31, డిసెంబర్ 2025, బుధవారం

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు  

సాధకుడికి ప్రతి క్షణమూ ఒక నూతన సంవత్సర ఆరంభమే. ఎందుకంటే సాధకుడు ప్రతీ క్షణమూ దృష్టిలో ఉంచుకుంటూ, యే పని చేసినా, యే సంకల్పాలు చేసుకున్నా, యే ప్రయత్నాలు చేసినా, ఆధ్యాత్మిక వికాస దిశగానే ఉండాలి. మనిషి జీవించే జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా శారీరక శ్వాసతో పాటు ఆధ్యాత్మిక శ్వాస కూడా కొనసాగాలి. ప్రతీ క్షణమూ మనిషి బాహ్యంగా కూడా అన్నీ విధాలా మరింత మరింత మెరుగైన మానవునిగా తయారయ్యే పనిలో నిమగ్నమవ్వాలి.  

గత సంవత్సరంలో ఆధ్యాత్మికంగా గురుదేవుల నుండి అనేక సత్సంగాలు, అనేక ప్రత్యేక సత్సంగాలు(భండారాల్లో), అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు, పరాశిక్షకుల నుండి అనేక వ్యక్తిగత ధ్యాన సిట్టింగులు, అనేక సందేశాలు, అనేక ప్రత్యేక సమావేశాలు, అనేక చర్చలు, అనేక ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం, వ్యక్తిగత సాధన, వలంటీరు సేవ, వృత్తిపరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైన బాధ్యతలు, నిర్వహించి ఉంటాం. చేతనా పరమైన వికాసాన్ని, పురోగతిని సాధించిన అనుభూతిని మనం పొందుతున్నాం. అందుకు 2025 వ సంవత్సరానికి  సర్వదా కృతజ్ఞులమై ఉంటూ, పూజ్య దాజీ 2026 వ సంవత్సరం గడుపవలసిన విధానాన్ని, అనుక్షణం మనసులో ఉంచుకుంటూ, వారి సంకల్పానికి తగినట్లుగా పసిహృదయాన్ని నిలుపుకుంటూ జీవన గమనాన్ని ముందుకు సాగిద్ధాం. 

29, డిసెంబర్ 2025, సోమవారం

మీలోని పసి హృదయాన్ని అలాగే నిలుపుకోండి - పూజ్య దాజీ 2026 నూతన సంవత్సర సందేశం

 


     మీలోని పసి హృదయాన్ని అలాగే నిలుపుకోండి                  పూజ్య దాజీ 2026 నూతన సంవత్సర సందేశం                            పూజ్య బాబూజీ అందించిన విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ సందేశ స్ఫూర్తితో 

(పూజ్య దాజీ ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం)

యహీ దిల్ హై జానమ్, మాసూమియత్ మే ఖోజా తూ 

మీరు గందరగోళంలో పడిపోతే అమాయకంగా మారిపోండి. ఆత్మ ఎక్కడ నివసిస్తుందో అదే హృదయం. ప్రియతమలారా, మిమ్మల్ని మీరు సరళత్వంలోకి సాగిపోనివ్వండి. 

ప్రియమైన సోదరసోదరీమణుల్లారా, 

మనం 2026 వ సంవత్సరంలోకి సమీపిస్తున్న తరుణంలో మీ అందరూ మన మాస్టర్లు ఎప్పుడూ చెప్తూ ఉండే, మీ పసి హృదయాన్నిఅలాగే నిలుపుకోండి అనే సందేశాన్ని కాస్త ఆగి మననం చేసుకోవాలని కోరుతున్నాను. సరళమైన ఈ ఒక్క మార్గదర్శక సూచన మొత్తం ఆధ్యాత్మిక జీవనానికి కీలకమైనది. కానీ ఈ పాఠం, ఎప్పుడూ కంటే ఇప్పుడు ఎందుకు ముఖ్యమో, మన జాతి అత్యున్నత ఆశయానికి ఎందుకు కీలకమైనదో మీతో పంచుకోదలచుకున్నాను.    

ఈ లోకమంతా ఒకే కుటుంబం లేక వసుధైవ కుటుంబకం అంటారు. ఇది మన ప్రాచీన భారత మాత సందేశం.  మనకీ పలుకులు పలకడం అంటే గర్వపడుతూ ఉంటాం. పలు దేశాలు ఒకచోట సమావేశమైనప్పుడు ఈ సందేశాన్ని తలచుకుంటూ ఉంటాం. కాని ఇక్కడ మనం కాస్త ఆగి ప్రశ్నించుకోవలసిన ప్రశ్న ఒకటుంది: ఇది మన ఇళ్ళల్లోనే సాధించుకోలేనప్పుడు, ఇక ప్రపంచంలో సాధ్యపడే అవకశశాం ఉందా అని?

మీ కుటుంబాన్ని గరించే ఆలోచించండి. ముగ్గురో, నలుగురో లేక అంతా కంటే ఎక్కువో ఉన్నారనుకుందాం. ఈ చిన్న కుటుంబంలోనే మీరు బాగా ప్రేమించే వ్యక్తిని గమనించగలుగుతున్నారా? అవతలి వ్యక్తి ఎలా ప్రవర్తించాడో లేక ఎలా ప్రవర్తించలేదో, మీ మనసులో లెక్కలు వేసుకుంటున్నారా? "ఫలానా ఆవిడ నన్ను 2019 లో ఇలా అంది." "నా త్యాగానికి అతనెప్పుడూ విలువ ఇవ్వలేదు."  "నేను చేసిన పనిని ఎప్పుడూ మెచ్చుకోరు."  కొన్నిసార్లు ఇలాటి లెక్కలు మన మనసుల్లో తెలియకుండానే వేసుకుంటూ ఉంటాం. ఇలా మనం మనసుల్లో లెక్కలేసుకుంటున్నంత కాలం, వసుధైవ  కుటుంబకం అనేది ఒక అందమైన వాక్యంగానే మిగిలిపోతుంది. 

ఇప్పుడొక పసిమనసును చూడండి. పసిమనసు సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు నీళ్ళల్లో ఆడుకుంటున్నప్పుడు హైడ్రోజెన్ గురించి. ఆక్సిజన్ గురించి ఆలోచించరు; హాయిగా ఆడుకుంటారంతే. షరతులుండవు, హద్దులుండవు, ప్రేమించే సమయంలో పాత జ్ఞాపకాలుంచుకోరు.  పసిపిల్లలు "నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తాను" అని షరతులు పెట్టరు. నిన్న తగిలిన దెబ్బలు గుర్తుంచుకోరు. పసి హృదయం అంటే ఇబ్బందులకు దూరంగా ఉండేది, జీవితంలో కష్టాల నుండి క్షేమగా ఉండేది. కుటుంబాన్ని నిజంగా కుటుంబంగా మార్చేది ఈ హృదయమే; ఆ కుటుంబం చిన్నది కావచ్చు లేక ప్రపంచమంతా ఆవరించి ఉండవచ్చు. 

ఆత్మ యొక్క సింహాసనం 

ఆత్మ నివసించేది ఈ హృదయమేనని మన మాస్టర్లు గుర్తు చేస్తూ ఉంటారు; అన్నిటికీ అతీతంగా ఎదగాలన్న ఆకాంక్షతో ఉన్న జీవుడి తత్త్వసారం  ఈ హృదయం. విషయం అంతా ఈ స్థాయిలోనే ఉంది. మనం ఏమి సాధించామన్నది కాదు, మనం ఎంత ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నామన్నది కాదు, ఎంత కాలం ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని అనుసరించామన్నది కాదు. మన హృదయాలు ఎంత స్వచ్ఛంగా, ఎంత సరళంగా, ఎంత పసితనంతో నిండి ఉన్నాయన్నదే ముఖ్యం. 

పసివాడు నేర్పించకుండా ఎలా తెలుసుకుంటాడు ? 

సాధారణమైనవాటిని చూసి ఆశ్చర్యపోవడం. నిదర్శనాలు అడుగకుండా నమ్మగలగడం. మనసులో లెక్కలలేకుండా ప్రేమించగలగడం. వ్యూహాల్లేకుండా ఉండగలగడం. జ్ఞాపకం పెట్టుకోకుండా క్షమించగలగడం. యేమీ ఆశించకుండా ఇవ్వగలగడం. 

ఈ జాబితాని జాగ్రత్తగా పరిశీలించండి. వసుధైవ కుటుంబకం అనేది మన నుండి ఆశించేది సరిగ్గా ఇదే కదా? తత్త్వశాస్త్రాల నుండి, క్రమశిక్షణ ద్వారా మనం నేర్చుకోవాలని చేస్తున్న కృషి వీటి కోసమే కదా? 

కాఠిన్యం మనం పోగొట్టుకోవాలి 

జీవితం మనలను కఠినంగా తయారు చేస్తుంది. నిరాశలు  హృదయాన్ని కఠినంగా చేస్తాయి. బాధ్యతలు కావచాలుగా  మారతాయి. చివరికి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే సాధన కూడా, సమర్పణకు గాకుండా ఆర్జించడం కోసం చేస్తే అది కూడా ఏర్పడే కాఠినయానికి కారణం అవుతుంది. నెమ్మదిగా, తెలియకుండా మనం మనసుల్లో లెక్కలు వేసుకోవడం ప్రారంభిస్తాం. అర్థం చేసుకోని జీవిత భాగస్వామి. ఫోన్ కాల చేయని సంతానం. నిరాకరించిన తల్లిదండ్రులు. సహకరించని తోబుట్టువు. మనసులో పడే ఉద్వేగపరమైన ప్రతీ లెక్క, మనం బాగా ప్రేమించే వ్యక్తులకు మనకు మధ్య ఏర్పడే అడ్డుగోడలో ఒక్కో ఇటుకలా పని చేస్తుంది. 

నలుగురే ఉన్న మన ఈ చిన్న కుటుంబంలోనే ఈ అవరోధాలను తొలగించుకోలేకపోతే, దేశాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య ఉన్న హద్దులను చెరపగలిగే పరిస్థితి ఎక్కడుంటుంది? 

2026 లోని రహస్యం 

2026 అందించే రహస్యం ఇదే: భగవంతుడిని సమీపించేది ఆధ్యాత్మికానుభవాలను వెంట పడటమూ కాదు లేక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాగా ప్రోగుచేసుకోవడమూ కాదు. పసి హృదయాల్లా తయారవడం మార్గం. ఒక పువ్వుని ఆశ్చర్యంగా చూడటం; సిగ్గు పడకుండా ఏడవగలగడం; కారణం లేకుండా నవ్వగలగడం; భయం లేకుండా ప్రేమించగలగడం; మనసులో లెక్కల్లేకుండా క్షమించగలగడం. 

భగవంతునితో అనుసంధానం సాధ్యం చేసే హృదయమే, మనలను పరస్పరం కలుపుతుంది. భగవంతునితో అనుసంధానమవడానికి, ఒక హృదయం, కుటుంబంతో కలవడానికి మరో హృదయం అని రెండు హృదయాలు అవసరం లేదు. కావలసినది ఒక్కటే హృదయం, అది - పసి హృదయం. 

ప్రపంచం ఎదగమంటుంది; గంభీరంగా ఉండమంటుంది; నిన్ను నివ్వు కాపాడుకో అంటుంది; ఆధ్యాత్మిక ప్రగతిని కొలుచుకోమంటుంది. కానీ మాస్టర్లు మరోలా మాట్లాడుతున్నారు: "పసి పిల్లల్లా తయారవ్వండి" ; "మూలానికి తిరుగు ప్రయాణం చేసి, తాజా జీవితాన్ని పొందండి" అంటారు. "ప్రతీదీ హృదయంపై ఆధారపడుంది" అంటారు మాస్టర్లు. 

ఈ సంవత్సరంలో మీరు చేయడానికొక అభ్యాసం 

ఈ సంవత్సరాన్ని మీలోని పసివాళ్ళ స్వభావాన్ని పునరుద్ధరించుకోవడం ద్వారా మీ ఇంట్లో ప్రారంభించండి. మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు, ఖాళీ చేతులతోనూ, తెరచిన హృదయంతోనూ, రండి; ఒక పసివాడు తన తల్లిదండ్రుల వద్దకు యే లెక్కలూ, అజెండా లేకుండా వచ్చినట్లు రండి. ధ్యానం నుండి లేచిన తరువాత అదే హృదయంతో బ్రేక్ ఫాస్ట్ చేయండి, మీ భాగస్వామి వద్దకు వెళ్ళండి; మీ పిల్లల వద్దకు వెళ్ళండి; మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళండి. 

ఎవరు ఏమి అన్నారో వాటిని మనసులో పెట్టుకోకండి. గతంలో ఎవరైనా బాధ పెట్టుమటే మనసులో నుండి తీసేయండి. మీరు ఆశించినట్లుగా ఉండటం వల్ల ఇతరులు మీ ప్రేమను పొందాలని అనుకోవద్దు. 

ఇతరులకు సేవ చేసేటప్పుడు, పిల్లలు తమ ఆటబొమ్మలను మనకు చూపిస్తూ ఆనందిస్తున్నట్లుగా సేవ చేయండి; పేరు కోసం కానీ గుర్తింపు కోసం గాని చేయకుండా కేవలం పంచుకోవడం అనే ఆనందం కోసం సేవ చేయండి. సంబంధాల్లో ఇబ్బందులొచ్చినప్పుడు చిన పిల్లవాడు నమ్మినట్లు నమ్మండి; అవతలి వ్యక్తి అర్హుడని కాదు, అందుకు ఋజువులున్నాయని కాదు; నమ్మాడమే మీ స్వభావం కాబట్టి, మీ హృదయంలో అస్సలు అనుమానం గూడు కట్టుకోలేదు కాబట్టి. 

పరివర్తనా తరంగం 

ఇది గనుక మనం చేయగలిగితే అసాధారణమైనది జరుగుతుంది. మనింట్లో మొదలైన వసుధైవ కుటుంబకం బయటకు ప్రసరించడం ప్రారంభమవుతుంది. మనసుల్లో లెక్కలేసుకోని కుటుంబం లెక్కలేసుకోని సమాజంగా తయారవుతుంది. బేషరతుగా ప్రేమించగలిగే సమాజం బేషరతుగా ప్రేమించే జాతికి బీజం అవుతుంది. నిజంగా ఒక్క కుటుంబంలా తయారైన దేశం, అప్పుడు ప్రపంచాన్ని కూడా ఒక్క కుటుంబంగా ఉండాలన్న ఆహ్వానాన్ని త్రికరణ శుద్ధిగా ఇవ్వగలుగుతుంది. 

పరివర్తన ఎక్కడో అక్కడ ప్రారంభమవ్వాలి. అది మీ హృదయంలో ప్రారంభం కానివ్వండి. మీ ఇంట్లో మొదలు కానివ్వండి. ఈ సంవత్సరం ప్రారంభం కానివ్వండి. 

ఈ సందేశానికి స్ఫూర్తినిచ్చిన విస్పర్ సందేశం 

ఈ భావాలను నాలో ప్రేరణ కలిగించిన, బాబూజీ దివ్యలోకం నుండి అందించిన సందేశాల్లో ఒక సందేశం పరిశీలిద్దాం. 

సోమవారం, అక్టోబర్ 18, 2004 - ఊయదయం 10:00 గంటలు 

"నీకు హాని కలుగకుండా క్షేమంగా ఉంచిన నీ పసి హృదయాన్ని నిలుపుకో. ఈ విషయాన్ని మన సోదరులందరికీ ప్రతీ ఒక్కరికీ చెప్పవచ్చు: ఈ ఆత్మ నివాసం ఉండేది ఈ హృదయంలోనే. అన్నిటికీ అతీతంగా ఉండే పరిస్థితిని తీవ్రంగా అన్వేషించే జీవుడి యదార్థ తత్త్వం ఇదే. ప్రతీదీ ఆధారపడున్నది ఈ స్థాయిలోనే. పసిపిల్లల్లా ఉండండి. జీవితం మిమ్మల్ని కఠినంగా తయారు చేసి, మూలానికి దూరం చేసి ఉంటే, తిరిగి మళ్ళీ పునరుద్ధరణ జరిగేది ఈ పసి హృదయం ద్వారానే. అసలైన విషయం మీద మీరు మీ దృష్టిని సారించడానికి సహకరించడమే ఈ ఆధ్యాత్మిక యాత్ర యొక్క లక్ష్యం. 

