17, నవంబర్ 2025, సోమవారం

కర్మ, అకర్మ, వికర్మ

 


కర్మ, అకర్మ, వికర్మ 

కర్మ అంటే ఆలోచనల వల్ల, చేసే పనుల వల్ల, ఉద్దేశ్యాల వల్ల కలిగే ఫలితం. కర్మ అంటే ధర్మానికి అనుగుణంగా చేసే పనులు. అంటే నైతికమైన పనులు, శాస్త్రాలకనుగుణంగా ఉండే పనులు, తనకు, సమాజానికి ఉపయోగపడే పనులు, కర్తవ్య భావంతో చేసే పనులు. ఉదాహరణలు: చిత్త శుద్ధితో తన ధర్మాలని నిర్వర్తించడం, గృహస్త ధర్మాలను నిర్వహించడం, దానధర్మాలు, సేవ, యజ్ఞాలు నిర్వహించడం, నిస్స్వార్థంగా పనులు చేయడం. 
వీటినే శీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నిత్య కర్మ అని చెప్పడం జరిగింది. 
నియతం కురు కర్మత్వం - గీత 
అర్థం: నీ నిత్యనాయిమట్టిక కర్మలు నువ్వు నిర్వహించు. 
యోగస్థ కురు కర్మాణి - గీత
అర్థం: యోగస్థితిలో కర్మలు నిర్వహించు  
అటువంటి కర్మ మనసును శుద్ధి చేసి ఆత్మ సాక్షాత్కారానికి సాధకుడిని సిద్ధం చేస్తుంది. 

అకర్మ అంటే బంధాన్ని కలిగించని కర్మ లేక పనులు. ఆకర్మ అంటే యేమీ చేయకుండా ఉండటం కాదు. అకర్మ అంటే అంతరంగంలో కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయడం. అంటే అహంకారం లేకుండా, కోరికలు లేకుండా, ఎటువంటి బంధాల్లేకుండా చేసే పనులు. 
అకర్మ స్థితిలో నీ ద్వారా పనులు జరుగుతాయి. కానీ కర్మను ప్రోగు చేసుకోవడం ఉండదు. అంతరంగంలో నిశ్శబ్దంగా, బంధాలకతీతంగా ఉండగలుగుతాము. 
కర్మాణి అకర్మ యః పశ్యేద్  - గీత 
చేసే కర్మలో కర్మ చేయకుండా ఉండటం చూడగలిగినవాడిని విజ్ఞుడంటారు. 
ఉదాహరణలు: ఒక జ్ఞాని కరుణతో బోధలు చేయడం; కర్మ యోగి నిసస్వార్థంగా పని చేయడం; ఈశ్వరార్పణంగా కర్మలు చేయడం. 

వికర్మ అంటే ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు. అంటే అనైతికమైన పనులు, ఇతరులకు హాని కలిగించే పనులు, స్వార్థపూరితమైన, వినాశనానికి దారి తీసే ప్రవర్తన, శాస్త్ర విరుద్ధంగా ఉండే పనులు. 
దీని పర్యవసానాలు ఇలా ఉంటాయి: నకారాత్మక ప్రభావాలు, మానసిక, ఉద్వేగపరమైన గందరగోళం, ఆధ్యాత్మిక పతనం. 
వికర్మణాః సంశయ కరణి - గీత 
అర్థం: అక్రమంగా చేసే పనులు పతనానికి, గందరగోళానికి దారి తీస్తాయి.
ఉదాహరణలు: స్వార్థం కోసం అసత్యాలు పలకడం, కోపంతో చేసే హింస, మోసం చేయడం, స్వలాభార్జన, హస్తలాఘవం,   కర్తవ్యపాలనను నిర్లక్ష్యం చేయించే అలసత్వం, బద్ధకం, వంటి పనులకు పాల్పడటం. 

మన ఆధ్యాత్మిక ప్రయాణం ఈ విధంగా సాగాలి:
వికర్మ -> కర్మ -> అకర్మ -> జ్ఞానం -> మోక్షం -> సాక్షాత్కారం 

ఒక్క వాక్యంలో చెప్పాలంటే:
కర్మ అంటే మనం చెయ్యవలసిన పని. 
అకర్మ అంటే అహం లేకుండా చేసే పని . 
వికర్మ అంటే మనం చేయకూడని పని. 

