పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ (నా మొదటి గురుదేవులు)
(1927-2014)
అఖండ మండలాకారం , వ్యాప్తం యేన చరాచారం
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
శ్రీరామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక సంస్థ గురుపరంపరలోని మూడవ గురువుగా ఉన్న పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ, 96 వ జయంత్యోత్సవాలు, హైదరాబాదులోని కాన్హా శాంతి వనంలోనూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో ఉన్న అభ్యాసులందరూ తమ తమ కేంద్రాల్లో ఈ జూలై 24, 2023 న జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా కృతజ్ఞతతో నిండిన హృదయంతో ప్రత్యేకంగా వారిని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం.
భగవంతుని స్మరణ లేక గురువుల స్మరణ ఎందుకు?
గురువుల స్మరణ ద్వారా వారి పట్ల అకారణ ప్రేమ జనిస్తుంది, దాని వల్ల నిజమైన శరణాగతి స్థితి ఏర్పడుతుంది, తద్వారా ఆయనలో లయమవడం జరుగుతుంది. భగవంతునిలో సంపూర్ణ ఐక్యమే మానవ జీవిత యదార్థ లక్ష్యం.
మన సహాజమార్గ సాధన ప్రకారం మనం ఎప్పుడూ భగవంతుని స్మరణలో లేక గురుదేవుల స్మరణలో అంటే నిరంతర స్మరణలో ఉండాలి కదా? మరి ఈ జయంత్యుత్సవాల్లో మరలా స్మరించుకోవడం ఏమిటి? అని ఒక సాధకుడు గురుదేవులను ప్రశ్నించడం జరిగింది.
దానికి గురుదేవులు సమాధానమిస్తూ, నిజమే మనం నిరంతరం వారి స్మరణలో ఉంటాం; కానీ ఆ రోజున ప్రత్యేకంగా స్మరించుకుంటే నష్టమేమీ లేదుగా! అని చక్కగా చెప్పడం జరిగింది.
పూజ్య చారీజీ దివ్యమంగళ విగ్రహం
పూజ్య పార్థసారథి రాజగోపాలాచారీజీ విగ్రహం కళ్ళు ప్రక్కకు త్రిప్పుకోలేని స్వరూపం. (పై చిత్రంలో కనిపించినట్లుగా) ఆరు అడుగుల ఆజానుబాహుడు; దివ్యత్వం అణువణువునా ఉట్టిపడేటువంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని, చుట్టూ ఉన్నవారిని పరవశింపజేసే మంగళకరమైన విగ్రహం. వారి గంభీర స్వరం దైవత్వాన్ని తలపించే విధంగా ఉండేది; వారి అలవాట్లు పరిపూర్ణుడైన మానవుడు అంటే ఇలా ఉంటారేమో అన్నట్లుగా అనిపించేవి; వారి సంభాషణా విధానం మైమరిపించే విధంగా ఉండేది; వారు నవ్వితే చాలు, చుట్టూ ఉన్న వాతావరణ అంతా ఆహ్లాదంగా మారిపోయేది; వారి ప్రసంగాలు కనువిప్పు కలిగించేవిగానూ, మేలుకొల్పు కలిగించే విధంగానూ, సున్నితమైన మందలింపులుగానూ ఉండేవి. వారు మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా కొన్ని ప్రసంగాలు సింహగర్జనలా ఉండేది. వారి భావాలను, సుస్పష్టంగా, ఎటువంటి భయం లేకుండా తెలియజేయగలిగిన నేర్పు వారిలో కనిపించేది. వారి భాష చాలా సరళంగా, స్ఫటికం అంత స్పష్టంగా ఉండేది; చిన్న పిల్లవాడు విన్నా ఏదొకటి అర్థమయ్యేలా ఉండేది; పండితులకు, పామరులకూ అర్థమయ్యేలా ఉండేవి ఆయన ప్రసంగాలు. ఎంతో దూరదృష్టితో ఇచ్చిన ప్రసంగాలు వారివి. వారు వ్రాసిన గ్రంథాలు గాని, వారి ప్రసంగాలు గాని ఎప్పటికీ స్ఫూర్తినిచ్చేవిగానే ఉంటాయి; స్వామి వివేకానందను తలపిస్తాయి. వారి వ్యక్తిత్వం దైవం మానుష రూపేణా అన్న ఆర్ష వాక్యాన్ని తలపించేది.
