31, జులై 2025, గురువారం

సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 1


సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 1 

అసతోమా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతజ్ఞ్గమయ.

తాత్పర్యము

అసత్యము నుండి సత్యము వైపుకు, అంధకారము నుండి వెలుతురు వైపుకు, మృత్యువు నుండి అమృతత్వము వైపుకు నడిపించు దేవా! 

- బృహదారణ్యక ఉపనిషత్తు 

ఓమ్ సహనావవతు సహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై. తేజస్వి నావధీతమస్తు  మా విద్విషావహై 
ఓమ్ శాంతిః  శాంతిః  శాంతిః 

తాత్పర్యము

ఈశ్వరుడు మనల నిరువురిని రక్షించుగాక, అతడు మనల నిరువురను పోషించుగాక, మనము గొప్ప శక్తితో (దివ్యబలముతో) కలసి పని చేయుదుముగాక. అధ్యయనముచే మనమిరువురము మేధా సంపదను పొందుదుముగాక, మన ఒకరినొకరు ద్వేషింపకుందుముగాక. శాంతి, శాంతి, శాంతి సర్వత్రా వుండుగాక. 

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 

తాత్పర్యము

అఖండ ప్రపంచాన్ని ఆకాశంలా వ్యాపించిన ఏ గురుతత్వమైతే 'తత్ 'అని పిలువబడే బ్రహ్మను దర్శింపజేసిందో, అట్టి శ్రీ గురువుకు నమస్కారము.

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః

తాత్పర్యము

అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.

గురుర్బ్రహ్మా  గురుర్విష్ణుః  గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
 ||

తాత్పర్యము

గురువే  బ్రహ్మ,  గురువే  విష్ణువు,  గురువే మహేశ్వరుడు. గురువు  మాత్రమే  పరబ్రహ్మ.  అట్టి  గురువుకు  నమస్కరిస్తున్నాను. 

స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమిః

తాత్పర్యం

దీర్ఘ కాలం అంతరాయం లేకుండగా గనుక శ్రద్ధాసక్తులతో  సాధన  చేసినట్లయితే దృఢమైన  పునాది  ఏర్పడుతుంది. 

విద్యార్థినా కుతోః సుఖం, సుఖార్థినా కుతో విద్యా,
విద్యార్థినా త్యజతే సుఖం
, సుఖార్థినా త్యజతే విద్యా. 

తాత్పర్యం

విద్యనర్థించేవాడికి సుఖం ఎక్కడుంటుంది, సుఖాన్ని కోరుకొనేవాడికి విద్య ఎక్కడుంటుంది? విద్యార్థి సుఖాన్ని వదులుకుంటాడు, సుఖాన్ని కోరుకొనేవాడు విద్యను వదులుకుంటాడు. 

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః,
ప్రారభ్య విఘ్న విహితా విరమంతి మధ్యాః
,
విఘ్నైః  పునః పునరపి ప్రతిహన్యమానాః
,
ప్రారభ్య చోత్తమ జనా న పరిత్యజంతి. 

తాత్పర్యం

విఘ్నాలు కలుగుతాయన్న భయంతో నీచులు నిశ్చయంగా పనిని ప్రారంభించరు; విఘ్నములున్నవని తెలిసిన తరువాత మధ్యములు విరమిస్తారు; విఘ్నాలు మాటిమాటికీ గొడ్డలి పెట్టులా కష్టాలు కలిగినప్పటికీ ఉత్తములు చేపట్టిన కార్యమును విడిచి పెట్టరు. 

ధర్మస్య ఫలమిచ్ఛంతి ధర్మం నేచ్చంతి మానవః |
పాపస్య ఫలం నేచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః || 

తాత్పర్యం

ధర్మము వల్ల కలిగే ఫలాన్ని కోరుకుంటాడు మానవుడు, కాని ధర్మంగా ఉండటానికి వెనుకాడతాడు. పాపము వల్ల కలిగే ఫలితాన్ని కోరుకోడు కాని పాపాన్ని స్వేచ్ఛగా ఆచరిస్తాడు.  

పిబంతి నదయః స్వయం ఏవ న అంభః స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః |
న అదంతి సస్యం ఖలు వారివాహా పరోపకారాయ సతాం విభూతయః ||   

తాత్పర్యం

నదులు వాటి నీరు అవి త్రాగవు; వృక్షాలు అవిచ్చే పండ్లు అవి తినవు; మేఘాలు తమ వల్ల వచ్చిన పంటలను అవి తినవు; అలాగే సజ్జనులు కూడా తమ ధనాన్ని పరోపాకారానికే ఉపయోగిస్తారు  

30, జులై 2025, బుధవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతం - బమ్మెర పోతన

 



శ్రీమదాంధ్ర మహాభాగవతం - బమ్మెర పోతన 

*

వ్వనిచే జనించు జగము; యెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరుడెవ్వఁడు; మూలకారణం
బెవ్వడు; అనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము తానేయైన వా
డెవ్వడు; వానిన్ ఆత్మభవున్  ఈశ్వరున్ నే శరణంబు వేడెదన్.


తా|| ఎవరి ద్వారా ఈ జగత్తు, ఈ సృష్టి సరుకిమపబడిందో, ఎవరి లోపల ఈ జగత్తు లీనమై ఉందో, ఎవరు యందు, ఇందు కూడా పరమేశ్వరుడై ఉన్నాడో, సరానికి మూలకారణం ఎవరై ఉన్నాడో, ఎవరు ఆది, మధ్యమ, అంతం లేకుండా ఉన్నాడో, ఎవరైతే సర్వమూ తానే అయి ఉన్నాడో; అటువంటి ఆత్మభవుడైన ఈశ్వరుడిని నేను శరణు వేడుతున్నాను.

 

పోతనామాత్యునిచే ఇవ్వబడిన భగవంతుని అద్వితీయమైన నిర్వచనం. మతాలతో సంబంధం లేని నిర్వచనం. భాగవతంలోని గజేంద్ర మోక్షం అధ్యాయం లోనిది. తెలుగు పిల్లలందరికీ తప్పనిసరిగా కంఠస్థం చేయించవలసిన ఉత్పలమాల పద్యం.  పైన వీడియోలో చిత్తూరు నాగయ్య గారు, భక్త పోతన సినిమాలో వారు ఈ పద్యాన్ని గానం ఎంత స్పష్టమైన ఉచ్ఛారణతో గానం చేశారో వింటే తనువు పులకరిస్తుంది. ఈ సినిమా నా దృష్టిలో, ప్రతీ అభ్యాసి             (సాధకుడూ)  తప్పక చూడవలసిన చిత్రం. 



29, జులై 2025, మంగళవారం

అష్టావక్ర గీత చిరు పరిచయం

 


అష్టావక్ర గీత చిరు పరిచయం  

ఇంచుమించుగా గీతలు సుమారు 100 రకాల గీతలున్నాయి. అందులో భగవద్గీత అన్నిటి కంటే ప్రాచుర్యంలో ఉన్నది. భగవద్గీత, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినది. అర్జునుడు కర్తవ్య బోధ తెలియక అజ్ఞానంలో గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు శ్రీ కృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని 18 అధ్యాయాల్లో అనేక విషయాలను మానవాళికి తెలియజేయడం జరిగింది. 

అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజుకు బోధించినదే అష్టావక్ర గీత. దీనినే అష్టావక్ర సంహిత అని కూడా అంటారు. ఇక్కడ జనక మహారాజు జ్ఞాని, అన్నీ తెలిసిన రాజర్షి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చిన బోధ ఈ గీత. వేదాంతంలో అతి ఉత్కృష్ట కోవకు చెందిన గ్రంథం. అష్టావక్రుడు సూటిగా, పరమసత్యాన్ని యే విధంగా తెలుసుకోవాలో సుస్పష్టంగా కుండ బడ్డలుకొట్టినట్లు చెప్పడం జరిగింది. 

అర్జునుడికి కలిగిన ప్రశ్నలు మనిషిలో కలిగినప్పుడే భగవద్గీత అర్థమవుతుంది. ఆ ప్రశ్నలు యేదొక దశలో ప్రతీ మనిషికీ కలుగుతాయి. అలాగే జనక మహారాజుకు కలిగిన ఉత్కృష్టమైన ప్రశ్నలు మనలను వేధించినప్పుడే అష్టావక్ర గీత బోధపడుతుంది. 

అష్టావక్రుడు ఇంచుమించు ప్రతీ శ్లోకంలోనూ సత్యాన్వేషణకు పరిష్కారాన్ని స్పష్టంగా సూచిస్తారు. ఈ గీత నిధిధ్యాసనకు సంబంధించిన గ్రంథం అని కూడా చెప్తారు. అంటే కేవలం శ్రవణానికి, మననానికి మాత్రమే గాక నిధిధ్యాసనకు ఎక్కువగా సమయాన్ని వెచ్చిపజేసే గ్రంథం. ఇతర శాస్త్రాలన్నీ శ్రవణం ద్వారా, ఆ తరువాత మననం ద్వారా (ప్రశ్నించుకుని అర్థం కూలంకషంగా తెలుసుకున్న తరువాత) పూర్తయిన తరువాత మాత్రమే, కేవలం నిధిధ్యాసన ద్వారా  సాక్షాత్కరించుకోగలిగే శాస్త్రం అని చెప్తారు.

