హార్ట్ఫుల్నెస్ సంస్థలో భండారాలు/ఉత్సవాలు
అంటే ఏమిటి? ఎప్పుడు జరుగుతాయి?
భండారాలనేవి మన సంస్థలో మన గురుపరంపర జన్మదినోత్సవాలను
ఒక చోట ఒక పెద్ద ఆధ్యాత్మిక సమావేశంగా మూడు రోజులు జరుపుకొనే వేడుకలు. వీటిల్లో సాధకులు/అభ్యాసులు
అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది.
ఈ మూడు రోజుల్లో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం
ఈ సమావేశం జరిగే చోట ముఖ్యంగా నెలకొని ఉంటుంది. అభ్యాసి కూడా ఈ వాతావరణాన్ని అంతరంగంలో ప్రస్ఫుటంగా అనుభూతి
చెందగలుగుతాడు; మాటల్లోవ్యక్తం చెయ్యలేకపోయినా.
ఈ మూడు రోజుల్లో జరిగే ధ్యానాలు ఊహకందని విధంగా చాలా
అలౌకికంగా ఉంటాయి. అప్రయత్నంగానే ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళగలగడం వంటివి
అనుభూతి చెందుతారు. గురుదేవులు ఈ సందర్భంగా ఇచ్చే ప్రసంగాల్లో, మన ఆధ్యాత్మిక యాత్రకు
సూచనలు, ఆదేశాలు, మెళకువలు, మనలను
మనం సవరించుకోవలసిన అంశాలు, ఇత్యాదివి అనేక విశేషాలు మనకు గోచరిస్తాయి. హృదయంలో
ప్రగాఢమైన అనుభూతులు అభ్యాసికి కలిగే అవకాశం ఉంది.
ఎవరి పేరున జన్మదినోత్సవం జరుపుకుంటున్నామో, వారికి
ప్రత్యేకమైన విధంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం కోసం ఈ వేడుకలు. వారిని
ప్రత్యేకంగా స్మరించుకొనే సందర్భం ఇదిిి..
అంతే కాదు, అప్పటి వరకూ మన ధ్యాన సాధన ద్వారా మనం
సాధించిన/సాధించలేకపోయిన ప్రగతిని గురించి, మన దోషాలను గుర్తించే
ప్రయత్నం, భవిష్యత్తులో సాదన కొనసాగించవలసిన ప్రణాళికలు, ఇత్యాది వాటిని గురించి ఆత్మావలోకనం చేసుకొనే సమయం.
అన్నిటికంటే మనకందని నిజం: ఇంతకు ముందు భూమ్మీద అవతరించిన మహాపురుషులు, అవతార పురుషులు, మన గురుపరంపరలోని మహాత్ములు, అదృశ్య రూపంలో వారి సాన్నిధ్యానుభూతిని
కలుగ జేస్తారని మన గురువులు చెప్పియున్నారు. అంతటి సూక్ష్మగ్రాహ్యత గలవారు, ఆధ్యాత్మికంగా పురోగతిని బాగా సాధించినవారు కొందరు,
ఈ మహాత్ముల ఉనికి యొక్క అలౌకిక అనుభూతిని చెందుతారు
కూడా. అంతటి పరమ పావన దినాలు ఈ భండారా జరిగే రోజులు.
ఈ సంస్థలో సంవత్సరానికి నాలుగు భండారాలు జరుగుతాయి:
1.
లాలాజీ (సంస్థ ఆదిగురువులు) జన్మదినోత్సవం – ఫిబ్రవరి
1, 2, 3 తేదీల్లో
2.
బాబూజీ (శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు)
జన్మదినోత్సవం – ఏప్రిల్ 29, 30, మే 1 వ తేదీల్లో
3.
చారీజీ ( బాబూజీ వారసులు, మూడవ గురువు)
జన్మదినోత్సవం - జూలై
23, 24, 25 తేదీల్లో
4.
దాజీ (ప్రస్తుత మార్గదర్శి, సజీవ మాస్టరు, నాల్గవ గురువు) జన్మదినోత్సవం – సెప్టెంబరు
27, 28, 29 తేదీల్లో
భండారాలకు అభ్యాసులు ఏ విధంగా
తయారవ్వాలి?
మన హృదయాలను సాధ్యమైనంతగా ఖాళీ చేసుకోవాలి, శూన్యపరచుకోవాలి; ఇది జరగాలంటే, మన సాధన సక్రమంగా సాగాలి; కనీసం కొన్ని రోజులకు
ముందే ప్రిసెప్టర్ల వద్ద ఎక్కువ సిట్టింగులు తీసుకోవాలి; భగవత్ స్మరణలో నిరంతరం
ఉండటానికి ప్రయత్నించాలి; సంస్థ సాహిత్యాన్ని చదవడానికి ప్రయత్నించాలి; అహం వదిలి వినమ్రభావాన్ని
అలవరచుకొనే ప్రయత్నంలో ఉండాలి; అందరితో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రేమ-సామరస్యాలతో మెలగాలి; దశాదేశాలను పాటించే ప్రయత్నంలో ఉదడాలి. మన కోరికలను తగ్గించుకొనే ప్రయత్నంలో ఉండాలి.
ఈ విధమైనటువంటి జీవన శైలిని అనుసరించగలగడం వల్ల మనలో సంస్కారాలు, భయాలు, చింతలు మలినాలూ తగ్గి, అహంకారం తగ్గి మన హృదయంలోశూన్యత ఏర్పడుతుంది. దివ్యమైన ఆలోచనలు పెరగడం ద్వారా, బుద్ధి వివేకంగా మారేదిశలో
ఉన్నప్పుడు మన ప్రయత్నం మేరకు మన హృదయంలో శూన్యత ఏర్పడుతుఁది, ఖాళీ అవుతుంది. ఈ శూన్యతే గురుకృపను ఆకర్షిస్తుంది. ఇటువంటి హృదయంతో ఈ భండారాల్లో
పాల్గొనే ప్రయత్నం ప్రతీ అభ్యాసీ చెయ్యాలి. అప్పుడు ఈ మూడురోజుల్లో మన గురుదేవులు వర్సించే
కృపకు మనం పాత్రులం కాగలం; ఆధ్యాత్మిక ప్రయోజనం, ఆధ్యాత్మిక ఎదుగుదల సంభవించే అవకాశం ఏర్పడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి