16, నవంబర్ 2020, సోమవారం

తపన, తీవ్ర ఆకాంక్ష, పరితప్త హృదయం

 తపన, తీవ్ర ఆకాంక్ష, పరితప్త హృదయం 

జీవితంలో ఏది సాధించాలన్నా తపన లేనిదే సాధ్యం కాదు. తపన ఎంత తీవ్రంగా ఉంటే గమ్యం లేక మన లక్ష్యం అంత చేరవవుతుంది. ఇది అన్నీ విషయాల్లోనూ వర్తిస్తుంది. అతిముఖ్యంగా ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవడానికి, లేక అనుకున్న ఆశయాన్ని సాధించడానికి లేక మానవ పరిపూర్ణతను సాధించడానికి చాలా అవసరం. 

ఆధ్యాత్మిక తపన అనేది మనలో ఉండే ఒక వెలితి వల్ల వస్తుంది; ఒక ఖాళీ వల్ల వస్తుంది; ఒక అసంపూర్ణ భావం వల్ల కలుగుతుంది; ఒక అశాంతి ఏర్పడుతుంది; ఇదే గమ్యానికి జేర్చే ఇంధనం. ఇదే మనం అహంకారం సృష్టించే తుచ్ఛమైన అవరోధాలను తొలగించేది కూడా. ఇదే మనలో ఉన్న తత్త్వ వేత్తను వెలికి తీసేది కూడా. 

ఉదాహరణకు సిద్ధార్థుడు అప్పటి వరకూ ఏ కష్టమూ ఎరగకుండా జీవించినవాడు, ఒక రోజున, ఒక శవాన్ని చూసి, ఒక వ్యాధిగ్రస్తుడిని చూసి, ఒక వృద్ధుడిని చూసి, తీవ్ర వేదనకు లోనై మనిషి ఈ విధంగా కష్టాలకు లోనవడానికి మూలకారణం ఏమిటో తెలుసుకోవాలన్న తపన బయల్దేరి, ఆ కారణం తెలుసుకునే వరకూ ఆయన మనసులో మరేదీ లేకుండా పరిష్కారాన్ని కనుగొని, గౌతమ బుద్ధుడవుతాడు. ఇలా కొన్ని సంఘటనల వల్ల కొందరిలో తీవ్ర తపన కలుగవచ్చు. 

మరో ఉదాహరణ శ్రీరామకృష్ణ పరమహంస. వారిలో తపన ఎలా ఉండేదంటే, ప్రతీ రోజూ రాత్రి చీకటి పడగానే  "అయ్యో భగవంతుని సాక్షాత్కారం గాకుండగానే మరో రోజు గడచిపోయిందే!" అని రాత్రుళ్ళు విలపిస్తూ ఉండేవారట. అదీ వారి తపన. అలా రామకృష్ణ, శ్రీరామకృష్ణ పరమహంసగా మారడం జరిగింది. 

ఇక ఆయన శిష్యుడు స్వామి వివేకానంద తపన ఎలా ఉండేది? అతి పిన్న వయసులో అసలు భగవంతుడు ఉన్నాడా లేదా? అని తెలుసుకోవాలనుకున్నాడు; ఉంటే ఎవరైనా చూశారా? అటువంటి వ్యక్తి కోసం విపరీతమైన శాంతితో కనిపించిన వ్యక్తిని "నువ్వు దేవుడిని చూశావా?" అని ప్రశ్నించేవారట. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే వరకూ ఆయనకు నిద్ర పట్టేది కాదట; అటువంటి తీవ్ర తపనే నరేంద్రుడిని శ్రీరామకృష్ణ పరమహంస వద్దకు చేర్చింది. స్వామి వివేకానందుడిగా పరివర్తన చెందడం జరిగింది.  

లక్ష్యాన్ని బట్టి తపన తీవ్రత అవసరమవుతుంది. కొన్ని లక్ష్యాలకు ఎక్కువ తపన అవసరం ఉండదు. కానీ మానవ వికాసం, భగవంతునితో పరిపూర్ణ ఐక్యం, ఆధ్యాత్మికోన్నతి, మోక్షప్రాప్తి, కర్మరాహిత్యం వంటి పరమ సూక్ష్మ లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు అతి తీవ్రమైన తపన అవసరమవుతుంది లేకపోతే మనం చేపట్టిన సంకల్పం పూర్తవకుండానే ఆగిపోతుంది. 

కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలో మనలను నడిపించవలసినది, నడిపించేది  తపన మాత్రమే. తపన ఏ విధంగా ఉండాలంటే దారిలో ఉండే కలుపుమొక్కలను, అవరోధాలను దగ్ధం వేసే విధంగా ఉండాలి. 

అటువంటి తపన ప్రతీ వ్యక్తి ఆత్మలోనూ నిక్షిప్తమై ఉంది. ప్రతీ ఆత్మలోనూ ఉంది; అది వివిధ రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది - డబ్బు కోసం, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, అధికారం కోసమూ, ఇలా అనేకరకాలుగా మనిషిలో వ్యక్తమవుతూ ఉంటుంది. అయినా ఇవేవీ మనిషికి సంతృప్తినివ్వవు. స్వతః సిద్ధంగా ఉండే తపన తన మూలాన్ని చేరుకొనే వరకూ ఆ ఆత్మ విశ్రమించదు. పడుకోనివ్వదు. సాధారణంగా నిద్రాణ స్థితిలో ఉంటుంది. 

మనిషికి అస్తిత్వానికి సంబంధించిన కష్టాలు ఎదురైనప్పుడు సాధారణంగా తన మూలాలను తెలుసుకునేందుకు ఆరాటపడటం మొదలవుతుంది; ఇంచుమించు పునాదులు కదిలే విధంగా పరిస్థితులు తటస్థమైనప్పుడు ఇటువంటి  ప్రశ్నలు ఆత్మలో తలెత్తి, వాటికి సమాధానం దొరికే వరకూ పరితపిస్తూ ఉంటుంది ఆత్మ. అటువంటి తపనే తనకనువైన ఆధ్యాత్మిక మార్గానికి లేదా మార్గదర్శనం చేసే గురువు వద్దకు దారి తీస్తుంది. అదే గమ్యాన్ని చేరుకొనే వరకూ కూడా ఆత్మను నడిపిస్తుంది కూడా. 

అయితే సహజంగా ప్రతీ ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న ఈ  తపనను పెంచుకోవచ్చు కూడా. అది ధ్యానం వల్ల సాధ్యం. ఆధ్యాత్మికతలో  త్వరితంగా గమ్యం చేరడానికి ఇంధనం లాంటిది ఈ తపన. ధ్యానంలో నిమాగ్నమైన కొద్దీ గమ్యానికి చేరువవుతున్న అనుభూతి ఆత్మకు కలగడం వల్ల గమ్యాన్ని చేరుకోవాలన్న తపన రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది. గమ్యం చేరుకుంటున్నానన్న విశ్వాసం మరీ మరీ పెరుగుతూ ఉండటం వల్ల మనలో వికాసం జరగడం కూడా గమనిస్తూ ఉంటాం. 

అన్నిటికంటే అతివిచిత్రమైన విషయం ఏమిటంటే, ఆత్మ పడే తపనను, పరమాత్మ ఆత్మ కోసం పడే తపనతో పోలిస్తే అస్సలు పోల్చలేనంత తీవ్రంగా ఉంటుందని ఒకసారి  బాబూజీ చెప్తారు.  

తపన తీవ్రతరం చేసుకోవడానికి గ్రంథాలు చదవడం వల్ల గాని, సత్సాంగత్యం వల్ల గాని, ధ్యానం వల్ల గాని, స్వార్థం లేకుండా కర్మ చేయడం వల్ల గాని, చింతన వల్ల గాని, సేవ వలన గాని, వీటన్నిటి వల్ల గాని పెరగవచ్చు. తపన అంటే ఆధ్యాత్మిక ఆకలి; ఆ ఆకలి ద్వారా ఆ పరమాత్మను ఆత్మ స్మరిస్తూ ఉంటుంది; అందుకే ఆ తపన ఎంత తీవ్రంగా ఉంటే తన ప్రియతముడైన పరమాత్మను అంతా త్వరితంగా చేరుకుంటుంది. 