"నీలో ఈ అవసరాన్ని నువ్వు అనుభూతి చెందుతున్నావు. నీ ప్రాపంచిక జీవనం నీకు సంతోషం కలిగించవచ్చు, కానీ నీలో యేదో శూన్యత కలిగించవచ్చు కూడా, యేదో లేని వెలితి అనుభూతి చెందుతారు. కానీ అంతులేకుండా చేసే సాధన ఆ దివ్యత్వంతో ఏకమైపోవాలన్న తీవ్ర తపన మరింత మరింత ఎక్కువగా ఉపరితలంపైకి వాస్తు ఉంటుంది. సుదీర్ఘ అన్వేషణ యొక్క చరమాంకం ఇదే, తిరుగాడుతూ ఉండగా అన్వేషకునికి సత్యము దర్శనం ఇస్తుంది. 

"ఈ రంగంలో ప్రతీదీ చాలా తేలిక: నువ్వు చేయవలసినదల్లా కావాలనుకోవడం, సరైన విధంగా సాధన చేయడం, సమస్యలతో నిండిన నకిలీ జీవితం వల్ల నిజమైన గమ్యానికి దూరంగా ఉంచడంలో   హక్కులను కోల్పోయినప్పుడు పోగొట్టుకున్న వివేకాన్ని గుర్తుంచుకోవడం."

మనం మరచిపోయిన సరళత్వం  

ప్రతీ విషయం చాలా తేలికంటున్నారు బాబూజీ. కావాలనుకోవడం, సరిగ్గా సాధన చేయడం, కోల్పోయిన వివేకాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఇంతే మనకు కావలసినది. ఇక్కడ వివేకం అంటే పసివాడి వివేకం; లెక్కలేసుకోకుండా ప్రేమించడం; గుర్తుంచుకోకుండా క్షమించగలగడం; యేమీ ఆశించకుండా ఇవ్వగలగడం.  ఇటువంటి వివేకం వసుధైవ కుటుంబకం అనేది సాధ్యపడేలా చేస్తుంది. మనం యే హరదాయంతో జన్మించామో అక్కడే ఈ వివేకం ఉంది; దాన్ని మరలా ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలనుకోవచ్చు. 

ఈ 2026 వ సంవత్సరం మిమ్మల్ని మీరు మరలా సరళంగా తయారయ్యేలా అనుకూలించనివ్వండి. ఈ సంవత్సరం మీరు హాయిగా నవ్వగలగాలి, స్వేచ్ఛగా ఏడవగలగాలి, ఎల్లల్లేకుండా ప్రేమించగలగాలి, ప్రగాఢంగా నమ్మగలగాలి. ఈ సంవత్సరం మీరు బాగా ప్రేమించేవారి పట్ల, బహుశా కొన్ని దశాబ్దాలు  మనసులో ఏర్పరచుకున్న లెక్కలను కాల్చివేయండి. ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే, సాధన చేసేది యేదో సాధించాలని కాకుండా, అంతరంగంలో ఎప్పుడూ ఉన్న, ఎప్పుడూ వదిలిపెట్టని ఆ దివ్యమైన పసివాడిని తిరిగి కనుగొనాలని చేయడం. ఆ పసిహృదయం అక్కడే కనుగొనబడాలని, ఆదరించబడాలని, గౌరవించబడాలని,  జీవించాలని వేచి ఉన్నది. 

ఒకే గమ్యం, ఒకే హృదయం

మీరు తపిస్తున్న యోగస్థితి,  మీరు ప్రార్థిస్తున్న లయావస్థ, మీరు అభ్యాసం చేస్తున్న అతీత స్థితి, అన్నీ ఈ పసి హృదయంలో దాగి ఉన్నాయి. అలాగే వసుధైవ  కుటుంబకంలో కూడా దాగి ఉన్నాయి. ఈ రెండూ రెండు గమ్యాలు కావు. రెండూ ఒక్కటే. దివ్యత్వంలో లయమవగలిగే హృదయం కుటుంబంలో కూడా లయమవగలదు. భగవంతుని పట్ల ఎటువంటి లెక్కలు ఉంచుకోని హృదయం, జీవిత భాగస్వామి పట్ల, సంతానం పట్ల, తోబుట్టువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎటువంటి లెక్కలూ ఉంచుకోదు. 

