16, జులై 2022, శనివారం

చైతన్యం

చైతన్యం 

మనిషిలోని ఈ చైతన్యాన్ని  గురించి  విస్తృతంగా సైంటిఫిక్ సమాజాల్లోనూ,  ఆధ్యాత్మిక  అన్వేషకుల్లోనూ  మునుపెన్నడూ  లేని  విధంగా  చర్చలు  జరుగుతూ  ఉన్నాయి. ఈ  చైతన్యానికి  కుల, మత, రంగు, భాషలతో అస్సలు  పని లేదు. ఈ  అగోచర  సత్యమే  మనిషిని  సృష్టిని  కూడా  నడిపిస్తోందన్నది  మన  ఆధ్యాత్మిక  సైంటిస్టులు, మన మహర్షులు  ప్రాచీన  కాలంలోనే  తేల్చి  చెప్పడం  జరిగింది. శంఖంలో  పోస్తేనే  గాని  నీరు  తీర్థం  కాదన్నట్లు, విజ్ఞాన శాస్త్రం  లేదా  సైంటిఫిక్ భాషలో  వింటేనే  ఆ  పరమ సత్యాలకు  బలం  ఏర్పడుతుంది  ఈ  ఆధునిక  యుగంలో.  ఎందుకంటే  ఎవరికి  వారు  ధ్యానం లోలోతుల్లోకి  వెళ్ళి  తెలుసుకోవలసిన సత్యాలను  అందరికీ  అర్థమయ్యే  భాషలో  చెప్పాలి;  అందరికీ  ఆమోదయోగ్యమైన  భాషలో,  పద్ధతిలో  తెలియజేయాలి. మన  పాశ్చాత్యులు  చెప్పిన  పరమసత్యాలను  ఆధ్యాత్మికంగా  అనుభూతి  చెందడం ద్వారా  మాత్రమే  సరైన, స్పష్టమైన జ్ఞానం కలుగుతుంది. మరో  మార్గం  లేదు. చైతన్యాన్ని  అనుభూతి  చెందవలసినదే;  దాని  ప్రభావాలను  చూడవచ్చు  గాని, నిజమైన  జ్ఞానం  అనుభూతి  వల్లే  కలుగుతుంది. అది  కేవలం  ధ్యానం  ద్వారానే  సాధ్యపడుతుంది.

దీన్ని  కొంచెం  సమగ్రంగా అర్థం  చేసుకునే  ప్రయత్నం  చేద్దాం.

చైతన్యం  అంటే  ఏమిటి?

చైతన్యం  అంటే యెరుక, స్పృహ, చేతనం, వివేకము, జ్ఞానము ఇలా  నానార్థాలు  కనిపిస్తాయి మన తెలుగు  నిఘంటువు  చూస్తే. అయితే  చైతన్యమే  మనిషి  మనుగడను  నడిపించేది, నిర్వచించేది  కూడా.  అంటే  మన  చైతన్యాన్ని బట్టే  మన  జీవితం  ఉంటుంది.

ఆధ్యాత్మిక  పరిభాషలో చైతన్యం అనేది  ప్రధానంగా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం  అనే నాలుగు  సూక్ష్మశరీరాల  కలయిక. ఈ  చైతన్యం ఆకాశంగా  భావిస్తే  మనసు, బుద్ధి,  అహంకారాల  అందులో  నిక్షిప్తమై  ఉన్న  గ్రహాలుగా  భావించుకోవచ్చును.  కాబట్టి ఈ  మనసు  బుద్ధి  అహంకారాలను  బట్టే  చిత్తం లేక  చైతన్యం  ఉంటుంది. 

ఈ  చైతన్యం  అసంఖ్యాకమైన  పొరలతో  కూడి  ఉంటుంది. ఈ  పొరల్లో  మన గతంలో  ఏర్పరచుకున్న సంస్కారాలు,  చిత్త వృత్తులూ  బీజరూపాలుగా  ఉంటాయి. ఇవి గాక  భయాలు,  చింతలు,  కామం,  క్రోధం,  లోభం,  మోహం, మదం, మాత్సర్యం అనే  మలినాలు  కూడా  ఉంటాయి.  వీటి  ప్రభావం  వల్ల  మన  చైతన్యం  భగవంతుడు  సృష్టించిన  విధంగా పవిత్రంగా,  స్వచ్ఛంగా  లేకుండగా  కలుషితమైపోయింది. ఈ  మలినాల  ప్రభావం  చేతనే  అనేక  జటిలమైన  మనస్తత్త్వాలను ఏర్పరచుకోవడం,  వాటిల్లో  ఇరుక్కుపోవడం, అందులో  నుండి  బయట  పడలేకపోవడం జరుగుతూ  ఉంది. మనిషి  పతనానికీ, ఉన్నతికీ కూడా  ఈ  చైతన్యమే  కారణం. చైతన్యాన్ని  కలుషితం  చేసిన, చేస్తున్న  ఈ  మలినాలను,  జటిల తత్త్వాలను సమూలంగా  తొలగించి స్వచ్ఛంగా  పవిత్రంగా  తన స్వస్వరూపాన్ని  పునరుద్ధరించడమే,  ఆధ్యాత్మికోన్నతి,  చైతన్య  వికాసం, ఆధ్యత్మిక  వికాసం,  ఆత్మవికాసం.  యోగసాధన  అంతా  ఇది  సిద్ధించుకోవడం  కోసమే. 