భగవంతుని కోసం నిజమైన తపన ఎలా ఉంటుందంటే, నీటిలో మునిగిపోతున్నవాడు ప్రాణం కోసం ఏ విధంగా పరితపిస్తాడో, అలా ఉంటుందట. అటువంటి తపన సాధకుడిని గమ్యానికి త్వరితంగా చేరుస్తుంది. 

సహజంగా ప్రతీ ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న ఈ తపనను సాధకుడు, సత్సాంగత్యం ద్వారా, ఆధ్యాత్మిక గ్రంఠా ధ్యయనం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ధ్యానం ద్వారా, గురువుల శుశ్రూష ద్వారా, స్వచ్ఛంద సేవ ద్వారా మరింతగా రగిలేలా చేసుకోవచ్చు.

అందుచేత అటువంటి ఆధ్యాత్మిక ఆకలిని, తపనను, ఆధ్యాత్మిక తృష్ణను, అందరూ విపరీతంగా పెంచుకుందురుగాక! అటువంటి తీవ్ర తపనతో ఎప్పుడూ మన హృదయాలు నిండి ఉండుగాక! 

23, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం

శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం 

ఏ విద్యను అభ్యసించాలన్నా మన పెద్దవాళ్ళు, శాస్త్రాలు, 3 మెట్ల సోపానాన్ని అధిరోహించవలసి ఉందని సూచించడం జరిగింది - 1) శ్రవణం 2) మననం  3) నిధిధ్యాసన ఫలితంగా కలిగేది సాక్షాత్కారం. 

కేవలం శ్రవణంతో సరిపోదు. సాధారణంగా మనం శ్రవణంతో ఆగిపోతూ ఉంటాం. అందుకే విషయాన్ని గురించిన సమగ్ర అవగాహన ర్కపోవడం, అది మనకు అవసరమైనప్పుడు అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అతిముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యనభ్యసించడానికి లేక బ్రహ్మ విద్యనభ్యసించాలనుకున్నవారికి, ఈ మూడు మెట్లను సాయశక్తులా   అనుసరించడం చాలా అవసరమబవుతుంది, మన యాత్ర సజావుగా సాగడానికి.

1) శ్రవణం: అంటే గురువులు, పెద్దలు చెప్పినది సావధానంగా వినడం, విద్యకు సంబంధించిన గ్రంథాలను చదవడం గాని, ఈరోజుల్లో దృశ్య/శ్రవణ మాధ్యమాల ద్వారా వినడం/వీక్షించడం, ఇవి కూడా శ్రవణంలోకే వస్తాయి. 

కమ్యూనికేషన్ స్కిల్స్ లేక సంభాషణా కుశలతల్లో అతి ముఖ్యమైనది సావధానంగా వినగలగడం, అవధరించడం. వినడం రానివాడికి ఎప్పటికీ సరైన జ్ఞానం అబ్బదు. అంతేకాదు, వినడం రానివాడు, ఏదీ నేర్చుకోలేడు. వినడానికి ఇష్టపడనివాడు వితండవాదిగా తయారయ్యే ప్రమాదం ఉంది; అహంకారిగా మారే ప్రమాదం ఉంది. ఏదైనా చెబుతున్నప్పుడు వినిపించుకోని వ్యక్తికి దూరంగా ఉండాలి. కాబట్టి శ్రవణం అనేది జ్ఞాన సముపార్జనకు మొదటి మెట్టు. వినవలసి వచ్చినప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకొని ఇనాలి, ముఖ్యంగా గురువు చేసే బోధనలను ఈ విధంగా వినాలి; వాడుక భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. లేకపోతే చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది. 

2) మననం : వినడంతో ఆపేయక విన్నదానిని గురించి మననం చేసుకోవాలి. అంటే విన్న విషయాన్ని గురించి మరింత లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయడం; సందేశాన్ని ఇచ్చిన గురువు యొక్క మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం; వినదాన్ని ఆస్వాదించే ప్రయత్నం; వినదాన్ని కూలంకషంగా నెమరు వేసుకొనే ప్రయత్నం; ఇవన్నీ చెయ్యాలి.

3) నిధిధ్యాసనం : విన్నదాన్ని, మననం చేసినా కూడా జ్ఞాన సముపార్జన పూర్తి కాదు. మననం చేసిన తరువాత, సారాంశం లేక ప్రసంగించినవారి హృదయం  బోధపడిన తరువాత, ఆ సారాంశంపై కొంత సేపు ధ్యానించాలి. అప్పుడు మనం విన్నది,చదివినది మన శరీర వ్యవస్థలో జీర్ణమైపోతుంది, ఆ జ్ఞానం మన స్వంతమైపోతుంది. మన శరీర వ్యవస్థలో అంతర్భాగమైపోతుంది. ఏ విధంగానైతే తిన్న ఆహారం జీర్ణమై మన శరీర వ్యవస్థలో మనకు అవసరమైన  బలంగా  మారుతుందో, అదే విధంగా ఈ జ్ఞానం కూడా మనలో అంతర్భాగమై మనకు అవసరమైన స్ఫూర్తిగానూ, శక్తిగానూ మారి మనకు అవస్రమైనప్పుడల్లా ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటుంది.

ఈ మూడు మెట్లను మనం ఏదైనా నేర్చుకున్న ప్రతీసారీ, ముఖ్యంగా బ్రహ్మ విద్య లేక గూవులు చేసేబోధలను అనుసరించినప్పుడు ఫలితంగా మనం ఏ విషయాన్నైతే అభ్యసించే ప్రయత్నంలో ఉన్నామో ఆ విషయం యొక్క సాక్షత్కారం జరుగుతుంది. 


15, ఆగస్టు 2020, శనివారం

యోగం అంటే ఏమిటి?

యోగం అంటే ఏమిటి?

యోగం అంటే మన శాస్త్రాలు చెప్పేది ఏమిటి?

యోగం అంటే ఇక్కడ మనం నాలుగు నిర్వచనాలు చెప్పుకుందాం:

1.    యుజ్యతే ఇతి యోగః

2.    యోగః చిత్తవృత్తి నిరోధః

3.    యోగః కర్మసు కౌశలం

4.    యోగస్థః కురు కర్మాణి

1)     యోగం అంటే ఏమిటి?

    యుజ్యతే ఇతి యోగః – కలయికే యోగం అంటే. రెండుగా ఉన్నవి ఒక్కటిగా మారిపోవడం; నీటి చుక్క సముద్రంలో కలిసినప్పుడు సముద్రంగా మారిపోవడం. ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడు పరమాత్మగా మారిపోవడం.

2)    ఈ యోగాన్ని సాధించడం ఎలా?

    యోగః చిత్తవృత్తి నిరోధః – చిత్తంలోని అనేక రకాల వృత్తులను, అనేక రకాల తత్త్వాలను నిరోధించడమే యోగం. చిత్తం అంటే చైతన్యం; చైతన్యం అనేది ప్రధాన నాలుగు సూక్ష్మశరీరాల్లో ఒకటి; కాని ఇందులోనే మనసు, బుద్ధి, అహంకారం అనే మూడు ఇతర సూక్ష్మశరీరాలుంటాయి. వీటన్నిటినీ శుద్ధి చేస్తే చిత్తశుద్ధి తనంతతానుగా జరుగుతుంది.

3)    యోగం సాధిస్తే ఏమిటి ప్రయోజనం?

    యోగః కర్మసు కౌశలం – యోగసాధన వల్ల మనం చేసే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది, కుశలత పెరుగుతుంది, పనితనం పెరుగుతుంది. పనితనం పెరగడం వల్ల అమోఘమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది; చేసిన పని సార్థకమవుతుంది; జీవితమే సార్థకమవుతుంది.

4)    మనం చేసే పనులు ఏ విధంగా చెయ్యాలి?