ఆ పసి హృదయం మీరే. ఎప్పుడూ అలాగే ఉన్నారు. ఎప్పటికీ అలాగే ఉంటారు కూడా. 

హ్యాపీ న్యూ ఇయర్ 2026!

ప్రియతమలారా, ఎక్కడ గందరగోళంగా ఉంటుందో, అక్కడ అమాయకంగా మారిపోదాం. 

యహీ దిల్ హై జానమ్, మాసూమియత్ మే ఖోజా తూ 

పూజ్య దాజీ ఇచ్చిన ఆంగ్ల సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


22, డిసెంబర్ 2025, సోమవారం

ప్రపంచ ధ్యాన దినోత్సవంలో హార్ట్హుల్నెస్ గిన్నిస్ బుక్ రికార్డ్


ప్రపంచ ధ్యాన దినోత్సవంలో  
హార్ట్హుల్నెస్  గిన్నిస్ బుక్ రికార్డ్ 

ఐక్య రాజ్య సమితి గత సంవత్సరం ప్రకటించినట్లుగా డిశంబర్ 21, 2025 న రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్  సంస్థ ఆన్ లైన్ లో,  ధ్యానం నిర్వహించడం జరిగింది. ఈ ధ్యానాన్ని సంస్థ అధ్యక్షులు పూజ్య దాజీ రాత్రి 8 గంటలకు నిర్వహించడం జరిగింది. ఇందులో 3,57,655 మంది పాల్గొనడం జరిగింది. 20 లక్షల మందిని   పైగా ఆహ్వానించడం జరిగింది ఈ బృహత్ కార్యాన్ని 160 దేశాల్లోని సంస్థ వాలంటీర్లందరూ చేసిన కృషి, దాజీ అనుగ్రహం. 

గత సంవత్సరం ఆర్ట్ ఆఫ్ లివ్వింగ్ సంస్థ 3.44 లక్షల మంది ధ్యానంలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం హార్ట్ఫుల్నెస్ 3.57 లక్షల మంది పాల్గొనడం చేత హార్ట్ఫుల్నెస్ సంస్థ గత సంవత్సరం ఆర్ట్ ఆఫ్ లివ్వింగ్  వారు ఏర్పరచుకున్న గిన్నీస్ బుక్ రికార్డును మించి కొత్త రికార్డును స్థాపించడం జరిగింది. 

పైన చిత్రాల్లో గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్, పూజ్య దాజీ ధన్యవాదాలు చెప్తున్న చిత్రాలు. 

ఇది రికార్డు స్థాపించడం, స్థాపించకపోవడం కంటే కూడా సమిష్ఠి చేతనలో, సంవత్సర-సంవత్సరానికీ  ధ్యానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అంతా కంటే ముఖ్యం ప్రపంచంలో ఇటువంటి ధ్యాన యజ్ఞం వల్ల, ఇంత మంది, భూమ్మీద శాంతి-సామరస్యాల కోసమన్న ఒకే ఆలోచనతో, ఒకే సంకల్పంతో ధ్యానించినందువల్ల భూమి చుట్టూ ఒక సూక్ష్మ వెలుగుతో కూడిన వాతావరణం ఏర్పడి మానవాళి పరివర్తనకు దోహద పడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం రానున్న రోజుల్లో గమనించవచ్చు. 

ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించిన  ఐక్యరాజ్య సమితికి, ఇటువంటి  మహత్తర ధ్యాన యజ్ఞాన్ని తలపెట్టిన పూజ్య దాజీ సంకల్పానికి, దానికి కృషి చేసిన సంస్థ వలంటీర్లకు, ఆన్ లైన్ ధ్యానంలో పాల్గొన్న ధ్యానాభిలాషులకు కృతజ్ఞతలు. 

ఇది కేవలం ధ్యాన యాత్రలో ఆరంభం మాత్రమే. ఆశక్తీ కొనసాగించదాలచుకున్న వారు దయచేసి సమీప హార్ట్ఫుల్నెస్ కేంద్రాన్ని గాని, హార్ట్ఫుల్నెస్ ధ్యాన శిక్షకులను సంప్రదించి సాధన ప్రారంభించాలని ప్రార్థన. 