ఈ  చైతన్యము  భౌతిక  శరీరం  అంతటా అంటే  అన్నమయ  కోశం అంతా,  ప్రాణమయ  కోశం  అంతా,  మనోమయ  కోశం  అంతా,  విఞానమయ  కోశం అంతా,  ఆనందమయ  కోశం  అంతా  అణువణువునా  వ్యాపించి  ఉంది. అంటే  చైతన్యము  స్థూలసూక్ష్మకారణ శరీరాలంతటా  వ్యాపించి ఉంది. దీన్నే  వ్యక్తిగత  చైతన్యము  అని అంటారు. ఈ  కలుషితమైన  వ్యక్తిగత చైతన్యము  శుద్ధ  చైతన్యంగా  మారి  ఆధ్యాత్మికంగా  ఊర్ధ్వ లోకాలకు  పయనించడమే యోగసాధన లేక  ఆధ్యాత్మిక  యాత్ర  యొక్క  లక్ష్యము. 

అందుకే  చైతన్యాన్ని  ఆత్మ  యొక్క  అభివ్యక్తీకరణ అని అంటారు.  ఈ  వ్యక్తిగత  చైతన్యమే  మనిషిని  నిర్వచించేది; మనిషి  ఎలా  ఉన్నాడో  అలా  ఉండటానికి  కారణం. కాబట్టి  చైతన్యంలో  మార్పు/పరివర్తన  వస్తేనే  మనిషిలో  మార్పు గాని  పరివర్తనగాని  వచ్చేది. మనిషిలో  మార్పుకు  చైతన్యంలో  మార్పు  చాలా  కీలకమైనది. అంటే  మనసులోనూ,  బుద్ధిలోనూ,  అహంలోనూ  మార్పులొస్తే  తప్ప  చైతన్యంలో  మార్పు  రాదు. 


12, జులై 2022, మంగళవారం

గురుపూర్ణిమ ఎలా జరుపుకోవాలి?

గురుపూర్ణిమ

రేపు అంటే  జూలై 13, 2022 తేదీన గురుపూర్ణిమ అయ్యింది. ప్రతీ  సంవత్సరమూ ఆషాఢ  పూర్ణిమ నాడు,  వేదవ్యాస  మహర్షి  జన్మదిన  సందర్భంగా  ఈ  రోజును  గురుపూర్ణిమగా  భారతీయ  సాంప్రదాయంలో  అనాదిగా  జరుపుకుంటూ  వస్తున్నారు.  వేదవాజ్ఞ్మయాన్ని అంతటినీ  క్రోడీకరించి,  ఒక్కచోటుకు  జేర్చిన మహాత్ముడు,  మహర్షి వ్యాసమహర్షి.  వీరి  జన్మదినాన  అన్ని  సాంప్రదాయాలకు  సంబంధించినవారు,  శిష్యులందరూ  కూడా వ్యాసమహర్షిని  స్మరించుకుంటూ తమతమ  గురుపరంపరను తమ  గురుదేవులను పూజించుకోవడం  ద్వారా ఇది  జరుగుతూ ఉంది.  

ఈ  రోజున  వివిధ  సాంప్రదాయాలకు  సంబంధించినవారు, వారి-వారి  సంప్రదాయాలకనుగుణంగా వివిధ రకాలుగా  ఈ  పవిత్ర దినాన్ని  జరుపుకుంటూ  ఉంటారు. ఈ  రోజున  గురువుతో  భౌతికంగా  కూడి  ఉండగలిగినప్పుడు  సాధకుడి  ఆధ్యాత్మిక  పురోగతి  ఎన్నో  ఇంతలు  త్వరితంగా గురువు  అనుగ్రహం  చేత జరిగే  అవకాశం  ఉందని  చెప్తారు. 

హార్ట్ఫుల్నెస్,  శ్రీరామచంద్ర  మిషన్ సంప్రదాయంలో గురుపూర్ణిమ

కాని  ఈ  సంస్థలో  అది సాధకుడు  లేక  అభ్యాసి అంతరంగ  తయారీని  బట్టి,  ఆతని  అంతరంగ  స్థితిని  బట్టి,  అతని తపనను  బట్టి  ఆధారపడుంటుందని  చెప్తారు  మన  గురువులు.

ఉత్తర్  ప్రదేశ్ లోని షాజహానుపూరుకు  చెందిన శ్రీరామచంద్రజీ,  ఆప్యాయంగా  పిలుచుకొనే  బాబూజీ  స్థాపించిన శ్రీరామచంద్ర  మిషన్ లో,  ఈ  సంప్రదాయంలోని  గురుపరంపర యొక్క గురువులు, గురుపూర్ణిమ ప్రతీ  సంవత్సరం  ఒక  ఆచారంలా  ఒక క్రతువులా  చెయ్యద్దంటారు.  ఈ  సంప్రదాయం  వాటన్నిటికీ  అతీతంగా  చాలా  దూరంగా  ప్రయాణించిన  సంస్థ  అంటారు.  యాదృచ్ఛికంగా అంటే  అనుకోకుండా మనం  ఆ  రోజున  గురువుతో  కూడి  ఉన్నట్లయితే  అది  వేరే  విషయం,  కాని  ఆ  రోజున  ప్రత్యేకంగా  గురువుతో  ఉండాలని  ప్రణాళిక  అవసరం  లేదంటారు. దానికి  బదులుగా ఆ రోజున, అభ్యాసి  లేక  సాధకుడు  ఎక్కడున్నా తన  గురుదేవుల  స్మరణలో  ఎంతగా  లీనమైపోయి  ఉండటానికి  ప్రయత్నించాలంటే  ఆ  స్మరణలో  సాధకుడు  ఆహుతి  అయిపోవాలంటారు. "Consume yourself in His remembrance" అంటారు. 

స్మరణ  అంటే  మళ్ళీ  కేవలం  జ్ఞాపకాలు  కావు.  ఆ  జ్ఞాపకాలు  ఎలా  ఉండాలంటే  మనం  స్మరిస్తున్న  వ్యక్తి లేక  గురువు  సాక్షాత్తు  మనతో  ఆయన  ఉనికి  ఉన్నట్లుగా  అనుభూతి  చెందగలగాలి. వారి  ఉనికిని అనుభూతి  చెందుతూ,  వారు  గడిపిన  జీవన  విధానాన్ని,  వారు  సాధన చేసిన  విధానాన్ని,  వారి  క్రమశిక్షణ, వారి  వ్యక్తిత్వం,  వారి  ఆధ్యాత్మిక  సాన్నిధ్యాన్ని... వీటన్నిటినీ  స్మరిస్తూ వారి  ఉనికిని  నిజంగా  అనుభూతి  చెందే  ప్రయత్నంలో  ఉంటూ  మన జీవితం  ఎంత  వరకూ  దీనికి  దగ్గరగా  ఉంది అని  ఆత్మావలోకనం  జరిగినప్పుడు  కనీసం మనం  చేసుకోవలసిన  సవరణలు  ఏమిటో  అయినా  మనకు  తెలిసే  అవకాశం  ఉంటుంది.  

కావున  ఈ  పరమపవిత్ర  దినాన  అభ్యాసులుగా  మనందరమూ  గురువుల  అభీష్తాన్ని  అనుసరించి తమ  గురుదేవుల  దివ్యస్మరణలో తమను  తాము  ఆహుతి  చేసుకోగలరని  ప్రార్థిస్తూ.... 

గురుపూర్ణిమ - గురుదేవుల  దివ్య స్మరణలో మనలను  మనం ఆహుతి చేసుకోవడమే  గురు పూర్ణిమనాడు  సాధకుడు  చెయ్యవలసినది.

8, జులై 2022, శుక్రవారం

ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాల గుండా ప్రయాణం


ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాల గుండా ప్రయాణం

 ఆధ్యాత్మిక పరిభాషలో ద్వంద్వాలంటే సుఖము-దుఃఖము, వెలుగు-చీకటి, జ్ఞానము-అజ్ఞానము,  మంచి-చెడు, జననము-మరణము, ఇష్టము-అయిష్టము, కోరికలు-సంతుష్ఠి, అశాంతి-శాంతి, కరుణ-ద్వేషము, సాహసము-భయము, భ్రమలు-స్పష్టత, వగైరా వంటి పరస్పర విరుద్ధ విషయాలు. ఒకటుంటే రెండవది ఉండక మానదు. ఒకటి కోరుకుని మరొకదాన్ని తప్పించుకోలేము. అందుకే ఈ లోకాన్ని ద్వంద్వాల ప్రపంచం అంటాం. మనం  జీవించే ప్రపంచం ఈ ద్వంద్వాలతో కూడుకున్న ప్రపంచం. వీటితోనే జన్మ నుండి మృత్యువు వరకూ మన మనుగడ కొనసాగుతూ ఉంటుంది. కష్టమొచ్చినప్పుడు కృంగిపోయి, సంతోషం వచ్చినప్పుడు స్పృహలేకుండాపోయి; మన  ముఖం కాస్సేపు వికసించి, కాస్సేపు ముడుచుకుపోయి ఉంటూ ఉంటుంది. పుట్టినప్పటి నుండి మరణించే వరకూ అందరూ సామాన్యంగా జీవించే విధానం ఇదే. దీనికి కారణం మన  జీవన విధానంలో ఎరుకలో (లేక  చేతనలో) గణనీయమైన మార్పు సంభవించకపోవడమేనని యోగం అంటుంది. ఆ మార్పు కోసం ఏ ప్రయత్నమూ చెయ్యకపోవడమే మనలో  మార్పు లేకపోవడానికి కారణం అంటున్నారు మహాత్ములు. అందుకే ఈ ద్వంద్వాలకతీతంగా ఎదగడమే మానవ జన్మ యొక్క సార్థకత, పరమార్థము అని  మన  పెద్దలు చెబుతూ ఉంటారు. దీన్నే మోక్షం అని  కూడా అంటారు. ముఖ్యంగా  ప్రతీ మనిషీ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే – మనిషి పుట్టిందే ఎదగడం కోసం. పరివర్తన కోసం. తన  స్వస్వభావాన్ని సాక్షాత్కరించుకోవడం కోసం. మార్పు, ఎదుగుదల లేని జీవితం  నిరర్థకం, వ్యర్థ  జీవితం అవుతుంది.

 సాంప్రదాయపరంగా మోక్షం అనేది  మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం, పరమావధి. దీనికి మించి ఏమీ  చేరుకునే గమ్యం మరేదీ లేదు. కాని సహజమార్గ ఆధ్యాత్మిక పథం  ప్రకారం  మోక్షం అన్నది పరతత్త్వాన్ని చేరుకోవడంలో మొదటి లక్ష్యం మాత్రమే. దీన్ని గురించి మనం  తరువాత విపులంగా చెప్పుకుందాం.

 అయితే ద్వంద్వాలకతీతంగా ఉండే స్థితి ఎలా ఉంటుంది? అంటే మోక్షస్థితి ఎలా  ఉంటుంది?

భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించినటువంటి స్థితప్రజ్ఞత్వ స్థితిలా ఉంటుంది. అంటే సమత్వ స్థితిలో స్థిరపడిపోయినటువంటి చేతనాస్థితి, లేక  ఎరుక. పైన  చెప్పిన ద్వంద్వాల స్పర్శ కూడా కలగనటువంటి శాశ్వత అంతరంగ స్థితి. విపరీతమైన స్పష్టతతో కూడిన ప్రజ్ఞ లేక  ఎరుకకలిగి ఉండటం. ఆ  ఎరుకతో జీవనం కొనసాగించగలిగే పరిస్థితి ఈ స్థితి. ఈ స్థితిని దేహముండగానే అనుభూతి చెగలిగేటువంటి స్థితి. దేహంరాలిపోయే ముందు ప్రతీ  సాధకుడు  కనీసంగా సాధించవలసిన ఆధ్యాత్మిక  లక్ష్యం. 

 అది  అందరికీ సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే మనం  చెయ్యవలసినదేమిటి? యోగానికి దీనికి ఏమిటి సంబంధం? ముఖ్యంగా  బాబూజీ రూపకల్పన చేసిన సహజమార్గము అనే  ఆధ్యాత్మిక పథం  ప్రకారం, దీనికి పరిష్కారం ఎలా  ఉంది? వీటికి సమాధానాలు శోధించే ప్రయత్నం చేద్దాం.

 యౌగిక చక్రాల పరంగా జరిగే ఆధ్యాత్మిక యాత్ర:

సహజమార్గ ఆధ్యాత్మిక పథం  ప్రకారం, పూజ్య బాబూజీ ఆవిష్కరించిన సహజమార్గ పథం  ప్రకారం,  జీవుడి ఆధ్యాత్మిక ప్రయాణం అంతులేని విధంగా, అనంతం వైపు కొనసాగుతూ ఉంటుంది. బాబూజీ ప్రకారం జీవుడు మూలం నుండి విడిపోయినప్పుడు, క్రిందకు వచ్చిన క్రమమే ఈ యౌగిక చక్రాలు. మొదటి మనసు (ఫస్ట్ మైండ్) నుండి క్రిందకు దిగి వచ్చినప్పుడు ఆ మనోశక్తి వివిధ స్థానాల్లో  ముడులు-ముడులుగా ఏర్పడింది; బాబూజీ వీటిని అందుకే గ్రంథులంటారు; వీటినే మనం  చక్రాలంటాం. సాంప్రదాయ పరంగా ఇవి  ఏడు  చక్రాలు-మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విషుద్ధి, ఆజ్ఞ చక్రాలు. సహస్రారచక్రం లేక  సహస్రదళ్ కమల్ అనేది గమ్యస్థానం సాంప్రదాయం ప్రకరం. సహజమార్గ ఆధ్యాత్మిక పథం  ప్రకారం ఈ యాత్ర 13  గ్రంథుల/చక్రాల గుండా చెయ్యవలసి ఉంది. సహస్రారం తరువాత బ్రహ్మ రంధ్రం (12 వ గ్రంథి), ఆ తరువాత దాని క్రింద కేంద్ర క్షేత్రానికి సంబంధించిన 13 వ గ్రంథి ఉన్నాయి. కాబట్టి సాంప్రదాయపరంగా యాత్ర సహస్రారంతో పూర్తవడం గాక ఇంకా 13వ  గ్రంథిని కూడా దాటి అనంతం వైపు కొనసాగుతూ ఉంటుందని సహజమార్గం చెబుతుంది.

