16, జులై 2022, శనివారం

చైతన్యం

చైతన్యం 

మనిషిలోని ఈ చైతన్యాన్ని  గురించి  విస్తృతంగా సైంటిఫిక్ సమాజాల్లోనూ,  ఆధ్యాత్మిక  అన్వేషకుల్లోనూ  మునుపెన్నడూ  లేని  విధంగా  చర్చలు  జరుగుతూ  ఉన్నాయి. ఈ  చైతన్యానికి  కుల, మత, రంగు, భాషలతో అస్సలు  పని లేదు. ఈ  అగోచర  సత్యమే  మనిషిని  సృష్టిని  కూడా  నడిపిస్తోందన్నది  మన  ఆధ్యాత్మిక  సైంటిస్టులు, మన మహర్షులు  ప్రాచీన  కాలంలోనే  తేల్చి  చెప్పడం  జరిగింది. శంఖంలో  పోస్తేనే  గాని  నీరు  తీర్థం  కాదన్నట్లు, విజ్ఞాన శాస్త్రం  లేదా  సైంటిఫిక్ భాషలో  వింటేనే  ఆ  పరమ సత్యాలకు  బలం  ఏర్పడుతుంది  ఈ  ఆధునిక  యుగంలో.  ఎందుకంటే  ఎవరికి  వారు  ధ్యానం లోలోతుల్లోకి  వెళ్ళి  తెలుసుకోవలసిన సత్యాలను  అందరికీ  అర్థమయ్యే  భాషలో  చెప్పాలి;  అందరికీ  ఆమోదయోగ్యమైన  భాషలో,  పద్ధతిలో  తెలియజేయాలి. మన  పాశ్చాత్యులు  చెప్పిన  పరమసత్యాలను  ఆధ్యాత్మికంగా  అనుభూతి  చెందడం ద్వారా  మాత్రమే  సరైన, స్పష్టమైన జ్ఞానం కలుగుతుంది. మరో  మార్గం  లేదు. చైతన్యాన్ని  అనుభూతి  చెందవలసినదే;  దాని  ప్రభావాలను  చూడవచ్చు  గాని, నిజమైన  జ్ఞానం  అనుభూతి  వల్లే  కలుగుతుంది. అది  కేవలం  ధ్యానం  ద్వారానే  సాధ్యపడుతుంది.

దీన్ని  కొంచెం  సమగ్రంగా అర్థం  చేసుకునే  ప్రయత్నం  చేద్దాం.

చైతన్యం  అంటే  ఏమిటి?

చైతన్యం  అంటే యెరుక, స్పృహ, చేతనం, వివేకము, జ్ఞానము ఇలా  నానార్థాలు  కనిపిస్తాయి మన తెలుగు  నిఘంటువు  చూస్తే. అయితే  చైతన్యమే  మనిషి  మనుగడను  నడిపించేది, నిర్వచించేది  కూడా.  అంటే  మన  చైతన్యాన్ని బట్టే  మన  జీవితం  ఉంటుంది.

ఆధ్యాత్మిక  పరిభాషలో చైతన్యం అనేది  ప్రధానంగా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం  అనే నాలుగు  సూక్ష్మశరీరాల  కలయిక. ఈ  చైతన్యం ఆకాశంగా  భావిస్తే  మనసు, బుద్ధి,  అహంకారాల  అందులో  నిక్షిప్తమై  ఉన్న  గ్రహాలుగా  భావించుకోవచ్చును.  కాబట్టి ఈ  మనసు  బుద్ధి  అహంకారాలను  బట్టే  చిత్తం లేక  చైతన్యం  ఉంటుంది. 

ఈ  చైతన్యం  అసంఖ్యాకమైన  పొరలతో  కూడి  ఉంటుంది. ఈ  పొరల్లో  మన గతంలో  ఏర్పరచుకున్న సంస్కారాలు,  చిత్త వృత్తులూ  బీజరూపాలుగా  ఉంటాయి. ఇవి గాక  భయాలు,  చింతలు,  కామం,  క్రోధం,  లోభం,  మోహం, మదం, మాత్సర్యం అనే  మలినాలు  కూడా  ఉంటాయి.  వీటి  ప్రభావం  వల్ల  మన  చైతన్యం  భగవంతుడు  సృష్టించిన  విధంగా పవిత్రంగా,  స్వచ్ఛంగా  లేకుండగా  కలుషితమైపోయింది. ఈ  మలినాల  ప్రభావం  చేతనే  అనేక  జటిలమైన  మనస్తత్త్వాలను ఏర్పరచుకోవడం,  వాటిల్లో  ఇరుక్కుపోవడం, అందులో  నుండి  బయట  పడలేకపోవడం జరుగుతూ  ఉంది. మనిషి  పతనానికీ, ఉన్నతికీ కూడా  ఈ  చైతన్యమే  కారణం. చైతన్యాన్ని  కలుషితం  చేసిన, చేస్తున్న  ఈ  మలినాలను,  జటిల తత్త్వాలను సమూలంగా  తొలగించి స్వచ్ఛంగా  పవిత్రంగా  తన స్వస్వరూపాన్ని  పునరుద్ధరించడమే,  ఆధ్యాత్మికోన్నతి,  చైతన్య  వికాసం, ఆధ్యత్మిక  వికాసం,  ఆత్మవికాసం.  యోగసాధన  అంతా  ఇది  సిద్ధించుకోవడం  కోసమే. 

ఈ  చైతన్యము  భౌతిక  శరీరం  అంతటా అంటే  అన్నమయ  కోశం అంతా,  ప్రాణమయ  కోశం  అంతా,  మనోమయ  కోశం  అంతా,  విఞానమయ  కోశం అంతా,  ఆనందమయ  కోశం  అంతా  అణువణువునా  వ్యాపించి  ఉంది. అంటే  చైతన్యము  స్థూలసూక్ష్మకారణ శరీరాలంతటా  వ్యాపించి ఉంది. దీన్నే  వ్యక్తిగత  చైతన్యము  అని అంటారు. ఈ  కలుషితమైన  వ్యక్తిగత చైతన్యము  శుద్ధ  చైతన్యంగా  మారి  ఆధ్యాత్మికంగా  ఊర్ధ్వ లోకాలకు  పయనించడమే యోగసాధన లేక  ఆధ్యాత్మిక  యాత్ర  యొక్క  లక్ష్యము. 

అందుకే  చైతన్యాన్ని  ఆత్మ  యొక్క  అభివ్యక్తీకరణ అని అంటారు.  ఈ  వ్యక్తిగత  చైతన్యమే  మనిషిని  నిర్వచించేది; మనిషి  ఎలా  ఉన్నాడో  అలా  ఉండటానికి  కారణం. కాబట్టి  చైతన్యంలో  మార్పు/పరివర్తన  వస్తేనే  మనిషిలో  మార్పు గాని  పరివర్తనగాని  వచ్చేది. మనిషిలో  మార్పుకు  చైతన్యంలో  మార్పు  చాలా  కీలకమైనది. అంటే  మనసులోనూ,  బుద్ధిలోనూ,  అహంలోనూ  మార్పులొస్తే  తప్ప  చైతన్యంలో  మార్పు  రాదు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...