ఉదాహరణకు మనం అష్టావక్ర గీతలోని ప్రారంభంలో ఉన్న రెండు  శ్లోకాలను అధ్యయనం చేస్తేనే, మనం ఇప్పటి వరకూ అష్టావక్రుని గురించి మాట్లాడుకున్న వారి తత్త్వం అవగతమవుతుంది. పూజ్య దాజీ ఈ గ్రంథం నుండి తరచూ ఈ శ్లోకాలను ఉటంకిస్తూ ఉంటారు. 
జనక ఉవాచ:
కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి |
వైరాగ్యం చ కథం  ప్రాప్తమేతద్  బ్రూహి మమ ప్రభో ||1-1||
జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి? ముక్తిని సాధించడం ఎలా? వైరాగ్య స్థితిని చేరుకోవడం ఎలా? దయచేసి తెలపండి ప్రభు!

అష్టావక్ర ఉవాచ: 
ముక్తిమిచ్ఛసి చేత్తాత్ విషయాన్ విషవత్త్వజ |
   క్షమార్జవదయాతోష సత్యం పీయూషవద్ భజ ||1-2||
నీవు ముక్తిని సాధించాలనుకుంటే విషయాలను విష తుల్యంగా భావించు నాయనా! సహనం, చిత్తశుద్ధి, కరుణ, సంతుష్టి, సత్యసంధత, వీటిని అమృత తుల్యంగా భావిస్తూ సాధన చెయ్యి.

నిజమైన సత్యాన్వేషకులు, ఆధ్యాత్మిక సాధకులు, జిజ్ఞాసువులు, తగిన సమయం వచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని తప్పక అధ్యయనం చెయ్యవలసినది. 






27, జులై 2025, ఆదివారం

దేవర్షి నారద - భక్తికి ప్రమాణం

 


దేవర్షి నారద - భక్తికి ప్రమాణం   
(☝ భక్తిపై ప్రసంగం కోసం ఇక్కడ పైన క్లిక్ చేయగలరు)
*
బ్రహ్మర్షి విన్నాం, రాజర్షి విన్నాం. నారద మహర్షిని దేవర్షి అంటారు. మన పురాణేతిహాసాల్లో  భక్తికి ప్రామాణికంగా కనిపించే వ్యక్తి నారద మహర్షి. మన చలన చిత్రాల్లో చూపించినట్లుగా ఒక కామిక్ ఫిగర్ కాదు; కలహాలు పెట్టేవాడు కాదు. ఒకవేళ పెట్టినా ఆ కలహాలు లోకకళ్యాణం కోసమే ఉద్దేశించే ఉండేవి. 

నారద అనే పదానికి అర్థం ఇలా చెప్తారు: నారం దదాతి ఇతి నారద. నారం అంటే నరుడికిచ్చేది అంటే ఆత్మజ్ఞానం. ద అంటే ఇవ్వడం; నారద అంటే ఆత్మజ్ఞానం ప్రసాదించేవాడు, అని అర్థం. నారా అంటే నారాధర్మం, మానవ ధర్మం అని కూడా అర్థం ఉంది. అత్యున్నత మానవ ధర్మం ఆత్మజ్ఞానం. 

వేదవ్యాసునికి శ్రీమద్భాగవతం వ్రాయడానికి ప్రేరణ నారద మహర్షే. ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, వాల్మీకి మహర్షికి ఆత్మజ్ఞానం ప్రసాదించినది నారడుడే. భగవంతునికి అతిప్రియమైనవాడు నారదుడు; నారాదుడునికి అతి ప్రియమైనవాడు భగవంతుడు, బాగవత ప్రియుడు. 
నారదుని వ్యక్తిత్వం: ఆయనను బ్రహ్మమానస పుత్రునిగా పురాణాలు చెప్తున్నాయి. అంతే కాదు, ఆయన గొప్ప ఆత్మ జ్ఞాని, భాగవత భక్తుడు, అందరి శ్రేయస్సు కోరేవాడు, అన్ని కళలూ తెలిసిన విద్వాంసుడు. ఆయనే వీణను కనిపెట్టారని చెప్తారు. భగవంతుడే స్వయంగా ఆయనకు వీణను ప్రదానం చేశారని కూడా చెప్తారు. ఆయన వీణ పేరు మహతి. 

ఆయనకు 14 లోకాలు సంచరించే వారం ఉంది. దేవతలే గాక, ఋషులు, మునులు, మహారాజులతో కూడిన మనుష్యలోకం, అసురులు, ఆశ్రమాలు అన్ని చోట్లా ఆయనను స్వాగతించేటువంటి వ్యక్తిత్వం వారిది. 

భక్తికి ప్రామాణిక గ్రంథాలు రెండే - నారద భక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు. కానీ నారద భక్తి సూత్రాలు చాలా ప్రసిద్ధి. 

ఈ గ్రంథంలో:
భక్తి దవభావం ఏమిటి? భక్తిని పెంపొందించుకోవడం ఎలా? భక్తిని చాటే లక్షణాలేమిటి? భక్తిని అలవరచుకోవడానికి చెయ్యవలసిన సాధనలేమిటి? భక్తి మార్గంలో కలిగే అవరోధాలేమిటి? వాటిని యే విధంగా అధిగమించాలి? భక్తిలో వివిధ స్థాయిలేమిటి? మన హృదయంలో భక్తి జాగృతమయ్యిందా, లేదా అనేది ఎలా తెలుస్తుంది? భక్తి హృదయంలోకి ప్రవేశించకుండా ఆపేది యేది? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? హెచ్చరికాలేమిటి? నేను భక్తి మార్గంలో ఉన్నా కూడా నేనెందుకు పురోగతి చెందడం లేదు? భక్తి ఎంతో ముఖ్యమైనదిగానూ, అలాగే అదే సమయంలో తేలికైనదిగానూ   ఎలా ఉంది? తక్కిన సాధనాలతో పోలిస్తే భక్తి సాధన ఎందుకని అంతా తేలిక? భక్తి లేకుండా ఇతర సాధనా పద్ధతులు సరైన ఫలితాలు ఎందుకని ఇవ్వవు? భక్తి అలవరచుకోవడం వల్ల ప్రయోజనాలేమిటి? 

పైన చెప్పిన ఈ అంశాలన్నీ ఈ గ్రంథంలో విస్తారంగా చర్చించడం జరిగింది. త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక సాధన చేసే సాధకులందరూ తప్పనిసరిగా అధ్యయనం చెయ్యవలసిన నిగూఢ ఆధ్యాత్మిక గ్రంథం - నారద భక్తి సూత్రాలు




26, జులై 2025, శనివారం

డా. అరుణ గారు ఒక ఆదర్శ అభ్యాసి

 


డా. అరుణ గారు ఒక ఆదర్శ అభ్యాసి
*
డా. అరుణ గారు హైదరాబాదులోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉండే గైనకాగిస్ట్ డాక్టర్, ఒక ఆదర్శ అభ్యాసి, మంచి మనీషి, గొప్ప సంఘసేవకురాలు. ఆమె తన వైద్య సేవలను ఆర్యన్ నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రి ద్వారా అందిస్తూండేవారు. చాలా కాలంగా ఈ ఆసుపత్రి ఇక్కడ జనానికి సేవలందిస్తూ ఉంది. అంటే కాదు, ఆమె హార్ట్ఫుల్నెస్ సంస్థలో స్వచ్ఛంద వైద్య సేవలు కూడా అందించేవారు. ఇది గాక ఇక్కడ స్థానిక హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రంలో ప్రతీ శనివారం నిరాడంబరంగా కిచెన్ లో కూరలు తరిగుతూ అందరి అభ్యాసుల మనసులను చూరగొన్న వ్యక్తి. ఎందరికో స్ఫూర్తి. 2010 నుండి శ్రీరామ చంద్ర మిషన్ అభ్యాసయిగా సాధన చేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి  2014  నుండి బాగా పరిచయం. క్రమం తప్పకుండా ధ్యాన సిట్టింగులకు మా యింటికి వస్తూండేవారు. వయసు పెద్దదైనా, సాధనలో తేడా రానిచ్చేవారు కాదు. మాస్టర్ గారి పట్ల విపరీతమైన భక్తి ప్రపత్తులుండేవి, తపన ఉండేది. ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. కొన్ని రోజుల క్రితమే కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. జూలై 25, 2025 న ఆమె తన దేహాన్ని చాలించారు. ఆమె ఆత్మ యొక్క అనంత యాత్ర, పూజ్య గురుదేవుల మార్గదర్శనంలో సునాయాసంగా ముందుకు సాగాలని ప్రార్థిస్తూ ... వారి కుటుంబ సభ్యులకు ఈ సమయంలో అవసరమైన మానసిక నిబ్బరం ఆ భగవంతుడు ప్రసాదించుగాక. 

