30, సెప్టెంబర్ 2025, మంగళవారం

పూజ్య దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025

 


పూజ్య దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025


అహమ్మదాబాద్ సోదరులు శ్రీ రాజగోపాలన్  గారు. వీరి వద్ద తక్కిన రెండు పరిచేయాత్మక ధ్యాన సిట్టింగులు పూర్తి చేసి ధ్యానం ప్రారంభించడం జరిగింది. విశేషం ఏమిటంటే అప్పటి నుండి ఇప్పటిదాకా వారు తన సాధన విడువకుండా కొనసాగించడం. ఎంత తీరిక లేకుండా ఉన్నా ఎక్కడున్నా, ఒక ప్రక్క వ్యాపారం  చేస్తూ, మరో ప్రక్క సంసార బాధ్యతలను వహిస్తూ కూడా తన సాధనా క్రమం ఎక్కడా తప్పకుండా కొనసాగించేవారట. ఇది గాక, వారికి పుస్తకాలు విపరీతంగా చారివేవారట; అన్నీ రకాల సాహిత్యం ముఖ్యంగా స్వీయ వికాస గ్రంథాలు, ఆధ్యాత్మిక సాహిత్యము, బాగా చదివేవారట. ప్రస్తుతం ఎన్నో గ్రంథాలు రచిస్తున్నారు. 
 1977 లో, షాజహాన్పూర్ (ఉ. ప్ర.) వాస్తవ్యులయిన, తన గురుదేవులైన పూజ్య బాబూజీతో మొట్టమొదటి కలయిక సంభవిస్తుంది.  ఆ మొట్టమొదటి దర్శనంలో ముఖాముఖీ సంభాషణ ఏమీ జరుగకపోయినా, ఇరువురి మధ్య మౌన సంభాషణ బాగా జరిగిందంటారు దాజీ అంతేగాక దాజీ ఇంటికి వెడుతూ బాబూజీని దర్శించి నమస్కారం పెట్టి వెడుతూండగా, "ఆకురాడిని ఫలానా మందు, వెన్నతో గ్రహించమని చెప్పు" అని బాబూజీ సహాచార్యుని ద్వారా సందేశం పంపిస్తారు.  పూజ్య దాజీ ఆశ్చర్యపోతారు, తనకు ఆ ఆరోగ్య సమస్య ఉందని ఆయనకెలా తెలిసిందని నివ్వెరపోతారు. ఆ విధంగా దాజీకి పూజ్య బాబూజీ ప్రథమ దర్శనం జరుగుతుంది.  
ఆ తరువాత యథాతథంగా తన అభ్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా వెళ్ళి అక్కడ తన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. న్యూ యార్క్ నగరంలో ఆయన వ్యాపారం విస్తరిస్తుంది. అయినప్పటికీ తన సాధనలో ఎక్కడా క్రమం తప్పలేదు. ఆరి ఆధ్యాత్మిక తృష్ణ తన లక్ష్యసాధన కోసం అంత లోతుగా ఉండేది. అలా పూజ్య దాజీ వ్యక్తిత్వం తూర్పు దేశాల హృదయం, పాశ్చాత్య దేశాల మేధస్సుల అద్భుత మిశ్రమంగా ఉండేది. 
(సశేషం ... )


26, సెప్టెంబర్ 2025, శుక్రవారం

పూజ్య గురుదేవులు దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025


 Irresistible Craving

(☝పైన లింక్ క్లిక్ చేయండి, దాజీ పై చిన్న వీడియో వీక్షించండి)

పూజ్య దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025 

ఈ సెప్టెంబర్ 28న పూజ్య గురుదేవులు దాజీ 70 వ జన్మదినోత్సవం, కాన్హా శాంతి వనంలో మనందరమూ జరుపుకోబోతున్నాం.   

ఈ మహాత్ముడు గుజరాత్ రాష్ట్రంలో 1956 వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. వీరిలో మొదటి నుండి, భగవంతుని కోసం నిరోధించలేని ప్రబలమైన తపన కలిగి ఉండేవారు. కొంచెం ఊహ వచ్చిన తరువాత శ్రీరామకృష్ణ కథామృతం అనే గ్రంథాన్ని చదువుతూ తన్మయత్వం చెందుతూండేవారు. కంటి నుండి అశ్రువులు కారుతూ ఉండేవి. స్వామి వివేకానందలా తయారవ్వాలన్న తీవ్ర ఆకాంక్ష ఉండేదట. సన్న్యాసిగా  మారదామని ఇంట్లో నుండి బయల్దేరారట కూడా. హిమాలయాలలో తపస్సు చేసినటువంటి ఒక 80 యేళ్ళ సాధువు సలహాతో ప్రభావితమై ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత తనకు తోచినట్లుగా మార్గదర్శనం లేకుండా ధ్యానం చేస్తూండటం చూసి, ఒక స్నేహితుడు, ధ్యానం పద్ధతిగా నేర్చుకునేందుకు సహజమార్గ ప్రశిక్షకురాలైన శ్రీమతి ద్రౌపదీ బెహన్ గారి వద్దకు తీసుకువెడతాడు. ఆమె "ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నావు?" అని అడుగుతారు. దానికి దాజీ "నేను స్వామి వివేకానందలా తయారవ్వాలనుకుంటున్నాను" అని జవాబిచ్చారట. "దానికి సన్న్యాసి గా తయారవ్వాల్సిన అవసరం లేదు. మగ, ఆడ అని ఇద్దరినీ సృష్టించడానికి భాగ్యవంతుడేమీ మూర్ఖుడు కాదు" అని అంటారామె. ఈ వాక్యం దాజీని బాగా ప్రభావితం చేస్తుంది. ఆ తరువాత ఆమె ద్వారా మొదటి ధ్యాన సిట్టింగ్ తీసుకుంటారు. దాజీకి ఆ ధ్యానంలో శ్రీరామకృష్ణ పరమహంస, బంగారు ఛాయలో ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ధ్యాన సిట్టింగ్ నిర్వహించిన ద్రౌపదీ బెహన్ గారికి కంటి నుండి అశ్రువులు ధారలుగా రావడం ప్రారంభించాయట. ఆమె పరవశించి, ఆశ్చర్యానికి గురై, "నీకు మిగిలిన రెండు సిట్టింగులు అహమ్మదాబాదులో అనుభవుజ్ఞులైన ప్రశిక్షకులు ఒకాయన ఉన్నారు; ఆయన వద్దకు వెళ్ళు" అని పంపించారట. ఆ విధంగా వారికి సహజ మార్గంలో 1976 లో ప్రవేశించడం జరిగింది. ఆ సమయంలో వారు ఫార్మసీ చదువుతున్నారట. వారితోపాటు నెమ్మది-నెమ్మదిగా వారి తోటి విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఈ ధ్యానాన్ని ప్రారంభించి నిత్యం సాధన కూడా క్రమం తప్పకుండా చేస్తూండేవారట.  

సశేషం ...  

16, సెప్టెంబర్ 2025, మంగళవారం

జిజ్ఞాస - తపన

 


జిజ్ఞాస - తపన 
*
जिज्ञासा ज्ञानहेतुः स्यात् मोक्षमार्गप्रवर्तिका ।

జిజ్ఞాస జ్ఞానహేతు: స్యాత్  మోక్షమార్గప్రవర్తికా |

(అర్థం: జ్ఞానానికి కారణం జిజ్ఞాస. సాధకుడిని మోక్షమార్గంలో స్థిరపరచేది ఈ జిజ్ఞాస.)
*
జిజ్ఞాస అంటే తెలుసుకోవడం కోసం తపించడం; జ్ఞానం కోసం పరితపించడం.  ఈ జిజ్ఞాస దేనికోసమైనా కావచ్చు. జిజ్ఞాస ప్రధానంగా రెండు రకాలు - లౌకిక జిజ్ఞాస, ఆధ్యాత్మిక జిజ్ఞాస. 
లౌకిక విషయాల కోసం తపించడం లౌకిక జిజ్ఞాస అవుతుంది. పరమసత్యాన్ని తెలుసుకోవాలన్న తపనను ఆధ్యాత్మిక జిజ్ఞాస అంటారు. దీన్నే బ్రహ్మ జిజ్ఞాస అని కూడా అంటారు, నామరూపగుణరహితమైన పరమసత్యాన్ని తెలుసుకోవడం కోసం పరితపించడం.  
మనం ప్రస్తుతం చర్చించుకుంటున్నది ఆధ్యాత్మిక జిజ్ఞాసను గురించి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అనికూడా అంటాం. మనిషి తనను గురించి, తన చుట్టూ ఉన్న సృష్టిని గురించి, సృష్టికి మూల కారణమైనదాన్ని గురించి, స్వతః సిద్ధంగా తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటాడు. మనిషి మనుగడకు, తన ఆధ్యాత్మిక పరిణతికి ఈ తపనే ఇంధనంలా పని చేస్తూ ఉంటుంది. ఇది ఆత్మలో స్వతఃసిద్ధంగా ఉంది. తప్పించుకోలేనిది. ఈ తపన యొక్క గమ్యం ఆ పరమసత్యాన్ని కనుగొనడమే, ఆ జ్ఞానానుభూతి కలగడమే; అప్పుడే ఆత్మకు సంతుష్టి కలిగేది. ఈ ఆధ్యాత్మిక ఆకలి ఎంత తీవ్రంగా ఉంటే, గమ్యం అంత చేరువవుతుంది. 
బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన లక్షణాలు - 1)వివేకం, 2)వైరాగ్యం, 3)షట్ సంపత్తి (శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధాన) అనే 6 లక్షణాలు, ముముక్షుత్వం (మోక్షం కోసం తీవ్ర తపన). ఇవేవీ లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక యాత్ర, నిజమైన జిజ్ఞాస గాకుండగా, కేవలం కృత్రిమమైన పైపైకి మాత్రమే ఉన్న కుతూహలంగా మిగిలిపోతుంది. కుతూహలం అంటే తేలికగా ఉండేది, దృష్టి తేలికగా మరలే తత్త్వం. జిజ్ఞాస అంటే లోతైనది, అస్తిత్వానికి సంబంధించినది, పరివార్తనతో కూడినది. 
జిజ్ఞాస అభివ్యక్తమయ్యే విధానాలు:
శ్రవణం, మననం, నిధిధ్యాసనం,  గురువును సరైన ప్రశ్నలను అడగటం, అత్యున్నత సాక్షాత్కారం కోసం సరళమైన, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని కొనసాగించడం. 
ఆవిద్యకు, విద్యకు వారధి జిజ్ఞాస. కాబట్టి దీన్ని పెంపొందించుకునే పనిలో ప్రతి సాధకుడు, నిరంతరం నిమగ్నమై ఉండాలి. 



సంపూర్ణ శరణాగతి

 


సంపూర్ణ శరణాగతి
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ|| 
*
ఆ పరమాత్మలో సంపూర్ణ లయం కావాలనుకునే ఆధ్యాత్మిక సాధకులకు, భక్తులకు వర్తించే పదం, ఈ శరణాగతి అనే పదం. ఎందుకంటే భాగ్యవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందాలంటే ఇదే అతి దగ్గర మార్గం. కానీ నిజానికి ఇది ప్రతి ఒక్కరికీ  అవసరమైన పదం.  
శరణాగతి అనగానే యేదో ఒక ఓడిపోయిన సన్నివేశంగా, అదొక బలహీనత అన్నట్లుగా, మనలో ఉన్న అహంకారానికి దెబ్బలా మొదట్లో అందరికీ తోస్తుంది. కానీ యదార్థం అది కాదు. 
భగవంతుని మహత్తును యదార్థంగా గుర్తించడం, ఆయన సమక్షంలో మన యదార్థ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఆ స్పృహతో జీవితం కొనసాగించడం శరణాగతి అంటే. 
అయితే శరణాగతి అనే ఆధ్యాత్మిక స్థితి సముచిత సమయంలో సంభవిస్తుంది తప్ప, ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఎందుకంటే ఇడి అహం లేని స్థితి కాబట్టి. 
అయితే కొన్ని సాధనలు శరణాగతి దిశగా జీవితం కొనసాగేలా చేయవచ్చు. కానీ నిజమైన శరణాగతి ఆ భగవంతుని లేక ఆ గురువు అనుగ్రహం వల్లనే సంభవిస్తుందంటారు. వాటిల్లో కొన్ని - 1) భగవంతుడు ఆమోదించినవి (అనుకూలించేవి) స్వీకరించడం, అనుకూలించనివాటిని నిరాకరించడం 2) ఆయన సంరక్షణను నమ్మడం, ఆయన కాపాడుతున్నాడన్న నమ్మకం కలిగి ఉండటం, 3) వినమ్రంగా ఉండటం, ఆత్మ సపర్మాణ కలిగి ఉండటం. 
పైన చెప్పినవి కొంత వరకూ జటిలంగా ఆచరణకు దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. పూజ్య బాబూజీ దీన్ని మనకు సులభం చేసేశారు. శరణాగతి భగవంతునిపై అన్నిటికీ ఆధారపడటంతో ప్రారంభమవుతుందన్నారు. ఇది ఆచరణకు చాలా తేలిక. 
పూజ్య లాలాజీ మనం అదృశ్యమయితేనే మనలో ఉన్న భగవంతుడు విరాట రూపం ధరిస్తాడు, అంటే బహిర్గతమవుతాడంటారు. ఇలా ధ్యానం ద్వారా అదృశ్యమవడమే శరణాగతి అంటే. 
శరణాగతి వల్ల సిద్ధించే ఫలాలు - భయం నుండి సంపూర్ణ విముక్తి, సంస్కార భారం తొలగిపోవడం, అహం కరిగిపోవడం వల్ల అంతరంగ ప్రశాంతత, వినమ్రత, భక్తిరస ప్రాప్తి, భగవంతుని సాయుజ్యం లేక సంపూర్ణ లయం.
పైన చిత్రం: పూజ్య బాబూజీ, సంపూర్ణ శరణాగతి భావంతో ధ్యాన భంగిమలో ఉన్నట్లుగా తోస్తుంది. 

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

  కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7 పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్...