11, సెప్టెంబర్ 2024, బుధవారం

ఆచార్య వినోబా భావే



ఆచార్య వినోబా భావే 
(1895-1982)
ఈ రోజు భారత రత్న ఆచార్య వినోబా భావే జన్మదినోత్సవం. ఆయన సెప్టెంబర్ 11, 1895 న ఒక బ్రాహ్మణ కుటుంబంలో, మహారాష్ట్రలో  జన్మించారు. వీరి అసలు పేరు వినాయక నరహరి. డబ్బు సంపాదించడం కోసం ఆయనకు చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. అందుకే వారు బనారస్ వెళ్ళి, సంస్కృతంలో పట్టు సాధించి, మన శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం జరిగింది. అలాగే కొరాన్ అధ్యయనం చేయడం కోసం వారు అరబిక్ నేర్చుకొని మూలాన్ని చదివి పట్టు సంపాదించారు. అలాగే బైబిల్ చదువుకున్నారు. 
 
వీరు సంఘ-సంస్కర్తగానూ, స్వాతంత్ర్య  సమర యోధుడుగానూ,  ఆధ్యాత్మిక ఆచార్యులుగానూ భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా  ప్రసిద్ధి పొందినవారు. వీరు మానవ హక్కుల కోసం, పోరాడిన వ్యక్తి; అహింసను ఆయుధంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. 

అంతే కాదు, ఆచార్య వినోబా భావే అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వాతంత్ర్యం సాధించిన తరువాత, 1951 లో  వారు నేతృత్వం వహించిన భూదాన్ ఉద్యమం. ఈ ఉద్యమ లక్ష్యం భూమి సేకరణ - భూమి ఎక్కువగా ఉన్నవారు, భూమి లేని వారికి భూదానం చేయడం. దీని కోసం వారు కొన్ని వేల కిలోమీటర్లు నడవడం జరిగింది.  మనకు ప్రత్యేకంగా విశేషం ఏమిటంటే, ఈ ఉద్యమాన్ని, తెలంగాణాలోని హైదరాబాదు శివార్లలో ఉన్న పోచంపల్లి గ్రామం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ ఊరును భూదాన్  పోచంపల్లి అని కూడా అంటారు. 

1940 లో మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహం చేసినవారు వీరే; ఆ తరువాతే నెహ్రూగారు చేయడం జరిగింది. ఈ పోరాటంలో 7 సార్లు ఖైదులో ఉన్నారు. 1958 లో వారు రేమన్ మ్యాగ్సాసే పురస్కారం, మరణానంతరం 1983 లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందించడం జరిగింది. 
1932 లో, మహారాష్ట్రలోని ధూలే అనే ప్రదేశంలో, ఆరు నెలలు ఖైదీగా ఉండవలసి వచ్చినప్పుడు, ఆశువుగా భగవద్గీత మీద, 700 శ్లోకాలపై మరాఠీలో ఇతర ఖైదీలనుద్దేశించి అనర్గళంగా అద్భుతంగా, సమాధి స్థితిలో ఉంటూ ప్రవచనాలివ్వడం జరిగింది.  అవే Talks on the Gita అనే పేరుతో ఆంగ్లంలో ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథం అన్ని  భారతీయ భాషలలోనూ, అనేక విదేశీ భాషలలో కూడా ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథాన్ని భారతీయ సంపదగా భావిస్తారు. 

ఈ గ్రంథాన్ని గురుదేవులు పూజ్య దాజీ  2019 లో మన సంస్థ ప్రచురణగా విడుదల చేయడం జరిగింది. దాజీ ఈ గ్రంథాన్ని గురించి ముందుమాటలో, ఈ గ్రంథాన్ని గురించి వినోబా భావే స్వయంగా పలికిన మాటలను  సంస్మరించుకున్నారు: "నేను గీతను గురించి వ్రాసిన వ్యాసాలు గాని, ప్రవచనాలు గాని జైల్లో గాక మరెక్కడైనా అయితే అంతా అద్భుత ప్రభావం కలిగి ఉండేవి కావేమో; ఈ ఖైదు మా స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఒక యుద్ధ క్షేత్రం అవడం వల్ల ఇంతటి  ప్రభావం కలిగి ఉన్నాయనిపిస్తుంది."

ప్రతి ఒక్కరూ ఈ అద్భుత గ్రంథాన్ని, చక్కటి కథలా చెప్పిన ఈ 18 ప్రసంగాలను ఆస్వాదించి భగవద్గీత యొక్క గొప్ప ప్రయోజనాన్ని సిద్ధించుకొందురుగాక. 


 

1 కామెంట్‌:

  1. దాజీగారు ప్రచురించిన తర్వాతే 30ఏళ్ళుగా నా దగ్గర వున్న ఈపుస్తకం చదివినాను. గీతపై ప్రత్యేకమైన పంధా వీరి వుపన్యాసాలలో నాకు కనిపించింది.

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...