    యోగస్థః కురు కర్మాణి – యోగసాధన వల్ల కలిగిన యోగస్థితిలో ఉంటూ కర్మలు చేసినప్పుడు సంస్కారాలు/వాసనలు అంటవు. ఏ పనీ మోహంతో చేయడం ఉండదు. యోగశితి మనిషికి కనిపించని కవచమ్లా పని చేస్తుంది; ఈ విధంగా జీవితం కొనసాగినప్పుడు, జన్మరాహిత్యం లేక మోక్షం అనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితి ఆతరువాత ఆత్మసాక్షాత్కారం అనే అత్యున్నత ఆద్యాత్మిక స్థితి అనుభవంలోకి వస్తుంది.

కాబట్టి యోగసాధన ప్రతి ఒక్కరికీ అనివార్యము. భూమిపై శ్రేష్ఠమైన విధంగా జీవించే జీవన విధానం ఈ యోగవిద్య లేక బ్రహ్మ విద్య మనకు నేర్పిస్తుంది. మనిషి మరింత మరింత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదిగే ఏకైక మార్గం యోగం. హార్ట్ ఫుల్ నెస్ యోగ విధానం అనేది ఇటువంటి యోగవిద్యను ఆధునిక మానవుని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యోగవిద్యనందించే రాజయోగ విధానం. అందరూ ప్రయత్నింతురుగాక!

 

 

9, ఆగస్టు 2020, ఆదివారం

మార్పు, పరివర్తన, పరిణామం/వికాసం


 
మార్పు, పరివర్తన, పరిణామం/ఆత్మ-వికాసం

ప్రతి మనిషీ మారాలనుకుంటాడు; మరింత మెరుగైన విధంగా మారాలనుకుంటాడు. ఎంతవరకూ మారాలి? పరిణామానికి/వికాసానికి అంతు ఉందా? అసలు మారడం అంటే ఏమిటి? ఏ విధంగా మారాలి? పరివర్తన అంటే ఏమిటి? పరిణామం లేక ఆత్మ-వికాసం అంటే ఏమిటి? మనిషి అసలు మారతాడా? మారితే ఎప్పుడు మారతాడు? మారాలంటే ఎలా మారాలి? ఎక్కడ ప్రారంభించాలి? మారితే మనలో మారవలసినది ఏది? మారడానికి ఎవరైనా సహకరించగలరా? ఏమైనా ఉపాయాలున్నాయా? లేక మనం ఏమీ చెయ్యక్కర్లేకుండానే ఏ ప్రయత్నమూ లేకుండానే మారిపోతామా?వికాసం చెందుతామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

 మనిషి ఖచ్చితంగా మారవలసిందే. ఏ విధంగా అంటే రోజు రోజుకూ మరింత మెరుగైన విధంగా మారాలి.

·         మనిషిలో పశు తత్త్వాలు, మనిషి తత్త్వాలు, దైవ తత్త్వాలు మూడూ ఉన్నాయి. పశుత్వం ఎక్కువగా ఉంటే మనిషివా, పశువ్వా? అంటారు; అదే మానవీయ లక్సణాలతో నిండి ఉంటే – అతను మహా మనీషి అంటారు; అలాగే మనిషిలో దైవత్వం ఉట్టిపడుతూ ఉంటే – మనిషి కాదండీ, దేవుడండీ అంటాం. కాబట్టి ఆకారఁ మనిషిదే అయినా ముందు సరైన మనిషిగామారవలసి ఉంది, ఆ తరువాత మనిషి దైవంగా మారవలసి ఉంది తత్త్వపరంగా.

·         అలాగే ఈ మానవ వ్యవస్థలో మూడు శరీరాలున్నాయి:

o   స్థూల శరీరం (అంటే కనిపించే ఈ భౌతిక శరీరం), దీనికి వయసు వస్తుంది తప్ప పెద్దగా మారేది ఉండదు; దీని వికాసానికి పరిమితులున్నాయి.

o   సూక్స్మ శరీరం (ప్రధానంగా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారాలు) ఈ నాల్గింటినీ కలిపి అంతఃకరణ అని కూడా అంటారు. స్థూల శరీరంతో పోలిస్తే దీనికి మారే అవకాశాలెక్కువ, వికాసానికి పరిమితులు తక్కువ.

o   కారణ శరీరం (అంటే ఆత్మ). ఇది ఏకపోతే తక్కిన రెండు శరీరాఅకు అస్తిత్వమే ఉండదు. ఇది మార్పులేనిది, నాశనము లేనిది.

o   కాబట్టి మనిషి మారాలంటే మన సూక్స్మ శరీరం మారాలి; అంటే మంసు, బుద్ధి, అహంకారము, చిత్తము లేక చైతన్యం మారాలి. మనిషి ఎలా ఉన్నాడోఅలా ఉండటానికి కారణం అతని చైతన్య స్థితే; అందులో నిక్షిప్తమై ఉన్నవే మనసు, బుద్ధి, అహంకారము. ఇవి తమ పవిత్రతను కోల్పోయి, కలుషితమైపోయాయి. వీటిని శుద్ధి చేస్తే గాని మనిషిలో నిజమైన మార్పు, పరివర్తన/వికాసం జరుగదు.

·         మనిషి అసలు మారేదెప్పుడు? మనిషి అతను మారాలనుకున్నప్పుడే మారగలుగుతాడు. లేకపోతే మనలను సృష్టించిన భగవంతుడు కూడా మార్చలేడు. కావున మనిషి హృదయపూర్వకంగా మారాలనుకుంటేనే మారతాడని బాగా అర్థం చేసుకోవాలి.

·         మనిషి తనంత తాను ఎవరి సహాయం లేకుండా తన సూక్స్మ శరీరాలను శుద్ది చేసుకోగలడా అంటే అది సాధ్యపడినట్లయితే గనుక మనిషి ఎప్పుడో మారి ఉండేవాడు; అది జరగడం లేదు గనుక బయట నుండిఒక మార్గదర్శి లేక గురువు రూపంలో, ఆ గురువుబోధించే యోగ విధానాన్ని అనుసరించడం ద్వారా మనిషికి సహాయం అందుతుంది.

·         చివరిగా మార్పుకు, పరివర్తనకు వ్యత్యాసం ఏమైనా ఉందా? రెండూ ఒక్కటేనా? మనం వాడుకలో రెండూ ఒక్కటిగానే ఉపయోగిస్తున్నా, ఈ రెంటి మధ్య తేడా ఉందనే చెప్పాలి. ఉదాహరణకు, గొంగళిపురుగు సీతాకోక చిలుకగా మారడం, పరివర్తన; రత్నాకరుడు అనే బందిపోటు వాల్మీకి మహర్షిగా తయారవడం పరివర్తన. సీతాకోక చిలుకలో గొంగళి పురుగుకు సంబంధించిన లక్షణాలేవీ కనిపించవు. అలాగే వాల్మీకి మహర్షిలో రత్నాకరుడు లక్షణాలేవీ కనిపిఁచవు. అదీ పరివర్తన. పరివర్తన చెందే దశకు ముందు అనేక మార్పులు జరుగుతాయి గొంగళిపురుగులో. మార్పులో విషయం మారదు, విషయంలోని అంశాల అమరిక మారుతుంది. పరివర్తనలో విషయమూ పూర్తిగా మారిపోతుంది, విషయం లోని అంశాల అమరిక కూడా పూర్తిగా మారిపోతుంది.

·         కాబట్టి ముఖ్యంగా ఆధునిక పరిస్థితుల్లో తనకు తాను సమయఁ ఇచ్చులేకుండా తీరిక లేకుండా  జీవిస్తున్న మానవులకు అనుకూలమైన, చాలా ప్రభావపూరితమైన సర్ళమైన యౌగిక ప్రక్రియలు మన హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన పద్ధతిలో ఎన్నో ఉన్నాయి. కేవలం మూడు నెలల కాలం అభ్యాసం నిర్దేశించిన విధంగా చేసినప్పుడు పైన చెప్పిన వాటిల్లో నిజాన్ని ఎవరికి వారు ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. ప్రయత్నించి చూడాలి. మానవ ప్రయత్నం ఉన్నప్పుడే దైవం యొక్క అనుగ్రహం పని చేస్తుంది, త్వరితంగా ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి మానవ ప్రయత్నఁ ఉంటేనే ఆత్మ వికాసం, ఆత్మోన్నతి, జీవిత సార్థక్యం.

 

 

5, ఆగస్టు 2020, బుధవారం

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని గురించి అందరిలో తరచూ కలిగే ప్రశ్నలు

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని గురించి 

అందరిలో తరచూ కలిగే ప్రశ్నలు

మనం ధ్యానం ఎందుకు చెయ్యాలి? ముఖ్యంగా హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం ఎందుకు చెయ్యాలి?

మనలో సహజత్వం పునరుద్ధరింఛుకోవడానికి. మనలో ఉన్న ఎన్నో అసహజమైన తత్తాలు ధ్యానం చేస్తున్న కొద్దీ వీడ్కోలు పలుకుతాయి. రోజురోజుకూ మన శ్శాంతి పెరుగుతూ ఉంటుంది. పైగా ధ్యానమే చేయగా-చేయగా జీవితంలో మన లక్షం ఏమిటో కూడా స్పష్టం చేస్తుంది. ఇదీ ధ్యానం మనలో కలుగజేసే అద్భుతం. దీన్నే ఆత్మవికాసం అంటారు.

మనలో ఉండే ఈ అసహజమైన తత్త్వాలేమిటి?

మన చింతలు, భయాలు, మలినాలు, కోరికలు, కామం, కోపం, పిసినారితనం, మదం, అన్నీ స్వంతం చేసుకోవాలనుకోవడం, అసూయ, జటిలమైన స్వభావాలు, ఇవన్నీ మనలో ఉండే అసహజమైన తత్తాలు. అవునా కాదా? ఇవన్నీ మనకు అడ్డు వస్తున్నాయా లేదా మనం ముందుకు సాగడానికి? మరి వీటిని తగ్గించుకోవడం గాని లేక పోగొట్టుకోవడం గాని ఎలా చెయ్యడం?

మనశ్శాంతి పెరిగితే ఏమవుతుంది?

మనశ్శాంతి పెరిగితే పనులు ప్రశాంతంగా సరిగ్గా చెయ్యగలుగుతాం; ఆలోచనలో స్పష్టత కలుగుతుంది; తెలియకుండా సహజంగానే మనలో విలువలు పెరుగుతాయి; మానవ సంబంధాలు మెరుగుపడతాయి; ఆరోగ్యం కూడా మెరుగవుతుంది; చంచలమైన మనస్సు క్రమక్రమంగా క్రమబద్ధమవుతుంది; అన్నిటికంటే ముఖ్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవన్నీ మనకు అవసరమా కాదా?

ఈ మార్పులన్నీ రావడానికి ఎంత సమయం పడుతుంది?

అది మనకు మన పట్ల ఉన్న నిబద్ధతను బట్టి, మన తపనను బట్టి, మన సంసిద్ధతను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటువంటి మార్పులు కొన్ని మనలో మూడు నెలల్లోనే సంభవించడం గమనించుకోవచ్చు. దీనికి నిర్దేశించిన విధంగా ఈ హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిని అనుసరించవలసి ఉంటుంది. ఈ మార్పులు మనలను ఈ సాధనను కొనసాగించడానికి తగిన ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి.

మనిషి మారాలి, మారాలి అంటూంటారు? ఏమిటి మారుతుంది మనలో?

మనిషి అనే వ్యవస్థలో మూడు శరీరాలున్నాయి - స్థూల శరీరం: అంటే కనిపిస్తోన్న ఈ భౌతిక శరీరం

సూక్ష్మశరీరం: అంటే మనలో ఉండే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇత్యాదివి; వీటన్నిటినీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు. కారణ శరీరం: ఆత్మను కారణ శరీరం అంటారు; ఏది లేకపోతే పై రెండు శరీరాలూ ఉండవో దాన్ని ఆత్మ అని అంటారు.

వీటిల్లో స్థూల శరీరం సహజంగానే మారుతూనే ఉంటుంది; శారీరక మార్పుల్లో మనిషి యొక్క ప్రమేయం పెద్దగా ఏమీ ఉండదు. ఆత్మ లేక కారణ శరీరం శుద్ధమైనది, మార్పులేనిది కాబట్టి అది మారేది ఏమీ ఉండదు.

ఇక మిగిలినది సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం, చైతన్యం - ఈ నాలుగూ సూక్ష్మ శరీరంలోని ప్రధాన అంశాలు. నిజానికి మనసు బుద్ధి అహంకారం వంటి సూక్ష్మ శరీరాలన్నీ చైతన్యం అనే ఆకాశంలో నక్షత్రాల్లా ఇమిడి ఉంటాయి. కాబట్టి మనిషి మారడమూ అంటే ఇవే మారాలి- అంటే మన మనసు, బుద్ధి అహంకారము అనేవి శుద్ధంగా తయారయ్యేవరకూ మారాలి, అంటే భగవంతుడు సృష్టించినప్పుడు ఉన్న విధంగా తయారవ్వాలి; అప్పుడు చైతన్యం కూడా శుద్ధంగా పవిత్రంగా, ఉండవలసిన విధంగా ఉండటం జరుగుతుంది. దీన్నే మనం ఆత్మ వికాసం అంటాం. కాబట్టి మనిషి మారాలి అన్నప్పుడు అతనిలో మారేది ఈ సూక్ష్మ శరీరమే. ఇది మన చేతుల్లోనే ఉంది. నిజానికి మన సమస్యలన్నీ పరికించి చూస్తే మనసు చుట్టూ, బుద్ధి చుట్టూ, అహంకారం చుట్టూనే అల్లుకొని ఉన్నాయి. దీని వల్ల మన చైతన్య స్థితి కూడా కలుషితమైపోయింది. వీటిని శుద్ధి చేసుకోవడం ద్వారా మన విధిని మనమే రూపకల్పన చేసుకోవచ్చును ఈ విధంగా, భగవంతుని నిందించకుండా.

అంటే ఈ హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతి సూక్ష్మ శరీరాన్ని శుద్ధీకరించి పవిత్రం చేస్తుందన్నమాట. ఇది మనం అనుభవపూర్వకంగా కొద్ది కాలంలోనే తెలుసుకోవచ్చు. సంపూర్ణంగా తెలుసుకోవడాన్నే ఆత్మ సాక్షాత్కారం లేక దైవ సాక్షాత్కారం అని కూడా అంటారు.

అంటే ఈ హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతి మనం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి అత్యంత ఉత్కృష్టమైన ఆత్మ-సాక్షాత్కార స్థితికి చేర్చగలదు. అదే జీవిత పరమార్థం, మనం మానవ జన్మెత్తినందుకు దాన్ని సార్థకం చేసుకొనే ప్రయోజనమూ కూడా. వెరసి ఈ ధ్యానం ప్రతీ మనిషిని మరింత మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చి దిద్దగలదు.

అయితే దీనికి కావలసిన అర్హత ఏమిటి?

దీనికి కావలసిన అర్హత కేవలం ఈ పద్ధతిని ప్రయత్నించాలన్న సంసిద్ధత; మనం మారాలన్న సంసిద్ధత మాత్రమే. అయితే వయసు 15 సంవత్సరాలు దాటినవారెవరైనా ప్రయత్నించవచ్చు.

దీనికి ప్రత్యేకంగా చెల్లించవలసిన రుసుములేమైనా ఉన్నాయా?

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యానంలో శిక్షణ జీవితం అంతా పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎటువంటి రుసుములూ లేవు.

ప్రతిరోజూ ఈ సాధనకు ఎంత సమయం వెచ్చించవలసి ఉంటుంది? మాకు సమయం ఉండదు...

