31, జనవరి 2026, శనివారం

పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం - 4

 
పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం-4 

మన వంతుగా చేయవలసిన కృషి 

పూజ్య గురుదేవుల సందేశాల నుండి ఏడు మాసాలలోనే సంపూర్ణ యాత్ర పూర్తి చేయడానికి పూజ్య దాజీ సూచించిన మార్గదర్శక సూత్రాలు :

1) ప్రతి మనిషిలోనూ ఉన్న పసిహృదయాన్ని నిలుపుకునే ప్రయత్నం 

2) నిర్దేశించిన విధంగా సంపూర్ణ అభ్యాసాన్ని అనుసరించడం - ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం, నిరంతర స్మరణను అభ్యాసం చేయడం అనగా ఎ. ఇ. ఐ. ఒ. యు. పద్ధతిని అభ్యసించడం, అంటే ధ్యానం తరువాత కలిగిన ఆధ్యాత్మిక స్థితిని  గుర్తించడం, ఆస్వాదించడం, రోజంతా నిలుపుకునే ప్రయత్నంలో ఉండటం. 

3) తీవ్ర అభ్యాసం (ఇంటెన్స్ అభ్యాస్) చేయడం అంటే ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా సాధన చేయడం. రోజు-రోజుకీ మరింత మరింత సూక్ష్మమైన భావనతో, మరింత మెరుగైన లోతైన, అవగాహనతో (అంటే మిషన్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం) సాధన చేయడం.  

4) సహజమార్గ సిద్ధాంతాలను అనుసరించడం. అంటే బాబూజీ దశ నియమాలు, చారీజీ జోడించిన 2 నియమాలు మన దైనందిక జీవన విధానంగా మారిపోయేలా జీవించే ప్రయత్నంలో నిమగ్నమవడం. 


15, జనవరి 2026, గురువారం

పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం - 3

 

పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల    మననం - 3 - పసిహృదయం 


ప్రభువు యేసు క్రీస్తు అన్న మాటలు ఈ సమరభంగా గుర్తు చేసుకోదగ్గవి - "పసి పిల్లల్లా ఉండండి" అన్నారు. పసి హృదయం స్థితి ఎలా ఉంటుందంటే ఎటువంటి కల్మషమూ ఉండదు, పసితనం, అమాయకత్వమే పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది; స్వచ్ఛత కనిపిస్తుంది; పగ, ప్రతీకారాలు, ద్వేషాలు ఉండవు; మనసులో గతంలో జరిగినవేవీ, యే విషయాలూ ఉంచుకోరు; పసిపిల్లలకి అహంకార భారం ఉండదు; కాబట్టి "నాకు తెలుసు" అన్న స్థితి అస్సలుండదు; అటువంటి వైఖరుల వల్ల, భావాల వల్ల నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది; చైతన్య వికాసం కుంటుపడుతుంది; సరళంగా, విషయాల భావాలతో తెరచిన మనసు కలిగి అందుకునే స్థితిలో ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది సహజంగా జరిగిపోతుంది. 

7, జనవరి 2026, బుధవారం

పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం - 2

 

పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల    మననం - 2

సందేశాలలోనే నిక్షిప్తమైన సమాధానాలు: మొదటి సందేశంలో 2026 సంవత్సరం అంతా పసిహృదయం నిలుపుకుంటూ జీవించడం ఎలాగో  విపులంగా తెలియజేయడం జరిగింది. క్లుప్తంగా ఇచ్చిన రెండవ సందేశంలో సుస్పష్టంగా చేయవలసిన అంశాలను తెలియజేశారు: 1) సహజ్ మార్గ్  సిద్ధాంతాలను అనుసరించడం 2) సహజ్ మార్గ్  అభ్యాసాన్ని - ధ్యాన, శుద్ధీకరణ, ప్రార్థనాదులను సంపూర్ణంగా అభ్యాసం చేయడం 3)  ఆధ్యాత్మిక యాత్రను సంపూర్ణంగా ఏడు మాసాలలో పూర్తి చేయడం. 

వీటన్నిటినీ మాస్టర్లు కోరరు కానీ, సహజ్ మార్గ్ పథం, పద్ధతి కోరుతున్నది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మన చేతనాన్ని పరిశుద్ధీకరించే అంశాలు కావున, మన చేతన వీటి సారంగా మారవలసిన అవసరం ఉంది. అంటే సాధన చేసేటప్పుడు ఉండే భావాలు, భక్తి వైఖరులు  రోజు- రోజుకీ మరింత-మరింత సూక్ష్మంగా మారాలి. సూక్ష్మంగా మారాలీ అంటే వీటి యొక్క స్పష్టమైన అవగాహన సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి. అవగాహన మరింత-మరింత స్పష్టంగా అవుతున్న కొద్దీ ఆత్మవికాశం, ఆత్మ సహుదధీ అంతా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. స్పష్టమైన అవగాహన లేకపోతే సక్రమంగా సాధన ఎలా చేస్తారు? అని అంటూండేవారు పూజ్య చారీజీ. కాబట్టి మనందరమూ ఆ ప్రయత్నంలో ఉందాం. 

పైవన్నీ పూర్తి చేసిన సజీవ ఉదాహరణ ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఆయన సాక్షాత్తు, మన కళ్ళెదురుగా ఉన్న మన సజీవ మాస్టరే - పూజ్య దాజీయే. వాయి అనుగ్రహం ఉండనే ఉంది. వారు చెప్తున్నది, బహుశా మనలో లేనిదీ మన ప్రయత్నమే. ఆ ప్రయత్నాన్ని లేక ప్రయత్న లోపాలను సరిదిద్దే మార్గాలే మనకు వారు సూచించడం జరిగింది. ఆ విధంగా మనం సాధనలో మునిగిపోవడం, సాధన తీక్షణంగా అవడం అని వారు సూచించినవి యదార్థమవుతాయి. నిజాయితీగా ప్రయత్నిద్దాం. 

