ఆధ్యాత్మిక ఎదుగుదల - ఆధ్యాత్మిక ప్రగతి - ఆధ్యాత్మిక వికాసం
ఈ మూడు పదాలకర్థం ఒకటే. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఇంచుమించు ప్రారంభించిన వెంటనే దీన్ని గురించిన జిజ్ఞాస మనసులో మెదలడం మొదలైపోతుంది. షట్చక్రాల యాత్ర అయితే యే చక్రంలో ఉన్నామో అని, సహజ్ మార్గ్ యాత్ర అయితే 13 గ్రంథుల యాత్రలో యే గ్రంథి దాకా వచ్చామని, యే స్థాయిలో ఉన్నామని, జిజ్ఞాస కలుగుతూ ఉంటుంది. ఇది సమంజసమే కొంతవరకూ. మరి కొంతమంది కొన్ని గ్రంథాలు చదివి ఆయా స్థాయిలకు అప్పుడే చేరుకున్నామని కూడా భ్రమల్లో పడిపోతూ ఉంటారు. అలాగని తెలుసుకోలేమనీ కాదు నా అభిప్రాయం. ఇది భ్రమా, నిజమా అన్న సందేహం అస్సలు ఏర్పడకుండా ఉన్న క్షణంలో అది సత్యమవుతుంది. ఇది ఎవరి మనస్సాక్షి వారికే వెల్లడిస్తుంది.
అయితే నిజానికి ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏమిటి? శరీరం ఎదుగుతున్నదనడానికి ఎటువంటి సూచనలున్నాయో, మనసు ఎదుగుతోందనడానికి ఎటువంటి సూచనలున్నాయో, అలాగే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామనడానికి ఏమైనా సూచనలున్నాయా? ఉన్నాయి. వాటినే ఆధ్యాత్మిక విలువలు అంటాం. ఏమిటవి? మానసిక ప్రశాంతత, మనసు నిశ్చలంగా ఉండటం, శాంతి, ఆనందము, మౌనం, ప్రేమ, విశ్వాసము, సరళత్వం, శుచిగా ఉండటం, త్రికరణ శుద్ధి - మనసా, వాచా, కర్మణా శుద్ధిగా ఉండటం, ఇతరుల మనసులను బాధపెట్టని మనస్తత్త్వం, ధైర్యం, నిర్భయత్వం, ఏకాగ్రత, సూక్ష్మత్వం, హృదయంలోని తేలికదనం, వాక్శుద్ధి, ఇత్యాదివి. ఇవి సాధన చేస్తున్న కొద్దీ రోజురోజుకీ పెరుగుతూండటం (ఈ పెరగడానికి నిజానికి అంటూ లేకపోయినప్పటికీ) గమనించగలిగితే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లే. ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ సాధకుని చేతనంలో పరివర్తన కలిగి, శుద్ధి జరుగుతూ ఉంటుంది. అలా చైతన్య శుద్ధి జరుగుతుంది. దీన్నే చైతన్య వికాసం అని, ఆధ్యాత్మిక వికాసం అని చెప్పుకోవచ్చు.
ఇక చక్రాలపరంగా ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఏమిటి? ఒక్కొక్క చక్రానికి తనకు సంబంధించిన ఒక్కొక్క రకమైన చేతనం ప్రబలంగా ఉంటుంది. సాధకుడి సాధన ద్వారా ఒక్కొక్క చక్రం శుద్ధి జరిగినప్పుడు ఆయా చక్రానికి సంబంధించిన చైతన్యం వ్యక్తిలో ప్రబలంగా ఉంటుంది గమనిస్తే. గురువు దీన్ని స్పష్టంగా గమనించగలుగుతాడు. అన్ని చక్రాల శుద్ధి జరిగినప్పుడు, ఆధ్యాత్మిక ప్రయాణం సమగ్రంగా జరిగినప్పుడు, గురువులా పరిపూర్ణ వ్యక్తిత్వంగా మారడం లేక పరిపూర్ణ వ్యక్తిత్వంగా పరివర్తన చెందడం జరుగుతుంది.
ఈ చైతన్య శుద్ధి ఎలా జరుగుతుంది? మనసు, బుద్ధి, అహంకారము శుద్ధి జరిగినప్పుడు.
మనసు, బుద్ధి అహంకారము ఎలా శుద్ధం అవుతాయి?
ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన, దశనియమాల జీవన శైలిని అవలంబించడం వల్ల వీటి శుద్ధి జరుగుతుంది.
కాబట్టి అభ్యాసం, అభ్యాసం, అభ్యాసమే మనం అనుసరించవలసినవాటిల్లో కీలకమైన అంశం.
తథాస్తు.