15, నవంబర్ 2025, శనివారం

భక్తి

 


భక్తి 

శ్రద్ధ లేని భక్తి, భక్తి కాదు; శ్రద్ధ బీజం అయితే భక్తి పర్యవసానం.

శ్రద్ధ యొక్క అభివ్యక్తీకరణే భక్తి. భక్తి అంటే దైవం పట్ల ప్రేమ, సమర్పణ భావం, నిరంతర స్మరణతో కూడిన అంకితభావం. భక్తి ప్రయత్నిస్తే వచ్చేది కాదు. హృదయ శుద్ధి జరిగినప్పుడు అప్రయత్నంగా కలిగేది భక్తి. భక్తి కేవలం ఉద్వేగపూరితమైనది కాదు, భక్తి భాగ్యవంతునితో ఏడాతెగకుండా ఉండే ప్రేమతో కూడిన లోతైన సంబంధం. 
భగవంతుడు దూరంగా ఎక్కడో లేడు, ఈ హృదయంలోనే ప్రియతముడిగా ఉన్నాడంటూమది భక్తి. భగవంతుని ప్రేమించాలనుకున్నవారికి యేదీ అడ్డు రాదు; భక్తికి యేదీ అడ్డు లేద; విధులు లేవు. ప్రేమించేది హృదయంతో. ప్రేమే దైవం, దైవమే ప్రేమ అంటుంది భక్తి. 
ప్రేమ ఉన్నచోట భయం ఉండదు. 
సమర్పణ ఉన్నచోట అహం ఉండదు. 
భక్తి అహాన్ని కరిగించి ఆత్మను ఆవిష్కరిస్తుంది. 
భక్తి పండితులకు, పామరులకూ అందరికీ సరళమే. అందరికీ అందుబాటులో ఉండేది. 
భక్త్యా మాం అభిజానాతి - శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీత 
భక్తి ద్వారా మాత్రమే నిజంగా నన్ను తెలుసుకోగలుగుతారు. 
"నేను" నుండి "నీవే" వరకూ చేసే ప్రయాణమే భక్తి; చివరికి ఒక్కటే మిగులుతుంది. 
ప్రేమ వేగంగా గమ్యానికి చేరుస్తుంది; బుద్ధి నెమ్మదిగా చేరుస్తుంది; అందుకే భక్తి శ్రేష్ఠం.  
భక్తిలో మహాభావ స్థితి ఎలా ఉంటుందంటే:
అక్కడ అహం పూర్తిగా కరిగిపోతుంది. 
దైవంతో వేరుగా ఉన్న భావన అదృశ్యమవుతుంది. 
బ్రహ్మ పదార్థం శుద్ధ ప్రేమ యొక్క తత్త్వంగా సాక్షాత్కరిస్తుంది. 
(భక్తిని గురించి మరింత లోతైన అవగాహన కోసం దయచేసి నారద భక్తి సూత్రాలు అనే గ్రంథాన్ని అధ్యయనం చేయగలరు.)
నారద భక్తి సూత్రాల ప్రకారం భక్తే పరమ గమ్యం. దైవత్వం పట్ల పరమప్రేమే భక్తి. ఆ ప్రేమ అకారణ ప్రేమ అయి ఉండాలి, బేషరతు ప్రేమ అయి ఉండాలి, ఎడతెగని ప్రేమ అయి ఉండాలి, పరిపూర్ణ ప్రేమ అయి ఉండాలి - అదే పరమ ప్రేమ అంటే. భక్తి స్వభావం అమృతాన్ని పోలి ఉంటుంది. 

నిజమైన భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయి ?
వినమ్రత కలిగి ఉండాలి 
ద్వేషం, కోపం, అసూయ నుండి విముక్తి పొందినవాడై ఉండాలి 
సకల జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి 
అందరిలోనూ దైవాన్ని చూసేవాడై ఉండాలి 
భగవదేచ్ఛకు సంపూర్ణంగా సమరపితుడై ఉండాలి. 

