ధీశక్తి - ధ్యానం - 3
సంకల్పం
(Will, Suggestion)
ఆధ్యాత్మిక సందర్భంలో సంకల్పం అంటే ఇచ్ఛాశక్తితో కూడిన ఆలోచన.
ఆలోచన + ఇచ్ఛాశక్తి = సంకల్పం
సంకల్పాలు లేనిదే యేమీ జరగవు జీవితంలో. ఈ సూత్రం మామూలు సాంసారిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా వర్తిస్తుంది. వాడుక భాషలో చెప్పుకోవాలంటే సంకల్పం అంటే మనసులో అనుకోవడం. మనసులో అనుకోకుండా ఏ పనీ చేయలేం. ఉదాహరణకు ఉదయం గంటలకు లేవాలి అని మనసులో రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటేనే మనం ఆ సమయానికి లేవగలుగుతాం. మన శరీర వ్యవస్థ లేదా ప్రకృతి విచిత్రంగా ఈ సంకల్పానికి స్పందిస్తుంది. ఇది మనందరి అనుభవమే. అనుకుంటే జరిగి తీరుతుంది. సంకల్పం ఎంత దృఢంగా ఉంటే , ఎంత పవిత్రమైనదైతే అంతా త్వరగా నెరవేరుతుంది.
సాంసారిక జీవనంలో Think, Do, and Achieve అంటారు. అంటే సంకల్పించుకోవడం, సంకల్పం పనిగా తర్జుమా కావడం, ఆ తరువాత సంకల్పించినదాన్ని సాధించడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక జీవనంలో Think and Achieve అంటే సంకల్పం చేసుకోగానే, సాధించడం జరుగుతుంది అని అనేవారు చారీజీ. అందుకే హార్ట్ఫుల్నెస్ ధ్యానసాధనలో ధ్యానం ప్రారంభించే ముందు ఒక సంకల్పం చేస్తాం, ఆ సంకల్పమే ధ్యానంగా మారిపోతుంది.
అయితే ఈ సంకల్పం ఎంత సూక్ష్మంగా చేసుకోగలిగితే అంత శక్తివంతంగా, అంతా త్వరితంగానూ సాకారమవుతుంది. సంకల్పం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నట్లయితే అటువంటి సంకల్పాన్ని దివ్య సంకల్పం అని అంటాం. అటువంటి సంకల్పాలు వెనువెంటనే సాకారమవుతాయి. మన సాధన అంతా కూడా మన సంకల్పాలు దివ్య సంకల్పాలుగా మారే దిశగానే కొనసాగాలి.
సంకల్పంలో పవిత్రతా భావం, సూక్ష్మ ఆలోచనా శక్తి, తగినంత ఇచ్ఛాశక్తి కీలకం. మనిషి సంకల్పం, దైవసంకల్పానికి అనుగుణంగా ఉన్నప్పుడు అవి నెరవేరుతాయి. దీనికి ఆధ్యాత్మిక సాధన కీలకం. అప్పుడు జీవితమే దైవసంకల్పానికి అనుగుణంగా నడుస్తూ ఉండే అవకాశం ఉంటుంది.
(సశేషం ...)