30, అక్టోబర్ 2021, శనివారం

మార్పు - పరివర్తన - ఆత్మావలోకనం (భాగం 7)


మార్పు - పరివర్తన - ఆత్మావలోకనం  (భాగం 7)

 

మార్పు అంటే  ఎదుగుదల. ఎదుగుదల  ఆనందాన్నిస్తుంది.  ఎదుగుదల  పరిణామానికి  అనుకూలమైనది.  అందుకే  ప్రకృతికి  కూడా  అనుకూలమైనది.  మార్పు  ఎప్పుడూ  మెరుగుపడటానికే.  మార్పు  ఒక్కటే శాశ్వతం  ఈ  సృష్టిలో.  మార్పుకు  అడ్డుపడటం  ప్రకృతి  ప్రవాహానికి  అడ్డు  పడటమే;  అది  వినాశనానికే  దారి  తీస్తుంది. మార్పు  లేనిదే  భవిష్యత్తు  లేదు. 

మార్పు  అనేది  ప్రక్ఱ్ర్తిలో  అన్ని  స్థాయిల్లో  ప్రతీ క్షణం  జరుగుతున్నా  కూడా  అది  చాలా  నెమ్మదిగా  జరుగుతూ  ఉంటుంది.  తనంతతానుగా  జరుగుతుంది.  ఈ  మార్పు  మహాప్రళయం  వరకూ  కొనసాగుతూ  ఉంటుంది  మన  శాస్త్రాల  ప్రకారం.  కాబట్టి  మార్పు  అనేది  ప్రకృతి నియమం.  సమస్త చరాచర జీవుల్లోనూ  అప్రయత్నంగా  జరుగుతూ  ఉంటుంది. దాన్నే  వికాసం  అని  పరిణామం  అని  కూడా  అంటారు.  ఈ  పరిణామ  ప్రక్రియలో  మనకిష్టమున్నా  లేకపోయినా  పాల్గొనవలసినదే - ప్రత్యక్సంగానో,  పరోక్షంగానో.  కాని  కేవలం  మనిషిలో  మాత్రమే  ఈ  ప్రకృతి  కార్యంలో  ప్రయత్న  పూర్వకంగా  పాల్గొనే  అవకాశం  ఉంది.  ఎందుకంటే  మనిషిలో  మాత్రమే  తనను  తాను  తెలుసుకోగలిగే  బాగా వికసించిన పరికరాలున్నాయి. వాటినే  మనం  సూక్ష్మశరీరాలంటాం;  ప్రధానంగా  మనసు, బుద్ధి,  అహంకారం, చిత్తము అనేవి  నాలుగు. ఇవి  యే  జీవరాసుల్లోనూ  ఇంతగా  వికసించి  లేవు. అలాగే  మనిషి  తరువాత  ఉండే  అనంత  యాత్రలో  ఉన్న  దేవతలకు  కూడా  లేవంటారు  పెద్దలు.  అందుకే  వాళ్ళైనా  సరే,  అత్యున్నత  ఆధ్యాత్మిక  శిఖరాలకు  ఎదగాలంటే  ఈ  మానవ  జన్మ  ధరించవలసినదే.  ఇక్కడే  ఈ  మానవ  జన్మలోనే  అత్యున్నత  ఆధ్యాత్మిక  వికాసం  సుసాధ్యమవుతుంది.  అందుకే  మానవ జన్మ  చాలా  విలువైనది. మానవ  జన్మెత్తిన  ముఖ్యోద్దేశ్యం వికాసం, పరిణామం. దీనికి  విరుద్ధంగా  జీవించడం  లేక  కాలాన్ని  వృథా చేయడం    మానవజన్మను  వ్యర్థం  చేసుకోవడం అవుతుంది. మానవుడు  ఎప్పుడైతే  అత్యున్నత  వికాసం  కోసం  ప్రయత్నపూర్వకంగా  పాల్గొనడానికి  ప్రయత్నిస్తాడో  అప్పుడు  ప్రకృతి  కూడా  సహకరిస్తుంది; ఎందుకంటే  ఇది ప్రకృతి  కార్యం  గనుక. అప్పుడు  మనిషి  వికాసం  త్వరితంగా  జరుగుతుంది.  ఈ  ప్రయత్నపూర్వకంగా  పాల్గొనడాన్నే  ఆధ్యాత్మిక  సాధన  అంటారు. ఇటువంటి  ఆధ్యాత్మిక సాధన  వల్ల ఎంతో కాలాన్ని  ఆదా  చేయడం  జరుగుతుంది;  జీవితాన్ని  అర్థవంతంగా  గడిపినట్లవుతుంది; ఎంతో  ఆత్మసతృప్తినిస్తుంది;  జీవిత  గమనం  సరైన దిశలో  జరుగుతుంది;  ఆలోచనలో  స్పష్టత  ఉంటుంది; సరైన  నిర్ణయాలు  తీసుకుంటూ  ఉంటాం;  రోజురోజుకూ  సూక్ష్మత్వం  పెరుగుతూ  ఉంటుంది;  లోపలి  ప్రపంచంం  బయట ప్రపంచాన్ని  గురించి  సమగ్రమైన  అవగాహన  పెరుగుతూ  ఉంటుంది;  ఈ  సృష్టిలో  మన  స్థానం  ఏమిటో  అర్థమవుతుంది;  మన ఉనికికి  సంబంధించిన  రహస్యాలను  తెలుసుకోగలుగుతాం -  దీన్నే  ఆత్మ  సాక్షాత్కారం  అని  కూడా  అంటారు. ఇక  నిత్య  జీవితంలో  ఈ  మార్పు  దిశగా,  ఈ  పరిణామ  దిశగా  ప్రయత్నపూర్వకంగా  చేసే  ఈ  హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక  యాత్ర  విజయవంతంగా  సాగడానికి మనం  అనుసరించవలసినవి, అనుసరించదగ్గవి:  1) ఆత్మావలోకనం  2) సాధన  3) గురువు 4) స్వాధ్యాయం  5)  సేవ

1) ఆత్మావలోకనం: ఇవన్నీ  విస్తృతంగా  చెప్పుకోవలసిన అంశాలు. ప్రస్తుతానికి మనం  ఆత్మావలోకనం  గురించి  చెప్పుకుందాం. ఇది  మనిషిలో  రావలసిన  మార్పును  త్వరితంగా  తీసుకురాగలిగే  చాలా  కీలకమైన  పరికరం. 

ఇక్కడ  ఆత్మావలోకనం  అంటే యేది  కాదో  కూడా  తెలుసుకోవడం  అవసరం. ఆత్మావలోకనం  అంటే  కేవలం  కళ్ళు  మూసుకుని  కూర్చోవడం  కాదు;  ధ్యానించడమూ  కాదు; ఏకాగ్రతా  కాదు.

ఆత్మావలోకనం  అంటే  తనను తాను యథాతథంగా  ఉన్నదున్నట్లుగా ఎటువంటి పక్షపాత  ధోరణి  లేకుందా  గ్రహించగలగడం;  తనలో  ఉండవలసిన  లక్షణాలను,  ఉండకూడని  లక్షణాలను  గుర్తించడం; ఈ  ప్రక్రియ  ఎప్పటికప్పుడు  తన  ఆలోచనలను,  తన  చేతలను,  తన  అలవాట్లను,  తన  కోరికలను,  తన ప్రవర్తనను,  తన  ఉద్దేశాలను, తన  ఉద్వేగాలను, తనలో  కలిగే  భావాలను ఒక  సాక్షి  భావంతో  గమనించడం  ద్వారా  సాధ్యపడుతుంది. అప్పుడే  సరిదిద్దుకోవలసినవాటిని  సరిదిద్దుకోవడం  సాధ్యపడుతుంది; తొలగించుకోవలసినవాటిని  తొలగించుకోవడం  సాధ్యపడుతుంది. ఆత్మావలోకనం  సూక్ష్మగ్రాహ్యతను  కూడా  పెంపొందిస్తుంది. 

కొరతలు,  దోషాలు  గుర్తించిన  తరువాత  వాటిని  మనస్ఫూర్తిగా  స్వీకరించాలి;  ఎప్పటికప్పుడు  ప్రయత్నపూర్వకంగా  తొలగించుకునే  ప్రయత్నం  చెయ్యాలి. అలాగే  మెరుగుపరచుకోవలసిన  లక్షణాలను  గుర్తించిన  తరువాత  వాటిపై  దృష్టి పెట్టి  అవసరమైనది  చెయ్యాలి.  ఇది  ప్రతి  నిత్యం  జరగాలి.  మన  నిత్యజీవనంలో  ఈ  ఆత్మావలోకన  ప్రక్రియ  అంతర్లీనంగా  నేపథ్యంలో  జరుగుతూ  ఉండాలి. ఇది ప్రయత్నిస్తేనే  జరుగుతుంది. ఇది  జరగాలంటే  తనలో  పరివర్తన  రావాలన్న  ఆకాంక్ష,  ఆసక్తి,  తపన చాలా  అవసరం. గుర్తించిన  అంశాల్లో  కొన్ని  బాగుచేయడం  గాని,  తొలగించడం  గాని,  సరిదిద్దుకోవడం  గాని  అసాధ్యమయ్యేవి  ఉండవచ్చు.  వాటిని  హృడయపూర్వకంగా  స్వీకరించి  వాటికి  తగినట్లుగా  మనలను  సర్దుకుంటూ  దివ్యప్రణాళికలో  వీటి  పాత్ర  యేదో  ఉండుంటుందని  ప్రార్థనాపూర్వకంగా  స్వీకరించడానికి  ప్రయత్నించాలి.  ఇక్కడ  హార్ట్ఫుల్నెస్  ప్రార్థన  ఎంతగానో  సహాయపడుతుంది. గుర్తించిన  దోషాలను  తొలగించుకోవడానికి  హార్ట్ఫుల్నెస్  శుద్ధీకరణ  ప్రక్రియ ఎంతో  చేయూతనిస్తుంది;  అలాగే  ఉన్న  మంచి  లక్షణాలను  మెరుగుపరచుకోవడానికి,  హృదయ  వికాసం  జరగడానికి  ధ్యానం  ఎంతగానో  ఉపకరిస్తుంది. 

ఇవన్నీ  క్రమక్రమంగా  చేయడం  వల్ల  మన  శీలంలో  గణనీయమైన  మార్పు  లోపల  ప్రాణాహుతితో  కూడిన  ధ్యానం  ద్వారా కలిగే  ఆధ్యాత్మిక  స్థితికి  అనుగుణంగా  సర్దుకుంటుంది;  ఆ  విధంగా  మన  ఆధ్యాత్మిక  ప్రగతి,  పరిణతి,  యాత్ర  త్వరితంగా  జరుగుతుంది. ఇది  మనందరమూ  ప్రత్యక్షానుభవంతో  తెలుసుకోవచ్చు.  (సశేషం)


27, అక్టోబర్ 2021, బుధవారం

మార్పు - పరివర్తన (భాగం 6)


మార్పు - పరివర్తన (భాగం 6)

ఆధ్యాత్మిక  పరివర్తన

 మనం  ఇప్పటి  వరకూ  చర్చించుకున్నది  ఆధ్యాత్మిక మార్పును  గురించి,  అంతరంగంలో  జరుగవలసిన  మార్పును  గురించి;  అదే  నిజమైన  మార్పు. ఆ  మార్పు  అనంతంగా  కొనసాగుతూనే  ఉంటుంది  ఇక  మార్పుకు  అవకాశం  లేని స్థితి కలిగే  వరకూ; అదే  మూలంలో  లయమైపోవడం  లేక  భగవంతునిలో  సంపూర్ణ  ఐక్యం  పొదడం  లేక  మనిషి  పరిపూర్ణత్వాన్ని  సాధించడం అంటే.  దీన్నే  అంతరంగా ప్రవర్తన అని  కూడా  అనవచ్చు. ఈ  సూక్ష్మ  శారీరాల్లో  పరివర్తన  కలగడానికి  మనం  ఆధ్యాత్మిక  సాధన  సహాయం  తీసుకుంటాం. ముఖ్యంగా  హార్ట్ఫుల్నెస్  వంటి  సమర్థవంతమైన సాధనను  ఆశ్రయిస్తాం.

మార్పు-పరివర్తన

మార్పు  అంటే  వస్తువులోని  అంశాల యొక్క అమరిక  మారుతూ  ఉండటం; మార్పు  అనేది  ప్రతీ క్షణమూ  జరుగుతూ  ఉండేది.  పరివర్తన  అంటే  పూర్వాశ్రమంలోని  ఏ  పోలికా  లేకుండా  పూర్తిగా మారిపోవడం.  మనం  ఇంతకు  పూర్వం  చెప్పినట్లుగా  పరివర్తన  అంటే,   పురుగు  సీతాకోకచిలుకగా  పరివర్తన  చెందడం;  బందిపోటుగా  ఉన్న  రత్నాకరుడు  వాల్మీకి  మహర్షిగా  పరివర్తన  చెందడం. పాశవికంగా  ఉండే  మానవుడు  మానవత్వం  గల  మానవుడుగానూ  మానవత్వం  గల  మానవుడు  దివ్యమానవుడిగా  పరివర్తన  చెందడమూ అన్నమాట.

శీలపరమైన  పరివర్తన

కేవలం  ఆధ్యాత్మిక  పరివర్తన  వస్తే  సరిపోదు,  అదే  అసలైన  మార్పు  అయినా  కూడా. దానికి  దీటుగా,  తగినట్లుగా,  అంతరంగ  మార్పుకు అనుగుణంగా  బాహ్యమైన  శీలమార్పులు  జరుగకపోయినట్లయితే  అంతరంగంలో  జరిగిన  ప్రవర్తన  నిరర్థకమైపోతుంది.  అందుకే  ఆధ్యాత్మిక  సాధన ద్వారా  సంభవిస్తున్న  అంతరంగ  మార్పులను  అప్రమత్తంగా  ఉంటూ  గమనిస్తూ,  దానికి  అనుగుణంగా  మన  ఆలోచనలను,  మన  చేతలను,  మన  అలవాట్లను,  మన  ప్రవర్తనను,  వెరసి  మన  శీలాన్ని  గనుక  మలచుకోకపోయినట్లయితే సూక్ష్మ శరీరాల్లో  సంభవించిన మార్పుల  ప్రయోజనం  సరిగ్గా  చేకూరదు.  ఈ  అంశం  కొంత  ఆశ్చర్యాన్ని  కలిగించవచ్చు.  కాని  కొంచెం  పరికించి  చూసినట్లయితే  అర్థమవుతుంది.  దీపంలో  ఉన్న  జ్యోతి  దేదీప్యమానంగా  వెలుగుతున్నా  కూడా  వెలుతురు  బయటకు  రాకపోవచ్చు.   దీపానికి  పట్టే  మస్సే దీనికి  కారణం. ఈ  మస్సి (అంటే  సౌశీల్యం  లేకపోవడమే)  పట్టకుండా  ఎప్పటికప్పుడు  చూసుకోకపోతే  లోపల  వెలుగు  ఎంత  గొప్పగా  ఉన్నా  అది  సరిగ్గా  బయటకు  రాదు.  అదే  విధంగా  లోపల  కలుగుతున్న  ఆధ్యాత్మిక  ప్రగతికి  అనుగుణంగా  ఎప్పటికప్పుడు  శీలాన్ని  తగినట్లుగా  సరిదిద్దుకోవడం,  మలచుకోవడం  చెయ్యవలసినది  సాధకుడి  బాధ్యత.  ఈ  విధంగా  ఆధ్యాత్మిక  వికాసం,  శీల వికాసం  రెండూ  చేదోడు-వాదోడుగా  ముందుకు  సాగుతూ  ఉండాలి.  అప్పుడే  మనిషిలో  సమగ్రమైన  పరివర్తన  రోజురోజుకూ  స్రైన  దిశలో  కొనసాగుతూ  సంతృప్తికరమైన  మనుగడను  సాగించడం  ప్రతీ  మనిషికి  సాధ్యపడుతుంది.  