సహజ మార్గం ప్రకారం భక్తి:
భక్తి సహజమైనది.   
భక్తి మౌనంతో కూడినది. నిశ్శబ్దంగా జరిగేది. 
మాస్టర్ మార్గదర్శనంలో కొనసాగేది భక్తి. 
భక్తి ప్రత్యక్షంగా సాధించేది: నిత్యం ధ్యానం ద్వారా, శుద్ధీకరణ ద్వారా, ప్రార్థన ద్వారా, నిరంతర స్మరణ ద్వారా, సేవ ద్వారా. 
భక్తికి పరాకాష్ఠ ఏకత్వమే - భాగ్యవంతునితో ఏకత్వం సాధిచడమే. 

ఒక్క వాక్యంలో చెప్పాలంటే:
హృదయం సాధన ద్వారా శుద్ధి చేయబడి, ప్రాణాహుతి ద్వారా సున్నితపరచబడి, సూక్ష్మీకరించబడి, మాస్టర్ పట్ల శరణాగతి భావంతో ఉండే హృదయం సహజంగా దివ్యత్వం వైపు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాన్నే భక్తి అని అంటారు. 

14, నవంబర్ 2025, శుక్రవారం

శ్రద్ధ

 


శ్రద్ధ 
శ్రద్ధ అంటే సత్య పదార్థంతో నిత్యం అనునాదం కలిగి ఉండటం. 
 
శ్రద్ధ, భక్తి లేకుండా ఆధ్యాత్మిక జీవనం అసాధ్యం. శ్రద్ధ అనే పదం మనం తెలుగు వాడుక భాషలో ఆసక్తి (interest) అనే అర్థంలో సాధారణంగా వాడుతూ ఉంటాం. అంటే మనసు పెట్టి చేయాలని. కానీ ఈ పదానికి సంస్కృత మూలం అయిన శ్రద్ధ అనే పదానికి అర్థం - మనసును లేక హృదయాన్ని సత్యముపై శాశ్వతంగా నిలిపి ఉంచడం. నమ్మకం పరిపక్వమయితే అది విశ్వాసం; విశ్వాసం పరిపక్వమైనప్పుడు అది శ్రద్ధ. 

నమ్మకం -> విశ్వాసం -> శ్రద్ధ 
నమ్మకం సమాచారంపై ఆధారపడినది; ఆలోచనపై ఆధారపడినది; స్థూలమైనది; మార్పుకు లోనుకావచ్చు.  
ఆ విన్న సమాచారం ద్వారా అనుభవంలోకి వచ్చినప్పుడు కలిగేది విశ్వాసం. హృదయానికి సంబంధించినది. విశ్వాసం అంటే పరిపకవమైన నమ్మకం. 
శ్రద్ధ అంటే ఆత్మకు సంబంధించినది; ఆత్మ సత్య పదార్థంతో, యాదార్థంతో అనునాద స్థితిలో ఉండటమే శ్రద్ధ. సంస్కృతంలో  శ్రద్, అంటే హృదయం; ధా, అంటే నిలిపి ఉంచడం, ధరించడం. విశ్వాసం పరికమైనప్పుడు కలిగేది. 

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం - భగవద్గీత 
శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది; జ్ఞానం శ్రద్ధ నివ్వడు. శ్రద్ధ జ్ఞానానికి ద్వారాలు తెరుస్తుంది. 

శ్రద్ధ మూడు రకాలు 
సాత్త్విక శ్రద్ధ; రాజసిక శ్రద్ధ; తామసిక శ్రద్ధ. 
సాత్త్విక శ్రద్ధ స్పష్టతకు, ప్రశాంతతకు, సత్యనిష్ఠకు  దారి తీస్తుంది; రాజసిక శ్రద్ధ విజయాన్ని, ఫలితాలను, ప్రదర్శనను కోరుకునేలా చేస్తుంది. 
తామసిక శ్రద్ధ గ్రుడ్డి నమ్మకానికి, మూఢనమ్మకాలకు, హానికర చేష్టలకు దారి తీస్తుంది. 