20, డిసెంబర్ 2025, శనివారం

పూజ్య చారీజీ స్మృతిలో ...

 


పూజ్య చారీజీ స్మృతిలో ... 

పరమపూజ్య పార్థసారథి రాజగోపాలాచారీజీ, ఆరడుగుల ఆజానుబాహుడు; ఒక దివ్య పురుషుడు; వారిలో దివ్యత్వం కాదు, దివ్యత్వంలోనే వారున్నట్లుగా దేదీప్యమానంగా మయిమరపించే చిరునవ్వుతో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేవారు. వారి కంఠస్వరం గంభీరంగా, సింహగర్జనలా ఉండేది. వారు మాట్లాడిన విషయం ప్రతీ హృదయంలోనూ చొచ్చుకుపోయి తన పని పూర్త చేసేది; వారు మాట్లాడే భాష అర్థంకాని వారి హృదయంలో కూడా చోటు చేసుకుని వారికి అందవలసిన సందేశం అర్థమయ్యేట్లుగా ఉండేది. మా అమ్మమ్మగారు, ఇంగ్లీషు అస్సలు అర్థంకాని  మనిషి, చారీజీని ఎప్పుడూ చూడని మనిషి, ధ్యానం అంటే అవగాహన లేని 80 సంవత్సరాల వృద్ధురాలు, "ఒరేయ్ ఆయన క్యాసెట్ పెట్టరా, ఆయన కంఠస్వరం బాగుంటుంది.. "అంటూ వారి ఆంగ్ల ప్రసంగాలు వింటూండేవారు. అదీ చారీజీ ప్రభావం. 

వారిని 1990 లో మొట్టమొదటిసారి చూడక ముందు, నాలో వేల సంఖ్యలో ప్రశ్నలతో వేధింపబడుతూ ఉండేవాడిని; వారిని మొట్టమొదటిసారిగా దర్శించిన వెంటనే నాలో అన్ని ప్రశ్నలకూ ఒకేసారి సమాధానం దొరికినట్లు, అపూర్వమైన శాంతిని అనుభూతిని పొందాను. ఆ క్షణమే నాకు తెలియకుండానే ఇక వీరితోనే నా జీవితం అన్న దృఢసంకల్పం జరిగిపోయింది. ఆ తరువాత ఇక వెనక్కి తిరిగి చూసింది లేదు. బహుశా ఇటువంటి అనుభూతే చాలా మంది సాధకులకు కూడా కలిగి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ జనారణ్యంలో సరైన గురువును కనుగొన్న మధురాతి మధుర క్షణం అది. 

బాబూజీని ప్రత్యక్షంగా చూడని అభ్యాసులకు ఆ వెలితిని పూజ్య చారీజీ తన జీవన శైలి ద్వారా, బాబూజీ బోధల ద్వారా, బాబూజీ ఛలోక్తుల ద్వారా, అఅబూజీ అద్భుతమైన హావభావ అనుకరణాల ద్వారా, పూడ్చఏవయారు; సాక్షాత్తు బాబూజీనే దర్శింపజేసేవారు.  ఆయన పలికిన ప్రతీ వాక్యంలోనూ బాబూజే అన్న పదం తప్పనిసరిగా ఉండేది. సరిగ్గా బాబూజీ కూడా లాలజీని ఇలాగే స్మరిస్తూండేవారట. ఇది కూడా చారీజీ ద్వారానే తెలిసింది. ఆ విధంగా బాబూజీ యొక్క సరళత్వం, స్వచ్ఛత యొక్క ప్రస్తుత అభ్యాసులకు అనుభూతి కలిగేది. తద్వారా పూజ్య చారీజీ అభ్యాసుల హృదయాలలో నిర్మించవలసిన ఆధ్యాత్మిక సౌధాలకు చక్కటి పటిష్ఠమైన ప్రేమ పునాడీని వేయడం జరిగింది. దాని పైన ప్రస్తుత మాస్టర్ పూజ్య దాజీ ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. 

19, డిసెంబర్ 2025, శుక్రవారం

పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ - సమాధి - మణపాక్కం, చెన్నై

 

పూజ్యశ్రీ  పార్థసారథి రాజగోపాలాచారీజీ - సమాధి  మణపాక్కం, చెన్నై   

అధ్యక్షులు 

శ్రీరామ చంద్ర మిషన్, 

హెడ్ క్వార్టర్స్: షాజహాన్ పూర్ (ఉ. ప్ర.), భారత్ 

1983 నుండి 2014 

జననం: జూలై 24, 1927 

మహాసమాధి : డిశంబర్ 20, 2014 

(ఈ రోజు మన ప్రియతమ గురుదేవులు పూజ్యశ్రీ చారీజీ మహాసమాధి పొందిన రోజు; కాస్సేపు మౌనంగా ధ్యానంలో ఉందాం.) 




సహజ మార్గ ధ్యాన పద్ధతి (ఆడియోలో)

సహజ మార్గ ధ్యాన పద్ధతి (ఆడియోలో)


సహజమార్గ సాధన ప్రారంభించాలనుకున్నవారు సమీప ట్రైనర్లను సంప్రదించి ఈ క్రింది ప్రక్రియలను ప్రత్యక్షంగా నేర్చుకోగలరు. ఈ క్రింది వెబ్ సైట్ క్లిక్ చేసి మరింత సమాచారాన్ని పొందగలరు. 

www.heartfulness.org  

క్లుప్త పరిచయం 

ఈ క్రింది ఆడియో లింకులను క్లిక్ చేసి వినగలరు:

హార్ట్ఫుల్నెస్  రిలాక్సేషన్ 

హార్టఫుల్నెస్ రిలాక్సేషన్

హార్ట్ఫుల్నెస్ ధ్యానం గురించిన ప్రసంగం 

హార్టఫుల్నెస్ ధ్యాన ప్రసంగం 

హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ ప్రసంగం 

హార్ట్ఫూలనెస్ నిర్మలీకరణ ప్రసంగం 

హార్ట్ఫుల్నెస్ గైడెడ్ క్లీనింగ్ 

గైడెడ్ క్లీనింగ్

హార్ట్ఫుల్నెస్ ప్రార్థన 

హార్టపులనెస్ ప్రార్థన  

నైతికత లేనిదే ఆధ్యాత్మికత నిలవదు

 


విలువలతో కూడిన ఆధ్యాత్మిక దిగ్గజం, స్వామి వివేకానంద 
నైతికత లేనిదే ఆధ్యాత్మికత నిలవదు  

నైతిక విలువలు లేనిదే సౌశీల్యం అసాధ్యం. సౌశీల్యం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి నిష్ప్రయోజనమవుతుంది. 

నైతిక విలువలు ఎలా అలవడతాయి?
ప్రధానంగా అలవరచుకోవాలన్న సంకల్పం వల్ల అలవడతాయి. ఆ తరువాత
పుట్టుకతో కొంత గత జన్మ సంస్కారాల వల్ల, కుటుంబ సంస్కృతి వల్ల , పెరిగే వాతావరణం వల్ల, సజ్జనుల సాంగత్యం వల్ల, విద్యాభ్యాసం వల్ల, ఆశయాల వల్ల, జ్ఞానం వల్ల, ధ్యానం వల్ల విలువలు మనిషిలో పెంపొందుతాయి. 
విలువలతో కూడిన జీవితం అందరి హృదయంలో ఉన్న అంతర్యామి యొక్క వెలుగును బయటకు ప్రసరించేలా చేస్తుంది.
 
లాంతరు ఉపమానం 
లాంతరులో దీపం వెలుగు బయటకు రావాలంటే చిమ్నీ యే విధంగా మసి లేకుండా శుభ్రంగా  ఉండాలో, అలాగే బాహ్య జీవనం లోపలి ఆధ్యాత్మిక ప్రగతికి తగినట్లుగా విలువలతో కూడి ఉండటం వల్ల సాధ్యపడుతుంది. 

విలువలతో జీవనం అనేది నిర్విరామంగా కొనసాగవలసిన ప్రయత్నం. ప్రయత్నపూర్వకంగా కొనసాగవలసిన ప్రక్రియ. 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...