సౌశీల్యంలో  కలుగవలసిన  మార్పులకు  కొన్ని  మార్గాలు

సౌశీల్యాన్ని  ఎప్పటికప్పుడు  సరిదిద్దుకోవడానికి  లేక  తగిన  విధంగా  మలచుకోడానికి  చేపట్టవలసిన  కొన్ని  మార్గాలు: 

  1. ఆదర్శ వ్యక్తిని  అనుసరించడం అంటే  విధేయతగా  ఉంటూ  గురువును    అనుకరించే/అనుసరించే  ప్రయత్నం.  వారి  అలవాట్లు,  వారి  ప్రవర్తనను, వారి  లక్షణాలను అనుసరించే  ప్రయత్నం
  2. స్వాధ్యాయం అంటే  సముచిత  గ్రంథాలను  చదవడం,  తనను  తాను  సూక్ష్మంగా  సమగ్రంగా  తెలుసుకునే  ప్రయత్నం  చెయ్యడం
  3.  ఎప్పటికప్పుడు  ఆత్మావలోకనం ద్వారా  తన  ఆలోచనలను,  చేతలను,  అలవాట్లను,  ప్రవర్తనను  గమనించుకుంటూ  సరిదిద్దుకునే  ప్రయత్నంలో  ఉండటం.
  4. ఇతరుల  సేవలో, గురువుల  సేవలో  కొంతైనా  సమయాన్ని  వెచ్చించడం. 

(సశేషం)

23, అక్టోబర్ 2021, శనివారం

మార్పు - పరివర్తన (భాగం 5)


మార్పు - పరివర్తన (భాగం 5)

 

మనం ఇంతకు  పూర్వం  చెప్పుకున్నట్లుగా,  మనిషి  మారడానికి  ఇష్టపడినా,  ఇష్టపడకపోయినా  కూడా  ప్రకృతిపరంగా  ఉండే  సహజ  పరిణామ క్రమంలో  మార్పులో  పరాకాష్ఠకు  చేరుకునే  వరకూ  సహజసిద్ధంగా  మార్పు  కొనసాగుతూనే ఉంటుంది.  అంటే  ప్రకృతిలోని  ఇతర  జీవరాసుల్లో  అప్రయత్నంగా  ఏ  విధంగా  పరిణామక్రమంలో  మార్పులు  వస్తున్నాయో  ఆ  విధంగా  మనుషుల్లో  కూడా  వస్తుంది.  కాని  ఈ  మార్పు  యొక్క  గతి  చాలా  మెల్లగా  ఉంటుంది.  అంటే ఉదాహరణకు  అమీబా  అనే  ఏకకణ  జీవి  మనిషిగా  పరిణామం  చెందాలంటే  కొన్ని  లక్షల  సంవత్సరాలు  పట్టవచ్చు.  అలాగే  మనిషి  తను  మారాలనుకున్న  స్థితికి  ఏ  ప్రయత్నమూ  లేకుండా  మారాలనుకుంటే  చాలా  సమయం  పట్టవచ్చు. మనిషి  ఒక్కడే,  ఈ  జీవి  ఒక్కటే  తనను  తాను  తెలుసుకోగలిగే  సమర్థత  ఉంది  కాబట్టి, మార్పు  ప్రయత్నం  ఉంటే  త్వరితంగా  జరిగే  అవకాశం  ఉంది;  అదీ  అత్యున్నతమైన  మార్పు ఒక్క  జన్మలోనే  సంభవించే  మహత్తర  అవకాశం  ఉంది.  లేకపోతే  సహజంగా  జరిగే  పరిణామ  క్రమంలో  ఎన్ని  జన్మమ్లు  పడుతుందో  చెప్పడానికి  లేదు.  కాబట్టి  ఈ  జన్మలోనే  మనిషి  కాలాన్ని  వ్యర్థం  చేయకుండా  అత్యున్నత  చైతన్య స్థితులకు  పరిణతి  చెందడం  చాలా  ముఖ్యము,  అవసరము  కూడా.  కాబట్టి  మనిషి  పుట్టిన  ప్రయోజనమే  పరిణతి  చెందడం. అదే  జన్మనెత్తిన  ప్రతీ  ఆత్మ  యొక్క  స్వధర్మం.  ప్రతీ  ఆత్మ  పరితపించేది  దీని  కోసమే.  ప్రతీ  ఆత్మలో  ఉన్న  వెలితి  ఇదే.  ఎంత  ధనము,  ఎంత  జ్ఞానం,  ఎన్ని  అధికారాలున్నా,  భూమ్మీద  ఎంత  శక్తివంతులుగా  చలామణి  అవుతున్నా  ప్రతీ  ఆత్మ లోలోతుల్లో  పడే  వ్యధ,  వేదన  దీని  కోసమే,  ఈ  పరిణతి  కోసమే.  కేవలం  ఆ  పరిణతి  మాత్రమే  ఆ  దాహాన్ని,  ఆ  తృష్ణను  తీర్చగలిగేది.  ఇటువంటి  దాహాన్ని,  ఇటువంటి  ఆధ్యాత్మిక  ఆకలిని,  ఆధ్యాత్మిక  తృష్ణను,  తీర్చేదే  ఆధ్యాత్మికత లేక  ధ్యానం.  అదెలాగో  ఇప్పుడు  చూద్దాం.  

ప్రతి  ఆత్మా  పరితపించే  ఈ  ఆధ్యాత్మిక  పరిణతిని  త్వరితంగా  సాధించగలిగేది  ఆధ్యాత్మికత  ద్వారానే లేక  ప్రయత్నపూర్వకంగా  చేసే ఈ  ధ్యానం  ద్వారానే. ప్రకృతి  కూడా  ఇదే  పరిణామ దిశలో  ప్రయాణిస్తున్నది  కాబట్టి,  మనిషి  ప్రయత్నపూర్వకంగా  చేసే  ఈ  ప్రయత్నంలో  ప్రకృతి  సహకారం  కూడా  తోడవడం      ప్రతీ  సాధకుడూ  గమనించడం  జరుగుతుంది.  ఎందుకంటే  ప్రకృతి  లక్ష్యం  కూడా అదే  కాబట్టి.  అందుకే  మహాత్ములందరూ  కూడా  ప్రకృతితో  శృతి  కలిగి  ఉండమంటారు;  ప్రకృతికి  విరుద్ధంగా  ఉండద్దంటారు.  అందుకే  మనం  ఎంపిక  చేసుకునే  ఆధ్యాత్మిక  ధ్యాన  సాధన  ప్రకృతితో  శృతిలో  ఉండె  విధంగా జాగ్రత్త  పడాలి. 

ఇప్పుడు మనం  మనిషిలో  రావలసిన  మార్పును  గురించి,  కోరుకోవలసిన  మార్పులను  గురించి,  ఆ  మార్పు  జరగవలసినది  ఎక్కడో,  ఏ  విధంగానో,  తెలుసుకునే  ప్రయత్నం  చేద్దాం. 

మనిషిలో  మూడు  శరీరాలుంటాయని  మనకు  ఇప్పటికే  తెలుసు -  స్థూల,  సూక్ష్మ,  కారణ  శరీరాలు.  ఇందులో  స్థూల  శరీరంలో  జరిగే  మార్పులు  ప్రకృతి  చూసుకుంటుంది,  మనం  ఆ  భౌతిక  శరీరాన్ని పోషించడం  తప్ప  పెద్దగా  చేసేదేమీ  ఉండదు. ఇక  కారణ  శరీరం, అంటే  యేది  లేకపోతే  మిగిలిన రెండు  శరీరాలూ  ఉండవో, దాన్నే  ఆత్మ  అంటాం;  అది  మార్పు  లేనిది,  అందులో  మార్వలసినదేదీ  లేదు;  ఆత్మ  పవిత్రమైనది,  శుద్ధమైనది, కాబట్టి  ఆత్మలో  లేక  కారణ  శరీరంలో  మారేదీ  లేదు.  

