20, అక్టోబర్ 2025, సోమవారం

దీపావళి - బయట దీపం వెలుగు, లోపల దివ్యవెలుగు

 

 



దీపావళి - బయట దీపం వెలుగు, లోపల దివ్యవెలుగు 

దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. ఈ దీపాల పండుగను భారతీయులు, ముఖ్యంగా హిందువులు అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు. 

శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతమ్మవారిని రావణ చర్య నుండి విడుదల చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా కొందరు; శ్రీకృష్ణుడు నరకాసుర వఢ చేసి 16,100 కన్యలను చెర నుండి విడిపించి, వివాహమాడి సమాజంలో వారికి గౌరవం లభించేలా గొప్ప వరాన్ని ప్రసాదించిన రోజుగానూ; మహావీర జైన్ అనే 24 వ తీర్థంకరుడు నిర్వాణం పొందిన రోజుగానూ; లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన రోజుగానూ, ఇలా అనేక కారణాల చేత ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. 

ఈ సందర్భంగా జనం అందరూ తమ ఇళ్ళను శుభ్రం చేసుకొని, నూతన వస్త్రాలు ధరించి, దీపాలు వెలిగించి, లోపలున్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టపాకాయలు కాలుస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. 

ఆధ్యాత్మికపరంగా దీన్ని అర్థం చేసుకుంటే, బయట దీపాలు లోపల కలిగే మేలుకొలుపుకు సంకేతాలు; నరకాసురుని వధించడం అంటే కామ, క్రోధ, అహంకారాలను నాశనం చేయడం; నిజమైన లక్ష్మీ అంటే శాంతి, పవిత్రత, దివ్యప్రేమ; దీపం వెలుగు అంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆత్మ నుండి వచ్చే ప్రకాశం.  

హార్ట్ఫుల్నెస్ సహజమార్గం ప్రకారం నా అవగాహనలో, ధ్యానం ద్వారా హృదయాన్ని ప్రకాశింపజేయడం; అంతరంగంలో జ్యోతిని ప్రజ్వలించడానికి సాంకేతమే బయట దీపాలు వెలిగించడం; యౌగిక ప్రాణాహుతి ప్రసరణ ద్వారా, హృదయం పవిత్రతతో వెలుగును విరజిమ్మడం. 
హృదయం లోపలి నుండి ప్రకాశించినప్పుడు నిజమైన దీపావళి ప్రారంభమవుతుంది - బాబూజీ  

సమస్త విశ్వానికి దీపావళి సందేశం 1) వివేకం ద్వారా వెలుగులో జీవించు 2) కారుణతో ప్రేమతో జీవించు  3) పవిత్రంగా ఉండటం ద్వారా శాంతిని వ్యాపింపజేయి 4) ద్వంద్వాలకతీతంగా జీవిస్తూ ఏకత్వాన్ని సాక్షాత్కరించుకో. 

"బాబూజీ మహారాజ్ కు అమావాస్య నాడు దైవ సాక్షాత్కారం జరిగింది; బుద్ధుడికి పౌర్ణమినాడు జరిగింది; సాక్షాత్కారం సాధకులకు ఏ రోజైనా, ఎప్పుడైనా, ఏ  క్షణమైనా జరగవచ్చు. దానికి తగిన విధంగా తయారవడానికే ప్రాణాహుతితో కూడిన ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన వంటి ప్రక్రియల సాధన చేయడం ద్వారా ఇది సాధ్యం. కానీ "నాకు సాక్షాత్కారం జరిగింది" అని డైరీలో వ్రాసుకోడానికి సాధకుడుండడు. దయచేసి ఈ విషయాన్ని గురించి ఆలోచించండి." - ఈ దీపావళి నాడు పూజ్య దాజీ కాన్హాశాంతి వనంలో ఇచ్చిన సందేశం  

అందరూ దీపాలువెలిగించుకుని (లోపల-బయట) నిశ్శబ్దంగా ప్రార్థనాపూర్వకంగా దీపావళి జరుపుకోవాలని ఆశిస్తూ 
అందరికీ దీపావళి శుభాకాక్షలు.  

17, అక్టోబర్ 2025, శుక్రవారం

హృదయంతో వినడం - 2

 


హృదయంతో వినడం - 2 

హృదయంలో నిద్రాణమై బీజరూపంలో ఉన్న శక్తులు అనేకం ఇంకా వెలికి రావలసినవి ఉన్నాయని శాస్త్రజ్ఞులు కూడా నమ్ముతున్నారు. హార్ట్ మ్యాత్ సొల్యూషన్స్ (ఇది ఇంటర్నెట్ లో దొరుకుతుంది) అనే గ్రంథంలో హృదయానికి అవసరమైన బుద్ధి హృదయంలోనే ఉందని మామూలుగా వాడే బుద్ధి అవసరం లేదని తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ లో ఉల్లేఖించడం జరిగింది.  

లోపలి నుండి వినిపించే గళం హృదయ గళమా లేక మరేదైనా గళమా ఎలా తెలుస్తుంది?
ఇంతకు ముందు వ్యాసంలో లోపల అనేక గళాలున్నాయని తెలుసుకున్నాం. వాటిల్లో మనస్సాక్షిని లేక హృదయ గళాన్ని గుర్తించడం ఎలా అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది హృదయ గళం మనం తప్పు చేస్తున్నప్పుడే వినిపిస్తుంది. మనం తీసుకున్న నిర్ణయం సరైనడా కాదా అన్న సందేహం వచ్చిందంటే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. సరైన నిర్ణయం అయితే ఇక యేమాత్రమూ సందేహం ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

హృదయం లేక మనస్సాక్షిని అనుసరించడం అనేది ఈ ప్రపంచంలో సాధ్యమా?
మనం ఉన్న పరిస్థితుల్లో కష్టసాధ్యమే. హృదయాన్ని ప్రస్తుత కాలంలో అనుసరించాలంటే సాహసం కావాలి; నిజానికిది చాలా సరళమైనది. సరళమైనది జటిలం చేసేసుకున్నాం. సరైన ఆలోచనా విధానం, సరైన అవగాహన చాలా అవసరం. 
కానీ అన్నిటికంటే పెద్ద ఒత్తిడి మనస్సాక్షికి దూరంగా ఉండటమే; భగవంతునికి దూయమగా ఉండటమే; ఆత్మవిరుద్ధంగా జీవించడమే. కాబట్టి సరైన దిశలో జీవితం కొనసాగాలంటే కనీస ప్రయత్నం అవసరం. అదే ఆధ్యాత్మిక సాధన.

సరైన ఆలోచనా విధానం అని , సరైన అవగాహన అని ఎలా తెలుస్తుంది ? 
సరైన ఆలోచనపైనే సరైన అవగాహన ఆధారపడుంది; సరైన అవగాహన సరైన ఆలోచనపైన ఆధారపడుతుంది. సరైన ఆలోచన, సరైన అవగాహన అని ఎప్పుడు తెలుస్తుందంటే మనసులో విపరీతమైన ప్రశాంతత ఉన్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత ప్రతీదానికి అవసరం. అది హార్ట్ఫుల్నెస్ ధ్యానం వల్ల సరళంగా సంభవిస్తుంది.  
కాబట్టి హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన వల్ల హృదయంతో వినడం అనేది సుసాధ్యం, సహజం. దీనివల్ల సరైన ఆలోచన, సరైన అవగాహన, సరైన నిర్ణయాలు, అన్ని స్థాయిల్లో ఉండే ఒత్తిళ్ళు క్రమక్రమంగా పోగొట్టుకోవడం; ఆ తరువాత అణువణువూ ప్రశాంతత స్థిరంగా ఉన్నప్పుడు ఇతర సూక్ష్మ లోకాల సంపర్కం, ఆ తదుపరి ఆత్మ వికాసం జరుగుతాయి. ఈ యాత్ర పూర్తవడం అంటూ ఉండదు; ఇది అనంత యాత్ర. ఒత్తిడి నుండి మోక్షం; మోక్షం నుండి భగవత్సాక్షాత్కారం ; అక్కడి నుండి లయావస్థ; లయావస్థ నుండి పూజ్య దాజీ చెప్పినట్లుగా, అసలు అనంత యాత్ర ప్రారంభవడం జరుగుతుంది. ఇది ఆత్మ కొనసాగించే సృష్టి ఆది నుండి ఒక అనంత అంతరంగ సాహసయాత్ర. అందరూ ఉత్సాహంగా, ధైర్యంగా, ఆనందంగా కొనసాగింతురుగాక! 


15, అక్టోబర్ 2025, బుధవారం

హృదయంతో వినడం - 1

 


హృదయంతో వినడం - 1 
హృదయంతో వినడం అనేది ఒక కళ. హార్ట్ఫుల్నెస్ జీవన విధానం అంతా కూడా దీన్ని గురించే; హృదయాన్ని గురించే అంతా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది భౌతిక హృదయాన్ని గురించి కాదు; లబ్-డబ్, లబ్-డబ్ అని కొట్టుకునే మాంసపు గుండెను గురించి కాదు; మనం చర్చించుకుంటున్నది ఆధ్యాత్మిక హృదయం గురించి; తెలుగులో వాడుకలో హృదయాన్ని మనసు అని కూడా అంటాం. మంచి మనసున్న మనిషి, సహృదయుడు, దయార్ద్ర హృదయుడు. కఠిన హృదయుడు, సున్నిత మనస్కుడు, ... ఇలా మనసు అనే పదాన్ని, హృదయం అనే పదాన్ని ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. ఈ ఆధ్యాత్మిక హృదయం ఎక్కడుంది? గుండె కొట్టుకునే ప్రాంతంలోనే ఉంది అని మన విస్పర్శ్ గ్రంథం కూడా ధృవీకరిస్తోంది. హృదయం అంటే కేంద్రం అని కూడా అర్థం ఉంది. హృదయం అనేది మనిషి చేతనకు కేంద్రంగా ఉంది. అందుకే హృదయాన్ని బట్టే మనిషి వ్యక్తిత్వం; మనిషి చేతనం; మారవలసినది హృదయమే; అందుకే హృదయ పరివర్తనం అంటారు; హృదయం మారితే మనిషి మారినట్లే. వేదాది శాస్త్రాలన్నీ కూడా హృదయాంతరాళంలోనే దైవం నివాసం అని చెబుతున్నాయి. మనం ధ్యానం ద్వారా అనుభూతి చెందవచ్చు. అందుకే హృదయం ఎప్పుడూ తప్పుడు మార్గదర్శనం చేయదు. మనస్సాక్షి అంటే కూడా ఇదే; అంతఃకరణ అంటే కూడా ఇదే.  హృదయం అనేది ఉద్వేగాలకు, ప్రేరణలకు మూలస్థానం అని పూజ్య దాజీ చెబుతూ ఉంటారు. అంతే కాదు, మనిషి తప్పు చేస్తున్నప్పుడల్లా తప్పక ఎత్తి చూపుతుంది; కానీ సరైన పని చేసినప్పుడు, సరిగ్గా ఆలోచించినప్పుడు, మౌనంగా ఉండిపోతుంది, కానీ 'శభాష్' అని భుజం తట్టదు. 

