21, మార్చి 2025, శుక్రవారం

ఇప్పుడే, ఇక్కడే

ఇప్పుడే, ఇక్కడే 

84 లక్షల యోనుల  గుండా ప్రయాణం పూర్తయిన తరువాత, కనీసం 84 లక్షల జన్మల తరువాత మానవజన్మ అంటారు పెద్దలు; అందుకే మనుష్యత్వం దుర్లభం అంటారు ఆది శంకరులు. 

అలా  ఎందరో మానవులు ఈ భూమ్మీద జన్మించారుఇంత  మంది మానవుల్లో ఒక  ఆలుమగల జంట  ఏర్పడటంవాళ్ల కలయికలో ఎన్నో లక్షల పురుష వీర్యకణాల్లో  ఒక్క వీర్యకణం ఎన్నో లక్షల స్త్రీ అండాలలోని  ఒక అండంతో ముడిపడి ఒక పిండం తయారవడంతల్లి గర్భంలో ఆ పిండం పెరగడంఆ పిండంలోకి మూడు మాసాలకు ఆత్మ ప్రవేశించడంనవమాసాల తరువాత పిండం మానవ శిశువుగా ఆవిర్భవించడం జరిగిపోతున్నది.

ఆ ఆత్మ ఎక్కడి నండి వస్తుందో, దాని ప్రయాణం ఎక్కడికో యేమీ తెలియదు కదా!!!

అక్కడి నుండి ప్రారంభమవుతుంది మనిషిపై అనేక పొరలు ఏర్పడటం; యే  విధంగా? మొదట  ఆడబిడ్డా, మగ  బిడ్డా అని అడుగుతాం లింగం

ఆ తరువాత తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నడా అంటాం రంగు.

ఆ తరువాత జాతి, కులం, భాష, మతం. ఇదంతా బిడ్డ పుట్టగానే మనకు ఏర్పడిపోతాయి. ఇక  జీవితాంతం ఇవి మన  తోడుగానే ఉంటాయి; వీటిల్లో కొట్టుకుంటూఎ మన జీవితం తరచూ కడతేరుతూ ఉంటుంది.

మనం మనిషి బిడ్డగా జన్మించావన్న సత్యాన్నే మరచిపోతాం.

వాటితోనే మన మనుగడను కొనసాగిస్తూఁటాం. అసంపూర్ణంగా మిగిలిపోతాం.

మనలను మనం యథాతథంగా ఈ పొరల మాటున ఉన్న అసలు తత్త్వాన్ని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం అంటే బహుశా; దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు పెద్దలు.

చిక్కు ఏమిటంటే ఇది తెలుసుకునే వరకూ ఆత్మకు నిద్ర పట్టదు, యేదో తెలియని పూడ్చలేని వెలితి, యేదో చెప్పలేని తీవ్ర అసంతృప్తి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అని కూడా అంటారు పండితులు. ఈ దాహాన్ని తీర్చడమే మానవ జన్మ ప్రయోజనమేమోనని అనిపిస్తూ ఉంటుంది.  

 ఇవి ఉన్నంతవరకూ మనిషిలో వికాసం జరిగే అవకాశం ఉన్నట్లే. ఇది లేకపోతే మాత్రం, ఆదిశంకరులు చెప్పిన పునరపి జననం, పునరపి మరణం తప్పకపోవచ్చు. అలా ఎన్ని జన్మలో!!, 84 లక్షల జీవరాసుల్లో ఎక్కడ జన్మిస్తామో!! ఎవ్వరికీ తెలియదు.

అందుకే ఇప్పుడే, ఇక్కడే పని పూర్తయిపోవాలంటుంది ఆధ్యాత్మికత. మహర్షులు, అవతారా పురుషులు, మహాత్ములెందరో కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. పరిష్కార మార్గాలు చూపించారు, చూపిస్తున్నారు, బహుశా భవిష్యత్తులోనూ చూపిస్తూనే ఉంటారు కూడా.

ఈ పరిష్కార మార్గాలే మనకు మత గ్రంథాలుగా, వివిధ సాంప్రదాయాల ఆధ్యాత్మిక పద్ధతులుగా, శాస్త్రాలుగా భూమ్మీద మనకు అందుబాటులో ఉన్నాయి. 

మరల మనిషి అసలు అన్వేషనఊ మరచిపోయి వీటిని తనకున్న పరిమితమైన శక్తులతో అర్థం చేసుకోవడానికి సతమతమవుతూ ఉంటాడు. తనను తాను ఈ శబ్దారణ్యంలో, తెలివితేటల వలల్లో, వాదోపవాదాల్లో, పడిపోయి, ప్రామాణికమైన అన్వేషణ అంతర్ముఖంగా చేసే అన్వేషణేనని తెలుసుకునే సరికి జీవితం గడచిపోతుంది; అప్పటి వరకూ బహుశా అసలైన మార్గం తటస్థం కూడా కాదేమోననిపిస్తుంది; ఎందుకంటే తటస్థమైనా మనకు మనం ఉన్న పరిస్థితుల్లో గుర్తించడం జరగదు. 

ఒక్కసారి అటువంటి ఆధ్యాత్మిక పాఠము, అటువంటి సమర్థుడైన గురువు తటస్థించినప్పుడు, హృదయంలో అపరిమితమైన ప్రశాంతతను అనుభూతి చెందడం జరుగుతుంది. అప్పుడు, ఇప్పుడే, ఇక్కడే మన జీవిత పరిష్కారం ఉందని ప్రామాణికంగా హృదయానికి స్పష్టమవుతుంది. అక్కడి నుండి అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. 

7, మార్చి 2025, శుక్రవారం

గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ - భారత మండపం - న్యూఢిల్లీ - ఫిబ్రవరి 21, 2025

 


గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ 
భారత మండపం - న్యూఢిల్లీ
ఫిబ్రవరి 21, 2025


పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ (PSSM) 2025, ఫిబ్రవరి 20 నుండి 23, వరకూ న్యూఢిల్లీలోని  ప్రతిష్ఠిత భారత మండపంలో, గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21, 2025 న హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో పూజ్య దాజీ ధ్యానాన్ని గురించి ప్రసంగం చేయడం, ఆ తరువాత అక్కడున్నవారికి, ధ్యానం యొక్క అనుభూతిని కలుగజేయడం జరిగింది. 

