శ్రీ రాము మహంతి నిష్క్రమణ - అశ్రు నివాళి
శ్రీ రాము మహంతి నా జ్యేష్ట సోదర సమానులు. నాకు ఆత్మీయుడు. 36 యేళ్ళ సాన్నిహిత్యం. తోటి ఆధ్యాత్మిక యాత్రికుడు. అందరమూ శ్రీరామ చంద్ర మిషన్ లో ఆప్యాయంగా రాము భయ్యా అని పిలుచుకునే వాళ్ళం. భయ్యా ఈ నెలలో తన యాత్రలో ముందకు సాగుతూ ఈ భౌతిక ప్రపంచం నుండి నిష్క్రమించారు. వారికప్పటికి 76 సంవత్సరాలు. అందులో 40 సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనకు వెచ్చించారు. చాలా కాలం శ్రీ రామ చంద్ర మిషన్ లో ప్రశిక్షకునిగా, సహజ మార్గ ఆధ్యాత్మిక శిక్షకునిగా పని చేయడం జరిగింది. చాలా కాలం తెలుగు అనువాద సంపాదక బృందంలో చాలా కృషి చేశారు. ఆయన గొప్ప ప్రేరకుడు; ఎంతో మంది యువకులను ప్రేరణ కలిగించి ఈ సాధనలో నిలదొక్కుకునేలా చేసిన వ్యక్తి. 1985 లో సాధన ప్రారంభించారు. ఆయన ఒక ప్రశిక్షకుడన్న మాటతో స్ఫూర్తిని పొంది ఈ సాధన చేపట్టానని నాతో పంచుకోవడం జరిగింది. ఆయన అన్నదేమిటి? - life has to be lived differently - అని అన్నారట. ఆ క్షణం నుండి నాకు తెలిసి రాము భయ్యా ఆ ఎరుకతో ఆ తరువాతి జీవితాన్ని చివరిదాకా కొనసాగించడానికి ప్రయత్నించారు. తన గురుదేవులైన పూజ చారీజీ మహారాజ్ అంటే ఎడతెగని ప్రేమ, శ్రద్ధ, విధేయత కలిగిన వ్యక్తి. అత్యంత శ్రమ జీవి. ఆయనకి పగలు, రాత్రి బేధం ఉండేది కాదు సంస్థ పని చేయడానికి. ఏది, చలి, వర్షం ఇవేవీ అస్సలు అడ్డు కావు అతను పని చేయడానికి. ఇక ఎక్కడాయికయినా వెళ్ళవలసి ఉంటే అస్సలు దూరంతో, సామ్యంతో సంబంధం ఉండేది కాదు. చేతి గడియారం ఉన్నట్లు నేనెప్పుడూ చూడలేదు. చూసే అలవాటు లేదు.
ఆయన చుట్టూ ఎప్పుడూ సకారాత్మక వాతావరణమే ఉండేది. పాజిటివ్ వాతావరణం. ఎన్ని రకాల కస్టాలు చుట్టూ ముట్టి ఉన్నా అలాగే ఉండేవాడు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం అంటే ఎలాగో ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను. గుండెపోటును అధిగమించాడు, గొంతు క్యాన్సర్ ను అధిగమించాడు; ఎలా అధిగమిమచ్చాడో ఒక పుస్తకం కూడా వ్రాయడం జరిగింది. As a man thinketh - James Allen వ్రాసిన పూస్తాన్ని తెలుగులో అనువదించడం కూడా చేశారు రాము భయ్యా. సోదర భావాన్ని పెంపొందించే కల అతనిలో చూడట జరిగింది. అతి సరళంగా మనుషులతో కలిసిపోయేవాడు. ఒక కప్పు చాయ్ - టీ ఉంటే చాలు ఎంత పనైనా చేసేసేవాడు. భోజనం కూడా అక్కర్లేదు. రాము భయ్యా చాయ్ కి పర్యాయపదంగా మారిపోయాడు మాలో చాలా మందికి. ఇప్పటికీ చాయ్ త్రాగుతున్నప్పుడల్లా, ముఖ్యంగా దోమలగూడా ఆశ్రమంలో టీ త్రాగితిన్నప్పుడల్లా ఆయన స్మరణలోకి రాక మానడు నాకు. సోదరభావం పెంచడానికి ఆయన వాడే ఒక నెపంగా అనిపించేది నాకు.
వినమ్రుడు, నిగర్వి, సరళుడు, స్వచ్ఛ హృదయుడు రాము భయ్యా. తప్పక మన గురుపరంపర దివ్య సాన్నిధ్యంలో ఈ పాటికి వాళ్ళు అప్పగించిన యేదో పనిలో నిమగ్నమైపోయి ఉంటాడు. నేను వ్యక్తిగతంగా గొప్ప ఆసరాను కోల్పోయాను.
ఓం శాంతిః శాంతిః శాంతిః