 ద్వంద్వాలకతీతంగా దాటవలసిన 5 బిందువుల/గ్రంథుల/చక్రాల  హృదయ క్షేత్రం:

సహజమార్గ పథంలో అనాహత చక్రాన్ని 4 ఉపచక్రాలుగా చెబుతారు. వాటిని 1, 2, 3, 4 బిందువులుగా అభివర్ణిస్తారు. 5వ  బిందువును కంఠ  చక్రం లేక  విశుద్ధి చక్రం అని  కూడా పిలుస్తారు. ఈ అయిదు చక్రాలు మనం  ఉండే ద్వంద్వ ప్రపంచానికి సంబంధించినవి. ఈ 5 చక్రాలను/గ్రంథులను కలిపి హృదయ క్షేత్రం అంటారు. గురువు యొక్క మార్గదర్శనంలో సహజమార్గ సాధన ద్వారా ఈ 5 బిందువులను  దాటినప్పుడు ఈ స్థితప్రజ్ఞ స్థితి  లేక  ద్వంద్వాతీత స్థితి లేక  మోక్ష స్థితి సంభవిస్తుంది.

 ఈ హృదయ  క్షేత్రాన్ని గురించి పూజ్య దాజీ మరింత విపులంగా ఇచ్చిన వివరణ:

ఒక్కొక్క గ్రంథిలో ఒక్కొక్క చేతనం,  ఒక్కొక్క  రకమైన ప్రకంపనం, ఒక్కొక్క రకమైన వర్ణం, ఒక  ప్రత్యేక వాతావరణం, అక్కడ యాత్ర జరుగుతున్నప్పుడు అనుభవంలోకి వస్తాయి. ఒక్కొక్క  చక్ర  యాత్రం  పూర్తయినప్పుడు    చక్రానికి  తగినటువంటి  పరిణామం/ఆత్మవికాసం జరుగుతుంది. ఈ చక్రాలు  శక్తి  క్షేత్రాలు  కూడా.  ఆయా  చక్రంలో యాత్ర  చేస్తున్నప్పుడు  మామూలుగా  ఆయ  శక్తులు  రావడం  కూడా  జరుగుతుంది.  కాని  సహజమార్గ  ఆధ్యాత్మిక పథంలో ఆ  అవకాశం ఉండదు. ఆ శక్తులను సంపాదించడంలో ఉండే ప్రమాదాల్లో చిక్కుకుపోకుండా, అహంకారం అదుపులో  ఉంచుతూ గురువు మనలను రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథంలో శక్తులు సాధకుడికి రావు. గురువు అవసరమూ అని  అనుకుంటే తప్ప.  

 మనం  ఇంతకుముందు  చెప్పుకున్నట్లుగా    హృదయ  క్షేత్రంలో 5  బిందువులున్నాయి.  ఇదే  ద్వంద్వాల  లోకం  మనం  జీవిస్తున్న   ప్రపంచం.  ఈ ప్రపంచంలో జీవనం  మీద  పట్తు రావాలంటే, స్థిత ప్రజ్ఞత్వ స్థితిని చేరుకోవడానికి ఈ 5 బిందువుల యాత్ర పూర్తవ్వాలి, అంటే వీటిపై పట్టు సంపాదించాలి. ఇవి  గాక  ఎన్నో  ఉపబిందువులు  కూడా  ఉన్నాయి.  కాని  వాటిల్లో ప్రధానంగా పాయిట్ ఎ,  పాయింట్ బి,  పాయింట్ సి, పాయింట్ డి అని  నాలుగున్నాయి.

 బిందువు 1- హృదయ చక్రం/ భూమి బిందువు. ఈ చక్రం సంతుష్ఠికి-కోరికలకు అనే  ద్వంద్వాలకు నిలయం. ఈ చక్ర వాతావరణం కలుషితమైనప్పుడు కోరికలు ఎక్కువగా ఏర్పడతాయి. కోరికలు తగ్గినప్పుడు చక్ర శుద్ధి జరిగి సంతుష్థి పెరగడం వల్ల తదనుగుణంగా ఆత్మవికాసం జరుగుతుంది.

 బిందువు 2 – ఆత్మ చక్రం/ఆకాశ బిందువు . శాంతి- అశాంతుల నిలయం. 1వ  బిందువులో కోరికలు ఎక్కువగా ఏర్పడినప్పుడు అది  అశాంతిగా మారి 2వ  బిందువు  వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. 2వ  బిందువు శుద్ధి అవుతున్న కొద్దీ అశాంతి పోయి  శాంతి ఏర్పడి ఆత్మానుభూతి జరుగుతుంది.