మనం ఏ పనికైనా ప్రాధాన్యతనిచ్చినప్పుడే మనకు ఆ పని కోసం సమయం చిక్కడం జరుగుతుంది. లేకపోతే సమయం దొరకదు. ఈ సాధన మన ఆత్మవికాసానికి, మనం మరింత మెరుగైన వ్యక్తులుగా తయారవడానికి, ప్రశాంతతతో కూడిన జీవనానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈ పనికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వగలగాలి. ప్రతి నిత్యం మనం ధ్యానంతో రోజును ప్రారంభించాలి.

అయితే ఈ సాధన చేసుకోవడానికి ప్రారంభ దశలో మనకి అవసరమైన సమయం కేవలం కొన్ని నిముషాలు మాత్రమే. ఉదయం కనీసం ఒక అరగంట, ఆ రోజు పని పూర్తయిన తరువాత సాయంకాలం ఒక 20 నిముషాలు, ఆ తరువాత రాత్రి పడుకొనే ముందు ఓ 5 నిముషాలు వెచ్చించగలగాలి. ఈ కాస్త సమయం వెచ్చించగలిగితే మన రోజంతా మంగళకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన సత్యం.

ఈ ధ్యాన పద్ధతిని అనుసరించడం వల్ల ఏమైనా అద్భుతాలు జరుగుతాయా?

మనం అనుకొనే అద్బుతాలు జరుగకపోవచ్చును గాని ఈ సాధనను త్రికరణ శుద్ధిగా నిర్దేశించిన విధంగా అనుసరించినట్లయితే, మనిషి మరింత మెరుగైన మనిషిగా మారడమే గాక చివరికి ఒక దివ్యమైన వ్యక్తిగా మారే అద్భుతం జరిగే అవకాశం తప్పక ఉంది.

మేము సంసారం చూసుకోవాలి, చదువులు/ఉద్యోగాలు/వ్యాపారాలు చూసుకోవాలి; ఇవేమైనా విడిచిపెట్టవలసి ఉంటుందా?

సంసారానికి గాని, ఉద్యోగవ్యాపారాలకు గాని, మనం నిర్వర్తించవలసిన ఏ ఇతర బాధ్యతలనూ కూడా విడిచిపెట్టనవసరం లేకపోగా, వీటన్నిటినీ మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు; ఈ ప్రపంచంలో మనకు ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు; ఒత్తిడి లేకుండా జీవించగలుగుతారు; ఇతరులకు ఉదాహరణలుగా జీవించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అవసరమైన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. గృహిణులకు అవసరమైన ప్రేమ సహనమూ పెరుగుతాయి; పురుషుల్లో ఉండే చీకాకులు, చిటపటలు, కోపం, అసహనం తగ్గుతాయి.

 అసలు ఈ హార్ట్‌ఫుల్‌నెస్అంటే ఏమిటి?

హార్ట్‌ఫుల్‌నెస్ అంటే హృదయాన్ని అనుసరించి జీవించే జీవన విధానం. ఏ పనైనా హృదయపూర్వకంగా చేయడం; హృదయంతో మాట్లాడటం; హృదయం ఇర్దేశించిన విధంగానే ధైర్యంగా జీవించగలగడం. ఎందుకంటే మనందరిలో ఉండే హృదయం ఎప్పుడూ తప్పుడు ఆదేశాలివ్వడు. మన జీవితానికి అది దిక్సూచి. అయితే మనం బుద్ధినే అనుసరించి జీవిస్తున్నాం; నిజానికి బుద్ధి కూడా హృదయాన్ని అనుసరించే పని చేయాలి. కాని ప్రస్తుతం మన బుద్ధికి, హృదయానికి అనుసంధానం లేనట్లుగా బుద్ధి పని చేయడం వల్ల మనం అన్ని రకాల ఒత్తిళ్ళకు గురవుతున్నాం. ఈ వ్యవస్థను హృదయంపై ధ్యానించడం ద్వారా సరిదిద్దుకోవచ్చు. అదే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం.

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానంలో ప్రత్యేకతలేమైనా ఉన్నాయా?

ఈ ధ్యాన పద్ధతిలో రెండు విశిష్టతలున్నాయి: 1) ప్రాణాహుతి ప్రసరణ 2) శుద్ధీకరణ ప్రక్రియ.

ప్రాణాహుతి ప్రసరణ : ధ్యానం అంటే అంతర్ముఖులమై మనలోకి చూసుకొనే ప్రక్రియ. మన మనస్సును క్రమబద్ధీకరించే ప్రక్రియ. ఇది అంత తేలికైన పని కాదు. ఈ ప్రక్రియలో మనకు ప్రాణాహుతి అనే ఒక దివ్యశక్తి తోడుగా ఉంటూ మన ధ్యానంలోకి పూర్తిగా నిమగ్నమవడానికి సహకరిస్తుంది. ఇది ఆత్మను స్పృశించడం ద్వారా అత్యంత శాంతిని కలుగజేస్తుంది.

 శుద్ధీకరణ ప్రక్రియ. : హృదయంలో మనం ఇంతకు ముందు అనుకున్న, మనలో ఉన్న దివ్యత్వాన్ని కమ్మేసిన చింతలు, భయాలు, జటిలమైన తత్తాలు, నకారాత్మకమైన ఆలోచనలు, సంస్కారాలు, వీటన్నిటినీ క్రమక్రమంగా తొలగించుకొనే ప్రక్రియ, ఈ శుద్ధీకరణ లేక పునరుజ్జీవన ప్రక్రియ.

ఈ రెండు ప్రక్రియలూ ఒక పద్ధతి ప్రకారం అనుసరించినప్పుడు సాధకుడు ఒక మెరుగైన మనిషిగానే గాకుండగా ఒక దివ్యమైన ప్రేమ-మూర్తిగా, పవిత్రంగా మారగలుగుతాడు.

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిలో నిత్యం అనుసరించవలసిన సాధనా ప్రక్రియలేమిటి?

ఉదయం ఒక అరగంట ధ్యానంతో ప్రారంభించాలి; సాయంకాలం ఆ రోజు నిర్వర్తించవలసిన పనులన్నీ పూర్తయిన తరువాత ఒక 20 నిముషాలు ద్ధీకరణ లేక నరుజ్జీవన ప్రక్రియను చేసుకోవాలి; రాత్రి పడుకొనే ముందు ఓ 5 నిముషాలు ్రర్థనా-ధ్యానం చేసుకోవాలి.

మీ సంస్థ పేరేమిటి? దాని ఆశయం ఏమిటి?

మా సంస్థ పేరు హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్. శ్రీరామచంద్ర మిషన్ అనే లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ కు అనుబంధ సంస్థ. ఈ సంస్థ ద్వారా హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని అందించడం జరుగుతోంది.

దీని ఆశయం భూమ్మీదున్న ప్రతీ వ్యక్తికి ధ్యానాన్ని కనీసం పరిచయం చేయడం. తద్వారా మానవుల సమిష్ఠి చైతన్యంలో నిండిపోయిన వత్తిడిని సాధ్యమైనంత మేరకు తగ్గించడం, అందులో తగిన మార్పు సంభవించే విధంగా కృషి చేయడం. అందరికీ ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారా తేలికగా ధ్యానించే పరిస్థితిని కల్పించడం. ప్రతీ వ్యక్తి మనసులో శాంతి ఉంటేనే అందరూ కాంక్షించే ప్రపంచ శాంతి సాధ్యపడుతుంది కాబట్టిఅది ఈ ధ్యానం వల్ల కొద్ది రోజుల్లోనే సాధ్యపడుతుంది కాబట్టి, ఆ విధంగా ప్రపంచ శాంతికి తోడ్పడటమే ఈ సంస్థ ఆశయం. మనిషిని మరింత మరింత మెరుగైన విధంగా తీర్చి దిద్దుకొనే మార్గాన్ని, దానికి సంబంధించిన సేవలను ఉచితంగా యావత్ ప్రపంచానికి అందివ్వడమే ఈ సంస్థ ఆశయం.

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతికి మార్గదర్శకులెవరు?

ప్రస్తుత మార్గదర్శకులు పూజ్యశ్రీ కమలేష్ డి. పటేల్ గారు. అందరూ వారిని ఆప్యాయంగా దాజీఅని పిలుస్తారు. వీరు హైదరాబాదు శివార్లలో చేగూరులో కాన్హా శాంతి ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు. వీరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 130 దేశాల్లో ఉండే సాధకులకు మార్గదర్శిగా ఉన్నారు.

 ఈ ధ్యానం ప్రారంభించాలంటే ఏం చేయాలి?

ఈ ధ్యాన పద్ధతిని అనుసరించాలన్న ఆసక్తి గలవారు, సమీప హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రాన్ని గాని లేక సమీప హార్ట్‌ఫుల్‌నెస్ ప్రశిక్షకులను.ట్రైనర్లను గాని సంప్రదించండి. వీరిని గురించి, హార్ట్‌ఫుల్‌నెస్‌ను గురించి మరింత  సమాచారం కోసం దయచేసి ఈ వెబ్ సైటుకు https://www.heartfulness.org 

ఆ తరువాత వరుసగా మూడు రోజులు హార్ట్‌ఫుల్‌నెస్ పరిచయాత్మక ధ్యాన సిట్టింగులు  హార్ట్‌ఫుల్‌నెస్ ప్రశిక్షకులు లేక ట్రైనర్ల ద్వారా తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత ఎవరికి వారు ధ్యాన సాధన చేసుకోవచ్చును.


22, జులై 2020, బుధవారం

ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు వస్తే ఏమి చెయ్యాలి?


ధ్యానంలో విపరీతమైన  ఆలోచనలు వస్తే  ఏమి చెయ్యాలి? 
ముందుగా ఆలోచనలను గురించి కొంత స్పష్టత తెక్చుకుందాం:
  • మొట్టమొదటగా, ఆలోచనలు చెడ్డవి కావని తెలుసుకోవాలి. ఆలోచనలు లేకపోతే జీవితమే లేదు. ఆలోచనతోనే మనిషి మనుగడ సాగేది. మన మనుగడ సాగడానికి మనకు మంచి ఆలోచనలు అవసరం.
  • అయితే ఈ ఆలోచనల్లో నకారాత్మకమైన ఆలోచనలు, సకారాత్మకమైన ఆలోచనలు, దివ్యమైన ఆలోచనలు అన్నీ ఉంటాయి.మన ఆధునిక మానసిక శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం, మనిషికి ప్రతి రోజూ సుమారు  70, 000 కు పైగా ఆలోచనలు వస్తాయి. అందులో అరవై శాతం పనికిరాని నకారాత్మకమైన ఆలోచనలే ఉంటాయి. ఇవి మన శక్తిని పీల్చేస్తాయి. నకారాత్మకమైన ఆలోచనలు చాలా బరువైన ఆలోచనలు.
  • ఈ ఆలోచనలన్నీ పుట్టేది మనసులోనే. అందుకే మనసును క్రమశిక్షణలో పెట్టడం అవసరం. దానికి ద్యానం తప్ప మరో మార్గం లేదు. 
  • అయితే ఈ ఆలోచనలు కళ్ళు తెరచి ఉన్నప్పుడు కంటే  కూడా మూసుకున్నప్పుడే ఎక్కువగా వస్తున్నట్లు అనిపిస్తాయి. కాని ఇది వాస్తవం కాదు. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా అలాగే వస్తూఁటాయి కాని మనం లోపలికి చూడకపోవడం మూలాన లేనట్లనిపిస్తాయి. 
  • మన ఇంద్రియాలన్నీ బయట వస్తువులను గమనించడమే అలవాటు మూలాన, లోపలికి అంతరంగ లోకి చూడటం అలవాటు లేకపోవడఁ మూలాన కూడా ఈ ఆలోచనలు భంగపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది.
  • ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం కాబట్టి, మిగిలిన అన్ని ఇంద్రియాలను మూసివేస్తాం కాబట్టి అవి ధ్యాన భంగం విపరీతంగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. 
ధ్యానంలో విపరీతమైన  ఆలోచనలు వస్తే  ఏమి చెయ్యాలి? 
మనం కళ్ళు మూసుకొని హృదయంలో దివ్యమైన వెలుగు ఉందన్న ఆలోచనతో కూర్చున్నప్పుడు, అన్ని రకాల ఆలోచనలు దండేత్తి రావచ్చు. వాటిపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే, వాతంతట అవే రాలిపోతాయి.
ఆలోచనలకు స్వతహాగా వాటికి శక్తి ఉండదు. మనం వాటిపై దృష్టి సారించినప్పుడే వాటికి మనం బలం ఇచ్చినవాళ్ళమవుతాం. అంద్కే వాటిని పట్టించుకోకుండా ఉంటే అభ్యాసం చేయగా-చేయగా వాటంతట అవే రాలిపోతాయి. కొన్ని రోజులకు బాగా తగ్గిపోతాయి.
వాటిని పిలువకుండా వచ్చిన అతిథులుగా భావించాలి. అవే తగ్గిపోతాయి, అంటారు బాబూజీ. నిర్లక్ష్యం చేయడమే దీనికి ఏకైక ఆయుధం.
ఆలోచనలతో పోరాడవద్దు, ఆపే ప్రయత్నం చేయకూడదు; రానివ్వండి, కాని వాటిని పట్టించుకోకండి. ఇది అభ్యాసం వల్ల కొన్ని రోజుల్లోనే పట్టు వస్తుంది. అభ్యాసం చాలా చాలా చాలా అవసరం. 

21, జులై 2020, మంగళవారం

హార్ట్ఫుల్నెస్ సంస్థలో భండారాలు/ఉత్సవాలు అంటే ఏమిటి? ఎప్పుడు జరుగుతాయి? భండారాలకు అభ్యాసులు ఏ విధంగా తయారవ్వాలి?

హార్ట్ఫుల్నెస్ సంస్థలో భండారాలు/ఉత్సవాలు అంటే ఏమిటి? ఎప్పుడు జరుగుతాయి?

భండారాలనేవి మన సంస్థలో మన గురుపరంపర జన్మదినోత్సవాలను ఒక చోట ఒక పెద్ద ఆధ్యాత్మిక సమావేశంగా మూడు రోజులు జరుపుకొనే వేడుకలు. వీటిల్లో సాధకులు/అభ్యాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది.

 ఈ మూడు రోజుల్లో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ సమావేశం జరిగే చోట ముఖ్యంగా నెలకొని ఉంటుంది. అభ్యాసి కూడా ఈ వాతావరణాన్ని అంతరంగంలో ప్రస్ఫుటంగా అనుభూతి చెందగలుగుతాడు; మాటల్లోవ్యక్తం చెయ్యలేకపోయినా.

 ఈ మూడు రోజుల్లో జరిగే ధ్యానాలు ఊహకందని విధంగా చాలా అలౌకికంగా ఉంటాయి. అప్రయత్నంగానే ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళగలగడం వంటివి అనుభూతి చెందుతారు. గురుదేవులు ఈ సందర్భంగా ఇచ్చే ప్రసంగాల్లో, మన ఆధ్యాత్మిక యాత్రకు సూచనలు, ఆదేశాలు, మెళకువలు, మనలను మనం సవరించుకోవలసిన అంశాలు, ఇత్యాదివి అనేక విశేషాలు మనకు గోచరిస్తాయి. హృదయంలో ప్రగాఢమైన అనుభూతులు అభ్యాసికి కలిగే అవకాశం ఉంది.

 ఎవరి పేరున జన్మదినోత్సవం జరుపుకుంటున్నామో, వారికి ప్రత్యేకమైన విధంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం కోసం ఈ వేడుకలు. వారిని ప్రత్యేకంగా స్మరించుకొనే సందర్భం ఇదిిి..

 అంతే కాదు, అప్పటి వరకూ మన ధ్యాన సాధన ద్వారా మనం సాధించిన/సాధించలేకపోయిన ప్రగతిని గురించి, మన దోషాలను గుర్తించే ప్రయత్నం, భవిష్యత్తులో సాదన కొనసాగించవలసిన ప్రణాళికలు, ఇత్యాది వాటిని గురించి ఆత్మావలోకనం చేసుకొనే సమయం.

 అన్నిటికంటే మనకందని నిజం:  ఇంతకు ముందు భూమ్మీద అవతరించిన మహాపురుషులు, అవతార పురుషులు, మన గురుపరంపరలోని మహాత్ములు, అదృశ్య రూపంలో వారి సాన్నిధ్యానుభూతిని కలుగ జేస్తారని మన గురువులు చెప్పియున్నారు. అంతటి సూక్ష్మగ్రాహ్యత గలవారు, ఆధ్యాత్మికంగా పురోగతిని బాగా సాధించినవారు కొందరు, ఈ మహాత్ముల ఉనికి యొక్క అలౌకిక  అనుభూతిని చెందుతారు కూడా. అంతటి పరమ పావన దినాలు ఈ భండారా జరిగే రోజులు.

 ఈ సంస్థలో సంవత్సరానికి నాలుగు భండారాలు జరుగుతాయి:

1.     లాలాజీ (సంస్థ ఆదిగురువులు) 
జన్మదినోత్సవం – ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో
2.    బాబూజీ (శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు) 
జన్మదినోత్సవం – ఏప్రిల్ 29, 30, మే 1 వ తేదీల్లో
3.    చారీజీ ( బాబూజీ వారసులు, మూడవ గురువు) 
జన్మదినోత్సవం -  జూలై 23, 24, 25 తేదీల్లో
4.    దాజీ (ప్రస్తుత మార్గదర్శి, సజీవ మాస్టరు, నాల్గవ గురువు) జన్మదినోత్సవం – సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో

భండారాలకు అభ్యాసులు ఏ విధంగా తయారవ్వాలి?

మన హృదయాలను సాధ్యమైనంతగా ఖాళీ చేసుకోవాలి, శూన్యపరచుకోవాలి; ఇది జరగాలంటే, మన సాధన సక్రమంగా సాగాలి; కనీసం కొన్ని రోజులకు ముందే ప్రిసెప్టర్ల వద్ద ఎక్కువ సిట్టింగులు తీసుకోవాలి; భగవత్ స్మరణలో నిరంతరం ఉండటానికి ప్రయత్నించాలి; సంస్థ సాహిత్యాన్ని చదవడానికి ప్రయత్నించాలి; అహం వదిలి వినమ్రభావాన్ని అలవరచుకొనే ప్రయత్నంలో ఉండాలి; అందరితో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రేమ-సామరస్యాలతో మెలగాలిదశాదేశాలను పాటించే ప్రయత్నంలో ఉదడాలి. మన కోరికలను తగ్గించుకొనే ప్రయత్నంలో ఉండాలి.

 ఈ విధమైనటువంటి జీవన శైలిని అనుసరించగలగడం వల్ల మనలో సంస్కారాలు, భయాలు, చింతలు మలినాలూ తగ్గి, అహంకారం తగ్గి మన హృదయంలోశూన్యత ఏర్పడుతుంది. దివ్యమైన ఆలోచనలు పెరగడం ద్వారా, బుద్ధి వివేకంగా మారేదిశలో ఉన్నప్పుడు మన ప్రయత్నం మేరకు మన హృదయంలో శూన్యత ఏర్పడుతుఁది, ఖాళీ అవుతుంది. ఈ శూన్యతే గురుకృపను ఆకర్షిస్తుంది. ఇటువంటి హృదయంతో ఈ భండారాల్లో పాల్గొనే ప్రయత్నం ప్రతీ అభ్యాసీ చెయ్యాలి. అప్పుడు ఈ మూడురోజుల్లో మన గురుదేవులు వర్సించే కృపకు మనం పాత్రులం కాగలం; ఆధ్యాత్మిక ప్రయోజనం, ఆధ్యాత్మిక ఎదుగుదల సంభవించే అవకాశం ఏర్పడుతుంది.

 

 

 


20, జులై 2020, సోమవారం

భండారా అంటే ఏమిటి? మన సంస్థలో భండారాల ప్రాముఖ్యత ఏమిటి? వాటిల్లో పాల్గొనవలసిన అవసరం ఏమిటి?

భండారా అంటే ఏమిటి?
'భండారా' అనే పదం ఉత్తర భారతదేశంలో పెద్ద-పెద్ద ఆధ్యాత్మిక సమావేశాలకు పెట్టిన పేరు. 'భండారా' అనే పదం భండార్ అంటే భాండాగారం తెలుగులో. ఈ పదం  నుండి వచ్చిందే భండారా అనే పదం. వనరులన్నీ ఒకే చోట పెద్ద రాసిగా దాచి ఉంచే ప్రదేశం. అక్కడి నుండి ఎవరికి అవసరమైనంత వారు తీసుకు వెడుతూ ఉండేవారు. అదే విధంగా ఈ సందర్భంలో ఈ భండారాలో ఆధ్యాత్మిక సంపద ఆ ఉత్సవం జరిగినంత సేపూ వర్షిస్తూనే ఉంటుంది. అందులో పాల్గొన్నవారు వాళ్లకు వీలైనంత సంపద అర్హత లేకుండానైనా పొందవచ్చు. తాత్పర్యం ఏమిటంటే, ఎవరి పేరున భండారా జరుపబడురతున్నదో, వారి కృప అభ్యాసుల అర్హత చూడకుండా వర్షించడఁ జరుగుతుఁది. అర్హతలు చూడకుండా ప్రసాదించేదాన్నే కృప లేక అనుగ్రహం అంటారు. 

మన సంస్థలో భండారాల ప్రాముఖ్యత ఏమిటి?
  • మన సంస్థలో కూడా మన గురుపరంపర జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతీ సంవత్సరమూ మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక సమావేశాలుగా ఇవి జరుగుతూ ఉంటాయి. మన మాస్టర్లు మన నిరంతర స్మరణలో ఉన్నా కూడా ఈ మూడు రోజుల్లో వారిని ప్రత్యేకంగా స్మరించుకోవడం జరుగుతుంది - వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ కూడా. 
  • గురువులు వారి అపార కృపచే తమ అభ్యాసులకు అర్హతలు చూడకుండా ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించే రోజులు ఈ భండారా జరిగే రోజులు. 
  • అంతేకాదు, ప్రతి అభ్యాసి తన ఆధ్యాత్మిక ప్రగతిని ఒక్కసారి సరి చూచుకొని, ఎక్కడున్నాం? ఏమి చెయ్యలేదు? ఏమి చెయ్యాలి?  నా అలవాట్లలో, నా ప్రవర్తనలో, నా ఆలోచనా విదానంలో, నా సాధనలో, మాస్టరు పట్ల నిబద్ధతలో ఇత్యాది అంశాల్లో ఎటువంటి సవరణలు చేసుకోవాలి? ఇటువంటి ప్రశ్నలను తనకు తాను ప్రతి సాధకుడు వేసుకొని, కొత్త తీర్మానాలు చేసుకొని, ఇందులో వారి సహాయం అర్థించడానికి ఒక అద్భుత అవకాశం.
  • ఈ సమయంలో సజీవ మాస్టరు ద్వారా నిర్వహింపబడే ధ్యానాలు అతి శక్తివంతంగా ఉంటాయి; అలౌకికంగా ఉంటాయి; విపరీతమైన శుద్దీకరణలు జరుగుతాయి; ఊహించని పేరు పెట్టలేని అనిర్వకనీయమైన ఆధ్యాత్మిక స్థితులు కలిగే అవకాశం ఉంటుంది; దానితో రానున్న కాలంలో మన జీవితాల్లో అనేకా మార్పులు రావడం అమనించుకోవచ్చు.
  • అంతే కాదు, మన గురుపరంపరలోని మహాత్ములే గాక ఎందరో మహాత్ములు ఆ సందర్భంలో సూక్స్మ రూపంలో మనలను ఆశీర్వదించడానికి విచ్చెస్తారు. అందుకే ఆ వాతావరణం చాలా ప్రత్యేకంగా, చాలా సూక్ష్మంగా, ఎంతో పవిత్రంగా, తెలియని ఆనందం, వర్ణనాతీతంగా ఉంటుంది.
వాటిల్లో పాల్గొనవలసిన అవసరం ఏమిటి?
  • మనం ప్రతిరోజూ చేసే ప్రార్థనలోని మొట్టమొదటి వాక్యం గనుక నిజంగా హృదయంలో స్థిరపడిన సాధకుడికి, ఆధ్యాత్మికంగా ఎదగాలన్న వ్యక్తికి, మరింత మెరుగైన మనిషిగా తయారవ్వాలనుకున్న అభ్యాసికి, పైన వ్రాసిన చదివిన కారణాలు సరిపోతాయి, ఎందుకు పాల్గొనాలో తెలియడానికి.
  • అనివార్య కారణాల వల్ల ఇందులో పాల్గొనలేకపోయినట్లయితే కనీసం మానసికంగా గురువుతో శృతి కలిగి అనుసంధానమై ఉండటానికి ప్రయత్నించండి. అనివార్య కారణాలైతేనే....
  • ఈ కోవిడ్ వాతావరణంలో మన గురుదేవులు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ధ్యాన్నించడానికి అనుమతినివ్వడం జరిగింది. ప్రతీ ఇంట్లోనూ ఇటువంటి భండారా వాతావరణం ఏర్పరచుకోవడఁ మన బాధ్యత. 