మనలో అనేక గళాలున్నాయి 
మనిషి అంతరంగంలో నుండి అనేక గళాలు వినిపిస్తాయి - మన సంస్కారాల గళాలు, మన అహంకారానికి సంబంధించిన గళాలు, మన కోరికలకు సంబంధించిన గళాలు, ఈ గళాలన్నీ కూడా మనలో ఉండే వికారాల ప్రభావం కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ బుద్ధిని ప్రభావితం చేస్తాయి. ఆ బుద్ధినే మనిషి సాధారణంగా అనుసరిస్తూ ఉంటాడు. 'బుద్ధి కర్మానుసారిణి' అని పెద్దలు అందుకే అన్నారు; అంటే బుద్ధి మన కర్మలను (సంస్కారాలను) అనుసరిస్తుంది; మనం బుద్ధిని అనుసరిస్తాం. అందుకే మనిషి జీవితం తన కర్మ ఎలా ఉంటే అలా కొనసాగుతూ ఉంటుంది. నిజానికి బుద్ధి కూడా హృదయాన్ని అనుసరించినట్లయితే కర్మల ప్రభావం తగ్గి, మనిషి జీవితం ఉండవలసిన రీతిలో సరైన దిశలో కొనసాగుతుంది; ఆ విధంగా వ్యక్తి యొక్క విధిరూపకల్పన ప్రారంభమవుతుంది. అది ధ్యానం వల్లనే సాధ్యపడుతుంది. బుద్ధికి  హృదయాన్ని అనుసరించే శిక్షణనివ్వడమే హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క లక్ష్యం. ఇది మొట్టమొదటి రోజు నుండి జరుగుతుంది. 
(ఇంకా ఉంది ...) 

14, అక్టోబర్ 2025, మంగళవారం

ఓం శాంతిః శాంతిః శాంతిః

 


(పైన చిత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానంలో.. సృష్టిస్థితిలయకారులు, వీళ్ళు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ధ్యానం చేస్తున్నదెవరిపైన?)
ఓం శాంతిః శాంతిః శాంతిః
ప్రతీ ఆత్మ శాంతి కోసం పరితపిస్తూ ఉంటుంది. శాంతి లేకపోయినట్లయితే ఏ పనీ సరిగ్గా జరుగదు. మనశ్శాంతి అవసరం ఇంత-అంతా కాదు. సమస్త సృష్టే శాంతి కోసం తపిస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో జరిగే సమస్త కదలికలూ, సూక్ష్మ కదలికల నుండి స్థూల కదలికల వరకూ కూడా శాంతి కోసమే. మన వేదాల్లో కూడా, ప్రతీ మంత్రమూ ఓం శాంతిః శాంతిః శాంతిః తో ముగుస్తుంది. శాంతి మంత్రాలని వేదాలలో ప్రత్యేకంగా ఉన్నాయి కూడా. 

వేదశాస్త్రాల్లో శాంతి
శాంతికి మూడు పార్శ్వాలున్నాయి :
1) ఆధ్యాత్మిక శాంతి - మనసుకు, హృదయానికి  సంబంధించిన అంతరంగ శాంతి 
2) ఆధిభౌతిక శాంతి - ప్రకృతికి, సమాజానికి, తోటి జీవులకు సంబంధించిన శాంతి 
3) ఆధిదైవిక శాంతి - అంతరిక్షంలోని శక్తులకు, విధికి దైవత్వానికి సంబంధించిన శాంతి. 
అందుకే మన శాంతి మాత్రాల్లో మూడు సార్లు ఓం, శాంతిః శాంతిః శాంతిః అని భగవంతుని ప్రార్థించేది. 
సంగచ్ఛధ్వం, సంవదధ్వం, సం వో మనాంసి జానతాం  
- ఋగ్వేదం  (10.191.4)
అర్థం: అందరూ సామరస్యంగా కదలండి, అందరూ ఒక్క గళంతో మాట్లాడండి, మీ మనసులన్నీ సామరస్యంగా ఉండేలా హూసుకోండి. 
ఓం, శాంతిః శాంతిః శాంతిః
- అథర్వ వేదం (19.9 .14)
అర్థం: శరీరంలోనూ (ఆధ్యాత్మికం), వాతావరణంలోను (ఆధిభౌతికం), అంతరిక్షంలోనూ(ఆధిదైవికం) శాంతి ఉండాలని ప్రార్థన. 
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ 
- బృహదారణ్యక ఉపనిషత్తు (1.3.28)
 శాంతి అంటే అర్థం
 లోపల బయట ఉండవలసిన సామరస్యం, ప్రశాంతత; నిశ్చలత్వం; నిశ్శబ్దం; ఒకరకమైన శూన్యత్వం. 
అంతరంగంలో శాంతి ఎలా కలుగుతుంది?
ధ్యానం తరువాత వచ్చేదే శాంతి అంటుంది సహజ మార్గం. అభ్యాసం చేయగా-చేయగా శరీర వ్యవస్థలో అణువణువూ శాంతితో నిండిపోతుంది.
శాంతి కర్మఫల త్యాగం వల్ల వస్తుందంటుంది భగవద్గీత; మనలో ఉన్న భయం, చింతలు, అరిషడ్వర్గాల వంటి వికారాలు, సంస్కారాలు  తొలగిపోవడం వల్ల అపరిమితమైన గాఢమైన శాంతి కలుగుతుంది.

పైన చిత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానంలో.. సృష్టిస్థితిలయకారులు, వీళ్ళు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ధ్యానం చేస్తున్నదెవరిపైన?
సమాధానం: బ్రహ్మ సృష్టించే ప్రక్రియపైన ధ్యానిస్తున్నాడు. విష్ణువు స్థితికార్యంపై ధ్యానిస్తున్నాడు; లయకారుడు లయంపై ధ్యానిస్తున్నాడు. వీరు ముగ్గురూ కూడా తమలో బీజస్థితిలో ఉన్న ఒకే పరబ్రహ్మ తత్త్వంపై  ధ్యానిస్తూ ఉంటారు. మనుషులకైనా, దేవతలకైనా, సృష్టిస్థితిలయకారులయినా ధ్యానం అనివార్యం.  

7, అక్టోబర్ 2025, మంగళవారం

సమయం - కాలం (భాగం 3)

 


సమయం - కాలం (భాగం 3)

సహజ మార్గ మాస్టర్లు అనుభవ జ్ఞానంతో, కాలాన్ని గురించిన పలికిన కొన్ని అమృత వాక్కులు:
- విడిచిన బాణం, పలికిన మాట, గడిచిన కాలం తిరిగి రావు. కాబట్టి వీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 
- భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తనను తాను 'కాలోస్మి' అని చెప్పుకుంటాడు; అంటే తానే కాలమని అర్థం. అందుకే కాలాన్ని వృథా చేయడం అంటే భగవంతుని వ్యర్థం చేయడమే అన్నారు చారీజీ. 
- శారీరక, మానసిక అనుభవాలన్నీ కాలపరిధిలోనే సంభవిస్తాయి. అంటే భూత, వర్తమాన, భవిష్యత్కాలాల్లోనే సంభవిస్తాయి. అందుకే శరీరానికి, మనసుకు అతీతంగా,కాలాతీతంగా  ఎదగవలసిన అవసరం; అదే పూర్ణత్వం;అది మనిషికి మాత్రమే ధ్యానం ద్వారా సాధ్యం. 
- ధ్యానం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు; సమయాన్ని సృష్టించుకోవచ్చు; వృథా గాకుండగా జీవించడం నేర్చుకోవచ్చు; తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనులను నాణ్యతలో రాజీ పడకుండా ఉండే సమర్థతలను పెంచుకోవచ్చు. - దాజీ  
- కాలాతీత చేతనంతో జీవించడం వల్ల అన్నిటి పట్ల  స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది; వివేకం ఏర్పడుతుంది; అది ఈ భవసాగరాన్ని సునాయాసంగా ఈదేలా చేస్తుంది.   
- నా సమయం ఎప్పుడూ వృథా కాదు. - లాలాజీ. అంటే వారెప్పుడూ నిరంతర స్మరణలో ఉంటారు కాబట్టి. 
- ప్రేమ, పవిత్రత, హృదయంలోని ప్రశాంతత, శాంతి, ఆనందము, నిశ్చలత్వం ఇత్యాదివన్నీ కాలాతీత స్థితులే. 

6, అక్టోబర్ 2025, సోమవారం

సమయం - కాలం (భాగం 2)

 


సమయం - కాలం (భాగం 2)
భారతీయ వేద వాజ్ఞ్మయంలో కాలం 

వేదోపనిషత్తులలో కాలం అంటే ఆ పరతత్త్వమే, ఆ పరబ్రహ్మమే  కాలంగా అభివ్యక్తమయ్యింది. ఆ పరబ్రహ్మమే కాలంగానూ, కాలాతీత తత్త్వంగానూ కూడా ఉన్నది. సృష్టిస్థితిలయలు ఈ కాలం ద్వారానే నిర్వహింపబడుతున్నాయి. 

భగవద్గీతలో "కాలోస్మి లోక క్షయత్ కృత్ ప్రవృద్ధో ..." (11:32) "నేనే కాలాన్ని సమస్త లోకాలను చివరికి లయం చేసేది నేనే" అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు.  

పురాణాలలో కాలం అనేది ఒక చక్రం; యుగాలు, కల్పాలు, మరలా మరలా పునరావృతం అవుతూ ఉంటాయి. 

యోగశాస్త్రంలోనూ, వేదాంత శాస్త్రంలోనూ కాలం అనేది ఒక మిథ్య(మాయ); పదార్థానికి, మనసుకు,  ఆవల ఉన్నది కేవలం "శాశ్వత ప్రస్తుతం" మాత్రమే. 

ఆధ్యాత్మిక చింతన ప్రకారం కాలం అనేది మనలను మనం శరీరంగానూ, మనసుగానూ గుర్తించుకోవడం వల్ల నిజమలా అనిపిస్తుంది. నిగూఢ ధ్యానలోతుల్లో లీనమై ఉన్నప్పుడు కాలం అదృశ్యమైపోతుంది. చేతనకు సంబంధించిన తత్త్వంగా మాత్రమే మిగిలిపోతుంది. ఆధ్యాత్మికత ప్రకారం కాలం అనేది ఒక తెర మాత్రమే; దాని ఆవల ఉన్నదే అసలైన సత్యం; పరమసత్యం. 


సమయం - కాలం (భాగం 1)

 


సమయం  - కాలం (భాగం 1)
సమయం, కాలం - ఈ రెండు పదాలు నిత్యం మన జీవితంలో వాడుతూ ఉంటాం. వీటికి అర్థాలు పరిశీలిద్దాం. 
సమయము, లేదా కాలము అనేవి రెండు రకాలుగా అర్థం చేసుకోవలసి ఉంది: 
1) సమయం - కొలవగలిగే సమయం (సెకన్లు, నిముషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు 
2) కాలం - అస్తిత్వానికి సంబంధించినది (ఉనికికి స్వరూపాన్ని ఇవ్వడం, వీధి, మోక్షం, కాలం ఆసన్నమవడం అంటే మృత్యువు దగ్గరపడటం ఇత్యాది అర్థాలు)

సూక్ష్మ కాలమానం 
(విష్ణు పురాణం, భాగవత పురాణం, సూర్య సిద్ధాంతం)
తృటి: అతి సూక్ష్మ మానము (సెకనులో 1/16,875 భాగం )
నిమేషం: కనురెప్పపాటు (0.213 సెకను)
క్షణము: 0.8 సెకన్లు  
ముహూర్తము: 48 నిముషాలు (ఒక రోజుకు 30 ముహూర్తాలు)
అహోరాత్రులు: రాత్రింబవళ్ళు 24 గంటలు  

మహాకాలమానము 
మహాయుగం : 4 యుగాలు = 43,20,000 సంవత్సరాలు.

సత్య యుగం (కృతయుగం): 1,728,000 సంవత్సరాలు 

త్రేతా యుగం: 1,296,000 సంవత్సరాలు 

ద్వాపర యుగం: 864,000 సంవత్సరాలు 

కలి యుగం: 432,000 స,వత్సరాలు 

కల్పం : 1000 మహాయగాలు 

బ్రహ్మకు ఒక పగలు ఒక కల్పం, ఒక రాత్రి ఒక కల్పం 

సశేషం ....  

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...