సహజ్ మార్గ మాస్టర్ల ప్రకారం: 
గమ్యం దిశగా ముందుకు సాగుతున్నామన్న పరిపూర్ణ విశ్వాసం హృదయ లోలోతుల్లో ఉండటమే శ్రద్ధ. 
ప్రాణాహుతి, ధ్యాన ప్రక్రియాలపై పరిపూర్ణ విశ్వాసం. 
అంతరంగంలో నుండి మార్గదర్శి అయిన హృదయంపై పరిపూర్ణ విశ్వాసం.  
శ్రద్ధ అంటే అసంభవమైనదాన్ని నమ్మగాలగడం - చారీజీ 
ఇక్కడ శ్రద్ధ అంటే మాస్టర్ పై ఆధారపడటం కాదు, మన పద్ధతిపైన, ఆధ్యాత్మిక పరివర్తనం పైన పటిష్ఠమైన విశ్వాసం ఉండటం.  శ్రద్ధ అంటే దివ్యత్వం అంటే సున్నితమైన, సూక్ష్మమైన ఆకర్షణ కలిగి ఉండటం. 

శ్రద్ధను అలవరచుకోవడం ఎలా? 
సత్సాంగత్యం ద్వారా అంటే తోటి సాధకులు/విజ్ఞుల సాంగత్యం ద్వారా, శాస్త్ర/ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనం ద్వారా, నిజాయితీగా జీవించడం ద్వారా, విశాల హృదయంతో ధ్యానించడం ద్వారా, ప్రత్యక్షయనుభవం ద్వారా అంతరంగంలోని మార్పులు గమనించడం ద్వారా శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. 

శ్రద్ధ యొక్క అత్యుకృష్ట స్వరూపం 
పరిపూర్ణ శ్రద్ధ సంభవించినప్పుడు: 
ఎక్కడా ఎటువంటి సందేహమూ ఉండదు ; హృదయం/మనసు స్థిరంగా ఉంటుంది; సాధన అప్రయత్నంగా జరిగిపోతుంది; దైవం అనేది ఇక నమ్మకంగా ఉండదు; సజీవ సాన్నిధ్యంగా మారిపోతుంది. దీన్నే పరమ శ్రద్ధ అని కూడా అంటారు - దివ్యత్వం పట్ల మొక్కవోని విశ్వాసం. 


 

 

10, నవంబర్ 2025, సోమవారం

రాజయోగము



రాజయోగము 

యోగాన్ని గురించిన కొన్ని నిర్వచనాలు: 
యుజ్యతే ఇతి యోగః - అంటే కలిపేది యోగము. 
యోగః చిత్తవృత్తి నిరోధః - చిత్తములోని వృత్తాలు నిరోధించేది యోగము. 
యోగః కర్మశు కౌశలం - కర్మలు చేయడంలో నైపుణ్యమే యోగం. 
యోగస్థః  కురు కర్మాణి - యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయాలి. 

నాలుగు యోగాలు 
ఇటువంటి యోగసిద్ధిని (ఆత్మ పరమాత్మలో లయమవడమే) సాధించడమే, మానవ జీవితం యొక్క అసలు ప్రయోజనం. ఈ యోగసిద్ధిని కర్మ యోగం ద్వారా గాని, జ్ఞాన యోగం ద్వారా గాని, భక్తి యోగం ద్వారా గాని, రాజయోగం ద్వారా గాని  సాధించవచ్చని శాష్టరకారులు, ఋషులు, మహాత్ములు తెలియజేయడం జరిగింది. 

కర్మ యోగం కర్మ ప్రధానమైనది, జ్ఞాన యోగం జ్ఞాన ప్రధానమైనది, భక్తవ యోగం భక్తిప్రధానమైనది. వీటిల్లో కూడా ప్రతీ యోగంలోనూ ఇతర యోగం యొక్క పాళ్ళు కూడా ఉంటాయి. కర్మ యోగి, భాగవాదారపణతో కర్మలను నిర్వహిస్తాడు; జ్ఞాన యోగి జ్ఞానం ద్వారా ఆత్మ-అనాత్మ వివేకంతో యోగా సిద్ధిని సాధిస్తాడు; భక్తి యోగి లేవలం భగవంతుని  పట్ల ప్రేమను వృద్ధి చేసుకుంటూ యోగసిద్ధిని పొందుతాడు. 