ఇక  మిగిలినది  ఈ  రెండు  శరీరాల  మధ్య  ఉన్న  సూక్ష్మ  శరీరం.  సూక్ష్మ శరీరాలు  మొత్తం  పదిహేనో, పదహారో  ఉన్నా  మన  శాస్త్రాల  ప్రకారం,  ప్రధానంగా  నాలుగున్నాయి -  మనసు,  బుద్ధి,  అహంకారం,  చిత్తం. కాబట్టి  మార్పు  రావలసినది  వీటిల్లో.  ఇక్కడ ముఖ్యంగా  మనసు,  బుద్ధి,  అహంకారం  మారుతూ  ఉన్న  కొద్దీ  మన  చిత్తం  లేక  చైతన్యం మారుతూ  ఉంటుంది. చైతన్యం  మారడమే  మనిషి  మారడం అంటే. మన  చైతన్యం  ఎలా  ఉంటే  మన  జీవితం  అలా  ఉంటుంది. తరచి  చూస్తే  మనిషి  జీవితం  ఈ  మనసు,  బుద్ధి  అహంకారాల  చుట్టూనే  తిరుగుతూ  ఉంటుంది.  వీటి  నాణ్యతను  బట్టే  మన  జీవితం  యొక్క  నాణ్యత కూడా ఉంటుంది.  కాబట్టి  మనిషి  మారాలంటే  చైతన్యం  మారాలి.  అంటే  ఈ  సూక్ష్మ  శరీరాలు మారాలి.  ఇవి  కనిపించని  వస్తువులు.  కనిపించని వాటిని  మార్చడం  ఎలా?  ఎలాగైతే  వ్యాయామం,  యోగాసనాలు,  ప్రాణాయామాలు  వంటివి  చేస్తే  భౌతిక  శరీరానికి  ఏ  విధంగా  ఆరోగ్యం  చేకూరుతుందో, అదే  విధంగా  ధ్యానం  చేసినప్పుడు,  ముఖ్యంగా  ఈ  హార్ట్ఫుల్నెస్  ధ్యాన  సాధన  చేసినప్పుడు  ఈ  సూక్ష్మశరీరాలకు  ఆరోగ్యం  చేకూరడం  జరుగుతుంది;  సూక్ష్మ  శరీరాల  శుద్ధి  జరుగుతుంది,  తద్వారా  చైతన్యంలో  మార్పులు  సహజంగా  అప్రయత్నంగా  వస్తాయి,  ఆలోచనల్లోనూ,  చేతల్లోనూ,  ప్రవర్తనలోనూ, వ్యక్తిత్వంలోనూ,  శీలంలోనూ సహజమైన  మార్పులు  సంభవిస్తాయి;  జీవితం నడవవలసిన  సరైన పరిణామ  దిశలో  నడుస్తుంది. (సశేషం) 

22, అక్టోబర్ 2021, శుక్రవారం

మార్పు - పరివర్తన (భాగం 4)


మార్పు - పరివర్తన (భాగం 4)

 మనం  ఈ  రోజున  మరి కొన్ని  ప్రశ్నలను  అర్థం  చేసుకునే  ప్రయత్నం  చేద్దాం. 

మన  చేతుల్లో  ఎంత  వరకూ  ఉంది?  మన  చేతుల్లో  లేనిదేమిటి? 

గతం  గతః అంటారు.  గతించినది మన చేతుల్లో  లేదు. కాబట్టి  మార్చలేము.  భవిష్యత్తు  ఇంకా  రాలేదు.  వర్తమానం  మన గతాన్ని  బట్టే  ఉంది  కాబట్టి  వర్తమానాన్ని  బట్టే  మన  భవిష్యత్తు  ఉండబోతోంది. కాబట్టి  మన  చేతుల్లో ఉన్నది  వర్తమానం, ఇక్కడే-ఇప్పుడే,  ఏమి  చెయ్యాలన్నా.  ఇక్కడ-ఇప్పుడు  మనం  చెయ్యవలసినది  చెయ్యకపోతే గతం  యొక్క  ప్రభావాన్నే  అనుభవిస్తూండటం  కొనసాగుతూ  ఉంటుంది.  Past is a history, Future is a mystery, Today is a Gift, that is why it is called Present. అంటారు  ఇంగ్లీషులో.  గతం  చరిత్ర అయిపోయింది; భవిష్యత్తు  చెప్పలేనిది; ఈ  రోజు మనకున్న  కానుక;  అందుకే  దీన్ని  ఇంగ్లీషులో  ప్రెజెంట్  అంటారు.  గతం  ఇక మన  చేతుల్లో  లేదు; వెనక్కి  వెళ్ళి  సరిదిద్దుకోలేము; గతం  నుండి  కేవలం  పాఠాలు  నేర్చుకోగలం  మళ్ళీ చేసిన  పొరపాట్లు  చెయ్యకుండా  పాఠాలు  మాత్రమే  నేర్చుకోగలం. 

మన కర్మ  ప్రభావం  ఏమైనా  ఉంటుందా? విధివ్రాత ఎలా  ఉంటే  అలా  జరుగుతుందంటారు, మరి మన  విధిని  మనం మార్చుకోగలమా? 

మన  విధి అంటే  మనం  గతంలో  చేసుకున్న  కర్మే. అదే  మన  ప్రస్తుతాన్ని  శాసించేది  స్థూల  స్థాయి  నుండి సూక్ష్మస్థాయిల  వరకూ శాసిస్తూనే  ఉంటుంది. దాన్నే  కర్మ  సిద్ధాంతం  లేక  ఇంగ్లీషులో  కార్మిక్  లా  అని అంటారు.  ఇది  తిరుగులేని  సిద్ధాంతం. దీన్ని  ఎవ్వరూ  తప్పించుకోలేరు, దేవతలు, మహాపురుషులు,  అవతార పురుషులూ  కూడా  దీనికి  అతీతులు  కారు. వ్యక్తిగత కర్మ,  ఉమ్మడి  కర్మను  బట్టి  కూడా  మన  జీవితాలు  ప్రభావితమవుతూ  ఉంటాయి. 

అయితే  మానవుడిలో  సంకల్ప శక్తి (free will) కూడా  ఉంది. మన విధి అంటే  కర్మ-సంకల్పశక్తుల కలయిక. కాబట్టి  కర్మకు  సంబంధించినంతవరకూ  అనుభవించక  తప్పదు. అందుకే  విధి  ఎలా  ఉంటే  అలాగే  జరుగుతుందంటారు. అలాగే  సంకల్పబలం  ద్వారా ప్రస్తుతాన్ని  సరిదిద్దుకోవచ్చు;  కర్మలను చెఱిపేసుకోవచ్చు,  కొత్తవి  ఏర్పడకుండా  చూసుకోవచ్చు.  ఆ  విధంగా  మన  విధిని  మనమే  నిర్మాణం  చేసుకోవచ్చు. ఈ  సందర్భంలో  పూజ్య  చారీజీ  నాకు  వ్రాసిన  ఒక లేఖలో  విధిని  గురించి  ప్రశ్నించగా  వ్రాసిన  సమాధానంగా వ్రాసినది  ఈ  అవగాహనలో  వెలుగునిస్తుందని  భావిస్తున్నాను: విధి  లేక  విధివ్రాత  అనేది  తమ విధిని  మార్చుకోవడానికి  ఏ  ప్రయత్నమూ  చేయనివారికి  మాత్రమే  వర్తిస్తుంది.  ఈ  వాక్యం  నుండి  మనం  అనేక  విషయాలను  అర్థం  చేసుకోవచ్చు.  దయచేసి  ఆలోచించండి.  