ప్రసంగంలో పూజ్య దాజీ పలికిన ముఖ్య  పలుకులు ఇలా ఉన్నాయి: 
నన్ను ధ్యానం మీద ముఖ్యంగా నిశ్శబ్దంగా జరుగుతున్న చైతన్య వికాసాన్ని గురించి, అంతరంగ శాంతిని గురించిన సైన్సును, అంతరంగ పరివర్తనకు సంబంధించిన విజ్ఞానాన్ని గురించి మాట్లాడమన్నారు మన నిర్వాహకులు. అదీ 4 నిముషాల్లో! నా పరిస్థితి మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణుడి పరిస్థితిలా ఉంది. 18 అధ్యాయాలు 5 నిముషాల్లో చెప్పవలసిన పరిస్థితి ఒకవైపు యుద్ధానికి సన్నద్ధంగా ఇరువైపులా సేన మధ్య ఉన్న పరిస్థితిలా ఉంది. ఇరు పక్షాలూ ఒకర్నొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అర్జునుడు యుద్ధం చేయడం నా వల్ల కాదంటాడు. కృష్ణ భగవానుడు నిస్సహాయుడుగా నిలబడ్డాడు. ఈ మూర్ఖుడి అర్థమయ్యేలా ఎలా చెప్పడం అని అనుకుంటూ. నన్ను ఇక్కడ చైతన్య వికాసం గురించి, అంతరంగ పరివర్తనను గురించి మొత్తం అంతా 4 నిముషాల్లో చెప్పమన్నారు, నిర్వాహకులు నన్ను క్షమించాలి, ఈ పనికి మీరు పొరపాటు వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు మీరు. ఇది సాధ్యపడే వకాశం కూడా ఉండేది; కానీ వినేవాళ్ళు అర్జునుడిలా ఉండి, చెప్పేవాడు శ్రీకృష్ణుడిలా ఉండుంటే కొద్ది నిముషాల్లోనే ఇది సాధ్యపడుండేది.  కానీ దానికి ప్రాణాహుతి అవసరం. అర్జునుడి మానసిక స్థితిని మార్చడానికి, ఆతని చేతనంలో పరివర్తన తీసుకురావడానికి ఆయనకు ప్రాణాహుతి అవసరం అయ్యింది. ఆ విధంగా అతన్ని యుద్ధానికి సన్నద్ధం చేశాడు. 
ముందు ధ్యానం అంటే ఏమిటో నిర్వచనం చేయాలి. ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటో కూడా తెలియాలి. ఈ చేతనం అంటే ఏమిటి? కాబట్టి మనం ముందుగా ధ్యానం యొక్క ప్రయోజనంతో మొదలు పెడదాం. సరళంగా చెప్పాలంటే చైతన్య వికాసమే ధ్యానం యొక్క లక్ష్యం. మనకి మూడు శరీరాలున్నాయి - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరలో మనకున్న ఆయుష్షులో వికాసం జరగడం కుదరదు. అందులో వికాసం రావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆత్మ, వికాసం చెందనవసరం లేదు. అది స్వఛ్ఛమైనది, మార్పులేనిది, నాశనం లేనిది. ముందే పరమ స్వచ్ఛంగా ఉన్నది మారడం గాని వికాసం చెందడం గాని ఎలా జరుగుతుంది? అవసరమే లేదు. కాబట్టి మార్పు చెందేది కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే. సూక్ష్మ శరీరంలోని ప్రధాన భాగం చేతనం అనే నది. ఈ చేతనానికి, మనసు, బుద్ధి, అహంకారము సహాయపడతాయి. 
మనం ఈ మనసు, బుద్ధి, అహంకారాలను, చేతనాన్ని ప్రభావితం చేసేలా  మార్చాలనుకున్నప్పుడు ఇవి యే విధంగా పరివర్తన చెందేలా చేయాలి?  తద్వారా ఈ చేతనం, అధిచేతనం అనే ఆకాశంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా, ఉపచేతనం అనే మహాసముద్రం లోలోతుల్లోకి మునక వేసేలా వికాసం చెందడానికి ప్రభావితం అవ్వాలంటే ఏమి చేయాలి? 
మనసు వికసించినప్పుడు, మనసు పరిణతి చెందినప్పుడు, అది చేసే పనిలో కూడా పరిణతి రావాలి. మనసు చేసే పనేమిటి? ఆలోచించడం. కాబట్టి మనసు వికాసం చెందినప్పుడు ఆలోచన కంటే మెరుగైన విధంగా మారాలి; ఆలోచన కంటే మెరుగైనాడేది? యంభూతి. మనసు అనుభూతిగా వికాసం చెండాలి. మెదడుతో ఆలోచించడం కంటే హృదయంతో అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అది ధ్యానంతో సాధ్యం. 
ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం అనే సాంకృత పదాన్ని, ఈ సంధిని విడగొడితే, ధీ + యానం అవుతుంది.  ఇక్కడ ధీ అంటే పరమోత్కృష్ట జ్ఞానం, లేక దివ్య జ్ఞానం. యానం అంటే  వాహనం; అంటే ధ్యానం అనేది దివ్యజ్ఞానానికి జేర్చే  వాహనం అన్నమాట. ధ్యానం అంటే అవ్యక్తంపై దృష్టిని కేంద్రీకరించడం. అయితే ప్రతీ వాహనానికి నడవాలంటే ఇంధనం అవసరం; ఇక్కడ ధ్యానంలోని యానానికి అవసరమైన ఇంధనం ఏమిటి? భౌతిక శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం, అంటే సమతౌల్య ఆహారం ఎలాగో, మనసుకు జ్ఞానం ఎలాగో, ఆత్మకు ఆహారం ప్రాణాహుతి శక్తి అలా  అవసరం.  నేను ఈ రోజు ఈ వేదిక నుండి ఉదఘోషిస్తున్నాను - ప్రాణాహుతి లేకుండా చైతన్య వికాసం అంగుళం కూడా  ముందుకు కదలదు. అందుకే ప్రాణహుతితో కూడిన ధ్యానం అందరికీ అవసరం. 
ఆ తరువాత ధ్యానంతో కార్యక్రమం ముగిసింది. 





