28, నవంబర్ 2025, శుక్రవారం

ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరం

 


హృదయంలోని దివ్య వెలుగుపై ధ్యానం 

ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరం 

నిజానికి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో దినచర్యగా మారిపోవలసిన అంశం. క్రమంగా ధ్యానం జీవన విధానంగా మారిపోవాలి. శ్వాస అయినా ఆగిపోవచ్చునేమో గాని ధ్యానం ఆగకూడదు. ఇది కొన్ని రోజుల సాధనలోనే సుసాధ్యం, అసంభవం కాదు. 

అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి? 
మనుషులలో ఆలోచనా-కాలుష్యం పోగొట్టుకోవాలంటే చెయ్యాలి. అదే మనిషిచే చేయబడే అన్ని అనర్థాలకు, అన్ని రకాల అన్ని స్థాయిల్లో జరిగే ఒత్తిళ్ళకు మూల కారణం అయి ఉంది. దురదృష్టవశాత్తు, వ్తతఇళ్ళతో జీవించడమే మనిషి జీవన విధానం అయిపోయింది. కొంతవరకూ ఒత్తిడి మంచిదే అయినప్పటికీ (బద్ధకం వచ్చేస్తుంది లేకపోతే), మనకున్నవి మోతాదుకు మించిన ఒత్తిళ్ళు. ఇవి శారీరక అనారోగ్యానికి, ఆ తరువాత మానసిక అనారోగ్యానికి దారి తీసి, తద్వారా రోజురోజుకీ మనశ్శాంతి తగ్గిపోతూ, జీవితాన్ని సార్థకం చేసుకుని ఆత్మవికాసం చెందే  అద్భుత అవకాశాన్ని కోల్పోయేలా చేస్తాయి.
కేవలం ఒత్తిళ్ళు తగ్గించుకోవాడమే కాదు, మనోబుద్ధ్యహంకారచిత్తాలను  శుద్ధి చేసి మనిషిలో నిద్రాణమై ఉండే ఎన్నో నైపుణ్యాలను వెలికి తీస్తుంది, తద్వారా మనశ్శాంతి, ఏకాగ్రత, ఆలోచనలలో స్పష్టత, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, ఏకాగ్ర చిత్తం జీవితంలో ఎదురయ్యే కష్టాలను చిరునవ్వుతో స్వీకరించగలిగే పరిస్థితి, భయాన్ని పోగొడుతుంది, మనలో ప్రేమను పెంచుతుంది, క్రమశిక్షణను సహజంగా పెంచుతుంది, మనుషులలో సామరస్యం పెంచుతుంది, అంతేగాక ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు ఎదిగేలా దారి తీస్తుంది. మనలో అంతర్యామిగా ఉన్న దైవత్వాన్ని అనుభూతి చెందే పరిస్థితి ఏర్పడుతుంది; జీవితానికి దిశ ఏర్పడుతుంది; జీవనం చరితార్థమవుతుంది. 
ధ్యానం జీవిత పరమార్థానికి అవసరమైన పరిష్కారం; మనిషి అస్తిత్వం యొక్క మూలాల్లోకి వెళ్ళి పని చేస్తుంది. 
కాబట్టి ధ్యానం శ్వాస కంటే చాలా అవసరం. ఎందుకంటే శ్వాస ఆగిపోయి ప్రాణాలు విడిచిపెట్టినప్పుడు కూడా మృత్యువు తెలియకుండా, మరో ఉన్నత లోకానికి తీసుకువెళ్ళే సాధనం ధ్యానం. ఆ విధంగా మృత్యువును కూడా అధిగమించగలిగే సాధనం.  
కాబట్టి దయచేసి ఆలోచించండి, ధ్యానం చేయకపోతే ఎంత కోల్పోతున్నాడో మనిషి!

25, నవంబర్ 2025, మంగళవారం

భౌతిక హృదయం - ఆధ్యాత్మిక హృదయం

 


భౌతిక హృదయం - ఆధ్యాత్మిక హృదయం 

భౌతిక హృదయం ప్రతి ఒక్కరికీ సాధారణంగా ఛాతీకి ఎడమ భాగంలో ఉండే శరీర అవయవం. వేల మందిలో యే ఒక్కరికో ఛాతీకి కుడి భాగంలో ఉంటుంది. ఇది భౌతిక జీవనానికి ఆధారం. ఊపిరి తిత్తుల ద్వారా శుద్ధం చేసిన రక్తాన్ని, పోషక పదార్థాలను శరీరానికి నలు మూలలా సరఫరా చేస్తుంది.  ఉద్వేగాలకు పుట్టిల్లు. భౌతిక హృదయం మనిషిలో కలిగే ఉద్వేగాలకు, ఒత్తిళ్ళకు, హార్మోన్లకు  ప్రభావితమవుతూ ఉంటుంది. 


ఆధ్యాత్మిక హృదయం శరీర అవయవం కాదు. కంటికి కనిపించదు. కానీ అనుభూతి చెందవచ్చు. ఆధ్యాత్మిక హృదయం ఆత్మకు నివాసం; మనిషి చేతనానికి, అనుభూతులకు కేంద్రం; మనం ధ్యానంలో దివ్యవెలుగును అనుభూతి చెందేది ఇక్కడే; మానవీయత, దివ్యత్వాల కలయిక జరిగే చోటు. ఆధ్యాత్మిక చేతనం ఉండేది ఇక్కడే; ఛాతీకి కొంచెం కుడి ప్రక్కగా ఉంటుందని గువులు చెప్తారు. 


ఉద్వేగాలన్నీ అనుభూతి చెందేది భౌతిక హృదయంలోనే అయినప్పటికీ, అవి ఉద్భవించేది ఆధ్యాత్మిక హృదయంలో. మన కర్మల వల్ల, మన సంకల్పాల వల్ల, మన ఆలోచనా ప్రక్రియల ఫలితంగా ఈ ఉద్వేగాలు కలుగుటూ ఉంటాయి. 


ఆధ్యాత్మిక హృదయ శుద్ధి జరిగినప్పుడు భౌతిక హృదయం ఆరోగ్యంగా తేలికగా ఉంటుంది. హృదయంపై ధ్యానం చేయడం వల్ల శాంతి, ఆలోచనలోనూ, అవగాహణలోనూ స్పష్టత, ఉద్వేగాల్లో సమతౌల్యత, చైతన్య విస్తరణ జరుగుతుంది.  


భౌతిక హృదయం శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది; ఆధ్యాత్మిక హృదయం జీవుడిని సజీవంగా ఉంచుతుంది. భౌతిక హృదయం రక్తాన్ని సరఫరా చేస్తే, ఆధ్యాత్మిక హృదయం శాంతిని, ప్రేమను, ఉన్నత చేతనాన్ని సరఫరా చేస్తుంది. 


19, నవంబర్ 2025, బుధవారం

సహజ మార్గ ధ్యాన సాధనలో ఎదురయ్యే సవాళ్ళు

 


సహజ మార్గ ధ్యాన సాధనలో ఎదురయ్యే సవాళ్ళు 

అత్యున్నత ఆధ్యాత్మిక వికాస దిశగా తీసుకువెళ్ళే సరళమైన సహజ్ మార్గ ధ్యాన పద్ధతిని అనుసరించే క్రమంలో సాధకుడికి సాధారణంగా ఎదురయ్యే కొన్ని సవాళ్ళను మనం ఇక్కడ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సహజ మార్గ గురువుల ప్రకారం నిజానికి అవి సవాళ్ళు కావు, ఆధ్యాత్మిక పరిణతికి, ఎదుగుదలకు  తోడ్పడే అవకాశాలని చెప్తారు. 
మానసిక చంచలత్వం 
 మొట్టమొదటి అవరోధం - చంచలంగా అటు-ఇటూ తిరిగే మనసు ధ్యానం చేయనివ్వకపోవడం. 
ఆలోచనలు, కోరికలు, చింతలు, నిరంతరం తిరుగుతూ ఉండే మనసు ధ్యాన వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం. 
ఇది సహజం ఎందుకంటే అనసెప్పుడూ బాహ్యఓనముఖంగా పని చేస్తూ ఉంటుంది, దాన్ని అంతర్ముఖం చేయమన్నప్పుడు వచచ్చే ఇబ్బందులివి. 

నిత్యసాధన, క్రమశిక్షణ
ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం నిత్యం చేయగలగడం పెద్ద సమస్య చాలా మందికి. 
బద్ధకం, తీరిక లేకపోవడం, మనసు పలు రకాలుగా (మూడ్ సవింగ్స్ అంటారు)ఉండటం వల్ల ఆసక్తి లేకపోవడం 
సాధన తీవ్రంగా చేయడం కంటే కూడా నిత్యం చేయడం ములహయం అంటుంది సహజ మార్గం. పూజ్య దాజీ కనీసం 5 నిముషాలయినా ప్రతి నిత్యం ధ్యానం చేయమంటారు. తీవ్ర సాధనకు క్రమశిక్షణ, నిబద్ధత చాలా అవసరం. 

సూక్ష్మ అహం వల్ల కలిగే అవరోధాలు 
ధ్యానం ద్వారా హృదయ శుద్ధి జరుగుతున్న కొద్దీ అహం అభద్రత  అనుభూతి చెందుతుంది. 
"నేను ప్రోగ్రెస్ అవుతున్నానా?", "నాకేమీ అనిపించడం లేదు". "నేను మాస్టరుకు ఎందుకు శరణాగతి అవ్వాలి?" వంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. 
ఇటువంటి ప్రశ్నలు మరలా సాధకుడిని స్వార్థంగా ఆలోచింప చేస్తాయి. 

సంస్కారాలు ఎదుర్కోవడం 
సాయంకాల శుద్ధీకరణ సమయంలో లోపలున్న పాత ముద్రలు పైకి రావడం వల్ల, నిర్మూలింపబడటం వల్ల ఒక్కోసారి బరువుగానూ అలజడిగానూ ఉండవచ్చు. దీని మూలాన ప్రశాంతత, ఆనందం ఆశిస్తున్న వాళ్ళకి ఆసక్తి తగ్గడం జరుగుతుంది. 

అనుభూతులపై ఆధారపడటం 
చాలా మంది సాధకులు, ధ్యానంలో యేవో కనిపిస్తాయని, కాంతి కనిపిస్తుందని, ప్రత్యేకమైన స్థితులు కలుగుతాయని ఆశిస్తూ ఉండటం వల్ల అటువంటి అనుభూతులు కాలగకపోయే సరికి వారికి నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. 
మాస్టర్లు మార్పు అనేది అనుభూతిలో కాదని, అంతరంగ పరివర్తనలోనూ, అంతరంగ స్థితిలోనూ ఉంటుందని పడే పడే మాస్టర్లు చెబుతూనే ఉంటారు. 

శరణాగతి, శ్రద్ధ
మాస్టర్ పట్ల నిజమైన  సమర్పణ భావం కలగడం అంతా తేలిక కాడ. ఎందుకంటే స్వీయ నియంత్రణలోనే ఉండాలనే మన ఆధునిక ఆలోచనా ధోరణి వల్ల, మేధాపరమైన ప్రశ్నించే అలవాటు వల్ల అంతా తేలిక కాదు. 
సాధకుడు గ్రుడ్డి నమ్మకం గాకుండాగా, అతిగా సందేహించకుండా, చేసే అభ్యాసాన్ని, శ్రద్ధను సమతౌల్యంగా ఉండేలా చూసుకోవాలసి ఉంది. 

ప్రాపంచిక ఆకర్షణలు 
కుటుంబ బాధ్యతలు, పని/వ్యాపారాల ఒత్తిడి, సామాజిక ఒత్తిళ్ళు వీటితో సత్యమవుతూ ఉండటం వల్ల మనసు చంచలంగా అస్థిరంగా ఉంటుంది. 
ఆధ్యాత్మిక సాధన, ప్రాపంచిక జీవనం రెండూ సమంగా ఉండేలా చూసుకోవడం నిజంగా పరీక్షే; కానీ ప్రాపంచిక జీవనం నుండి తప్పించుకోవడం కాదు, అందులో కొనసాగుతూనే సమతౌల్యత సాధించాలన్నది మాస్టర్ల బోధ. 

ఫలితాల కోసం అశాంతి 
చాలా మంది సాధకులు తమలో  పరివర్తన అతి త్వరగా రావాలనుకుంటారు. కానీ సహజ మార్గ పద్ధతి, పరిశుద్ధంగా తయారయ్యేటువంటి జీవితకాల ప్రయాణం. 
ఓర్పు లేకపోవడం అనేది చీకాకుకు, ఇతరులతో పోల్చుకోవడం, చివరికి సాధనను వదిలిపెట్టేయడం కూడా జరుగుతుంది. 

మార్గంలో కలిగే ఒంటరితనం 
కుటుంబ సభ్యులు, స్నేహితులు సాధకుడు ఎందుకు ఈ అభ్యాసం ఈ మార్గాన్ని అవలంబిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోవచ్చు; తరచూ అపార్థం చేసుకోవచ్చు లేక వేరేలా అర్థ చేసుకోవచ్చు కూడా. ఈ పరిస్థితి వల్ల కలిగే ఒంటరితనం సాధకుడి శ్రద్ధ-విశ్వాసాలకు, అంతరంగ శక్తికి పరీక్షగా తీసుకోవాలి. 

లోతైన సూక్ష్మమైన సవాళ్ళు
ఆధ్యాత్మిక పురోగతి మరింత మరింత ఎక్కువవుతున్న కొద్దీ సవాళ్ళు మరింత సూక్ష్మంగా ఎదురావుతూ ఉంటాయి:
ప్రేమతో ఉంటూ  బంధాల్లేకుండా ఉండటం,
ఇష్టాయిష్టాలకతీతంగా ఉండటం, 
ఆధ్యాత్మిక పురోగతికి తాను కారణంగా భావించకుండా ఉండటం,
స్వప్రయత్నం కంటే కూడా దివ్య కృపపై ఎక్కువగా  ఆధారపడటం వంటి సవాళ్ళు ఎదురావుతూ ఉంటాయి. 

సహజ్ మార్గ్ పద్ధతి ప్రాణాహుతి ద్వారా మనసు, బుద్ధి, అహంకారాలను క్రమక్రమంగా శుద్ధి చేసే ప్రక్రియలతో కూడిన సాధనా పద్ధతి. తద్వారా చైతన్య శుద్ధి జరిగి మనిషిలో పరివర్తన సాధ్యమవుతుంది. 
 పైన ఉల్లేఖించిన సవాళ్ళను అధిగమించడానికి కొన్ని సూచనలు:
సాధన పట్ల కాస్త ఆసక్తి, కాస్త ప్రయత్నం, కాస్త నిబద్ధత, కాస్త ఓర్పు అలవరచుకోవాలి. 
ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనం, పూజ్య గురుదేవుల ప్రసంగాలను వినడం, తోటి అభ్యాసుల సాంగత్యం, సత్సంగం, స్వచ్ఛంద సేవలలో పాల్గొనడం, మాస్టరుపై అపారమైన శ్రద్ధను అలవరచుకోవడం, వల్ల ఈ సహజ్ మార్గ్ అనంత ఆధ్యాత్మిక యాత్ర సునాయాసంగా కొనసాగుతూ ఉంటుంది. 
 

17, నవంబర్ 2025, సోమవారం

కర్మ, అకర్మ, వికర్మ

 


కర్మ, అకర్మ, వికర్మ 

కర్మ అంటే ఆలోచనల వల్ల, చేసే పనుల వల్ల, ఉద్దేశ్యాల వల్ల కలిగే ఫలితం. కర్మ అంటే ధర్మానికి అనుగుణంగా చేసే పనులు. అంటే నైతికమైన పనులు, శాస్త్రాలకనుగుణంగా ఉండే పనులు, తనకు, సమాజానికి ఉపయోగపడే పనులు, కర్తవ్య భావంతో చేసే పనులు. ఉదాహరణలు: చిత్త శుద్ధితో తన ధర్మాలని నిర్వర్తించడం, గృహస్త ధర్మాలను నిర్వహించడం, దానధర్మాలు, సేవ, యజ్ఞాలు నిర్వహించడం, నిస్స్వార్థంగా పనులు చేయడం. 
వీటినే శీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నిత్య కర్మ అని చెప్పడం జరిగింది. 
నియతం కురు కర్మత్వం - గీత 
అర్థం: నీ నిత్యనాయిమట్టిక కర్మలు నువ్వు నిర్వహించు. 
యోగస్థ కురు కర్మాణి - గీత
అర్థం: యోగస్థితిలో కర్మలు నిర్వహించు  
అటువంటి కర్మ మనసును శుద్ధి చేసి ఆత్మ సాక్షాత్కారానికి సాధకుడిని సిద్ధం చేస్తుంది. 

అకర్మ అంటే బంధాన్ని కలిగించని కర్మ లేక పనులు. ఆకర్మ అంటే యేమీ చేయకుండా ఉండటం కాదు. అకర్మ అంటే అంతరంగంలో కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయడం. అంటే అహంకారం లేకుండా, కోరికలు లేకుండా, ఎటువంటి బంధాల్లేకుండా చేసే పనులు. 
అకర్మ స్థితిలో నీ ద్వారా పనులు జరుగుతాయి. కానీ కర్మను ప్రోగు చేసుకోవడం ఉండదు. అంతరంగంలో నిశ్శబ్దంగా, బంధాలకతీతంగా ఉండగలుగుతాము. 
కర్మాణి అకర్మ యః పశ్యేద్  - గీత 
చేసే కర్మలో కర్మ చేయకుండా ఉండటం చూడగలిగినవాడిని విజ్ఞుడంటారు. 
ఉదాహరణలు: ఒక జ్ఞాని కరుణతో బోధలు చేయడం; కర్మ యోగి నిసస్వార్థంగా పని చేయడం; ఈశ్వరార్పణంగా కర్మలు చేయడం. 

వికర్మ అంటే ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు. అంటే అనైతికమైన పనులు, ఇతరులకు హాని కలిగించే పనులు, స్వార్థపూరితమైన, వినాశనానికి దారి తీసే ప్రవర్తన, శాస్త్ర విరుద్ధంగా ఉండే పనులు. 
దీని పర్యవసానాలు ఇలా ఉంటాయి: నకారాత్మక ప్రభావాలు, మానసిక, ఉద్వేగపరమైన గందరగోళం, ఆధ్యాత్మిక పతనం. 
వికర్మణాః సంశయ కరణి - గీత 
అర్థం: అక్రమంగా చేసే పనులు పతనానికి, గందరగోళానికి దారి తీస్తాయి.
ఉదాహరణలు: స్వార్థం కోసం అసత్యాలు పలకడం, కోపంతో చేసే హింస, మోసం చేయడం, స్వలాభార్జన, హస్తలాఘవం,   కర్తవ్యపాలనను నిర్లక్ష్యం చేయించే అలసత్వం, బద్ధకం, వంటి పనులకు పాల్పడటం. 

మన ఆధ్యాత్మిక ప్రయాణం ఈ విధంగా సాగాలి:
వికర్మ -> కర్మ -> అకర్మ -> జ్ఞానం -> మోక్షం -> సాక్షాత్కారం 

ఒక్క వాక్యంలో చెప్పాలంటే:
కర్మ అంటే మనం చెయ్యవలసిన పని. 
అకర్మ అంటే అహం లేకుండా చేసే పని . 
వికర్మ అంటే మనం చేయకూడని పని. 

15, నవంబర్ 2025, శనివారం

భక్తి

 


భక్తి 

శ్రద్ధ లేని భక్తి, భక్తి కాదు; శ్రద్ధ బీజం అయితే భక్తి పర్యవసానం.

శ్రద్ధ యొక్క అభివ్యక్తీకరణే భక్తి. భక్తి అంటే దైవం పట్ల ప్రేమ, సమర్పణ భావం, నిరంతర స్మరణతో కూడిన అంకితభావం. భక్తి ప్రయత్నిస్తే వచ్చేది కాదు. హృదయ శుద్ధి జరిగినప్పుడు అప్రయత్నంగా కలిగేది భక్తి. భక్తి కేవలం ఉద్వేగపూరితమైనది కాదు, భక్తి భాగ్యవంతునితో ఏడాతెగకుండా ఉండే ప్రేమతో కూడిన లోతైన సంబంధం. 
భగవంతుడు దూరంగా ఎక్కడో లేడు, ఈ హృదయంలోనే ప్రియతముడిగా ఉన్నాడంటూమది భక్తి. భగవంతుని ప్రేమించాలనుకున్నవారికి యేదీ అడ్డు రాదు; భక్తికి యేదీ అడ్డు లేద; విధులు లేవు. ప్రేమించేది హృదయంతో. ప్రేమే దైవం, దైవమే ప్రేమ అంటుంది భక్తి. 
ప్రేమ ఉన్నచోట భయం ఉండదు. 
సమర్పణ ఉన్నచోట అహం ఉండదు. 
భక్తి అహాన్ని కరిగించి ఆత్మను ఆవిష్కరిస్తుంది. 
భక్తి పండితులకు, పామరులకూ అందరికీ సరళమే. అందరికీ అందుబాటులో ఉండేది. 
భక్త్యా మాం అభిజానాతి - శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీత 
భక్తి ద్వారా మాత్రమే నిజంగా నన్ను తెలుసుకోగలుగుతారు. 
"నేను" నుండి "నీవే" వరకూ చేసే ప్రయాణమే భక్తి; చివరికి ఒక్కటే మిగులుతుంది. 
ప్రేమ వేగంగా గమ్యానికి చేరుస్తుంది; బుద్ధి నెమ్మదిగా చేరుస్తుంది; అందుకే భక్తి శ్రేష్ఠం.  
భక్తిలో మహాభావ స్థితి ఎలా ఉంటుందంటే:
అక్కడ అహం పూర్తిగా కరిగిపోతుంది. 
దైవంతో వేరుగా ఉన్న భావన అదృశ్యమవుతుంది. 
బ్రహ్మ పదార్థం శుద్ధ ప్రేమ యొక్క తత్త్వంగా సాక్షాత్కరిస్తుంది. 
(భక్తిని గురించి మరింత లోతైన అవగాహన కోసం దయచేసి నారద భక్తి సూత్రాలు అనే గ్రంథాన్ని అధ్యయనం చేయగలరు.)
నారద భక్తి సూత్రాల ప్రకారం భక్తే పరమ గమ్యం. దైవత్వం పట్ల పరమప్రేమే భక్తి. ఆ ప్రేమ అకారణ ప్రేమ అయి ఉండాలి, బేషరతు ప్రేమ అయి ఉండాలి, ఎడతెగని ప్రేమ అయి ఉండాలి, పరిపూర్ణ ప్రేమ అయి ఉండాలి - అదే పరమ ప్రేమ అంటే. భక్తి స్వభావం అమృతాన్ని పోలి ఉంటుంది. 

నిజమైన భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయి ?
వినమ్రత కలిగి ఉండాలి 
ద్వేషం, కోపం, అసూయ నుండి విముక్తి పొందినవాడై ఉండాలి 
సకల జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి 
అందరిలోనూ దైవాన్ని చూసేవాడై ఉండాలి 
భగవదేచ్ఛకు సంపూర్ణంగా సమరపితుడై ఉండాలి. 

సహజ మార్గం ప్రకారం భక్తి:
భక్తి సహజమైనది.   
భక్తి మౌనంతో కూడినది. నిశ్శబ్దంగా జరిగేది. 
మాస్టర్ మార్గదర్శనంలో కొనసాగేది భక్తి. 
భక్తి ప్రత్యక్షంగా సాధించేది: నిత్యం ధ్యానం ద్వారా, శుద్ధీకరణ ద్వారా, ప్రార్థన ద్వారా, నిరంతర స్మరణ ద్వారా, సేవ ద్వారా. 
భక్తికి పరాకాష్ఠ ఏకత్వమే - భాగ్యవంతునితో ఏకత్వం సాధిచడమే. 

ఒక్క వాక్యంలో చెప్పాలంటే:
హృదయం సాధన ద్వారా శుద్ధి చేయబడి, ప్రాణాహుతి ద్వారా సున్నితపరచబడి, సూక్ష్మీకరించబడి, మాస్టర్ పట్ల శరణాగతి భావంతో ఉండే హృదయం సహజంగా దివ్యత్వం వైపు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాన్నే భక్తి అని అంటారు. 

14, నవంబర్ 2025, శుక్రవారం

శ్రద్ధ

 


శ్రద్ధ 
శ్రద్ధ అంటే సత్య పదార్థంతో నిత్యం అనునాదం కలిగి ఉండటం. 
 
శ్రద్ధ, భక్తి లేకుండా ఆధ్యాత్మిక జీవనం అసాధ్యం. శ్రద్ధ అనే పదం మనం తెలుగు వాడుక భాషలో ఆసక్తి (interest) అనే అర్థంలో సాధారణంగా వాడుతూ ఉంటాం. అంటే మనసు పెట్టి చేయాలని. కానీ ఈ పదానికి సంస్కృత మూలం అయిన శ్రద్ధ అనే పదానికి అర్థం - మనసును లేక హృదయాన్ని సత్యముపై శాశ్వతంగా నిలిపి ఉంచడం. నమ్మకం పరిపక్వమయితే అది విశ్వాసం; విశ్వాసం పరిపక్వమైనప్పుడు అది శ్రద్ధ. 

నమ్మకం -> విశ్వాసం -> శ్రద్ధ 
నమ్మకం సమాచారంపై ఆధారపడినది; ఆలోచనపై ఆధారపడినది; స్థూలమైనది; మార్పుకు లోనుకావచ్చు.  
ఆ విన్న సమాచారం ద్వారా అనుభవంలోకి వచ్చినప్పుడు కలిగేది విశ్వాసం. హృదయానికి సంబంధించినది. విశ్వాసం అంటే పరిపకవమైన నమ్మకం. 
శ్రద్ధ అంటే ఆత్మకు సంబంధించినది; ఆత్మ సత్య పదార్థంతో, యాదార్థంతో అనునాద స్థితిలో ఉండటమే శ్రద్ధ. సంస్కృతంలో  శ్రద్, అంటే హృదయం; ధా, అంటే నిలిపి ఉంచడం, ధరించడం. విశ్వాసం పరికమైనప్పుడు కలిగేది. 

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం - భగవద్గీత 
శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది; జ్ఞానం శ్రద్ధ నివ్వడు. శ్రద్ధ జ్ఞానానికి ద్వారాలు తెరుస్తుంది. 

శ్రద్ధ మూడు రకాలు 
సాత్త్విక శ్రద్ధ; రాజసిక శ్రద్ధ; తామసిక శ్రద్ధ. 
సాత్త్విక శ్రద్ధ స్పష్టతకు, ప్రశాంతతకు, సత్యనిష్ఠకు  దారి తీస్తుంది; రాజసిక శ్రద్ధ విజయాన్ని, ఫలితాలను, ప్రదర్శనను కోరుకునేలా చేస్తుంది. 
తామసిక శ్రద్ధ గ్రుడ్డి నమ్మకానికి, మూఢనమ్మకాలకు, హానికర చేష్టలకు దారి తీస్తుంది. 

సహజ్ మార్గ మాస్టర్ల ప్రకారం: 
గమ్యం దిశగా ముందుకు సాగుతున్నామన్న పరిపూర్ణ విశ్వాసం హృదయ లోలోతుల్లో ఉండటమే శ్రద్ధ. 
ప్రాణాహుతి, ధ్యాన ప్రక్రియాలపై పరిపూర్ణ విశ్వాసం. 
అంతరంగంలో నుండి మార్గదర్శి అయిన హృదయంపై పరిపూర్ణ విశ్వాసం.  
శ్రద్ధ అంటే అసంభవమైనదాన్ని నమ్మగాలగడం - చారీజీ 
ఇక్కడ శ్రద్ధ అంటే మాస్టర్ పై ఆధారపడటం కాదు, మన పద్ధతిపైన, ఆధ్యాత్మిక పరివర్తనం పైన పటిష్ఠమైన విశ్వాసం ఉండటం.  శ్రద్ధ అంటే దివ్యత్వం అంటే సున్నితమైన, సూక్ష్మమైన ఆకర్షణ కలిగి ఉండటం. 

