5, సెప్టెంబర్ 2024, గురువారం

ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5

 

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 
(1888-1975)

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశ రెండవ రాష్ట్రపతిగా (1962-67) ఉన్న విషయం అందరికీ విదితమే. భారతదేశం గర్వించదగ్గ మహాపండితులు, మహా జ్ఞాని. వారు 1962 లో రాష్ట్రపతిగా పదవిని చేపట్టినప్పుడు వారి శిష్యులు వారి జన్మదినోత్సవాన్ని వైభవంగా జరపాలనుకున్నారు. దానికి వారు, నా జన్మదినోత్సవం చేసే బదులుగా ఈ రోజున ఉపాధ్యాయుల దినోత్సవంగా పరిగణించి ఉపాధ్యాయులను గౌరవించమని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరమూ సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయుల దినోత్సవంగా వారి గౌరవార్థం జరుపుకుంటూ ఉన్నాం. 

మనలో ప్రతి ఒక్కరి జీవితంలో మనలను అనేక రకాలుగా ప్రభావితం చేసి ఉంటారు. సకారాత్మకంగా ప్రభావితం చేసినవాళ్ళూ ఉండవచ్చును, నకారాత్మకంగానూ ప్రభావితం చేసినవాళ్ళు కూడా ఉండి ఉండవచ్చును. మనకు ఈ రెండు రకాల వాళ్ళు జ్ఞాపకం ఉండిపోతారు. ఇరువురి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండవలసినదే. ఒకళ్ళు జీవితంలో ఎలా ఉండాలో మార్గదర్శనం చేస్తే, మరొకరి వద్ద నుండి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం గనుక. 

నా జీవితం మలచడంలో నాకు తెలుగు బోధకులుగా ఉన్న ఉపాధ్యాయులకు ఎంతో ఋణపడి ఉన్నాను. స్కూల్లో శ్రీమతి పద్మజ టీచర్, జూనియర్ కళాశాలలో శ్రీ అక్కిరాజు రామకృష్ణ గారు, డిగ్రీలో డా. అరిపిరాల విశ్వంగారు. అందరూ మహానుభావులే. అలాగే నాలో నాకే తెలియని కళలను వెలికి తీసిన శ్రీమతి విద్యాధరిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతాంజలి. 

ఉపాధ్యాయుడంటే బోధించేవాడు అని అర్థం; విద్యను నేర్పించేవాడు.  నేర్పించాలంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి; అంటే ఎప్పుడూ విద్యార్థిగానే ఉండాలి. కాబట్టి ఎప్పటికీ విద్యార్థిగా ఉండేవాడే సరైన ఉపాధ్యాయుడు. అటువంటివారే విద్యార్థులను సరైన నాగరికులగా, సరైన మానవులుగా, తీర్చి దిద్దగలిగేది.  అటువంటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 

అలాగే విద్యార్థులకు కేవలం సమాచారాన్ని అందించడమే గాక, విషయాలను స్పష్టంగా వివరించగలగడమే గాక, వారిని ఆలోచిమపజేసి, ప్రేరణ కలిగించేవాడు శ్రేష్ఠమైన ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయులు ధన్యులు. ఎందుకంటే అటువంటి ఉపాధ్యాయులు సజీవ ఉదాహరణలుగా నిలుస్తారు. వీళ్ళ వ్యక్తిత్వాలు అనుసరించదగ్గవిగా ఉంటాయి. వీళ్ళ సంఖ్య అపరిమితంగా పెరగాలని మనందరం  ఆకాంక్షించాలి.  




1 కామెంట్‌:

  1. శ్రీ సర్వేపల్లిరాధాకృష్ణన్గారు నేను ప్రత్యక్షంగాచూసినమొదటిరాష్ట్రపతి. హైస్కూలురోజుల్లోప్రత్యేకరైలులో ఉలిందకొండఅనే చిన్నగ్రామంలో రైలుఆపి రక్షణహడావిడిలేకుండాఅద్దం వెనుక ఆయన నాకిప్పటికీ గుర్తే.

    రిప్లయితొలగించండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...