అయితే  మన శాస్త్రాల్లో  కర్మను  మూడు  రకాలుగా  వర్ణిస్తారు: 1) ప్రారబ్ధ కర్మ 2) సంచిత  కర్మ 3) ఆగామి  కర్మ. ఈ  మూడూ  తేలికగా  గుర్తుంచుకోవాలంటే  వదిలేసిన  బాణం (ప్రారబ్ధం) , చేతిలో  ఉన్న  బాణం (సంచితం), అమ్ములపొదిలో  ఉన్న  బాణాలు (ఆగామి) ఇలా  గుర్తు  పెట్టుకోవచ్చు.  1) ప్రారబ్ధ  కర్మ  అంటే  వదిలేసిన బాణం,  తిరిగి  రాదు,  ఏమీ  చెయ్యలేము; దాని  పర్యవసానం  అనుభవించవలసినదే. 2) సంచిత  కర్మ అంటే  చేతిలో  ఉన్న  బాణం  ఇంకా  వెయ్యలేదు కాబట్టి  మన  నియంత్రణలోనే  ఉన్న  కర్మ  అన్నమాట. 3) ఆగామి కర్మ  అంటే  అమ్ములపొదిలోని  బాణాలు  ఇంకా  వెయ్యవలసిన  బాణాలు  లేక  అనుభవించవలసిన  కర్మలు. సారాంశం  ఏమిటంటే  ప్రారబ్ధాన్ని  అనుభవిస్తూ  సంచిత  ఆగామి  కర్మలను  నాశనం  చేసుకొమ్మని  ఆధ్యాత్మికత  చెబుతూ  ఉన్నది. ఇదెలాగ  అనేది  ఈ  వ్యాసంలో  రానున్న భాగాల్లో తెలుసుకుందాం.

ఇక  మనిషిలో  కలుగవలసిన  మార్పును  గురించి,  కర్మను  తొలగించుకోవడం ఎలాగో,  వ్యక్తిత్వంలో  లేక  శీలంలోని  మార్పులు  ఎలాగో, అసలు మనిషిలో  మారవలసినదేమిటో,  వ్యక్తిగ్తంగా  మారవలసిన అవసరం,  ఉమ్మడిగా  మారవలసిన  అవసరం మొదలగు  విషయాలను  గురించి  రానున్న  భాగాల్లో  తెలుసుకునే  ప్రయత్నం  చేద్దాం.  







21, అక్టోబర్ 2021, గురువారం

మార్పు - పరివర్తన (భాగం 3)

మార్పు - పరివర్తన (భాగం 3)

 అందుకే  మనిషి  మారాలనుకుంటేనే  గాని మారడం  జరగదు.  మనకి  మారాలనుంది,  అని అనుకుందాం.    

ఈ  మార్పు   ఎక్కడినుండి  మొదలవుతుంది?  మనం  చెయ్యాల్సింది  ఏమైనా ఉందా?  

లేక తనంతతానుగా  జరిగిపోతుందా? అసలు  మనలో  మారవలసినదేది? 

ఈ  మార్పు  అలా  ఎంతకాలం  కొనసాగుతూ  ఉంటుంది లేక  కొనసాగుతూ  ఉండాలి?  

మన  చేతుల్లో  ఎంత  వరకూ  ఉంది?  మన  చేతుల్లో  లేనిదేమిటి? 

మన కర్మ  ప్రభావం  ఏమైనా  ఉంటుందా? విధివ్రాత ఎలా  ఉంటే  అలా  జరుగుతుందంటారు, మరి  విధిని  మార్చుకోగలమా? 

ఈ  మార్పు  ఎక్కడ  ఆగిపోతుంది?  

మార్పుకు,  పరివర్తనకు  ఏమైనా  తేడా  ఉందా? రెండూ  ఒక్కటేనా?  ఇటువంటి  ప్రశ్నలు  నాలాంటివాళ్ళకు  మనలో  కొంతమందికి  కలుగుతూ  ఉండవచ్చు. వీటికి  సమాధానాలు  కనుగొనే  ప్రయత్నం  చేద్దాం.  

మనం  తెలుసుకోవాలనుకుంటున్నది  పైపైన  జరిగే  మార్పు  కాదు,  సమగ్రమైన  మార్పు గురించి  అని  మనం  మరచిపోకూడదు.  పైపైన  కలిగే  మార్పులు, లేక  తెచ్చిపెట్టుకున్న  మార్పులు  తాత్కాలికమైనవి, ఎక్కువ సేపు  నిలబడవు.  ఇంగ్లీషులో  వీటిని  కాస్మెటిక్ ఛేంజె స్ అంటారు.  మన లక్ష్యం  శాశ్వతమైన  మార్పు, దీనిన్నే  మనం  పరివర్తన  అంటాం.  మార్పు  పరివర్తనకు  దారితీయాలి.  స్పష్టంగా  అర్థం  అవ్వాలంటే  పరివర్తన  అంటే  గొంగళి  పురుగు  సీతాకోకచిలుకగా  మారడం, రత్నాకరుడు  అనే  బందిపోటు  వాల్మీకి  మహర్షిగా  మారడం, పశువులా ఉండే  మనిషి,  మానవత్వం  గల  మనిషిగా మార్డం,  ఆ  మనిషి  దైవంగా  మారడం. ఇటువంటి  పరివర్తన  జరగాలంటే  ప్రతినిత్యం  అనేక  దశల్లో  మార్పులు  జరుగుతూనే  ఉండాలి.  సంపూర్ణ  పరివర్తన  కలిగే  వరకూ  ఈ  మార్పులు  సంభవిస్తూనే  ఉంటాయి. దాని  కోసం  మన  వంతు  కృషిని  కొనసాగిస్తూనే  ఉండాలి.  దాన్నే  మనం  సాధన,  తపస్సు  అని  అంటాం. 

ఈ  మార్పు   ఎక్కడినుండి  మొదలవుతుంది? మనం  కోరుకునే  మార్పు  అది  సమాజంలో గాని,  కుటుంబంలో  గాని  మరెక్కడైనా గాని  మొదలవ్వాల్సినది  మనలోనే. ప్రకృతిలో  మారినదేమీ  లేదు, మారేదేదీ లేదు,  అవే  వృక్షాలు,  అదే  గాలి,  అదే  ఆకాశం,  అదే  అగ్ని, అవే  నీళ్ళు. వాటిల్ని  కూడా  మనం  పాడు  చేశాం  తప్ప  ప్రకృతి ఇప్పటికీ  బహుశా  సృష్టి  మొదలైనప్పటి  నుండీ  అలాగే  ఉంది.  మార్పు  రావలసినది  మనిషిలోనే,  కాబట్టి  మార్పు  మనతోనే  ప్రారంభమవ్వాలి. ఇందులో  రెండో  ఆలోచన  లేదు.  

మనం  చెయ్యాల్సింది  ఏమైనా ఉందా?  లేక తనంతతానుగా  జరిగిపోతుందా? సృష్టి  మారుతూ  ఉంది  కాబట్టి,  మనం  కూడా  సృష్టిలో  అవిభాజ్య  భాగాలమే గనుక,    అదే  గతిలో  మనలో  కూడా  మార్పు  అన్ని  స్థాయిల్లోనూ  జరుగుతూ  ఉంటుంది.  మనం  ఏమీ  చెయ్యకపో యినా  కూడా  తనంతతానుగా  జరుగుతూనే  ఉంటుంది. కాని  అదృష్టవశాన  ఈ  మార్పు  సంభవించే  గతిని  పెంచేటువంటి  అవకాశం  మనిషికి  ఉంది.  మనిషిలో  ఉన్న  చతన్యం  అటువంటి  వికసించిన  దశలో  ఉండటం  వల్ల  మానవుడికి  మాత్రమే  ఆ  అవకాశం  ఉంది.  దీనిని  మనం  ఆధ్యాత్మిక  సాధన  ద్వారా, తపస్సు  ద్వారా  ఈ  అవకాశాన్ని  వినియోగించుకోవడం  జరుగుతుంది.  ఆధ్యాత్మిక  సాధన  సహజంగా  ప్రకృతికి  అనుకూలంగా  ఉండటం  వల్ల మానవ  ప్రయత్నానికి  ప్రకృతి  కూడా  సహకరించడం  ప్రారంభిస్తుంది.  ఈ  కారణం  వల్ల  ఆధ్యాత్మిక  సాధన  మనిషిలో  వికాసాన్ని  తీవ్రతరం  చేస్తుంది,  మనిషి  యాత్ర  అత్యున్నత  పరిణామ  దిశలో  వేగంగా  ప్రయాణించే అవకాశం  ఉంది  అది  మనిషి  తన  అనుభవంలో  అనుభూతి  చెందడం  కూడా  జరుగుతుంది.  కాబట్టి  మనం  చెయ్యవలసినదే  ఎక్కువగా  ఉంది  మనం  వికాసంలో.  ఈ  జనన-మరణ  చక్రం  కూడా మనిషికి  తన  వికాసానికి  ప్రకృతి  అందించే  అవకాశాలు  మాత్రమే. అవి  శిక్షలు  కాదు.  జనన-మరణాల మీద  సంపూర్ణంగా  పట్టు  వచ్చే  వరకూ  అవి  తప్పవు.  మార్పు-పరివర్తన ప్రయాణ దిశలో  భాగమే  ఈ  జన-మరణాలు. అందుకే  మనిషి  తన  ప్రయత్నాన్ని  తీవ్రతరం  చేసుకోవలసిన  అవసరం,  వీటి నుండి  బయట  పడి  యాత్రను  కొనసాగించాలంటే.  

ఈ  మార్పు  అలా  ఎంతకాలం  కొనసాగుతూ  ఉంటుంది లేక  కొనసాగుతూ  ఉండాలి? 

ఈ  మార్పు  లేదా  ఈ  వికాసం  జీవుడు  అత్యున్నత  పరిణామ  శిఖరాన్ని  చేరుకొనే  వరకూ  కొనసాగుతూనే  ఉంటుంది,  అనంతంగా. ఈ  మార్పులు  మనలో  అన్ని  స్థాయిల్లోనూ  సహజంగా  సంభవిస్తున్నప్పుడు  మనిషి  మరింత మరింత  పరిశుద్ధంగా  (refinement) మారుతూ  ఉంటాడు.  ఈ  సుద్ధత్వానికి  అంతు  అంటూ  లేదు.  ఇది  అనంత  యాత్ర.  దానితో  మనం  జీవిత6లో సరైన  దశలో  ప్రయాణిస్తున్నామన్న  ఆత్మవిశ్వాసం  కూడా  రోజురోజుకూ  పెరుగుతూ  ఉంటుంది.  ఇది  మనం  ప్రతినిత్యమూ  చూడగలిగేటువంటి  పరిణామం. (సశేషం)   

20, అక్టోబర్ 2021, బుధవారం

మార్పు - పరివర్తన (భాగం 2)


మార్పు - పరివర్తన (భాగం 2)

సృష్టి  ఆవిర్భవించిన క్షణం నుండీ  మారుతూనే  ఉంది, విస్తరిస్తూనే  ఉంది - స్థూలంగానూ  మార్పులు  సంభవిస్తున్నాయి,  సూక్ష్మంగానూ  సంభవిస్తున్నాయి. ఒక  ప్రవాహంలా  కొనసాగుతూ  ఉంటుంది సృష్టి.  నదిలో  ఒకే రకమైన  నీళ్ళల్లో  మనం  కాళ్ళు  కడుగుకోలేమంటారు, ఎందుకంటే  నదిలో  నీరు  ప్రవహిస్తూ  ఉండటం వల్ల  నీరు  మారిపోతూనే  ఉంటుంది. అలాగే  ఈ  శరీరం  క్షణభంగురం  అంటారు:  ఇందులోని  కణాల్లో  ప్రతీక్షణం  మారిపోతూ  ఉంటాయి, ఎన్నో  కణాలు చనిపోతూ  ఉంటాయి,  ఎన్నో  కొత్త  కణాలు  పుఫుతూ  ఉంటాయి.  మనకు పుట్టినప్పుడున్న  శరీరానికి  ప్రస్తుత శరీరానికీ  పోలికే  లేదు. ఇది మనుషులకే  గాక  సమస్త చరాచర  వస్తువులన్నిటికీ  వర్తిస్తుంది.  ఇవి  ప్రకృతిలో  స్వతఃసిద్ధంగా  జరుగుతూ  ఉండే  మార్పులు; అటువంటి  మార్పుల వల్లే  ప్రపంచంలో  బహుశా  జీవం  ఉంది,  అందం  ఉంది,  ఉత్సాహం  ఉంది. ఇటువంటి  మార్పుల  వల్లే  అన్నీతా  వికాసం కనిపిస్తూ  ఉంటుంది. కాబట్టి  మార్పు, అనివార్యము,  శాశ్వతము.  అది  ఆగిపోయినప్పుడు  బహుశః  ఇక సృష్టి  ఉండదేమో.  బహుశా  మార్పులేని లేక  మార్పురహితమైన  స్థితికి  చేరుకొనే  వరకూ  ఈ  మార్పులు  ఈ  విధంగా  కొనసాగుతూనే  ఉంటుంది. 

ఇక మనం  మనుషుల్లో  కలిగే  మార్పుల  విషయానికొచ్చేద్దాం. పైన  ప్రస్తావించినవన్నీ  స్వతఃసిద్ధంగా, స్వాభావికంగా,  అప్రయత్నంగా,  తనంతతానుగా,  ఏ  సంకల్పం  లేకుండా, లేక  ప్రకృతి సంకల్పం  మేరకు  జరుగుతూ  ఉండే  మార్పులు.  వాటిల్లో  మనిషి  ప్రమేయం  లేదు, ఎందుకంటే  తాను  కూడా  ప్రకృతిలోని  భాగమే  కాబట్టి,  ప్రకృతిలో  జరిగేవన్నీ  కూడా  మనిషికి  కూడా  వర్తిస్తాయి. కాని  మనం  మాట్లాడుకునే  మనిషిలో  కలిగే/కలుగవలసిన మార్పు ఏమిటి? 

యావత్ ప్రపంచం అంతా  కూడా  ఆకాశంతో ఎలా  నిండి  ఉందో, అలాసృష్టి  సంస్తం  కూడా  చైతన్యంతో నిండి  ఉంది. అంతటా  వ్యాపించి  ఉంది. ఈ చైతన్యం  అంటే  ఏమిటి?  చైతన్యం  అంటే  స్పృహ,  ఎరుక,  జ్ఞానము,  మనిషి  ఏదైనా  తెలుసుకోగలుగుతున్నాడూ  అంటే  అది  దీని  వల్లే. ఈ  చైతన్యం  సమస్త  చరాచర  అంటే  కదిలేవి,  కదిలనివి  అన్న్టిల్లోనూ  అణువణువునా  వ్యాపించి  ఉంది.  అయితే  కదలని  వస్తువుల్లో  అంటే  రాళ్ళల్లోనూ, ఖనిజాల్లోనూ ఇటువంటి  వస్తువుల్లో  నిద్రాణమై  ఉంది. వృక్ష  ప్రపంచంలో  ఈ  చైతన్యం  కాస్త  మేల్కొన్న  స్థితిలో  ఉంది;  ఇక  జంతు  ప్రపంచంలో  మరికాస్త  మేల్కొన్న  స్థితిలో  ఉంటుంది; మనిషిలో  సంపూర్ణంగా  మేల్కొన్న  స్థితిలో  ఉంది  వీటితో  పోలిస్తే. ఈ  మేల్కొని  ఉండటం  అంటే  ఏమిటి  వికసించి  ఉండటం.  మానవేతర  వస్తువుల్లో  ఉన్న  చైతన్యం తమ  ఉనికిని  కాపాడుకునేంత మేరకు  మాత్రమే  వికసించి  ఉంటుంది.  సృష్టిలో  జరిగే  పరిణామ  ప్రక్రియకు  కారణం  ఈ  చైతన్యం. వృక్షప్రపంచంలోనూ,  జంతుప్రపంచంలోనూ   తమను  తాము  తెలుసుకునేంతగా  ఈ  చైతన్య వికాసం  జరగలేదు. మనిషిలో  మాత్రమే  తనను  తాను  సంపూర్ణంగా  తెలుసుకొనే  అవకాశం  ఉంది. 

ఈ  చైతన్య  వికాసాన్ని  బట్టే  పరిణామ  ప్రక్రియ  జరుగుతుందని  అనుకున్నాం.  ఆ  విధంంగా  అర్థం  చేసుకున్నప్పుడు  మనకు  శాస్త్రాల్లో  చెప్పిన  ఈ  వాక్యం  అర్థంవుతుంది - " ఆత్మ  84  లక్షల  యోనుల్లో  నుండి  ప్రవేశించిన  తరువాత  గాని  మానవ జన్మ  సంభవించదు"  అంటుంది  శాస్త్రం. అంటే  ఈ  చైతన్య  వికాసం జరిగి  మానవస్థాయికి  చేరుకోవడానికి  ఈ  పరిణామ  క్రమంలో  84  లక్షల  జీవరాసుల్లో  నుండి  ప్రవేశించాలి. అంటే  అమీబా  వంటి  ఏకకణ  జీవి  నుండి  మనిషి  వరకూ  మన  శాస్త్రాల  ప్రకారం  సుమారు 84 లక్షల  రకాల జీవరాసులున్నాయి. ఈ  విషయం  గనుక మనం  అంగీకరించగలిగితే,  కేవలం  మనిషిగా  జన్మించడంతోనే చాలా  పెద్ద  ప్రయాణం  పూర్తి చేసేశాం  అని  అర్థం, ఈ  వికాసపథంలో,  ఈ  పరిణామక్రమంలో. ఎంత  కాలం  పట్టిందో కదా!! లెఖ్క  కూడా  వేయలేము.  అందుకే  మానవ  జన్మ  చాలా  ఉత్కృష్టమైనది.  చాలా  ఉన్నతమైనది  అని  అంటారు. డార్విన్  పరిణామ  సిద్ధాంతం  కూడా  ఇక్కడితో  ఆగిపోతుంది.  కాని  మానవ  జన్మ  తరువాత  వికాసం ఉండదా?  వికాసపథం  పరిసమాప్తమైపోతుందా? మానవలోకం తరువాత ఇక  లోకాల్లేవా?  మానవ  లోకానికి  అడుగున జంతులోకం,  వృక్షలోకం,  ఖనిజలోకం  ఉన్నట్లుగా  మానవ లోకానికి  పైన  లోకాలేవీ  లేవా?  ఇక  వికాసం  ఉండదా?  అంటే  అది  వికాసపథానికే విరుద్ధం;  పరిణామ ప్రక్రియకే  విరుద్ధం;  అది  ప్రకృతికే  విరుద్ధం.  

ఇక్కడ  పరమపూజ్య చారీజీ (పార్థసారథి  రాజగోపాలాచారి, హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలోని గురుపరంపరలో  మూడవ  గురువర్యులు) ఈ  సందర్భంలో  పలికిన  వాక్కులు  మనకు  చక్కటి వెలుగునిస్తాయి. మనిషి  జన్మ  వచ్చే  వరకూ జరిగే ఈ వికాస యాత్రలో  ఆత్మ  ప్రమేయం  లేకుండా,  ఏ  ప్రయత్నమూ  లేకుండా,  తనంతతానుగా సాగుతుంది  ఈ  ప్రయాణం.  మనిషి  వరకూ  చేసిన  యాత్రం  ఎంతుందో  అంతకంటే  ఊహకందనంత యాత్ర  మానవ  జన్మ  తరువాత  కూడా  ఉంది. వీటినే  ఊర్ధ్వలోకాలు  అని  అంటారు.  కాబట్టి  మానవజన్మతో  ఈ  యాత్ర  ఆగిపోదు. మానవ  జన్మ  వరకూ  ఆత్మ  వివిధ  రకాల  శరీరాలు  ధరించినట్లే,  బహుశా  ఊర్ధ్వలోకాల్లో  ధరించే  శరీరాలు  వేరుగా  ఉండవచ్చునేమో!  అంటే  వికాసానికి  అంతులేదన్నమాట;  పరిణామానికి  అంతు  లేదన్నమాట. అందుకే  మన  గురువులు మానవజన్మ  ప్రయోజనం  ఆధ్యాత్మిక  పరిణామం  అనే  చెప్తారు;  మనిషి  జన్మనెత్తినది  వికాసం  కోసమే. ఆధ్యాత్మిక  పరిణతి  కోసమే.  అయితే  పూజ్య  చారీజీ  మరొక  విషయాన్ని  కుడా స్పష్టం  చేస్తారు.  ఈ  వికాసం  మానవ  జన్మ  సంభవించే అంతవరకూ  అప్రయత్నంగా  జరిగిపోయినా,  ఇక  నుండి  చెయ్యవలసిన  ప్రయాణం  మాత్రం  అంటే  మనిషి  జన్మ  తరువాత  మాత్రం  ఆ  జీవుడికి  ఇష్టమైతేనే  యాత్ర ముందుకు  కొనసాగుతుంది,  లేదా  జరుగదు.  ప్రకృతికి  ఇకపై  జరిగే  యాత్రకు  ఇష్టపూర్వకంగా,  సంసిద్ధులుగా  ఉన్నవారికి  మాత్రమే  తెరిచి  ఉంటుంది ఈ  ఊర్ధ్వలోకాల  వికాస  యాత్ర.  అందుకే  ఈ  హార్ట్ఫుల్నెస్  ఆధ్యాత్మిక  ధ్యాన  పద్ధతిని  అందించిన  వ్యవస్థపక  గురువులు  సమర్థగురు  బాబూజీ  మహారాజ్,  ఈ  సాధన  ప్రారంభించాలంటే  కావలసిన  అర్హత  మీ సంసిద్ధత  మాత్రమేనంటారు.  (సశేషం) 



19, అక్టోబర్ 2021, మంగళవారం

మార్పు - పరివర్తన (భాగం 1)

మార్పు - పరివర్తన (భాగం 1)

 

ఎందుకో గాని  ప్రతి  మనిషిలోని   అంతరాత్మ,  మార్పును  కోరుకుంటూ  ఉంటుంది;  తన చుట్తూ  ఉన్నవన్నీ  మారాలని,  పరిస్థితులు  మారాలని,  తన కుటుంబ  సభ్యులు  మారాలని,  జనం  మారాలని,  ప్రభుత్వం  మారాలని,  తన తోటి  ఉద్యోగులు  మారాలని, సమాజం  మారాలని,  వెరసి  మనుషులందరూ  మారాలని  కోరుకుంటూ  ఉంటాడు. ఆ  మార్పు  అనేదేమిటో  ప్రత్యేకంగా  చెప్పలేకపోయినా  కూడా. ఈ  ధోరణి  చూస్తే  'మార్పు'  అంటే  ఏదైనా సరే  కొంచెం  మెరుగు  పడటం  అని  అర్థం  చేసుకోవచ్చు.  ఆ  విధంగా  ఏదైనా  మెరుగుపడినప్పుడు  ఆత్మకు  కొంత  సుఖం కలుగుతూ  ఉంటుంది.  అదే  సమ్యంలో  మరింత  మార్పు జరగాలని  కూడా  తపిస్తూ  ఉంటుంది  ఈ  ఆత్మ.  

విచిత్రం  ఏమిటంటే,  ఆత్మ తాను  కూడా  మారాలన్న  విషయాన్ని  ఎందుకో  మరచిపోతుంది.  ఎపూడూ  చుట్టూ  ఉన్నవి  మారాలనే  కోరుకుంటుంది;  అది జరగనప్పుడు  నిరాశానిస్పృహలతో  కొనసాగుతూ  ఉంటుందే  తప్ప  తాను  మారాలన్న  విషయం  తనకు  స్పృహలోకి  రాదు.  ఇందులో  సృష్టి  రహస్యం  ఏమిటో  అనిపిస్తుంది. 

చాలా  మంది  మహానుభావులు,  మహనీయులు,  మహాత్ములు  అందరూ  కూడా  మనిషిలో  మార్పు  తనతోనే  ప్రారంభమవ్వాలి  అని  చెప్పారు;  వాళ్ళు  తమ  జీవితాల్లో  ఆవిష్కరించుకున్నదే  తమ  జీవన  విధానాల  ద్వారా  మానవాళికి  తెలియజేశారు,  తెలియజేస్తున్నారు, ఇప్పటికీ. 

కాబట్టి  మార్పు  అంటే  అది  ఏమైనప్పటికీ  ఎప్పుడు  వ్యక్తిలో  సంభవించే  అవకాశం  ఉంటుందీ  అంటే,  ఆ  కోరుకుంటున్న మార్పు  ఆ  వ్యక్తి  తనలోనే  మొదలవ్వాలనుకున్నప్పుడే జరుగుతుంది.  లేకపోతే  తనలోనూ  మార్పు  ఉండదు,  చుట్టూ  ఉన్న  ప్రపంచంలో  జరిగే  మార్పు  కూడా  కనిపించదు. ఇది మొదటి  సూత్రం. 

ఈ  సరళమైన  హార్ట్ఫుల్నెస్  ఆధ్యాత్మిక  పద్ధతిని  అవలంబించడం  ప్రారంభించాక,   మార్పును  గురించిన  సమగ్ర  అవగాహన  కొంచెం-కొంచెంగా  ఏర్పడటమే  గాక  గొప్ప ఆత్మ  సంతృప్తి  కలుగుతోంది.  ఆత్మసంతృప్తి  కలగడమే  మనం  సరైన  మార్గంలో  ముందుకు  సాగుతున్నామన్న  ఆత్మ-విశ్వాసాన్ని  కలిగించేది.  మనస్సాక్షి  ఎంతో  సంతృప్తికరంగా  ఉండటం  అనుభూతి  చెందుతాం.  దానికంటే  గొప్ప  సుఖం  మనిషికి  అందుబాటులో  యేదీ  లేదనిపిస్తుంది.  మిగిలిన  సుఖాలన్నీ  ఎన్ని  ఉన్నా  ఇది  లేకపోయినట్లయితే  మనిషికి  అసలు  సుఖం  లేనట్లే.  

ఎందుకూ  అంటే  ఈ  సాధనను  కొనసాగిస్తున్నకొద్దీ,  ప్రతినిత్యం  అనుష్ఠానం  చేస్తూ  మనలో  వచ్చే  మార్పులు  గమనిస్తూ  ఉంటే  కలిగే  ఆత్మవిశ్వాసం గాని,  గొప్ప  సంతుష్ఠి  గాని, అంతరంగంలో  యేదో  తెలియని  బలం  వృద్ధి  అవుతూఁడటం  గాని, మనలో  తెలియకుండా,  అప్రయత్నంగా,  మన  అలవాట్లలో,  మనం  స్పందించే  విధానాల్లో  గాని,  మన  అవగాహనలో గాని  సహజంగా  మార్పులు  జరుగుతూండటం  చూస్తే,  ఇదే  సరైన  జీవన  విధానం,  ఇదే  మనస్సాక్షిని  అనుసరించి  జీవించవలసిన  మార్గం  అని  మనకు  రూఢీగా  అర్థమైపోతుంది.  మంస్సాక్షిని  అనుసరించే  ధైర్యాన్ని  కోల్పోయిన  మనం నెమ్మదిగా  మన  మనస్సాక్షిని  అనుసరించే  ధైర్యం  రోజురోజుకీ  పెరుగుతూ  ఉంటుంది.  మానసిక  ప్రశాంతత  పెరుగుతూ  ఉంటుంది;  ఇంతకు  ముందెన్నడూ  లేనటువంటి  అలౌకిక  అంతరంగ  సుఖాన్ని  అనుభవించడం  జరుగుతూ ఉంది.  జీవితంలో  ఎదురయ్యే కష్టాలను  చూసి  బెంబేలెత్తిపోకుండా  ధైర్యంగా  ఎదుర్కొని  పరిష్కరించుకునే  పరిస్థితి  ఏర్పడుతూ  ఉన్నది.  భవసాగరం  ఈదడం  రోజురోజుకూ  తేలికైపోతున్నది.  అర్థవంతంగా  జీవితాన్ని  కొనసాగిస్తున్నామన్న  తృప్తి  కలుగుతూ  ఉన్నది.  మనసు  రోజురోజుకూ  తేలికైపోతుంది; 24 గంటల్లో  మనసు  చాలా  వరకూ  ప్రశాంతంగా  ఉంటోంంంం  దాని వల్ల  సరైన  నిర్ణయాలను  నిర్భయంగా తీసుకోగలగడం  జరుగుతూ  ఉంది.  ఇలా  చెప్పుకుంటూ  పోతే,  మాటల్లో  వ్యక్తం  చేయలేని ప్రయోజనాలు  అనేకం  కనిపిస్తున్నాయి.  ఎవరికి  వారు  ప్రత్యక్షానుభవం  ద్వారా  ప్రయత్నించి  చూడవలసినదే  గాని  మాటల్లో  చెప్పడానికి  లేదు.  

అయితే  ఈ  మార్పును  గురించి  నాకు  కలిగిన  ప్రస్తుత  అవ్గాహనను ఇక్కడ  మీతో  పంచుకోవాలనుకుంటున్నాను:

నేనింతకూ  పూర్వం  చెప్పినట్లుగా,  మనిషిలో  సమూలమైన  మార్పు రావాలంటే  మనిషి స్వయంగా  తాను  మారాలనుకుంటే  తప్ప జరగదు.  బహుశా  ఇది  ప్రకృతి  నియమం.  మనిషికి  మారాలని  లేకపోతే  సాక్షాత్తు  భగవంతుడు  కూడా  నిస్సహాయుడైపోతాడు. కాబట్టి  మార్పును  కోరుకోపోవడం  ప్రకృతివిరుద్ధమైన  జీవనం.  కాబట్టి  ప్రతి  మనిషి  తన  శ్రేయస్సును  దృష్టిలో  పెట్టుకొని  చేసుకోవలసిన సంకల్పం ఇది.  ఆ  ఉద్దేశ్యం  మనిషిలో  ఉండటం  చాలా  అవసరం.  ఆ  తరువాత  ఆ  సంకల్పానికి  ఒక దిశ  ఏర్పరచుకోవాలి.  ఆ  దిశ  ఏర్పరచేదే  ఇటువంటి  ఆధ్యాత్మిక  ధ్యాన  పద్ధతి.  

మార్పు  అనేది  ఎప్పుడూ  కూడా  మన  మంచికే.  మార్పు  అనేది  నిత్యనూతనమైనది.  మార్పు  లేకపోతే  జీవితమే  లేదు.  మార్పు  అనేది  మన  మనుగడకు  సంకేతం.  మనిషిలోని  ప్రతీ  అంశంలోనూ  మార్పు  సంభవిస్తూ  ఉండాలి.  మన  చుట్టూ  ఉన్న  ప్రకృతిలో  గాని,  మనం  కూడా  ప్రకృతిలోని  అవిభాజ్య  భాగాలమే  కాబట్టి  మనిషి  ప్రకృతిలో  ఎన్నెన్నో  మార్పులు  జరుగుతూండటం  గమనించవచ్చు.  మన  శరీరంలో  గాని,  మన  మనసులో  గాని,  బుద్ధిలో  గాని,  మన  అహంకారంలో  గాని,  అంటే  స్థూల  సూక్ష్మ శరీరాల్లోనూ,  పంచకోశాల్లోనూ,  అన్నిటిల్లోనూ  మనకు  తెలియకుండా  ఎన్నెన్నో  మార్పులు  జరుగుతూ  ఉంటాయి.  అవన్నీ  ప్రకృతి  సిద్ధంగా  జరుగుతూ  ఉంటాయి.  ఆ  మార్పులు  జరుగకపోయినట్లయితే  ఈ  ప్రపంచంలో  నూతనత్వం గాని,  ఎదుగుదల  గాని  ఉండేది కాదు.  (సశేషం)




ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...