శ్రద్ధను అలవరచుకోవడం ఎలా? 
సత్సాంగత్యం ద్వారా అంటే తోటి సాధకులు/విజ్ఞుల సాంగత్యం ద్వారా, శాస్త్ర/ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనం ద్వారా, నిజాయితీగా జీవించడం ద్వారా, విశాల హృదయంతో ధ్యానించడం ద్వారా, ప్రత్యక్షయనుభవం ద్వారా అంతరంగంలోని మార్పులు గమనించడం ద్వారా శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. 

శ్రద్ధ యొక్క అత్యుకృష్ట స్వరూపం 
పరిపూర్ణ శ్రద్ధ సంభవించినప్పుడు: 
ఎక్కడా ఎటువంటి సందేహమూ ఉండదు ; హృదయం/మనసు స్థిరంగా ఉంటుంది; సాధన అప్రయత్నంగా జరిగిపోతుంది; దైవం అనేది ఇక నమ్మకంగా ఉండదు; సజీవ సాన్నిధ్యంగా మారిపోతుంది. దీన్నే పరమ శ్రద్ధ అని కూడా అంటారు - దివ్యత్వం పట్ల మొక్కవోని విశ్వాసం. 


 

 

10, నవంబర్ 2025, సోమవారం

రాజయోగము



రాజయోగము 

యోగాన్ని గురించిన కొన్ని నిర్వచనాలు: 
యుజ్యతే ఇతి యోగః - అంటే కలిపేది యోగము. 
యోగః చిత్తవృత్తి నిరోధః - చిత్తములోని వృత్తాలు నిరోధించేది యోగము. 
యోగః కర్మశు కౌశలం - కర్మలు చేయడంలో నైపుణ్యమే యోగం. 
యోగస్థః  కురు కర్మాణి - యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయాలి. 

నాలుగు యోగాలు 
ఇటువంటి యోగసిద్ధిని (ఆత్మ పరమాత్మలో లయమవడమే) సాధించడమే, మానవ జీవితం యొక్క అసలు ప్రయోజనం. ఈ యోగసిద్ధిని కర్మ యోగం ద్వారా గాని, జ్ఞాన యోగం ద్వారా గాని, భక్తి యోగం ద్వారా గాని, రాజయోగం ద్వారా గాని  సాధించవచ్చని శాష్టరకారులు, ఋషులు, మహాత్ములు తెలియజేయడం జరిగింది. 

కర్మ యోగం కర్మ ప్రధానమైనది, జ్ఞాన యోగం జ్ఞాన ప్రధానమైనది, భక్తవ యోగం భక్తిప్రధానమైనది. వీటిల్లో కూడా ప్రతీ యోగంలోనూ ఇతర యోగం యొక్క పాళ్ళు కూడా ఉంటాయి. కర్మ యోగి, భాగవాదారపణతో కర్మలను నిర్వహిస్తాడు; జ్ఞాన యోగి జ్ఞానం ద్వారా ఆత్మ-అనాత్మ వివేకంతో యోగా సిద్ధిని సాధిస్తాడు; భక్తి యోగి లేవలం భగవంతుని  పట్ల ప్రేమను వృద్ధి చేసుకుంటూ యోగసిద్ధిని పొందుతాడు. 

వీటిల్లో రాజయోగం (మనోయోగం అని కూడా అంటారు)  యోగాల్లో రాజు వంటిదని, యోగములలో శ్రేష్ఠమైనదని ఆర్యులు చెప్పడం జరిగింది. శరీర వ్యవస్థలో మనస్సు లేక ఆలోచన అనేది రాజు వంటిది కాబట్టి, ఆ మనస్సుతో లేక ఆలోచనాశక్తి ద్వారా సిద్ధించే యోగాన్నే రాజయోగం అని నిర్వచించడం జరిగింది. 

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ పద్ధతి ఒక రాజయోగ ధ్యాన పద్ధతి
హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ అనే రాజయోగ పద్ధతి కర్మ, జ్ఞాన, భక్తి యోగాల సరైన మిశ్రమం. మనిషికి కర్మలొనర్చడం అనివార్యం. సాధకుడు చేసే ప్రతీ కర్మలోనూ, కర్మ, జ్ఞాన, భక్తి అనే ఈ మూడు అంశాలూ ఉంటాయి - యేమి చేయాలన్నది - కర్మ, ఎలా చేయాలన్నది - జ్ఞానం, ఎటువంటి భావంతో చేయయాలన్నది - భక్తి. ఈ మూడు అంశాలూ ఉన్న కర్మ పరిపూర్ణ కర్మ అవుతుంది. సహజ్ మార్గ్ లో ధ్యానం చేయాలన్నది కర్మ, యే విధంగా చేయాలన్నది జ్ఞానం, ఎటువంటి భావంతో చేయాలన్నది భక్తి. ఇది మనసుతో చేసే యోగం కాబట్టి, మనసును క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం కాబట్టి, ఆలోచనను ధ్యాన వస్తువుపై కేంద్రీకరిస్తాం కాబట్టి, దీన్ని రాజయోగ పద్ధతి అని అంటారు.   

6, నవంబర్ 2025, గురువారం

అస్థిత్వానికి సంబంధించిన ప్రశ్నలు

 


అస్థిత్వానికి  సంబంధించిన  ప్రశ్నలు 
Existential Questions

అస్థిత్వం అంటే మన ఉనికికి సంబంధించిన ప్రశ్నలన్నమాట. ప్రతి వ్యక్తిలో, ప్రతి ఆత్మలో సహజ సిద్ధంగా కలిగే ప్రశ్నలు; మనలోని జిజ్ఞాసకు నిదర్శనాలు; మనలో స్వతః సిద్ధంగా ఉండే తపన వల్ల కలిగే ప్రశ్నలు. ప్రతీ వ్యక్తికీ యేదొక దశలో సమాధానాలు దొరికే వరకూ వేధిస్తూ ఉంటాయి. అలాగే మన దృక్పథాన్ని విస్తృతం చేస్తాయి కూడా. చేతనను విస్తృతపరుస్తాయి. అవగాహన పెంచుతాయి. ఈ ప్రశ్నలే మనిషిని ఆధ్యాత్మికతకు దారి తీస్తాయి. ఈ ప్రశ్నలకు విశ్వజనీనంగా అందరూ అంగీకరించగలిగే సమాధానాలేవీ ఉండవు. ఎవరికి వారు తమ సమాధానాలు వారే శోధించి ఆత్మ బోధ ద్వారా తెలుసుకోవలసినదే. శాస్త్రాలు, గురువులు, మహాత్ములు వారి-వారి అనుభవ జ్ఞానం ద్వారా తెలుసుకున్నవి అందించి సహకరించగలరే గాని, నిజమైన సమాధానాలు అంతరంగంలో నుండి రావలసినదే. దీనికి ప్రతీ ఆత్మ స్వీయ మననం ద్వారా తపిస్తూ శ్రమించవలసినదే. దైవాన్వేషణ  లేక సత్యాన్వేషణ అంటే ఇదే. సత్యాన్వేషణలో కలిగే ప్రశ్నలు  ఇవే. ఈ ప్రశ్నలకు సమాధానాలు రానిదే ఆత్మకు నిద్ర పట్టదు. అస్సలు నిద్ర పట్టని ఆత్మలు మహాత్ములవుతారు. సాగటౌ మనిషిలో కూడా ఈ ప్రశ్నలుంటాయి గాని వీటికి ప్రాధాన్యతనివ్వడు. సంసార సాగరంలో పడిపోవడం మూలాన వీటి ప్రాధాన్యత అడుగుకి వెళ్ళిపోతూ ఉంటుంది. గురువు వచ్చి తట్టి లేపే వరకూ ప్రాధాన్యతలోకి రాదు. ఆ విధంగా మేల్కొన్న వ్యక్తి ఆధ్యాత్మిక సాధకుడవుతాడు. జీవిత పరమార్థం ఇదేనని తెలుసుకుంటాడు. 

సాధారణంగా కలిగే కొన్ని ప్రశ్నలు:
జీవితం యొక్క అర్థం ఏమిటి? ప్రయోజనం యేమైనా ఉందా?
మనుషులు కష్టాలెందుకు పడాలి? వాటి ప్రాముఖ్యత ఏమిటి?
మనం ఎందుకు పుట్టాం? ఎందుకు చనిపోతాం? పుట్టుకకు, చనిపోవడానికి మధ్య మనిషి యేమి చెయ్యాలి? లేక చనిపోయే వరకూ బ్రతకవలసిందేనా? యేమైనా ప్రయోజనం ఉందా? చనిపోయిన తరువాత ఏమవుతుంది? మనం ఎక్కడి నుండి వచ్చాం? అసలు 'నేను' అంటే ఎవరు?

ఈ ప్రశ్నలకు పరిష్కారం 
వీటికి ప్రతి మనిషి తర్కపరంగా సమాధానాలు వెతుక్కున్నప్పటికీ, నిజమైన పరిష్కారం అనుభవపరంగా తెలుసుకోవలసినదే; దాన్నే మనం ఆత్మ సాక్షాత్కారం లేక దైవ సాక్షాత్కారం అంటూంటాం.  

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

  కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7 పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్...