 బిందువు3 – అగ్ని చక్రం. ఇది  సంవేదనకు/కరుణ-ద్వేషానికి/నిస్పృహకు  నిలయం. ఈ బిందువు కలుషితమైనప్పుడు ద్వేషానికి, నిరాశ-నిస్పృహలకు  ఎక్కువగా లోనవుతూ ఉంటాం. ఈ చక్ర శుద్ధి జరిగినప్పుడు సంవేదన, కరుణ జీవుడిలో వృద్ధి చెంది ఆత్మవికాసం జరుగుతుంది.

 బిందువు 4- జల  బిందువు.  ఇది  సాహసానికి-భయానికి నిలయం. ఇక్కడ వాతావరణం కలుషితమైనప్పుడు సాహసం తగ్గి  భయం  ఏర్పడుతుంది. ఈ బిందువు శుద్ధి జరిగినప్పుడు మానసిక  స్థైర్యం  పెరుగుతుంది.  ఆత్మవిశ్వాసం  పెరుగుతుంది. ఆ విధంగా  ఆత్మవికాసం  జరుగుతుంది. 

 బిందువు 5 – వాయు చక్రం. స్పష్టతకు-భ్రమలకు  నిలయం.  ఇక్కడి  వాతావరణం  కలుషితమైనప్పుడు  జీవుడు  భ్రమలకు  లోనవుతాడు.  స్పష్టతను  కోల్పోతాడు.  భ్రమలకు, భ్రాంతులకు లొంగిపోతాడు. మనఃస్థిమితం కోల్పోతాడు. ఈ చక్ర శుద్ధి జరిగినప్పుడు భ్రమలకు, భ్రాంతులకు దూరమై అన్ని విషయాల్లోనూ స్పష్టతను ఏర్పరచుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ ఆత్మవికాసం జరుగుతుంది.

 ఈ విధంగా ఈ 5 బిందువుల యాత్రను సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడు,  అంటే పూర్తిగా పట్టు సంపాదించినప్పుడు, ఆత్మ ద్వంద్వాలకతీతంగా ఎదిగి ముందుకు సాగుతుంది.  మోక్షస్థితి అనుభవంలోకి వస్తుంది. బంధవిముక్తిని  ఆత్మ  అనుభూతి చెందుతుంది. స్వేచ్ఛగా తరువాతి యాత్రను కొనసాగిస్తుంది. ఇది  సహజమార్గ సాధన ద్వారా సరళంగా గురుదేవుల మార్గదర్శనంలో ఈ జెవితంలోని కొంత భాగంలోనే ఎవరికైనా సాధ్యపడుతుంది. సాధకుడిలో దీనికి కావలసినది కేవలం దృఢ  సంకల్పం, అచంచల విశ్వాసము, సమర్పణాభావం మాత్రమే.

 మనం  ఇంతకు ముందు 4 ప్రధాన ఉపచక్రాలను/ఉపబిందువులను గురించి ప్రస్తావించుకున్నాం – పాయింట్ ఎ,  పాయింట్ బి,  పాయింట్ సి,  పాయింట్ డి. 

పూజ్య దాజీ ప్రకారం ఈ నాలుగు పాయింట్లు సంస్కారాల ప్రవేశ-ద్వారాలు. మనం  నిత్యం ప్రపంచంతో వ్యవహరించేప్పుడు ఏర్పడే ముద్రల ప్రవేశ-ద్వారాలు. అందుకే వీటిని వివిధ సమయాల్లో నిర్దేశించిన విధంగా శుద్ధి చేసుకోవలసిన అవసరం.

పాయింట్ఎ- ఈ పాయింట్లో ప్రాపంచిక చింతలకు, ఆర్థిక ఇబందులు,వంటివాటికి సంబంధించిన ముద్రలు ఏర్పడటం జరుగుతుంది. దీన్ని రాత్రి పడుకొనే ముందు ఒక 7 నిముషాలకు మించకుండా శుద్ధి చేసుకోవడం మన  నిత్యసాధనలో ఒక  భాగం.

పాయింట్ బి - ఇక్కడ లైంగిక పరమైన ముద్రలు, స్త్రీ-పురుషుల మధ్య ఉండే ఆకర్షణలకు సంబంధించిన ముద్రలు ఏర్పడటం జరుగుతుంది. దీన్ని ఉదయం ధ్యానానికి ముందు ఒక 7 నిముషాలకు మించకుండా నిర్దేశించిన విధంగా శుద్ధి చేసుకోవాలి.

పాయింట్ సి – ఇక్కడ మన ఇష్టాలకు-అయిష్టాలకు సంబంధించిన ముద్రలు ఏర్పడటం జరుగుతుంది. ఇది  ప్రిసెప్టరు వద్ద తీసుకొనే సిట్టింగుల ద్వారా శుద్ధి జరుగుతుంది.

పాయింట్ డి – ఇక్కడ మన  నిత్య జీవితంలో కలిగే అపరాధ భావాలకు సంబంధించిన ముద్రలు ఏర్పడతాయి. అంటే చెయ్యవలసినపనులు చెయ్యకపోయినా, చెయ్యకూడని పనులు చేసినా ఈ ముద్రలు ఏర్పడతాయి. ఇవి  అతి  భారమైన ముద్రలు. వీటిని ఏ శుద్ధీకరణ ప్రక్రియా తొలగించలేదు. కేవలం రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనలో భాగంగా మనం  చేసిన అపరాధాలకు త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాపం చెంది తిరిగి మరల  చేయకుండా ఉండేలా తీర్మానం చేసుకోవడం ద్వారా మాత్రమే తొలగిపోయే అవకాశం ఉంటుంది.

 మోక్షం అంటే దాజీ ఇచ్చిన సమాధానం:

సహజమార్గ సాధన నిత్యమూ నిర్దేశించిన విధంగా అభ్యాసి అనుసరించినప్పుడు  క్రమక్రమంగా సంస్కారాలన్నీ తొలగిపోయి, హృదయ క్షేత్ర శుద్ధి  జరిగి, అంటే ద్వంద్వాలకతీతంగా బంధవిముక్తులమై ముందుకు సాగినప్పుడు దాన్ని మోక్ష  స్థితి లేక  కర్మరాహిత్యస్థితి, కర్మశూన్యులమైపోవడం  వల్ల జనన మరణాల నుండి  విముక్తి  కలుగుతుంది. మోక్షం అంటే పూజ్య దాజీ ఇచ్చిన మరొక  స్పష్టీకరణ:  కేవలం బంధవిముక్తులమై  జననమరణ వలయం  నుండి  బయట  పడటమే  గాక,  అవసరమనుకుంటే  మానవ జన్మ  తీసుకునే  స్వేచ్ఛ కూడా  ఉంటుంది.  అందుకే  మహాత్ములందరూ,  భూమ్మీదున్న  ఆఖరి  వ్యక్తి కూడా  విముక్తుడయ్యే  వరకూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండటానికి ఇష్టపడతామని  కాంక్షించడం జరిగింది.

 కాబట్టి, ద్వంద్వాతీత స్థితి అంటే  కోరికల్లేకుండా సంతుష్ఠితో, శాంత హృదయం కలిగి, ద్వేషం లేకుండా ప్రేమతో,  భయం  లేకుండా ధైర్యంతో, భ్రమలు, భ్రాంతులు లేకుండా స్పషటతతో కూడిన ఉన్న్తమైన చేతనా స్థితి. ఇందులో ప్రాపంచిక చింతలుండవు,  స్త్రీపురుష ఆకర్షణలకు సంబంధించిన సమస్యలుండవు, ఇష్టాయిష్టాల కలత  ఉండదు, ఎటువంటి అపరాధభావమూ లేనటువంటి స్థితి ఈ ద్వంద్వాతీత స్థితి. కర్మలు/సంస్కారాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయిన స్థితిని  ఈ యౌగిక చక్రాల యాత్ర పూర్తవగానే చేరుకోవడం జరుగుతుంది. నిర్దేశించిన విధంగా ఈ సాధన చేసేవారందరికీ ఇది  సాధ్యం. ఎంత సమయం పడుతుంది? సాధకుని దృఢసంకల్పాన్ని బట్టి, తన నిబద్ధతను బట్టి, తన  సమర్పణా భావాన్ని బట్టి  ఈ జన్మలోనే, అదీ  కొంత భాగంలోనే ఈ స్థితిని చేరుకొనే అవకాశం ఉంది.

 

 

 

 

 

 

 

 

 

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 4- (విస్పర్ సందేశాలను చదివే విధానం)

విస్పర్ సందేశాలను  చదివే  విధానం ... పూజ్య  చారీజీ  మాటల్లో ...

ఫిబ్రవరి  2, 2009 న సత్ఖోల్  ఆశ్రమంలో  "హృదయంతో చదవండి"  అన్న  శీర్షికతో  ఇచ్చిన  ప్రసంగంలో పూజ్య  చారీజీ  ఈ  విస్పర్  సందేశాలను  హృదయంతో  చదవమని  చెప్తారు. పూజ్య  గురుదేవులు  దాజీ  ధ్యాన స్థితిలో  చదవమని  చెప్పడం  జరిగింది.  ఈ  సందేశాలను  ఉదయం  ధ్యానం  తరువాత  లేక  సత్సంగం  (సామూహిక  ధ్యానం) తరువాత  అందుకే  చదవడం శ్రేష్ఠం. ఈ  సందేశాల్లో  భాష  కంటే  అందులే  ఉండే  దివ్య తరంగాలతో  ప్రతి స్పందించడం  ప్రధానం,  ఇంగ్లీషులో  రెజొనెన్స్ అంటారు. ఈ  సందేశాలు  దివ్యలోకం నుండి  అందిన  సూక్ష్మమైన తరంగాలు లేక  ప్రకంపనలు. వీటిని  మన  హెలీన్ పైరే గారు వారికొచ్చిన  ఫ్రెంచ్  భాషలో  తర్జుమా  చెయ్యడం  జరిగింది. ఆమెకు  ఫ్రెంచ్  భాష  మాత్రమే  రావడం  వల్ల ఆ భాషలో  తర్జుమా  చేయడం  జరిగింది.  ఆమె తెలుగు వారయ్యుంటే  తెలుగులో  తర్జుమా  అయి  ఉండెవి. ఆ తరంగాలతో  మనం  రెజొనేట్  అయినప్పుడు, మన  ఆత్మ  వాటిని  అందుకొని  ప్రతిస్పందించినప్పుడు,  కలిగే  దివ్యానుభూతులు  మన  చేతనంలో  అనేక  మార్పులు  సంభవించేలా  చేస్తాయి. "ఈ  సందేశాలు  మనలోని  సంస్కారాలను  చాలా  వరకూ  తొలగించేస్తాయి, కాని  చిత్తశుద్ధితో, ఆ ప్రయోజనం  కోసం  చదివినప్పుడు  మాత్రమే" అని పూజ్య  చారీజీ  చెప్పారు. మనలను  శుద్ధంగా,  సరళంగా  తయారు  చేస్తాయి. 

ఇక్కడ  ప్రకంపనాలంటే, స్థూలమైన  ప్రకంపనలు  కావు.  అతి  సూక్ష్మ  ప్రకంపనలు;  ఇంకా  చెప్పాలంటే  ప్రకంపన  లేని  ప్రకంపనలు. అర్థం  చేసుకోవడం  కంటే  అనుభూతి  ద్వారా  తెలుసుకోగలం. మాటకు/చేతలకు ముందు ఆలోచన;  ఆలోచనకు  ముందు భావన;  భావనకు  ముంంం  సూక్ష్మ  ప్రకంపన. మనం  అందుకోవలసినది  ఆ  సూక్ష్మ  ప్రకంపన.  అది  ధ్యాన  స్థితిలో  మాత్రమే  సంభవిస్తుంది.  హృదయం  కూడా  మరింత  మరింత  సున్నితంగా  సూక్ష్మంగా  తయారయ్యే  అవకాశం  ఉంది. 

"బుర్రను  పూర్తిగా  ప్రక్కకు  పెట్టేసి  హృదయంతో  చదవమంటారు  చారీజీ. పైగా  ఇది  నా  తుదు  హెచ్చరిక  అని  కూడా  అన్నారు  ఈ  సందేశాలు  చదివే క్రమాన్ని  గురించి మాట్లాడుతూ  చెప్పడం  జరిగింది.  అదెలా  సాధ్యం  అని  అడుగుతారేమో,  ప్రయత్నించి  చూడండిచూడండి, ఆశ్చర్యపోతారు,  మీ  మెదడుకు  అందనివి  కూడా  సృష్టిలో  ఉన్నాయని  తెలుసుకొని  ఆశ్చర్యపోతారు" అన్నారు  చారీజీ.

కాబట్టి,  ప్రతీ  సాధకుడు  తన  నిత్యసాధనలో,  ఉదయం  ధ్యానం  చేసిన  తరువాత  కలిగిన  ధ్యాన  స్థితిలో  అలాగే  కొనసాగుతూ  ఈ  విస్పర్  సందేశాన్ని  సంపూర్ణమైన  విశ్వాసంతోనూ,  భక్తితోనూ  చదివే  ప్రయత్నం  చెయ్యండి,  తర్జుమా  కంటే  అతీతమైన  ప్రకంపనలను,  అంటే  హెలీన్  పైరే గారు  అందుకున్న  ప్రకంపనలతో  ప్రతిస్పందించే  అవకాశం  మనకు  కలుగుతుంది.  ఆ  ప్రకంపనలు  మనకి  నిజమైన  ఆధ్యాత్మిక  ప్రయోజనాన్ని  సిద్ధింంంంచేలా తోడ్పడతాయి. ఇదెలాగంటే,  వేదమంత్రాలు  మనకు  అర్థం  గాకపోయినా,  వేదోచ్ఛారణ  వల్ల  కలిగే  ప్రకంపనల  వల్ల  మనసుకు  ఎటువంటి  అనిర్వచనీయమైన  ప్రశాంతతను  చేకూరుస్తాయో,  అదే  విధంగా  ధ్యానస్థితిలో  ఈ  సందేశాలను  మనం  చదువుతున్నప్పుడు  వినేకారిలోనూ,  చదివేవారిలోనూ  కూడా  అంతకంటే  సూక్ష్మ  దివ్య తరంగాలను  అందుకోవడం  జరుగుతుంది.

కావున  అమదరూ  ప్రతి  రోజూ  తమ  ధ్యానం  తరువాత  విధిగా  ఈ  విస్పర్  సందేశాన్ని  చదుబుకునే  ప్రయత్నించాలని  ప్రార్థిస్తూ....

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...