5, ఆగస్టు 2020, బుధవారం

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని గురించి అందరిలో తరచూ కలిగే ప్రశ్నలు

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని గురించి 

అందరిలో తరచూ కలిగే ప్రశ్నలు

మనం ధ్యానం ఎందుకు చెయ్యాలి? ముఖ్యంగా హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం ఎందుకు చెయ్యాలి?

మనలో సహజత్వం పునరుద్ధరింఛుకోవడానికి. మనలో ఉన్న ఎన్నో అసహజమైన తత్తాలు ధ్యానం చేస్తున్న కొద్దీ వీడ్కోలు పలుకుతాయి. రోజురోజుకూ మన శ్శాంతి పెరుగుతూ ఉంటుంది. పైగా ధ్యానమే చేయగా-చేయగా జీవితంలో మన లక్షం ఏమిటో కూడా స్పష్టం చేస్తుంది. ఇదీ ధ్యానం మనలో కలుగజేసే అద్భుతం. దీన్నే ఆత్మవికాసం అంటారు.

మనలో ఉండే ఈ అసహజమైన తత్త్వాలేమిటి?

మన చింతలు, భయాలు, మలినాలు, కోరికలు, కామం, కోపం, పిసినారితనం, మదం, అన్నీ స్వంతం చేసుకోవాలనుకోవడం, అసూయ, జటిలమైన స్వభావాలు, ఇవన్నీ మనలో ఉండే అసహజమైన తత్తాలు. అవునా కాదా? ఇవన్నీ మనకు అడ్డు వస్తున్నాయా లేదా మనం ముందుకు సాగడానికి? మరి వీటిని తగ్గించుకోవడం గాని లేక పోగొట్టుకోవడం గాని ఎలా చెయ్యడం?

మనశ్శాంతి పెరిగితే ఏమవుతుంది?

మనశ్శాంతి పెరిగితే పనులు ప్రశాంతంగా సరిగ్గా చెయ్యగలుగుతాం; ఆలోచనలో స్పష్టత కలుగుతుంది; తెలియకుండా సహజంగానే మనలో విలువలు పెరుగుతాయి; మానవ సంబంధాలు మెరుగుపడతాయి; ఆరోగ్యం కూడా మెరుగవుతుంది; చంచలమైన మనస్సు క్రమక్రమంగా క్రమబద్ధమవుతుంది; అన్నిటికంటే ముఖ్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవన్నీ మనకు అవసరమా కాదా?

ఈ మార్పులన్నీ రావడానికి ఎంత సమయం పడుతుంది?

అది మనకు మన పట్ల ఉన్న నిబద్ధతను బట్టి, మన తపనను బట్టి, మన సంసిద్ధతను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటువంటి మార్పులు కొన్ని మనలో మూడు నెలల్లోనే సంభవించడం గమనించుకోవచ్చు. దీనికి నిర్దేశించిన విధంగా ఈ హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిని అనుసరించవలసి ఉంటుంది. ఈ మార్పులు మనలను ఈ సాధనను కొనసాగించడానికి తగిన ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి.

మనిషి మారాలి, మారాలి అంటూంటారు? ఏమిటి మారుతుంది మనలో?

మనిషి అనే వ్యవస్థలో మూడు శరీరాలున్నాయి - స్థూల శరీరం: అంటే కనిపిస్తోన్న ఈ భౌతిక శరీరం

సూక్ష్మశరీరం: అంటే మనలో ఉండే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇత్యాదివి; వీటన్నిటినీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు. కారణ శరీరం: ఆత్మను కారణ శరీరం అంటారు; ఏది లేకపోతే పై రెండు శరీరాలూ ఉండవో దాన్ని ఆత్మ అని అంటారు.

వీటిల్లో స్థూల శరీరం సహజంగానే మారుతూనే ఉంటుంది; శారీరక మార్పుల్లో మనిషి యొక్క ప్రమేయం పెద్దగా ఏమీ ఉండదు. ఆత్మ లేక కారణ శరీరం శుద్ధమైనది, మార్పులేనిది కాబట్టి అది మారేది ఏమీ ఉండదు.

ఇక మిగిలినది సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం, చైతన్యం - ఈ నాలుగూ సూక్ష్మ శరీరంలోని ప్రధాన అంశాలు. నిజానికి మనసు బుద్ధి అహంకారం వంటి సూక్ష్మ శరీరాలన్నీ చైతన్యం అనే ఆకాశంలో నక్షత్రాల్లా ఇమిడి ఉంటాయి. కాబట్టి మనిషి మారడమూ అంటే ఇవే మారాలి- అంటే మన మనసు, బుద్ధి అహంకారము అనేవి శుద్ధంగా తయారయ్యేవరకూ మారాలి, అంటే భగవంతుడు సృష్టించినప్పుడు ఉన్న విధంగా తయారవ్వాలి; అప్పుడు చైతన్యం కూడా శుద్ధంగా పవిత్రంగా, ఉండవలసిన విధంగా ఉండటం జరుగుతుంది. దీన్నే మనం ఆత్మ వికాసం అంటాం. కాబట్టి మనిషి మారాలి అన్నప్పుడు అతనిలో మారేది ఈ సూక్ష్మ శరీరమే. ఇది మన చేతుల్లోనే ఉంది. నిజానికి మన సమస్యలన్నీ పరికించి చూస్తే మనసు చుట్టూ, బుద్ధి చుట్టూ, అహంకారం చుట్టూనే అల్లుకొని ఉన్నాయి. దీని వల్ల మన చైతన్య స్థితి కూడా కలుషితమైపోయింది. వీటిని శుద్ధి చేసుకోవడం ద్వారా మన విధిని మనమే రూపకల్పన చేసుకోవచ్చును ఈ విధంగా, భగవంతుని నిందించకుండా.

అంటే ఈ హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతి సూక్ష్మ శరీరాన్ని శుద్ధీకరించి పవిత్రం చేస్తుందన్నమాట. ఇది మనం అనుభవపూర్వకంగా కొద్ది కాలంలోనే తెలుసుకోవచ్చు. సంపూర్ణంగా తెలుసుకోవడాన్నే ఆత్మ సాక్షాత్కారం లేక దైవ సాక్షాత్కారం అని కూడా అంటారు.

అంటే ఈ హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతి మనం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి అత్యంత ఉత్కృష్టమైన ఆత్మ-సాక్షాత్కార స్థితికి చేర్చగలదు. అదే జీవిత పరమార్థం, మనం మానవ జన్మెత్తినందుకు దాన్ని సార్థకం చేసుకొనే ప్రయోజనమూ కూడా. వెరసి ఈ ధ్యానం ప్రతీ మనిషిని మరింత మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చి దిద్దగలదు.

అయితే దీనికి కావలసిన అర్హత ఏమిటి?

దీనికి కావలసిన అర్హత కేవలం ఈ పద్ధతిని ప్రయత్నించాలన్న సంసిద్ధత; మనం మారాలన్న సంసిద్ధత మాత్రమే. అయితే వయసు 15 సంవత్సరాలు దాటినవారెవరైనా ప్రయత్నించవచ్చు.

దీనికి ప్రత్యేకంగా చెల్లించవలసిన రుసుములేమైనా ఉన్నాయా?

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యానంలో శిక్షణ జీవితం అంతా పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎటువంటి రుసుములూ లేవు.

ప్రతిరోజూ ఈ సాధనకు ఎంత సమయం వెచ్చించవలసి ఉంటుంది? మాకు సమయం ఉండదు...

మనం ఏ పనికైనా ప్రాధాన్యతనిచ్చినప్పుడే మనకు ఆ పని కోసం సమయం చిక్కడం జరుగుతుంది. లేకపోతే సమయం దొరకదు. ఈ సాధన మన ఆత్మవికాసానికి, మనం మరింత మెరుగైన వ్యక్తులుగా తయారవడానికి, ప్రశాంతతతో కూడిన జీవనానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈ పనికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వగలగాలి. ప్రతి నిత్యం మనం ధ్యానంతో రోజును ప్రారంభించాలి.

అయితే ఈ సాధన చేసుకోవడానికి ప్రారంభ దశలో మనకి అవసరమైన సమయం కేవలం కొన్ని నిముషాలు మాత్రమే. ఉదయం కనీసం ఒక అరగంట, ఆ రోజు పని పూర్తయిన తరువాత సాయంకాలం ఒక 20 నిముషాలు, ఆ తరువాత రాత్రి పడుకొనే ముందు ఓ 5 నిముషాలు వెచ్చించగలగాలి. ఈ కాస్త సమయం వెచ్చించగలిగితే మన రోజంతా మంగళకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన సత్యం.

ఈ ధ్యాన పద్ధతిని అనుసరించడం వల్ల ఏమైనా అద్భుతాలు జరుగుతాయా?

మనం అనుకొనే అద్బుతాలు జరుగకపోవచ్చును గాని ఈ సాధనను త్రికరణ శుద్ధిగా నిర్దేశించిన విధంగా అనుసరించినట్లయితే, మనిషి మరింత మెరుగైన మనిషిగా మారడమే గాక చివరికి ఒక దివ్యమైన వ్యక్తిగా మారే అద్భుతం జరిగే అవకాశం తప్పక ఉంది.

మేము సంసారం చూసుకోవాలి, చదువులు/ఉద్యోగాలు/వ్యాపారాలు చూసుకోవాలి; ఇవేమైనా విడిచిపెట్టవలసి ఉంటుందా?

సంసారానికి గాని, ఉద్యోగవ్యాపారాలకు గాని, మనం నిర్వర్తించవలసిన ఏ ఇతర బాధ్యతలనూ కూడా విడిచిపెట్టనవసరం లేకపోగా, వీటన్నిటినీ మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు; ఈ ప్రపంచంలో మనకు ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు; ఒత్తిడి లేకుండా జీవించగలుగుతారు; ఇతరులకు ఉదాహరణలుగా జీవించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అవసరమైన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. గృహిణులకు అవసరమైన ప్రేమ సహనమూ పెరుగుతాయి; పురుషుల్లో ఉండే చీకాకులు, చిటపటలు, కోపం, అసహనం తగ్గుతాయి.

 అసలు ఈ హార్ట్‌ఫుల్‌నెస్అంటే ఏమిటి?

హార్ట్‌ఫుల్‌నెస్ అంటే హృదయాన్ని అనుసరించి జీవించే జీవన విధానం. ఏ పనైనా హృదయపూర్వకంగా చేయడం; హృదయంతో మాట్లాడటం; హృదయం ఇర్దేశించిన విధంగానే ధైర్యంగా జీవించగలగడం. ఎందుకంటే మనందరిలో ఉండే హృదయం ఎప్పుడూ తప్పుడు ఆదేశాలివ్వడు. మన జీవితానికి అది దిక్సూచి. అయితే మనం బుద్ధినే అనుసరించి జీవిస్తున్నాం; నిజానికి బుద్ధి కూడా హృదయాన్ని అనుసరించే పని చేయాలి. కాని ప్రస్తుతం మన బుద్ధికి, హృదయానికి అనుసంధానం లేనట్లుగా బుద్ధి పని చేయడం వల్ల మనం అన్ని రకాల ఒత్తిళ్ళకు గురవుతున్నాం. ఈ వ్యవస్థను హృదయంపై ధ్యానించడం ద్వారా సరిదిద్దుకోవచ్చు. అదే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం.

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానంలో ప్రత్యేకతలేమైనా ఉన్నాయా?

ఈ ధ్యాన పద్ధతిలో రెండు విశిష్టతలున్నాయి: 1) ప్రాణాహుతి ప్రసరణ 2) శుద్ధీకరణ ప్రక్రియ.

ప్రాణాహుతి ప్రసరణ : ధ్యానం అంటే అంతర్ముఖులమై మనలోకి చూసుకొనే ప్రక్రియ. మన మనస్సును క్రమబద్ధీకరించే ప్రక్రియ. ఇది అంత తేలికైన పని కాదు. ఈ ప్రక్రియలో మనకు ప్రాణాహుతి అనే ఒక దివ్యశక్తి తోడుగా ఉంటూ మన ధ్యానంలోకి పూర్తిగా నిమగ్నమవడానికి సహకరిస్తుంది. ఇది ఆత్మను స్పృశించడం ద్వారా అత్యంత శాంతిని కలుగజేస్తుంది.

 శుద్ధీకరణ ప్రక్రియ. : హృదయంలో మనం ఇంతకు ముందు అనుకున్న, మనలో ఉన్న దివ్యత్వాన్ని కమ్మేసిన చింతలు, భయాలు, జటిలమైన తత్తాలు, నకారాత్మకమైన ఆలోచనలు, సంస్కారాలు, వీటన్నిటినీ క్రమక్రమంగా తొలగించుకొనే ప్రక్రియ, ఈ శుద్ధీకరణ లేక పునరుజ్జీవన ప్రక్రియ.

ఈ రెండు ప్రక్రియలూ ఒక పద్ధతి ప్రకారం అనుసరించినప్పుడు సాధకుడు ఒక మెరుగైన మనిషిగానే గాకుండగా ఒక దివ్యమైన ప్రేమ-మూర్తిగా, పవిత్రంగా మారగలుగుతాడు.

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిలో నిత్యం అనుసరించవలసిన సాధనా ప్రక్రియలేమిటి?

ఉదయం ఒక అరగంట ధ్యానంతో ప్రారంభించాలి; సాయంకాలం ఆ రోజు నిర్వర్తించవలసిన పనులన్నీ పూర్తయిన తరువాత ఒక 20 నిముషాలు ద్ధీకరణ లేక నరుజ్జీవన ప్రక్రియను చేసుకోవాలి; రాత్రి పడుకొనే ముందు ఓ 5 నిముషాలు ్రర్థనా-ధ్యానం చేసుకోవాలి.

మీ సంస్థ పేరేమిటి? దాని ఆశయం ఏమిటి?

మా సంస్థ పేరు హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్. శ్రీరామచంద్ర మిషన్ అనే లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ కు అనుబంధ సంస్థ. ఈ సంస్థ ద్వారా హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని అందించడం జరుగుతోంది.

దీని ఆశయం భూమ్మీదున్న ప్రతీ వ్యక్తికి ధ్యానాన్ని కనీసం పరిచయం చేయడం. తద్వారా మానవుల సమిష్ఠి చైతన్యంలో నిండిపోయిన వత్తిడిని సాధ్యమైనంత మేరకు తగ్గించడం, అందులో తగిన మార్పు సంభవించే విధంగా కృషి చేయడం. అందరికీ ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారా తేలికగా ధ్యానించే పరిస్థితిని కల్పించడం. ప్రతీ వ్యక్తి మనసులో శాంతి ఉంటేనే అందరూ కాంక్షించే ప్రపంచ శాంతి సాధ్యపడుతుంది కాబట్టిఅది ఈ ధ్యానం వల్ల కొద్ది రోజుల్లోనే సాధ్యపడుతుంది కాబట్టి, ఆ విధంగా ప్రపంచ శాంతికి తోడ్పడటమే ఈ సంస్థ ఆశయం. మనిషిని మరింత మరింత మెరుగైన విధంగా తీర్చి దిద్దుకొనే మార్గాన్ని, దానికి సంబంధించిన సేవలను ఉచితంగా యావత్ ప్రపంచానికి అందివ్వడమే ఈ సంస్థ ఆశయం.

హార్ట్‌ఫుల్‌నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతికి మార్గదర్శకులెవరు?

ప్రస్తుత మార్గదర్శకులు పూజ్యశ్రీ కమలేష్ డి. పటేల్ గారు. అందరూ వారిని ఆప్యాయంగా దాజీఅని పిలుస్తారు. వీరు హైదరాబాదు శివార్లలో చేగూరులో కాన్హా శాంతి ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు. వీరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 130 దేశాల్లో ఉండే సాధకులకు మార్గదర్శిగా ఉన్నారు.

 ఈ ధ్యానం ప్రారంభించాలంటే ఏం చేయాలి?

ఈ ధ్యాన పద్ధతిని అనుసరించాలన్న ఆసక్తి గలవారు, సమీప హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రాన్ని గాని లేక సమీప హార్ట్‌ఫుల్‌నెస్ ప్రశిక్షకులను.ట్రైనర్లను గాని సంప్రదించండి. వీరిని గురించి, హార్ట్‌ఫుల్‌నెస్‌ను గురించి మరింత  సమాచారం కోసం దయచేసి ఈ వెబ్ సైటుకు https://www.heartfulness.org 

ఆ తరువాత వరుసగా మూడు రోజులు హార్ట్‌ఫుల్‌నెస్ పరిచయాత్మక ధ్యాన సిట్టింగులు  హార్ట్‌ఫుల్‌నెస్ ప్రశిక్షకులు లేక ట్రైనర్ల ద్వారా తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత ఎవరికి వారు ధ్యాన సాధన చేసుకోవచ్చును.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...