7, జనవరి 2025, మంగళవారం

ఏకాత్మ అభియాన్ - హార్ట్ఫుల్నెస్

 


ఏకాత్మ అభియాన్ - హార్ట్ఫుల్నెస్ 

హార్ట్ఫుల్నెస్ సంస్థ 2024 వ సంవత్సరంలో ఆనాటి మధ్య ప్రదేశ్ ప్రభత్వ సహకారంతో ఏకాత్మ అభియాన్ పేరుతో, ఆ రాష్ట్రంలోని 42000 గ్రామాల్లో కోటి మందికి పైగా హార్ట్ఫుల్నెస్ ధ్యానం నేర్పించడం జరిగింది. ఈ మహా యజ్ఞంలో స్వచ్ఛందంగా ఎందరో ప్రశిక్షకులు, వలంటీర్లు భారత దేశ నలుమూలల నుండి వచ్చి నెలరోజులకు పైగా నిస్స్వార్థ సేవలనందించడం జరిగింది. 

అటువంటి కార్యక్రమమే ఈసారి, తెలంగాణాతో సహా మరో ఎనిమిది రాష్ట్రాలలో ఒక సంవత్సరంపాటుగా చేయాలని సంస్థ సంకల్పించింది. ఇందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రకటన పూజ్య దాజీ జనవరి 1 వ తేదీన చేస్తూ, ఆసక్తిగల అభ్యాసులను, ప్రశిక్షకులను, అందరినీ ఈ యజ్ఞంలో పాల్గొనమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అందరికీ ఒక ముఖ్య సూచన చేశారు: "అందరినీ శ్రీరామ చంద్ర మిషన్ సభ్యులుగా చేయడం మన లక్ష్యం కాదు. వారు నమ్ముతున్న దైవాన్ని, ధ్యానం ద్వారా అనుభూతి చెందవచ్చని, ఆ అనుభవాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయడం. " ఇది మనందరి మనసులో ఉంచుకుంటూ పని చేద్దాం.  

కావున   అటువంటి ధ్యానానుభూతిని తెలంగాణాలోని అన్ని  గ్రామాల్లో ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయడానికి మనందరమూ మనకున్న భక్తిప్రపత్తులతో, ఉత్సాహంగా పాల్గొందాం; రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుదాం.    



1, జనవరి 2025, బుధవారం

ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం

 



ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం 

పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అద్భుత ప్రకటన చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2025 లో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సమర్థగురు శ్రీ రామ చంద్రజీ మహారాజ్ (పూజ్య లాలాజీ ), శ్రీరామ చంద్ర మిషన్ ఆదిగురువుల వార్షిక జన్మదినోత్సవాన్ని ఈసారి ఆది శక్తి మహోత్సవంగా జరుపుకోబోతున్నామని ప్రకటించారు. దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం అమలులో ఉన్న విద్యను, తరువాతి తరాల వారికి ఆ అందించడానికి వారసులు ఎవరూ లేక కాలగర్భంలో కనుమరుగైపోయిన  ప్రాణాహుతి ప్రసరణ విద్యను పునరుద్ధరించిన మహాత్ముడు  పూజ్య లాలాజీ మహారాజ్. ఆయన జన్మదినాన్ని అంటే ఫిబ్రవరి 2 వ తేదీన మనం ఆదిశక్తి మహోత్సవంగా జరుపుకోబోతున్నాం. 