9, జులై 2020, గురువారం

హృదయం, మనస్సాక్షి, అంతఃకరణ

హృదయం, మనస్సాక్షి, అంతఃకరణ
హృదయం, మనస్సాక్షి, అంతఃకరణ - ఈ పదాలను మనం చిన్నప్పటి నుండి వాడుతున్నాం. ఈ మూడూ ఒకటే. మనిషివేనా, "నీకు హృదయం లేదా?" అంటాం. "నీకు మనస్సాక్షి లేదా ఈ పని ఎలా చేశావు?" అంటాం. "ఏ పని చేసినా అంతఃకరణ శుద్ధితో చెయ్యాలి" అని అంటాం. వివిధ సందర్భాల్లో ఒకొక్క పదం వాడతాం. కాని అర్థం, తత్త్వం ఒక్కటే.

మన హృదయాన్ని బట్టే, మన మనస్సాక్షిని బట్టే, మన అంతఃకరణ శుద్ధిని బట్టే, మనిషి జీవితం యొక్క నాణ్య్తత ఆధారపడి ఉంటుంది. సమాజం నాణ్య్త కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి మనుగడే దాని మీద ఆధారపడి ఉంటుంది.

దాని ప్రస్తుత స్థితి ఎలా ఉందో మనందరిలో ఎలా ఉందో అందరికీ తెలుసు.
ఇంతటి ముఖ్యమైనదాన్ని మనం ఎలాగో నిర్లక్ష్యం చేస్తూ వచ్చేసాం. దీనికి   చికిత్స ఏమిటి? సరిదిద్దుకోవడం ఎలా? ఏమైనా మార్గం ఉందా?

అదృష్టవశాత్తు ఉంది: హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా, అంతఃకరణ శుద్ధి చేసుకోవడం ద్వారా. ఈ అంతఃకరణ అంటే ఏమిటి? దాన్ని శుద్ధి చేయడం ఎలా?

మానవ వ్యవస్థలో మూడు శరీరాలున్నాయి : స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే కనిపించే శరీరం; సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇలా అనేకం ఉన్నాయి కాని, ప్రధానమైనవి ఈ నాలుగు. ఈ నాల్గింటినీ కలిపి అంతఃకరణ లేక హృదయము అని అంటారు. వీటిని శుద్ధి చేయడమే అంతఃకరణ శుద్ధి అంటే. కారణ శరీరం అంటే ఆత్మ, ఏ తత్త్వం లేకపోతే మిగిలిన రెండు శరీరాలనీ అస్తిత్వమే ఉండదో దాన్ని కారణ శరీరం అంటారు. అదే ఆత్మ.

మనిషి మారడమూ అంటే స్థూల శరీరం మారడఁ కాదు, దాన్ని పెద్దగా మార్చలేము. అలాగే కారణ శరీరమైన ఆత్మను మార్చలేము, ఎందుకంటే అది మార్పులేనిది, నాశనం లేనిది, కాబట్టి. కాబట్టి మనిషి మారడమూ అంటే సూక్ష్మశరీరాలు లేక అంతఃకరణ మారడం అన్నమాట.

అయితే ఈ మనసు, బుద్ధి అహం, చిత్తం - ఈ నాలుగూ కూడా కనిపించని శక్తులు మనలో ఉన్నవి. ఈ నల్గింటి చుట్టూనే మనుషుల జీవితాలు అల్లుకొని ఉంటాయి. ఈ కనిపించని వస్తువులను ఏ విధంగా మార్చడం? కనిపించని వస్తువైన మనసు ద్వారానే మళ్ళీ. మనసుతో చేసేదే ధ్యానం. ప్రతి రోజూ వ్యాయామం చేసినట్లుగానే ధ్యానం  కూడా నిత్యం చేసినట్లయితే వీటి శుద్ధి సాధ్యపడుతుంది. ఏ విధంగా? వ్యాయామం చేయడం ద్వారా స్థూల శరీరంలోని అవయవాలన్నిటికీ ఏ విధంగా ఆరోగ్యం చేకూరుతుందో, అదే విధంగా ధ్యానం చేయడం వల్ల, ముఖ్యంగా హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం ప్రతి నిత్యమూ చేయడం వల్ల ఈ సూక్ష్మశరీరాల శుద్ధి జరుగుతూ ఉంటుంది. శుద్ధి జరుగుతూన్న కొద్దీ మనలో సమూలమైన మార్పులు కలుగుతూండటం గమనించవచ్చు. కనుక ప్రయత్నించి చూడండి, మీ జీవితంలో పరివర్తనను సాధించండి.

అయిఏ ఎంత కాలం పడుతుంది? అది మీ తపనను బట్టి, మీ కృషిని బట్టి, మీ ఉత్సాహాన్ని బట్టి, మీ అంకితభావాన్ని బట్టి ఉంటుంది.

30, జూన్ 2020, మంగళవారం

హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిలోని విశిష్టత ఏమిటి?


హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిలోని విశిష్టత ఏమిటి?
హార్ట్ ఫుల్ నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతి, రెండు ప్రధాన అంశాల వల్ల విశిష్ఠతను సంతరిచుకుంటుంది.

1. యౌగిక ప్రాణాహుతి, ఆంగ్లంలో ట్రాన్స్ మిషన్ అంటారు, అంటే ఇది ఒక దివ్యశక్తి ప్రసరణ: ఉత్కృష్ట యోగస్థితిలో ఉన్న గురువు ద్వారా ఈ శక్తి ప్రసరణ సాధకుడి హృదయంలోకి ప్రసరించడం జరుగుతుంది. దీని వల్ల సాధకుడి ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలుగా నిలుస్తున్న సంస్కారాలను/వాసనలను/కర్మలను/ప్రవృత్తులను తేలికగా సమూలంగా తొలగించడం జరుగుతుంది. కావున ఆధ్యాత్మిక ప్రగతి త్వరితంగా జరుగుతుంది.

2. శుద్ధీకరణ, ఆంగ్లంలో క్లీనింగ్: ఈ ప్రక్రియ ద్వారా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డు పడుతున్న మన హృదయం లో పేరుకుపోయిన సంస్కారాలను ఏ రోజుకారోజు తొలగించుకొనే ప్రక్రియ. దీని వల్ల వత్తిళ్ళు తగ్గడం, ధ్యాన లోతులు పెరగడం, హృదయంలో ఉన్న బరువు తగ్గి తేలికదనాన్ని వెనువెంటనే అనుభూతి చెందగలగడం జరుగుతుంది.
ఈ రెండు అంశాలు మరే ఇతర యౌగిక పద్ధతుల్లో కనిపించవు.

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...