25, జులై 2025, శుక్రవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - కొన్ని పలుకులు

 

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - కొన్ని పలుకులు 

పూజ్య గురుదేవులు చారీజీ నాకు వ్రాసిన లేఖల్లో నాలో ఏమాత్రం పరివర్తన రావడానికి కారణమైన కొన్ని మహత్తర వాక్యాలు. 

ప్ర: భౌతిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం రెండిటిపైన సమదృష్టి పెట్టి జీవించాలంటున్నారు. నా మనసు సహజంగా ఆధ్యాత్మికత వైపే మొగ్గుతోంది. నాకు చేతకావడం లేదు. దయచేసి మార్గదర్శనం చేయగలరు. 
చారీజీ: నీ సమయాన్ని సమంగా రెండు పార్శ్వాలపైన ఉంచడానికి ప్రయత్నించు. మనసు అధికంగా ఆధ్యాత్మిక వైపు మొగ్గుతూ ఉంటే అపపిడు భౌతిక జీవనంపై దృష్టి సారించు; అలాగే ఎక్కువగా భౌతిక జీవనం వైపు మొగ్గుతూ ఉంటే ఆధ్యాత్మికత వైపుకు మనసును మరల్చడానికి ప్రయత్నించు. 
నీ పురోగతికై ప్రార్థిస్తాను. 
ఆశీస్సులతో పార్థసారథి. 

ప్ర: పర్ఫెక్షన్ (పరిపూర్ణత) అంటే ఏమిటి?
చారీజీ: పరిపూర్ణత అంటే నా గురుదేవుల ప్రకారం, పరిపూర్ణ అంతరంగ సమత్వం. (Perfect inner balance )

ప్ర: భయాన్ని పోగొట్టుకోవడం ఎలా?
చారీజీ: నిరంతర స్మరణ ద్వారా భయాన్ని తొలగించుకోవచ్చు. దయచేసి ప్రయత్నించు. 

ప్ర: ప్రతీదీ విధిరాత ప్రకారమే జరిగేటప్పుడు ఇక మనిషి చేసేదేముంటుంది? 
చారీజీ: నుదుటిరాత లేక విధి అనేవి ఎవరికి వర్తిస్తాయంటే, ఎవరైతే తమ విధిని లేక నుదుటిరాతను మార్చుకోడానికి యే ప్రయత్నమూ చెయ్యరో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
నీ పురోగతికై ప్రార్థిస్తాను. 
ఆశీస్సులతో పార్థసారథి.  

ప్ర: నా భౌతిక జీవనంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. ఏమి చేయమంటారు?
చారీజీ: నీ భౌతిక పరిస్థితులు బాగుపడటం కోసం, జయాపజాయలను గురించి  ఆలోచించకుండా  నిరంతరం నీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. దీనికి మాస్టర్ పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి. 
నీ విజయం కోసం ప్రార్థిస్తాను 
పార్థసారథి. 

24, జులై 2025, గురువారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం -మహోన్నత వ్యక్తిత్వం


పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - మహోన్నత వ్యక్తిత్వం
 
పూజ్య గురుదేవులను చూస్తే మహోన్నత వ్యక్తిత్వం అంటే ఇదేనేమోననిపించింది. ఆయన భౌతిక సన్నిధిని నిరంతరం  కోరుకునేవాళ్ళు అభయాసులందరూ. వారి కాటేజ్ దగ్గరే వారి భౌతిక దర్శనం కోసం  పరితపిస్తూ ఉండేవారు అభ్యాసీలు. అంతటి దివ్యమంగళ విగ్రహం వారిది. దైవత్వం అణువణువునా ఉట్టిపడుతూ ఉండేది. ముఖంలో అనంతమైన ప్రశాంతత; దివ్య తేజస్సు; ఆరడుగుల ప్రకాశించే విగ్రహం; ఆజానుబాహుడు; వారి అందం వయసు గడుస్తున్నా కొద్దీ పెరుగుతూ ఉండేది. 

 అద్భుతమైన కంఠస్వరం; మొట్టమొదటిసారి వారి కంఠస్వరం విన్న తరువాత, నా చిన్నప్పటి నుండి విపరీతంగా వినాలనుకున్న స్వామి వివేకానంద కంఠస్వరం బహుశా ఇలాగే ఉండేదేమోననిపించింది. ఆ క్షణం నుండి ఆ కోరిక నా మనసులో నుండి దానంతట అదే తొలగిపోయింది. 

ఇక వారి ఆంగ్ల భాషపై పట్టు, అమోఘం; అద్భుతమైన అభివ్యక్తీకరణ; సరళమైన భాషా ప్రయోగం; అతి నిగూఢ విషయాలు చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యేలా చెప్పగలిగే పటిమ; పండితులకు, పామరులకూ సమానంగా అర్థమయ్యే విధంగా ఉండేవి వారి ప్రసంగాలు; చక్కని చమత్కారాలు, చమక్కులు; సందేశంతో కూడిన సున్నిత హాస్యం; వీటన్నిటికీ తోడు గంభీరమైన శ్రావ్యమైన కంఠస్వరం; చక్కని సంగీత జ్ఞానం; వేణుగానం చేసేవారు; ఆధ్యాత్మికతలోకి రాకపోయినట్లయితే వేణుగాన విద్వాంసుడనయ్యేవాడినని అంటూండేవారు; ఆ తరువాత పైన చిత్రంలో ఉన్నట్లుగా, ఈలపాటలతో అభ్యాసుల మనసులు రంజింప జేయడంతోపాటుగా వారిపై ఆధ్యాత్మికంగా పని చేసేవారు; చిన్నప్పటి నుండి విపరీతంగా పుస్తకాలు చదివేవారట. కంటి దృష్టి చిన్నప్పటి నుండి బలహీనంగా ఉండటంతో ఆడుకోగలిగేవారు కాదట; ఆ సమయాన్ని కూడా పుస్తకాలు చదవడానికి వినియోగించేవారట. అన్ని పుస్తకాలు చదివి అభ్యాసులకు వాటిని పిండినప్పుడు వచ్చిన రసాన్ని పంచేవారు. 

వారి సంభాషణా చాతుర్యం, పటిమ అద్భుతం; చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్థాయిలో మమేకమై, పెద్దవాళ్ళతో సంభాషించినప్పుడు వాళ్ళ స్థాయిలో, యువతతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్థాయిలో, శాస్త్రజ్ఞులతో మాట్లాడినప్పుడు వాళ్ళతో శృతిలో ఉంటూ ఒక గొప్ప శాస్త్రజ్ఞుడిలా  మాట్లాడుతూండేవారు. 

అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది వారికి; కొన్ని వేల మంది అభ్యాసుల పేర్లు గుర్తుంచుకోవడమే గాక వాళ్ళు చేసే పని ఎక్కడుంటారు వంటి వివరాలు కూడా వారికి జ్ఞాపకం ఉండేవి. అదెలా సాధ్యం అని అడిగితే, అది అసాధారణ శక్తి కాదు, కేవలం సంస్థ పట్ల నాకున్న ఆసక్తి వల్ల వచ్చిందనేవారు. ఇక వారి నిర్వహయణా సామర్థ్యాలు, తన గురుదేవుల సందేశాన్ని ప్రపంచం అంతటా వ్యాపింప జేయడంలో వారి సమర్థత, సుమారు 100 కు పైగా దేశాలలో వ్యాపింపజేశారు. 

ఇది గాక ఆయన జీవితకాలంలో సహజ మార్గ సాంప్రదాయంలో నాకు తెలిసి బహుశా 3000 కు పైగా వివాహాలు వారి చేతులు మీదుగా చేసి ఆశీర్వదించారు. ఈ వివాహాలు ఎటువంటి ఆర్భాటమూ లేకుండా, కుల మత భాష జాతీయ బేధాల్లేకుండా వివాహాలు చేశారు. ఇది ప్రపంచానికి వారు చేసిన గొప్ప సేవ. బహుశా ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ఇన్ని వివాహాలు చేసి ఉండరని నా నమ్మకం. అన్ని జంటలూ సంతోషంగా వారి ఆశీస్సులతో పిల్లా, పాపలతో సుఖంగా జీవితం గడుపుతున్నారు. 

23, జులై 2025, బుధవారం

చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం



👆 ఆడియో కోసం పై లింకును క్లిక్ చెయ్యండి 

చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం 

ప్రకృతితో ఏకత్వం కలిగి ఉండండి

ప్రియ మిత్రులారా,

ఎదగడం అంటే విడిచిపెట్టేయడం

మనం ఒక బీజాన్ని చూసినప్పుడు సత్యం కనిపిస్తుంది. బీజంలో ఒక చెట్టుకు కావలసినవన్నీ ఉంటాయి – వేళ్ళు, కాండం, కొమ్మలు, ఆకులు, పువ్వులు అన్నీ. కానీ బీజం తాను యాదార్థంగా ఉన్నదునట్లుగా వ్యక్తం అవ్వాలంటే బీజం అందులో నుండి బద్దలకొట్టుకుని రావాలి. అప్పటి వరకూ కాపాడుతూ ఉన్న పెంకును విడిచిపెట్టేయాలి. విడిచి పెడితేనే జీవం చిగురిస్తుంది.

ఇదీ ప్రకృతి నుండి మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం: ఎదగాలంటే విడిచిపెట్టేయాలి.

తల్లి వృక్షానికి ఈ జ్ఞానం ఉంది. శిశిర ఋతువు వచ్చినప్పుడు తన ఆకులు పట్టుకు కూర్చోదు. ఎంతోఅందంగా రాలనిస్తూ కొత్త చిగురుకు వసతి కల్పిస్తుంది. మరీ బిగుతుగా పట్టుకుని ఉండటం అనేది జీవితం ముందుకు సాగనీయకుండా చేస్తుందన్న అంశం, మనం తరచూ మరచిపోతాం గాని, ఆ జ్ఞానం, ఆ వృక్షానికి ఉంటుంది.  

తల్లి హృదయానికిది బాగా తెలుసు. తొమ్మిది మాసాలు రెండు గుండెలు ఒక్కటిగా కొట్టుకుంటాయి. తల్లి, తన జీవంలో భాగమైనదాన్ని విడిచిపెట్టేస్తుంది, ఆమెకు ప్రేమ లేక కాదు, ఆ శిశువును అత్యధికంగా ప్రేమిస్తుంది గనుక. ఒకటిగా ఉన్నది, ఇప్పుడు రెండు అయ్యాయి, రెండూ విడివిడిగా ఇప్పుడు ఎప్పటికీ ప్రేమించగలిగే శక్తిని కలిగి ఉన్నాయి.

 

ప్రేమ చక్రం

ఈ అనంత చక్రంలో మూడు సరళమైన సత్యాలున్నాయి: 

1. ఎడగడమూ అంటే విడిచి పెట్టేయడం

2. ప్రేమ తనను తాను ఎదుగుదల ద్వారానే వ్యక్తం చేసుకుంటుంది

3. ప్రేమించడం అంటే నియంత్రణ నుండి విముక్తి చేయడం

శ్వాస ప్రక్రియలో లాగానే  ఒకదానికొకటి దారి తీస్తుంది: ఉచ్ఛ్వాస, నిశ్శ్వాస తరువాత మరలా  ఉచ్ఛ్వాస వచ్చినట్లే జీవితం కూడా ముందుకు సాగుతూ ఉంటుంది.

మనం ఏదైనా సృష్టించినప్పుడు, మనం ప్రేమను వ్యక్తం చేస్తున్నాం – అది ఒక పాట కావచ్చు, ఒక చిత్రం కావచ్చు లేక ఒక బాంధవ్యం కావచ్చు. తనను తాను వ్యక్తం చేసుకోవాలని, పంచుకోవాలి అన్న  ప్రేమ యొక్క అవసరమే, యేదైనా సృష్టించాలన్న ప్రేరణను కలిగిస్తుంది. ప్రేమ అనేక రకాలుగా అభివ్యక్తం అవడం జరిగింది, చివరికి బిగ్ బ్యాంగ్ అనే ప్రథమ విస్ఫోటనం ద్వారా కూడా జరిగింది ప్రేమ యొక్క అభివ్యక్తీకరణే.   

విషయాలని ఎదిగేలా చేసేది ప్రేమే. “ప్రపంచాన్ని నడిపే యంత్రం ప్రేమ” అని అంటూండేవారు చారీజీ.

వైరుద్ధ్యం

ఇక్కడే ఒక పెద్ద వైరుద్ధ్యం ఉంది. ఎవరినైనా నిజంగా ప్రేమించాలంటే వాళ్ళని విడిచిపెట్టేయాలి. మొదట్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ప్రేమించడం, విడిచిపెట్టేయడం రెండూ ఒక్కసారే ఎలా జరుగుతాయి?

కానీ ఒక్కసారి దీని గురించి ఆలోచించండి: ఒక గులాబీ మొగ్గను కాపాడే పొరలు గనుక విచ్చుకోకపోతే అది వికసించగలదా? సీతాకోకచిలుక తాను అల్లుకున్న గూడులో నుండి ఆ దారాలను వదుల్చుకొని బయటకు రాగలదా? కొన్ని ప్రమాణాలకు కట్టుబడి ఉంటూ హృదయాలు కలవాలంటే, అలా కలవగలవా? 

నిజమైన ప్రేమలో ఆపేక్షలుండవు, కోరికలుండవు, బంధాలుండవు. స్వేచ్ఛగా ఉండేది ప్రేమ. నిజమైన నిర్మమకారం అంటే సంబంధం లేనట్లు ఉండటం కాదు; అది ఎంత శక్తివంతమైన ప్రేమ అంటే, వ్యక్తిని స్వంతం చేసుకోవడానికి బదులుగా, సంపూర్ణ స్వేచ్ఛనిస్తుంది.

మనం తరచూ ప్రేమని, మమకారాన్ని కలిపేస్తూ ఉంటాం. నిజానికి మమకారం అనేది ప్రేమ ధరించే దుస్తుల్లాంటివి, భయపెడతాయి. బోనులో పెట్టి, దాన్ని జాగ్రత్త అన్నట్లు. ఆధారపడేలా చేసి దాన్ని భక్తి అంటారు.  

మొక్కకి ఎక్కువ తెలుసు. అందులోని పరిమళాన్ని గాలి ఎటో దూరంగా తీసుకుపోతుందని మొక్కకి తెలుసు. దానికి కాసిన పండు చివరికి రాలిపోతుందని దానికి తెలుసు. అయినా మొక్క తిరగబడి పోరాడదు. మొక్క మరింత పెద్దదవుతూనే ఉంటుంది. ఎదగడం, స్వేచ్ఛనివ్వడం, మరింతగా జీవాన్ని పెంపొందనివ్వడం, మొక్క యొక్క సహజ స్వభావం,

 

 మనిషిగా ఉండటంలో సవాలు

మనం మనుషులం, స్వంతంగా మన ఎంపికలు మనం చేసుకుంటూ మనలను మనం ఎరుకలో కలిగి ఉంటాం. అయితే మన అహం మాత్రం “నేను”, “నాది” అంటూ విషయాలను అంటిపెట్టుకొని ఉంటూ మనలను మనం నిర్వచించుకునేలా చేస్తుంది. ఈ విశ్వాసం లేకపోవడం వల్ల కూడా,  భవిష్యత్తు భద్రత కోసం కూడబెట్టుకుంటూ ఉంటాం.

మనం ధ్యానించినప్పుడు ఈ బంధాలు విడిపోతాయి; మన ఆలోచనలను గురించిన, మన  భావాలను గురించిన ఎరుక ఎక్కువవుతుంది. యేది సత్యం, యేది అసత్యం, యేది శాశ్వతం, యేది అశాశ్వతం అన్న విచక్షణ కలుగుతుంది. అల్పమైన స్వయాన్ని దాటి ఆనంతత్వంలోకి చూడటం ప్రారంభిస్తాం. 

ఈ మార్పు తనకు తానుగా స్వయంగానే ప్రేమతో కూడిన చర్య అవుతుంది.

 

లాలాజీ జీవితం నుండి

మమకారం లేని ప్రేమకు మన ఆదిగురువులైన లాలాజీయే శ్రేష్ఠమైన ఉదాహరణగా ఉండేవారు. ఉదాహరణకు, వారి కుమార్తె మరణ వార్త విని, సత్సంగంలో నిశ్శబ్దంగా అలా కూర్చొని ఉండగా వారి కళ్ళల్లో నుండి నీరు కారడం ప్రారంభించింది.

ఒక సాధుపురుషుడు, “మహాత్ముడు కన్నీరు పెట్టడం ఏమిటి?” అని అడుగుతాడు. ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటే ఆయన ఇతరుల గురించి ఆలోచిస్తారు గనుక.

లాలాజీ కొంత సేపు నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఆ తరువాత కొంత సేపటికి, ఆయన కొన్ని ఎండుటాకులు తీసుకుని నలుపుతారు. అవి శబ్దం చేస్తాయి. అప్పుడాయన, “ప్రాణం లేని ఆకులు కూడా, నలిపితే యేదొక శబ్దం చేస్తున్నప్పుడు, మరి నేను నిజంగా ప్రాణం ఉన్న మనిషిని కదా. కలిసి ఉన్న భాగాలు విడిపోయినప్పుడు శబ్దం రావడం సహజమే గదా” అని అన్నారట.

“జనం సహజంగానే ప్రేమను, జాగ్రత్తను, మమకారాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు; వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నా లేకున్నా” అంటూ లాలాజీ కొనసాగిస్తూ అన్నారు. మనం మానవత్వం గల జీవి   నుండి దయగల జీవిగా, అక్కడి నుండి దివ్యత్వం గల జీవిగా ప్రయాణిస్తున్నాం. మనం వికాసం చెందుతున్న కొద్దీ సృష్టిలోని యదార్థ సత్యాలతో విడిపోవడం గాకుండగా, ఒక్కటైపోతూ ఉంటాం.  

ఇదే ప్రేమతో కూడిన నిర్మమకారం: విడిచి పెట్టేస్తూనే, నిగూఢంగా అనుభూతి చెందడం.

 

తప్పుడు మార్గం

ప్రేమ లేకుండగా తటస్థంగా ఉండటం గురించి మనం జాగ్రత్తపడాలి. అది మరీ చలనం లేనిది, సుదూరమైనది, దీనికి ఎటువంటి ఆధ్యాత్మిక విలువా లేదు. ఇదెలా ఉంటుందంటే, నేను బ్రహ్మచారినే గాని నాకెవరూ దగ్గరగా ఉండటానికి లేదు అన్నట్లుంటుంది. ఈ రకమైన దూరం ఉద్వేగపరంగా అసక్తుడని సూచిస్తున్నది గాని, వివేకం వల్ల కలిగినదిగా లేదు.

 

సంపూర్ణ తటస్థ భావం సాధ్యమయ్యేది ఎప్పుడంటే, ప్రేమ ఎంత పటిష్ఠంగా ఉండాలంటే, యేమి నష్టపోయినా, యేది పొందినా పట్టించుకోకుండా ఉన్నప్పుడు సాధ్యం. ఉద్వేగపరంగా ఆధారపడకుండా సంపూర్ణంగా పాల్గొనగలగడం జరుగుతుంది. దీని వల్ల మమకారం లేని సామీప్యత, బంధాలకి లోనుగాకుండా సంబంధం కలిగి ఉండటం సాధ్యపడుతుంది.

ఈ ప్రేమపూరితమైన దూరాన్ని అందిపుచ్చుకోవడం ఎలా? నా వద్ద ఒక్కటే సమాధానం ఉంది: అవగాహన, అభ్యాసం.

చిన్నగా ప్రారంభించండి. యేదైనా ఒక విలువైన వస్తువు చేతిలో ఉంచుకోండి: ఒక విలువైన నగ గాని ఒక విలువైన చిత్రం గాని. దాని పట్ల మీరు కృతజ్ఞులుగా ఉండండి. దాన్ని కోల్పోతామేమోనన్న భయం యేమైనా ఉందేమో గమనించండి. ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని పట్టును కాస్త విడవండి. పిడికిళ్ళలో పట్టుకునే బదులు తెరచిన చేతులతో పట్టుకోండి. తద్వారా విలువను తెలుసుకోవడానికి, స్వంతం చేసుకోడానికి గల వ్యత్యాసాన్ని గుర్తించండి.

ఇక సంబంధాల విషయానికొద్దాం. మీరు ఎవరినైనా భయంతో గాని, అవసరం వల్ల గాని, యేదో అపేక్షించి గాని గట్టిగా పట్టుకున్నప్పుడు మీ దృష్టి పెట్టండి. ఇతరుల స్వేచ్ఛను గౌరవించండి. దూరంగా లాగేయడం గాని, దూరంగా పరుగెత్తడం గాని చేయకండి. బేషరతుగా ప్రేమించండి. స్వేచ్ఛ, యే విధంగా బలహీనం గాకుండగా, నిజమైన సంబంధాలను ఏర్పరస్తుందో గమనించండి.

చివరికి దీన్ని మీ మీదే ప్రయోగించండి. మీ గురించిన గుర్తింపులను గాని, కథనాలను గాని, చివరికి మీ గాయాలను కూడా మీరే విధంగా గట్టిగా పట్టుకొని ఉన్నారో గమనించండి. మీ గురించిన పాత కథనాలను ఎప్పటికప్పుడు విడిచిపెట్టేయడం అలవరచుకోండి. మీకు ఉపయోగం లేని వాటిని విడిచి పెట్టేది మిమ్మల్ని మీరు ద్వేషిస్తున్నారని కాదు, మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి.

 

ప్రకృతి యొక్క దయ నుండి మనకొక పాఠం 

ఒక నది ఒడ్డున తగినంత సేపు నిలబడగలిగితే, అది సర్వం నేర్పిస్తుంది. నీరు కదలికను చూడండి. అది స్పృశించిన రాళ్ళ మధ్యలో నీరు నిలబడిపోవడం గాని, అది నీరు అందించే తీరాలలో నిలబడిపోవడం గాని జరగదు. ప్రతీ క్షణం నది ఇస్తూనే ఉంటుంది, అయినా నది అలాగే ఉంటుంది. తనను తాను నిరంతరమూ ఇచ్చుకుంటూ రావడం ద్వారా తన నివాసమైన మహాసముద్రాన్ని కనుగొంటుంది.

కానీ ప్రకృతి నేర్పించే పాఠాలు ఇంకా నిగూఢంగా ఉంటాయి. దీని గురించి కాస్త ఆలోచించండి: నారింజ చెట్టు తాను ఇస్తున్న నారింజ పండ్లకు బదులుగా నారింజ రసం ఇమ్మని ఆడగదు. మామిడి చెట్టు, మూల్యం చెల్లించమని ఎప్పుడూ మామిడి రసం కోరదు. ఇటువంటి వృక్షాలు మామూలు వస్తువులని కూడా తియ్యతియ్యటి కానుకలుగా మార్చేస్తాయి. అవి తినేది కేవలం సేంద్రియ వ్యర్థాలు, త్రాగేది నీరు, వినియోగించుకునేది సూర్యరశ్మి మాత్రమే.

ఆవు తను ఇచ్చే పాలకు బదులుగా యేమీ కోరదు, పాలతో సహాయ ఏమీ ఆడగదు. గడ్డి తింటుంది, మరింత గడ్డి తప్ప మరేమీ తినదు! కానీ మనలో కొందరం ఆవును మొత్తంగా తినేస్తాం; మన కడుపులను శ్మశానాలుగా మార్చుకుంటూ. నిస్స్వార్థంగా మనకు సేవనందించే వాటికి మనం చేస్తున్నది ఇది.

ఇందులో నుండి మనం ఏమి గ్రహించవచ్చు? మనం అన్నీ శ్రేష్ఠమైనవి తింటున్నా కూడా మనం ఇస్తున్నదేమిటి? ఈ ప్రశ్న నా సహచరులనెందరినో ఎన్నో సార్లు కాస్త ఆగి, ఆలోచించేలా చేసింది.

ఈ మూడు అవసరాలను తీర్చేది కేవలం ఒక దివ్య పరంపర యొక్క ప్రేమ వల్లే సాధ్యం అని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది నాకు: ఎదగడం, ప్రేమించగలగడం, సేచ్ఛనివ్వడం. యేమీ ఆడగకుండా ఉండటం, సర్వం పంచడం ద్వారా ప్రకృతి ప్రేమపై ఆధారపడి ఉంది. ప్రేమతో కూడిన నిర్మమకారం యొక్క అత్యున్నత స్వరూపం ఇదే.

ప్రేమతో కూడిన నిర్మమకారం గురించి ప్రకృతి ఇచ్చే మౌన సందేశం ఇది; ఇదెంత మౌలికమైనదంటే, దీన్ని సాధారణంగా పట్టించుకోరు.

మేఘాలు నీరు ప్రోగు చేసుకుంటాయి, వర్షం ద్వారా బరువెక్కుతాయి, ఆ తరువాత నీటిని మొత్తాన్ని విడుదల చేస్తాయి. అప్పుడు మేఘాలు చిన్నవవుతాయా? అవ్వవు. బరువు తగ్గుతాయి అంతే, ఆకాశంలో అలాగే కదులుతూ కొనసాగుతూ ఉంటాయి. వర్షం నదులుగా మారి, విత్తనాలకు ఆహారమై, మళ్ళీ ఆవిరిగా పైకెళ్ళి మరలా మేఘాలుగా తయారవుతూ ఉంటాయి.

ఇది మీ శ్వాస నేర్పిస్తుంది. శ్వాస బయటకు వదిలినప్పుడు యేదో విడిచిపెడుతున్నాం; శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు, యేదో లోపలికి గ్రహించడం జరుగుతోంది. శ్వాసను శాశ్వతంగా ఆపే ప్రయత్నం చేస్తే జీవితమే ఇబ్బంది పడుతుంది. మనసు అప్పుడప్పుడు మరచిపోయే వాటిని,  శరీరం గుర్తుంచుకుంటుంది: పట్టుకొని ఉండటం, విడిచి పెట్టడం అనేవి జీవిత గమనం యొక్క రెండు మౌలిక ప్రక్రియలు.

 

నాల్గవ నియమం : ప్రకృతి మార్గం సరళమైనది

“ప్రకృతితో ఒక్కటిగా ఉండేలా మీ జీవితాన్ని సరళంగా మలచుకోండి.” – బాబూజీ 

ఈ సూత్రాన్ని జీవితంలో దించుకోగలిగితే, వికాసం చెందడానికి అతివేగవంతమైన మార్గం అవుతుంది.

