పూజ్య దాజీ గౌరవ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని గౌరవించుట
ఇద్దరు మహాదిగ్గజాల ఆత్మీయ సంభాషణ
గద్గద స్వరంతో స్వాగటిస్తున్న సోదరి దర్శ్విందర్
కాన్హా శాంతి వనంలో ఇద్దరు మహాదిగ్గజాల కలయిక
(ఆదివారం, నవంబర్ 26, 2023)
ఎన్నో రోజుల నుండి నిరీక్షిస్తున్న ఘడియ రానే వచ్చింది - భారత ప్రధాన మంత్రి కాన్హా శాంతి వనానికి ఆయన రాక. ఆదివారం, నవంబర్ 26, 2023 న ఉదయం సుమారు 10:30 గంటలకు కాన్హా శాంతి వనం, హార్ట్ఫుల్నెస్ ప్రధాన కార్యాలయానికి వారు విచ్చేయడం, పూజ్య దాజీ వారికి ఆతిథ్యం ఇవ్వడంలో భాగంగా, ఆశ్రమం అంతటా ఒక చిన్న పర్యటన చేయించడం అన్నీ జరిగాయి.
దైవప్రణాళికకు, గురుపరంపరకు, అనుగుణంగా వ్యవహరిస్తూ, మానవాళికి నేతృత్వం వహిస్తున్న భూమ్మీద ఉన్న ఈ ఇద్దరు మహాదిగ్గజాలు - పూజ్య దాజీ, గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వేదిక మీద కలిసి ప్రవేశిస్తున్నప్పుడు, ఆ అద్భుత దృశ్యాన్ని చూసి, అక్కడున్న అభ్యాసులందరూ పులకరించిపోయారు, పరవశించిపోయారు. ఆనంద భాష్పాలు చాలామంది కళ్ళల్లో గమనించడం జరిగింది. సంధానకర్తగా అద్భుతంగా వ్యవహరించిన మన ప్రిసెప్టర్ సోదరి దర్శ్విందర్ కూడా అనిర్వచనీయమైన ఆనందంతో, కళ్ళల్లో నుండి వస్తున్న నీరు కనిపించకుండా గద్గద స్వరంతో మన ప్రధానికి హృదయపూర్వక స్వాగతం పలికింది. ఆమె పలికిన పలుకులు కూడా ఆ వాతావరణానికి తగినట్లుగా మనసుకు హాయి కలిగించే విధంగా ఉన్నాయి. ప్రధానిని కీర్తిస్తూనే బాహ్య స్వచ్ఛతతోపాటు అంతరంగ స్వచ్ఛత కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కదా అని హార్ట్ఫుల్నెస్ అందించే సేవలను ప్రధానికి తెలియజేసింది.
ఆ తరువాత పూజ్య దాజీ, గౌరవనీయ ప్రధానికి హార్దిక స్వాగతం పలుకుతూ వారిని గురించి తన మనసులో పెల్లుబుకుతున్న లోతైన భావాలను తన ప్రసంగంలో పంచుకోవడం జరిగింది. దాదాపు 1978, ఆ ప్రాంతంలో నేనింకా సంస్థలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, ఈ దేశాన్ని, ఈ భూమిని కూడా శాసించగలిగే ఒక గొప్ప రాజకీయ నాయకుడు గుజరాత్ లో పెరుగుతున్నాడని, పూజ్య బాబూజీ ఆ రోజుల్లో అన్నారని పెద్దలు చెప్పుకుంటూ ఉండటం నేను వినేవాడిని. దూరదృష్టితో పలికిన ఆ బాబూజీ మహారాజ్ గారి ఇంటికే ఇప్పుడు ఆ మహానుభావుడు విచ్చేయడం సంతోషకరం అన్నారు. వచ్చినందుకు కృతజ్ఞతను తెలిపారు. అంతేగాక, ప్రసంగ ప్రారంభంలో, మన సంస్థలో సాధారణంగా మనం ఆరా (మనిషి చుట్టూ ఆవరించియున్న కాంతిని) గురించి మాట్లాడం; కేవలం దానికి సాక్షిగా ఉంటాం అన్నారు. కానీ మన మధ్యలో ఉన్న ఈ మహానుభావుడి ఆరా ప్రభావం నన్ను మాట్లాడేలా చేసిందన్నారు. ప్రధానిని కీర్తిస్తూ, వారు పార్లమెంటులో మాట్లాడుతున్నప్పుడు కూడా వారి మనసులో నకారాత్మకత ఉండదని, ఆనందంగా మాట్లాడతారని, నవ్వించే విధంగా హాయిగా మాట్లాడతారని, నిస్స్వార్థంగా మానవాళికి సేవాలనందించేవారి ఆరా అలాగే ఉంటుందని దానికి నేను కూడా వశుడినైపోయాను అన్నట్లుగా దాజీ చెప్పడం జరిగింది. మన ప్రధాని కేవలం మన దేశానికే గాక, మొత్తం ప్రపంచానికే ఒక గొప్ప నాయకులవ్వాలని మనందరమూ ఆ పరమాత్మను ప్రార్థించాలి అని కోరడం జరిగింది.
ఆ తరువాత అందరూ ప్రధాని సందేశం కోసం నిరీక్షిస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఎప్పటి నుండో వద్దామనుకున్నా పైవాడి నుండి అనుజ్ఞ వచ్చినప్పుడే సమయం వస్తుందన్నారు. అదిప్పుడు మీ మధ్య ఉండి, ఇప్పటి వరకూ వింటున్న కాన్హా శాంతి వనాన్ని దగ్గర నుండి వీక్షించే సౌభాగ్యం కలిగిందన్నారు. అందరినీ ఇక్కడకు పంపిస్తాడు కానీ, ఈయన మాత్రం రాడు అంటూ దాజీకి నా మీద అభియోగం కూడా ఉందని నవ్వించారు. పూజ్య దాజీ వినమ్రత కట్టివేసే విధంగా ఉందని కొనియాడారు. వారు నిర్వహిస్తున్న కార్యం నిజంగా అద్భుతం అని అభివర్ణించారు. కాన్హా శాంతివనం పర్యటనలో పూజ్య దాజీ అంత సూక్ష్మంగా వివరిస్తూ ఉంటే ఆయన (దాజీ) ఇక్కడ ప్రతీ కణంలో ఆవరించి ఉన్నారనిపించిందన్నారు. లక్షమంది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరంలో కలిసి ధ్యానించినప్పుడు ఉద్భవించే శక్తి ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించవచ్చన్నారు. మన ఋషుల, మహాత్ముల నుండి వారసత్వంగా లభించినటువంటి సుసంపన్నమైన మన ఆధ్యాత్మిక సంపదను మరింతగా పెంపొందిస్తూ విశ్వ గురువుగా , విశ్వ మిత్ర గా భారతదేశాన్ని మార్చడంలో మనందరి బాధ్యత చాలా ప్రముఖమైనదని గుర్తు చేశారు. ప్రస్తుతానికి కేవలం కాన్హా శాంతి వనం యొక్క రుచి మాత్రమే చూశానని, మరలా తీరుబడిగా తప్పక రావాలని తన సంకల్పాన్ని వెలిబుచ్చారు. ఆ విధంగా మన ప్రధాని తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది.
వారు ప్రసంగ సమయంలో ఉటంకించిన ఒక భర్తృహరి సుభాషితం, ఈ సంస్కృత శ్లోకం ఇలా ఉంది :
పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।
పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥
వృక్షాలు ఫలాలనిచ్చేది పరోపకారం కోసమే, ఇతరుల కోసమే; నదులు ప్రవహించేది పరోపకారం కోసమే; గోవులు పాలిచ్చేది ఇతరుల కోసమే; అలాగే ఈ మానవ శరీరం కూడా పరోపకారం కోసమే ఉన్నది, అని ఈ శ్లోకం యొక్క అర్థం.
మన ప్రిసెప్టర్ సోదరి దర్శ్విందర్ స్వాగతం పలుకుతున్నప్పుడు, పూజ్య దాజీ ప్రసంగిస్తున్నప్పుడు, ఆ తరువాత ప్రధాని మాట్లాడుతున్నప్పుడు మన అభ్యాసులు సమయోచితంగా తమ కరతాళ ధ్వనులతో ధ్యాన మందిరం మార్మ్రోగించారు . అక్కడి సూక్ష్మ ఆధ్యాత్మిక వాతావరణం కేవలం అక్కడకు వచ్చివారు మాత్రమే అనుభవించగలిగి ఉంటారు. ఆ తరువాత ప్రధాని పూజ్య దాజీ ఇంటికి విచ్చేసి, వారి ఆతిథ్యం స్వీకరించి తన కార్యనిర్వహణను కొనసాగించే క్రమంలో, కాన్హా అనుభూతిని తమ మనసులో చెరగని ముద్రగా తీసుకుని వెళ్ళి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం.
నవంబర్ 26, 2023 మన సంస్థ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుంది.
సోదరులు కృష్ణారావు గారు చెప్పవలసిందంతా చాలా చక్కగా వర్ణించారు. అయితే ఎదో చెప్పడానికి ఇంకా సంకోచిన్చినట్లుగా ఉంది. ఇరువురూ మానవ జాతి కోసం తపించే వారే కావటం, ఇప్పుడు ఈ భూమి మీద ఈ కష్టక్కలం లో ఒకపక్క యుద్ధ వాతావరనం, ప్రకృతి వైపరీత్యాలతో మన మనుగడ కే ముప్పు వాట్ల్లె సమయంలో ఇటువంటి నాయకులు మనలను ముందుకు తీసుకువెళ్ళడం మనకు ఎంతో అవసరం కదా ! నేను అక్కడకు అంటే కన్హ వేల్లలేకపయినప్పటికీ ఆ వాతావరన్నాన్ని అంతటినీ ఆస్వాదించాను అంటే పరమపూజ్య దాజీ సాంకేతికత వినియోగిస్తూ అక్కడి సూక్ష్మ తరంగాలను అందుకోగలిగిన అందరికీ అందించారంటే అమోఘం. ఇంతకన్నా ఏమి చెప్పనూ !
రిప్లయితొలగించండి