(సశేషం ..)

6, జనవరి 2026, మంగళవారం

పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం - 1

 


పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల 
మననం -1 

పూజ్య దాజీ ఇటీవల అందించిన రెండు నూతన సంవత్సర సందేశాల మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

నూతన సంవత్సరానికి 2-3 రోజుల ముందే ఒక సందేశాన్నివ్వడం జరిగింది. అందులో ప్రతీ మనిషిలో ఉండే పసిహృదయాన్ని నిలుపుకునే పనిలో ఈ సంవత్సరం అంతా నిమగ్నమై ఉండమన్నారు. ఆ సందేశంలో అది ఎలా సాధన చేయాలో కూడా విపులంగా వివరించడం జరిగింది. 

 జనవరి 1 వ తేదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ క్లుప్తమైన ప్రసంగం చేస్తూ - సాధనలో తీక్షణంగా చేయమని, అభ్యాసంలో మునిగిపొమ్మని, ఏడు నెలలలోనే సంపూర్ణ యాత్ర, సంపూర్ణ సాధన ద్వారా పూర్తి చేయమని, దీనికి ఏడు మాసాలలో పూర్తి చేయవచ్చని, సంవత్సరకాలం ఎక్కువని, అఅబూజీ అంటూండేవారని మనందరికీ అత్యున్నత శ్రేయస్సు కలగాలని ఆశీర్వదించడం జరిగింది; ఆదేశించడం కూడా జరిగింది. 

ఇది విన్న వెంటనే నా గుండెల్లో విపరీతమైన కలవరం మొదలయ్యింది. ఏమిటి దాజీకి మనపై అంత విశ్వాసం?  ఇది నిజంగా సాధ్యమేనా? ఈ సంవత్సరాంతంలో అత్యధిక మోక్షం పొందిన వ్యక్తులను, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులను చూడబోతున్నామా? అలా ఆదేశించడం ద్వారా రానున్న సంవత్సరంలో కానీ, ఏడు నెలల్లో గాని మన నుండి ఎటువంటి ప్రయత్నం ఉండాలని ఆశిస్తున్నారు? వారి అనుగ్రహం ఈ విషయంలో నిస్సందేహంగా ఉంది, కేవలం మన ప్రయత్నం లోనే కొరత ఉన్నదా?  ఈ కొరతను యే విధంగా పూరించాలి? ఇలా పలు రకాల ప్రశ్నలు ఆ క్షణం నుండి నాలో కలుగుతూనే ఉన్నాయి.  బహుశా చాలా మందికి కలుగుతూ ఉండవచ్చు. 

ఇప్పటికే ఈ సంవత్సరంలో 6 రోజులు గడిచిపోయాయి, ఇన్ని రోజులూ లేక ఇన్ని సంవత్సరాలూ చేస్తున్న సాధన కంటే భిన్నంగా, మరింత ప్రభావపూరితంగా, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభ్యాసాన్ని ఎలా కొనసాగించాలి? అయితే ప్రశ్నలోనే సమాధానం నిక్షిప్తమై ఉంటుందంటారు పెద్దలు. ఆ దిశలో ఆలోచిస్తూ దాజీ ఇచ్చిన సందేశాలను మరలా-మరలా చదివినప్పుడు కొన్ని ఆలోచనలు స్ఫురించడం జరిగింది. బహుశా ఈ సంవత్సరం అంతా కూడా స్ఫురిస్తూనే ఉంటాయేమో కూడా. వాటిని ఇక్కడ (ఈ శీర్షికన) ఆలోచనలు వస్తున్నంత వరకూ పంచుకునే ప్రయత్నం చేసే సాహసం చేస్తున్నాను. 
(సశేషం .... ) 

5, జనవరి 2026, సోమవారం

ఏడు మాసాలలో సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయండి - పూజ్య దాజీ పిలుపు


ఇక్కడ క్లిక్ చెయ్యండి 👇


ఏడు మాసాలలో సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్రను  పూర్తి చేయండి - పూజ్య దాజీ పిలుపు 
మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు ముందే నూతన సంవత్సర సందేశాన్ని పంచుకోవడం జరిగింది. అయినా వ్యక్తిగతంగా మీ అందరికీ ఈ నూతన సంవత్సరం మంగళకరంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
మానందరమూ ఈ 2026 లో మన యాత్రను సంపూర్ణంగా పూర్తి చేయడానికి కృషి చేద్దాం. అభ్యాసంలో పూర్తిగా మునిగిపోండి. మీ సాధనను తీవ్రతరం చేసుకోండి. అప్పుడు చూడండి ఫలితాలు ఎలా ఉంటాయో. ఈ యాత్ర కేవలం ఏడు మాసాల్లోనే పూర్తి చేయవచ్చుననేవారు. ఒక సంవత్సరం మరీ ఎక్కువ. సహజ మార్గ సిద్ధాంతాళం అనుసరించండి; మీ జీవన శైలిని మార్చుకోండి; సహజమార్గం కోరుతున్నది; సహజమార్గ పథం కోరుతున్నది; మాస్టర్లు ఎప్పుడూ కోరరు. సహజమార్గ సూత్రాలను అనుసరించడం అనేది ఈ పాఠ్యం యొక్క అవసరం. 
కాబట్టి ఈ సంవత్సరం నిజంగా ఆత్మావిష్కరణ  సంవత్సరంగా, ఆత్మసాక్షాత్కార సంవత్సరంగా పరిణమించుగాక. తథాస్తు!  
ధన్యవాదాలు

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

  కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7 పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్...