వీటిల్లో రాజయోగం (మనోయోగం అని కూడా అంటారు)  యోగాల్లో రాజు వంటిదని, యోగములలో శ్రేష్ఠమైనదని ఆర్యులు చెప్పడం జరిగింది. శరీర వ్యవస్థలో మనస్సు లేక ఆలోచన అనేది రాజు వంటిది కాబట్టి, ఆ మనస్సుతో లేక ఆలోచనాశక్తి ద్వారా సిద్ధించే యోగాన్నే రాజయోగం అని నిర్వచించడం జరిగింది. 

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ పద్ధతి ఒక రాజయోగ ధ్యాన పద్ధతి
హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ అనే రాజయోగ పద్ధతి కర్మ, జ్ఞాన, భక్తి యోగాల సరైన మిశ్రమం. మనిషికి కర్మలొనర్చడం అనివార్యం. సాధకుడు చేసే ప్రతీ కర్మలోనూ, కర్మ, జ్ఞాన, భక్తి అనే ఈ మూడు అంశాలూ ఉంటాయి - యేమి చేయాలన్నది - కర్మ, ఎలా చేయాలన్నది - జ్ఞానం, ఎటువంటి భావంతో చేయయాలన్నది - భక్తి. ఈ మూడు అంశాలూ ఉన్న కర్మ పరిపూర్ణ కర్మ అవుతుంది. సహజ్ మార్గ్ లో ధ్యానం చేయాలన్నది కర్మ, యే విధంగా చేయాలన్నది జ్ఞానం, ఎటువంటి భావంతో చేయాలన్నది భక్తి. ఇది మనసుతో చేసే యోగం కాబట్టి, మనసును క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం కాబట్టి, ఆలోచనను ధ్యాన వస్తువుపై కేంద్రీకరిస్తాం కాబట్టి, దీన్ని రాజయోగ పద్ధతి అని అంటారు.   

6, నవంబర్ 2025, గురువారం

అస్థిత్వానికి సంబంధించిన ప్రశ్నలు

 


అస్థిత్వానికి  సంబంధించిన  ప్రశ్నలు 
Existential Questions

అస్థిత్వం అంటే మన ఉనికికి సంబంధించిన ప్రశ్నలన్నమాట. ప్రతి వ్యక్తిలో, ప్రతి ఆత్మలో సహజ సిద్ధంగా కలిగే ప్రశ్నలు; మనలోని జిజ్ఞాసకు నిదర్శనాలు; మనలో స్వతః సిద్ధంగా ఉండే తపన వల్ల కలిగే ప్రశ్నలు. ప్రతీ వ్యక్తికీ యేదొక దశలో సమాధానాలు దొరికే వరకూ వేధిస్తూ ఉంటాయి. అలాగే మన దృక్పథాన్ని విస్తృతం చేస్తాయి కూడా. చేతనను విస్తృతపరుస్తాయి. అవగాహన పెంచుతాయి. ఈ ప్రశ్నలే మనిషిని ఆధ్యాత్మికతకు దారి తీస్తాయి. ఈ ప్రశ్నలకు విశ్వజనీనంగా అందరూ అంగీకరించగలిగే సమాధానాలేవీ ఉండవు. ఎవరికి వారు తమ సమాధానాలు వారే శోధించి ఆత్మ బోధ ద్వారా తెలుసుకోవలసినదే. శాస్త్రాలు, గురువులు, మహాత్ములు వారి-వారి అనుభవ జ్ఞానం ద్వారా తెలుసుకున్నవి అందించి సహకరించగలరే గాని, నిజమైన సమాధానాలు అంతరంగంలో నుండి రావలసినదే. దీనికి ప్రతీ ఆత్మ స్వీయ మననం ద్వారా తపిస్తూ శ్రమించవలసినదే. దైవాన్వేషణ  లేక సత్యాన్వేషణ అంటే ఇదే. సత్యాన్వేషణలో కలిగే ప్రశ్నలు  ఇవే. ఈ ప్రశ్నలకు సమాధానాలు రానిదే ఆత్మకు నిద్ర పట్టదు. అస్సలు నిద్ర పట్టని ఆత్మలు మహాత్ములవుతారు. సాగటౌ మనిషిలో కూడా ఈ ప్రశ్నలుంటాయి గాని వీటికి ప్రాధాన్యతనివ్వడు. సంసార సాగరంలో పడిపోవడం మూలాన వీటి ప్రాధాన్యత అడుగుకి వెళ్ళిపోతూ ఉంటుంది. గురువు వచ్చి తట్టి లేపే వరకూ ప్రాధాన్యతలోకి రాదు. ఆ విధంగా మేల్కొన్న వ్యక్తి ఆధ్యాత్మిక సాధకుడవుతాడు. జీవిత పరమార్థం ఇదేనని తెలుసుకుంటాడు. 