ప్రాణాహుతి శక్తే ఈ ఆది శక్తి సృష్టి ఆరంభానికి పూర్వం ఉన్న శక్తిని ఆది శక్తి అని దాజీ తెలియజేయడం జరిగింది. మరొక సందర్భంలో ఈ ప్రాణాహుతి  ప్రసరణతో ఆధ్యాత్మిక శిక్షణానందించిన మహర్షి పేరు  కూడా పూజ్య దాజీ ఋషభ్ నాథ్ అని కూడా సూచించడం జరిగింది.  

ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారానే హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ్ ఆధ్యాత్మిక శిక్షణ అందించడం జరుగుతూ ఉంది. ప్రాణాహూతితో కూడిన  ధ్యానమే హార్ట్ఫుల్నెస్ విశిష్టత. ప్రాణాహుతి శక్తి లేక ఈ ఆది శక్తి, మూలం నుండి ఒక ఉత్కృష్ట స్థాయి యోగి హృదయం ద్వారా ధారగా ప్రవహించే శక్తి. 

ప్రాణాహుతి ఆత్మను మూలంతో అనుసంధానం చేస్తుంది ఆత్మకు మూలం యొక్క అంజుభూతిని కలిగించడం ద్వారా మూలాన్ని గుర్తు చేస్తుంది; మూలానికి తిరుగు ప్రయాణమయ్యేలా హృదయ పరివర్తన కలిగిస్తుంది. సంస్కార బీజాలను దగ్ధం చేస్తుంది. వికారాలను నశింపజేస్తుంది; చంచల మనస్సును క్రమబద్ధం చేస్తుంది; మానసిక ప్రశాంతతనువృద్ధి చేస్తుంది; కోరికలను తగ్గిస్తుంది. దివ్యప్రేమను, పరిశుద్ధ ప్రేమను, అకారణ ప్రేమను, అనుభవంలోకి తీసుకువస్తుంది. ఆత్మను ఆవరించి ఉన్న కలుపుమొక్కలను తొలగిస్తుంది; ఉన్నతోన్నత చేతనాస్థితుల అనుభూతిని కలిగిస్తుంది; అలుముకున్న అంధకారాన్ని నిర్మూలిస్తుంది; ఆహాన్ని వినమ్రతగా మారుస్తుంది; జీవితాలను శుద్ధి చేసి, సరళం చేస్తుంది. 

ఈ మహత్తర ఆది శక్తి మహోత్సవానికి ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరూ విచ్చేసి ప్రాణాహుతి వృష్టిని అనుభూతి చెందుదురుగాక. 



28, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 3

 


ధీశక్తి - ధ్యానం - 3 

సంకల్పం 
(Will, Suggestion)  
ఆధ్యాత్మిక సందర్భంలో సంకల్పం అంటే ఇచ్ఛాశక్తితో కూడిన ఆలోచన. 
ఆలోచన + ఇచ్ఛాశక్తి = సంకల్పం 
సంకల్పాలు లేనిదే యేమీ జరగవు జీవితంలో. ఈ సూత్రం మామూలు సాంసారిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా వర్తిస్తుంది. వాడుక భాషలో చెప్పుకోవాలంటే సంకల్పం అంటే మనసులో అనుకోవడం. మనసులో అనుకోకుండా ఏ పనీ చేయలేం. ఉదాహరణకు ఉదయం  గంటలకు లేవాలి అని మనసులో రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటేనే మనం ఆ సమయానికి లేవగలుగుతాం. మన శరీర వ్యవస్థ లేదా ప్రకృతి విచిత్రంగా ఈ సంకల్పానికి స్పందిస్తుంది. ఇది మనందరి అనుభవమే. అనుకుంటే జరిగి తీరుతుంది. సంకల్పం ఎంత దృఢంగా ఉంటే , ఎంత పవిత్రమైనదైతే  అంతా త్వరగా నెరవేరుతుంది. 
సాంసారిక జీవనంలో Think, Do, and  Achieve అంటారు. అంటే సంకల్పించుకోవడం, సంకల్పం పనిగా తర్జుమా కావడం, ఆ తరువాత సంకల్పించినదాన్ని సాధించడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక జీవనంలో Think and Achieve అంటే సంకల్పం చేసుకోగానే, సాధించడం జరుగుతుంది అని అనేవారు చారీజీ. అందుకే హార్ట్ఫుల్నెస్ ధ్యానసాధనలో ధ్యానం ప్రారంభించే ముందు ఒక సంకల్పం చేస్తాం, ఆ సంకల్పమే ధ్యానంగా మారిపోతుంది. 

అయితే ఈ సంకల్పం ఎంత సూక్ష్మంగా చేసుకోగలిగితే అంత శక్తివంతంగా, అంతా త్వరితంగానూ సాకారమవుతుంది. సంకల్పం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నట్లయితే అటువంటి సంకల్పాన్ని దివ్య సంకల్పం అని అంటాం. అటువంటి సంకల్పాలు వెనువెంటనే సాకారమవుతాయి. మన సాధన అంతా కూడా మన సంకల్పాలు దివ్య సంకల్పాలుగా మారే దిశగానే కొనసాగాలి. 

సంకల్పంలో పవిత్రతా భావం, సూక్ష్మ ఆలోచనా శక్తి, తగినంత  ఇచ్ఛాశక్తి కీలకం. మనిషి సంకల్పం, దైవసంకల్పానికి అనుగుణంగా ఉన్నప్పుడు అవి నెరవేరుతాయి. దీనికి ఆధ్యాత్మిక సాధన కీలకం. అప్పుడు జీవితమే దైవసంకల్పానికి అనుగుణంగా నడుస్తూ ఉండే అవకాశం ఉంటుంది. 

(సశేషం ...)


27, డిసెంబర్ 2024, శుక్రవారం

ధీశక్తి - ధ్యానం - 2

 


ధీశక్తి  - ధ్యానం - 2 

ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
ఆలోచనల మూలం ఏమిటి? ఆలోచనలు మన సంస్కారాల మూలాన లేక మన కర్మల వల్ల, వాసబాల వల్ల వస్తూంటాయి. ఇవి మామూలు ఆలోచనలు అవే చర్యలుగా మారి అవే ముద్రల్లా  ఏర్పడి, పదే పదే  అవే పనులు చేయడం వల్ల ప్రవృత్తుల్లా, లేక సంస్కారాలుగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్కారాలే మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఇలా మనం సంస్కారాల బరువును తగ్గించుకవడం పోయి పెంచుకుంటూ ఉంటాం. తద్వారా ఇవన్నీ ఖర్చవడం కోసం మళ్ళీ-మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటాం. కాబట్టి సంస్కారాల వల్లే ఆలోచనలు వస్తాయి, ఆలోచనల వల్లే సంస్కారాలు ఏర్పడటం, జరుగుతూ ఉంటుంది. మొక్క ముందా, విత్తు ముందా అనే పరిస్థితి. కొత్త సంస్కారాలు ఏర్పడకుండా కాపాడే కవచమే ధ్యాన స్థితి. ఇది ధ్యానం అల్లే సాధ్యం. ఆలోచనలకు అతీతంగా తీసుకువెళ్ళేదే ధ్యానం.

స్థూల ఆలోచనలు, సూక్ష్మ ఆలోచనలు, దివ్య ఆలోచనలు 
మనిసజీకవచ్చే ఆలోచనలు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. 1) స్థూల ఆలోచనలు అంటే బరువైన ఆలోచనలు, నకరాత్మకమైన ఆలోచనలు, సాంసారిక ఆలోచనలు, 2) సూక్ష్మ ఆలోచనలు అంటే తేలికైన ఆలోచనలు, శాంతిని కలిగించేవి, హాయిని కలిగించేవి, సృజనాత్మకమైన ఆలోచనలు, 3) దివ్య ఆలోచనలు అంటే పై రెండూ ఆలోచనలు కంటే అత్యంత తేలికైనవి, అలౌకిక ఆనందాన్ని, ఆత్మసుఖాన్ని కలిగించేవి. 
అందుకే ఎప్పుడూ దివ్య ఆలోచనలు కలిగేటువంటి వాతావరణాన్ని అంతరంగంలో సృష్టించుకునే ప్రయత్నంలో ఉండాలి మనిషి. ధ్యానం ద్వారాన్నే ఈ అంతరంగ వాతావరణాన్ని మార్చవచ్చు. 
 
(సశేషం ...)


21, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 1

 


ధీశక్తి  - ధ్యానం - 1  

ప్రతి మనిషికి అందుబాటులో ఉండే అత్యద్భుత శక్తి ధీశక్తి లేక ఆలోచనా శక్తి. ఆలోచన లేకపోతే సృష్టి లేదు; ఆలోచన లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఆలోచన లేకపోతే యే  పనీ చేయలేము. 

ఆలోచన కాంతి కంటే వేగమైనది; మనోవేగం అంటాం. యే వస్తువుతోనైనా, ఆ వస్తువు మన అనుభవంలో ఉన్నా ఉండకపోయినా, చూసినా చూడకపోయినా ఆ వస్తువుతో ఆలోచన ద్వారా వెంటనే సంపర్కం ఏర్పరచుకోవచ్చు. అది వస్తువే కానక్కర్లేదు, భావమైనా కావచ్చు. ఉదాహరణకు మనం ఎప్పుడూ దైవాన్ని అనుభూతి చెందకపోయినా కూడా, ఆలోచన ఆ దైవ భావంతో అనుసంధానం ఏర్పరుస్తుంది. 

ఆ ఆలోచనను తదేకంగా అటువంటి భావంపై గాని, వస్తువుపై గాని దృష్టిని నిలపడమే ధ్యానం. దీన్నే ధ్యాన వస్తువు అని కూడా అంటారు. ఈ ప్రక్రియ వల్ల, దీన్ని పద్ధతిగా కొనసాగించడం వల్ల  ధ్యాన వస్తువు యొక్క సిద్ధి కలుగుతుంది. ఇదీ ఆలోచనకు, ధ్యానానికీ ఉన్న సంబంధం. 

అయితే ఆలోచనలకు స్వతహాగా యే శక్తి ఉండడంటారు బాబూజీ. మనం వాటిపై దృష్టిని నిలిపినప్పుడే వాటికి శక్తి లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాటిపై దృష్టి నిలపడం మానేస్తామో అవి వాటంతట అవే ఎండుటాకుల్లా రాలిపోతాయమటారు బాబూజీ. 

దృష్టిని నిలపడం 
మనం మన జీవితంలో గమనిస్తే అనేక సమస్యలుంటూ ఉంటాయి. సమస్యపై తగిన దృష్టిని నిలపడం ద్వారానే మనం ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటాం. ఆ విధంగా దృష్టి పెట్టనట్లయితే ఆ సమస్య అలాగే ఉండిపోవడమే గాక క్రమంగా జటిల సమస్యగా తయారవుతుంది. కాబట్టి సమస్య పరిష్కారానికి దానిపై దృష్టి నిలపడం అనివార్యం. 

అయితే జీవిత సమస్యకు పరిష్కారం కావాలంటే, దేనిపై దృష్టి నిలిపితే ఇది పరిష్కారమవుతుందో దానిపై నిలపవలసి ఉంది. ఆ ధ్యాన వస్తువునే హృదయంలో దివ్యమైన వెలుగు ముందే స్థితమై ఉందన్న భావం, అని అంటారు బాబూజీ. అందుకే సహజ మార్గ రాజయోగ ధ్యాన పద్ధతిలో జీవిత సమస్య పరిష్కారానికి హృదయంలో ఉన్న దివ్య ఉనికి అనే భావం పై ధ్యానిస్తాం. 

(సశేషం ...)



సత్సంగ్ ప్రాశస్త్యం

సత్సంగ్ ప్రాశస్త్యం    సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా ...