ఛానలింగ్
విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనే అద్భుతమైన ఉద్గ్రంథాన్ని పరిచయం చేసే ముందు మనం ఛానలింగ్ అనే ప్రక్రియను గురించి కొంచెం తెలుసుకుందాం. ఛానలింగ్ అంటే ఇతర లోకాలతో సంపర్కం కలిగి, ఆయా లోకాల సమచారాన్ని గాని, ఇంతకు ముందు భూమ్మీదున్న మహాత్ముల ఆత్మలు గాని, ఇతర లోకాల మహాత్ములతో గాని సంపర్కం కలిగి వారందించే సమాచారాన్ని గాని, సందేశాలను గాని అందుకొని ఈ లోకానికి అందజేయగలిగేటువంటి ఒక అత్యున్నత సహజ ప్రజ్ఞతో కూడిన ఒక మానస ప్రక్రియ. ఇది ఉత్కృష్ట శ్రేణికి చెందిన ఛానలింగ్ ప్రక్రియ.
ఈ ప్రజ్ఞ ద్వారా ఇతర ఉన్నత లోకాల్లో ఉన్న మహాత్ములతో సంభాషించగలగడమే కాదు, ఇతర లోకాల్లో సంచరిస్తున్న గతించిన ఆత్మలతో కూడా సంపర్కం ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని గాని సందేశాలను గాని అందుకొనే మాధ్యమాలుగా పని చేసేవారున్నారు.
మన భాషలో అర్థం చేసుకోవాలంటే, ఆ వ్యక్తికి ఇతరలోకాల భాష వచ్చి ఉండాలి, మన లోకంలోని భాష వచ్చి ఉండాలి; అప్పుడు ఆ భాషలోని సందేశాలను మన భాషలోకి తర్జుమా చేసేవాళ్ళన్నమాట.
అయితే పైన చెప్పినట్లుగా అటువంటి ఉన్నత కోవకు చెందిన ప్రజ్ఞ, మహాత్ముల సందేశాలను అందుకోవాలంటే అటువంటి ప్రజ్ఞ జన్మతః అంటే పుట్టుకతోనే ఉండాలంటారు పెద్దలు. దానికి ధ్యానం తోడైనప్పుడు అటువంటి సూక్ష్మ లోకాలతో సంపర్కం ఏర్పడి, ఆ మహాత్ములు ఈ లోకానికి అందించవలసిన సందేశాలు ఈ మాధ్యమాల ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందేశాలు మానవ కళ్యాణానికి, ఆధ్యాత్మిక వికాసానికి, భవిష్యత్ప్రణాళికకు ఎంతగానో ఉపయోగపడాలని, అప్పుడప్పుడు హెచ్చరించడం కోసం ముందస్తుగానే తగిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇలా అనేకమైన ప్రయోజనాలున్నాయి ఇటువంటి సందేశాల వల్ల.
అయితే ఈ ప్రక్రియను అనుభవించడం అనేది అంత తేలికైన విషయం కాదని అర్థమవుతున్నది. ఒక రకమైన ప్రసవవేదనే అని తెలుస్తుంది వీరి జీవితాలను గమనిస్తే. కాని అటువంటి సేవలను ఈ మానవాళికి అందించడమే గొప్ప సేవగా భావిస్తూ ఈ సేవలకు ఉపక్రమిస్తారు ఈ మాధ్యమాలు.
ఇలాగ ప్రపంచ చరిత్రలో ట్రాన్స్ ఛానలింగ్ చేసే మాధ్యమాలు చాలా మందున్నారు. ఏసు క్రీస్తు వంటి మహాత్ముల నుండి, ఇంకా ఇతర మహాత్ముల నుండి సందేశాలు అందుకున్నవారున్నారు. ఇదేమీ ప్రపంచానికి కొత్త కాదు. అయితే మానవలోకంలో అన్ని విద్యల్లో నకిలీ విద్యలున్నట్లుగానే ఇక్కడ కూడా నకిలీ మాధ్యమాలున్నారు, తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!
ఈ మాధ్యమాలు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వాళ్ళల్లో అత్యున్నత స్థాయికి చెందిన సూక్ష్మగ్రాహ్యత, సున్నితత్త్వం, సూక్ష్మాతి సూక్ష్మ తరంగాలను గ్రహించగలిగే సామర్థ్యమే గాక వాటిని మన భూలోక భాషలోకి తర్జుమా చెయ్యగలిగేటువంటి సామర్థ్యాలుంటాయి. సాధారణంగా ఆధ్యాత్మిక సాధకులుగా ఉంటారు వీరు. వీరినే ఆంగ్లంలో స్క్రైబ్ అని అంటారు, తెలుగులో లేఖరి అనవచ్చు.
అటువంటి అత్యున్నత కోవకు చెందిన స్క్రైబే మనం మదర్ అని పిలుచుకొనే మేడం హెలీన్ పైరే. ఈమె ఫ్రెంచ్ దేశస్థురాలు. వీరిని గురించి తరువాయి భాగాల్లో వివరంగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. (సశేషం)
chakkagaa cheppaaru
రిప్లయితొలగించండిVery clearly explained brother.Thank you.
రిప్లయితొలగించండి