హృదయ పథం - పరితప్త హృదయం
ప్రతీ మనిషీ జనన మరణాల మధ్య జరిగేది జీవితం అనుకుంటాడు. అలాగే జీవిస్తూ ఉంటాడు. పుట్టడం, పెరగడం, చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం, వివాహం చేసుకోవడం, ధనము-ఆస్తులు కూడబెట్టుకొనే పనిలో ఉండటం, పిల్లల్ని గనడం, వాళ్ళని పెద్ద చేయడం, వాళ్ళ వివాహాలు చేయడం, మధ్య-మధ్యలో కష్ట-సుఖాలను అనుభవించడం, అనారోగ్యాలను ఎదుర్కోవడం, ముసలి వాళ్ళవడం, రకరకాల మనోవ్యధల పాలవడం, ఒకరోజు చనిపోవడం. ఇదే సగటు మనిషి యొక్క జీవిత క్రమం. ఆ మనిషి పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఏమైనా కావచ్చు. చిన్న చిన్న తేడాలు తప్ప సగటు మనిషి యొక్క జీవన సరళి ఇదే. ఇందులో కొందరు పేరు-ప్రఖ్యాతులు సాధిస్తారు, కొంతమంది సాధించకుండా, లేక అవసరం లేదనుకునో జీవించి చనిపోతారు. ఒక విధమైన మత్తులో సాగిపోతూ ఉంటుంది సగటు జీవితం. ఒక్కోసారి ఒక గొప్ప మతిమరుపు జీవితంలా అనిపిస్తూ ఉంటుంది.
ఎక్కడినుండి వచ్చామో, చనిపోయిన తరువాత ఎక్కడికి వెడతామో ఎవ్వరికీ తెలియదు. ఎన్ని మతాలున్నా, ఎన్ని ఉద్గ్రంథాలున్నా, ఎంతమంది మహాపురుషులున్నా, ఇది బోధ పడటం కష్టం, కనీసం జన్మకు, మృత్యువుకు మధ్య జీవించడంలో ప్రయోజనం ఏమైనా ఉందా, ఏదైనా పద్ధతిగా జీవించాలా, చనిపోయే లోపల సాధించవలసిన గొప్ప ప్రయోజనం ఏదైనా ఉందా, అర్థం కాదు.
పైన చెప్పిన విధంగా జీవించడమే జీవితం అంటే కూడా ఈ ఆత్మకు సంతృప్తి కలుగదు, విచిత్రం. యేదో తెలియని వెలితి అంతరాత్మలో, యేదో తెలియని బాధ, సమాధానాల్లేనటువంటి ప్రశ్నలు లోపల, దిశ లేక, అర్థంగాక, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో, ఎవరిని సంప్రదించి మన మీమాంసలను తొలగించుకోవాలో, ఎవరితోనూ పంచుకోలేక, సమస్యలకు పరిష్కారాల్లేక, కష్టాలు ఎందుకు పడాలో తెలియక, ఎందుకు పుట్టామో తెలియక, ఎందుకు చనిపోతున్నామో తెలియక, ప్రతీ ఆత్మ, ప్రతీ హృదయం సమాధానం దొరికే వరకూ నిశ్శబ్దంగా, అంతర్లీనంగా క్షోభిస్తూ ఉంటుంది, జీవితాన్ని వెళ్ళ బుచ్చుతూ ఉంటుంది. జీవితం అంతా ఇటువంటి అస్తిత్వానికి సంబధించిన ప్రశ్నలను ఎదుర్కోకపోయినా, మృత్యు శయ్యపై మాట పడిపోయినప్పుడు, ఇంద్రియాలు, అవయవాలు అని చేయనప్పుడు, తన జీవితం అంతా తన ముందు రీవైండ్ అవుతున్నప్పుడు, ఆ ఆత్మ తీవ్రమైన క్షోభ, వ్యధ, వేదన, నరక యాతన, తలచుకుంటేనే భయమేస్తుంది.
మరి దీని పరిష్కారం ఏమిటి అంటే, ఎవరికి వారు తన్నుకోవలసిందే, ఎవరికి వారు సంఘర్షణ పడవలసిందే, ఎవరికి వారు వారి వారి సమాధానం వెతుక్కోవలసిందే. ఇది అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న. అస్తిత్వానికే మొర పెట్టుకున్నప్పుడు, విచిత్రంగా ఆ అస్తిత్వమే, దాన్నే ప్రకృతి అని కూడా అంటారు, మనకు తగిన గురువు రూపంలో, లేక ఒక మార్గం రూపంలో మన ముందు తటస్థమవడం జరుగుతుంది. దాన్నిగుర్తించగలిగే అవయవం మనందరిలో ఉంది - అదే హృదయం. అయితే ఆత్మ పడే సంఘర్షణ ఒక పరిపక్వ దశకు వచ్చే వరకూ ఈ గురువు తటస్థ పడడు సాధారణంగా. కాని అటువంటి గురువు ఇలా కొట్టు మిట్టాడుతున్న ఆత్మలకు వీలైనంత త్వరలో ఉద్ధరించాలని మన కంటే ఎజక్కువగా ఆరాటపడుతూ ఉంటాడట. ఆ ఆరాటం వల్ల ఈ అస్తిత్వ సమస్య పరిష్కారం త్వరగా లభించే అవకాశం ఉంది.
అటువంటి కాలమాన పరిస్థితుల్లోనే మనందరమూ ఉన్నామని నాకు చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. అదే హృదయ పథం - హార్ట్ ఫుల్ నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతి. హృదయాన్ని అనుసరించి జీవించే పథం. మనకు అడుగడుగునా కలిగే సమస్యలకు, మీమాంసలకు, ప్రశ్నలకు సమాధానాలి ఇవ్వగలిగే అవయవం మనలో ఉన్న హృదయమే. దీన్ని అనుసరించే కళే, దీన్ని అనుసరించే శాస్త్రమే ఈ హృదయ పథం. రానున్న వ్యాసాలో, నా ఈ హృదయపథ-ప్రస్థానం లో నాకింత వరకూ కలిగిన అవగాహనను మీతో పంచుకొనే ప్రయత్నము, సాహసము చేస్తాను.