23, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం

శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం 

ఏ విద్యను అభ్యసించాలన్నా మన పెద్దవాళ్ళు, శాస్త్రాలు, 3 మెట్ల సోపానాన్ని అధిరోహించవలసి ఉందని సూచించడం జరిగింది - 1) శ్రవణం 2) మననం  3) నిధిధ్యాసన ఫలితంగా కలిగేది సాక్షాత్కారం. 

కేవలం శ్రవణంతో సరిపోదు. సాధారణంగా మనం శ్రవణంతో ఆగిపోతూ ఉంటాం. అందుకే విషయాన్ని గురించిన సమగ్ర అవగాహన ర్కపోవడం, అది మనకు అవసరమైనప్పుడు అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అతిముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యనభ్యసించడానికి లేక బ్రహ్మ విద్యనభ్యసించాలనుకున్నవారికి, ఈ మూడు మెట్లను సాయశక్తులా   అనుసరించడం చాలా అవసరమబవుతుంది, మన యాత్ర సజావుగా సాగడానికి.

1) శ్రవణం: అంటే గురువులు, పెద్దలు చెప్పినది సావధానంగా వినడం, విద్యకు సంబంధించిన గ్రంథాలను చదవడం గాని, ఈరోజుల్లో దృశ్య/శ్రవణ మాధ్యమాల ద్వారా వినడం/వీక్షించడం, ఇవి కూడా శ్రవణంలోకే వస్తాయి. 

కమ్యూనికేషన్ స్కిల్స్ లేక సంభాషణా కుశలతల్లో అతి ముఖ్యమైనది సావధానంగా వినగలగడం, అవధరించడం. వినడం రానివాడికి ఎప్పటికీ సరైన జ్ఞానం అబ్బదు. అంతేకాదు, వినడం రానివాడు, ఏదీ నేర్చుకోలేడు. వినడానికి ఇష్టపడనివాడు వితండవాదిగా తయారయ్యే ప్రమాదం ఉంది; అహంకారిగా మారే ప్రమాదం ఉంది. ఏదైనా చెబుతున్నప్పుడు వినిపించుకోని వ్యక్తికి దూరంగా ఉండాలి. కాబట్టి శ్రవణం అనేది జ్ఞాన సముపార్జనకు మొదటి మెట్టు. వినవలసి వచ్చినప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకొని ఇనాలి, ముఖ్యంగా గురువు చేసే బోధనలను ఈ విధంగా వినాలి; వాడుక భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. లేకపోతే చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది. 

2) మననం : వినడంతో ఆపేయక విన్నదానిని గురించి మననం చేసుకోవాలి. అంటే విన్న విషయాన్ని గురించి మరింత లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయడం; సందేశాన్ని ఇచ్చిన గురువు యొక్క మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం; వినదాన్ని ఆస్వాదించే ప్రయత్నం; వినదాన్ని కూలంకషంగా నెమరు వేసుకొనే ప్రయత్నం; ఇవన్నీ చెయ్యాలి.

3) నిధిధ్యాసనం : విన్నదాన్ని, మననం చేసినా కూడా జ్ఞాన సముపార్జన పూర్తి కాదు. మననం చేసిన తరువాత, సారాంశం లేక ప్రసంగించినవారి హృదయం  బోధపడిన తరువాత, ఆ సారాంశంపై కొంత సేపు ధ్యానించాలి. అప్పుడు మనం విన్నది,చదివినది మన శరీర వ్యవస్థలో జీర్ణమైపోతుంది, ఆ జ్ఞానం మన స్వంతమైపోతుంది. మన శరీర వ్యవస్థలో అంతర్భాగమైపోతుంది. ఏ విధంగానైతే తిన్న ఆహారం జీర్ణమై మన శరీర వ్యవస్థలో మనకు అవసరమైన  బలంగా  మారుతుందో, అదే విధంగా ఈ జ్ఞానం కూడా మనలో అంతర్భాగమై మనకు అవసరమైన స్ఫూర్తిగానూ, శక్తిగానూ మారి మనకు అవస్రమైనప్పుడల్లా ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటుంది.

ఈ మూడు మెట్లను మనం ఏదైనా నేర్చుకున్న ప్రతీసారీ, ముఖ్యంగా బ్రహ్మ విద్య లేక గూవులు చేసేబోధలను అనుసరించినప్పుడు ఫలితంగా మనం ఏ విషయాన్నైతే అభ్యసించే ప్రయత్నంలో ఉన్నామో ఆ విషయం యొక్క సాక్షత్కారం జరుగుతుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...