ప్రకృతి అంతా కూడా సరళత్వాన్ని గురించే. సృష్టికి పూర్వం ఉన్న పరతత్త్వంలో నిక్షిప్తమై ఉండేది ప్రకృతి. కానీ ఇంకా పూర్తిగా వికసించలేదు.  ప్రకృతి యొక్క స్వీయ జీవశక్తి ఇదే. కార్యకలాపాలన్నీ ప్రారంభించేది ఇక్కడే, ఈ స్థానంలోనే. ఇదే యదార్థమైన మూలం. కేవలం జటిల తత్త్వాలన్నిటినీ తొలగించుకోవడం ద్వారా మాత్రమే సరళత్వాన్ని సాధించుకోగలిగే ఏకైక మార్గం.

మనమే ఈ సరళమైన విషయాన్ని మరింత జటిలంగా చేసుకున్నాం. మనమే ప్రకృతి ప్రవాహానికి విరుద్ధంగా, అడ్డుపడేలా, మన ఆలోచనల వలలను, కోరికల వలలను, చేతల వలలను  సృష్టించుకున్నాం. ఒకళ్ళు చల్లటి గాలిలో తిరగమంటారు; మరొకరు జలుబు చేస్తుంది, జాగ్రత్త అంటారు;  ఒకళ్ళు డబ్బు సంపాదనలో పడమంటారు; మరొకరు మరో మార్గాన్ని అనుసరించమంటారు. మనలను మనం పరస్పర విరుద్ధ ప్రవృత్తుల సమూహంగా తయారు చేసేసుకున్నాం అంటారు బాబూజీ.

నారింజ చెట్టు ఇటువంటి సమస్యలను ఎదుర్కోవలసిన పని లేదు. ఎందుకంటే అది పండు ఇవ్వాలా అక్కర్లేదా అని ఆలోచించదు. ఆవు పాలను ఉత్పత్తి చేయాలా అక్కర్లేదా అని ఆలోచించదు. అవి సరిగ్గా ప్రకృతి ఉన్నట్లే పరిపూర్ణ సరళత్వ స్థితిలో ఉంటాయి గనుక.

మనం స్వయంగా నిర్మించుకున్న ఈ వలలను నాశనం చేసుకుని, మనలో “నిద్రాణమై ఉన్న ప్రకృతి యొక్క ఈ పరమతత్త్వాన్ని” తిరిగి స్వంతం చేసుకోవలసిన అవసరం ఉంది. మనం ప్రకృతిని అనుసరించాలనుకుంటే, ఎడతెగకుండా   మన చేతలను శుద్ధీకరించుకోవలసి ఉంటుంది, అనవసరమైన పనులను తొలగించుకోవలసి ఉంటుంది, పరిశుద్ధ స్థితిని సాధించడానికి మనం సృష్టించుకున్న వలల సమూహాన్ని నాశనం చేసుకోవాలి. 

ఇదే ప్రేమతో కూడిన నిర్మమకారం క్రియారూపం దాల్చడం అంటే. దీనర్థం, మరింత అధికంగా ఆధ్యాత్మిక అభ్యాసాలు చేయడం కాదు; అనవసరమైనవన్నీ తొలగించేసుకోవడం. శిశిర ఋతువులో చెట్లు ఎండుటాకులను  ఎలా రాలనిస్తాయో, అదే విధంగా మనం నిర్మించుకున్న వలలన్నిటినీ విడిచిపెట్టేయగలగాలి. ప్రకృతితో సమశృతి కలిగి ఉండే సరళ జీవన విధానానికి మనం తిరిగి వచ్చేయాలి. మనం కల్పించుకున్న ఈ అన్ని “అవసరాలు” అనే  అంశాన్ని ఒకసారి పునరాలోచన చేసుకోవాలి.

 

పరమ సత్యం

అసలు సమస్య ఇక్కడే ఉంది. నారింజ చెట్టు, మట్టిని, నీటిని, సూర్యరశ్మిని యేమీ అడగకుండా తియ్యదనంగా మారుస్తున్నది. ఆవు గడ్డి తిని, తనను తాను ఆహారంగా మార్చుకుంటున్నది, తిరిగి  యేమీ ఆశించకుండా. ఇలా యేమీ ఆలోచించకుండా ఇవ్వడమే ఆ దివ్యశ్రేణి పని అంటే.  

అన్నీ శ్రేష్ఠమైనవి తినే మనం ఈ మౌలిక సిద్ధాంతాన్ని సాధారణంగా మరచిపోతూ ఉంటాం. నారింజలో తియ్యదనాన్ని, ఆవు ఇచ్చే పాలని, భూమి ఇచ్చే సమృద్ధిని తీసుకుంటున్నాం, కానీ తిరిగి మనం యేమిస్తున్నాం? ఈ ప్రశ్న మనలో అల్పమైన అనుభూతిని కలుగజేయాలి, మన జీవితం యొక్క అసలు ప్రయోజనాన్ని గుర్తు చేయాలి. అసలు పెద్ద సమస్య దానంతట అదే తొలగిపోతుంది: మనం విడిచిపెట్టేయగలిగినప్పుడు, చాలా అధికంగా పొందడం జరుగుతుంది. ఎంత ఎక్కువ స్వేచ్ఛనిస్తే, అంత పటిష్ఠమైన సంబంధాలు ఏర్పడతాయి. విడిచి పెట్టేస్తే ఎదగ గలుగుతాం.

ఇక్కడ ఏ ప్రణాళికా లేదు, ఏ మాయా లేదు. ప్రేమ ఈ విధంగా పని చేస్తుంది; దివ్య శ్రేణి అలా పని చేస్తుంది. ప్రేమ అనేది మూసుకుని ఉన్న వ్యవస్థ కాదు; బాహాటంగా ప్రవహించే ప్రవాహం. ఇది నీరులా, గాలిలా, కాంతిలా కదులుతూ ఉంటుంది; నిరంతరం మారుతూ, ఎప్పుడూ తిరిగి వస్తూ ఉంటుంది. 
ఈ దివ్యశ్రేణిని మనం అనుసరిస్తున్నప్పుడు, తిరిగి యేమీ ఆశించకుండా ఇస్తూపోతూ ఉన్నప్పుడు, ప్రేమతో కూడిన నిర్మమకారం అనేది మనం చేస్తున్నది కాదని, మనమే స్వయంగా ఆ విధంగా అయ్యామని తెలుసుకోగలుగుతాం.

 

స్వీకరణ

చివరిగా, మనం ప్రేమతో కూడిన తటస్థ భావనను అభ్యాసం చెయ్యం; మేము ఇప్పటికే చేస్తున్నామని స్వీకరిస్తున్నాం. మనం ఒకరి నుండి ఒకరు విడిపోడానికి ప్రయత్నించే జీవులం కాదు. జీవితం నూతన రూపాల్లోకి నిరంతరం మారుతూ ఉంటుంది, నిరంతరం విడిచి పెట్టడం, నిరంతరం తనను తాను ప్రేమించడం చేస్తూ ఉంది. 

మీరు తీసుకుంటున్న ప్రతీ శ్వాసతోనూ ఉంటూ సృష్టి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. ఒక పసివాడిని గాని, ఒక కలను గాని, ఒక క్షణాన్ని గాని మీరు విడిచిపెట్టగలిగినప్పుడు జీవన స్రవంతితో శృతిలో ఉంటారు.

నదికి తెలుసు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుందని. మబ్బుకు తెలుసు వర్షిస్తుందని, ఎండిపోతుందని, మళ్ళీ తిరిగి మబ్బుగా ఏర్పడుతుందని. విత్తనానికి అందులో నుండి బయటకు వచ్చి ఎదగాలని తెలుసు. మనకు కూడా గుండె లోలోతుల్లో ఎక్కడో తెలుసు – ప్రేమ అంటే విడిచి పెట్టేయడమని, అలాగే ప్రేమతో విడిచి పెట్టేయడం అంటే ప్రేమగా మారిపోవడమేనని మనకు కూడా తెలుసు.

సరళత్వంలో ఇటువంటి స్థాయికి చేరుకున్నప్పుడు, “గత సంస్కారాలన్నీ తొలగిపోయిన తరువాత ఉండే స్థితితో సమానంగా ఇంద్రియాలన్నీ లయమైపోవడం వల్ల ఏర్పడుతుంది.” అప్పుడు మాత్రమే మనలను మనం దివ్యత్వానికి శృతిలో ఉంటున్నామని, సరళమైన, ప్రేమపూరితమైన, ప్రకృతి యొక్క ఇచ్చే గుణంతో పరిపూర్ణ సామరస్యంగా జీవిస్తున్నట్లు అనుకోగలుగుతాం.

 

ఆహ్వానం

ఈ మాటలను మరీ గంభీరంగా తీసుకోకండి. వాటి పని వాటిని చేయనివ్వండి; ఆ తరువాత వాటిని పోనివ్వండి. ఇవన్నీ గుర్తుంచుకునే విషయాలు కాదు; ప్రవాహంలోకి రావడానికి ఆహ్వానాలు మాత్రమే. 

విడిచి పెట్టడానికి భయపడినట్లయితే, విడిచి పెట్టడం అనేది ఒక నూతన జీవనాన్ని తీసుకువస్తుందని గుర్తుంచుకోండి; నష్టం కాదు. ప్రతీ సంధ్యా సమయం కూడా అంతాలు, నూతన ప్రారంభాలకు దారి తీస్తాయని తెలుపుతున్నది. విడిచి పెట్టేయడం వల్ల అందుకోవడానికి కొత్త చోటు ఏర్పడుతోందని మన ప్రతీ శ్వాస తెలియజేస్తోంది.

తెరిచిన బాహువులతో ప్రేమించండి. ఇది ఆధ్యాత్మికమని, లేక హాస్యంగా ఉంటుందని కాదు; ప్రేమ కేవలం ఈ విధంగానే పని చేస్తుంది కాబట్టి. పిడికిలి కొన్ని వస్తువులను పట్టుకుంటుందంతే. తెరచిన హస్తాల్లోనే సృష్టి మొత్తం ఉండేది. ఒక నది నేర్పించేది, ఒక మేఘం నేర్పించేది, ప్రతీ తల్లి హృదయానికి తెలిసిందేమిటంటే, ప్రేమించడం అంటే విడిచిపెట్టేయడం; మరి విడిచి పెట్టేయడం ద్వారానే మనం తపిస్తున్న ప్రేమగా మారగలిగేది.

ఇదే పాఠం. తేలిక. చేయగలిగినది. ఎప్పటికీ.

ప్రేమతోనూ, గౌరవంతోనూ,

కమలేష్ 


 

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - ప్రథమ దర్శనం

 


పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - ప్రథమ దర్శనం 



గురువుతో మొట్టమొదటి కలయిక చాలా అద్భుతమైనది అందరికీ. ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయేది. ప్రతి సాధకుడికి ఇటువంటి అద్భుత మధుర క్షణం వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప్రత్యేక అనుభూతి కలుగవచ్చు. ఉదాహరణకు స్వామి వివేకానంద మొట్టమొదట సారి శ్రీరామకృష్ణుల వారిని కలవడం; బాబూజీ మహారాజ్ తన గురుదేవులైన లాలాజీ మహారాజ్ ను మొట్టమొదటిసారి దర్శించడం; పూజ్య చారీజీ బాబూజీతో మొదటి కలయికను ఎంత అద్భుతంగా వర్ణించారో మనం చదివ్యయం. అలాగే పూజ్య దాజీ కూడా వారి సరళమైన కానీ దివ్యమైన అనుభవాన్ని మనతో పంచుకోవడం కూడా చూశాం. ఆ మొట్టమొదటి కలయికలోనే చాలా వరకూ జరుగవలసిన ఆధ్యాత్మిక కార్యం బీజరూపంలో నిక్షిప్తం అయిపోతుందని, నా విశ్వాసం; రానున్న కాలంలో ఆ బీజమే మొలకెత్తి వృక్షమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాధకుడికి గురువుతో కలయిక మళ్ళీ మళ్ళీ తలచుకునేంత నిగూఢ క్షణం; ఎంతో జ్ఞానం ఊరుతూ ఎ సమయానికి ఆ సమయం లక్ష్యం దిశగా అవసరమైన వివేకాన్ని అందించేటువంటి అద్భుత క్షణం. 

పూజ్య చారీజీ 1964 లో ఆయన మొట్టమొదటి సారి బాబూజీతో కలయికను, మై మాస్టర్ గ్రంథంలోనూ, ఎన్నోసార్లు తన ప్రసంగాల్లోనూ ఉల్లేఖించడం చూశాం; ఎన్నో విషయాలు గ్రహించాం, గ్రహిస్తూనే ఉన్నాం. 

పూజ్య గురుదేవుల ప్రథమ దర్శనం 
నేనంతకు పూర్వం ఎందరో మహాత్ములను చూడటం జరిగింది. అందరి వద్ద స్ఫూర్తి-ప్రేరణాలు కలుగుతూనే ఉన్నాయి. కానీ యేదో వెలితి, యేదో వ్యక్తం చేయలేని లోటు. నాకు సహజ్ మార్గ్ సాధనను పరిచయం చేసిన ప్రశిక్షకులు, నన్ను సాధ్యమైనంత త్వరగా పూజ్య చారీజీని కలవమని సలహా ఇచ్చారు గాని నా మనసుకు పెద్దగా ఎక్కలేదు. అయితే నేను మార్చ్ 1990 లో ప్రారంభించాను, ఏప్రిల్ 30 న జైపూర్ లో బాబూజీ భండారా. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్యాలస్ లోకి, పూజ్య చారీజీ వస్తున్నారని తెలిసి అందరూ నిరీక్షిస్తున్నారు; నేను కూడా వేచి ఉన్నాను; ఎటువంటి అపేక్ష లేకుండా; మరో మహాత్ముడిని చూస్తున్న ఆరాటం తప్ప యేమీ లేదు. ఒక కుర్చీ వేసి ఉంచారు అక్కడ ఆయన కోసం. అందరమూ క్రింద కూర్చొని ఉన్నాం. తక్కువ మందే ఉన్నారు. 

కాస్సేపటికి ఆ మహానుభావుడు రానే వచ్చాడు. అదే మీదటి సారి చూడటం; వినడం. 6 అడుగులు, దివ్య తేజస్సు; ఆజానుబాహుడు; మనిషి మొత్తం ప్రకాశిస్తున్నారు; పైన చిత్రంలో ఉన్నట్లుగా చూశాను కానీ గడ్డం అవీ లేవు; కళ్ళల్లో ఒకరకమైన కొంటెతనం; మేధను సూచిస్తూ విశాలమైన నుదురు; మొత్తంగా దివ్యమంగళ విగ్రహం అన్నట్లుగా చూపు తిప్పుకోలేని మహాపురుషుని దర్శనం. ఇక మనసులోకి తొంగి చూసుకుంటే, అపరిమితమైన అలౌకిక ఆనందం; లక్ష ప్రశ్నలకు ఒకేసారి సమాధానం వచ్చినట్లు; పిచ్చ నిశ్శబ్దం; శాశ్వత ముద్ర కానీ ముద్ర పడిపోయింది.  యేదో సాధించేసిన తెలియని గర్వం; మా మధ్య యేమీ సంభాషణ జరగలేదు. అసలు ఆ అవసరం రాలేదు. ఆంగ్లంలో యూరేకా మూమెంట్ అంటారు. ఇక నేను చేరవలసిన చోటుకు క్షేమంగా చేరుకున్నాను; ఇక గురువు అన్వేషణ అవసరం లేదు అన్న గొప్ప ఆత్మ విశ్వాసం కలిగింది.
 
ఆ తరువాత నా తపన చాలా వరకూ చల్లారింది; కానీ ఒక కొత్త తపన ప్రారంభమయ్యింది. వారిలో అణుమాత్రంగానైనా తయారయ్యే ప్రయత్నం చెయ్యాలి అన్న తపన. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. వారి జీవిత కాలంలో పూర్తికానీ నా ఈ ఆధ్యాత్మిక యాత్రను ఎంతో అనుగ్రహంతో వారి వారసులైన పూజ్యశ్రీ దాజీ గారికి అప్పగించడం జరిగింది. పూజ్య గురుదేవులైన దాజీ మార్గదర్శనంలో నా యాత్ర ఇలా కొనసాగుతూ ఉంది. 

ఇంకా ఉంది ... 


22, జులై 2025, మంగళవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం


పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం

ఈ నెల జూలై 24, 2025 న పూజ్య గురుదేవుల 99వ  జన్మదినోత్సవం. 98వ జయంతి. ఈ సందర్భాన వారి ప్రత్యేక స్మరణలో వారితో నా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని గురించి, కొన్ని అక్షరాల ద్వారా క్లుప్తంగా పునర్జీవించాలన్న సంకల్పం కలిగింది. ప్రయత్నిస్తాను.   

ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో ఉన్న మామూలు సాధకుడు, దేని కోసం వెతుకుతున్నాడో , దేని కోసం తపిస్తున్నాడో కూడా స్పష్టంగా అవగాహన లేకుండా వెతుకుతున్న రోజుల్లో, తటస్థమైన మహాత్ములందరి సాంగత్యంలో పాల్గొనే ప్రయత్నం చేసేవాడిని. గుడులు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, తటస్థమైన ధ్యాన పద్ధతులు, సైంటిస్టులను, నోబెల్ పురస్కార గ్రహీతలను వివిధ ఆధ్యాత్మిక సంస్థలను, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సందర్శిస్తూ ఉండేవాడిని; ఇదంతా ఊహందుకున్నప్పటి నుండి. అయినా యేదో తెలియని వెలితి; అందరి వద్ద మంచే నేర్చుకున్నాను; దేనికీ వంక పెట్టడానికి లేదు; అయినా యేదో తీరని ఆకలి; పైగా ఆకలి తీవ్రత పెరిగింది. మనసులో సమాధానాల్లేని అనేక ప్రశ్నలు; తీవ్ర అశాంతి; ఎవరికీ చెప్పుకునేది కాదు; ఇతరులకు ఇది పెద్ద సమస్య కాదు; నాకు చాలా పెద్ద సమస్యలా ఉండేది.  

మరో ప్రక్క చదువు, వగైరావన్నీ నిర్లిప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కువగా ఏకాంతంగా గడపటానికి ఇష్టపడేవాడిని. విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటయ్యింది. తపన మరింత తీవ్రం అయ్యేది. 

కొన్ని సంవత్సరాలకు, నన్ను యేదో తెలియని శక్తి నడిపిస్తున్నదన్న ప్రగాఢ అనుభూతి కొనసాగుతూ ఉండేది; ఎవరికైనా చెప్తే నమ్మరు, పైగా హేళన చేస్తారన్న భయం ఉండేది. గుప్తంగా ఆ అనుభూతి యొక్క సత్యం నాలోనే ఉంచుకున్నాను; నాకు మాత్రమే తెలుసు. 1986 లో శ్రీ రామ కృష్ణ మఠంలో, ఆ సంస్థ అధ్యక్షులయిన స్వామి గంభీరానందజీ వద్ద గురుదీక్ష తీసుకోవడం జరిగింది. మనసు కొంత ఊరడిల్లింది. 4 సంవత్సరాలకు వారు మహాసమాధి పొందడం జరిగింది. ఆ క్షణం నుండి మరలా నా మనసు అగాథంలో ఉన్నట్లుగా తీవ్ర వ్యధకు గురయ్యింది. దీని ప్రభావం ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఏమి చేయాలో తెలియక మండల కాలం స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. 80 కి.మీ. లు నడిచి మకరజ్యోతిని దర్శించాను. తనువు పులకరించింది. తిరిగి వచ్చిన తరువాత శ్రీరామ చంద్ర మిషన్ సభ్యులు ఒకాయన పరిచయం అయ్యాడు. కానీ ఆయనతో నేను బాగా వాదించేవాడిని. ఆయన కూడా అలాగే ఉండేవాడు. కానీ సాంగత్యం నచ్చింది. కానీ ఈ సంస్థలో చేరాలన్న ఆలోచన యే కోశాన లేదు.

తదుపరి వ్యాసం గురుదేవుల ప్రథమ దర్శనం ...  

 

7, జులై 2025, సోమవారం

ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత

 ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత

శ్లోకం

పూజకోటి సమం స్తోత్రం,   

 స్తోత్రకోటి సమో జపః

 జపకోటి సమం ధ్యానం ,         

 ధ్యానకోటి సమో లయః

భావం:

కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,

కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,

కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,

కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.

- శ్రీ కృష్ణ భగవానుడు, ఉత్తర గీత  

శ్లోకం

నాస్తి ధ్యాన సమం తీర్థం;   

 నాస్తి ధ్యాన సమం తపః| 

 నాస్తి ధ్యాన సమో యజ్ఞః 

 తస్మాద్యానం సమాచరేత్

భావం:

ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అందువలన | అన్నింటికన్నా ఉత్తమమైన ధ్యానం తప్పక అభ్యసించాలి. 

- శ్రీ వేదవ్యాస మహర్షి 

గురుపూర్ణిమ

 

గురుపూర్ణిమ

ఈ సంవత్సరం  జూలై 10, 2025 తేదీన గురుపూర్ణిమ అయ్యింది. ప్రతీ  సంవత్సరమూ ఆషాఢ  పూర్ణిమ నాడు,  వేదవ్యాస  మహర్షి  జన్మదిన  సందర్భంగా  ఈ  రోజును  గురుపూర్ణిమగా  భారతీయ  సాంప్రదాయంలో  అనాదిగా  జరుపుకుంటూ  వస్తున్నారు.  వేదవాజ్ఞ్మయాన్ని అంతటినీ  క్రోడీకరించి,  ఒక్కచోటుకు  జేర్చిన మహాత్ముడు,  మహర్షి వ్యాసమహర్షి.  వీరి  జన్మదినాన  అన్ని  సాంప్రదాయాలకు  సంబంధించినవారు,  శిష్యులందరూ  కూడా వ్యాసమహర్షిని  స్మరించుకుంటూ తమతమ  గురుపరంపరను తమ  గురుదేవులను పూజించుకోవడం  ద్వారా ఇది  జరుగుతూ ఉంది.  

ఈ  రోజున  వివిధ  సాంప్రదాయాలకు  సంబంధించినవారు, వారి-వారి  సంప్రదాయాలకనుగుణంగా వివిధ రకాలుగా  ఈ  పవిత్ర దినాన్ని  జరుపుకుంటూ  ఉంటారు. ఈ  రోజున  గురువుతో  భౌతికంగా  కూడి  ఉండగలిగినప్పుడు  సాధకుడి  ఆధ్యాత్మిక  పురోగతి  ఎన్నో  ఇంతలు  త్వరితంగా గురువు  అనుగ్రహం  చేత జరిగే  అవకాశం  ఉందని  చెప్తారు. 

హార్ట్ఫుల్నెస్,  శ్రీరామచంద్ర  మిషన్ సంప్రదాయంలో గురుపూర్ణిమ

కాని  ఈ  సంస్థలో  అది సాధకుడు  లేక  అభ్యాసి అంతరంగ  తయారీని  బట్టి,  ఆతని  అంతరంగ  స్థితిని  బట్టి,  అతని తపనను  బట్టి  ఆధారపడుంటుందని  చెప్తారు  మన  గురువులు.

ఉత్తర్  ప్రదేశ్ లోని షాజహానుపూరుకు  చెందిన శ్రీరామచంద్రజీ,  ఆప్యాయంగా  పిలుచుకొనే  బాబూజీ  స్థాపించిన శ్రీరామచంద్ర  మిషన్ లో,  ఈ  సంప్రదాయంలోని  గురుపరంపర యొక్క గురువులు, గురుపూర్ణిమ ప్రతీ  సంవత్సరం  ఒక  ఆచారంలా  ఒక క్రతువులా  చెయ్యద్దంటారు.  ఈ  సంప్రదాయం  వాటన్నిటికీ  అతీతంగా  చాలా  దూరంగా  ప్రయాణించిన  సంస్థ  అంటారు.  యాదృచ్ఛికంగా అంటే  అనుకోకుండా మనం  ఆ  రోజున  గురువుతో  కూడి  ఉన్నట్లయితే  అది  వేరే  విషయం,  కాని  ఆ  రోజున  ప్రత్యేకంగా  గురువుతో  ఉండాలని  ప్రణాళిక  అవసరం  లేదంటారు. దానికి  బదులుగా ఆ రోజున, అభ్యాసి  లేక  సాధకుడు  ఎక్కడున్నా తన  గురుదేవుల  స్మరణలో  ఎంతగా  లీనమైపోయి  ఉండటానికి  ప్రయత్నించాలంటే  ఆ  స్మరణలో  సాధకుడు  ఆహుతి  అయిపోవాలంటారు. "Consume yourself in His remembrance" అంటారు. 

స్మరణ  అంటే  మళ్ళీ  కేవలం  జ్ఞాపకాలు  కావు.  ఆ  జ్ఞాపకాలు  ఎలా  ఉండాలంటే  మనం  స్మరిస్తున్న  వ్యక్తి లేక  గురువు  సాక్షాత్తు  మనతో  ఆయన  ఉనికి  ఉన్నట్లుగా  అనుభూతి  చెందగలగాలి. వారి  ఉనికిని అనుభూతి  చెందుతూ,  వారు  గడిపిన  జీవన  విధానాన్ని,  వారు  సాధన చేసిన  విధానాన్ని,  వారి  క్రమశిక్షణ, వారి  వ్యక్తిత్వం,  వారి  ఆధ్యాత్మిక  సాన్నిధ్యాన్ని... వీటన్నిటినీ  స్మరిస్తూ వారి  ఉనికిని  నిజంగా  అనుభూతి  చెందే  ప్రయత్నంలో  ఉంటూ  మన జీవితం  ఎంత  వరకూ  దీనికి  దగ్గరగా  ఉంది అని  ఆత్మావలోకనం  జరిగినప్పుడు  కనీసం మనం  చేసుకోవలసిన  సవరణలు  ఏమిటో  అయినా  మనకు  తెలిసే  అవకాశం  ఉంటుంది.  

కావున  ఈ  పరమపవిత్ర  దినాన  అభ్యాసులుగా  మనందరమూ  గురువుల  అభీష్తాన్ని  అనుసరించి తమ  గురుదేవుల  దివ్యస్మరణలో తమను  తాము  ఆహుతి  చేసుకోగలరని  ప్రార్థిస్తూ.... 

గురుపూర్ణిమ - గురుదేవుల  దివ్య స్మరణలో మనలను  మనం ఆహుతి చేసుకోవడమే  గురు పూర్ణిమనాడు  సాధకుడు  చెయ్యవలసినది.

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

  కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7 పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్...