సాధారణంగా కలిగే కొన్ని ప్రశ్నలు:
జీవితం యొక్క అర్థం ఏమిటి? ప్రయోజనం యేమైనా ఉందా?
మనుషులు కష్టాలెందుకు పడాలి? వాటి ప్రాముఖ్యత ఏమిటి?
మనం ఎందుకు పుట్టాం? ఎందుకు చనిపోతాం? పుట్టుకకు, చనిపోవడానికి మధ్య మనిషి యేమి చెయ్యాలి? లేక చనిపోయే వరకూ బ్రతకవలసిందేనా? యేమైనా ప్రయోజనం ఉందా? చనిపోయిన తరువాత ఏమవుతుంది? మనం ఎక్కడి నుండి వచ్చాం? అసలు 'నేను' అంటే ఎవరు?

ఈ ప్రశ్నలకు పరిష్కారం 
వీటికి ప్రతి మనిషి తర్కపరంగా సమాధానాలు వెతుక్కున్నప్పటికీ, నిజమైన పరిష్కారం అనుభవపరంగా తెలుసుకోవలసినదే; దాన్నే మనం ఆత్మ సాక్షాత్కారం లేక దైవ సాక్షాత్కారం అంటూంటాం.  

30, అక్టోబర్ 2025, గురువారం

మూడు పరిచయాత్మక సిట్టింగుల ప్రాముఖ్యత ఏమిటి? - దాజీ

 


పైన వీడియో లింక్ ను క్లిక్ చెయ్యండి - దాజీ ఆంగ్ల ప్రసంగం 

మూడు పరిచయాత్మక సిట్టింగుల ప్రాముఖ్యత ఏమిటి? - దాజీ 
నా దృష్టిలో ఈ మూడు పరిచయాత్మక ధ్యాన సిట్టింగులు మనలను ఎన్నో రకాలుగా తయారు చేస్తాయి. దిశానిర్దేశనం చేయడం లాంటిది ఈ ప్రక్రియ. మొదటి రోజు ధ్యానించడం ఎలాగో నేర్పించడం జరుగుతుంది. రెండవ రోజు మనలను మనం యే విధంగా శుద్ధీకరించుకోవాలి అనేది నేర్చుకుంటాం. మూడవ రోజు ఆ భగవంతునికి ప్రార్థన యే విధంగా నివేదించాలన్నది తెలుసుకుంటాం.

ధ్యానంలో మనం ఎప్పుడూ మాట్లాడుకునే ప్రాణాహుతిని ఎలా అందుకోవాలి, మన హృదయాన్ని ఆ ప్రసరణను అందుకునే విధంగా ఎలా ఉంచుకోవాలి? అయితే మన పరాశిక్షకులు, మన ట్రైనర్ మన హృదయం అవసరమైనప్పుడల్లా ఈ ప్రాణాహుతిని అందుకునేలా మనపై ఆధ్యాత్మిక కార్యాన్ని చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఈ ప్రక్రియ తనంతతానుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు అర్థరాత్రి రెండు గంటలకు మీకు ధ్యానం చేయాలనిపించిందనుకోండి. అప్పుడు కళ్ళు మూసుకొని ప్రాణాహుతిని ఆవాహన చేశారనుకోండి. వెంటనే ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకోవడం ప్రారంభిస్తారు. ఇదంతా ఆ మూడు పరిచయాత్మక  సిట్టింగుల ప్రభావమే. రెండవ విషయం ఏమిటంటే ఈ సిట్టింగులు మనలను ఆ మూలంతో అనుసంధానం చేస్తాయి. మరొక విష్యయం ఏమిటంటే, మనం శుద్ధీకరణ చేసుకునే ముందు చేసుకునే సంకల్పం – “నాలోని జటిల తత్త్వాలు, మలినాలు నా వ్యవస్థలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాయన్న సంకల్పం పని చేయడం ప్రారంభిస్తుంది ఈ మూడు సిట్టింగుల వల్ల. ఆ విధంగా మనలను మనమే ఈ శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా సరళంగా, శుద్ధిగా తయారవ్వాలన్న ఆదేశాన్ని ఇచ్చుకోగలిగే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇక ప్రార్థన. ప్రార్థన నా దృష్టిలో, సహజ్ మార్గ్, హార్ట్ఫుల్నెస్ దృష్ట్యా మనం భగవంతుడిని యేమీ అడగటం లేదు. కేవలం నీవే నా జీవిత యదార్థ లక్ష్యం అంటున్నాం అంతే. నన్ను లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా అడ్డు పడుతున్నది కేవలం నా కోరికలే. నాకు అవరోహయలుగా ఉన్నవి ఇవే. దానికి పరిష్కారం కేవలం నీవు మాత్రమే; నన్ను ఈ పరిస్థితి నుండి బయటకు తీయగల శక్తివి, దైవానివి నీవు మాత్రమే అంటున్నాం అంతే. తద్వారా మనలను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నావేమిటో మనం గుర్తిస్తున్నాం; అలాగే మనలను ఈ స్థితి నుండి విముక్తిని కలిగించడంలో భగవంతుని పాత్రను కూడా మనం గుర్తిస్తున్నాం. అలా మనం ముందుకు సాగుతూ ఉంటాం.

ప్రార్థన నా దృష్టిలో, శ్రేష్ఠంగా ఎప్పుడుంటుందంటే మన హృదయం శూన్యంగా ఉన్నప్పుడు; శూన్యం అంటే యేమీ లేనప్పుడు, యే కోరికాలూ లేనప్పుడు. నాకు భగవంతుని వద్ద నుండి యేమీ కోరడం లేదు; యేమీ వద్దు కూడా; కానీ నాకు కావలసినది కేవలం నువ్వు మాత్రమే; అది మాత్రం నిరాకరించకు ప్రభూ అని అనడం. అంతే. మనం గనుక అటువంటి అపరిమితమైన శూన్యాన్ని మన హృదయంలో సృష్టించుకున్నట్లయితే, ఆయన తనంతట తానే దిగి వస్తాడు. ఆ శూన్యం గనుక కొంచమే ఉన్నట్లయితే ఎంత ఆహ్వానించగలం? మనం గనుక భగవంతుని అపరిమితుడిగా భావించినట్లయితే, మనం సృష్టించుకునే శూన్యత కూడా అపరిమితంగానే ఉండాలి. ఇందులో కొంచెం కూడా రాజీ పడటానికి లేదు; కాస్త కూడా హృదయంలో చెత్త ప్రోగవకూడదు. చివరికి గాఢమైన భక్తి కూడా అడ్డు పడొచ్చు. అయినా అక్కడ మనం జోక్యం చేసుకోం. అవి ప్రారంభదశలో అనుసరించే మార్గాలు కాబట్టి. మనం వాళ్ళని ఆపం. మనం ప్రస్తుతం చేస్తున్న ధ్యానం కూడా చివరిలో అవరోధంగా మారుతుంది. కానీ మనం ఆ విషయానికి తరువాత వద్దాం. ప్రస్తుతాయికి ధ్యానం మనం అక్కడికి చేరుకునే సాధనంగా తీసుకుందాం; ఆ తరువాత చివరికి ధ్యానానికి కూడా వీడ్కోలు పలుకుతాం; మన యాత్రలో యేదొక దశలో అన్నీ ఆగిపోవలసిందే. మీఋ ఆ స్థాయికి చేరుకున్నప్పుడు మీకు తప్పక తెలుస్తుంది.

సత్సంగ్ ప్రాశస్త్యం

సత్సంగ్ ప్రాశస్త్యం    సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా ...