గురుపరంపర ప్రాముఖ్యత,
సహజ్ మార్గ్ గురుపరంపర
పరంపర అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం వారసత్వం, కొనసాగింపు, ఒక గురువు నుండి ప్రధాన శిష్యునికి జ్ఞాన సిద్ధిని ప్రసరణ చేయడం. ఆ విధంగా గురుపరంపర అనేది వివిధ తరాల గురువుల వారసత్వం. గురుపరంపర ద్వారా ఆధ్యాత్మిక ప్రజ్ఞను, ఆధ్యాత్మిక సిద్ధిని భద్రంగా పదిలపరచడం, అందించడం (ప్రసరించడం) జరుగుతూ ఉంటుంది. గురుపరంపర అంటే ఆది గురువు ఆర్జించిన పరమ ఆధ్యాత్మిక సిద్ధులను, ప్రజ్ఞను, తన ప్రధాన శిష్యుడికి అందజేయడం ద్వారా తరువాతి తరానికి సజీవంగా ప్రసరించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అనుభవాన్ని, యౌగిక సాధనా ప్రక్రియలను, అనుగ్రహాన్ని, అంతరంగ పరివర్తననను గురువు శిష్యునికి ప్రసరించడం.
రకరకాల గురుపరంపరలు, వారి-వారి సాంప్రదాయాలను బట్టి మనకు ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే
సహజ్ మార్గ్ గురుపరంపర కూడా ఉన్నది. మొట్టమొదటి గురువును మన సాంప్రదాయంలో ఆదిగురువు అని సంబోధిస్తూ ఉంటాం. సహజ్ మార్గ్ గురుపరంపరలో ఆదిగురువు - పూజ్య లాలాజీ మహారాజ్. ఆఅ తరువాత బాబూజీ మహారాజ్ - చారీజీ మహారాజ్ - ప్రస్తుతం సజీవ గురువు దాజీ మహారాజ్.
మన గురువుల ప్రకారం అప్పుడప్పుడు వాళ్ళ ప్రసంగాల్లో ఉల్లేఖించినడాన్ని బట్టి పూజ్య లాలాజీకి పూర్వం కూడా కొందరు గురువుల పరంపర ఉందని తెలుస్తున్నది. పైన చిత్రంలో ఉన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడితోనూ, రాధా మాతతో ప్రారంభమై బుద్ధ భగవానుడు, చైతన్య మహాప్రభు, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస ఇంకా ఎందరో ఉన్నారట.
గురుపరంపర ప్రాముఖ్యత యేమిటంటే గురువు పొందిన ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధిని కేవలం గ్రంథాల ద్వారా సంపూర్ణంగా అందించడం సాధ్యపడదు, దివ్య ప్రేమను సజీవంగా సజీవంగా అందించడం సాధ్యపడదు, అది కేవలం పరిశుద్ధ హృదయం అంటే పవిత్రంగా శుద్ధీకరింపబడిన సూక్ష్మ శరీరాల ద్వారా మాత్రమే యథాతథంగా అందించడం సాధ్యపడుతుంది. అదే సజీవ గురువు యొక్క ప్రాముఖ్యత. అదే గురుపరంపర యొక్క ప్రాముఖ్యత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి