?మన శాస్త్రాలు ఏమంటున్నాయి? మన సహజ్ మార్గ్ గురుపరంపరలోని మాస్టారలేమంటారు? క్లుప్తంగా పరిశీలిద్దాం

వీటిని పూర్తిగా తొలగించలేము కాని వీటిని అదుపులో పెట్టుకోవచ్చని, అంటారు మన శాస్త్రకారులు. మరికొందరు పూర్తిగా తొలగించుకోవచ్చని కూడా అంటారు. అయితే ఇక్కడ పూర్తిగా తొలగించుకోవడం అంటే వీటి ప్రభావం ఆత్మపై ఉండకుండా చేసుకోవచ్చని చెప్తారు. 

శాస్త్రకారులకు కొంచెం భిన్నంగా సహజ్ మార్గ్ మాస్టర్ పూజ్య బాబూజీ మహారాజ్ గారు ఈ షడ్రిపుల్లో కామం, క్రోధం అనేవి దైవదత్తమని, భగవంతుడు సృష్టించినవని, వీటిని పూర్తిగా తొలగించలేమని, తక్కినవి మనిషి సృష్టించుకున్నవి కావున వీటిని పూర్తిగా సహజ్ మార్గ్ సాధన ద్వారా తొలగించుకోవచ్చని తెలపడం జరిగింది. కామం భగవంతుడిని కోరుకోడానికని, ఆ కోరుకున్నదానికి అవరోధంగా నిలిచేవాటి పట్ల కోపం చూపించడానికి క్రోధం ఉన్నదని పూజ్య చారీజీ వివరించారు.

భగవద్గీత 

ఇంద్రియపరమైన విషయాలను తదేకంగా ఆలోచించుటవల, మోహం ఏర్పడి, మోహం కోరికగా మారుతుంది, కోరిక నెరవేరనప్పుడు  అది కోపంగా మారుతుంది, కోపం అదుపులో లేనపుడు అది భ్రాంతిగా మారుతుంది. భ్రాంతి వలన స్మృతిని  కోల్పోవడం జరుగుతుంది ; స్మృతిని కోల్పోవడం వల్ల వివేకం నశిస్తుంది; వివేకం నశించడంతో మనిషి వినాశనమవుతాడు. 

20, మే 2025, మంగళవారం

భయం

 


భయం 
భయం ప్రతి జీవిలోనూ ఉండేదే. మనం ముఖ్యంగా మనుషుల్లో ఉండే భయాన్ని గురించి చర్చించుకుందాం. 
భయం వల్ల మనిషి సరిగ్గా ఎదగవలసిన విధంగా ఎదగడం జరగదు. ఆధ్యాత్మికంగా కూడా. అలాగని భయం పూర్తిగా చెడ్డదని అనడానికి కూడా లేదు. కొంత భయం అవసరం అని కూడా అనుభవం ద్వారా తెలుసుకున్నాడు మనిషి. 
రకరకాల భయాలు - చీకటి అంటే భయం, ఎత్తులంటే భయం, పాకే జీవులంటే (పాములు ఇత్యాదివి) భయం. తిరస్కరిస్తారన్న  భయం, విఫలమవుతామన్న భయం, అపరాధం చేసినప్పుడు కలిగే భయం, అసత్యం పలికినప్పుడు కలిగే భయం,  తప్పులు చేసినప్పుడు కలిగే భయం, కారణం తెలియని భయం, ఇలా ఎన్ని రకాల భయాలున్నా, అసలు భయం మాత్రం మృత్యు భయమే. ఆ భయం పోయిందంటే సమస్త భయాలూ పోతాయి. అమృతత్వం లభిస్తుంది అంటారు మన పెద్దలు. 
ఈ భయం ముందు ఆందోళనకు దారి తీస్తుంది, వివేకం పని చేయదు, ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది. జీవితంలో యే విధంగానూ ఎదగడం జరగదు. 
అయితే ఈ భయానికి మూల కారణం ఏమిటి? మన శాస్త్రాలేమంటున్నాయి?మన మహర్షులేమంటున్నారు? మన హార్ట్ఫుల్నెస్ గురుపరంపర చెప్పేదేమిటి? భయాన్ని పోగొట్టుకోడానికి పరిష్కారాలేమయినా ఉన్నాయా? 
వేదంలో
అభినో భద్రాః క్రతవో యంతు విశ్వతః 
- ఋగ్వేదం 
దీనర్థం: అన్ని వైపుల నుండి ఉదాత్తమైన ఆలోచనలు కలుగుగాక. భయం అజ్ఞానం నుండి పుడుతుంది కాబట్టి, దీన్ని అధిగమించడానికి అన్ని దిక్కుల నుండి ఉదాత్తమైన, సాత్త్వికమైన ఆలోచనలు కలుగుగాక అని దీని అర్థం. 
ఉపనిషత్తుల్లో  
ద్వితీయాడ్ వి భయం భవతి 
- బృహదారణ్యక ఉపనిషత్తు 
దీనర్థం: ద్వంద్వం వల్లే భయం పుడుతుంది. అద్వైతం ద్వారానే భయం పతుంది అంటుంది ఉపనిషత్తు. 
భగవద్గీతలో 
అజ్ఞానం వల్ల, మమకారం వల్ల కలిగే బంధాల వల్ల భయం పుడుతుందంటాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో.  దీన్ని భక్తి వైరాగ్యాల చేత, ఆత్మ సాక్షాత్కారం ద్వారా అధిగమించాలంటాడు గీతాచార్యుడు. 
అభయం శతత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగా వ్యవస్థితః 
అభయం (నిర్భయత్వం) మనసు పవిత్రంగా శుద్ధిగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక వివేకం కలిగినప్పుడు సాధ్యపడుతుందని దీని అర్థం. 
శ్రీమద్రామాయణం 
హనుమంతుడు భక్తి-విశ్వాసాల ద్వారా, సాహసం ద్వారా భయాన్ని అధిగమిస్తాడు. 
రామో విగ్రహవాన్ ధర్మః 
అంటే రాముడు మూర్తీభవించిన ధర్మం. అందుఅల్లా ఆ దివ్య వ్యక్తిత్వం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వీడలేదు. 
మహాభారతం 
యుధిష్ఠరుడు సత్యనిశఠతో ఉండటం వల్ల నిర్భయతవాన్ని సాధించాడు. 
భీష్ముడు మృత్యుశయ్యపై ఉన్నా కూడా భయం లేకపోవడానికి కారణం జీవితం అంతా ధార్మికంగా జీవించడం వల్ల. 
మన శాస్త్రాల ప్రకారం భయానికి మూలకారణాలు 
ఆవిద్య (అజ్ఞానం) - ఆత్మజ్ఞానం లేకపోవడం 
రాగద్వేషాలు - మమకారాలు, వికర్షణలు, కోల్పోతామన్న భయం 
అహంకారం - మృత్యుభయం 
కర్మ - వ్యక్తి చేసే కర్మల వల్ల కలిగే పరిణామాల భయం 
సహజ మార్గ గురుపరంపర 
ఆత్మ, ఆ పరమాత్మ నుండి, ఆ మూలం నుండి మొట్టమొదటిసారిగా విడిపోయినప్పుడు కలిగినది భయం. భయమే ఆత్మ ఏర్పరచుకున్న మొట్టమొదటి సంస్కారం. మిగిలిన సంస్కారాలన్నీ భయం వల్ల ఏర్పడ్డవే.  భయాన్ని నిరంతర స్మరణ ద్వారా తొలగించుకోవచ్చునన్నారు, పూజ్య చారీజీ మహారాజ్. 

8, మే 2025, గురువారం

అలసత్వం - బద్ధకం

 


అలసత్వం - బద్ధకం 

బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యపోకండి. ఉన్నాయి. 

అసలు బద్ధకానికి మూల కారణలేమిటో చూద్దాం. 1) స్పష్టమైన ప్రయోజనం లేనప్పుడు, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు లేనప్పుడు 2) విఫలమవుతామన్న భయం ఉన్నప్పుడు లేక మనలో కొరతలున్నప్పుడు 3) చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నా లేక పెద్దవిగా ఉన్నా వచ్చేది 4) శక్తి లేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు 5) సుఖం ఎక్కువైనప్పుడు లేక మనసును మళ్ళించే విషయాలున్నప్పుడు 5) నకారాత్మకమైన ఆలోచనా విధానం ఉన్నప్పుడు. 

మరో దృష్టి కోణంలో నుండి చూస్తే ఆశ్చర్యకరంగా బద్ధకం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి: 1) సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది - ఎందుకంటే బద్ధకస్తులు కష్టమైన పనులు త్వరగా/సరళంగా చేసే మార్గాలు వెతుకుతారు; నేను కష్టమైన పనిని బద్ధకస్తుడికి  అప్పగిస్తాను, ఎందుకంటే పని పూర్తి చేయడానికి అతను తేలిక మార్గం వెతుకుతాడు - బిల్ గేట్స్ 2) విశ్రాంతిని, శక్తిని కూడగట్టుకునేలా చేస్తుంది 3) మనలోని సృజనాత్మకతను పూరికొల్పుతుంది 4) కలిసిగట్టుగా పని చేయడాన్ని ప్రోత్సహిస్తుంది, ఇతరులకు పని అప్పగించడం నేర్పిస్తుంది 5) ఆలోచింపజేస్తుంది, పని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచింపజేస్తుంది 6) ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది.  

అయితే ఆధ్యాత్మిక సందర్భంలో ఆలోచిస్తే, నిత్యం ఆధ్యాత్మిక సాధన చేయకపోవడానికి ముఖ్య కారణం బద్ధకమే. దీనికి పైన చెప్పిన కారణాలు గనుక మనలో ఉన్నట్లయితే, వాటికి పరిష్కారాలు కూడా తరచి చూస్తే వాటిల్లోనే కనిపిస్తాయి. 

అయితే అస్సలు బద్ధకం లేకుండా ఉండగలమా అన్నది ప్రశ్నే. అయితే పూజ్య చారీజీ కాస్త వెసులుబాటు కల్పించినట్లుగా అనిపించింది - పని లేనప్పుడు బద్ధకించవచ్చు గాని, పని ఉన్నప్పుడు బద్ధకించరాదన్నారు చారీజీ. తప్పక దీన్ని ప్రతి సాధకుడు పరిష్కరించుకోవలసినదే. ఆలోచించండి!

హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో ధ్యానం

  హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో ధ్యానం హార్ట్ఫుల్నెస్  సహజ్ మార్గ్ అనే రాజయోగ ధ్యానపద్ధతిలో, హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో కూర్చోని ...