చారీజీ - బాబూజీ దివ్య కలయిక, గురుశిష్యుల అద్భుత సంబంధం
చారీజీ తన గురుదేవులైన బాబూజీని మొట్టమొదటసారి కలిసినప్పుడు వారి అనుభూతిని "నా గురువర్యులు (My Master)" అనే తన గ్రంథంలో అభివర్ణించిన విధానం ప్రతీ సాధకుని మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ గ్రంథం ప్రతీ ఆధ్యాత్మిక సాధకుడూ చదువవలసిన దివ్య గ్రంథం. ఈ గ్రంథం అధ్యయనం చేయడం వలన ఇద్దరు మాస్టర్లను గురించిన అవగాహన, ఒక శిష్యుడు తన గురువును ఏ విధంగా చూడాలి, ఏ విధంగా భావించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా దర్శించాలి, గురు-శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, ఇంకా మరెన్నో రకాలుగా లోతుగా అర్థం చేసుకునే అవకాశం కలిగి పాఠకుడికి ఆధ్యాత్మిక సాధనలో లోలోతుల్లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. చారీజీ My Master కవరు పేజీలోనే ఒక్క లైనులో తన గురుదేవులను The Essence of Pure Love అని వర్ణిస్తారు. అంటే నా గురుదేవులు, పవిత్ర ప్రేమ యొక్క సారం అని అర్థం. మన వంటి వారికి ప్రేమే సరిగ్గా తెలియదు, పవిత్ర ప్రేమ అంటే అసలు తెలియదు, ఆ పవిత్ర ప్రేమ యొక్క సారంగా తన గురుదేవులను అభీవర్ణించడం, చారీజీ బాబూజీని ఎంత లోతుగా దర్శించారో తెలియజేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో సంస్థను నెలకొల్పడం
50 సంవత్సరాలుగా ఆవిశ్రాంతంగా, రేయింబవళ్ళూ కృషి చేస్తూ తన గురుదేవుల సందేశాన్ని, ఆశయాన్ని, ప్రపంచం అంతా తిరుగుతూ 100 దేశాలలో సహాజమార్గ పద్ధతిని అందించినటువంటి మహాత్ములు చారీజీ. అంతే కాదు భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల్లోనూ స్థాపించిన మహనీయుడు. కొన్ని సంవత్సరాలు 6 నెలలు భారతదేశంలోనూ, 6 నెలలు విదేశాలు పర్యటిస్తూ అన్ని చోట్లా ఉన్న జిజ్ఞాసువులను కలుస్తూ, మార్గదర్శనం చేస్తూ సుదీర్ఘంగా పని చేశారు చారీజీ.
3000 కు పైగా కుల, మత, రంగు, జాతి విభేదాలలేకుండా వివాహాలు జరిపి ఉత్కృష్ఠమైన ఆశయాలను సాకారం చేసిన మహనీయుడు
తన జీవితకాలంలో 3000 కు పైగా కుల, మత, రంగు, జాతి విభేదాల్లేకుండా సహాజమార్గ సాంప్రదాయం ప్రకారం వివాహాలు జరిపి, ఉన్నతమైన ఆశయాలను సాకారం చేసిన మహనీయుడు పూజ్య చారీజీ. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సుమారు అన్ని జంటలూ సుఖంగా సంసారాలు చేసుకుంటున్నారు, ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ఆ జంటలకు జన్మించిన పిల్లలకు నామకరణం కూడా చేశారు చారీజీ. వారందరూ ప్రస్తుతం వారి ఆశయాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు.
సహాజమార్గ సాధకుల హృదయాల్లో నిజమైన ప్రేమను పునాదిగా ప్రతిష్ఠించారు
వారి శిక్షణ ప్రేమతో కూడినదిగా ఉండేది. అందరిలో ప్రేమను నింపడం, పరస్పరం ప్రేమతో వ్యవహరించేలా చేయడం, పరస్పరం జరిగే స్ఫర్థల్లో క్షమించుకోగలగడం, మరచిపోగలగడం నేర్పించారు. ఈ పునాదితో సాధన కొనసాగించడం తేలికయ్యేలా చేశారు. తెలియకుండా మా అందరి వ్యక్తిత్వాలను సరిదిద్దారు, మలిచారు. జీవితానికి ఒక దిశను కల్పించారు; జీవితాన్ని అర్థవంతంగా మార్చారు; జీవిత ప్రయోజనాన్ని తెలుసుకునేలా చేశారు; జీవితంలో వచ్చే ఇబ్బందులను, సవాళ్ళను, ధైర్యంగా ఎదుర్కొనేలా శిక్షణనిచ్చారు; అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.
(సశేషం ... )